Chayya Chayya - a song of mystics
సంగీతం అందరినీ అలరిస్తుంది. కానీ ఒకే సంగీతం ఒక్కొక్కరికి ఒక్కోలా వినిపిస్తుంది. ఒక పాట ఒకరిలో దుఃఖాన్ని కలుగజేయువచ్చు. ఒకరిలో ఆనందాన్ని..ఒకరిలో గతం తాలూకు జ్ఞాపకాన్ని, మరొకరిలో వర్తమానపు వర్తమానాన్ని. ఇది చెవికి సంబంధించినది. చెవి ఒకొక్కరిలో ఒకలా సునిశిత శక్తిని కలిగి ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఆ సునిశిత శక్తి మరింత పెరగవచ్చు కూడా. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నాలో ఒకపాట కలిగించిన అలజడిని చెప్పడం కోసం. ఆ పాట Dil Se.. సినిమాలోని ఛయ్య ఛయ్య పాట.
పాటని ఎంజాయ్ చేయాలంటే భాష తెలిసి ఉండనవసరం లేదు. ఆ పాట లిరిక్స్ ఏ భావోద్వేగాన్ని కలిగిస్తాయో , పాట లిరిక్స్ అర్థం కాకున్నా సంగీతాన్ని జాగ్రత్తగా వింటే అదే భావోద్వేగాన్ని పొందుతాం. ఎందుకంటే పాట ఒక రాగంలో కూర్చబడుతుంది. ఒక్కో రాగానికి కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలుంటాయి. కరుణ రసమా, శృంగార రసమా, రౌద్ర రసమా అనేది ఆ రాగం కూర్పులోనే ఉంటాయి. కాబట్టి పాట లిరిక్స్ అర్థం కాలేదు కాబట్టి పాట అర్థం కాలేదు అని చెప్పడం సంగీతాన్ని సరిగ్గా వినకపోవడం వలననే అని నా అభిప్రాయం.
హిందీ ఉర్దూ సరిగ్గా రాని రోజుల్లో ఈ పాటను విన్నాను. ఆ సంగీతం ఊపేసింది. ఇదేదో హృదయాన్ని తట్టి లేపే పాట అనిపించింది. బీబీసీ నిర్వహించిన సర్వేలో 155 దేశాలలో సంగీతం అభిమానులు ఈ పాటను తమకు ఇష్టమైన పాటల్లో మొదటి స్థానంలో ఉంటుందని చెప్పారు. గమనించండి వాళ్ళెవ్వరికీ హిందీ రాదు. కానీ తమ హృదయాల్లో మొదటి స్థానాన్ని ఇచ్చేశారు. ఇప్పటికీ ప్రపంచంలోని టాప్ పది పాటల్లో ఛయ్య ఛయ్య పాట ఒకటిగా నిలబడింది. అదే సంగీతం మహత్యం. అలాగే నేనుకూడా ఈ పాట అర్థం తెలియకుండానే మొదటి స్థానాన్ని ఇచ్చేశాను నా హృదయంలో. సుఖ్విందర్ సింగ్ గాత్రం ఆ ఖంగుమనే గొంతు నచ్చేశాయి. షారుక్ ఖాన్ అభినయం స్టైల్ మెస్మరైజ్ చేశాయి. అందుకే ఈపాట పాడటం నేర్చేసుకున్నాను. ఈ పాటకి డాన్స్ కూడా చేసి రెండుమూడు చోట్ల ప్రైజ్ కూడా గెలుచుకున్పాను. గమనించండి నాకు ఆ పాట అర్థం తెలియకుండానే ఇదంతా జరిగింది.
ఆ తర్వాత ఒకరోజు అనుకోకుండా తమిళంలో ఈ పాట విన్నాను. ఏదో వేరేగా ఉందనిపించింది. హుషారు కంటే ఏదో బాధ కూడా ఈ పాటలో ఉందేమో అనిపించింది. కానీ పెద్దగా పట్టించుకోలేదు. అదే సమయంలో తెలుగులో కూడా విన్నాను. పర్వలేదనిపించింది. కానీ ఒకరోజు ఎందుకో మళ్ళీ ఒకసారి తమిళంలో విన్నాను.వింటూ ఉండగా వింటూ ఉండగా..ఇదొక మాయాజాలం లా అనిపించింది. ఎవరో ఒక సూఫీ ఆధ్యాత్మిక గురువు లాంటివాడు మంత్రాలు చదువుతున్నట్టుగా అనిపించింది. మళ్ళీ జాగ్రత్తగా విన్నాను. ఔను ఇవి మంత్రాలే. పాట కాదు.
ఒకరిమీద ప్రేమ కలగడం ఊరికే అలా జరగదు. ఒక వ్యక్తిని చూసినపుడు పుట్టే ప్రేమ శారీరకమైనది కాదు. మానసికమైన ది కూడా కాదు. అది లోలోపల ఉన్న ఆధ్యాత్మిక మంత్రకవాటాలను తట్టి లేపుతుంది. ప్రేయసి ఈ విశ్వ ప్రేమకీ దైవ ప్రేమకీ ఒక తలుపు వంటిది. ఆమెను లేదా అతడిని అన్వేషించడం ఆరాధించడం మన కొంతకాలం ఉండిపోయే ఈ భూమి మీద ఒక ఆధ్యాత్మిక అన్వేషణకి దారితీస్తుంది. ప్రేయసి ప్రేమాన్వేషణ దైవాన్వేషణ విడదీయరానివౌతాయి. అర్థంకాని తమిళంలో ఈపాట నన్ను ఇలా చేరింది. ఐతే పాటను వింటూ వందల సార్లు ఆ అనుభూతిని పొందాను. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఈ తమిళ హిందీ పాటల అర్థం తెలుసుకుందామని ప్రయత్నించాను. ఆశ్చర్యం. అవి నేననుకున్నట్టే ఉన్నాయి.
గుల్జార్ హిందీలో రాసిన పాట ఒక సూఫీ తాత్వికుడి కవిత నుండి ప్రభావితం చెందింది. దీనికి పంజాబీ జానపదాన్ని మిక్స్ చేసి రాశాడు గుల్జార్. టెక్నాలజీని వాడకంలో రెహ్మాన్ ఎంత ఆధునికుడో మానసికంగా అంత మార్మికుడు. మనసు విద్య తెలిసినవాడు. మిస్టిక్ కాని సంగీతజ్ఞుడు ఏమి మాజిక్ చేయలేడు. కాపీ రైట్స్ వంటి ప్రాపంచిక విషయాలకి ఒక మ్యూజిక్ మిస్టిక్ లొంగిపోయాడంటే అతడిలో మ్యాజిక్ మాయమైపోతుంది. కానీ రెహ్మాన్ అటువంటి వాడు కాదని అతడి ఆధ్యాత్మిక జర్నీ చూస్తే అర్థమవుతుంది. గుల్జార్ ఈ పాటను బుల్లే షాహ్ అనే సూఫీ కవి రాసిన జానపదం ఆధారంగా రాశాడు. నీ ప్రేమ నన్ను పిచ్చివాడిలా థయ్య థయ్యా అని నృత్యం చేయించిందని రాశాడు బుల్లే షాహ్. ఒరిజినల్ పదం థయ్య థయ్యా. ఐతే తమిళంలో "థయ్యా థయ్యా తక థయ్య థయ్యా" అనే ఉంటుంది. అంటే బుల్లే షాహ్ అనుకున్నట్టు నృత్యానికి సంబంధించిన పదాన్నే తమిళంలో వాడారు. ఐతే గుల్జార్ హిందీలో దీన్ని మార్చాడు. థయ్యాను ఛయ్యా చేశాడు. అంటే నీడ. ప్రేమ నీడలో తలదాచుకున్నవాడి కాలికింద స్వర్గం ఉంటుందని రాశాడు. అదే సూఫీ ప్రేమతత్వం.
తమిళంలో, హిందీలో లిరిక్స్ లో అద్భుతమైన సూఫీ కవిత్వాన్ని ఈ మిస్టిసిజాన్నీ నిలబెట్టుకుంది ఈ పాట. కానీ తెలుగులో ఈ పాటను ఎవరు రాసారో అసలు ఎందుకు రాశారో కూడా తెలియదు. ఆ రెండు భాషల్లో కవిత్వం విన్నాక సూఫీ తత్వాన్ని మాజిక్ నీ అనుభవించాక తెలుగు పాట కనీసం విని బుద్ధి కూడా కాదు. తమిళంలో థయ్యా థయ్యా తక థయ్య థయ్యా..ని ఐనా తెలుగు లో తీసుకోవలసింది. ఛయ్య అనే తెలుగుపదానికి ఏం అర్థమూ లేదు. పాట సాకీతో ఇలా మొదలౌతుంది.
అటవిబాటలో ఉన్న ఓ నా పిచ్చుకల్లారా
ఓపికతో పాదాలమీద
ఎదురుచూస్తున్న ఆత్మల్లారా..
థయ్య థయ్యా అని నాట్యం చేద్దాం రండి.(తమిళం)
ఎవరి తల ప్రేమ నీడలో తలదాచుకుందో
వాడి కాళ్ళకింద స్వర్గం ఉంటుంది.
ప్రేమ నీడకు పోదాం పదండి. (హిందీ)
ఎంతటి అలకే కిన్నెరసాని
మామను చేరే అల్లరివాణి
చల్ ఛయ్య ఛయ్య (తెలుగు)
తెలుగు లో చల్ ఛయ్య ఛయ్య ని అలాగే ఉంచేశారు. దారుణం.
తమిళంలో కవిత్వంతొ పల్లవి మొదలౌతుంది.
హృదయం ఎగిసిపడింది
దాని దరువు రొద నొప్పిగా మారింది.
ఒక పచ్చని చిలుక వచ్చి పోగానే
ఈ గుండెలో భయం మొదలైంది.
నాట్యం చేద్దాం రండి
హిందీలో సాకీ అర్థమే మరలా రిపీట్ ఔతుంది...
ప్రేమ నీడలో నడువు
నీ పాదం స్వర్గం మీద ఉంటుంది
ప్రేమ నీడలోకి పోదాం పద.
తెలుగులో చూడండి...
చెలి కిలకిలలే చిటికెయ్య
మది చెదిరి కథాకళి చెయ్య హొయ్య
చల్ ఛయ్య ఛయ్య.
ఏందో ఇది కదా! కిలకిలలే చిటికెయ్యడం.
ఆ తర్వాత చూడండి...
ఆమె కంటికి రెండువందలేళ్ళు
ముక్కందానికి మూడువందలు
ఆమె అందమైన కథకు
ఐదొందలేళ్ళు
అరె,మనం బతకాలి కదా! (తమిళం)
ఆమె సుగంధంతో నిండి ఉంది
ఆమె భాష అందమైన ఉర్దూలా ఉంది
ఆమే నా పగలూ రాత్రీ
నా ప్రపంచం కూడా..
ఆ సఖినే నా ప్రేయసి.(హిందీ)
ఓ కన్నియపై చూపున్నదయా
ఎదట పడే చొరవుండదయా
మనసాపలేక మాటాడలేక
ఒక ఖయ్యామై తయ్యారయ్యా(తెలుగు)
ఒమర్ ఖయ్యాం ని ఈ పంక్తులలోకి తేవడం ఒక్కటే బాగుంది.
ఆ తర్వాత మొదటి చరణం మొదట తెలుగు లో చూడండి
"ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా
ప్రతి చోట తనే అంటున్నదయా
తన వెంటపడే నా మనవి విని
ఏనాటికి కనిపించేనయ్యా
తన వెంటపడే నా మనవి విని
ఏనాటికి కనిపించేనయ్యా
ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా
ప్రతి చోట తనే అంటున్నదయా
తన వెంటపడే నా మనవి విని
ఏనాటికి కనిపించేనయ్యా
తొలగేన మరీ ఈ మాయ తెరా
తన చెలిమి సిరీ నా కలిమి అనీ
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి". ఈ తెలుగు పదాలు చూడండి ఊరికే పాటకోసం ఏవో కొన్ని పదాలు నింపి నట్టు ఉన్నాయి కదూ.
ఇవే పంక్తులు తమిళంలో కవిత్వంతో ఎలా మారాయో చూడండి.
"ఒక్క చూపుతో
నీవు నన్ను కరిగించావు
ఒక్క నవ్వుతో
నీవు నన్ను తోసేశావు.
నా అహాన్ని కూల్చేశావు.
నీ సైగతో నన్ను
నీ బానిస చేసుకున్నావు.
ఈ ఆరడుగుల వీరుణ్ణి
పట్టించుకోనైనా పట్టించుకోకుండా
నీ చరణదాసున్ని చేసుకున్నావు.
వర్షం పడేముందు
సన్నని తుంపర మాయమై నట్టు
ఆమె ఈరోజు మాయమైపోయింది.
నేను నిన్ను చూస్తే అగ్గి రాజేసుకుంటుంది
నీవు నన్ను చూస్తే ఒక మొగ్గ విచ్చుకుంటుంది.
నా మొదలే మొదలు
నా తుదనే తుదలు".
ముఖ్యంగా తమిళంలో ఈ భాగంలో సూఫీ మంత్రాలు చదువుతున్నట్టే ఉంటుంది.
ఉర్దూ కవిత్వం చూడండి
" కొన్నిసార్లు పూవులు గర్వాన్ని ప్రదర్శిస్తాయి
కానీ అవి సువాసన వచ్చినప్పుడే
మనకు కనిపిస్తాయి.
నేను ఆమెను తావీజు లాగా కట్టుకుంటాను.
అప్పుడామె ఎక్కడోచోట ఉర్దూ శ్లోకంలాగా దొరుకుతుంది.
ఆమే నా సంగీతం
ఆమే నా పవిత్ర శ్లోకం.
ఇక్కడ షారుక్ ఖాన్ తావీజును వేసుకున్నప్పుడు చూపే భక్తిని నటనలో చూపిస్తాడు. హిందీలో ఒరిజినల్ పాట అని అర్థమౌతుంది. తమిళం పాట ఎందుకూ తగ్గకుండా ఉర్దూలోని సూఫీ తత్వాన్ని ఓన్ చేసుకుంటే.. తెలుగు ఎటూ కాకుండా అర్థంలేని పాటను నిలబెట్టింది.
మొదటి చరణం ఎండింగ్ తెలుగు తమిళం హిందీలలో వరుసగా చూద్దాం
జాలిపడైనా ఓయ్ అనదే
మర్యాదకైన పరదా విడదే
అపరంజి చిలక శ్రమ పడిన ఫలితమై
నా వైపే వస్తూ ఉన్నదయా
ఓయ్ అనడం, పరదా విడటం అంతకుముందు సీన్ కి సంబంధించినవి. అంటే తెలుగు కవి సీన్ ని దృష్టిలో పెట్టుకొని రాశాడు పాపం. కానీ కవిత్వం కుదరలేదు.
"నీవు కొండమీద దొరికిన వజ్రానివి
నా గుండెలో వేరుతొడుగున్నదానివి
నీవు ఒక్కరోజా రెండురోజులా?
లేక నా జీవితపు మూలాల్ని
ఎప్పటికీ తాకుతూనే ఉండిపోతావా??"(తమిళ్)
ఆమె మంచు బిందువుల్లా గా నడుస్తుంది.
స్వర్గం ఆమె పాదాలతోపాటు నడుస్తుంది.
ఒక్కోసారి తరుశాఖలమీద
ఒక్కోసారి ఆకులమీద
నేను గాలిలో కూడా ఆమె జాడ
వెతుకుతున్నాను.( హిందీ)
రెండవ చరణం మొదలై ఎలా ముగుస్తుందో చూడండి
మూడు భాషల్లో
నేను ఆమె అందాన్ని ఆరాధిస్తాను
కానీ అది సూర్యకాంతి - నీడలాగా నన్ను మోసం చేస్తోంది.
ఆమె తన రంగులను మార్చేస్తుంది.
నేను రూపాలను రంగులనూ అమ్ముకునేవాడిని.
ఎవరి తల ప్రేమ నీడలో తలదాచుకుందో
అతడి పాదం కింద స్వర్గం ఉంటుంది.
ఆమే నా పగలూ రాత్రీ
నా ప్రపంచం కూడా..
ఆ సఖినే నా ప్రేయసి.(హిందీ). హిందీలో పైనున్న పంక్తులు రిపీట్ ఔతాయి. కానీ తమిళంలో మళ్ళీ కవిత్వం నిండుతుంది ఈ పంక్తుల్లో.
"ఇంద్రధనుస్సు రెండు సార్లు రాదు.
ఒకసారి వస్తే మరోసారి రాదు.
స్టేషను దాటిన రైలు పాట
ఒకసారి దాటేశాక వినబడదు.
ఆ పాట పాడిన గొంతు
ఒకసారి పోయాక
పాట మళ్ళీ వినబడదు.
నా సగం గుండె నీదే
నా సగం గుండెలో నిండినది నీవే
ఓ నా ప్రేమ జ్యోతీ!
ఓ నా జీవన సారమా!
నీవే నా దేవతవు
నీవు నిజానివా?
లేక నా కలవా?(తమిళం)
మదినూయలలూపే సొగసయ్యా
తొలి తూర్పు కాంతులే చెలి ఛాయా
పరువాల తరంగమే తానయ్యా
మహరాణి రూపు హరివిల్లయ్యా
మహరాణి రూపు హరివిల్లయ్యా
ఎంతటి అలకే కిన్నెరసాని
మావని చేరే అల్లరి మానీ
ఎంతటి అలకే కిన్నెరసాని
మావని చేరే అల్లరి మానీ
చెప్పరయ్య నా జాణ తోటి
తన కంటపడే దారేదయ్యా
తెలుగులో కిన్నెరసాని,జాణ, అపరంజి చిలక, మహారాణి వంటి విశేషణాలతో నింపినట్టు కనిపిస్తుంది. హిందీలో తమిళంలో కనబడిన కవిత్వం తెలుగులో కనబడదు. హిందీలో సుఖ్విందర్ సింగ్ మ్యాజిక్ చేసినా, మనమీద దయవుంచి తమిళంలో అతడి గొంతును పాటలో చాలా కుదించారు. కానీ తెలుగులో పాట మొత్తం సుఖ్విందర్ సింగ్ తో పాడించడంతో బెడిసికొట్టింది.
తమిళం పాటలోనే సూఫీ తరహా మంత్రాలలాగా వినిపిస్తుంది. సుఖ్విందర్ సింగ్ హిందీలో బాగా పాడాడు అనిపిస్తుంది. గుల్జార్ ఉర్దూ కవిత్వం అతడి గొంతుకు సరిపోయినట్టే అనిపిస్తుంది. కానీ తమిళంలో ఉండే మ్యాజిక్ హిందీలో లేదు. తమిళం పలికే విధానం ఆ కవిత్వం ఈ పాటకు మిస్టిసిజాన్ని తెచ్చాయి. తెలుగులో చెప్పడానికి ఇంకేం లేదు. సుఖ్వీందర్ సింగ్ ఎంత చెడగొట్టాడో లిరిక్స్ అంతే చెడగొట్టాయి.
విరించి విరివింటి