Friday, 30 September 2016

కవిత్వ సందర్భం 26 kondepudi

Brain drain returns without heart
---------------------------------------------------------------------------------

ఒక ప్రపంచ పటాన్ని తీసుకుని చేతిలో నలిపివేస్తే, దేశాలన్నీ ముడుచుకుని దగ్గరయినట్టుగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుత ప్రపంచ పరిస్థితికి ఒక సింబాలిక్ ఇమేజ్. దేశాల మధ్య భౌతిక దూరాలే తరిగాయి. ప్రాక్ పశ్చిమ దేశాలుగా విడిపోవటమన్నది పొరలు పొరలుగా బహురూపాల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఆధునిక ప్రపంచంలో మార్పు ఊహించనంత వేగంగా జరిగిపోతూ ఉంటుంది. ఈ వేగానికి తట్టుకుని తమ తమ జీవిత విధానాల్ని, మానవ సంబంధాల్నీ మార్చుకుంటూ బతక నేర్చిన వారు ఒక వైపూ, మార్చుకోలేక, లేదా మార్పును అందుకోలేక వెనుకబడిపోయే వారు ఇంకోవైపూ కనిపిస్తూ ఉంటారు. మార్పు అనే పద్ధతి ద్వారా మనకు తెలియని భవిష్యత్తు మన జీవితాల్ని నిర్ధాక్షిణ్యంగా తొలిచేస్తూనే ఉంటుంది. "కాలం గడిచేకొద్దీ, సామూహికత్వం నుండి వ్యక్తివాదం వైపుకు పశ్చిమ దేశాలు స్వయం ప్రేరణతో సహజంగానే నడిస్తే, ఎలాంటి స్వయం ప్రేరణా లేక కేవలం పశ్చిమ దేశాలతో ఏర్పడిన పరిచయ ప్రభావం చేత మాత్రమే తూ ర్పు దేశాలు వ్యక్తివాదం (individualism) వైపు నడిచాయంటారు" శ్రీ అరవిందులు. భారత దేశంలో ఆధునిక టెక్నాలజీని అందుకుని, విదేశీ చదువులు చదివిన వారు, విదేశాల్లో నివసిస్తున్నవారు, ఆ పశ్చిమ సమాజాల పరిచయ ప్రభావానికి లోనైనపుడు, తీవ్రమైన ప్రవర్తనా మార్పులకు లోనవటం సహజం. వాళ్ల ప్రవర్తనల్లో వచ్చిన మార్పు, వ్యక్తిగతంగా వాళ్లు గుర్తించలేక పోవచ్చు. కానీ స్వంత దేశానికి తిరిగి వచ్చినపుడు, తోటి బంధువులూ స్నేహితులూ, వ్యక్తి వాదాన్ని మోసుకొచ్చిన ఈ కొత్త మనిషిని అర్థం చేసుకోవటానికి ఇబ్బంది పడతారు. వ్యక్తి వాదంలోంచి పుట్టుకొచ్చిన కొత్త మానవ విలువలనీ, మానవ సంబంధాలనీ చూసి, ఏది నిజమనే అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతారు. డెట్రాయిట్ నుండి సొంత ఊరికి తిరిగి వచ్చిన తమ్ముడిని, ఆ సందర్భాన్నీ కవిత్వం చేస్తూ, ఎన్నో ఆసక్తికర విషయాల్ని చర్చిస్తారీ కవితలో కవయిత్రి కొండేపూడి నిర్మల. ఇదొక చారిత్రక సందర్భానిది. విదేశాల్లో కొడుకు లేదా కూతురున్నారని గొప్పగా చెప్పుకునే 'ఐటీ బూమ్' పెచ్చరిల్లుతున్న సందర్భం. ఆ సందర్భంలోని ఒకానొక కుటుంబం అందులోని అనుబంధాలూ, మానసిక ఘర్షణలూ అన్నీ ఈ కవితలో ఇమిడిపోయి కనిపిస్తాయి.

కుటుంబం, విద్య, మతం, ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వం అని సమాజంలో ఐదు ప్రాథమిక వ్యవస్థలుంటాయి (primary institutions of society). ఇవన్నీ కూడా మనిషి మనసుకీ అతని అవసరాలకీ, చుట్టూ ఏర్పడిన పరిస్థితులకీ అనుగుణంగా మార్పులు చెందుతూ నే ఉంటాయి. ఈ శతాబ్దపు ఆధునిక జీవితం, ఆర్థిక వ్యవస్థనీ, ప్రభుత్వాలపై విపరీతంగా ప్రభావితం చేసింది. మతం గానీ, విద్య గానీ అందుకు అనుగుణంగా మలచబడ్డాయి. చివరకు కుటుంబం కూడా ఈ ఆధునిక పోకడలను అందిపుచ్చుకోవడానికి విచ్ఛిన్నం చెందటం ప్రారంభించింది. కుటుంబం చుట్టూ ఉన్న సమాజంలో జరిగే అఘాతాలకు షాక్ అబ్సార్బర్( shock absorbers) గా పని చేయాల్సింది పోయి, ఆ కుటుంబాలే షాక్ కి గురవుతున్నాయి. ఆధునిక నగర సమాజంలో కుటుంబం నిర్వహించాల్సిన బాధ్యతలను, ఓల్డేజ్ హోం లూ, క్రష్ లూ, కౌన్సిలింగ్ సెంటర్లూ వంటి కొత్త సంస్థలు నిర్వహిస్తూ, సమాజంలో కుటుంబ పాత్రను( role of family in society) శూన్యం వైపు నడిపిస్తూన్నాయి. నగరీకరణ తెచ్చే నూతన సమాజాన్ని, వెస్ట్ భౌతికంగానూ మానసికంగానూ కూడా అర్థం చేసుకోగలిగింది. ఇండియా వంటి దేశాలు భౌతికంగా దానిని అనుసరిస్తున్నాయే తప్ప, మానసికంగా గ్రామీణ వ్యవస్థతో ఇంకా పెనవేసుకుని ఉన్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ రెండు వ్యవస్థల నడుమ వేలాడుతూ  సందిగ్ధావస్థలోనే ఉన్నాయి. ఈ కవితలో కవయిత్రి నిర్మల ఆ సందిగ్ధావస్థలో కనబడతారు. కానీ అంతర్గతంగా ఈ మార్పును వ్యతిరేకిస్తూ గ్రామీణ సమాజాన్ని కోరుకున్నట్టుగా చూస్తామీ కవితలో. గ్రామీణ సామూహిక తత్వానికీ, నాగరిక వ్యక్తి వాదానికీ జరిగే ఘర్షణను అక్కా తమ్ముళ్ల పాత్రల ద్వారా ఆవిష్కరిస్తారు.

ఈ కవితలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ముందుగా కవిత రూపంలో మనకు ఆ సందర్భాన్ని చెబుతున్న అక్కగా కొండేపూడి నిర్మల. విదేశాలనుంచి తిరిగి వచ్చిన ఆమె తమ్ముడిని చూసి, మనతో మాట్లాడుతుందీ కవితలో. సూర్యోదయాన్ని తమ్ముడి కంటే పదిగంటలు ముందుగా చూడగలిగిన ఒక భౌగోలిక అద్భుతంలో ఉన్న ఆమె, తన తమ్ముడిన చూసిన తరువాత అతడికంటే ఎంతగానో వెనుకబడి ఉన్నానని గుర్తిస్తుంది. అల్విన్ టఫ్లర్ చెప్పే ఫ్యూచర్ షాక్( Future Shock) వంటిదిది. చిన్నప్పటి ప్రపంచ పటానికీ, ఇపుడు నలిగిపోయి ముడతలు పడి ఉన్న ప్రపంచ పటానికీ ఉన్న పోలికలను సింబాలిక్ గా అర్థం చేసుకుంటుంది కవయిత్రి. శత్రు వ్యూహాలూ, వ్యాపార సంబంధాలూ కొనసాగించే దేశాలు, అక్కా తమ్ముళ్ల అనుబంధాల్ని కూడా వెట్టితో, వలసలతో ప్రభావితం చేయడం చూస్తుందామె. ఖచ్ఛితంగా చిన్నప్పుడు తను చూసిన తమ్ముడైతే కాదతను. కొత్త విలువలు, కొత్త అనుబంధాలూ నేర్పే మరో ప్రపంచానికి చెందిన తమ్ముడిని చూస్తుందామె.

ఇక తండ్రి పాత్ర. రోజూ కట్టుకునే చీరల్ని కొనీయటానికి విసుక్కునే ఆ తండ్రి, తమ్ముడు విదేశాలనుండి వస్తున్నాడని తెలియగానే, ఇల్లు పీకి పందిరేసినంత హడావుడీ చేయటం. దానికై లక్షలు ఖర్చు చేయటం. కానీ తను చనిపోయిన తరువాత, అంత్య క్రియలకు కూడా ఈ కన్న కొడుకు రాడని తెలియదా తండ్రికి. ఒక మనిషితో ఇంకో మనిషికుండే అనుబంధం, మరణం వరకూ కొనసాగుతుంది. మరణం తరువాత ఆ మనిషి ఉనికే ఉండడు. చివరిసారిగా ఆ మనిషిని స్మరించుకునే అంత్య క్రియలకు కూడా రాని, రాలేని పరిస్థితి చూస్తే ఈ సమాజం మనుషులను ఎంత కఠినంగా తయారు చేసేసిందో అర్థమవుతుంది. తనను కనీ పెంచిన తల్లి తండ్రులను అవసాన దశలో దగ్గరుండి చూసుకోలేని, తోడు ఉండలేని స్థితిని ఆధునిక జీవితం, కన్వీనియంట్ గా మభ్యపెడుతుంది. తండ్రి చనిపోయినప్పుడు, ఆ అంత్యక్రియల వ్యవహారమంతా వీడియో తీసి పంపితే చూడటమో, స్కైప్ లో చూడటమో జరగటం, వ్యక్తి తన జీవితంలో కనిపించని శక్తుల మధ్య పరాయీకరణ (Alienation) చెందాడనటానికి తార్కాణం. అంతేగాక, వాటిని వీడియోల్లో చూసి కన్నీరుమున్నీరవటమన్నది ఈ సమాజంలోని, తనలోని నిస్పృహ(insensitivity)ను చూసి బోరున విలపించలేని అశక్తత తప్ప, ఇంకోటి కాదు. పైగా ఈ ఆధునిక పోకడలను సమర్థించుకోవడానికి తగినన్ని కారణాలు, పాత సెంటిమెంట్లను వదిలించుకోవడానికి వీలైనన్ని బహానాలూ ఎప్పటికీ సిద్ధంగా ఉంటాయి.
ఇక తల్లి పాత్ర. ప్రేమనే పాకంతో అరిసెలనూ, పూత రేకులనూ, సున్నుండలనూ తయారు చేసి కొడుకుచేత తినిపిస్తుంది. కానీ బిజీ బిజీగా తీరికనే లేనట్టు కనిపించే కొడుకుతో మాట్లాడటానికి, ఇంటర్వ్యూకోసం అపాయింట్మెంట్ తీసుకోవాలసిన పరిస్థితిలో ఉంటుంది. ఇక విదేశీ వస్తువుల మీద మోజు పెంచుకునే పెద్దమామయ్య, ఇంపోర్టెడ్ మొగుడికోసం ఇంపోర్టెడ్ కలలు కనే పక్కింటి పారిజాతం, విదేశాలనుండి వస్తున్నాడు అనగానే, సెంటు బాటిల్ల కోసం, గడ్డం బ్లేడుల కోసం, వాలిపోయే బంధు మిత్ర గణం. ఇవన్నీ నిజ జీవితంలో కనిపించే పాత్రలే.

ఇక తమ్ముడి పాత్ర. ఒక ఆధునిక జీవితానికి ప్రతీక. మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలకంటే ఎక్కువగా చూడలేని సమాజానికి చెందిన పాత్ర. వ్యక్తి వాదం ముందు, అన్నీ సెంటిమెంట్లనూ 'ఐ మిస్స్డ్ యూ' వంటి కొన్ని తేలిక పదాలతో ప్రకటించేసి చేతులు దులుపుకునే ఒక పాత్ర. పాత చెక్క ఆట బొమ్మను జీవితాంతం కార్డ్ బోర్డ్ లో దాచుకున్న తరం నుండి, కొద్ది రోజులు ఆడుకున్న బార్బీడాల్ ను పాతగయిందని, ఎక్చేంజ్ ఆఫర్ కింద కొత్తది కొనుక్కునే తరానికి మార్పు చెందుతున్నామంటాడు అల్విన్ టోఫ్లర్. శాశ్వతత్వం నుంచి తాత్కాలికత్వానికి మన సంబంధ బాంధవ్యాలూ, అనుభూతులూ, మారిపోయినపుడు ఆ మార్పు రక్త సంబంధంతో పెనవేసుకున్న కుటుంబ సభ్యులమధ్య స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. బాల్యంతో పెనవేసుకుని పోయిన ఇంటిని అపార్ట్ మెంటుకిచ్చి, కొంత డబ్బు వెనుకేసుకోవటం, నాన్న అంత్య క్రియలను వీడియో తీయమని చెప్పటం, తీయనందుకు అక్కపై అలిగి మాట్లాడక పోవటం, నాలుగేళ్ల కోసారి వచ్చినపుడు, ఐ మిస్డ్ యూ అని కౌగిలించుకుంటే సరిపోతుందనుకోవటం, ప్రేమతో వండి చేసిన వంటలు తింటే ఆరోగ్యమేమవుతుందోనని డాక్టరు దగ్గర వాపోవటం వంటివన్నీ ఇప్పటికీ విదేశాల్లో కొడుకులుంటున్న ప్రతీ ఇంటిలో ఉండేవే. సెంటిమెంట్స్ లేని ఇన్సెన్సివిటీనే ఆధునిక ట్రెండ్ అయినపుడు బ్రెయిన్ డ్రెయిన్ హార్ట్ లెస్ గా తిరిగొస్తుంటుందనటానికి ఈ కవిత ఒక ఉదాహరణ.

ఊపిరాడ్డంలేదు

              కొండేపూడి నిర్మల
--------------------------------------

ఎంత  పండగ  పొద్దయినా
ఇండియా లో  పగలు  పన్నెండింటికి  నిద్ర లేచే  నా తమ్ముడు
ఉగాది  పచ్చడి  కోసం డెట్రాయిట్ నగరమంతా
తవ్వి బోర్లిన్చాడ్టా

పొరుగింటి పుల్లకూర  రుచే మరి
స్కూల్ కెళ్ళే  వయసులో  కోకాకోల  నీళ్ళే
వాడి  కడుపు  నిండా  ప్రవహించేది
మార్చురీ  ఐస్ లా ధగధగ  లాడే విదేశి ఉప్పుతో
ఉజ్జాయింపు  తెలియక విసుక్కుంటూనే
అమ్మ  ఉలవచారు  కాస్తుంది
చారు కెరటాల్లో సత్యాగ్రహం చేసినవాల్లంతా
కొట్టుకుపోతున్నారు
లేబుల్స్  విప్పకుండానే మరో దేశం  వస్తువులు చేతులు మార్చే
ఏజెన్సీ ఉద్యోగి  మా పెదమామయ్య  వాగ్ధాటికి
స్వదేశి ఆత్మ బహిష్కరణ  జరుగుతూ వుంటుంది ,

వలస పోవడం కంటే భావప్రాప్తి  సిద్దించే కల  ఇంకొకటి  తెలీని
పక్కింటి పారిజాతం  ఇంపోర్టెడ్ పెళ్ళికొడుకు  కోసం ఎదురుచూస్తుంది
చిన్నప్పుడు  నాకూ తమ్ముడికి ఉమ్మడి ఆస్తిగా
ప్రపంచ పటం ఒకటి  గోడకి వేలాడేసి  వుండేది
నిట్టనిలువుగా  ను౦చున్న సముద్రాలు
ఎడారుల్లోకి ఒలికి పోయినా
ఒకే సారవంతమయిన  నేల ఎందుకు పుట్టదో
తరగని  ఆలోచన నాకు
అప్పట్లో  కూడికలంటేనే ఇష్టం  మరి
వాడి దారి వేరు వాడిదంతా తీసివేతల పరిజ్ఞానం
ఎంతచిన్న  నదినయినా గట్టుకొక  పేరు చొప్పున విభజించాలనే
సమాచారం వాడే ముందు నాకు యిచ్చాడు
తమ్ముడు ఇంటికొస్తున్నట్టు కబురందితే చాలు
బిల్ క్లిoటనో, వాడి  తాతో కరుణించినoత
భయ సంబరాలు మా కళ్ళలో
కట్టుడు చీరలు కొనడానికి నసిగే నాన్న
లక్షలాది  రూపాయిలతో ఇంటికి ముస్తాబు చేయించాడు
గారడివాడో  చిలుక జోస్య గాడో వచ్చినంత
సంభ్రమంగా బంధు మిత్రులు చుట్టూ మూగారు

ఏ సంచి లోంచీ ఏ అద్భుతం బయటకు తీస్తాడో అని
నరాలు  తెగిపోయే౦త ఉత్కంట
గెడ్డం బేళ్ళు,  సెంటుబాటిళ్ళు, వాకీ టాకీలు
ఓహ్! ఒకటేమిటి  ఇల్లోక  స్మగ్లింగ్  కేంద్రంగా మారుతుంది
జారిపోతున్న పాము కుబుసాల్లాంటి  చీరలతో, లుంగీలతో
బొక్కబోర్లా  పడుతూ  గొప్పగా  నడవడం
మంచి  సర్కస్ లా  వుంది
ఎవర్ని చూస్తున్నా  పొట్లాలు  విప్పుతున్న చప్పుడే
అంటుకున్న కుటీర పరిశ్రమల తాలూకు  నిట్టాడ పాకల్లా
ఒకటే  చిటపటలు
ఎన్నాళ్ళుoటాడో  ఎప్పుడెగిరి పోతాడో తెలియక
అడిగేందుకు  ఇంటర్వూ దొరక్క
ముత్యాల గర్భం  వచ్చినంత  సందేహం మా అమ్మకి
ప్రేమనే  పాకం పట్టి  డబ్బాలకెత్తిన
అరిసెల్ని , సున్నుండల్ని, పూతరేకుల్ని తినేసి
గాలి, నీళ్ళు ,మనుషులు  వికటిస్తున్నారని
మా  డాక్టర్ దగ్గర  తమ్ముడు  కంప్లయింట్ చేస్తాడు
తమ్ముడిదెప్పుడూ ఇన్నోవేటివ్  బ్రెయిన్  కదా
బాల్యానికి  చిహ్నంలాంటి  విశాలమయిన ఇంటిని కూల్చి
అపార్ట్ మెంట్ల కివ్వాలని  ఆలోచన  చేస్తాడు
తమ్ముడిదెప్పుడూ  ఎమోషనల్  బ్రెయిన్  కదా
‘ ఐ మిస్సడ్ యూ ’ అంటూ  నాలుగేళ్ళకొకసారి  కావిలించుకొని
మేము నిజమనుకునే  లోగా  ఎగిరిపోతాడు
తమ్ముడిదెప్పుడూ  డాక్యుమెంటింగ్  బ్రెయిన్  కదా
నాన్న  అంత్య క్రియల్ని క్యాసెట్టు తీసి  పంపనందుకు
అలిగి  మాటలాడ్డ౦ మానేసాడు
వాడికంటే  పదిగంటల  ముందు  సూర్యోదయాన్ని చూడగల
ఒక బౌగోళిక  అద్భుతం లో వున్నా నేను
ఎక్కడో  ఎందుకో  వెనుకబడిపోయాను
దేశాల మధ్య  శత్రు వ్యూహాల్ని
శవాలు లెక్క తేలుస్తాయి
దేశాల  మధ్య  వ్యాపార  సంబంధాలు
అంకెలతో  సహా  దొరుకుతాయి
అక్కా తమ్ముళ్ళ  మధ్య  రక్త సంబంధం  ఒక  వలస
రాగ సంబంధం ఒక  వెట్టి
మనుషులందరూ  విండోస్ లో కిటకిటలాడ్డం మూలానో ఏమో
రోడ్ల  మీద  బరువు  లేదు
ముడతలు పడ్డ నా చిన్నప్పటి  ప్రపంచ పటం లా
దేశాలకు  దేశాలే  దగ్గరకు నొక్కుకుపోయాయి
ఆక్సిజన్  లోపమో.....ఇంకేమి  లోపమో
ఎవరికీ  ఊపిరాడ్డం లేదు

కవిత్వ సందర్భం26
14-9-16

Tuesday, 27 September 2016

దోమల బాధ, గాధ

దోమల బాధ, గాధ. A short notes on the way.
-----------------------------------------------------------------------
దోమలు లేని రాష్టంగా తయారుకావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సమర్థించదగినదే, కానీ మనకులాగా దోమలకు రాష్ట్ర సరిహద్దులూ తెలియదు, రాజమౌళి ఈగ లాగా పారిపోవడానికీ పగబట్టడానికీ వాటికంత తెలువులు కూడా లేవు. రాష్ట్రాన్నంతా ఒక పెద్ద దోమతెరలో కుట్టేయకపోతే పక్క రాష్ట్రాలనుండి ఎప్పటికప్పుడు దాడి చేస్తూనే ఉంటాయవి. మలేరియా, డెంగ్యూ ,ఎల్లో ఫీవర్ వంటి జబ్బులకు సంబంధించిన వ్యాధికారక క్రిములను దోమలు ఒక మనిషి నుండి ఇంకో మనిషికి వ్యాపింప చేస్తూ ఉంటాయి. ప్రతీ యేటా ప్రపంచ వ్యాప్తంగా పది లక్షలమందికి పైగా ఈ జబ్బుల బారిన పడి మరణిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. మన దేశంలో ఈ మరణాల సంఖ్య కాస్త తగ్గినా, జబ్బుల బారిన పడేవారి సంఖ్య పెద్దగా తగ్గలేదనే చెప్పాలి. నేటికీ ట్రైబల్ ఏరియాల్లో దోమల వల్ల విషజ్వరాలు సోకుతూ నే ఉన్నాయి. వర్షాకాలంలో ఐతే ఇక చెప్పనవసరం లేదు. ఆడదోమ గుడ్లు పెట్టడానికి నిలువ ఉన్న మంచి నీరు అవసరం కాబట్టి, ఇక ఆడదోమలకు వర్షాకాలం పండగనే చెప్పాలి. రెండు రాష్ట్రాలనూ వర్షాలు తడిపేస్తుంటే, ఏ పీ గవర్నమెంట్ దోమలు లేని రాష్ట్రంగా మారాలనుకోవటం హర్షణీయం.

అయితే దోమలని ఒక రాష్ట్రం నుండి పూర్తిగా నాశనం చేయటం సాధ్యమా..? అలా చేయటం శ్రేయస్కరమా అనేది చర్చించాల్సిన విషయం. దోమలలో దాదాపు 3500 రకాల జాతులున్నాయి. వాటిలో కేవలం 100 జాతులు మాత్రమే మనుషులకు ఈ భయంకర జబ్బులను కలిగిస్తున్నాయి. మిగతా జాతులన్నీ పూవుల మీద, పండ్ల మీదా, చిన్న కీటకాలమీద ఆధారపడి బతుకుతాయి. ఈ మిగతా రకాల దోమలు కూడా ఎన్నో పక్షులకు, చేపలకూ ఆహారంగా పనికొస్తూ ఉంటాయి. అంటే పర్యావరణ ఫుడ్ చెయిన్ (food chain) లో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతే కాక ఈ దోమలు పుప్పొడిని పూవులకు అందించే బాధ్యతను కూడా నిర్వహిస్తాయి కాబట్టి, ఫలదీకరణలో ఎన్నో ఇతర కీటకాలవలె, ఇవి కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. దోమలంటే ఇవన్నీ వస్తాయి కాబట్టి, వీటన్నింటినీ నాశనం చేయాలనుకోవడం వలన ఈ ఫుడ్చెయిన్ తెగిపోయి ఇతర జీవులకు కూడా ఇబ్బందులను సృష్టిస్తాయని పర్యావరణవేత్తలంటారు. ఇంకో విషయమేమంటే ఈదోమలను చంపాలంటే రెండు రకాల మందులుంటాయి. లార్వీసిడల్ మందులు, దోమల గుడ్లు పొదగకుండా లార్వా దశలోనే నాశనం చేయగలిగితే, అడల్టీసిడల్ మందులు, లార్వాలు దోమలుగా రూపాంతరం చెందిన తర్వాత నాశనం చేస్తాయి. ఐతే ఈ మందులు కేవలం దోమలనే కాక ఎన్నో ఇతర క్రిమి కీటకాలను కూడా చంపుతున్నాయని, అందువల్ల ఇకో సిస్టం (eco system) సమతౌల్యం దెబ్బతింటూందని కూడా అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. డేవిడ్ కామెన్ అనే సైన్స్ రైటర్ ఏమంటాడంటే..దోమలు మనుషులు చేసే పర్యావరణ విధ్వంసాన్ని సమర్థవంతంగా ఆపగలుగుతున్నాయని. ఆఫ్రికాలోని రెయిన్ ఫారెస్ట్ లు ఈ రోజుకీ మానవుల ఆక్రమణల బారిన పడకుండా బతికి మనగలుగుతున్నాయంటే కేవలం ఈ దోమలే కారణం అంటాడు. క్రూర జంతువులనైనా బంధించో చంపో ఆ అరణ్యాలను జయించగలడేమో గానీ, చిన్న చిన్న దోమలని జయించి బతకగలగటం సాధ్యం కాకపోవటం వలననే నేటికీ ఆ రెయిన్ ఫారెస్ట్ లు అలాగే ఉన్నాయంటాడీయన. అంటే మనకు తెలియకుండా ప్రకృతిలో దోమలు నిర్వహించే బాధ్యత ఎంతో అర్థం చేసుకోవాలి.

వ్యాధుల బారిన పడవేసే దోమల వృద్ధి జరగకుండా తగు సహజ జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. నిలువ ఉన్న మంచి నీరు ఎక్కడున్నా దోమలు గుడ్లు పెడతాయి. ముఖ్యంగా తెరచి వుంచిన కొబ్బరి బోండాల్లో వర్షపు నీరు చేరి వుంటుంది. వాటిల్లో లక్షల సంఖ్యలో దోమలు గుడ్లు పెడతాయి. కొబ్బరి బొండాలు తాగి అక్కడే పడవేయకుండా వీలైతే వాటిని ఇంటికి తెచ్చుకుని కాల్చేయాలి. అలాగే మనం బయట ఉంచిన నీటి బకెట్ లూ, చెత్త కుండీలు, నీల్ల టాంకులూ కూడా. వీటినన్నింటినీ గట్టిగా మూసి ఉంచటం వలన దోమలనువృద్ధి చెందకుండా చేయవచ్చు. వర్షాలు పడినపుడు నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిలువ ఉన్న నీటి మీద కొంత కిరోసిన్ లేదా, మంచి నూనె పోయటం ద్వారా, లార్వాలకు ఆక్సిజన్ సప్లై లేకుండా చేయవచ్చు. దోమల లార్వాలను తినే గంబూసియా వంటి చేపలను కుంటలలో పెంచటం కూడా ఒక మంచి పద్దతి. ఆ తరువాత దోమతెరలూ, ఆలౌట్ లూ ఎలాగూ ఉన్నాయి. అంతేకాకుండా మలేరియా డెంగ్యూ వ్యాధులు ప్రజలలో కొంత అవగాహన పెంచి సకాలంలో మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరికేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యన్గా ట్రైబల్ ఏరియాల్లో వర్షాకాలం లో తగు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. చివరగా చెప్పేదేమంటే, దోమ రహిత రాష్ట్రంగా మారాలి అనడం కంటే దోమల మీద అవగాహన పెరిగిన రాష్ట్రంగా తయారు కావాలి. దోమలన్నింటినీ చంపేయటం పరిష్కారం కాదని మనం గ్రహించాలి.    --- virinchi virivinti

Monday, 26 September 2016

Reply to Aranya krishna garu..on the debate over interview

అరణ్య కృష్ణ గారు మీరు ఈ ఇంటర్వూ చదివి స్పందించినందుకు కృతజ్ఞతలు.
మీరొక ఆసక్తికర చర్చను కూడా ఈ సందర్భంలో ముందుకు తీసుకొచ్చారు.
ఈ చర్చలో పాల్గొనే ముందు కొన్ని విషయాలు చెప్పాలి.
ఇది ప్రీ ప్లాన్డ్ ఇంటర్వ్యూ కాదు. ఆర్ట్ ఎగ్జిబిషన్ కి వెల్లడానికి గంట ముందు నేను ఇంటర్వూ తీసుకోవాలని అనుకోవడమూ,
కారులో వెల్తూ వెల్తూ ఓ పది ప్రశ్నలను తయారు చేసుకోవడమూ జరిగింది. చిత్ర కళ మీద నాకున్న ప్రాథమిక అవగాహన ఆ ప్రశ్నలు తయారు చేసుకోవడానికి ఉపయోగపడింది. రెండో విషయం నేను ఇంటర్వ్యూ తీసుకుంటానని శ్రీనివాస్ గారిని కలిసిన తర్వాత చెప్పాను. ఆయన దానికి వెంటనే అంగీకరించటం జరిగింది. రాసుకున్న పది ప్రశ్నల్లో ఐదో ఆరో అడిగాను. మిగిలిన ప్రశ్నలన్నీ ఆ సమయంలో స్పాంటేనియస్ గా వచ్చినవే. ఇంటర్వ్యూలో ఉండే ప్రశ్న సమాధానం పద్ధతి కాకుండా, ఒక సంభాషణలా జరిగింది. ఆ సమయంలో సత్య శ్రీనివాస్ గారి అంతర్లోకాల్ని కొంత స్పృశించగలిగే ప్రయత్నం అనుకోకుండా జరిగిపోయింది. ఒక ప్రీ ప్లాన్డ్ కాకపోవటం వలననే, ఒక స్పాంటేనిటీ ఇటు నా వైపూ, అటు సత్య గారి వైపూ ఉండటం వలననే ఈ సంభాషణ వాదాల భీషణఘోషణలు లేకుండా స్వచ్ఛంగా వచ్చింది అనుకుంటాను. ఇద్దరు మనుషుల మధ్య జరిగిన సంభాషణలానే మీరుచూడాలి. వాదా వివాదాల దృష్టితో చూసినపుడు మీకు ఎన్నో అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. కానీ వాటికి దూరంగా సంభాషణ జరిగినపుడు, మీరు వాటిలో అవి వెతకడం చేస్తున్నారేమోనని నా అనుమానం. ఇదెలా ఉంటుందంటే పోలీసు వాడు ప్రతీ ఒక్కరినీ అనుమాన దృక్కులతో చూస్తూ ఉంటాడు, వాడి ఉద్శోగరీత్యా..ఆ సమయంలో జరిగే పొరపాట్ల లాగా చెప్పవచ్చు.

ఇక రెండో విషయం, మీరు చర్చలో లేవనెత్తిన పాయింట్లు చూసినపుడు, మీరు ఇంటర్వ్యూ పూర్తి శ్రద్ధతో చదవలేదని నాకనిపించింది. మీలో ఈ అభాస జరగటానికి కారణం ఉంది. ఇంటర్వ్యూ చాలా పెద్దగా ఉండటం, చదవటానికి మొదలుపెట్టినపుడుండే శ్రద్ధ తరువాత్తరువాత తగ్గుతూ ఉండటం సహజంగా జరిగే పరిణామం ఎవరిలోనైనా. ఇంకోటేమంటే ఇంటర్వ్యూ ఒక విషయం మీదేకాదు, ఎన్నో అంశాల మీదకి మారుతూ ఉండటం వలన, ఈ అభిప్రాయమే ఫైనల్ వర్డ్ అనటానికి కూడా లేదు. ఆ కొద్ది సమయంలో ఉన్న స్పేస్ లో అదొక అభిప్రాయం. ఒక విషయం మీద ఒక సమయంలో ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉండం, అదే విధంగా వేరు వేరు సమయాల్లో ఆ అభిప్రాయాల్నే మోస్తూ కూడా ఉండిపోం.  ఏ అభిప్రాయమైన ఫైనల్ కాదు, మనం అభిప్రాయాల్ని కాలానుగుణంగా మార్చుకుంటూ ఉంటాం కాబట్టి.

ఇకచర్చలోకి దిగుదాం.
-------------------------

Friday, 23 September 2016

Intro of The Voice of Colours

ఆయనొక కవి, పెయింటర్, ఫోటోగ్రాఫర్. గ్రామాల్నీ, ట్రైబల్ ప్రదేశాల్నీ, అడవుల్నీ తన విస్తృత పర్యటనల ద్వారా ఆత్మీకరించుకుని, ఆ ఆత్మని ఈ కళల ద్వారా వ్యక్తపరుస్తూంటారు. ఒక ఎన్విర్న్మెంటలిస్ట్ గా దేశ దేశాల సంస్థలతో సంబంధాలు నెరపుతూ, ప్రకృతిలోని సహజ వనరుల సంరక్షణ కోసం గ్రామాల్లోని ప్రజలతో మమేకమవుతూ  అయన తనను తాను సిటీలో నివసించే ఒక సహజమైన వ్యక్తిగా మలచుకున్నారు. ఆయన ప్రకృతి ఆరాధన ఎంతటిదో ఆయన కవితలనే చదవనవసరం లేదు, ఆయన ఇంటిని చూసినా చాలు. తన కలలంటే ఎంతటి ఇష్టమో, గ్రామీణ జీవితమన్నా, స్వచ్ఛమైన ఆ మట్టి మనుషులన్నా ఆయనకు అంతే ఇష్టం. "20 మెమోయిర్స్" పేరిట హైదరాబాదులోని గోథే సెంటర్ లో మొదటి సారి తను గీసిన చిత్రాలను ప్రదర్శనకు పెట్టారు 'శ్రీ సత్య శ్రీనివాస్' గారు. తను జీవితంలో చూసిన ఎందరో గ్రామీణ అమ్మలను బొమ్మలుగా గీసి ప్రదర్శించారు. అమ్మలనే ఎందుకు గీశాడో తెలుసుకుందామని అనిపించింది. ఒక సాయంత్రం పూట, ప్రశాంతమైన వాతావరణంలో తన చిత్రాలను ప్రదర్శనకు ఉంచిన గోథే సెంటర్ లోనే, ఆ అమ్మల చిత్రాల మధ్యనే ఈ మా సంభాషణ సాగింది. కళలకు సంబంధించిన ఎన్నో విషయాల మీద స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్త పరుస్తూ, ఒక కళాకారుడిగా తన అంతరంగాన్ని కూడా ప్రదర్శనకు నిలిపినట్టుగా అనిపించింది ఆయనతో మాట్లాడుతుంటే. సత్య శ్రీనివాస్ గారికీ నాకూ మధ్య సాగిన ఆ సంభాషణలే "The Voice of Colours"  గా మీ ముందుకు తెస్తున్నాను.

                                                                                Virinchi Virivinti

Thursday, 22 September 2016

The Voice of Colours

Virinchi: ఏ కళలో అయినా రాణించాలి అంటే, గురువు ఉండాలి అంటారు.  చిత్రకళ (art of painting) లో మీకు గురువు ఎవరైనా ఉన్నారా?. వారి గురించి చెబుతారా?.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Satya Srinivas: ఈ కళ ను టెక్నికల్ గా నేర్చుకున్నది మాత్రం 'నరేంద్ర రాయ్' అనే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ దగ్గరే. 1982 కాలంలో కేశవ మెమోరియల్ లో వారి దగ్గర నేర్చుకున్నాను. కానీ తరువాత నాకు చిత్రాలు వేయాలి అనే ప్రేరణ కల్పించింది మాత్రం ఇదిగో కనిపిస్తున్నారు గా ఈ అమ్మలే. ఒక రకంగా చెప్పాలి అంటే మనలో అంతర్గత ప్రేరణ కలగటానికి గురువులెందుకు?. గురువులు మనకు ఒక దారిని చూపిస్తారు...కానీ, నడవాల్సిందీ ఆ ప్రేరణ పొందాల్సిందీ మాత్రం మనమే. మన అంతర్గత ప్రేరణకు గురువులు నేర్పిన విద్య ఒక టెక్నిక్ ని అందించేదిగా, ఒక సహాయకారిగా ఉంటుంది. అసలు ప్రేరణే లేనపుడు, కేవలం టెక్నిక్ మాత్రమే ఏమి చేయగలదు. ఇంకో విధంగా చెప్పాలంటే మన ప్రేరణే మనకు అసలైన గురువు. ఆ రకంగా చూసుకుంటే, నరేంద్ర రాయ్ తో పాటు ఈ అమ్మలందరూ నాకు గురువులే.

V: ఈ అమ్మలు మీలో అంతగా ప్రేరణ కలిగించటానికి కారణం ఏంటి?. మిమ్మల్ని కదిలించేంతగా వారిలో మీరేం చూసారు!?
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------
S: వారి జీవన విధానమే గురూ!  ఎన్విరోన్మెంటలిస్టు(environmentalist) గా నేను గ్రామాల్లో, ట్రైబల్ ఏరియాల్లో, అడవుల్లో సంచరిస్తున్నప్పుడు ఈ అమ్మలను దెగ్గరినుండి గమనించే అవకాశం కలిగింది. ఆ అమ్మల జీవితాలు, జీవన విధానాలే కాకుండా వారి ఉద్వేగాలు (emotions) నన్ను ఆలోచింపజేసాయి. అంతర్గత ప్రేరణ అక్కడ అలా మొదలయ్యి౦ది. ఆ తరువాత ఆ ప్రేరణే, నా చుట్టూ ఉన్న అమ్మలని కూడా అర్థం చేసుకోవటానికి ఉపయోగ పడింది. ఇపుడు నేను పోట్రెయిట్ గీసిన ఈ అమ్మల్లో చాలా మందితో నాకు అనుబంధం ఉంది. వారి జీవితం, వారి మానసిక ఉద్వేగాలు నాకు చాలా దగ్గరగా తెలుసు. వారి ఉద్వేగాలను నేను అనుభవించాను. అందుకే వారి ఉద్వేగాలకు ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాను. బొమ్మలు వేయటం, అందులోనూ పోట్రెయిట్స్ వేయటం నాకు చాలా ఇష్టం. కాబట్టి నాకు ఇష్టమైన కళ లో నాకు ఇష్టమైన వ్యక్తుల పోట్రెయిట్స్ గీయాలని అనిపించి బొమ్మలు వేయటం మొదలుపెట్టాను.

V:  ఈ అమ్మలందరూ మీకు వ్యక్తిగతంగా తెలిసినవారే అన్నమాట.
------------------------------------------------------------------------------------------

S: అందరూ తెలిసిన వారు కాదు. ఈ అమ్మల్లో కొంత మంది నాకు వ్యక్తిగతంగా తెలియక పోవచ్చు. కానీ మానసికంగా ఐతే మాత్రం నాకు తెలిసిన వారే!. ఎందుకంటే కొంత మంది మిత్రులు వారి తల్లుల ఫోటోలు నాకు పంపి బొమ్మలు గీయించుకున్నారు. అటువంటి అమ్మలు నాకు వ్యక్తిగతంగా తెలియక పోవచ్చు. కానీ మానసికంగా నాకు తెలియకుండా ఎలా ఉంటారు?  వారిని తెలుసుకున్నప్పుడే నేను బొమ్మ గీయగలను. ఉదాహరణకు  మీరు మీ అమ్మ ఫోటో ఇచ్చారనుకోండి. నేను వెంటనే ఆమె బొమ్మను వేయలేను. ఆమెను అర్థం చేసుకోవటానికి నాకు ఆరునెలలు కూడా పట్టొచ్చు. ఆమె ఫీచర్స్ ఏంటీ?..ఆమె జీవితమేంటి అనేది నేను ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. బొమ్మ వేయటానికి మూడు గంటలు లేదా మూడు రోజులు పట్టొచ్చు..కానీ ఒక అమ్మను నేను అర్థం చేసుకోవటానికి చాలా కాలం పట్టొచ్చు. అర్థం చేసుకోనిది, ఎలా వేయగలను?. "అర్థం చేసుకోవాలంటే ఆమె జీవితం గురించి క్షుణ్ణంగా తెలియాలా..?" అని మీరు అడగొచ్చు. కానీ ఒక కళాకారుడిగా నేను ఏ అమ్మనైనా అర్థం చేసుకోగలను. ఆమె జీవితమంతా తెలియాల్సిన అవసరం ఉండక పోవచ్చు. ఇన్ట్యూషన్(intution) నన్ను ప్రేరేపింపవచ్చు. వీళ్ళంతా అమ్మలు కదా..వాళ్ల మనసుల్లోంచి వినిపించే 'లల్లబీ' ని నేను వింటాను. వారి ఫోటోలను చూస్తున్నప్పుడు వారి జోలపాటలే నాకు వినిపిస్తాయి. అమ్మ ఎవరికైనా అమ్మే కదా..! కొడుకుగా మారటం మనం నేర్చుకున్నపుడే వారి జోలపాటల్ని మనం వినగలం. At the end of the day, it is not just a painting for me. కేవలం పెయింటింగ్ మాత్రమే అయ్యేట్టయితే ఇంత ఆలోచించవలసిన అవసరం లేదు. నాకు ఒక కథ కావాలి. ఆ అమ్మకు నాకూ మధ్య ఒక కథ ఉండాలి. అలా ఉన్నప్పుడే మా ఇద్దరి మధ్య ఉండే అనుబంధానికి ఈ పెయింటింగ్ అనేది ఒక నిదర్శనంలా మిగులుతుంది.  అపుడు నేను గీసిన పెయింటింగ్, నేను అమ్మతనాన్ని అర్థం చేసుకోగలిగటం వల్ల నాలోంచి బయటకు వచ్చే ఒక ఉద్వేగం వంటిది. It is not a painting for me. Its my emotion. My art is an expression of emotional outburst from me.

V:  అయితే కళాకారుడికి తను సృష్టించిన కళారూపం అందరూ భావిస్తున్నట్టు ఒక నిర్జీవ వస్తువు ఎంత మాత్రం కాదన్నమాట. ఎవరికి ఎలాగా ఉన్నా, ఎలాగా అనిపించినా,  అతడికి మాత్రం అది సజీవమైన అంశమే అంటారు..
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: అంతే కదా గురూ..! అది సజీవం కాలేనపుడు ఇక కళకు అర్థమే లేదంటాను. అది ఏ కళేగానీ..!  చిత్రకళలోని విశేషమేమంటే ఒక సజీవమైన అంశాన్ని నిర్జీవమైనటువంటి పనిముట్ల సహాయంతో సృష్టి చేయాలి. పేపరూ, రంగులూ నిర్జీవమైనవే కదా!...కళాకారుడు ఆ నిర్జీవ పనిముట్లకు ముందు ప్రాణం పోసి, తన సజీవ వస్తువును సృష్టించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎటువంటి సజీవ సృష్టి చేయడానికి ఎటువంటి పేపరు ఉపయోగించాలి?..ఏ రంగు ఉపయోగించాలి? అనేది ఆర్టిస్ట్ కి తెలిసి ఉండాలి. ఉదాహరణకు ఈ బొమ్మ చూడ౦డి... ఈమె యాకూబ్ గారి తల్లి. ఈమె పోట్రెయిట్ కి 'గ్రామ దేవత' అని పేరు పెట్టాను. ఈమెను పట్టుకోవడానికి గరుకు టెక్ట్చర్ ఉండే ఇండియన్ పేపర్ ను వాడాను. అదే ఈ బొమ్మ చూడ౦డి ఈమె కవి సిద్ధార్థ గారి తల్లి. ఈమెను ఆక్వారెల్లీ పేపర్ మీద పట్టుకున్నాను.


V: ఓహ్...! పేపర్ టెక్చర్ ను కూడా వేయబోయే బొమ్మకు అనుగుణంగా ఎంపిక చేసుకుంటారా!?. Interesting. మీరు యాకూబ్ గారి మదర్ కోసం ఈ రఫ్ టెక్చర్ ఉన్న ఇండియన్ పేపర్ని ఎంచుకున్నాను అన్నారు. ఆమె కోసం ఆ పేపర్నే ఎ౦పిక ఎందుకు చేసుకున్నారో వివరిస్తారా..?
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: నేను యాకూబ్ తల్లిని చూశాను. నిజంగానే ఆమె గ్రామ దేవత. ఎపుడూ రొట్టమాకురేవు ఊర్లోనే ఉంటుంది. సిటీకి రమ్మన్నా రాదామె. ఒక వేళ హైదరాబాదులోని యాకూబ్ ఇంటికి వచ్చినా, బయటనే సోఫాలోనో, మంచం మీదో కూర్చుంటుంది, అక్కడే పడుకుంటుంది. ఇంట్లో పడుకోమన్నా పడుకోదు. ఎందుకంటే..ఆమెకు స్పేస్ కావాలి. మనకులాగా గదులు ముఖ్యం కాదామెకు. బయట కూర్చుంటే నలుగురు మనుషులూ తిరుగుతూ  కనిపించాలామెకు. ఊర్లో అలాగే ఉంటుంది మనుషుల జీవితం. వారికి నలుగురూ కలిసే ఉండాలి. సిటీలో ఒక గదిలో కూర్చోపెట్టి ఒక టీవీని వాళ్ల ముందు పెట్టేస్తే..వాళ్లస్సలు ఉండలేరు. టీవీ ముందే జీవితమంతా గడిచిపోతే ఒక మనిషికీ ఇంకో మనిషికీ మధ్య సంబంధం ఏముంటుంది?. అందుకే ఆమె సిటీలో ఉన్నా పల్లెలో ఉండే స్వచ్ఛమైన జీవితాన్నే కోరుకుంటుంది. విశాలమైన స్పేస్ నే కోరుకుంటుంది. ఇటువంటి అమ్మను పట్టుకోవాలంటే ఈ టెక్చర్ ఉన్న పేపర్ ని ఉపయోగిస్తే బాగుంటుంది అనిపించింది నాకు. గ్రామ దేవతకు మనం రోజూ పూజలు చేయం. బోనాలు ప్రతి రోజూ ఎత్త౦. ప్రతీ శనివారం వేంకటేశ్వర స్వామిని పూజించినట్టు పూజించం. ఒక సందర్భంలోనే ఆ దేవతలను పూజిస్తాం. ఈ దేవతల ఉనికి అంతర్లీనమైనది. ఉదాహరణకు చెఱువు కట్ట మీది మైసమ్మ... కట్ట మీద ఆమె కొలువై ఉన్నందుకే ఆ కట్ట ఉంటుంది. మైసమ్మను అక్కడనుండి తొలగించి చూడండి, ఇంక చెరువూ ఉండదూ, కట్టా ఉండదు. అన్నింటినీ తవ్వేస్తారు. మైసమ్మ ఒక దేవత అనే భయం ఉండటం వల్ల, ఆ కట్ట అలాగే ఉంటుంది. ఆమె కనిపించకుండా ఆ చెఱువును కాపాడతూ ౦టుంది. అంటే ఊరిని కాపాడుతున్నట్టే కదా. ఆమె అక్కడి నుండి జరగదు. ప్రజలు కూడా ఆమెను అక్కడినుండి జరపరు. అట్లాగే యాకూబ్ మదర్ కూడా కనిపించకుండా ఆ వూరిని కాపాడుతూ  ఉంటుంది. ఆమె అక్కడి నుండి జరగదు. ఆమె అక్కడ ఉండటం వల్లే యాకూబ్ రొట్టమాకు రేవుతో అనుబంధాన్ని కొనసాగిస్తూ..ఆ ఊరికి పదే పదే వెళ్తూంటాడు. రొట్టెమాకురేవు అనే ఊరు, యాకూబ్ కి తల్లి ఐతే..యాకూబ్ తల్లి ఆ ఊరికి దేవత. ఊరికి చదువుకున్న పిల్లలు పదే పదే ఒస్తేనే కదా ఊరు కాపాడబడుతుంది. ఈమె కూడా కనబడకుండానే రొట్టమాకురేవును కాపాడుతూ  ఉంది. అందుకే ఆమెను 'గ్రామ దేవత' అంటున్నాను. చూడటానికి రఫ్ గా కనిపించినా ఈ పేపర్ మీద కలర్ అంత త్వరగా ఆరిపోదు. యాకూబ్ మదర్ ని పట్టుకోవడానికి ఇదే పేపర్ సరయినదని నాకనిపించింది. Its my intution.

V: ఇపుడు మీరు పేపరును సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని విషయాల్ని పరిగణలోనికి తీసుకుని మీ ఇన్ట్యూషన్ తో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగానే, కలర్ విషయంలో కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా...?
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: అవును. ఉదాహరణకు ఇదే యాకూబ్ మదర్ బొమ్మ చూడండి. ఈ బొమ్మలో కేవలం బ్రౌన్ కలర్ మాత్రమే ఉంటుంది. బ్రౌన్ అనేది మట్టి కలర్.  జీవితాన్ని పట్టుకోగలిగిన కలర్. చక్కదనాన్నీ, వెచ్చదనాన్నీ (warmth) ప్రతిబింబిస్తుందీ కలర్. ఈ బొమ్మలో పై నుండి కింది దాకా బ్రౌన్ కలర్ లోని వేరియస్ షేడ్స్ నీ, టోన్స్ నీ చూపించాను. తన ఊరినీ, మట్టినీ ప్రేమించే యాకూబ్ మదర్ ని పట్టుకోవడానికి ఈ కలర్ అయితేనే బాగుంటుందని..ఈ కలర్ ని తీసుకున్నాను.

V: నిర్జీవ వస్తువులైన పేపర్ కలర్ వంటి వాటికి ప్రాణం పోయడం అంటే ఇదేననుకుంటాను. చిత్రకారుడికి తన వస్తువే కాకుండా పేపర్, కలర్ వంటి వాటి మీద కూడా పూర్తి అవగాహన ఉండాలనిపిస్తుంది మీ మాటలు వింటుంటే..!
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: అంతే కదా గురూ...! ఏ కళాకారుడికయినా ముఖ్యంగా వాని ఇన్స్ట్రూమెంట్(Instrument) ఏంటో వానికి క్షుణ్ణంగా తెలియాలి. వీణ వాయించే వాడికి ఏ తీగను మీటితే  ఏ వైబ్రేషన్ వస్తుందో తెలియకపోతే వాడి మ్యూజిక్ అపశృతిలోనే ఉండిపోతుంది. ఇన్స్ట్రూమెంట్ ని అవగాహన చేసుకోలేక పొతే ఆ కళ కూడా నిర్జీవంగానే ఉండిపోతుంది. Knowing the instrument itself is an art.

V: ఓకే. ఉదాహరణకు మీరు ఇపుడు ఒక కాన్సెప్ట్ అనుకున్నారనుకుందాం. ఒక అమ్మను గీయాలి అనుకున్నారు. మీ ఊహల్లో ఆమెను 'ఇలా గీయాలి' అని ఒక ఊహా చిత్రాన్ని ఏర్పరచుకున్నారు. ఇపుడు బొమ్మ గీయటానికి ముందు, మిమ్మల్ని  మీరు ఎలా సిద్ధపరుచుకుంటారు?
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: ఊహల్లో ఒక రూపాన్ని గీసుకోవడం అంత సులువుగా జరుగదు గురూ..! ఒక్కోసారి ఆరు నెలలకు పైగా కూడా పట్టొచ్చు. ఈ ఫోటో చూడ౦డి, కవి సిద్ధార్థ మదర్ ఈమె. ఈమె ఎపుడూ నవ్వుతూ  నవ్విస్తూ ఉంటుంది. మా అమ్మతో అప్పట్లో పురాణ కాలక్షేపం వంటివి చేసేది. మా ఇంటికి చాలా సార్లు వచ్చేది. ఎపుడూ చూసినా నవ్వుతున్నట్టే కనిపించేది. ఫోటోలో కూడా నవ్వుతూ  కనిపిస్తుంది. ఆ నవ్వును నా బొమ్మలోకి నేను ఎలా పట్టుకోవాలి అనేది విషయం. ఆమెలోకి నేను వెళ్లాలి. లేదా ఆమెనన్ను ఆవహించాలి. ఆ మాతృత్వపు పరిమళాన్నీ, ప్రేమనూ నేను ఆస్వాదించాలి. అపుడే ఆమె నవ్వును నేను పట్టుకోగలుగుతాను. ఆ నవ్వును ఆమె కళ్ల లో చూపించాలి. మనిషి తన మనసుతో నవ్వేటపుడు కళ్లు చెమక్కుమని మెరుస్తుంటాయి. చిన్న పిల్లగాడి నవ్వులా స్వచ్ఛంగా ఉంటుంది. పైపై నవ్వు తెలిసిపోతుంటుంది. ఆమె నవ్వు అలా స్వచ్చంగా ఉంటుంది. ఈ బొమ్మలో ఆమె నవ్వును పట్టుకున్నాననిపించింది, అందుకే ఈ బొమ్మకు 'soulful smile' అని పేరు పెట్టాను. ఆమె నవ్వులోని ఆ స్వచ్ఛతను నా కలర్ షేడ్స్ లోకి తీసుకురాగలగటమే ఆ బొమ్మ వేస్తున్నపుడు నేను పట్టుకోవలసినది కాబట్టి నా prior preperation అంతా ఒక కొడుకుని కావటమే! నాకు బొమ్మ గీయటం ఒక ఉద్వేగ భరిత స్థితి తప్ప ఇంకేమీ కాదు. ఆ ఉద్వేగ స్థితిలోకి పోవటానికే నాకు సమయం పడుతుంది. ఒకసారి ఆ స్థితికి చేరుకున్నాక బొమ్మ గీయటానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. కోపం అనే ఒక ఎమోషన్ రోజుల తరబడి ఉండదు కదా! కొన్ని సెకన్లు ఉండొచ్చు. కొన్ని నిముషాలు ఉండొచ్చు. ఆ సమయంలోనే కొట్టడమో తిట్టడమో చేస్తాం కదా! ఇదీ ఆంతే.

V: అమ్మలనే చిత్రించాలని మీరు ఎపుడనుకున్నారు?. ఈ నిర్ణయం ఎపుడు తీసుకున్నారు?. ఎందుకు తీసుకున్నారు?. నా ప్రశ్నలో నాన్నలు ఎందుకు కాదు అనేది కూడా అంతర్గతంగా ఉందనుకుంటాను.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: (నవ్వులు) ఎపుడు నిర్ణయం తీసుకున్నాను అంటే ఇదమిత్తంగా చెప్పలేను..అంతర్లీనంగా నాకటువంటి భావన కలిగించింది మాత్రం గ్రామాల్లో నేను చేసిన పర్యటనలే అనుకుంటాను . మా నాన్న జర్నలిస్ట్ గా ఉన్నపుడు, చాలీ చాలని జీతాలు ఉండేవి. పెద్ద ఫ్యామిలీ మాది. అందుకే ఆ రెస్పాన్సిబిలిటీస్ ఆయనకు ఉండేవి. సంపాదనలో పడి మమ్మల్ని చూసుకోవటానికి సమయం కూడా ఉండేది కాదాయనకు. అప్పట్లో మేము హైదరాబాదుకు కొత్త. ఇక్కడ మాకంతా భయంగా ఉండేది. ఉర్దూలోనే మాట్లాడాలనే నిబంధనుండేది. ఈ రోజు సత్య శ్రీనివాస్ ఒక కవిగా ఒక పెయింటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అనుకుందాం. అంతేగాక, సత్య శ్రీనివాస్ అన్నలూ, చెల్లెళ్ళూ అందరూ వారి వారి రంగాల్లో సెటిలయ్యారు. ఒక్క సత్య శ్రీనివాస్ ఇంటి పరిస్థితియే కాదిది. దాదాపు అందరి ఇంటి పరిస్థితీ ఇదే. ఈ పిల్లలు గానీ, నాన్నలు గానీ ఇలా గొప్ప గొప్ప వాళ్లుగా తయారు కావటానికి కారణం ఎవరు?. ఇంటిలో ఉండే అమ్మలే కదా..? కనిపించకుండానే వాళ్లు ఇంత మందిని గొప్పవాళ్ళుగా తయారు చేశారు. అందుకోసమని తమ జీవితాల్ని ఎంతగానో త్యాగం చేశారు. పైగా ఈ అమ్మలు మననుండి గానీ, జీవితం నుండిగానీ ఏమీ ఆశించలేదు. అనామకంగానే ఉండిపోయారు. సంతోషాల్ని మాత్రమే పంచిపోయ్యారు. వీళ్ల స్టోరీస్ కూడా ఎక్కడా ఉండవు. గొప్ప వాళ్ల గురించే చర్చించుకుంటాం. ఫలానా వాడు గొప్ప కవి అంటాం. వాడు అలా తయారవటానికి కారణం ఎవరు?. మా అమ్మనే తీసుకోండి..కుటుంబాన్నంతా ఆమే నడిపింది. ఆమె మాత్రం ప్రపంచానికి తెలియకుండానే ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయింది. ఆమెను నేనెందుకు ఈ ప్రపంచానికి పరిచయం చేయకూడదు?. ఒక మొక్క నాటుతాం. పంట వస్తుంది. అది అలా ఎదిగి రావటానికి మొక్క గొప్పతనం అనుకుంటాం, లేదా విత్తనం గొప్పదనం అనుకుంటా౦. నేల లేకపోతే..నేలలో సారం లేకపోతే మొక్క ఎలా బతుకుతుంది?. ఎలా ఎదుగుతుంది? ఈ అమ్మలంతా నేల సారం వంటి వారు. నాన్నల గురించి పిల్లల గురించి వారి గొప్పతనం గురించి లోకం లో ఎన్నో కథలున్నాయి. ఈ అమ్మల కథలు ఎవరు గుర్తించాలి? ప్రపంచానికి ఎవరు అందించాలి?. (పది సెకన్ల గంభీర మౌనం)
మీ ప్రశ్న కు సమాధానం దొరికిందనుకుంటాను. (నవ్వులు)

V: మీరు అమ్మల్లో గత తరం అమ్మల్నే తీసుకున్నట్టు ఉన్నారు. ఈ జెనెరేషన్ అమ్మలను బొమ్మలుగా వేయలేదని అనిపించింది. ఈ ఎగ్జిబిషన్ లో ఈ తరం అమ్మలైతే నాకెవరూ కనిపించలేదు. ఇలా ఆ తరం అమ్మలనే ఎంచుకోవటానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: ఈ జెనెరేషన్ అమ్మలందరూ అమ్మలు కాదు గురూ..! కానీ ఆ జెనెరేషన్ అమ్మలను వెతుక్కుని, వారిని ఎక్ప్లోర్ చేసుకుంటూ పోతే..వాళ్లు వందల వేల యేండ్ల వృక్షాల్లాంటి వారని తెలుస్తుంది. నీడనిచ్చారే తప్ప, ఏమీ ఆశించలేదు వాళ్ళంతా. కుటుంబం నుంచిగానీ, సమాజం నుంచి గానీ ఏమీ ఆశించకుండానే వారు ఒక తరాన్ని ముందుకు నడిపించినవారు. ఇంకోటి వీళ్లకు పెట్టే గుణముంది. మీ అమ్మమ్మనే ఒకసారి గుర్తు తెచ్చుకోండి...ఆమె ఇంట్లో నలుగురు ఉన్నా పది మందికి సరిపడా వండేస్తుంది. ఎపుడెవరు ఇంటికొచ్చి తింటారేమో అనే ఆలోచన ఆ కాలం వారికుండేది. ఆ ఇల్లులు కూడా పదిమంది వచ్చీ పోయే ఇల్లుల్లా ఉండేవి. ఇపుడెవరన్నా ఇంటికి వస్తున్నారంటే..ఫోన్ చేసి రావాలి అనుకుంటున్నాం. ఫోన్ చేసి రాకు౦టే విసుక్కుంటున్నాం. వాడికెంత వండాలి..? ఎంత తింటాడో అని ఆలోచించే కాలంలో ఉన్నాం.

V:  అప్పటి అమ్మలందరినీ మీ చిత్రాల ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నారనుకోవచ్చా...?
------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: అంతే కాదు గురూ...ఆ తరం అమ్మలు అంతరించి పోతున్నారంటే, ఆ సమాజమే అంతరించి పోతున్నట్టు. ఆ పెట్టే గుణమే అంతరించి పోతున్నపుడు, ఒక అందమైన సమాజాన్ని నేను ఊహించలేను I cannot expect a beautiful society. When Im living in an inorganic society, how can I aspire for an organic relations between human beings?  ఈ అమ్మలను చిత్రించటం ద్వారా వారి ఆర్గానిక్ కల్చర్ ను నేను చిత్రించదలిచాను. ఈ రోజుల్లో 'ఆర్గానిక్' అనే పదం ఒక జోక్ గా మారింది. ఆర్గానిక్ అంటే సహజమైన పద్దతుల్లో పంటలు పండించటం మాత్రమే కాదు. అదొక గుణం. ఆర్గానిక్ కూరగాయలు తిని, నేను ఆరోగ్యంగా ఉన్నాననుకోవటం మూర్ఖత్వం. ఆర్గానిక్ సైకాలజీ లేనపుడు, సైకలాజికల్లీ నేను ఆర్గానిక్ గా ఆలోచించలేనపుడు, ఉత్త ఆర్గానిక్ కూరగాయలు తిని సహజంగా, ప్రకృతికి దగ్గరగా జీవించేస్తున్నామనుకోవటం ఒక బిగ్ జోక్. మనుషుల మధ్య ఆ సహజమైన ఆర్గానిక్ రిలేషన్స్ లేకుండా, ఆ గుణ సంపద లేకుండా, పై పై చర్యలతో సహజత్వాన్ని ఎలా తీసుకు రాగలం. అప్పటి స్మాల్ విలేజ్ సొసైటీల్లో వారి జీవితాల్లో సహజత్వం ఉండేది. జీవ౦ ఉండేది. మనమిపుడున్న సమాజం, ఈ జీవితం పూర్తిగా ఇనార్గానిక్. మన ఆలోచనలు కూడా ఇనార్గానిక్. ఈ భావన నన్ను ప్రేరేపించింది. నేను కేవలం ఆ అమ్మలను మాత్రమే చిత్రించటం లేదు. వారి గుణాల్ని, ఆ సమాజపు సహజత్వాన్ని, వారి జీవితాల్లోని స్వచ్ఛమైన జీవ కళ నూ చిత్రిస్తున్నాను. యాకూబ్ అమ్మలాగా నలుగురితో మాట్లాడుతూ  ఆరు బయట కూర్చోవటంలో ఉండే జీవకళ, క్లోజ్డ్ రూమ్స్ లో టీవీల ముందు కూర్చోవటంలో వస్తుందా?.

V: మీరన్నట్టు, ఈ తరాల అంతరాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. కానీ కాలానుగుణమైన ఈ మార్పు తప్పదేమో కదా..ఈ తప్పని పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలంటారు?.
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: అవును గురూ..! ఇది తప్పని సరి జరుగుతూ న్న మార్పు. కానీ నేను ఇంకో రకంగా దీనిని చూడదలిచాను. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. ఈ అమ్మలంతా ఆ కుటుంబాలనీ, అంత మందినీ నడిపినవారు. నడిపించిన వారు. ఆ సంబంధ బాంధవ్యాల్ని అర్థం చేసుకుని బతుకుని సంతోషంగా గడిపిన వారు. ఇపుడు కుటుంబం మాట వదిలేస్తే..పెళ్ళి అనేది కూడా లేదు. 'లివింగ్ టుగెదర్' అని వచ్చేసింది. నాకు నీవు ఫలానా ఇన్ని రోజుల్లో అర్థం కాకపోతే, నేను నిన్ను వొదిలేసేయవచ్చు అనే పరిస్థితిలోకి వచ్చేశాం. ఈ ట్రాన్సిషన్ జరిగింది.  స్వార్థం తప్ప ఇంకొకటి కనిపించని ఇటువంటి సమాజ౦లో why dont we document the people who have nurtured an organic thought in us. ఈ రోజు మనలో కొద్దో గొప్పో ఒకడికి అన్నం పెట్టే గుణమో సహాయం చేసే గుణమో ఉందీ అంటే అది ఆ తరంద్వారా సహజంగా మనలోకి ఇంబైబ్ అయిన గుణం. అది ఒక తండ్రి ద్వారానో..ఒక తల్లి ద్వారానో వచ్ఛిన గుణం కాదు. తల్లి దండ్రుల ద్వారా మనం వారి జీన్స్ ని పొందుతాం. కానీ ఆ గుణాల్ని కాదు. Gene itself is a subject. అది ఒక పదార్థం. దానికి ఎటువంటి ఎమోషనూ లేదు. అది కేవలం ఒక పదార్థం మాత్రమే. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా కావాలసిన రకంగా మనం ఒక బేబీని సృష్టించవచ్చు. కానీ ఆ బేబీ గుణగణాల్ని ప్రవర్తనా రీతుల్నీ సృష్టించలేం. ఆ గుణాల్ని సమాజమే అందించాలి. గుండెనో కిడ్నీనో ట్రాన్స్ప్లాంట్ చేసినపుడు, ఆ అవయవం మాత్రమే మారింది, కానీ గుణాలు మారవు. అవయవ దానం చేసిన వ్యక్తి గుణాలు అవయవం స్వీకరించిన వ్యక్తి లోకి వచ్చేయవు. ఇపుడు ఒక సమాజంలోని గుణాల్ని ఇంకో సమాజానికి అందించాలంటే...ఆ సమాజాన్నే ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఒక నేచురల్ ఆర్గానిక్ సొసైటీ లోని గుణాలను, ఒక అన్నేచురల్ ఇనార్గానిక్ సొసైటీకి బదలాయించాలి. నేను అడవుల్లో పని చేశాను. అక్కడి ట్రైబల్ అమ్మలతో మనుషులతో కలిసి పని చేశాను. వారి దగ్గర ఈ సహజత్వాన్నీ జీవ కళనూ చూశాను. అలాగే ఆ తరం అమ్మల్లో కూడా ఈ సహజత్వాన్నీ, జీవ కళనూ చూశాను. ఆ గుణాల్ని ఈ తరంలోకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి అనుకుంటాను. అందుకే ఒక కళా కారుడిలా నా బొమ్మల ద్వారా ఆ తరాన్ని, ఆ గుణాల్ని ఈ తరానికి అందించే ప్రయత్నం చేస్తున్నా.


V: మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ  ఈ జనరేషన్ అమ్మలందరూ అమ్మలు కాదు అన్నారు. ఈ విషయాన్ని ఇంకాస్త వివరంగా చెబుతారా?.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: అంతే కదా గురూ..! మాతృత్వం పొందిన వారంతా అమ్మలైపోరు కదా...! అమ్మతనమంటే పెట్టే గుణం. అది లేనపుడు తల్లి అయినంత మాత్రాన అమ్మలెలా అవుతారు. ఇక్కడ నేను బొమ్మలు వేసిన వారంతా అమ్మలే. వీరందరిలో పెట్టే గుణం ఉంది. మా అమ్మ మాత్రమే కాదు. వీరందరూ అమ్మల్లాగే కనిపిస్తారు నాకు. అమ్మ ఎవరికైనా అమ్మలాగే కనిపిస్తుంది. అది అమ్మగుణం. అదే అమ్మతనం. ఆ అమ్మతనానికి లింగ బేధాలు కూడా లేవు. పురుషుడైనా అమ్మతనాన్ని కలిగి ఉంటే..అమ్మే అవుతాడు. ఆ తనం ఉండాలి. ఆ తనాన్ని సమాజంలో పెంపొందించాలి. అది లేనపుడు ఆ అమ్మలు, ఆ మనుషులూ అమ్మలెలా అవుతారు?.

V: మీరు ఇపుడు ఎగ్జిబిషన్ లో ఉంచిన బొమ్మలన్నీ ఎప్పటి నుండి వేస్తున్నారు?.
------------------------------------------------------------------------------------------------

S: ఇవన్నీ 2002 నుండి 2016 వరకు వేసిన చిత్రాలు. 2002 లో మా అమ్మ బొమ్మను గీసాను. అప్పటి నుండి మొదలయ్యింది. ఇప్పటిదాకా నలభై ఆరు బొమ్మలు వేసాను. ఇక్కడ ఇరవై ఆరు బొమ్మల్ని డిసప్లే చేస్తున్నాను.

V: 2002 నుండి ఇప్పటి దాకా వేస్తూ వస్తున్నపుడు, మీ చిత్రాల్లో మీరు గమనిస్తున్న మార్పు ఏమిటి?.
-----------------------------------------------------------------------------------------------------------------------------

S: ఏ కళాకారుడైనా రెండు విషయాలు నేర్చుకోవాలి. ఒకటి స్కిల్(skill), రెండు క్రాఫ్ట్మన్ షిప్(craftsmanship).  స్కిల్ ఇన్హెరెంట్ గా రావచ్చు. కానీ క్రాఫ్ట్ మన్ షిప్ ని కళాకారుడే అభివృద్ధి చేసుకోవాలి. ఒక కుమ్మరి, కుండలు చేస్తున్నపుడు ఎటువంటి క్రాఫ్ట్మన్ షిప్ ను ప్రదర్శిస్తాడో..అటువంటి పర్ఫెక్షన్ ని నేర్చుకోవాలి. క్రాఫ్ట్మన్ షిప్ అభివృద్ధి చేసుకోవాలంటే..మనకున్న ఇన్స్ట్రూమెంట్స్ పై అవగాహన పెంచుకోవాలి. నా విషయం వరకూ వస్తే, ఇప్పటిదాకా నేను నా మిత్రులు ఇస్తూ వస్తూన్న ఆర్ట్ మెటీరియల్ ని అవగాహన చేసుకుంటూ నా చిత్రకళను కొనసాగిస్తున్నాను. కానీ ఈ రోజు టెక్నాలజీ పెరిగాక, ఈ ఆర్ట్ మెటీరియల్ కి సంబంధించిన సమాచారం విస్తృతంగా దొరుకుతోంది. మెటీరియల్ కూడా చాలా సులువుగా దొరుకుతోంది. దాన్నంతా నేను ఎక్ప్లోర్ చేయాలి. ఇందాకా మిత్రుడు ఏలే లక్ష్మణ్ వచ్చారు. మెటీరియల్ ని ఉపయోగించే విషయంలో కొన్ని సూచనలు చేశారు. మార్కెట్ కి వెళ్ళి ఈ మెటిరియల్ వెదుక్కోవాలి అనుకుంటున్నాను. అది నా క్రాఫ్ట్ మన్ షిప్ ని అభివృద్ధి చేసుకోవటానికి ఉపయోగపడుతుంది.

V: ఇదే ప్రశ్నను ఇంకో రకంగా అడుగుతున్నాను. నుండి ఇప్పటి దాకా మీరు బొమ్మలు గీస్తున్నారు. ఈ 14 సంవత్సరాల కాల వ్యవధి మీలో,మీ అంతరంగంలో. మీకు మీరు గమనించిన మార్పు ఏంటి?.
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: ఇంటర్నల్ గా నాకు ఖచ్ఛితంగా తెలిసిన విషయం ఏమంటే., my paintings are not marketable commodities.
ఈ అమ్మల్నీ అమ్మమ్మల్నీ నేను ఎలా అమ్ముకోగలను?. నాకు అమ్మలు కదా వీళ్ల౦తా...వారినెందుకు అమ్ముకోవాలి?. వారి బొమ్మలతో నాకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడినప్పుడు, అమ్ముకోవటమనే విషయం చాలా భయంకరంగా అనిపిస్తుంది నాకు. అంతే కాదు, 'మా అమ్మ బొమ్మను అమ్ముకు౦టావా?' అని రేప్పొద్దున ఇంకెవరైనా అడగొచ్చు. ఇపుడిటువంటి చోట్ల ఎక్కడైనా ఎగ్జిబిషన్ పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న అంశం కదా..! నా సొంత ఖర్చులతో నేను ఎంతకని ఈ ప్రదర్శనలను కొనసాగించగలను?. చిత్రాల ద్వారా ఈ అమ్మతనాన్ని ఇలా ఎంతకాలం సొంత ఖర్చులతో ఈ తరానికి అందించగలను అని ఆలోచిస్తుంటాను. నాకున్న సంపాదన రీత్యా నాకు ఈ పని తలకు మించిన భారం కాకూడదు అనుకుంటాను. లాభాలు రానవసరం లేదు నాకు ...ఎందుకంటే నేను అమ్మలను అమ్మతనాన్ని అమ్ముకోలేనని చెప్పాను కదా..కానీ నేను దివాలా తీయకుంటే చాలనుకుంటాను. దీనికో పరిష్కారం ఆలోచించినపుడు, ఇక పై అమ్మల బొమ్మలను వేయడానికి టోకెన్ లాగా కొంత డబ్బు తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇది ఈ మధ్య వచ్చిన ఆలోచనే. ఆ డబ్బు ఇలా ప్రదర్శనలు చేయటానికి కొంత ఊరటనిస్తే చాలు. లేదా ఇంకెవరైనా స్పాన్సర్ షిప్ చేస్తామని ముందుకు రావచ్చేమో తెలియదు. చూడాలి..,నేను ఈ ఆలోచనను ఎంత వరకు ముందుకు తీసుకెళ్లగలనో. ఎందుకంటే ....

V: ఇపుడు ఈ గోథే సెంటర్ లో ప్రదర్శన ఏర్పాటు చేయటానికి ఎవరైనా స్పాన్సర్స్ దొరికారా సర్..?
------------------------------------------------------------------------------------------------------------------------

S: స్పాన్సర్లు ఎవరూ లేరు కానీ, ఈ విషయంలో ఈ రోజు నేను మార్కెట్ ను జయించానేమో అన్నంత ఆనందం ఉంది. ఇక్కడ ఏర్పాటు చేయగలగటం నేను ఊహించనిది. సహకరించిన యాకూబ్ కీ, గోథే సెంటర్ నిర్వాహకులకు, బొమ్మలను అమర్చిన మిత్రుడు బంగారు బ్రహ్మం కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇది నేను ఊహించనిది అని ఎందుకు అంటున్నాను అంటే..ఈ గోథే సెంటర్ ఒకప్పుడు మేము నివసించిన ఇల్లు. సరిగ్గా ఇక్కడే మా ఇల్లు ఉండేది. తరువాత దానిని కూల్చి ఈ గోథే సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ నిర్వాహకులను అడిగినపుడు వారు ఈ స్థలం ఒకప్పుడు మేము నివసించిన ఇల్లే అని తెలుసుకుని చాలా సంతోషించారు. ఎగ్జిబిషన్ పెట్టుకోవటానికి పూర్తి సహకారం అందించారు. మా అమ్మ బొమ్మను నేను మొదట ఈ ఇంటిలోనే వేశాను, ఇపుడు అదే చోట , దాదాపు పధ్నాలుగు సంవత్సరాల తరువాత ప్రదర్శన పెట్టుకోవడానికి అవకాశం రావటం అనేది యాదృచ్ఛికం అనుకోవడం కన్నా అంతకుమించిని ఏదో అనుబంధం అనుకుంటాను. అతి తక్కువ ఖర్చుతో ఇలా పది మందితో నా అనుభవాల్ని పంచుకోవటం నేను మరచిపోలేని విషయం.

V: -(నేను చిత్రాల్ని పరిశీలిస్తూ...)చిత్ర కళలో ఎన్నో ఇజాలు వచ్చాయి కదా..! సర్రియలిజం, క్యూబిజం, ఎక్సప్రెషనిజం వంటివి..వీటిలో కొన్ని హృదయ జనితమైనవనీ, కొన్ని మేథో జనితమైనవనీ అంటూంటారు..అలాగే వీక్షకుడి విషయానికి వస్తే హృదయ రంజకమూ, మేథో రంజకమూ అని కూడా ఉంటుంటాయి. ఇపుడు మీ చిత్రాలు పాఠకుల హృదయాన్ని తాకాలి అనుకుంటారా లేక మేథస్సును తాకాలి అనుకుంటారా..?
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: బేసికల్ గా నేను ఈ ఇజంలనీ నమ్మను గురూ..!
ఈ కళ ఈ ఇజంలో ఉంది, ఆ బొమ్మ ఆ ఇజంలో ఉంది అనేది నేను నమ్మను. నమ్మను అంటే...ఒక కళాకారుడిగా నేను నమ్మను. అ౦టే ఆ ఇజాలు లేవని కాదు. కానీ ఒక చిత్రం ఏ ఇజంలోకి వస్తుంది అని తెలుసుకోవలసిన పని, ఆ విధంగా వివరించవలసిన పని నాది కాదు. అది విమర్శకుల పని. వీక్షకుల పని. ఒక కళాకారుడిగా నాలోపల ఉన్న కళను బయటకు తీయటమే నా పని. One who is a failure artist he turns to be a critic అంటాడు ఆస్కార్ వైల్డ్. నేను ఈ ఇజాల గురించి కొంతే తెలుసుకున్నాను, ఎంత అవసరమో అంతే తెలుసుకున్నాను. ఈ ఇజం ల గురించి ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ పోతే నేను విమర్శకుడినౌతానేగానీ..కళాకారుడిని కాలేను. ఇపుడు నా చిత్రాలు హృదయాన్ని తాకుతాయా..? మెదడును తాకుతాయా అంటే నేను చెప్పలేను. అది చూసేవాడి చూపుని బట్టి ఉంటుంది. అన్ని కళలూ హృదయాన్నీ తాకుతాయి, మెదడునూ తాకుతాయి...అలా తాకే ప్రయత్నం కళాకారుడు చేయగలగాలి. అంతవరకే అతడి పని అనుకుంటాను. ఒకసారి ఒక చిత్రాన్ని వేసిన తరువాత, ఇపుడా చిత్రం కళాకారుడిది కాదు, ప్రపంచానిది. ప్రపంచం ఎలా తీసుకుంటుందో ప్రపంచానికే తెలియాలి.

V: మనం ఈ విషయంలో ఇంకాస్త చర్చించాలి అనుకుంటాను. ఉదాహరణకు ఒక అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ ని ఒక ఆర్టిస్ట్ వేశాడనుకుందాం. అతడు ఏమి చెప్పదలుచుకున్నాడో వీక్షకుడికి అర్థం కాదు. ఆ పెయింటింగ్ ని చూడగానే, అది వీక్షకుడి హృదయాన్ని తాకే అవకాశం ఉండదు. అపుడు అతడు తన మేథను ఉపయోగించాలి. కొంతసేపు ఆలోచించాలి, పలు రకాలుగా ఊహిస్తూ పోవాలి. అపుడుగానీ ఆ ఆర్టిస్టు ఏమి చెప్పదలచుకున్నాడో ఇద మిత్తంగా అర్థం కాదు. అటువంటి సందర్భంలో వీక్షకుడికి అదే విధంగా ఆర్టిస్టుకీ మధ్య బంధం తెగిపోయే అవకాశం, భావ ప్రసరణ సవ్యం గా జరిగే సంభావ్యత తగ్గి పోతుంటాయి కదా..?
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
S: సమాజం అనేది ఒక స్టాటిక్ థింగ్ అనుకోను గురూ...! అది డైనమిక్ గా కదులుతూ  ఉంటుంది. సమాజంలో ఆధునిక టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్త కొత్త ఇజాలు కూడా కళారంగం లో పుట్టుకు వస్తాయి. సొసైటీ పరిణామం చెందే కొద్దీ కళ, అలాగే క్రాఫ్ట్మన్ షిప్(craftmanship) పరిణామం చెందుతుంటాయి. ఇపుడు ఒక వీక్షకుడు వందేండ్ల కిందటి మనసుతో వచ్చి, ఇప్పటి బొమ్మను చూస్తే వాడికేమర్థమవుతుంది. వాడి ఎమోషన్ వంద ఏండ్ల కిందటిది, ఇప్పటి ఎమోషన్ నీ ఇప్పటి పరిణామాన్ని అతడెలా అందుకోగలడు?. వీక్షకుడైనా , పాఠకుడైనా ఆ కళ గురించిన ప్రాథమిక అవగాహన లేనపుడు అతడు కళాకారుడితో కలిసి నడవలేడు. అవగాహనకు కళాకారుడు సృష్టించిన కళ అడ్డంకికాదు...వీక్షకుడి వెనుకబాటు తనమే అడ్డంకి. పోయెట్రీ విషయమైనా అంతే. పాఠకుడు ఎంతోకొంత హోం వర్క్ చేయగలిగినపుడే కవిత్వాన్ని అందుకోగలుగుతాడు. మన తెలుగులో పాఠకులు ఇంకా శ్రీశ్రీ దగ్గరే ఆగిపోయి ఉన్నారు. ఒక కవితను చూసి ఇది శ్రీశ్రీ కవితలా లేదు కాబట్టి, ఇది కవిత్వమే కాదనో, అర్థమే కావటం లేదనో అంటూంటారు. వారంతా అక్కడే ఆగిపోయి వున్నారు. శ్రీశ్రీ ఆధునికతకు, పరిణామానికి పెద్ద పీట వేశాడు.ఆయనే ఈ ఆధునికతకు ప్రతినిధి, కానీ అటువంటి శ్రీశ్రీ దగ్గరే పాఠకుడు ఆగిపోయాడు, అక్కడినుండి ఎదగటం లేదు. శ్రీశ్రీ తరువాత ఎన్నెన్ని కవిత్వోద్యమాలు వచ్చాయి..వాటిపై అవగాహనే లేనపుడు, పాఠకుడికి ఆ కవిత్వమెలా అర్థమవుతుంది?.

V:  ఐతే కళను అర్థం చేసుకోవాలంటే పాఠకుడు కూడా ఆ కళ పట్ల అవగాహన ఉండాలంటారు. ఈ మధ్య 'సామాన్య మానవుడు' లేదా 'సామాన్య పాఠకుడి'కి అర్థం కావటమే లేదు అని అనడం వింటూ ఉంటాం...
--------------------------------------------------------------------------------------------------------------------------------------

S: నేను సెల్ ఫోన్ మాత్రమే వాడతాను. మా అబ్బాయి స్మార్ట్ ఫోన్ వాడతాడు. ఇపుడు నా చేతికి ఆ స్మార్ట్ ఫోన్ ఇచ్చి ఉపయోగించమంటే నేను ఫోన్ కూడా చేయలేను. నేను స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలనే విషయం మీద ఇంకా అబ్డేట్ కాలేదు. నేను ఇంకా పురాతన సెల్ ఫోన్ యుగంలోనే ఉండిపోయానంటే..ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పటికీ అర్థం కాదు. ఇఫుడు తప్పు అబ్డేట్ కాలేని నాదే అవుతుందిగానీ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీది కాదు. ఒకఫోన్ విషయంలోనే పరిస్థితి ఇలా ఉంటే..ఒక కళకు ఇంకెంత ఉండాలి?.కళ విస్తృతమైనది కదా.. యూనివర్సల్ కదా..దాని పరిధి చాలా పెద్దది. దాన్ని అర్థం చేసుకునే రీతిలో పాఠకుడు ఉన్నపుడే అది అతడికి అర్థమవుతుంది. ఇక సామాన్య పాఠకుడు అంటే ఎవరు? కవిత్వం చదివేవాడు సామాన్యుడు ఎలా ఔతాడు?. ఈ అర్థంలేని వాదాలు పాఠకుడిని అజ్ఞానంలోనే ఉంచేస్తాయి తప్ప..వాడి అవగాహనా పరిధిని పెంచేవి కావు. గొప్ప పాఠకుల మధ్యనే గొప్ప కవులూ పుడతారు.

V: అయితే కళాకారుడికి 'ఇజాలతో పెద్దగా పనిలేదంటారు..
--------------------------------------------------------------

S: అవును. కొంత బేసిక్ స్టడీ ఉపయోగపడొచ్చు. అలాగే ఆర్ట్ హిస్టరీ కూడా కొంత అవగాహన చేసుకోవాల్సి ఉంటుందనుకుంటాను. ఆర్టిస్ట్ కి అన్నిటికంటే ముఖ్యం ఆర్ట్ వేయటమే. ఆర్ట్ వేస్తేనే అతడు నేర్చుకుంటాడు తప్ప వేరే ఏమి చదివినా, ఆలోచించినా అతడు నేర్చుకోలేడు. కవి కవిత్వం రాస్తూ రాస్తూనే కవిత్వం రాయటాన్ని నేర్చుకుంటాడు. ముందే కవిత్వానికి సంబంధించిన  ఆ ఇజంల మీద ధ్యాస వుంటే కవిత్వం రాసేదేముంటుందిక?.ఆకలేస్తే అన్నం తినాలి. ఆలోచిస్తే ఆకలి తీరదు..ఆకలి ఎలా తీరుతుందో తెలుసుకోవటం వల్ల ఆకలి తీరదు. మీ వైద్య పరిభాషలో చెప్పాలంటే..గుండె పనితీరును గురించి తెలుసుకోవాలంటే గుండె పని చేస్తున్నపుడే నేర్చుకోవాలి. గుండెను బయటకు తీసి గుండె పనితీరుని నేర్చుకోలేవు, కేవలం అనాటమీనే నేర్చుకోగలవు.
V: మీరు ఒక పెయింటర్, అలాగే ఒక పోయెట్..ఈ రెండు కళల్లో దేనితో మీరు ఎక్కువగా ఐడెంటిఫై అవుతారు?.
--------------------------------------------------------------------------------------------------------------------------------

S: నాకు ఈ రెండూ ఇష్టమే గురూ..ఇవే కాదు, ఫోటోగ్రఫీ అన్నా ఇష్టమే, ఇంటిని అందంగా సర్దుకోవటమన్నా ఇష్టమే. ఇవన్నీ నా ఎక్స్ప్రెషన్స్. నన్ను నేను వీటి ద్వారా తెలియబరుస్తున్నాను, ఆవిష్కరించుకుంటున్నాను, అలాగే వీటిద్వారా నన్ను నేను తెలుసుకుంటున్నాను. వీటిలో ఒకటి ఎక్కువ ఇష్టం, ఒకటి తక్కువ ఇష్టం అనేదేమీ లేదు. ఆయా సమయాల్లో.. స్పాంటేనియస్ గా నన్ను ఏది ప్రేరేపిస్తుందో ఆ ఎక్స్ప్రెషన్లోకి నేను ఒదిగిపోవటానికి ప్రయత్నిస్తాను. ఈ ఆర్ట్ ఫామ్స్ లో ఇది మోస్ట్ ప్రిఫర్డ్(most preferred) ఇది లెస్ ప్రిఫర్డ్(less preferred) అనేదేమీ లేదు. The purpose of my art forms is to express myself.

V: మిమ్మల్ని మీరు ఇలా ఎక్స్ప్రెస్ చేసుకున్నపుడు, పాఠకుడు లేదా వీక్షకుడు మిమ్మల్ని రీచ్ అవగలుగుతున్నాడా..? లేదా మీరు మీ పాఠకుడి దగ్గరికి రీచ్ అవగలుగుతున్నారా?
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: దానిని నేను చెప్పలేను. కొందరు మార్కెట్ ద్వారా విస్తరించి రీచ్ అవుతారు. కొందరు మౌత్ టు మౌత్ అవుతారు. నేను ఆలోచించేది first of all let me express myself.  రీచ్ అయ్యేది రీచ్ అవుతుంది. క్రికెట్ లో, సినిమాల్లో వొచ్చేసినంత తొందరగా డబ్బూ పేరూ ఈ పోయెట్రీలో, వ్యాసాల్లో, చిత్రాల్లో రావు. ఇది చాలా మెల్లిగా ముందుకు కదిలే విషయం. గంటసేపు జరిగే పుస్తకావిష్కరణ సభ గానీ, వారం రోజులు జరిగే art exhibition కానీ పాఠకుని దెగ్గరికి కళాకారుణ్ణి ఎంత వరకు తీసుకెళ్తాయి అంటే చెప్పడం కష్టమే. నా పోయెట్రీ ద్వారా, చిత్రాల ద్వారా ఇప్పటికిప్పుడే ప్రపంచానికి నేను తెలిసిపోవాల్సిన అవసరం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా నేను ఆలోచించేది సమాజం లో ఆర్ట్ మీద ఉండే శ్రద్ధ ఎంతుందని?
మన కళల మీద కావలసినంత అవగాహనని ప్రభుత్వాలు కల్పించ గలుగుతున్నాయా?. అవార్డులు రివార్డులు వంటి క౦టి తుడుపు చర్యలకే మనం అలవాటు పడిపోయి ఉన్నాం.  ఇపుడు మనం రోడ్డు మీదకు పోయామంటే ఎన్నో గోడలు తెల్లగా నిర్వికారంగా కనిపిస్తూ ఉంటాయి. వాటి మీద అందమైన చిత్రాల్ని ఎందుకు గీయకూడదు?. ఎందుకు ఖాళీగా ఒదిలేయాలి?. ఆ ఖాళీ స్పేస్ ని ఒక కళాకారుడు తనను తాను ఎక్స్ప్రెస్ చేయటానికి ఎందుకు కేటాయించకూడదు?. ఇటువంటివి ఎన్నో జరిగాలి. ప్రజల్లో కళ పట్ల చైతన్యం కలిగినప్పుడే కళ ప్రజల్ని చేరాల్సినంత చేరుతుంది.

V: ఇపుడు మీరు ఇక్కడ చిత్ర ప్రదర్శన చేశారు. మీరు స్వయంగా వీక్షకులకు మీ చిత్రాలను చూపించారు. వారి కళ్లలో మీరు మీ వీక్షకులను రీచ్ అయినట్టు మీకు అనిపించిందా..? మీ perspective ని తెలుసుకోదలిచి ఈ ప్రశ్న అడుగుతున్నాను.
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: నేను ఇక్కడ కేవలం నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాను. వారి ఎమోషన్ ను నేను ఖచ్ఛితంగా కొలవలేను. ఒక ఎమోషన్ ని అందరూ ఒకే తీవ్రతతో ఎక్స్ప్రెస్ (express) చేస్తారనుకోను. కొందరు మనసులో ఉంచుకుని బయటకు గంభీరంగా ఉండిపోవచ్చు. కొందరు వెంటనే బయటకు ఎక్స్ప్రెస్ చేయవచ్చు. కొందరు ఏమీ అర్థం కాకున్నా, పొగడాలి కాబట్టి 'వావ్' అని పెద్దగా అరవొచ్చు. కాబట్టి ఆ ఎమోషన్ లోని ఎక్స్ప్రెస్సివ్ తీవ్రత( intensity of expression) ఆధారంగా నేను రీచ్ అయ్యానా లేదా అనేది అంచనా వేయలేను. ఇంకోటేమంటే ఈ ఆర్ట్ ద్వారా నేనేమీ సందేశాలివ్వదలచుకోలేదు. నా సందేశాలేమీ లేవు. కాబట్టి సినిమా చూసి సందేశం తీసుకుపోయినట్టుగా నా దెగ్గరేమీ లేదు. కానీ ఈ ప్లాట్ ఫారం ద్వారా నేను నా ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ని ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ (emotional performance) గా మలచదలిచాను. ఇఫుడు మీరు ఇక్కడికొచ్చారు. ఈ బొమ్మల్ని చూశారు. చూసినపుడు, మీకు మీ అమ్మో, అమ్మమ్మో, నాయనమ్మో గుర్తుకు వచ్చి ఉంటుంది. బయటికెళ్ళాక కూడా మీరు మరచిపొయిన మీ అమ్మమ్మ, నాయనమ్మ మీకు గుర్తుకు రావాలి. వాళ్ళు మళ్లీ మీ జీవితాల్లోకి రావాలి. వాళ్లు బొమ్మలుగా, గోడ మీది ఫోటోలుగా మిగిలిపోకూడదు. లైఫ్ లోకి రావాలి. ఒక పోయెంను చదివి పాఠకుడు ఎలా మరల మరల మననం చేసుకుంటాడో..నా బొమ్మలు చూసిన వీక్షకుడు వాళ్ల అమ్మల్నీ, అమ్మమ్మల్ని, నాయనమ్మల్నీ గుర్తుకు చేసుకోవాలి. ఈ బొమ్మలు కొంతకాలం వాళ్లని హాంట్ చేయాలి. వెంటాడాలి. రేపు పొద్దున వాళ్ల అమ్మల్నీ అమ్మమ్మల్నీ చూసే దృష్టిలో కొంత మార్పు వచ్చినా చాలు. ఈ ఎగ్జిబిషన్ విజయం పొందినట్లే. ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇక్కడినుంచి మొదలవ్వాలి. అది మొదలవుతే, నేను వీక్షకుడికి రీచ్ అయినట్టే.

V: -ఈ ఆధునిక కాలంలో..బిజీ సిటీ లైఫ్ లల్లో మనుషులు ఎమోషనల్ గా ఉండటమే నేరమనుకుంటున్న తరుణంలో ..'ఎమోషనల్ పెర్ఫార్మన్స్' (emotional performance) ని మీరిక్కడనుండి మొదలు పెట్టాలనుకుంటున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమవుతుందని మీరు భావిస్తున్నారా?.
------------------------------------------
S: నిజమే గురూ..! నిజానికి మనకు అన్నీ తెలుసు గురూ..! మనలో సునిశితత్వం చచ్చిపోతోంది. మనం ఎమోషన్ ని రేషనలైజ్ చేసేస్తున్నాం, లాజికల్ గా ఆలోచించటం మొదలు పెట్టాం. ఏదన్నా చేయాలంటే..ఒక సహాయం చేయాలంటే..నాకేంటి ఇందులో లాభం అనే స్వార్థ పూరిత ఆలోచనని కొనసాగిస్తున్నాం. ఎవరైనా ఎమోషనల్ గా పని చేసినా, ఏదో లాభం లేనిది ఎందుకు చేస్తారు అనుకుంటుంటాం. ఎమోషన్ ని కూడా మార్కెటబుల్ అవునా కాదా అని చూస్తున్నాం. ఎవడికైనా వ్యవస్థ మీద కోపమొచ్చేసి విప్లవ కవిత్వం రాసేస్తే..అది పొలిటికల్ గా, మార్కెట్ పరంగా ఎంతవరకు పనికొస్తుంది? అని ఆలోచిస్తున్నాం. పొలిటికల్ గానో..మార్కెట్ పరంగానో మంచి గిరాకీ లేదా మంచి పేరు వస్తుంది అనుకున్నపుడు, ఇంక విప్లవ కవిత్వమే రాయటం మొదలు పెట్టాం. నీ కెట్లా కావాలి కవిత్వం..? విప్లవంగా కావాలా..? ఇదిగో రాసేశా..!! లేదా రొమాంటిక్ గా కావాలా?  ఇదిగో రాసేశా..!! నీ మార్కెట్ కు అనుగుణంగా నేను కవిత్వం రాసినట్టయితే..ఇంక నేను నా కవిత్వం రాసిందెపుడు?. ఇటువంటి కవుల్నీ కళాకారుల్నీ నేను నమ్మను అని చెప్పడానికి నాకెటువంటి కాంట్రాడిక్షన్స్ లేవు గురూ! కవులే ఇలా ఉన్నపుడు పాఠకుడు, వీక్షకుడు అంతకు మించి ఉంటాడనుకోలేను కదా!. కానీ ఈ ప్లాట్ ఫాం ద్వారా నేను ఎమోషన్ ను రేషనలైజ్ చేయదలచుకోలేదు. నా సెన్సిబిలిటీస్ ని ఎలా ఉండనిస్తానో అలానే వీక్షకుడికి అదించాలనుకుంటాను. నేను కొత్త కళ్లద్దాలను వీక్షకుడికి ఇచ్చాను. వాళ్లు వాటిని ఉపయోగించుకు౦టారో తీసి పక్కన పెట్టేస్తారో నేను చెప్పలేను.

V: ఈ రోజుల్లో పోయెట్రీని ఒక కారణం కోసం, ఒక సందేశం ఇవ్వడం కోసం, లేదా ఒక గుర్తింపుకోసం రాయటం మనం చూస్తుంటాం...
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: పోయెట్రీకి నిన్ను మించిన, నీ ఎమోషన్ ని మించిన కారణం ఏముంటుంది గురూ..! నీ ఎమోషనే నీ పర్పస్. వేరే పర్పస్ ఏమీ లేదు. ఇదేమన్నా సినిమానా, ఒక ఫార్ములా సినిమా సక్సెస్ అయిందని అందరూ అవే కథల్ని అవే సన్నివేశాల్ని మార్చి మార్చి తీయటానికి. ఒకరు ఒక పర్పస్ తో రాసి పేరు తెచ్చుకుంటే ఇంక అందరూ అదే పర్పస్ కోసం రాసేయటం. అంతే కాకుండా ప్రతీ కవీ శ్రీశ్రీ లాగా అయిపోవాలనుకోవటం. అందరూ శ్రీశ్రీలే అయిపోతే..ఇంక కాళోజీ ఎందుకు? దాశరథి ఎందుకు? నెరుడా ఎందుకు? గోథే ఎందుకు?. ఎందుకంటే మనం ట్యూన్ చేయబడ్డాం. సినిమా ఫార్ములా లాగా కవిత్వ ఫార్ములా. ఆ ఫార్ములా కవికి, పాఠకుడికీ ఒకే రకమైన కళ్లద్దాల్ని ఇస్తుంది. ఇద్దరూ అవే కళ్లద్దాల్ని పెట్టుకుని మాట్లాడుకుంటూ కూర్చుంటారు. పోయెట్రీలో కానీ, పెయింటింగ్ లో కానీ ఖచ్ఛితంగా నా ఐడెంటిటీ నాకు ఉండాలి. ఇంకొకరి ఐడెంటిటీ నాకెందుకు?. అసలే..ఈ రోజున్న కాంపిటీటివ్ ప్రపంచంలో, ఫాస్ట్ ప్రపంచంలో నీ ఐడెంటిటీ మహా అయితే పది రోజులకన్నా ఎక్కువ ఉండదు. కళాకారులైనా ఈ ట్రెండ్ కు అలవాటయి పోయారు. ఇప్పటి సినిమా గాయకులనే తీసుకోండి. రెండు మూడు సినిమాల్లో పాడాక, టీవీల్లో రియాలిటీ షో లకు వచ్చేస్తారు. లేదా దుబాయ్ లో పాటలు పాడి డబ్బులు సంపాదించుకుంటారు. ఆ గాయకుల పేర్లు కూడా మనకు గుర్తుండని పరిస్థితి వుంది. డబ్బు సంపాదించటమే ఐడెంటిటీ అనుకున్నపుడు, ఆర్ట్ ఉండేదెక్కడ?. అందుకే తన సొంత పనిని వదిలేసి,వేరే మార్గాల ద్వారా గుర్తింపు పొందాలనే తాపత్రయం. నేను నమ్మేదేంటంటే..నా పనికంటే నాకు వేరే గుర్తింపేది?

V: సినిమాల విషయంలో కళ కంటే కూడా మార్కెట్ ముఖ్యమవుతుందనుకుంటాను. అందుకే సినిమాల్లో కళనూ క్రియేటివిటీనీ ప్రశ్నించేలా ట్రెండ్ అనేది ఆధిపత్యం వహిస్తుంటూంది. ట్రెండ్ ని ఫాలో అవుతూ , మార్కెట్ ని పట్టుకుంటూ, సందేశాలు ఇచ్చే చిత్రాలు వస్తున్నాయిగా....
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

S: అందులో కూడా రియాలిటీ ఎక్కడుంది గురూ..! రియాలిటీకి దూరంగా ఉంటూ నేను సినిమాల ద్వారా సందేశాలిచ్చేస్తాను అనుకోవటం ఎంత పిచ్చితనం కదా..! సందేశమే ఇవ్వదలచుకుంటే..సినిమా ఆపేసి ఒక ప్రసంగం ఇవ్వొచ్చుకదా..! ఈ పైపై నటనలెందుకు?. సినిమా అనేది ఒక చీకట్లో గుద్దులాట లాంటిది గురూ..!! సినిమా ద్వారా నేను ఒక కనిపించని వ్యక్తి తోటి మాట్లాడుతున్నాను. సినిమా చూసే వాడెవడో నాకు తెలియనపుడు, వాడి ఎమోషన్స్ ఏమిటో నాకు తెలియనపుడు నేను ఏదైనా చూపించేస్తాను. 'శ్రీమంతుడు' సినిమానే తీసుకోండి. గ్రామాల్ని దత్తత తీసుకోవటమనే సందేశం ఉందంటాడు. అసలు ఈ రోజు గ్రామాలు గ్రామాల్లాగా లేనపుడు నీవు ఏం దత్తత తీసుకుంటున్నావు?. గ్రామ జీవితం గ్రామం లాగా లేదు. ఒకపుడు ఎనిమిది గంటలకల్లా నిద్రపోయే గ్రామం ఈ రోజు రాత్రి ఒంటిగంట వరకూ టీవీల ముందు సినిమాలూ సీరియళ్ళూ చూస్తుంది. అందరింటికీ ఇంటర్నెట్ ఉంది. అందరి చేతుల్లో సెల్ ఫోన్లూ, స్మార్ట్ ఫోన్లూ, ఫేస్ బుక్ లూ, చాటింగ్ లూ వచ్చేసాయి. పేరుకే గ్రామంలాగా ఉంది, గ్రామం ఎపుడో నగరీకరణ జరిగిపోయింది. ఇపుడు గ్రామాన్ని దత్తత తీసుకుని నీవేం చేస్తావు. గ్రామాన్ని పోషించిన తరమే లేదిపుడు. నగరీకరణ చెందిన గ్రామాన్నీ, నగరీకరణ చెందిన మనుషులనూ దత్తత తీసుకుని నీవే౦ సందేశం ఇస్తావు?

V: నిజమే సర్..నిజానికిప్పుడు గ్రామాలు అనేవే లేవేమో ప్రపంచమనే కుగ్రామం తప్ప...
------------------------------------------------------------------------------------------------

S: గ్రామాలు ఉన్నాయి.  గ్రామానికి ఉండాల్సిన జీవకళ గల గ్రామాలు లేవంటాను. బాగా డబ్బున్న వాళ్లు ఉండే గ్రామాల్లో ఆ జీవం లేదు. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో, ట్రైబల్ విలేజ్ లల్లో ఆ జీవం ఉంది. గ్రామాన్ని గ్రామంగా నిలపలేక, దానిని నగరీకరణ చేయటం కోసం దత్తత తీసుకోవడం చాలా పిచ్చి ఆలోచన కదా. జీవకళ ఉన్నటువంటి ఒక ఆర్గానిక్ సొసైటీ గ్రామాల్లో లోపించినపుడు, నగరమనే ఒక ఇనార్గానిక్ సొసైటీని గ్రామాల్లోకి తీసుకురావడానికి దత్తత తీసుకోవటం ఏమిటి?, దానికి సందేశమిచ్చేశామనీ, సమాజాన్ని మార్చేద్దామనీ డప్పు కొట్టడమేమిటి?
----------------------------------------------------------------------------------------------

V: మనం మాటలలో చాలా దూరమే ప్రయాణించామనుకుంటాను, ఇక కొన్ని ప్రశ్నలు... మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటి?.

S: రాబోయే మూడు నాలుగేండ్లలో వందకు పైగా అమ్మలను గీయాలనుకుంటున్నాను. ఈ ఎగ్జిబిషన్ కి వచ్చిన వారే అడుగుతున్నారు, మా అమ్మ బొమ్మ గీయండి అని. ఇంతకు ముందు చెప్పినట్టు 'టోకెన్' గా కొంత మనీ తీసుకోవాలనే ఆలోచన కూడా ఉంది. అంతే కాక ఇపుడు కొంతమంది వచ్చి మా విజయవాడలో ఎగ్జిబిషన్ పెట్టండి, కాకినాడలో పెట్టండి, వరంగల్ లో పెట్టండి అని అడుగుతున్నారు. నిజానికి ఈ ఖర్చులను భరించగలిగే స్తోమత నాకైతే లేదు, అందుకు ఎలా ఈ సమస్యను అధిగమించాలా అనే ఆలోచనలో ఉన్నాను. ఇక రెండో ప్రాజెక్టు, ఒక గ్రామాన్ని తీసుకుని ఆ గ్రామంలోని ముసలి అమ్మల్నీ, అమ్మమ్మల్నీ చిత్రాలుగా గీయాలని ఉంది. ఎందుకంటే నగరీకరణ ఊరిని కబ్జా చేసేస్తోంది. కావాలని మనమే కబ్జా చేసేస్తున్నాం. ఊరిలో ఈ ముసలీ తల్లీతండ్రుల తరం అంతరించి పోతే ఊరే అంతరించి పోతుంది. కాబట్టి ఊరిని మనం మాన్యుమెంట్ లా భద్ర పరచుకోవాలంటే, ఊరి జీవకళ ను పట్టుకోవాలంటే, ఆ జీవ కళకు ప్రతినిధులైన ఈ ముసలి వారిని డాక్యుమెంట్ చేయాలి.  రొట్టెమాకురేవు ని ఆ విధంగా తీసుకోవాలి అనే ఆలోచన ఉంది.
ఈ రెండు ప్రాజెక్ట్ లూ ఇంకా ఆలోచనల దశలోనే ఉన్నాయి. కార్యాచరణ ఎలా ఉండబోతుందో చూడాలి.

V: ఔత్సాహిక కళాకారులకు కవులకు మీరు ఏదైనా సూచనలాంటిది ఇస్తారనుకుంటాను..
-----------------------------------------------------------------------------------------------------------

S: నేను సందేశాలిచ్చేదేమీ లేదు గురూ! You only deserve what you can make yourself worthy of. నాకంటే నా కవిత్వం గొప్పదవ్వాలి. నాకంటే నా పెయింటింగ్ గొప్పదవ్వాలి అనే ఆలోచన పెంపొందించుకోవాలి. ఒక పోయం రాస్తే అది ప్రపంచానికి నచ్చేయాలి అనుకోకూడదు. నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. పొగడొచ్చు, తిట్టొచ్చు. కానీ నా పోయెట్రీతో అందర్నీ satisfy చేసెయ్యాలి అనుకోవటం మూర్ఖత్వం. Craftsmanship ని పెంపొందించుకోవాలి. నిరంతర విస్తృత అధ్యయనం కొనసాగుతునే ఉండాలి. క్రిటిసిజం లోకి ఎక్కువగా పోకుండా..కళ మీద ధ్యాస పెట్టాలి.

V: చివరిగా..ఒక ప్రశ్న. ఈ ఎక్జిబిషన్ ముగిసేసరికి మీ మీద మీకొచ్చిన అవగాహన ఏమిటి?.
-------------------------------------------------------------------------------------------------------

S: ఇంకా చాలా నేర్చుకోవాలి గురూ...! కొత్త కొత్త టెక్నిక్లను పట్టాలి. నేను బ్లాక్ పెన్సిల్ నీ, బ్లాక్ కలర్ నీ ఎక్కువగా ఉపయోగించలేదు. వీటిని ఎలా నా పెయింటింగ్స్లోకి తీసుకురావాలా అనేది అధ్యయనం చేయాలి. వైట్, కాంతిని రిఫ్లెక్ట్ చేస్తే.. బ్లాక్, కాంతిని పూర్తిగా గ్రహించేస్తుంది. అంటే అది ఒక శూన్యాన్ని పుట్టిస్తుంది. ఆ శూన్యాన్ని నా బొమ్మల్లో పట్టాలి. ఆ ఫైనర్ ఆస్పెక్ట్స్ లోని మెచ్యూరిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాను.

V: థ్యాంక్యూ సర్...మీ సమయానికి ధన్యవాదాలు. ఎన్నో విషయాల్ని ఈ సాయంత్రం నాతో చర్చించారు.
మీకు ఈ ఇంటర్వ్యూ బోర్ కలిగించలేదనుకుంటాను.
-----------------------------------------------------------------------------------------------------------------------------

S: లేదు లేదు. ఇట్స్ ఎ సడన్ సరప్రైస్ ఫర్ మీ. కానీ మంచి ఆయుధాలతోనే నా మీదకు దుమికావు గురూ..! (నవ్వులు)
నిజానికి ఏకాంతంలో నా ఆత్మ తో నేను సంభాషించుకున్నట్టుగా అనిపించింది. నీ ప్రశ్నలు, అపర్ణ సైలెంట్ అబ్సర్వేషన్ నన్ను నాతో గడిపేలా చేసింది.
కృతజ్ఞతలు. సరే లేటవుతుంది. బయలు దేరుదాం.

Friday, 9 September 2016

కవిత్వ సందర్భం 25 Afsar


ఈ తనిఖీలెందుకో...
...........................
"ఉన్న స్థితి"కీ "ఉండాలనుకున్న స్థితి"కీ ఎప్పటికీ ఘర్షణ జరుగుతూ ఉంటుందంటాడు జిడ్డు కృష్ణమూర్తి. మనిషి మనసులో తన మీద తనకు ఒక అవగాహన ఆత్మ గౌరవం అనేవి ఉన్నపుడు, అతని ఎదుటే ఆ అవగాహన ఆత్మ గౌరవం అనేవి శూన్య స్థాయికి నెట్టి వేయబడినపుడు తనకూ తన చుట్టూ ఉన్న లోకానికీ మధ్య ఒక స్పష్టమైన అగాధాన్ని అతడు కనుగొంటాడు. తను ఉన్న స్థితిలోనే అతడు తీవ్ర ఘర్షణకు లోనవుతాడు. అటువంటి పరిస్థితిలో తన లోపలి అంతరాత్మకూ బయటిలోకానికీ మధ్య ఒక చైతన్య స్రవంతి( stream of consciousness) ని సృష్టించుకుంటాడు కవి అఫ్సర్. ఈ అంతరాత్మ ఘోష మనసులో సాగుతూ నే ఉంటుంది. బయటకు ఎవరికీ వినిపించనిది. అది ఆత్మ శోక గీతం. తాను అనుభవించిన ఉద్వేగాన్ని తిరిగి ప్రశాంతతలో ఎపుడైనా గుర్తుకుతెచ్చుకున్నపుడు, ఒక కవితలాగా పరుచుకుంటుందా అనుభవం. ఆ కవితలో తనకూ తన చుట్టూ ఉన్న లోకానికీ మధ్య స్పష్టమైన ఖాలీని మరలా కనుగొంటాడు. అపుడు ఆలోచిస్తే ఈ అనుభవం తనదొక్కనిదే కాదు, తనలాంటి వారిదెందరిదో అని తనలోపలి చైతన్యాన్ని వారందరితో ఐక్యం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. తనలాగే తన వారందరి పేరు వెనుక ఒక అహ్మద్ అనో మహ్మద్ అనో, ఖాన్ అనో ఉంటుంది, కాబట్టి ఇది తన ఒక్కడి ఆత్మ శోక గీతం కాదు..ప్రతీ ముస్లీముదీ అని అంటాడు కవి అఫ్సర్.

సెప్టెంబరు పదొకొండు ట్విన్ టవర్ దాడుల తరువాత, "ఉగ్రవాదం మీద యుద్ధ"మనే ఒక అత్యవసర స్థితిలోకి అమెరికన్ సమాజం బలవంతంగా నెట్టివేయబడిందనుకోవాలి. "అంతా సవ్యంగా ఉంది, భయపడనవసరమే లేదు, రూల్స్ ని పాటించండి నిమ్మలంగా ఉండండి" అనేటటువంటి స్థితి, "ప్రజలందరూ రాబోయే విపత్తుకు సంసిద్ధులై ఉండండి" అని చెప్పినట్లుండే శాశ్వత అత్యవసరస్థితికి దారితీస్తుంది. అమెరికా రాజకీయాలకు ఇదే కావాలి కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిష్ట్రేషన్ (TSA) అమెరికా విమానాశ్రయాల్లో భద్రతను పెంచే దిశగా జాతి మత పరమైనటువంటి అంశాలను పరిగణలోనికి తీసుకుంది. ఒక వ్యక్తి ముస్లిం పేరుతో ఉన్నా, అతని వస్త్రధారణ ఇస్లాం మతాన్ని సూచించేదానిలా ఉన్నా, అతడి చర్మంలో మెలనిన్ ఒకింత ఎక్కువగా ఉన్నా అతడిని అనుమానపు దృక్కులతో చర్యలతో పరీక్షించటం మొదలయ్యింది (racial and religious profiling). అమెరికాలో సైతం ఈ ధోరణి ఎన్నో విమర్శలకు లోనయ్యింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ లిస్ట్ లో ఉన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా అమెరికాలో ఇటువంటి అవమానకర పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చినపుడు, సామాన్య పౌరుడి విషయం వేరే చెప్పనవసరం లేదు. ప్రతీ ముస్లీం ఉగ్రవాది కాడు అని చప్పే ప్రయత్నాల్లో "మై నేమ్ ఈజ్ ఖాన్" వంటి సినిమాలు కూడా వచ్చాయి. హ్యూమన్ డిగ్నిటీని ప్రశ్నార్థకంగా మార్చేలా సాగే ఈ అనుమానపు తనిఖీలు ముస్లిం సమాజాన్ని ఆ కొంత సేపు ప్రపంచాన్నుంచి వేరు చేస్తున్నపుడు తన లోపల ఉన్న స్థితికీ బయట తను ఉన్న స్థితికీ మధ్య సంఘర్షణను ఒక గీతంలా పాడుకుంటాడు కవి అఫ్సర్.

నిజానికి ఈ తనిఖీలు నిజమైన ఉగ్రవాదులను కనుక్కోలేక పోగా, కేవలం ఒక జాతి లేదా మతాన్నే అనుమానించటం వల్ల అసలైన ఉగ్రవాదులు కూడా తప్పించుకోగలిగే అవకాశం ఉంటుంది. ఉగ్రవాదులు తమకన్నా చాలా తెలివి తక్కువ వారు అనుకోవడమనే ధోరణికూడా ఈ ప్రొఫైలింగ్ లో దాగి ఉందన్నది సత్యం. బైసీయన్ స్టాటిస్టిక్స్ ని పరిగణలోనికి తీసుకున్నపుడు, ముస్లిములలో ఉగ్రవాదుల శాతం చాలా చాలా తక్కువ అనుకుంటే, నిజానికి తనిఖీ చేయబడే ముస్లిం అమాయకుడయ్యే అవకాశమే ఎక్కువ. కానీ మనం బేస్ రేట్ ఫాల్లసీ (Base rate fallacy) లోకి పడిపోతుంటాము. తనిఖీలో ఫాల్స్ పాజిటివ్ ఫలితాన్ని పరిగణలోనికి తీసుకునే విషయంలో తడబడతాము. తనిఖీ చేసే పోలీసు అధికారులు బేస్ రేట్ ఫాలసీలో పడిపోవటం వల్ల ముస్లిముల్లో అమాయకుల సంఖ్యే ఎక్కువ అనే సాధారణ విషయాన్ని మరచి, ఉగ్రవాదులు ముస్లిముల పేరుతో ఉన్నారనుకునే స్పెసిఫిక్ సమాచారానికి వారు దాసోహమనాల్సి వస్తుంది. సైంటిఫిక్ గా జరిగిన ఎన్నో సర్వేలు జాతి, మతాల ఆధారంగా జరిగే ఈ తనిఖీల వలన ఉగ్రవాదులను కనుగొనే అవకాశమే లేదని తేల్చి చెప్పాయి. సైకాలజీని ఆధారంగా చేసుకునే "బిహేవియరల్ ప్రొఫైలింగ్" కూడా పరిగణలోకి వచ్చింది. ఇవైనా కూడా ఈ తనిఖీల ఖచ్ఛితత్వం ఒక అవకాశానికి దగ్గరగా మాత్రమే ఉందని తేల్చి చెప్పేశాయి. ఒక బిహేవియరల్ పరీక్ష యొక్క పూర్తి ఖచ్చితత్వం శాతంగా నిర్ధారించారు. అంటే ఒక కాయిన్ ఎగిరి వేసి, పలానా వ్యక్తి టెర్రరిస్టా కాదా అని చెప్పడం వంటిదే ఇది తప్ప, అంతకు మించి ఇదేమంత గొప్పది కాదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చే ఆధారాలు ఈ విధంగా ఉన్నపుడు, అమెరికా చేసే ఈ జాతి, మత సంబంధమైన తనిఖీల నిజమైన ఆంతర్యం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం మతాన్ని బూచిగా చూపించే, అత్యహసర స్థితిని స్టేటస్ ఖో( STATUS QUO) లో ఉంచగలిగే ఒకానొక అమెరికా రాజకీయ కుయుక్తి తప్ప మరోటి కాదు. ఉగ్రవాదం పై యుద్ధం అమెరికా కొత్త ఆర్థిక విధానానికి ఒక సౌకర్యవంతమైన కొనసాగింపు కూడా.

లెనిన్ అన్నట్టు "చరిత్ర చాలా కఠినమైన నిర్ణయాధికారి. మనం ఈ క్షణాన్ని ఏదోలాగా గడవనిస్తే అది మనల్నెప్పుడూ క్షమించదు." అందుకే చరిత్ర మీద తిరగబడాలి తప్పదు. అందుకే ఈ కవిత ఇంటీరియర్ మోనోలాగ్ మాత్రమే కాదు. దానంతటకు అదే ఒక తిరుగుబాటు కూడా. ఈ అనుభవాన్ని ఎంత మంది ముస్లీము సోదరులు చెప్పడానికి ప్రయత్నించారో తెలియదు, కానీ కవి అఫ్సర్ ఆ భారాన్ని అతి సులువైన పదాల్లో మన మీద మోపేస్తారు. అర్థం చేసుకోవడం సహానుభూతి పొందటం మన బాధ్యతే.

నా పేరు
    Afsar Mohammed
-------------------------------------

నమ్మరా బాబూ నమ్మరా నన్ను ఈ పాస్పోర్టు సాక్షిగా ఇందులో వున్న నా అయిదారేళ్ల కిందటి నెరవని నా మీసాల నా తలవెంట్రుకల సాక్షిగా నమ్మరా, నేనేరా అది!

సరిహద్దులు లేవు లేవు నాకు అని రొమ్మిరుచుకుని అక్షరాలిరుచుకుని భాషలకతీతమే నేనని పలుకుల కులుకులన్నీ తీర్చుకుని నడుస్తూ పరిగెత్తుతూ వుంటా ఎయిర్ పోర్టుల గాజు అద్దాలు పగలవు నేనెంత ఘాట్టిగా కొండని ఢీ కొట్టినా.

నమ్మరా నన్ను నమ్మరా నా పేరు చివర మహమ్మదో అహమ్మదో షేకో సయ్యదో ఖానో వున్నా నేను మంచి బాలుణ్ణిరా. కాగితం తుపాకీని చూసినా మూర్ఛపోయే అమాయకుణ్ణిరా నమ్మరా నన్ను నమ్మరా.

భయపెట్టే నీ స్కాను కన్నుల గుండా నడిచెళ్లిన ప్రతిసారీ నా శల్యపరీక్ష లో సిగ్గుతో పది ముక్కలయి నా టికేటు మీద మూడు ఎస్సులు నా నిజాయితీనీ నా నీతినీ నా శీలాన్ని శంకించినా నమ్మరా నన్ను నమ్మరా

దేశాలు లేని వాణ్ణి రా
కన్న దేశమే తన్ని తరిమేసిన వాణ్ణిరా

తల్లీ తండ్రీ తాతా ముత్తాతా అందరికి అందరూ వున్నా
వొంటి మీది చొక్కా మాత్రమే మిగిలిన వాణ్ణిరా

నమ్మరా నన్ను నమ్మరా
నేనొట్టి ఆవారానిరా
నేనొట్టి పాగల్ గాణ్ణిరా

నిజమేరా
నన్ను చంపి పాతరేసినా
నా శవాన్ని ఎవ్వరూ మాదే మాదే అని పరిగెత్తుకు రారురా.

చచ్చి కూడా సాధిస్తాను రా
నమ్మరా నన్ను నమ్మరా

నా శవం కూడా నీకు మోయలేని భారం రా.

ఈ ఎయిర్పోర్టు దాటాక
ఎవరూ నా మొహం కూడా చూడరు రా.

నమ్మరా నన్ను నమ్మరా.

(ఇది ఎయిర్పోర్టులలో ప్రతి ముస్లిం పాడుకోవాల్సిన ఆత్మ శోక గీతం)
పవన్ మీటింగ్
...................
"పార్లమెంటును స్తంభింపజేయండి" అనేది ఒక పిలుపా?. పవన్ కల్యాణ్ స్టేజీ డ్రామాలో ఇదొక అద్భుత ఘట్టంగా నిన్న మనం చూశాం. ఇప్పటికే పార్లమెంటులో నలభై శాతం కాలాన్ని, దాన్ని సభ్యులు స్తంభింపజేయటం ద్వారా కోల్పోతున్నాం. ప్రజా సమస్యలని చర్చించాల్సిన సభ్యులు కొట్టుకుంటూ,బూతులు తిట్టుకుంటూ, స్లోగన్లూ ఇస్తూ, మైకులు విరిచేస్తూ చేస్తున్న భీభత్సాలని చూస్తున్నాం. చదువుకున్న సగటు భారత పౌరుడు పార్లమెంటు వ్యవహారాన్ని ఎంటర్ టైన్మెంటు ప్రోగ్రామ్ కంటే పెద్దగా ఉపయోగపడే విషయమేమీకాదని అనుకుంటున్నాడనటంలో సందేహం లేదు. ఇటువంటి సందర్భంలో కనీసం ఒక ఓటు కూడా సంపాదించుకోలేని పవన్ కల్యాన్ తనకు తాను సీమాంధ్ర ప్రజల రిప్రెసెంటేటివ్ ప్రకటించుకుని, పార్లమెంటును స్తంభింప జేయండి అని తెలుగు ఎం.పీ. లకు పిలుపునిస్తున్నాడు. ఇది అప్రజాస్వామికమన్న సెన్సుకూడా లేదు. ప్రత్యేక హోదా విషయం మీద పార్లమెంటులో ఇంకా సమర్థవంతంగా, సరయిన వ్యూహంతో పోరాడాలనే పిలుపు ఇవ్వాల్సింది పోయి, స్తంభింపజేయండి అని పిలుపునివ్వటం మరీ విడ్డూరం. స్తంభింపజేయటం ద్వారా, ఎన్నో ప్రజా సమస్యలను చర్చకు రానివ్వకుండా చేయండని పిలుపునివ్వటం ఏంటి?. ఈయన ఇపుడు దేశ భక్తుడంటే మనమంతా నమ్మాలి మరి.

ఒక పార్టీకి అధ్యక్షుడైనంత మాత్రాన, ఒక ప్రాంతం ప్రజలకంతా తానే రిప్రెజెంటేటివ్ అని ఎలా అనుకుంటున్నాడు. ఆ పార్టీ తరపున ఎలక్షన్లలో నిలబడాలి. గెలవాలి. అపుడు ఆ ప్రాంతానికి సంబంధించిన రిప్రెజెంటేటివ్ గా తనకు అర్హత వుంటుంది. కానీ పవన్ కల్యాణ్ ఇదేమీ లేకుండా తానే సీమాంధ్ర ప్రజల రిప్రెజెంటేటివ్ అని ప్రకటించుకున్నాడు. స్వయం ప్రకటిత రిప్రెజెంటేషన్ కి అంత వెయిటేజ్ ఉండదనే విషయం పాపం మరచిపోయాడు. ఎవరు చెప్పారాయనకు ఆయనే ఈ ప్రాంతానికి రిప్రెజెంటేటివ్ అని?. ఏ ఆధారంతో అలా ప్రకటించుకున్నాడు?. అర్థం కాని విషయాలు. ఆయనను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నదెవరు?. ఆయనంతాయనే ఒక పార్టీ ప్రకటించుకున్నాడు. దానిలో ఎవరరెవరున్నారు, ఎవరి రోల్ ఏంటిది ఎవరికీ ఏమీ తెలియదు. అంతా పిల్లలాటే.

ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనే ఊహ కూడా కనిపించటం లేదు. సొంత డబ్బా కొట్టుకోవడం లాంటివి పక్కకు పెడితే సగటు సీమాంధ్ర మనోగతాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇది సరిపోతుందా?. ఆయన చెప్పిన మూడంచెల కార్యాచరణ కూడా పేలవంగా ఉంది. క్లారిటీ లేదు. ఇపుడు ప్రతి జిల్లాలో మీటింగ్ లు పెట్టడం వల్ల ఒరిగేదేమిటి?. ప్రతీ సగటు సీమాంధ్ర పౌరుడు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కొత్తగా వారికి మీటింగ్ ల ద్వారా చెప్పేదేమిటి?. ఈ మీటింగ్లు అయిపోయే సరికి, ఎలక్షన్లే ఒచ్చేస్తాయి. మల్లీ రంగం మారుతుంది, ప్రాధాన్యాలు మారతాయి. బయటనుండి మద్దతిచ్చే పవన్ కల్యాణ్ ఏమి చేయగలుగుతాడు?. తాను కూడా ఎలక్షన్లలో నిలబడి కొన్ని సీట్లు కలిగిఉండటం వల్ల, ఇపుడు మద్దతు ఉపసంహరించటం ద్వారానో ఏదో విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసి ఉండేవాడు. కానీ బయటి మాటలకే పరిమితమైన పవన్ ఇపుడేమీ చేయలేడు. చంద్రబాబు ఇప్పటికే ప్రత్యేక హోదా తేవాలన్న దిశగా ప్రయత్నాలైతే చేస్తూనే ఉన్నాడు. ఆయన స్ట్రాటజికల్ గానే అడుగులు వేస్తున్నారు. ఇపుడు పవన్ ప్రసంగం వల్ల, ఇన్వాల్మెంటు ద్వారా కొత్తగా ఒరిగేదేమిటి?. దీన్నొక ప్రజా ఉద్యమం లా చేయాలనుకుంటే, అదేదో ఇపుడే చేయాలి. దానికి కార్యాచరణ ఏమిటి?. ముందు జిల్లాల్లో మీటింగ్ లు పెడితే, అది కూడా షూటింగ్ లు లేని ఖాలీ సమయాల్లో చేయాలి అంటే, పదమూడు జిల్లాలకు ఆవరేజిగా ఈ ప్రహసనం ముగిసే సరికి రెండు సంవత్సరాలే పడుతుంది.  ఇపుడొక బంద్ కి పవన్ పిలుపునిస్తే అది విజయవంతం కాగలుగుతుందా?. అంత ఫాలోయింగ్ పవన్ కి ఉందా?. అంతగా పవన్ ఇన్ప్లూయెన్స్ చేయగలిగితే బంద్ కి పిలిపివ్వటం ద్వారా తన సత్తా ఏంటో నిరూపించుకోవచ్చు. తద్వారా బలమైన సంకేతాలు పంపవచ్చు, కానీ పవన్ పైపై చర్యలకే పరిమితమైనట్టు కనిపిస్తోంది.

మొత్తానికి పవన్ ఇంతకు ముందు తప్పులే మల్లీ చేశాడు. కొత్త సీసాలో పాత సారాలాగే ఆయన వ్యవహారం సాగింది. ఆవేశం తప్ప ఆలోచన లేనట్టే అనిపించింది. చేతకాక ఇపుడున్న ప్రభుత్వం ప్రత్యేక హోదా తేలేకపోతున్నదనే అభిప్రాయం, తెలుగువారంటే ఉండే నిర్లక్షం వల్ల కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వటం లేదనే అభిప్రాయాన్నే పలు రకాలుగా చెప్పే ప్రయత్నం చేశాడు. మధ్య మధ్యలో సొంత డబ్బా చెబుతూ మొత్తానికి ఆయనేం చెప్పదలచుకున్నాడో ఎవరికీ అర్థం కాకుండా చెప్పి పోయాడు. అరుపులు, కేకలు స్పీచ్ కాదు అని ఇంకా తెలుసుకోకపోవటం వింతే. రెండు పడవల మీద స్వారీ అంత తేలికా కాదు. రాజకీయం రంగంలో ఉంటూ, సినిమాలు తీస్తూ రెంటికీ అన్యాయం చేస్తున్నాడు. దేనికో ఒకదానికి ఆయన పరిమితమౌతే ఈ పరిస్థితిలో మార్పు వచ్చి, ఇంకాస్త స్పష్టత రావొచ్చు.
గణేష్ నిమజ్జనం చెరువులలో చేస్తే ఏమౌతుంది?.
..........................................................
బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(BOD) అనేదొకటి ఉంటుంది. అదేంటో ఇపుడు తెలుసుకుందాం.  చెరువుల్లోని సూక్ష జీవులు నీటిలోని ఆక్సిజన్ ను తమ లో జరిగే రసాయన చర్యలకు ఉపయోగించుకుని శక్తిని పొందుతాయి.  అలాగే చెరువుల్లోని ఆల్గే, సైనోబ్యాక్టీరియా వంటివి ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. ఎపుడైతే చెరువులో సేంద్రియ పదార్థాలు ఎక్కువవుతాయో..సూక్మ జీవులు వాటిని గ్రహించి ఎక్కువ శక్తిని పొందటానికి ఎక్కువ ఆక్సిజన్ ను నీటినుండి గ్రహిస్తాయి. ఇలా జరగటం వల్ల నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి, ఆక్సిజన్ మీద ఆధారపడే నీటి జీవులైన చేపలు, కీటకాల జీవితం మీద ప్రభావం చూపి అవి నశించి పోయే ప్రమాదానికి దారి తీస్తాయి. అదే సమయంలో ఆక్సిజన్ లేని వాతావరణంలో బతికే ఎనరోబిక్ బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి, ఆక్సిజన్ మీద బతికే ఏరోబిక్ బ్యాక్టీరియాలు నశించిపోతుంటాయి. ఈ విధమైనటువంటి ఆక్సిజన్ డిమాండ్ నీటిలోకి సేంద్రియ పదార్థాలు (organic matter) విపరీతంగా వచ్చి చేరటం వల్ల సంభవిస్తూ ఉంటుంది. ఒక నీటి కుంటలోని బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ని మిల్లీ గ్రాములు పర్ లీటర్( mg/L) లలో కొలుస్తారు, స్వచ్ఛమైన నదీ జలాలలో 1mg/L గా ఉంటుంది. మామూలునదుల్లో 2 to 8 mg/L గా వుంటుంది. అదే మురుగు నీటి శుద్ధీకరణ జరిగిన తరువాత 20 mg/L గా ఉంటే, శుద్ధి చేయబడని మురుగు నీటిలో 600mg/L పై గా ఉంటుంది. మన హుసేన్ సాగర్ లో మామూలు సమయాల్లోనే 50 mg/L గా ఉంటుంది. అదే గణేష్ నిమజ్జనం జరిగాక అది 150mg/L కి పెరుగుతూ ౦టుంది. దీనివల్ల హుసేన్ సాగర్ లో ఉండే చేపలు కావచ్చు లేదా చుట్టూ ఉండే చిన్న చిన్న మొక్కలు కావొచ్చు, తీవ్రమైన ఆక్సిజన్ లేమితో చనిపోతూ ఉంటాయి. హుస్సేన్ సాగర్లో గాలిలోని ఆక్సిజన్ ను పీల్చే ముర్రెల్ (బత్తిని సోదరులు వాడేది), క్లైంబింగ్ పెర్చ్ వంటి చేపలు తప్ప, చాలా రకాల చేపలు పూర్తిగా నశించిపోయాయట.

ఇదే కాక, నీటిలో భార లోహాల (heavy metals) శాతం కూడా నిమజ్జనం తరువాత విపరీతంగా పెరుగుతుందట. ఉదాహరణకు ఇనుము పది శాతం పెరిగితే, కాపర్ మూడువందల శాతం పెరుగుతోందట. లెడ్, మెర్క్యూరీ వంటి లోహాలు కూడా నీటిలో పెరిగిపోతాయట. విగ్రహాలు తయారు చేసే కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్ (plaster of paris) చెరువు కింద భార లోహాలతో కలిసి గట్టి అవక్షేపం(sediment) లా ఏర్పడి వాటి కింద చిక్కుకున్న జల జీవులకు ప్రాణ హానిని కలిగిస్తుంటాయి. అవి పేరుకుపోయి, చెరువు లోతు తగ్గి పోవటానికి కారణమౌతాయి. హుసేన్ సాగర్లో లోతు తగ్గి పోయి, కొన్ని చోట్ల లోతు ముప్పై అడుగుల కంటే తక్కువగా ఉంటుందంటే ఈ అవక్షేపాలు ఎంతగా పెరిగి పోయాయో గ్రహించవచ్చు.

కూకట్పల్లి బాలానగర్ ప్రాంతాల్లో ఉండే మూడువందలకు పైగా ఫ్యాక్టరీలనుండి వచ్చే వ్యర్థాలు కూకట్ పల్లీ నాలా ద్వారా వచ్చి హుసేన్ సాగర్ లో కలుస్తుంటాయి. ఈ కాలుష్యమంతా ఈ పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలదే తప్ప, గణేశ్ నిమజ్జనం వలన కాదని కొందరి వాదనగా ఉంది. ఇందులో కొంత వాస్తవం ఉన్నా పూర్తిగా సమర్థనీయం కాదు. డొమెస్టిక్ వేస్టేజ్, ఇండస్ట్రియల్ ఎఫ్లూయంట్లూ వచ్చి చేరే హుసేన్ సాగర్ లో భగవంతుడిని నిమజ్జనం చేయడమేమిటి?. ముందే మురుగునీరు కలిసి ఉన్నాయని తెలిసీ, మనం పూజించిన దేవుడిని అదే మురుగులో వేయడం ఏమి ఆనందం?. పరిశ్రమలే చెరువుల్ని పాడు చేస్తున్నాయని తెలిసీ, అందులోనే నిమజ్జనం చేయటం అన్నది, మనవంతు కృషిగా పర్యావరణాన్ని నాశనం చేయటమే తప్ప మరొకటి కాదు. మనం పండుగను తప్పని సరిగా చేసుకోవాల్సిందే.."గణపతి మప్పా మోరియా" అని కేరింతలు కొట్టాల్సిందే, కానీ భవిష్యత్తులో మన పిల్లలు ఎటువంటి పర్యావరణ కాలుష్యంలోకి అడుగుపెడుతున్నారో ఆలోచించాలి. మన వేడుక రాబోవు తరాలకు శాపంగా మారకుండా చూసుకోవాలి. ఇపుడున్న శాస్త్ర సాంకేతికతను ఉపయోగించి మన వేడుకలను హుందాగా ఆరోగ్యవంతంగా మలచుకోలేనపుడు, మన సైన్సు చదువులు వ్యర్థమని గ్రహించాలి. విద్యను ప్రసాదించే గణేషుడిని మనం పరిశుద్ధంగా గౌరవించుకోవాలి.

గణేష్ చతుర్థి శుభాకాంక్షలతో..

Poltical satires

పదికాలాల పాటు పచ్చగా ఉండండని ఆశీర్వదించి పోయాడు.

ఆకు పచ్చనా..పసుప్పచ్చనా అర్థంగాక ఛస్తున్నా..
అసలే 'పచ్చ' అంటే అర్థాలే మారిపోయే రోజులివి!!
----------------------------------------------------

పద్రూపాయలిస్తే పావలా యాక్షన్ జేస్తే.. గది శీల్మా అన్నట్టు
పావలా ఇస్తే పద్రూపాయలాక్షన్ జేస్తే..గది రాజకీయమన్నట్టు..
గంతే భయ్...చింపుల్

ఈ రోజుల్లో పావలా ఏడున్నదని అడుగకుర్రి భయ్!!
---------------------------------------------------------

బ్రెజ్జా (BREZZA)అని స్పెల్లింగ్ ఇచ్చి, బ్రీజా (BREEZA) అని చదుకోమన్నట్టుందీ వ్యవహారం!!
------------------------------------------------------------------------------------------------

పరతీ ఏక పయాకేజీ...పరతీ ఏక హవోదా
.............. ....................................
ప్రత్యేక హోదా మీద ప్రత్యేకంగా ఏకుతాడని స్టేజీ ఎక్కించాం.

ప్రత్యేక ప్యాకేజీ పత్రాలని ప్రత్యేక ప్యాకేజీ చేశాం.

ఈ ఉద్యోగానికి హోదా ఉంటేనే వొస్తా..ప్యాకేజీ అంటే కుదరదు.

ప్రత్యేక హోదా ఇస్తాడంట, ప్యాకేజీ ఎంతిస్తారని అడుగుతున్నాడు

టీవీని స్విచ్ ఆఫ్ చేసి, పార్లమెంటును స్థంబింప జేశాడు.

స్టేటస్ ఉపయోగించి స్టే తెచ్చుకున్నవాడు, స్టేట్ కి స్పెషల్ స్టేటస్ తెచ్చుకోలేడా...?

స్టేటస్ తెచ్చుకోవడం స్టే తెచ్చుకున్నంత సులభం కాదు.

సింబాలిజం కి ఉదాహరణ -  నీరు, మట్టి ఇవ్వడం

సింబయాసిస్ కి ఉదాహరణ  - ప్యాకీజీ పుచ్చుకోండని ఒకరు, ప్యాకేజీ ఐతే పుచ్చుకోమని ఇంకొకరు కాలయాపన చేసి బతికెయ్యడం

పత్రికలకు, ఛానల్స్ లో హోదా గురించి ఊదరగొట్టడానికే సరిపోతుందట ఈ ప్యాకేజీ.

ప్రత్యెక హోదా అడగడానికి నీకున్న హోదా ఏంటి?
---------------------------------------------------------..--.--------......-.----

న్యూస్ ఛానల్స్ లో ప్రసారమయ్యే ఈ అతి పెద్ద డైలీ టీవీ సీరియల్ ఆగిపొయే ప్రసక్తే లేదా?.
రోజుకో మలుపు, ఉత్కంఠ భరిత సన్నివేశాలు, భీభత్సమైన 'ఫ్యామిలీ డ్రామా'
కథా నాయకుడి తొడగొట్టడాలు, ప్రతిపక్ష నాయకుడి (అంటే ప్రతినాయకుడ్నట్టు) పగబట్టడాలు
క్యారెక్టర్ నటుల జీవించేయడాలు, సడెన్ అప్పియరెన్స్ ఖామెడీ నటుల కేకలు, పెడబొబ్బలు
ఇంకా ఎంతకాలం సామీ...రిమోట్ తిప్పితే చాలు తలనొప్పి వొచ్చేలా వుంది.
ప్రతీ వాడూ ఏకితే గానీ 'ప్రత్యేకంగా' ఆగదా ఏంది ఈ సీరియల్..?
----------------------------------------------------------------------------------------

"స్పెషల్ స్టే" టస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న బాబు
-----------------------------------------.-------------
నిప్పుకు అగ్ని పరీక్ష అంటే భయమెందుకో...?
-------------------------.----------..----------

అనువుగాని చోట అధికులమనరాదు
కొంచముండుటెల్ల కొదువగాదు

చలిచీమల చేత చిక్కి చావదే సుమతీ

చెరపకురా చెడేవు

ఇటువంటివి బాగా వంటబట్టించుకుని ఉండింటే...మనవాల్లు బ్రీఫ్డ్ మీ అనాల్సి ఒచ్చేదే కాదనిపిస్తుంది.
----------------------------------------------------------------------------------------------

ఇంకా నయ్యం..., కృష్ణానదిని నిమజ్జనం చేద్దామనలేదు.