Wednesday, 24 August 2016

# ప్రతిజ్ఞకూ సంకల్పానికీ తేడా తెలియక్కర్లేదా? పెతీ దానికీ చేయి ముందరెట్టేయటమే

# రోజుకొకసారైనా ప్రపంచంలోనే నెంబర్ వన్ అనకుండా బతకలేడు, అది ఆయన వీక్ నెస్.

# సినిమాటోగ్రఫీలో ఉన్నప్పటి సినిమాలనుభవం ఆ విధంగా పనికొచ్చిందన్నమాట, ప్రతీదీ షూటింగ్ జరుగుతున్నట్టే భావించి నటిస్తుంటాడు.

# అప్పటిదాకా బతికుంటానో లేనో అని బెంగపడకు. నీకు నీవు బతికుండటం కావాలా? రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా చేయటం కావాలా?

# పరిపాలనను కూడా ఒలంపిక్స్ అనుకుంటాడు. అందుకే అన్నింటికీ ప్రపంచంలోనే నెంబర్ వన్ కావాలని శ్రమిస్తుంటాడు.

# టొంటీ టొంటీకి దేశంలోనే మూడు, టొంటీ ఫార్టీకి దేశంలోనే ఒకటి, టొంటీ సిక్స్టీ కి ప్రెపంచంలోనే ఒకటి. సాంబా రాస్కో

# టొంటీ సిక్స్టీకి ప్రపంచంలో చక్రం తిప్పబోతున్న శెనగపప్పు

మన సమాజంలో అతి పెరిగిపోతుందా

మన సమాజంలో అతి పెరిగిపోతుందా?

అవును. ప్రతీదాన్నీ రాజకీయం అంశం చేసి, దానిలో స్వలాభాల్ని వెనుకేసుకోవడానికి చేసే కుప్రయత్నాల్ని చూస్తుంటే, అతి విపరీతంగా పెరిగిపోయినట్టే వుంది. పుష్కరాల్నే తీసుకుందాం. పుష్కరాలు ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒద్దన్నా ఒస్తాయి. ఆ పుష్కరుడిని తామే పిలిచి ఆహ్వానించినట్టు చెప్పుకోవడం అతి. చంద్రబాబు ఒకింత అడుగు ముందుకేసి దేశ ప్రధాని, రాష్ట్రపతి ఇత్యాది ప్రముఖులను పుష్కరాలకు రండని ఆహ్వానించటం. రాజకీయనాయకులు ఇటువంటి ఉత్సవాలకు ఫెసిలిటేటర్ లుగా ఉండాలి తప్ప, తామే ఉత్సవాలని జరపాలి అనుకోవడం అతే మరి. వేల సంఖ్యలో ప్రజలు వస్తారు కాబట్టి, ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకున్నాం అని లోకల్ పోలీసు అధికారులు మనకు భరోసా ఇచ్చేలా మాట్లాడతారు అణుకుంటాం, కానీ ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రే చెబుతాడు. భారీ సినిమా సెట్టింగులు వేయడం, దానికి సినిమా దర్శకుల సహాయం తీసుకోవడం, అక్కడ ఇచ్చే హారతి స్టేజి నాటకాన్ని తలపించేలా సాగటం, దానినే మీడియా అత్యద్బుతమంటూ చూపటం, మనం చూసి ఆహా ఓహో అనటం, ఎక్కడా అతి తగ్గకుండా సాగుతోందనిపిస్తుంది. ఏది చేసినా ప్రభుత్వమే చేస్తోందని చెప్పుకోవటం, చూపుకోవటం ఈ అతికి కారణం. పుష్కరాలకు వెల్లే దారిలో భారీ భారీ ఫ్లెక్సీలు, ఎక్కడా ఒక్కచోటకూడా కృష్ణమ్మ బొమ్మగానీ, కృష్ణానది మీద కవులు రాసిన కవిత్వంగానీ కనిపించదు. కేసీఆర్ బొమ్మనో చంద్రబాబు బొమ్మనో వేసి కింద పేరూ ఊరు తెలియని పది తలకాయలు కనిపిస్తుంటాయి. వీరంతా ఆ ఫ్లెక్సీలను తయారు చేయించిన వారన్నమాట. కేసీఆర్ లేదా చంద్రబాబు ఆ ప్రదేశం గుండా పోతే తమ తలకాయలు చూస్తారనే బోడి ఆలోచనా ఫలితం ఇది. వేగంగా దూసుకెల్లే కాన్వాయ్ల్లోంచి తలకాయ బయటకు పెట్టి ఈ బోడి తలకాయలను ఆ ముఖ్యమంత్రులు చూస్తారనుకుంటారో ఏమో.

గోదావరి పుష్కరాలపుడు ఒకామె ఏకంగా స్నానంకోసం రాలేదు, మా చంద్రబాబు చేసిన ఏర్పాట్లు చూసి మురిసిపోదామని ఒచ్చామని చెప్పుకుంది. ఎంత డబ్బులిచ్చి చెప్పిచ్చుకున్నారో మనం ఊహించవచ్చు. ఇక అతి వాగుడు ప్రవచనకర్తలు గోదావరి పుష్కరాలపుడు చేసిన అతి తెలియంది కాదు. ముప్పై మంది వీరి అతి కి బలైపోయినా, సిగ్గులేకుండా ఇంకా ప్రవచనాలంటూ జనాలని సావగొట్టడం వారి లేకితనానికి పరాకాష్ట. కాకపోతే ఈసారి కాస్త బుద్ధి వచ్చినట్టుంది, కృష్ణా పుష్కరాలమీద ఎక్కడా కించిత్తు సుత్తినీ వేసినట్టు లేరు. ఒచ్చే సంవత్సరం తుంగభద్రా పుష్కరాలు మరి, ఏం వాగుతారో చూడాలి, ఈ సిగ్గు అప్పటికి కాస్త తగ్గి ఉంటుంది కదా..

ఇక రియో ఒలంపిక్స్. వందకోట్లమందిలో రెండు పతకాలొచ్చాయి. దానికి జనాలంతగా ఎందుకు ఫీలవుతున్నారో అర్థం కాదు. సెమీ ఫైనల్లో సింధు గెలిచింది. ఫైనల్లో గెలవాలని పూజలు వ్రతాలు చేయడం ఏంటిది?. ఏమి అతి అనుకోవాలి దీన్ని?. ఆటను ఆటలాగా చూడలేని దుర్బలత్వమే ఇది. ఎన్నో అంశాలు అనుకూలిస్తే తప్ప ఇటువంటి టఫ్ ఫైనల్లో గెలవటం సాధ్యంకాదు. సింధూ ఫైనల్లో గెలవాలి అనుకోవడం, కోరుకోవడం వరకు బాగానే ఉంది, దానికి పూజలు, ర్యాలీలు చేయడమేంటిది?. ఒకవేల ఫైనల్లో గెలిచి ఉండింటే, బాణా సంచాలు కాల్వటం, వీధుల్లో అర్ధరాత్రీ అపరాత్రీ అని లేకుండా బైక్ ల మీద భారత్ మాతాకీ జై అని ర్యాలీలు తీయడమూ, ఇదంతా ఆనందం అనుకోవాలనుకోలటం కూడా అతే. ఒలంపిక్స్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి. ఒకటి రెండింటిలో పతకాలు వస్తే మనమే ఇలా వుంటే, చాలా విభాగాల్లో పతకాలు సాధించే అమెరికా చైనాలు ఇంకెలా వుండాలి. కానీ ఆ దేశాలకు మనకుండేంత అతి లేదు. ఇక సింధూకు పతకం రాగానే ప్రెస్ మీట్ పెట్టి "ఆనందంగా ఉంది, నేను కట్టించిన స్టేడియంలో ఆమె ప్రాక్టీస్ చేయడం వల్లే" అని చంద్రబాబు. సిగ్గనిపించదేమో అలా మాట్లాడటానికి. ఆయన మూడు కోట్లు ప్రకటించగానే, కేసీఆర్ రెండాకులు ఎక్కువ తిని ఐదు కోట్లిస్తానంటాడు. అరే.. మీకు క్రీడలంటే అంత అభిమానం ఉంటే ఇయ్యుర్రి భయ్...ఈ ప్రెస్ మీట్ లేంది. అంతిచ్చినం, ఇంత పొడ్చినం అని చెప్పుడేంది?. రేపు సింధూ హైదరాబాదుకు వస్తే, భారీ ఎత్తున స్వాగత సన్నాహాలకు తెలంగాణా ప్రభుత్వ ఏర్పాట్లంట. సిగ్గేమన్నా ఉన్నదా జన్మలకు. అక్కడ సింధూ బంధువులుగానీ, ప్రాణ స్నేహితులుగానీ, అకాడెమీలోని తోటి ఆటగాల్లుగానీ కనిపించరు. అంతా రాజకీయ ప్రముఖులే. ఇంకెందుకు ఈ స్వాగత సన్నాహాలు?. స్వయంగా,ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలకడానికి పోయినా ఆశ్చర్య పడనక్కర లేదు. రాజకీయ లబ్దికోసం కాక ఇంక దేనికి పనికొస్తాయివి?. సింపుల్ గా ఉండలేకపోవటం ఎంతటి దౌర్భాగ్యం కదా.

ఇపుడు మనమంతా సింధూ ఏ కులం, ఏ ప్రాంతం అని చూసే పనిలో పడ్డాం. 'మా వాళ్ళే' అని చెప్పుకోవడానికి అవకాశం ఉందా లేదా అని సిగ్గువదిలి కష్ట పడిపోతున్నాం. సింధూ ముమ్మాటికీ ఆంధ్రా అమ్మాయే అని ఒకడు పోస్ట్ పెడతాడు, అదో గొప్ప రీసెర్చి చేసి కనుక్కున్న విషయంలాగా. బోనాలాడింది సింధూ, మా అమ్మాయే అని మరో తెలంగాణా రీసెర్చ్ స్కాలర్ బయలుదేరుతాడు. మా కులం అమ్మాయే మా కుల తేజం, కుల దైవం అని ఇంకొకడు. ఇప్పటికిప్పుడు తమ కులం, జాతి గుర్తుకొచ్చి ఊగిపోవడానికి తప్ప ఎందుకూ పనికిరాని విషయాలివి.

పుష్కరాలయినా, ఒలంపిక్స్ లో మన దేశం రెండు పతకాలు సాధించినా, మన రాజకీయ లబ్దికి ఇవి పనికొస్తాయా లేదా అన్నది ముఖ్యంగా మారిందిపుడు. ప్రజలింకా వెర్రి వెంగలప్పలే. శాస్త్రాలు ఘోషిస్తున్నాయని పనికి మాలిన విషయాల్ని చవట ప్రవచనకారులు చెప్పేదంతా విని నమ్మేవరకూ..ఫైనల్ లో గెలవాలని పూజలు వ్రతాలూ చేసే వరకూ, ప్రజల వెంగలాయిత్వాన్ని వాడుకునే రాజకీయనాయకులుంటూనే ఉంటారు. అతి కొనసాగుతూనే ఉంటుంది...
# అందరూ నాస్తికుల్లాగా మారిపోవాలనుకోవటం ఒక మూఢ నమ్మకం😊!!

#ఇంకా నయ్యం..., కృష్ణానదిని నిమజ్జనం చేద్దామనలేదు.

Sunday, 21 August 2016

విరించి ll   పంట  ll
--------------------------------

హృదయపు అంచులు తాకేలా
చెవులు రిక్కరించి విను
నాకు తెలిసిన ఓ విషయం నీతో చెప్పాలి

అక్షరాలు పండే నేలమీద
చల్లగ పాకే వానపాములాంటోణ్ణి
మబ్బులు ముసిరినపుడైనా నీకు తెలియాల్సింది
ఈ పంట నాశనం కాబోతోందని
పంట, డాబా మీద ఆరేసిన ఉతికిన బట్టలు కాదు కదా?

నీవు నీరు పోస్తున్న విత్తనం ఏ చెట్టవుతుందో
పండ్లు కాస్తేగానీ తెలియక పోవటం
వేస్తున్న ఎరువెటుపోతుందో
కలుపు మొక్కలు పెరిగితెకానీ ఎరగకపోవటం
నిజంగా ఎంతటి విషాదం కదూ
మంచి వ్యవసాయానికి ఎన్ని అంశాలు అనుకూలించాలో

ఇపుడంతా తడిగా ఉంది కదూ..!
కొట్టుకు పోతున్న కలుపు మొక్కలు నేలని వెక్కిరిస్తున్నాయి కదూ..!
రోజులికపై అసంపూర్ణంగా మిగిలిపోతే యేమి?
జీవిత సత్యం బోధపడినట్టే అయింది కదూ..!

ఒయాసిస్సు నీళ్ల కు సైతం పెరిగే చెట్టు ఇది
ఎరుక ఎరువులుంటే చాలు కోతకొచ్చేసే పంట ఇది

 *       *       *
స్నేహం స్నానం లాంటిది
మనల్ని మరింత శుభ్ర పరచాలి

స్నేహం ఆత్మకు ఇల్లులాంటిది
గోడల్లాంటి చేతుల మధ్య వెలుగనివ్వాలి

స్నేహం చిమ్మ చీకటిలో దూరంగా వెలిగే దీపంవంటిది
నడవలేనంతటి దూరం బతుకంతటి ఆశగా మారాలి.

14/8/16

Wednesday, 3 August 2016

కవిత్వ సందర్భం 24 Aranya krishna

మనిద్దరం సహజంగా ఏకమయిందెప్పుడని?
----------------------------------------------------------

"మానవుడు" అంటే ఆడ మగ శరీరాలు, లక్షణాలు సమానంగా కలిగి ఉన్నవాడే మానవుడు. మానవుడు అనే పదం ఒక జెండర్ కు మాత్రమే సంబంధించినది కాదు. ఇది స్త్రీ పురుషులిద్దరకూ సంబంధించినదే. తొలి మానవుడు ఎక్కడి నుండి పుట్టాడో ఎప్పటికీ మిస్టరీనే. జెనెసిస్ గ్రంధంలో ఆదామును నిద్ర పుచ్చి, అతడి పక్కటెముకలతో అవ్వను సృష్టించాడు దేవుడని ఉంటుంది. ఆదాము నిద్ర లేచే సరికి ఒకడు కాదు ఒకడి స్థానంలో ఇద్దరున్నారు. తొలి మానవుడు ఆ విధంగా మగ ఆడ శరీరాలుగా ఉదయించాడేమో. కానీ చెట్టుమీది నిషిద్ధ ఫలము తిన్న తరువాత తాము వేరు వేరు చైతన్యాలమని తప్పుగా గుర్తెరిగినప్పటినుంచి ఇప్పటి దాకా, వారెప్పుడూ ఒకే చైతన్యంగా కలిసైతే లేరు అన్నది వాస్తవం. మగవారు బుధ గ్రహం నుంచీ, ఆడవారు శుక్ర గ్రహం నుంచీ వచ్చారని, వారికిద్దరికీ అసలు పొసగనే పొసగదనీ మనం అర్థం చేసుకున్నాం. పుస్తకాలు కూడా రాసేసుకున్నాం( Men are from Mars, Women are from Venus ). సంక్లిష్టమైన జీవన విధానాలూ, మతాలూ, నమ్మకాలూ, రాజకీయాలూ, భ్రమలూ వంటివెన్నో మానవ సమాజం ఏర్పరచుకున్నాక ఇద్దరూ ఒకటే చైతన్యం అనే స్పృహ పూర్తిగా కోల్పోయి, అసలు సంబంధమే లేని వారిగా ఈనాడు మనం గుర్తించగలుగుతున్నాం. బాహ్యంగా దృగ్గోచరమయ్యే స్థూల శారీరక నిర్మాణ వ్యవస్థలనుంచీ, సూక్ష్మ జన్యు పదార్థాల( x and y chromosomes) వరకూ ఆడ మగ బేధాల్ని స్పష్టంగా గుర్తించగలిగాము. బాహ్య శారీరక విబేధాన్ని సులువుగా గుర్తించగలిగిన మానవుడు, ఆంతరంగిక మనో సీమల్లో మాత్రం చైతన్యపు ఏకత్వాన్ని గుర్తించే దశలో ఉండగలడని అనుకోవడానికి అవకాశమేలేదు. కవి అరణ్య కృష్ణ, ఎందుకనో ఈ బాహ్యంగా కనిపించే విబేధాల్లో ఏదైనా ఏకత్వ సూత్రం కనిపెడదామనే ప్రయత్నం చేస్తూ ప్రయాణం చేస్తాడు.

కవి నిరాశా వాదిగా ఉండకూడదనే అభిప్రాయం చాలా సార్లు తప్పని ఋజువవుతూ నే ఉంటుంది. నిరాశావాదం హెగేలియన్ డయాలెక్టికల్ పద్దతికి కావలసినంత యాంటీ థీసీస్ని సమర్పిస్తూనే ఉంటుంది. తద్వారానే ఒక సింథసిస్, ఒక రెవిలేషన్ అనేది ఉదయిస్తుంది. అతి ఆశావాదపు అవాస్తవికతను (optimistic unrealism)  సమర్థవంతంగా ఎదుర్కొని సత్యాన్ని నిలబెట్టడానికి నిరాశావాదం పనికొస్తుంది. డిప్రెసివ్ రియాలిటీ కి మనిషి మేల్కోవాలంటే ముందు డిప్రెషన్ లోకి పోవాల్సి ఉంటుంది. వాస్తవ పరిస్థితులకూ ఊహలకూ దూరం పెరిగే కొద్దీ మనిషి నిరాశాపరత్వంలోకి జారిపోక తప్పదు. కానీ అది మనిషికి చేటు చేసేదేమీ కాదు. డిప్రెషన్, తద్వారా వచ్చే నిరాశా వాదం, నేటి సమాజం చెబుతున్నంత మహా పాపమేమీ కాదు. నిరాశ అంతిమంగా అందించగలిగిన వరమే వాస్తవికతలో మేలుకోగలగటం. మనకు కవి అటువంటి నిరాశాయుత స్థితిలోనుంచి వాస్తవికత వైపు పయనిస్తున్నట్టు కనిపిస్తాడీ కవితలో.

తానొక మగవాడిగా, తన జీవితంలో తనతో పలు రూపాల్లో పలు సందర్భాల్లో, దశల్లో సంబంధం కలిగి వున్న స్త్రీత్వమనే ఒక అత్యద్భుతమైన అంశాన్ని తరచి తరచి చూస్తూ ఎక్కడైనా ఎప్పుడైనా ఆ అంశంతో ఏకత్వాన్ని పొందగలిగానా లేదా అని వెతుకుతున్నట్టుగా సాగుతాడీ కవితలో. మానవ సమాజం స్త్రీ పురుషులను వేరు చేయడానికే తన మతాలని వ్యవస్థలనీ మార్చుకున్నట్టుగా కవి భావిస్తాడు, అందుకే స్త్రీ ఎప్పటికీ పురుషుడికి అర్థంకాని ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయమే. తనతో పాటు పుట్టిన ఒక జీవిని అద్భుతంగా భావన చేయటంలోనే, సమాజం స్త్రీ పురుషుల మధ్య ఎంతటి దూరాన్ని సృష్టించగలిగిందో అర్థం చేసుకోవచ్చు. బాల్యంలో తోడబుట్టినదానిగా, స్నేహితురాలిగా, యవ్వనంలో ప్రియీరాలిగా లేదా భార్యగా ఉన్నప్పటికీ ఆ స్త్రీ అతడికి అర్థంకాని ఒక విషయమే. అర్థం కాని విషయం పట్ల మోహాన్ని పెంచుకుంటాం, అర్థం అయితేనే కదా ప్రేమ అనేది సాధ్యమయ్యేది. అందుకే కవి అడుగుతాడు, నిన్ను మోహించాను తప్ప ప్రేమించిందెప్పుడు? అని. నిజమే కదా, భావ కవిత్వ సారమంతా స్త్రీని అపురూపమైనదిగా, భోగ వస్తువుగా, అందరికీ అందరానిదిగా తయారు చేస్తూ మోహింపజేసింది కదా..ఎపుడు వాస్తవాన్ని చెప్పింది కనుక.

ఈ కవితలో పూర్తిగా ధ్వంసమైన ఆధునిక జీవితముంది. జీవితం పట్ల భయంకరమైన పెస్సిమిజం ఉంది. అది అందించే పలాయనత్వం ఉంది. స్త్రీ పురుష సంబంధాలు ధ్వంసమైన జీవన పరిస్థితులనుండి పలాయనత్వం చెందటానికి ఊతమిచ్చేలాగే తయారయ్యాయి తప్ప వాటి స్వచ్ఛమైన స్థితిలో ఏకత్వాన్ని సాధించనే లేవన్న కఠోర సత్యమూ ఉంది. ఈ కవిత రాసినపుడు కవి యుక్త వయసు వాడై ఉండిండాలి, ఇంకా వార్థక్యమూ అందులోని దాంపత్య జీవితమూ వంటి అంశాలు ఈ కవితలో లేవు కాబట్టి. ఒకవేల ఉండిండింటే కవి తప్పక అందులోని డొల్లతనాన్ని బయటపెట్టేవాడేమో. అంతేకాక మోహించటం బాహ్యమైన విషయమే. కవి స్త్రీకి సంబంధించిన ప్రతీ విషయంలో మోహితుడై, ఏదీ ఎక్కడా ఏకత్వ భావనైన ప్రేమ కనిపించటం లేదేమని వెతుకుతూ పోతాడు. తన వైఫల్య పరిస్థితినీ, తనలో ఆవిరవుతున్న ఆశలనీ, తనలోని ఉద్రేకాలనీ, లోకంలో వాస్తవాలని చెప్పబడుతున్న వైరుధ్యాలనూ చూసినప్పుడల్లా స్త్రీ అనే అద్భుత అంశం పట్ల అతడు మోహితుడై, ఊరట చెందటమే తప్ప, ఎపుడూ దానితో తాదాత్మ్యం చెందని పరిస్థితిని కవి ఒక ఆంతరంగిక సత్యంలా దర్శిస్తాడు. వివిధ రూపాల్లో తన చుట్టూ పరుచుకుని ఉన్న స్త్రీ అనే అమూర్త అంశం తనకు సంబంధించినంత వరకూ వాస్తవం కాదనీ, కేవలం వ్యామోహ పరిచే అసత్యమేననీ తెలుసుకుంటాడు. అంతేకాక తన ఊహలకు భిన్నంగా ఆమె కూడా ఒక వాస్తవమనే విషయాన్ని గుర్తెరగక ఎలా తనను నిందించాడో కూడా కవి తెలుసుకుంటాడు. మోహితుడైనా, నిందించినా ఆమె కూడా ఒక వాస్తవం, కేవలం ఊహ కాదు అని తెలుసుకోలేక పోవటం వలననే కదా. స్త్రీ పురుష సంబంధాలను ఎంతో లోతుగా చర్చించిన కవిత ఇది. మన చుట్టూ ఉన్న సమాజం కూడా స్త్రీ పురుషులను వారి వారి స్వచ్ఛమైన రూపాలలో తెలుసుకునే అవకాశం ఇవ్వదు. ఊహాజనితమైన చిత్రణలతో స్త్రీ అంటే పురుషుడికీ, పురుషుడంటే స్త్రీకి వాస్తవానికి భిన్నమైన అభిప్రాయాన్నే కలుగజేస్తుంది. అటువంటి అభిప్రాయాలన్నింటినీ కొల్లగొట్టి, నిజాన్ని అన్వేషించే అన్వేషకుడిలా కనిపిస్తాడు కవి. అంతే కాక కవిత కూడా ఉద్విగ్న పరిస్థితిలో నుండి తన్నుకొచ్చిన అంతర్మధనంలా సాగటంతో, భ్రమలన్నీ పటాపంచలు అయిపోయిన క్షణంలో.. కవిత చివరి వాక్యం ఒక రివిలేషన్ లాగా బయటకు చెబుతాడీకవి. "అసలు నీ కడుపులో పిండంగా కదలాడినపుడు తప్ప, మనిద్దరం సహజంగా ఏకమయిందెప్పుడ"ని?. ఇదే కదా నిరాశావాద వాస్తవికత(pessimistic realism).

వైరుధ్యాల కత్తెర మధ్య మనిద్దరం
----------------------------------------- Aranya Krishna

నిన్ను మోహించానే తప్ప ప్రేమించిందెప్పుడు?

నిక్కర్లేసుకుని హైస్కూలుకెళ్ళే రోజుల్లోనే
నాతో కలిసి పెరిగిన అక్కగా చెల్లిగా
నాతో నిస్కల్మషంగా వీధుల్లో ఆడుకున్న స్నేహితురాలిగా
పుస్తకం నుండి నెమలికన్ను జారిపడినట్లు
నా జ్ఞాపకాల్లో ఆలోచనల్లో అంతరించిపోయావు
నా కళ్ళముందు సంచరిస్తూ
ఏవో అజ్ఞాత రహస్యాలు పొందుపరుచుకున్న అద్భుత ద్వీపానివయ్యావు
నా చేతన అచేతన అవస్థల్లో ఊహల్లో స్వప్నాల్లో
నేనో సాహసిక సముద్ర యాత్రికుణ్నయ్యాను

నీ అద్భుత రహస్యాలకై ఎంతగా అన్వేషించానని!
కాలెజీ ఎగ్గొట్టి మ్యాట్నీషోకెళ్ళిన మలయాళం సినిమాల్లో
జులపాల జల్సారాయుళ్ళు వినిపిచే విజయగాధల్లో
స్నేహితులు సరదాగా చెప్పే బూతుకబుర్లలో
ఎంతగా పరిశోధించానని!

అంతేకాదు సుమా,
జీవితంలో వైఫల్యాలు నా హృదయాన్ని
అర్ధరాత్రి స్మశానమంత నిస్తేజం చేసినప్పుడు
నిన్ను నా ఉద్రేకంగా మలుచుకున్నాను
నా చుట్టూ ఆవరించుకున్న విరుద్ధ వాస్తవాలు
రెక్కలపాములై నామీద మొహరించి భయపెట్టినప్పుడు
నా పిరికితనం నుండి నిన్నే పలాయనంగా ఎంచుకున్నాను
జీవితం మీద నా ఆశలన్నీ
సముద్రం ఒడ్డున తడి ఇసుకలో పాదముద్రలంత వేగంగా అవిరైపోయినప్పుడు
నీ రూపలావణ్యాల మీద పిచ్చుకగూళ్ళు కట్టుకున్నాను
నా మోహాన్ని ఉద్రేకాన్ని పలాయనాన్ని మంచుముద్దలా కలగలిపి
నీ చుట్టూ పేర్చుకున్న అమూర్త ప్రేమచాయలో
నీ కదలికల్లోని ఆత్మవిశ్వాసం ఆలోచనల్లో వికాసం
నీ నవ్వుల్లో సృజనాత్మక అభిరుచి
అన్నీ కనుమరుగైపోయాయి

నిన్నో వాస్తవంగా నిరాకరించి
రూపరహిత ఆకృతిగా నా అక్షరాల్లో తీర్చిదిద్ది
నేనో సున్నిత భావుకుణ్నని మురిసిపోయాను

నేను నీ గురించి బూతుగా కలలుకన్నా
భావుకంగా ఊహాలోకాల్లో విహరించినా
రెండూ ఒక్కటే... నీ అస్తిత్వం నాకు నిజంకాదు

కానీ నీకు నువ్వు వాస్తవానివే కదా
నీ ఇంద్రియసంచలనం నీకు నిజమే కదా
నీ కోరికలు నా ఊహల్ని ప్రశ్నించినప్పుడు
నీ నిబ్బరం నా ఆధిక్యాన్ని చిన్నభిన్నం చేసినప్పుడు
నువ్వు పాషాణానివని నిందిస్తాను
రకరకాల సామెతలతో అవమానిస్తాను

మనిద్దరి మనో కక్ష్యల మధ్య దూరం జీవితం కంటే పొడుగైనది
భిన్న హృదయగోళాలకు చెందిన మనిద్దరం
సంసారం సాలెగూట్లో చిక్కుపడి అసహజంగా ఏకమౌతాం
మన శరీరాలు దగ్గరవుతున్నకొద్దీ
మన ఆత్మలు దూరంగా విసిరేయబడతాయి
నా మునివేళ్ళు నీ శరీరాన్ని తాకినప్పుడు
కండరాల రాతిపూల గరుకు స్పర్శ తప్ప
సున్నితమైన ప్రేమతడి అంటదు

అసలు నేను నీ కడుపులో పిండంగా కదలాడినపుడు తప్ప
మనిద్దరం సహజంగా ఏకమైందెప్పుడని?

కవిత్వ సందర్భం 24
3/8/16
పక్కవాని గుండె మీద గుద్దుతాడు

ఇది కబాలీ సినిమాలో.."ఒకడే ఒకడొకడే" పాటలో వినిపించే ఒక వాక్యం. ఇంతకీ ఆ పక్క వాడు ఎవడు?. కబాలి వాడి గుండెమీద ఎందుకు గుద్దుతాడు?. అసలిదేమి పాట? ఇదేమి భావం?. ఈ సినిమాలో ఒక్క పాట కూడా హాయిగా చెవులకు ఇంపుగా లేదు. వెస్టర్న్ పాప్ స్టైల్లో ఉండే మ్యూజిక్ ట్రాక్ కి సరిపోయేలా ఏదో ఒక తెలుగు పదం పెట్టేద్దాం అనుకుంటే ఇలాగే ఉంటుంది. "పక్క వాడి గుండె మీద గుద్దుతాడు" అని రాయటంలో ఎంతో గొప్పటి సాహిత్యం ఉట్టి పడుతోంది కదూ. ఇదీ మన దౌర్భాగ్యమన్నమాట. అనంత శ్రీరామ్ ఇలా కూడా రాస్తాడా?.
"ఉగ్ర త్రినేత్రుడా" పాట ఉన్నది ఉన్నట్టుగా డాక్టర్ డ్రే, "తర రర రా"...పాటకు కాపీ.  ఒక్కపాటనైనా పాడుకోవటానికి అనుకూలంగా లేదు. వెస్టర్న్ స్టైల్ రొద తప్ప, ఒక్క లిరిక్ కూడా అర్థం కాదు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు వస్తుంటుందో అర్థం కాదు. స్టేజి నాటకాల్లో పాత్రలు మాట్లాడేటపుడు ఏదో ఒక మ్యూజిక్ కొడతా ఉంటారు అక్కడ కీ బోర్డుచేతిలో ఉన్నవాడు. ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది. సిట్యుయేషన్ కి తగ్గట్టుగా, మూడ్ ని ఎలివేట్ చేసేలా ఉండాలి బీజీఎమ్. దర్శకుడు వేటినైతే మాటల్లో చెప్పలేడో, అక్కడ బీజీఎమ్ చెప్పగలగాలి. ఈ సినిమాలో అటువంటిదేమీ ఉండదు. ఒక యమాహా హై ఎండ్ కీ బోర్డుంటే చాలు, ఏదొత్తినా ఏదో ఒక మ్యూజిక్ ఒచ్చేస్తుంది, దాన్ని రికార్డు చేసి బీజీఎమ్ గా పెట్టినట్టు ఉన్నాడు.

స్టోరీ ఏ మాత్రం లేని ఈ సినిమాకి, ఒక తొక్కలో మ్యూజిక్ డైరెక్టరూ, దానికో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కా అనుకుంటే, ఈ సినిమాకు సంతోష్ నారాయణ చాలా ఎక్కువ. చిన్న పిల్లలు హాలీడేస్లో దొంగా పోలీస్ ఆట ఆడుకునేప్పుడు ఇటువంటి కథలతోనే ఆడుకుంటూ ఉంటారు. ఇపుడాడుకుంటున్నారో లేదో తెల్వదుగానీ, మేము ఆడుకునే కాలంలోస్టోరీ ఇంతకంటే క్రియేటివ్ గానే ఉండేడిది. మలేషియాలో ఇరవైదేండ్లు జైలులో ఉండి బయటకి ఒచ్చిన రజినీ, బయటకి రాగానే తన ప్రత్యర్థులను కనుక్కుని చంపటం మొదలు పెడతాడు. మలేషియాలో డ్రగ్స్ ప్రాస్టిట్యూషన్ బారిన పడుతున్న భారతీయులను కాపాడటానికి ఒక సమగ్ర కార్యాచరణ ఏమీ ఉండదు. డ్రగ్స్ అమ్మే గ్యాంగ్ స్టర్ లను చంపేస్తే ఆగిపోతుందన్నమాట. మలేషియా పోలీసులకీ, ప్రభుత్వానికీ లేని బాధ మన రజినీకి ఉంటుంది. కబాలి వారి డ్రగ్స్ మాఫియాను సాగనివ్వడన్నమాట. కాబట్టి కబాలిని చంపితేగానీ వారి మాఫియా ముందుకుసాగదు. వీరి వీరి గొడవల్లో పోలీసులుగానీ, అక్కడి ప్రభుత్వంగానీ, న్యాయస్థానాలుగానీ ఏవీ పట్టించుకోవన్నమాట. అంతా చిన్న పిల్లలాటనే. సినిమా మొత్తంలో మొదటి నిముషంలో చివరి నిముషంలో మాత్రమే పోలీసులు కనిపిస్తారు. ఇక రజినీ గ్యాంగ్ నడిపే స్కూల్ ఒకటి ఉంటుంది. అందులో ఓవర్ యాక్షన్ చేయగలిగిన వారికే అడ్మిషన్ ఇచ్చేట్టుగా ఉంటుంది. ఆ చదువుకునే పిల్లలనబడే వారు అడగగానే రజనీ తన గతాన్ని అటువైపు తిరిగి చెప్పేస్తాడన్నమాట. ఆ గతం వినగానే కబాలీ ఓ మహానుభావుడని అర్థం చేసుకున్న పిల్లలు, ఓవరాక్షన్ తో ఊగిపోతారన్నట్టు. ఆ గతంలో రజనీ చైనా వారికి తగ్గట్టుగా భారతీయులకు కూడా జీతాలు పెంచాలని కోరటం, పడగొడుతున్న గుడిని పడగొట్టకుండా ఆపడం, ఈలోగా సీతారామరాజు అనే అక్కడి ఒక నేత కబాలిలో నాయకత్వ లక్షణాల్ని గమనించడం, న్యాయం ధర్మం అని సీతరామరాజుగా నటించిన నాజర్ రెండు అర్థంపర్థం లేని, సిట్యుయేషన్ కి తగని రెండు స్పీచ్లు దంచడమూ, కబాలీ సీతారామరాజును తమ నాయకుడని తృప్తిపడిపోవడమూ ఇంతలో సీతారామరాజు చనిపోవడమూ, ఆయన చనిపోయినందుకో ఏమో..మలేషియాలో ఉన్న ముసలి డాన్ ఒకాయన అందరు లోకల్ డాన్ లతో మీటింగ్ పెట్టడమూ, ఆ మీటింగ్ లో కబాలిని నాయకుడిగా ప్రకటించడం, అందరూ నోరుమూసుకుని, లోలోపల బాధపడుతున్నా పైకి ఒప్పేసుకోవడమూ, ఈలోగా సీతారామరాజుగారి కొడుకు అసూయ పడి బయట పడటమూ, దీనిని ఆసరాగా చేసుకుని డ్రగ్స్ మాఫియా నడిపే డాన్ లు కబాలీని చంపడానికి స్కెచ్ వేయడమూ, ఆ స్కెచ్ లో కబాలి భార్య అనబడుతున్న ఒకామె చనిపోవడమూ, కబాలీ జైలుకు పోవడమూ. ఈ అర్థంలేని కథలో అంతగా బాధపడిపోవాల్సింది ఏముందోగానీ అందరూ తెగబాధపడటమూ.
ఇక రెండవ సగంలో కబాలి భార్య బతికే ఉందని తెలుసుకోవడమూ, డ్రగ్స్ మాఫియాలో ని దుండగులనందరిని చంపేయ్యటమూ, దానికి మల్లీ ఆ ముసలి డాన్ వందవ పుట్టిన రోజు వేడుక వేదిక కావడము. ఇంతలో కబాలికి కూతురుందని తెలుసుకోవటమూ, ఆ కూతురు కూడా ఓ పెద్ద ఫైటర్ లా మనల్ని నమ్మించటానికి ప్రయత్నించటమూ. కబాలి భార్యగా రాధిక ఆప్టే. తిప్తికొడితే సినిమా మొత్తం మీద ఐదు ఆరు డైలాగులుంటాయామెకు.

సినిమా మొత్తంలో ఓ వంద పాత్రలుంటాయి, వారంతా మనకు కబాలీ చాలా గొప్పవాడని చెబుతున్నట్టే పని చేస్తుంటాయి. మొదటి పాటలో ఎవరు ఎందుకు ఎగురుతున్నారో అర్థం కాకుండా ఎగురుతారు. అదే పాట. "పక్కవాడి గుండె మీద గుద్దుతాడు" కబాలి అని చెప్పే పాట. ఆ పాట సరిగ్గా అర్థం అయితే సినిమా చూడనవసరం లేదు. డబ్బులు వేస్టు ఇపుడే లేచిపోండి లేకపోతే గుండెమీద గుద్దుతాడు కబాలీ అని చెప్పే పాట అది. కానీ అర్థం కాని లిరిక్స్ కదా, అర్థం కాకపోవడం వల్ల అలాగే కూచుంటాం. కథ అని డైరెక్టర్ అనుకుంటే సరిపోదని ఎవరైనా ఆయనకు చెప్పండయ్యా..ఆయన్నలా ఒదిలేయకండయ్యా..అని సినిమా అయిపోయాక మనం అనుకుంటూ బయటకు నడవాల్సిందే. ఈ సినిమా బాగా లేదని రాయటం కూడా పరమ వేస్ట్. ఏదో టైం పాస్ కాక ఈ సుత్తి. చదివి భరించండి. చూడకపోతే మాత్రం ఆశ పడకండి. అతిగా ఆశపడే ప్రేక్షకుడూ, అతిగా ఆవేశ పడే డైరెక్టరూ బాగు పడినట్టు చరిత్రలో లేదు.
ఆనందం - ఒక అన్వేషణ (part5)
--------------------------------------------

మతం ఒక పురాతన అంశం, సైన్స్ ఒక ఆధునిక అంశం. ఈ రెండింటికీ అసలు పొసగదు. మతాన్ని అనుసరించేవాడు, మానవ జాతి ఆలోచనలోని గొప్ప విషయాలనన్నింటినీ, మన పూర్వీకులే సాధించేశారు. మనం ఇపుడు కొత్తగా ఆలోచించవలసిన అవసరమేమీ లేదు, కేవలం వాళ్లు ఆలోచించి పెట్టినదాన్ని మనం అనుసరిస్తే చాలు అంటాడు. సైన్స్ ని చదివినవాడు, మానవ జాతి ఇంతకు ముందు చేసిన ఆలోచనలన్నీ ప్రాథమిక దశలో ఉండిన్నాయి, వాటినాధారం చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ముందుకు సాగిపోవాలి అంటాడు. ఏ సూత్రాల మీద మతం ఆధారపడి వుందో వాటిని మార్చటానికిగానీ ఇంకాస్త ఉన్నతంగా చేయటంగానీ కూడదంటాడు మతవాది. ఏ సూత్రాలను ఆధారం చేసుకుని ఒక విషయం చెప్పబడిందో వాటిని ఇంకాస్త ముందుకు తీసుకుని పోవాలి అంటాడు సైంటిస్ట్. ఆధునిక కాలములో సైన్స్ బలపడే కొద్దీ మతము కూడా బలపడటం ఒక పారడాక్స్. మతం నమ్మకం మీద కొనసాగుతుంది. సైన్స్ నిరూపణ మీద కొనసాగుతుంది. మతాన్ని అనుసరించే వారు, అనుసరించని వారికన్నా ఎక్కవ ఆనందంగా ఉన్నారని, ఆధునిక శాస్త్రం పరిశోధన చేసి కనుగొన్న అంశం. నిరూపణ కూడా చేశారు. సైన్స్ పెరగటంతో మతానికి సంబంధించిన ఈ అంశం నిరూపణ అయ్యింది. దానివలన ఇపుడివి పరస్పరం విరుద్ధంగా కనిపించే అంశాలు కావు, పరస్పరం సహాయం చేసుకునే అంశాలు అని అనిపించటం జరుగుతోంది. మత అనుయాయులు కూడా తమ మతంలో అద్భుతమైన సైన్స్ ఉందని, ఆధునిక శాస్త్రాల సారమంతా తమ మత గ్రంధాలలో ఎపుడో చెప్పేశారని వంత పాడటమూ చూస్తుంటాం. అయితే మతమయినా, సైన్సు అయినా మనిషి మేథలోంచి పుట్టినవే కావడం వల్ల, ఇవి ఏవీ కూడా మనుషులను విడగొట్టకుండా చేయగల సత్తా ఉన్నవి కావు. మనిషి స్వతహాగానే ఇంకొక మనిషిని ఇష్టపడడు అన్నది వాస్తవం కనుక. మతమూ, సైన్సూ ఒకదానికొకటి సహాయం చేసుకునేది కూడా మనుషులను కలపడానికి అయితే కాదు. మనుషుల మధ్య రకరకాల గోడలు కట్టడానికే.

ఐతే దీనికి పారడాక్సికల్ గా కూడా మనం ఆలోచించవచ్చు. మనిషి స్వతహాగా వేరొక మనిషిని ఇష్ట పడడు. ఎపుడు ఇష్ట పడతాడు, ఆ వేరే వాడు కూడా తన వాడు, తన కుటుంబం వాడు అయివుండాలి. ఇపుడు కుటుంబంని పెద్ద చేస్తూపోతే తనసంఘం, తనకులం, తన జాతి, తన ప్రాంతం, తన రాష్ట్రం, తనదేశం, తన మతం. సాటి మనిషిని తన వాడే నని గుర్తించగలగటానికి, ఒకే మతం, లేదా ఒకే దేశంకు చెంది వుండటం అనేది, మనిషి సాధించిన అత్యంత ఏకత్వ భావన అనుకోవచ్చు. ఇపుడు మనిషి ఇంతకు మించి, అంటే తన దేశానికి మించి, తన మతానికి మించి, వీటికి ఆవల కూడా సాటి మనిషితో ఏకత్వ భావన కలిగి ఉంటాడా అనేది సమస్య. పక్కనున్న శతృ దేశం వాడిని, వీడు నా వాడు అనగలుగుతాడా?. వేరే మతం వాడిని వీడు నావాడు అని అనగలుగుతాడా?. ఇలా ఎవరినైనా అడిగి చూడండి, మనం అనగలుగుతాం సరే, అవతలి వాడుకూడా మనలాగే అనగలుగుతాడా చెప్పండి?, అని మనకు ఎదురు ప్రశ్న వస్తుంది. అంటే మనిషి ఇంక అక్కడికే ఆగిపోయాడు. ఇంతకు మించిన ఏకత్వ భావనను మనిషి సాధించనేలేడు. ఇపుడు వేరే దేశం వాడినైనా మనం ప్రేమించగలగాలి అంటే వాడు మన మతం వాడు అయివుండాలి. ఆ విధంగా దేశం కంటే కూడా మతం విస్తృత ఏకత్వ భావనని ఇస్తున్నదనుకోవచ్చు. కానీ ఆ తర్వాత, దాని ఏకత్వ పరుధులు దాటిన తర్వాత, ఇక అంతా వ్యతిరేకమే, వారందరూ ఈ మతం దృష్టిలో మనుషులే కారు, వారిని చంపవచ్చు కూడా.

సైన్స్ అయినా మనుషుల మధ్య ఏకత్వాన్ని సాధించలేదు. ఒకడు భౌతిక శాస్త్రం చదివి ఉండింటే, వాడు ఇంకొకడు భౌతిక శాస్త్రం చదివినా వాడితో ఐక్యతను సాధించలేడు. అయినా సైన్స్ ఎన్నో విభాగాలుగా విడిపోయి, విస్తృతంగా పరుచుకొని ఉంది. ఒక విభాగాన్ని అర్థం చేసుకోవటానికే ఒక జీవితకాలం సరిపడంత విస్తృతంగా తయారయ్యింది. కాబట్టి సైన్స్, జీవితం పట్ల ఒక ట్యూబ్యులార్ అవగాహననే ఇవవగలుగుతుంది తప్ప సంపూర్ణమైన అవగాహన ఇవ్వలేదు. ఈ మధ్య ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వారిని, మెకానికల్ ఇంజనీరింగ్ వారు గేలి చేయడం చూస్తుంటాం. మా సైన్స్ గొప్పదంటే మా సైన్స్ గొప్పదనీ, మేము ఎక్కువ సంపాదిస్తున్నాం అంటే మేమే ఎక్కువ సంపాదిస్తున్నామని గొడవపడటం కూడా గమనిస్తుంటాం. సైన్స్ కలిగించిన అజ్ఞానాంధకార స్వరూపం ఇది. అటు పురాతన మతమూ ఇటు ఆధునిక శాస్త్రమూ ఏదీ మనిషి ఉన్నతికి ఉపయోగపడక పోవటం. అంతేగాక సైంటిఫిక్ గా అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందని దేశాలుగా ప్రపంచం రెండు ముక్కలుగా ఉంటోంది. సైంటిఫిక్ దేశమంటే ఆర్థికంగా అభివృద్ది చెందిన దేశమని. సైన్సు మనిషిని ఆలోచనలకంటే ఆర్థికంగా రిచ్ గా చేస్తున్నది. సైంటిఫిక్ అనే పదం ఎకనామికల్ అనే పదానికి పర్యాయపదంలా మారింది.  అభివృద్ధి చెందిన దేశాల ఆగాయిత్యమంతా అభివృద్ధి చెందని దేశాల మీదే. భధ్రతామండలిలోని ఐదు దేశాలూ, సైంటిఫిక్ గా అభివృద్ధి చెందిన దేశాలే. ఒక అభివృద్ధి చెందుతున్న దేశాన్నో, ఒకబీద దేశాన్నో సభ్యత్వం కలుపుకోవాల్సిన అవసరం వాటికి లేదు, ఎందుకంటే సైంటిఫిక్ సుప్రమసీకి ఇది ఆటంకం. గొప్ప, తక్కువ అనే భావనలు సైన్స్ చదివినంత మాత్రాన పోతాయనుకోవడం వట్టి అత్యాశే అవుతుంది అని దీనివల్ల అర్థం అవుతుంది.. ఒకప్పుడు మతం సామ్రాజ్యవాదానికి ఊతమిస్తే, ఇపుడు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా దానికి తోడయింది. ఇతర దేశాల మీద జాతుల మీద బాంబులు వేయటానికి, వాటిని ఏ విదంగానైనా సర్వ నాశనం చేయడానికి ఉపయోగపడినంతగా సైన్సు వేరే ఏ విషయానికీ ఉపయోగపడటం లేదు. కానీ మతవాదులుకాని నాస్తిక వాదులు, సైన్సు మీద చాలా పెద్ద నమ్మకం కనబరచడం, "మతాలు మాత్రమే మారణ హోమాన్ని సృష్టించాయి, సైన్సు అభివృద్ధి చెందిన ఈ కాలంలో మతమేంటి?, నమ్మకమేంటి? అంతా నాన్సెన్స్". అని కొట్టివేయడం కూడా చూస్తుంటాం. సైన్సు సృష్టించిన మారణ హోమం వారికి కనిపించకపోవటం దారుణమైన విషయమే. గ్రీకుల చరిత్రను మార్చిన పోలేపోన్నిసియన్ యుద్ధం ముఠా పోట్లాటలూ దారి దొమ్మీల కంటే పెద్దదేమీ కాదంటారు చరిత్ర కారులు. కానీ సైన్సు పెరిగిన ఈనాటి యుద్ధాలు?. ఇవి ఏకంగా మానవజాతినే సమూలంగా నాశనం చేయగల శక్తిని కలిగి ఉన్నవి. టెక్నాలజీ పెరగిన తర్వాత మత యుద్ధాల గురించి తెలిసినంతగా, పెరగకముందు తెలియదనేది వాస్తవం. అందుకే సైన్స్ అండ్ టెక్నాలజీ ఆదునిక మానవునికి ప్రసాదించిన కొత్త రోగమే హంగ్టింగ్టన్ రోగం. అంటే నాగరికతల మధ్య యుద్ధం. మెడికల్ గా హంటింగ్టన్ జబ్బు అనేది మెదడులో కణాలు చనిపోవడం వల్ల సంభవించేది. క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అని ప్రతిపాదించిన ఈ కాలపు హంగ్టింటన్ కూడా మనుషుల్లో మెదడు కణాలు చచ్చిపోయే జబ్బునే కనుగొన్నాడు అనిపిస్తుంది. రాజుల మధ్య యుద్ధాలు పోయాయి, దేశాల మధ్య యుద్ధాలు పోయాయి. ఇపుడు మనుషుల మధ్య యుద్ధాలు. ఎక్కడో ప్రపంచంలో ఏ మారుమూలలోనో ఒక మతం వాడు ఇంకో మతం వాడిని కొడితే, ఇక్కడ నిరసనలూ, యుద్ధాలూ.

మనుషుల స్వభావాల్ని మతాలు ప్రభావితం చేస్తుంటే, ఆధునిక జీవితం వాటిని ద్విగుణీకృతం చేస్తుంది. మనిషి బేసిక్ గా అసూయాపరుడు, ఆశా పరుడు, కాంక్షాపరుడు, మోసకారి, స్వార్థపరుడు. మతమైనా సైన్సు అయినా, ఆతడి ఆకాంక్షా పరత్వాన్ని, విద్వేషాన్ని బయటకు చూపించుకోవడానికి ఉపయోగపడూతుందే తప్ప ఇంకో రకంగా ఉపయోగపడటం లేదన్నది వాస్తవం. మతమూ, సైన్సూ అతడికి విద్వేషాన్ని చిమ్మటానికి పనిముట్లే తప్ప ఇంకేమీ కాదు. కానీ ఆశ్చర్యంగా ఆస్తికులు మతానికీ, నాస్తికులు సైన్సుకీ కట్టుబడి ఈ రెంటికీ ఏ సంబంధం లేదంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ, సైన్సుకు అందనిది ఎంతో మతం కనుగొందని మతవాదులూ, సైంటిఫిక్ గా ఆలోచించటమే మతానికి విరుగుడని నాస్తికులూ, వాటికి ఎనలేని ప్రాముఖ్యాన్నిస్తూ గడిపేయటం గమనిస్తుంటాం.