Tuesday, 30 December 2014

విరించి ll కొంగొత్తా దేవుడండీ...ll

మనిషికి ఎన్ని బహానాలు...

భాబాస మెంబరునని
భాయీ అని వాడోవీడో కావులించుకుంటాడని
సాని కొంపల్లో సార గుడిసెల్లో
కులమతాలు బట్టలూడదీసుకుంటాయని
డోపమైన్ డెఫిసిట్ లో
డోసెక్కువై డస్సున కక్కుకున్నా
తానొక పావ్లోవ్ కుక్కననే విషయం తెలుసుకోలేడు

చెడుగా ఎలా ఉండకూడదో ఆలోచించే మనిషికి
మంచిగా ఉండిపోవడంలో ఆనందం తెలియదెన్నడూ...

సిర్రోసిస్ వచ్చి ముడ్డిలో బొడ్డులో నరాలు ఉబ్బినా
గుండె కండరాలు సాగి దుబ్బగయినా
వెర్నిక్కే కర్సాకాఫ్ పిచ్చి తలకెక్కినా
పాంటు బెల్టులొ మొదటి బొక్కకి బాడీ జారదిగినా
కళ్ళ కింద క్యారీ బాగులు కండగా జారినా
బతకడానికి బలపాల్లా మందులు మింగినా
విత్  డ్రావల్ ఫిట్స్ తో వళ్ళంతా కుదిపినా..
పోయేదేముంది...? ఫక్తు వెధవ జీవితం
బతికితే మహా అయితే మరో ముండ
లేకపోతే మరో భార్యా బాధితుడి అండ

అంతేకదా...
చస్తే పోయేదేముంది..?
కట్టి వుంటే తాళి తెగుతుంది
బొట్టువుంటే బోడవుతుంది
ఆడ పిల్లుంటే ఇల్లు అంగడవుతుంది
మొగోడుంటే ఇంకో మెడనూలు ఊడుతుంది

అంతేకదా....
దేవుళ్ళు పుడితే లేనిది...
గా మనిషి పుడితే మందెందుకు బందు.?
సమాధుల మొక్కేటందుకా..?

తాటి చెట్లకూ ఈత చెట్లకూ నిచ్చనలు వేసి
వైకుంఠ పాళి ఆడితే అంత అలుసెందుకు..?

డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండు శవాలు
వల్లకాటికి పోతే అంత భయమెందుకు..?

బెల్టు షాపుల బొత్తాలు పీకి
సమాజాన్ని నగ్నంగా చూపితే అంత వణుకెందుకు..?

చెప్పాను కదా...రాలితే కొన్ని కన్నీటి బొట్లు
చెదిరితే కొన్ని నుదుటిమీది బొట్లు

అందుకే తాగేద్దాం
తప్పతాగే తప్పు తప్పకుండా చేసేద్దాం
నిషా తక్కువై, జీవిత నిషాణా ఎక్కినా
పుర్రె కలషంలో తీర్థం ఎండిపోయినా
అపర భగీరథునిలా తపించేద్దాం
మత్తుమందు మతం పుచ్చుకుందాం
బీరు షాపుల్నీ, బారు దారుల్నీ, దేవతల్లా పూజించేద్దాం
ఏమంటారు..?

26/11/14.
విరించి  ll శత్రువు ll కథ
లంకంత ఇల్లు. ఇంటి మధ్యలో పెద్ద ఊయల. ఊయల ఊగుతూ  దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు పాండురంగయ్య. గుర్రాన్ని జరపాలా...ఒంటెను ఎరగా వేసి మంత్రిని చంపాలా అని. అటువైపు నర్సయ్య. పాండురంగయ్యకు కుడి భుజం...వీరాభిమాని...పాండురంగయ్య అడిగితే ప్రాణాలైనా ఇచ్చేస్తాడు. కానీ ఒక్క చెస్ విషయంలో పాండురంగయ్య కోటని బద్దలు కొట్టాలని చూస్తుంటాడు. పాండురంగయ్యని ఎందులోనూ ఎవరూ ఓడించలేరు..చదరంగంలోనైనా..రాజకీయంలోనైనా...రణరంగంలోనైనా.  ఆయనకి సమ ఉజ్జీ ఒక్కడే...ఆయన ప్రథ్యర్థి రఘురామయ్య . ఒంటెని ఎరగా వేసాడు పాండురంగయ్య. మంత్రికోసం. మీసం మెలేసి నర్సయ్యని గర్వంతో చూసాడు. నర్సయ్య తన యజమానిని ఓడించగల మేధావంతుడే..కానీ ఆయన మేథ, భయంలోనే సగం ఎగిరిపోతుంది. హోరుమనే వర్షంలో తడుస్తూ ఆబగా ఒచ్చాడు భీముడు. "అయ్యా...రఘురామయ్యని మనోల్లు యేసేశారయ్యా..." కిర్రు కిర్రుమని ఊగే ఊయల ఆగింది. తల ఎత్తి చూసాడు పాండురంగయ్య 'నిజమా' అన్నట్టు. నర్సయ్య దిగ్గున ఊయలమీంచి లేచి నిలబడ్డాడు. ఆనందంతో గట్టిగా అరవాలనుకున్నాడు. "జొన్న చేనుకాడ మనోల్లు కాపుకాసి ఆయన్ని ఏసేసారయ్యా..." . ఒక్కసారి తలుపు దగ్గర బాంబులు చుడుతున్న వీరయ్యని చూసాడు పాండురంగయ్య. వాడు ఇవేవీ వినిపించుకున్నట్టు లేడు. చుడుతూనే ఉన్నాడు. నర్సయ్య ని కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు. నర్సయ్య కూర్చున్నాడు. ఊయల కిర్రు కిర్రు శబ్దం మళ్ళీ మొదలైంది. దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా చదరంగం బోర్డులోకి చూస్తున్నాడు. నిజానికి పాండురంగయ్య అప్పటికే ఎత్తు వేసేశాడు. ఇపుడు ఆలోచించాల్సింది..ఆడాల్సింది నర్సయ్య. నర్సయ్యలో అయోమయం. ఎగిరి గంతులేయాల్సిన తరుణంలో ఈ నిశ్శబ్దాన్ని భరించలేకున్నాడు. ఆటమీద ధ్యాస లేదు. సమాచారం తెచ్చిన భీముడు కూడా పాండురంగయ్య మౌనానికి కారణాన్ని నర్సయ్య కళ్ళలో వెతుకుతున్నాడు. అదే అయోమయంలో ఎరగా వేసిన ఒంటెని మంత్రితో మింగేశాడు నర్సయ్య. ఫలితంగా ఇపుడు నర్సయ్య మంత్రి పాండురంగయ్య గుర్రం చెరలో ఉంది. ఇక చంపడమే తరువాయి. ఆటని శాసించే ప్రత్యర్థి మంత్రి చేతికి చిక్కాక కూడా, ఆలోచన అవసరం లేని చోట కూడా,  ఆలోచిస్తున్నాడు పాండురంగయ్య...లోపల కిర్రు కిర్రు మని ఊయల శబ్దం..బయట బోరుమని ఏడుస్తున్నట్టుగా వాన.

"ఏమోయ్ బామ్మర్దీ...మా చెల్లెమ్మ చేసిన ఇనుప సున్నుండలు తిని చెదరంగంలో ఎత్తులు వేయడం కాదు...నిజ జీవితంలో కూడా వేయడం నేర్చుకోవాలి".  రఘురామయ్య మాటలు చెవుల్లో వినిపిస్తున్నాయి. "చూడు పాండూ...ఈ వెధవ సన్నాసులు నన్ను చంపలేరులేగానీ...ఇదుగో చెక్..." . ఇదే ఊయల మీద రఘురామయ్యతో వేల సార్లు చదరంగం ఆడాడు. ఎత్తులకి పై యెత్తులు వేయడంలో ఇద్దరికి ఇద్దరే..."చూసావా నీ రాజు పని అయిపోయిందిగా....!! అది సరే..రేపు పట్నం వెల్తున్నావంటగదా కార్లో!? ....జాగ్రత్త...!! నిన్ను లేపేయడానికి దారెంబడి బాంబులు పెట్టిచ్చినా... ఎక్కడో ఓ చోట మావాళ్ళు నిన్ను లేపేస్తారు...మొగోడివైతే పట్నం పోయి తిరిగి రా...మా చెల్లెమ్మ వీర తిలకం దిద్దుతది....లేకపోతే తిలకం తీసేస్తది....ఏమ్మా విశాలాక్షీ...! మీ ఆయన జాగ్రత్త , అసలే ఊరికి సర్పంచి..రేపు కష్టమే...సిటీనుండి బాంబుల ఎక్స్పర్ట్ తో దారెంబడి పెట్టిచ్చినా...". మీసం మెలేస్తూ...రాచ ఠీవితో వెల్లిన రఘురామయ్య గుర్తుకొచ్చాడు...ఈరోజు శవమయ్యాడా...పరధ్యానంగానే నర్సయ్య మంత్రిని తన గుర్రంతో తినేశాడు. పాండురంగయ్య చేయి వణకడం నర్సయ్య గమనించాడు. "వాహ్.. మంత్రి ఖతం"  అరిచాడొకడు. తలెత్తి చూస్తే ముగ్గురు నలుగురు తమ ఊయల చుట్టూ చేరి ఆట చూస్తుండటం గమనించాడు పాండురంగయ్య. విషయం తెలిసి, ఒక్కొక్కల్లూ పాండు రంగయ్య ఇంటికి చేరుతున్నారు. కానీ నిశ్శబ్దంగా సాగే పాండురంగయ్య చదరంగం ముందు అందరూ పావులే..అందుకే ఎవరూ నోరు మెదపడం లేదు. వచ్చిన వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఊయల చుట్టూ చేరుతున్నారు.

ఈసారి సిపాయిలను అదిలించాడు నర్సయ్య. రఘురామయ్య కూడా సిపాయిలను ఉపయోగించి కోటని కట్టడంలో దిట్ట. చాలా సార్లు సిపాయిలతోటే రాజుకి చెక్ పెడతాడు. "చెక్ పెడితే పెట్టావ్లే వోయ్ ..గొప్ప...రేపు బయటకి కదలకు....వేట కొడవళ్ళతో దాడి చేపిస్తున్న. ఆడంగిలా ఇంట్ల కూర్చో...మా చెల్లెమ్మ పార్వతమ్మ తో కాసేపు ముచ్చట్లాడుకో...అర్థమయ్యిందా....ఆ పొలం పన్లు జీతగాండ్లకు పురమాయించు..ఎద్దుల్లాగా మేపావుగా నాయాండ్లని...నీవు ఇంటీకాన్నే వుండు..." అప్పట్లో ఇరవయ్యేళ్ళ క్రితం రఘురామయ్యకిచ్చిన వార్నింగ్ గుర్తుకొచ్చింది. గత ముప్పయేల్లుగా ఇలా ఎన్ని సార్లు ఒకరిమీద ఒకరు దాడులు చేసుకున్నారో...భూములకోసం ..సర్పంచి పదవుల కోసం...చేసిన హత్యలకి ప్రతిహత్యలకోసం...కానీ రాను రానూ పగ పెరిగిపోయింది...ఒకరికొకరు చూసుకునే పరిస్థితుల్లేవు...చివరి సారిగా తన భార్య విశాలాక్షి జబ్బుచేసి చనిపోతే సర్పంచిగా చూడ్డానికి వచ్చాడు రఘురామయ్య. ఆమె కూర్చునే అరుగు మీద కూర్చుని కాసేపు మౌనంగా రోదించాడు...పాండురంగయ్య చేతుల్ని ఒక్కసారి గట్టిగా వొత్తి వెళ్ళి పోయాడు..అప్పుడు చూసిందే రఘురామయ్యని. ఆ చేతుల్ని మళ్ళీ నర్సయ్య పట్టుకుని తన ఒక్క చేత్తో వత్తుతున్నాడు..."అయ్యా..మీదే ఆట" అని. నర్సయ్య ఇంకో చేతిని రఘురామయ్యనే నరికేసాడు. పాండురంగయ్య చూపులు చదరంగం బోర్డుమీద..ఆలోచనలు రఘురామయ్యమీద.

ఈ సారి రఘు రామయ్యకి ఇష్టమైన ఎత్తుగడతో నర్సయ్య మీదికి పావులు కదిలించాడు పాండురంగయ్య. "అయ్యా.. ఇది ఆ సచ్చినోడికి ఇష్టమైన ఎత్తు...ఆడే సచ్చినాక ఆడి ఎత్తు ఏం పార్తది". అనేశాడు నర్సయ్య. కోపంగా తల ఎత్తి చూసాడు 'ముందు మాటలాపి.., ఆడు' అన్నట్టు. అప్పుడు గమనించాడు తన చుట్టూ చాలామందే చేరారని. వాల్లంతా తనవాళ్ళు. తన నీడ కింద బ్రతికే వాళ్ళు. ఎన్నికల్లో రిగ్గింగ్ లు  చేసి తనని చాలా సార్లు సర్పంచిగా గెలిపించిన వాళ్ళు. తాను సర్పంచిగా వుండి చేసిన మంచి పనులకూ చెడ్డ పనులకూ అండగా నిలిచిన వాళ్ళు. అందులో ఒక్కొక్కరిది ఒక్కో కథ. వాళ్ళందరికీ ఈరోజు పండగ. తల ఎత్తి చూసిన సర్పంచ్ ని అందరూ దండాలు పెట్టి నవ్వుతూ పలకరిస్తున్నారు. ఇంతకు ముందులా వాళ్ళ నవ్వుల్లో భయం లేదు. ఉత్సాహం కనిపిస్తోంది. ఇంతకాలం వాళ్ళలో తన పట్ల కనిపించే భయానికి కారణం తనేనా...లేక రఘురామయ్యనా..ఇపుడు రఘురామయ్య చనిపోతే తనకు బయపడేదెవరు. ఇంకో వైపు మంత్రి పోయి ఏమి ఆడాలో తెలియక తికమక పడుతున్నాడు నర్సయ్య. ఏవో సిపాయి పావుల్ని కదిలిస్తున్నాడు. ప్రత్యర్థి మంత్రిని చంపేశాక ఆట ఇక ఏక పక్షమే..నిర్భయంగా తన రాజుని బయటకి తెచ్చి తిప్పుతున్నాడు పాండురంగయ్య. ప్రత్యర్థి మంత్రి చనిపోతే..తన రాజుకీ, రాచరికానికీ విలువే లేదన్నట్టుగా..

ఎలా చంపేశారు రఘురామయ్యని...ఆలోచనలో పడ్డాడు పాండురంగయ్య. బాంబుల వీరయ్యకి ఏమయింది ఈ సారి..? తన దగ్గర పని చేస్తున్న రఘురామయ్య మనిషికదా...వీడు ఈ దాడికి సంబంధించిన సమాచారాన్ని ఈసారి ఎందుకు రఘురామయ్యకి తెలపలేకపోయాడు..? ఈ మధ్య వాడికి చెవుడు వచ్చింది. మొన్న మేమంతా వేసుకున్న జొన్న చేను లో వేట కొడవళ్ళ ప్లాన్ వాడికి వినబడలేదేమో..అందుకే ఈ విషయాన్ని అక్కడ చెప్పలేకపోయాడేమో...చివరికి వాడి చెవుడే రఘురామయ్యని చంపిందా..అయ్యో....ఒకసారి వీరయ్య వైపు చూసాడు. వాడు,ఏమీ తెలియనట్టు బాంబులు చుడుతూనే ఉన్నాడు. ఈ బాంబులు ఎవడికోసం చుడుతున్నాడు వాడు...మరో రఘురామయ్య ఎపుడు పుడతాడు..? కుడివైపు ఏనుగుతో 'కాసిలింగ్' చేసుకున్నాడు నర్సయ్య...పేరుకే కాసిలింగ్. అది అధికార బదిలీ...రాచరికాన్ని నడిపే ఏనుగు. అదేదో గొప్ప ఘనకార్యం చేసినట్టు నవ్వుతున్నాడు నర్సయ్య. వాడి నవ్వులో కూడా భయం లేదు. ఊయలకి ఒక మూలగా కూర్చునేవాడు ఇపుడు మీదకి ఒక కాలు పెట్టి మరీ కూర్చున్నాడు కొత్తగా. వీడేనా కాబోయే 'కాసిలింగ్ ఏనుగు..'? తననిక మూలకి కూర్చోబెట్టి వీడే నడపబోతాడా రాచరికం. రఘురామయ్యని బూచిగా చూపించి తాను ఎదిగాడు..రఘురామయ్యకి పోటీగా ఊరికి మంచి పనులు చేసి పెట్టాడు. రఘురామయ్యని దయ్యంగా చిత్రించి ఊరిలోని వివిధ వర్గాలవారినీ ఒక్కటి చేయగలిగాడు. పాకిస్థాన్ లేకపోతే ఇండియాలో ఎన్ని మత ఘర్షణలు జరిగేవో...ఎన్ని వర్గ పోరాటాలు తెరలేచేవో...పాలస్థీనా లేకపోతే ఇజ్రాయిల్ లో ఎన్ని జాతులు కుమ్ములాడేవో..ఎన్ని తలలు గుమ్మాలకు వేళ్ళాడేవో...అందుకేనా శ్రీ కృష్ణుడు యుద్ధం చేయమంది. అజాత శత్రువైన ధర్మరాజుకి సైతం శత్రువులుండేలా చేసింది.

బోర్డు మీద పావులు కొన్నే మిగిలాయి. నర్సయ్యకు ఒకే ఒక్క రాజు మిగిలాడు. పదహారు స్టెప్పుల్లో ఆట ముగించాలి. పాండురంగయ్య తలుచుకుంటే మూడు స్టెప్పుల్లో ముగించగలడు. ఆయన దగ్గర మంత్రి వుంది. రెండేనుగులున్నాయ్..మూడు సిపాయిలున్నాయ్...కానీ ఈ ఆట ముగించాలని లేదు తనకి. డ్రా వైపు పావులు కదుపుతున్నాడు. పోలీసులు కూడా తన యింటికి చేరుకుంటున్నారు. శత్రువు లేని తన ఆటలో పస తగ్గింది. తన చేతిలో ఓడి పోవాల్సిన నర్సయ్య తనకు సమ వర్తిగా కాబోతున్నాడు. ఆట డ్రా గా ముగిసింది. నర్సయ్య కళ్ళు ఆనందంతో మెరిసాయి. పాండురంగయ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
06//12//14.

Sunday, 28 December 2014

విరించి  ll ఇంకొన్ని రాళ్ళు ll
..............................
ఏయ్ మ్యాన్....!!
నీకొక రాళ్ళ ఫ్యాక్టరీ కట్టించిస్తాను
పొద్దస్తమానం సమస్తంమీద
రాళ్ళేసుకుంటూ కూర్చుందువుగానీ....!!

పాక్షిక సత్యాలకి సగటులు కట్టి
ఫ్యాషన్ గా సంకలు గుద్దుకుంటుంటే..
బొప్పి కట్టిన నా నెత్తిమీది ఇనుప గమేళం
నేను సైతం నీక్కొన్ని రాళ్ళెత్తుతానంటోంది.

నీకు అర్థమైన,అర్ద వాక్య ముక్కని
అరకొర తెలివితో రాద్దాంతం చేస్తుంటే
ప్రతిరోజూ తద్డినం పెట్టుకుని ఏడ్చే తింగిరి తనం
నీ కాకలు తీరిన తలతిక్కత్వానికి తారంగమాడుతోంది..

నాలుగు పదాలను నగ్నంగా వురితీసి ఉరకలెత్తే
నీ కసిత్వానికి కపిత్వానికి పుంసత్వపు తొడుగా..?
నాలికతో నలిపి తీసే నానార్థాల రసిని
నీ కలం స్ఖలిస్తున్నట్టున్నది...
అందుకే ఇదిగో...'ఛా' కు గుడిదీర్ఘమిస్తున్నా....

నీ కవిత్వపు బూట్లలో బూతులు పడుతున్నాయి
సాక్సుల్లో...ఇంన్ట్సింక్ట్ ల స్టింక్ లు
నా కాళ్ళు పట్టడంలేదు..
గలీజు బూజును బెల్లంలా జుబుకుతూ
సాలెగూళ్ళ తోకలతో కానీయ్..ఇక నీ మద్దెలదరువు..!
ఇష్టాఇష్టాలతో...సందేశ సంభాషణలతో..మనకేం పని..?
రానీయ్.. ఇక వాంతికొచ్చే ప్రతీకలు...!
ఇవిగో ఇక్కడ నీకోసం ఇంకొన్ని రాళ్ళు

26/12/14
విరించి  ll సైతాన్ పూనకం ll
--------------------------------
ప్రపంచం మండిపోతోంది
ఏం చేయగలం అయితే...
సూర్యుడిని పట్టుకుని ఏడ్చేద్దామా..?

నాకిక పై పెదవిగ ఆకాశం
కింది పెదవిగా ఈ భూమిని చేసుకుని ఏడవాలనున్నది.

కన్నీటి చుక్కలకు ఏడుపొక్కటే దిక్కు
అనామకంగా ఒంటరిగా చీకట్లలో రాలిన కన్నీళ్ళే
మూడొంతుల భూమిని చుట్టేశాయి.
మిగిలిన ఒక్క వంతు ముక్కను
వంతలుగా వేలముక్కలుగ చేసేశాం..

అయినా మత సైతాన్ మత్తుమందును
మస్తీష్కాల్లో పాత వోడ్కా వోలె దాచుకుందాం...
ఇంకాస్త కిక్కు కోసం..

పుట్టిన ఏ బిడ్డా ఇప్పటిదాకా
కొత్త ప్రపంచాన్ని చూడనేలేదు.
అదే మతంలోకి, అదే జాతిలోకి
అదే కులంలోకి
అవే నీతి నియమాల్లోకి
ఈ పురాతన మెదడు కణాల్లోకి
మానని సమాజపు వృణాల్లోకి
జారి పడుతూనే ఉన్నారు
రోజుకి మూడున్నర లక్షలు
సెకనుకి నలుగురు.

ఏంచేద్దాం ..అయితే..
ఆష్ ట్రే వుంది కాబట్టి
సిగరెట్లు కాలుద్దాం
మనుషులున్నారు కాబట్టి
ఏదో ఒక సిద్దాంతంతో పేల్చేద్దాం..

నేటితో మనిషి శకం ముగింపు దగ్గరైనా వుండిండాలి
లేదా మనిషనేవాడు ఇంకా పుట్టకనైనా వుండిండాలి
నిజమైన మనిషికి మనం మరుగుజ్జు రూపాలమేమో
లేక వెస్టీజియల్ మెదడుతో తిరిగే ముసలి పీనుగులమో

అంతా చూస్తే మన పరిణామం ఆకారంలోనే
అంతరంగాల్లో ఎన్ని జంతువులమో
అంతరించి పోతున్న జంతుజాలాలని ఆందోళన ఎందుకు
మెదడులోని శిలాజాలకు ఆక్సిజన్ కూడా పోద్దాం అపుడపుడూ...
సత్వం కోసం పశుత్వాన్ని అణచి పెట్టుకుందాం
అదను కోసం వేటకుక్కలా కాచుకుని వుందాం

దేవుడనే చెత్తవెధవకిక చేతకాదు
పంపిన పదిమంది దూతలతో మనకిక పనిలేదు
హిరణ్య కశిపుడు ఎప్పుడో చెప్పినా
నీషే నిన్న చెప్పినా..
నేను నేడు మళ్ళీ చెబుతున్నా..
దేవుడు ఇక లేడు
మనల్ని పుట్టించి వాడు చచ్చిపోయాడు
వాడు ఏడ్చి సచ్చేదాక మనుషుల్ని మనమే చంపుదాం..

17/12/14
విరించి ll అమ్మా..మనమిపుడు ఏం చేద్దాం ll
.................................................
మా అమ్మ లాగే నీవూ ఓ అమ్మవి.
నీ గుండెలమీద అగ్గి కుంపటి రగిలే దాకా
నీ రొమ్ములమీద ఈ ప్రాతఃకాలం
బలిపీఠమై అరిచేదాకా
నీలో అమ్మతనాన్ని గుర్తించలేని
నా బ్రెయిన్ వాష్డ్ దేశభక్తిని చూసి
స్వచ్ఛందంగా సిగ్గుపడుతున్నాను.

రక్తం అద్దుకుని అయోమయంగా
అమాయకంగా ఎగిరివచ్చిన సీతాకోకచిలుకలు
మా తులిప్ పూవుల రెక్కలను ఆర్ద్రంగా తాకుతుంటే
తేనెలై  కురవాల్సిన మకరందం
కన్నీరై పూవులమీద జారిపోతుండటం చూసి
నీ ఒడిలో నా హృదయం పెట్టి
బోరున ఏడవాలని వుంది
మన సరిహద్దుల్లోని ముళ్ళ కంచె నుండి
మూతికూడా చొచ్చుకుని రాలేదు కదా..

మీ బిడ్డలు మా ఇంటికి శరణార్థులై వొచ్చినా
మా ఇంటి ఆడపడచులు మీఇంటీకి కోడళ్ళై వచ్చినా..
మానవత్వపు శ్మశానంలో ఎన్ని పీనుగలు దయ్యాలై లేస్తాయో..
బీటలు బారిన మన మనో భూముల్లో
ఎన్ని మోడువోయిన చెట్లున్నాయో..
మోదుగపూవుల కాలం వస్తుందా తల్లీ....

మన గడియారాల్లో ముల్లులు
ఒక మూలకి జరిగాయేమో..
సరిహద్దు రగిలించిన కాష్టమంతా
ఒక వైపు అమావాస్య వెన్నెల
మరో వైపు నెలవంక చీకటి ..అంతేగా.

చేతుల్లో పచ్చని చెట్లు
కాళ్ళల్లో వెచ్చనివేర్లూ పూయించాల్సిన నీవు
చేతులతో ఒకనికి మొక్కడానికి
కాళ్ళ ను ఇంకెవడో తొక్కడానికి అప్పగించి
అల్లా కి గాలిలో దీపం అర్పిస్తే...
మా మెదడు లేని కంకాళా లు వికృతంగా
వెక్కిరించడం తప్ప చేసిందేముందని...

అయినా చూసావా అమ్మా..
చేతుల్నించి జారిపోతున్న మన స్నేహాన్ని
పీక్కు తినడానికి ఎన్ని రాబందువులు
ఎదురుచూస్తున్నాయో...

శరీరమంతా ఉండగా చుట్టుకున్న కొంత కండ కోసం
నిండుగా అల్లుకున్న ఎముకల గూడుకోసం
అడవి గోడులా కొట్టుకునే గుండెకోసం
శిథిలాల్లో దాక్కున్న దేవుని కోసం
శిథిలమైన కొన్ని పుటల కోసం
వీపు మీద తుపాకుల్నీ
కడుపులో సూసైడ్ బాంబుల్నీ మోసే మన పిల్లల్ని చూసయినా
మనమేం చేద్దాం చెప్పు
మన ఎత్తుల నుండి కాస్త జారుదామా
ఇక్కడి నుండే మరింత దిగజారుదామా...?

19/ 12/ 14
విరించి ll హెచ్చరిక ll
........................................
 'ఉరుము' కునుకు తీస్తోంది
మరణంలాంటి వేడుకేదో జరుగుతున్నట్టు
పిడచ కట్టుకుపోయిన నాలికలా భావాలు

'మెరుపు' కలలు కంటోంది
గతం రాసుకున్న కాగితం కాలిపోతున్నట్టు
సంతలో తప్పిపోయిన జ్ఞాపకపు మరుపులా ఊహలు

'పిడుగు' గురక పెడుతోంది
ఆబ్జెక్టివ్ అందాలు సబ్జెక్టివ్ అద్దంలో అలసిపోయినట్టు
పిడాండ జాగృతి నుండి జారిఅండాండ సుశుప్తి లో  ఆలోచనలు

అలారం ప్రమాద హెచ్చరికలా మ్రోగింది..
సింహంలా జూలు విదిలించుకున్న తుఫాను
వళ్ళు విరుచుకుని భృకుటి ముడివేసిన 'కవి'
జన సముద్రం మీదికి ఉరికిన విప్లవాల వరదలు.
విరించి ll అగ్గి పూలు ll
.........................

నా మానాన నేను
 అక్షరాల ఇటుకలను కాల్చుకొని
కొన్ని జ్ఞాపకాలను పేర్చుకుంటుంటే..
డబ్బాలో గులకరాల్లేసి దొర్లిస్తారేం..
తలతెగిపడిన వాదాల్ని భుజాలకెత్తుకొని
తోకలతో కాలు దువ్వుతారేం...

తెలుసుగా..
కొబ్బరికాయకు బొట్టు పెట్టేది
హారతులు అద్దడానికి కాదు
బండకీడ్చి పగులగొట్టడానికి
బలి పశువుకు దండవేసేది
దండకాలు చదవడానికి కాదు
తల త్రుంచి నూనెలో వండడానికి
నా నుదుటిమీది బొట్టు చూసి పంచ కట్టు చూసి
తీసికట్టు అంచనాలు తలనుండి తీసేయ్
తెలుగోడి మీసకట్టు మీద ఉడుం పట్టుమీద
తెరచి చూడు లెక్కలేని కథలొచ్చాయ్

నా రాతల్ని గీతల్ని
తలరాతల్ని రోతల్ని
రంగు పాతరేస్తానంటే
రణరంగమే రచిస్తాను
ఎక్కడుందోయ్ ఈ ఢమరుకం
నీ బగ్గి మోటరు బడబడల్లోనా..
నా శివతాండవం ఢమఢమల్లోనా..

బాలసాహిత్యంలో బాలలై మిగిలింది
వెర్రిగా వినేవారు మాత్రమే..
అందులోని బకాసురుడు బాలుడేం కాదు
నరకాసురుడసలు నరుడేకాదు
చెప్పేదేమంటే నేను మీ బోసినవ్వుల బాలున్ని కాదు
నిలువెల్లా విషం నిండిన ఖలున్నీ కాదు

ఇదిగో...
నేను కాపు కాసిన మందార తోటలో..
ఇపుడిపుడే అగ్గి పూలు పూస్తున్నాయి
నాక్కూడా బ్రతికే హక్కుందని
అరచేతిలో కోడీక పట్టుకుని అరుస్తున్నాయి
చేనుకుండే కంచెని నేనే విప్పగలను...
నిప్పులు పారించగలను..
విప్పమంటారా....తప్పుకుంటారా..?

(కొంచం తెలుగోడి గర్వం కొంత తెలంగాణోడి ఆవేశం)
విరించి ll నగర పయనం ll
............... ....................
గుడ్డి లాంతరు మోసే ముప్పావు చీకటి
ఫాస్పరస్ బల్బులకింద ఉనికి కోల్పేతే..
సోదరా ...జరిగేదేముంటుంది
రోడ్డు పక్కని బీదరికపు సిగ్గంతా
బరిబత్తల బలవంతంగా నిలబడుతుంది
అభివృద్ది అంతా ఇంతే కదా
బీదరికం వెకిలిగా వెలిగిపోతోంది..!!

అర్ధ రాత్రి తిమిరాన్ని తరిమిన
డిస్కో మిర్రర్ బాల్ వెలుగుల్లో
అదిగో చూశావా...
నేలనలుకుతూ  మిణుకు మంటున్న
మిట్ట మధ్యాహ్నపు నిశీధిని.
తెరిచి వుంచిన బతుకుల లోగిలిలో
కనిపించని నగ్నత్వ వెగటు కౌగిలిని.
శిలలా కరడుగట్టిన గోడల్లో
శిల్పాల్ని వెతుక్కునే శిలాజాన్ని.
ఈ గోతుల పునాది కిందే కదా
బీదరికం మౌనంగా నలిగిపోతోంది..!!

మోసే బండలకిందే బరువెక్కువగా వుంది
ఊరే ఉప్పుకంటే చెమటెక్కువుంది
గమనించావా...
నగరమమనే బహిరంగ బలిపీఠంమీద
శ్మశాన వైరాగ్యం ఒక ఆయువు పట్టు
ఇదే కదా..వేల పల్లెలకి ఏకైక సమాధి
ఇచటికే కదా బీదరికం ప్రతిరోజూ పయనమయ్యేది..!!

సోదరా..మనమూ పోదాం పద..
మన ఊరి బొందలగట్టు మీది
వేపచెట్టు పిలిచేదాకా...
మన ఊరు కేవలం సమాధులకే
పనికొచ్చేదాకా...

25/12/14