Thursday, 21 March 2024

పిల్లలపై పాండెమిక్ ప్రభావం....essay

  తెలంగాణ పత్రికలో అచ్చయిన నా వ్యాసం


*పిల్లలపై పాండెమిక్ ప్రభావం..*


❤ ఆనంద్‌ పన్నెండేళ్ళ పిల్లవాడు. ఎపుడూ అల్లరి చేస్తూ హుషారుగా ఉండేవాడు గత కొద్ది రోజులుగా మౌనంగా ఉండటం మొదలెట్టాడు. వాడికి లోపల ఏదో తెలియని బాధ. స్కూలు లేదు. ఆడుకోవడానికి ఫ్రెండ్స్‌ లేరు. టీవీల్లో కరోనా వార్తలు తప్ప మరో అంశమూ లేదు. కరోనా కాలంలో ఇంటి నుంచే పని చేసుకునే అతడి తండ్రి ఇరవై నాలుగ్గంటలూ వార్తలు వింటూనే ఉంటాడు. టీవీల్లో ''మృత్యు ఘంటికలు'', ''మరణ మృదంగం'' వంటి పదాలకు అర్థాలు చాలా భయంకరమైనవని వాడికి ఇపుడిపుడే తెలుస్తోంది. కొందరు తెల్లటి ముసుగుల్లాంటి దుస్తులలో తిరుగుతూ కనిపించే దృశ్యాలూ, బ్లర్‌ చేయబడిన శరీరాల్ని స్ట్రెచర్‌ మీద తీసుకెళ్తున్న దృశ్యాలూ, వారి చుట్టూ బోరున విలపిస్తున్న మరికొందరూ... వాటినన్నింటినీ చూస్తూ ''జీవితం భయంకరంగా తయారైంద''ని అమ్మతో అంటున్న నాన్న. భయమేస్తుందంటూ అందరికీ ఫోన్లు చేస్తూ ఇరవై నాలుగ్గంటలూ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఆందోళనలో అమ్మ. ఇంతలో బంధువులలో ఎవరో కరోనా బారిన పడి మరణించారనే వార్త తెలియగానే బోరున విలపిస్తున్న వాడి తల్లిదండ్రులు. తలుపులూ కిటికీలూ వేసుకుని భయం భయంగా బతికేస్తున్న తమ కుటుంబం. వాడికి ఇవేవీ అర్థం కావడం లేదు గానీ జీవితం మాత్రం ఏదో భయంకరమైన స్థితిలో ఉందని అర్థమౌతుంది. వాడికి రాత్రిపూట నిద్ర పట్టడంలేదు. భయంకరమైన కలలు వస్తున్నాయి. రోజురోజుకీ వాడిలో భయం మరింత పెరిగింది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. స్కూలూ ఆటలూ పాటలూ స్నేహితులూ ముచ్చట్లూ చాక్లెట్లూ అన్నీ దూరమైనాయి. వాడు అసలు ఇంట్లో ఉన్నాడనే స్పృహ లేదు ఎవరికీ. వాడి చిన్న హృదయం మీద కరోనా పాండెమిక్‌ సృష్టించిన భయోత్పాతం ఎంత పెద్దదో ఎవరూ ఊహించలేరు. తెలియకుండానే వాడు మౌనంగా రోదిస్తున్నాడు. ప్రతిరోజూ... ప్రతీ క్షణం... ఇంటి ముందు స్నేహితులతో ఆడుకునే స్థలాల్లో ఖాళీలను కిటికీల్లోంచి చూస్తూ ఖాళీగా నిలబడి పోతున్నాడు. ఇది ఒక్క ఆనంద్‌ కథ మాత్రమే కాదు, ప్రస్తుతం ప్రతీ ఇంటిలో ఉన్న చిన్న పిల్లల కథ. 


❤ కరోనా పాండమిక్‌లో ఉన్న ఏకైక మంచి అంశం ఏంటంటే అది పిల్లలలో పెద్దగా ప్రభావం చూపకపోవడమని చాలా మంది సంబర పడిపోతుంటారు. కానీ కరోనా పాండమిక్‌ అందరికంటే ఎక్కువగా పిల్లల మీదే ప్రభావం చూపుతోందని దాదాపు ఎవరూ గుర్తించడమే లేదు. ఐతే పిల్లల శరీరం మీద కాదు, మనసు మీద. మరణాలనీ, ఏడుపులనీ,భయానక విశేషణాలతో ఎక్స్క్లూజివ్‌ విజువల్స్‌ తో బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సహా మసాలా దట్టించి మరణ వార్తలను అమ్ముకుంటున్న వార్తా వ్యాపారాన్ని తెలిసో తెలీకుండో చూస్తూ మానసికంగా క్రుంగిపోతున్నారు పిల్లలు. ముఖ్యంగా లాక్డౌన్‌, ఆ తరువాత పరిణామాలు చాలా ఇళ్ళల్లో గృహహింస పెరగటానికి దోహదం చేస్తే ఆ తల్లిదండ్రుల గొడవల మధ్యన చిక్కుకుని నలిగి పోతున్నారు చిన్నారులు. ప్రపంచమంటే జీవితమంటే పూర్తిగా అవగాహనకు రాకముందే సమీప భవిష్యత్తు పట్లే పూర్తి అపనమ్మకాన్నీ అనిశ్చితినీ మూటగట్టుకుని బిత్తర చూపులు చూస్తున్నారు పిల్లలు. నిజానికి ఈ పాండమిక్‌లో అసలైన విక్టిమ్స్‌ పిల్లలే. ఎందుకంటే ఈ భయానక వాతావరణం వాళ్ళలో కోలుకోలేని మానసిక ఒత్తిడిని కలిగించబోతోందేమోననే స్పృహ చైల్డ్‌ సైకాలజిస్ట్‌ లలో వ్యక్తమౌతోంది. ఇంట్లో తాతయ్య నానమ్మలు అనారోగ్యం పాలైతే, ఇంతకాలం వారితో కథలు చెప్పించుకుని ఆడుకునే పిల్లలు మరింత కృంగిపోతున్నారు. ఇక ఆ పెద్దవాళ్ళే కరోనాతో మరణిస్తే, కనీసం వాళ్ళ చివరి చూపుకూడా నోచుకోని పిల్లలు ఎంతటి క్షోభను అనుభవిస్తారో అర్థం చేసుకోవచ్చు. తల్లో లేక తండ్రో home quarentine లో రెండు మూడు నాలుగు వారాలు పిల్లలకు దూరంగా ఉండటం కూడా వారిని కృంగదీస్తుంది. 


❤ కరోనా కాలంలో లోకం గురించి కొంత ఆలోచించగలిగే వయసుగల ఆనంద్‌ లాంటి పిల్లలలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటే, మూడు నుంచి ఆరేళ్ళలోపు పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఈ వయసు పిల్లలు తమ భావాలను చెప్పలేరు. కాబట్టి తమ ప్రవర్తనలో దాన్ని ఏదో రూపంలో చూపుతుంటారు. బాగా హఠం చేస్తుంటారు. ఇర్రిటబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సరిగా నిద్రపోరు. పిల్లల ఈ ప్రవర్తనకు కారణం అర్థం చేసుకోక వారిలో అల్లరి ఎక్కువైందని, మొండితనం ఎక్కువైందనీ వారిని మరింత హింసకు గురి చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. బాలల మీద హింస అలా తెలియకుండానే పెరిగిపోతోంది. ''ఇంట్లో పిల్లల అల్లరి భరించలేకపోతున్నాం, ఈ స్కూళ్ళు ఎపుడు తెరుస్తారో ఏమో'' అంటూ వారిని మరింత బెదిరించే వాళ్ళే ఎక్కువ. నిజంగా స్కూళ్ళు తెరవనందుకు పేరెంట్స్‌కి కలిగే మానసిక ఒత్తిడికంటే కంటే పిల్లలలో కలిగే మానసిక ఒత్తిడే ఎక్కువ. చాలామంది పిల్లలకు గృహ హింసను తప్పించుకోవడానికి స్కూలు ఒక మంచి ప్రదేశం. కానీ ఈ రోజు తప్పనిసరై గృహహింసకు లోనౌతున్నారు.


❤ కరోనా పాండెమిక్‌ సమయంలో టీవీల ముందు వార్తలతో గడపడం కంటే పిలల్లతో గడపడం చాలా అవసరం. వారి సైకలాజికల్‌ స్ట్రెస్‌ను మొదటి దశలోనే గుర్తించి తగ్గించగలగడం అవసరం. ఎవరైనా చిన్నపిల్లలు కరోనా గురించి ప్రశ్నలు వేయడం మొదలెట్టా రంటేనే వారిలో దానికి సంబంధించిన స్ట్రెస్‌ మొదలైందని అర్థం చేసుకోవాలి. వారిని ఇక ఆ వాతావరణం నుంచి దూరం చేయగలగాలి. నిద్రలేమినీ, ఆకలి తగ్గడాన్నీ, కోపమూ, మొండితనం పెరగడాన్నీ అంతటినీ ''అల్లరి'' కింద జమకట్టకూడదు. ఆన్లైన్‌ క్లాసులు నిజంగా వారిని కరోనా సంబంధిత సమాచారం నుంచి దూరంగా ఉంచగలిగి వారిని వాళ్ళ రొటీన్‌ జీవన శైలిలోకి తీసుకుపోగలుగుతున్నాయా లేక అప్పటికే భయం గుప్పిట్లోకి పోయిన పిల్లవాణ్ణి మరింత భయపెడుతున్నాయా అన్నది తల్లిదండ్రులే గమనించుకోవాలి. విపరీతమైన స్ట్రెస్‌లో ఉన్న పిల్లలు ఆన్లైన్‌ క్లాసులలో సరిగా శ్రద్ధ చూపలేరు. చదవలేరు. అందుకని వాళ్ళని మరింత నిందిస్తూ చదువులో వెనకబడిపోతారేమోననే ఆందోళనతో చదవాల్సిందేనని మరింత బలపెడుతూ ఉంటారు. ఇత్యాదివి ప్రమాదకరం. వాళ్ళ ఆకలి నిద్ర వంటి వాటిమీద పూర్తి ధ్యాస ఉంచాలి. ఆటలు లేకపోతే పిల్లలకు శారీరక శ్రమ ఉండదు. మానసికోల్లాసమూ ఉండదు. పిల్లలకు ఆటల వాతావరణాన్ని తల్లిదండ్రులే ఇంట్లో కలిగించగలగాలి. టీవీ వార్తలూ, ఆన్లైన్‌ క్లాసులూ వారిని ఆనంద పరుస్తున్నాయా లేక బెంబేలెత్తిస్తున్నాయా? అనేది తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు తప్ప మరెవరికీ సాధ్యం కాదు. తల్లి లేక తండ్రిలో ఏ ఒక్కరు home isolationలో ఉన్నా మరొకరు ఆ పిల్లలకు మరింత ధైర్యాన్ని ఇవ్వగలగాలి. సింగిల్‌ పేరెంట్‌ పిల్లలుంటే ఆ పేరెంట్‌ క్వారంటైన్‌లో ఉంటే ఆ సమయంలో ఆ పిల్లలకు ధైర్యం చెప్పవలసిన బాధ్యత ఆ పేరెంట్‌ మీదే ఉంటుంది. అటువంటి పేరెంట్‌ ఉంటే ఆమె లేదా అతడి బంధువులు వారికి మోరల్‌ సపోర్ట్‌ ఇవ్వగలగాలి.


❤ కరోనా పాండెమిక్‌ ఈ రోజు కాకుంటే రేపు తగ్గిపోవచ్చు. కానీ ప్రస్తుతం ఈ ప్రపంచం పట్ల పిల్లలలో అది కలిగించిన దృక్పథం మాత్రం వాళ్ళ జీవితాంతం వేటాడబోతోందనిపిస్తోంది. ముఖ్యంగా తమ పక్కన ఓ లోకం తెలియని పసి బాలుడూ, ఇపుడిపుడే లోకాన్ని ఆసక్తిగా తిలకించాలని ఉబలాటపడే పసిబాలుడూ ఉన్నాడనే స్పృహ కూడా లేకుండా ఇళ్ళల్లో నిరంతరం కరోనా వార్తలతో చావు కబుర్లతో నింపేయడం నిజంగా వాళ్ళలో జీవనేచ్ఛను చంపేయడమే. మాస్కులు ఉపయోగించే విషయంలో ఫిజికల్‌ డిస్టాన్సింగ్‌ని పాటించే విషయంలో నిర్లక్ష్య వైఖరి ఉండేవాళ్ళు తమ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదమౌతుంది. భవిష్యత్తు పట్ల సుందరమైన కలలు కనడం, భవ్య జీవితాన్ని మహాద్భుతంగా ఊహించడం బాలల హక్కు. చోటా భీం, స్పైడర్‌ మ్యాన్‌, హారీపోటర్లతో కూడిన అద్భుత రసానుభూతి వారి ఆటల్లో మాటల్లో పొంగి పొరలాల్సిన వయసులో భీభత్స భయానక కరుణ రసాలు నిండిపోతున్నాయి. మన ముందు తరాల వారు కూడా మనకంటే పెద్ద విపత్తులనే తమ జీవితాల్లో ఎదుర్కొన్నారు. ఐనా గానీ మనకేనాడూ భయానక భవిష్యత్తును కలగనమని వాళ్ళు చెప్పి పోలేదు. వాళ్ళెంత క్షోభను అనుభవించినా మనకు మాత్రం ఓ సుందరమైన కలలు గనగల జీవితాన్నే ప్రసాదించారు. మనం మాత్రం బాధ్యతా రాహిత్యంతో పిల్లల కలల్ని చిదిమేస్తున్నాం. వారి బాల్యాన్ని వారికి కాకుండా చేస్తున్నాం. సమాచార విప్లవమంటూ వారి జీవితాలను నిరంతరం మృత్యు వార్తలతో, అది కూడా మరిన్ని భాషా విశేషణాలతో, భీతిగొలిపే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సహా నింపేస్తున్నాం.


❤ పిల్లలు తడిచిన సిమెంట్‌ లాంటివారు. ఎవరు ఏ గుర్తు పొరపాటుగా వేసినా తరువాతి కాలంలో అది శాశ్వత ముద్రగా మిగిలిపోతుంది. మెదడులో ఎమోషనల్‌ సెంటర్‌ అమిగ్దలాకు రేషనల్‌ సెంటర్‌ ఫ్రాంటల్‌ కార్టెక్సుకూ మధ్య సంబంధం మన పెద్దలలో అభివృద్ధి చెందినంతగా పిల్లలలో అభివృద్ధి చెంది ఉండదు. వారి ఎమోషన్‌ కి అందుకే ఏ రేషనాలిటీ ఉండదు. వారి కంటే ముందు తరం వారిమిగా వారి ఎమోషనల్‌ సపోర్టర్లుగా రేషనల్‌ డవలపర్స్‌గా మనం మారలేకపోతే రాబోయే తరానికి కరోనాకంటే మన తరమే పెద్ద శాపంలా పరిణమిస్తుంది. కరోనాను దానిచుట్టూ అల్లుకున్న భయాన్నీ తొలగించి ముందు తరాలవారికి మంచి జీవితాన్ని అందించడం మన తరం బాధ్యత. ఇది గుర్తించక తప్పదు. "ఒక సమాజం పిల్లలను చూసుకునే విధానంలోనే దాని ఆత్మ బహిర్గతమౌతుందని" నెల్సన్‌ మండేలా అంటారు. మనం మన సమాజాత్మను కాపాడుకోక తప్పదు.


❤ చాలామంది కరోనా పాండమిక్‌ వంటివి చూసి ప్రపంచం అంతమైపోతోందని మాట్లాడు తుండటం చూస్తుంటాం. కానీ కరోనా వైరస్‌ పిల్లల జోలికి పోకపోవడంతో ఈ ప్రకృతి మానవాళి మీద ఇంకా ప్రేమను కోల్పోలేదని అర్థమౌతుంది.


- డా|| విరించి విరివింటి,

ఎంబిబిఎస్‌, 

క్లినికల్‌ కార్డియాక్‌ ఫిజీషియన్‌

drvirinchi@gmail.com


Nava Telangana - Sopathi, 9-8-2020

Saturday, 16 March 2024

Perelman's logic. Essay

 "ఒక గొప్ప పనిని చేయాలంటే మనసు స్వచ్ఛంగా ఉండాలి. అపుడు నీవు మాథమేటిక్స్ గురించి ఆలోచించినది మాత్రమే అసలైన ఆలోచన. మిగిలినదంతా మనిషి బలహీనత. ఒక ప్రైజ్ ని ఒప్పుకున్నావంటే నీ బలహీనతను నీవు వ్యక్తపరుచుకోవడమే".


                 ఇది Perelman's logic.


ఒక చిన్న పని చేసి తాము మాత్రమే చేస్తున్నట్టు తమ కాంట్రిబ్యూషన్ చాలా గొప్పదైనట్టు ఒకటికి పదిసార్లు చెప్పుకుంటూ తమను తాము సెల్ఫ్ ప్రమోట్ చేసుకునేవాళ్ళను తరచు చూస్తూనే ఉంటాం. ప్రపంచంలో వీళ్ళంతా ఒకవైపు ఉంటారు. గుర్తింపు కోసం పాకులాట , identity crisis, అవార్డులకోసం దేబిరింపులతో, వార్తలలోని వ్యక్తులుగా ప్రముఖులుగా ఉండాలని తాపత్రయ పడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఒకవైపు ఉంటే, మరోవైపు వీటికన్నింటికీ దూరంగా మౌనంగా తమ పనేదో తాము చేసుకుంటూ పోవడమే కాక అన్ని పటోటాపాలకు దూరంగా ప్రశాంతంగా తమదైన జీవితాలనునిండుగా జీవించేవారూ ఉంటారు. అటువంటి అరుదైన వ్యక్తి రష్యన్ మాథెమెటీషియన్ గ్రిగోరి పెర్ల్మన్. 


గణితశాస్త్రంలోని జియోమెట్రిలో మహామహులైన గణితశాస్త్రజ్ఞులంతా జుట్టు పీక్కుంటున్న అంశం  poincare conjecture అనే సమస్యను ఇతడు పరిష్కరించాడు. 2002 -2003 కాలంలో అతడు ఆన్లైన్ లో రాసిన పేపర్లు గణితశాస్త్రంలో వణుకు పుట్టించాయి. గణిత శాస్త్రవేత్తలను అబ్బురపరచాయి. వారంతా గణిత శాస్త్రం లో ఇదొక విప్లవాత్మకమైన అంశంగా పేర్కొన్నారు. అతడి ఆన్లైన్ పేపర్లు ఏమిటీ కుర్రాడు ?. ఎలా సాధ్యం ఇతనికి!?. అని ముక్కున వేలేసుకునేలా చేశాయి.  ఇంటర్నెట్ ని  కేవలం మంచికి మాత్రమే, జ్జాన విస్తృతికి మాత్రమే  ఉపయోగించే ఇటువంటి వారు ఇపుడెందరున్నారు?. 


అతడేమీ తన పరిశోధనలను గణితశాస్త్ర జర్నల్స్ లో కూడా పబ్లిష్ చేయలేదు. కానీ ఈ సమస్యపై పని చేస్తున్నప్రపంచ వ్యప్త గణితశాస్రజ్ఞులు మాత్రం ఈ ఆన్లైన్ పేపర్లను చూసి అబ్బురపడ్డారు.  ఈ అంశంపై అతడు కనబరిచిన నేర్పుకు గుర్తుగా గణితంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే Fields Medal ని ఇతడికిద్దామనుకున్నారు. అతడు తిరస్కరించాడు. గణితశాస్త్రంలో Millemium prize problem అన తగ్గ ఈ Poincare conjucture సమస్యను పరిష్కరిస్తే మిలియన్ డాలర్లు ఇస్తామని ప్రకటించిన Clay Mathematics Institute కూడా ఇతడి గణితశాస్త్ర శక్తిని గుర్తించి మిలియన్ డాలర్లు బహూకరిస్తామని ముందుకు వస్తే దానినీ తిరస్కరించాడు. అతడు సాధించిన ఘనతను చూసి అమెరికా యూనివర్సిటీ లు గెస్ట్ లెక్చర్ ఇవ్వమంటే వెళ్ళాడు. ఆ టూర్ లో ఒక అమెరికన్ జర్నలిస్టు ఏ ప్రశ్న అడిగాడో తెలుసా?. మీ గోళ్ళు అంత పెద్దగా ఉన్నాయెందుకు ఆని?. ఎవరిని ఏ ప్రశ్నలడగాలో తెలియని పత్రికా జర్నలిస్టులు, సెన్షేషనలిజం ని మాత్రమే కోరుకునే ప్రజలు. వీరినుండి ఇంకేమి ఆశించేది లేదని అతడు రష్యాకు వెళ్ళిపోయాడు.


అతడు introvert అని అందరూ అనుకున్నారు. కానీ కొంతమంది పేరుకోసం పాకులాడే చీనీ గణితజ్ఞులను చూసి అతడు విసుగుచెందాడు. ఒక తనకు తానుగా ఉండాలనుకునే వ్యక్తి. ఈ ప్రైజ్ లకూ, వీటి ఝంఝాటాలకూ దూరంగా ఉండాలనుకునే వ్యక్తి. పేరునీ డబ్బునీ తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి. చాలా సాధారణమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడే వ్యక్తి. "నేను గణితాన్ని గణితంకోసం మాత్రమే చేస్తాను. అంతేతప్ప ఏదో గుర్తింపుకోసమో లేక డబ్బుకోసమో కాదు " అనేస్తాడు. శాస్త్రం విషయంలో కాంపిటీషన్ , వ్యక్తిగత గుర్తింపుకోసం పాకులాట వంటి కల్చర్ కి తాను దూరంగా ఉండేందుకు ఇష్టపడుతాడు. గణిత శాస్త్రమే కానీ మరే శాస్త్రమే కానీ ఒకరితో ఒకరు సహకరించుకోవడం వల్లనే తప్ప ఒకరు నిర్మించిన పునాదు‌లపై మరొకరు నిర్మించబడం జరుగుతుందే తప్ప ఒక వ్యక్తే అంతా చేసేసాడనుకునే వ్యక్తి పూజలకు, intellectul dishonesty లకు అతడు దూరంగా జరిగాడు. 


ఇపుడతడు రష్యాలో తన తల్లితో ఒక అపార్ట్మెంట్ లో సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అతడు ప్రపంచానికి కూడా పెద్దగా కనబడడు. ఒకరిద్దరు జర్నలిస్టులకు అతడిచ్చిన ఇంటర్వూలు తప్ప అతడి గురించి మనకు పెద్దగా తెలిసే అవకాశం కూడా లేదు. ప్రపంచంలో చిన్న పనిచేసి తమ ప్రాపకంవలననే అనుకునే పేలపిండి కృష్ణార్పణమనుకునే లోతులేని మనుషులు ఒకవైపుంటే అంతా తామే చేసి కూడా తాము నిమిత్తమాత్రులమని సాధారణంగా జీవించే మహనీయులూ ఉన్నారు. నిజమైన గురువులంటే వీరే. నిశ్శబ్దంగా తమపని  తాము చేసుకుంటూ పోతుండేవారే.! 


Happy π day💐💐🎂

March 14th 2023.


విరించి విరివింటి

నిద్ర విషయంలో నిద్రలేవండి. Essay

 నిద్ర విషయంలో నిద్రలేవండి


కాలమనేదే డబ్బుగా,పనియే దైవంగా మారిన ప్రపంచంలో ప్రతీక్షణం అందిపుచ్చుకోవాలనీ పనిచేయకపోవడం మహాపాపమనీ భావింపబడుతున్న తరుణంలో ఏ పనినీ చేయనీయని, ఏ ఉత్పాదకతా కలుగనీయని మమూడొంతుల జీవితంలో ఒకవంతుపైగా ఆక్రమించే ఒక పనికిరాని చర్యగా నిద్రను పరిగణించే దశలో మనం నిద్రగురించి మాట్లాడుకుంటున్నాం.

అసాధారణంగా వేగవంతమైన జీవితంలో పెద్ద పెద్ద జీవితలక్ష్యాలు అందుకోవాలని మనిషి పరుగులిడే ఈ కాలంలో నిద్ర అంత ముఖ్యమన విషయంగా కనబడకపోవడం సర్వసాధారణం ఐపోయిందన్నది వాస్తవం. పగలు రాత్రి అని ఒక రోజును రెండు భాగాలుగా అనుభవించిన జీవజాతులతో పాటు పరిణామం చెందుతూ వచ్చిన మానవుడు అకస్మాత్తుగా రాత్రి ఆనేదే లేని థామస్ అల్వా ఎడిసన్ అనంతర (post Edison era) యుగంలోకి అడుగుపెట్టి నిద్ర యొక్క అవసరం ఏంటని ఈరోజు ప్రశ్నించుకుంటున్నాడు. అభివృద్ధి అనబడే పరుగుపందెంలో దూసుకుపోతున్న సమాజాలకు నిద్ర ఒక పనికిరాని అనవసరమైన అడ్డుగోడగా, జీవితోన్నత శిఖరారోహణకు ప్రధానమైన శత్రువుగా కనిపించడం మొదలైంది.  కాసేపు కళ్ళు మూసుకుని పడుకోవడం సోమరితనంగా పరిగణించబడుతోంది. 

అందుకే మానవుడిని అలసట అనేది ఎరుగని యంత్రంగా, అతడి ఆత్మస్థైర్యంతో, కాఫీవంటి నిర్నిద్ర పానీయాలతో నిద్రని శాశ్వతంగా దూరంపెట్టగలడనే కొత్త భావాలు ఉబికివస్తున్నాయి. ఈ వింత పోకడలను వాటినుండి మానవ సమాజం ఎదుర్కోబోయే పెను ప్రమాదాలను గమనించిన సైంటిఫిక్ సమాజం "నిద్రవిషయంలో నిద్రలేవండి" అనే అలారం మోగించాల్సిన సమయం వచ్చింది. ప్రపంచంలో ఈరోజు నిద్రలేమి అన్నది కేవలం జబ్బు మాత్రమే కాదు. ఒక నూతన సామాజిక అలవాటు. ఈ రెంటినీ వేరు చేసి చూడటం అవసరం. అభివృద్ధి చెందిన దేశాలలో ముప్పైశాతం మంది నిద్రలేమితో బాధపడంతున్నారని WHO లెక్కలు చెబుతున్నా మొత్తానికి చూసుకుంటే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నిద్రలేమితో బాధపడేవాడు తనకు నిద్రకావాలని కోరుకుంటాడు. కానీ నిద్ర అనవసరం అనుకునే ధోరణి పెరిగిన సందర్భంలో మొత్తానికి నిద్రలేనివారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. ఒకవైపు మారుతున్న సామాజిక పరిస్థితుల కారణంగా పెరుగుతున్న శారీరక మానసిక సమస్య వలన నిద్రలేమి insomnia కలుగుతుండగా మరోవైపు గ్లోబలైజేషన్ లో భాగంగా తమ పనులు పూర్తి చేసుకోవడం కోసం రాత్రంతా డ్యూటీలు చేస్తూ నిద్రను బలవంతంగా అణుచుకుంటూ సొంతగా నిద్రలేమిని కోరుకుని తెచ్చుకుంటున్న తరమే ఏర్పడింది. ఐతే కారణం ఏదైనా నిద్రలేమి అనేక దీర్ఘకాలిక జబ్బులకు కారణమౌతోందని నూతన పరిశోధనలు చెబుతున్నాయి.


జీవులసలు ఎందుకు నిద్రపోవాలి. భూమి మీద జీవం మొదలైనప్పటినుండి పగలు రాత్రి ఉన్నట్లే నిద్ర మెలకువలు ఉన్నాయి. క్షీరదాల్లో సరీసృపాల్లో పక్షులలో ఉభయచరాల్లో నిద్ర స్పష్టంగా కనిపిస్తుంది.  చేపల్లో కనురెప్పలు లేకున్నా అవి నిద్రలాంటి విశ్రాంతిని తీసుకుంటాయని తెలుస్తోంది. డాల్ఫిన్లు మెదడులోని ఒక భాగాన్ని నిద్రపుచ్చి మరో భాగంతో అలెర్ట్ గా ఉండగలిగిన వింతైన జీవులు. పురాతన కాలం నుండి మనిషి నిద్రపై వివిధ వర్ణనలు ఆలోచనలు పరిశీలనలూ చేస్తూనే ఉన్నాడు.  గ్రీకులు hypnos దేవతను కొలిచారు. ఈజిప్షియన్లు నిద్రలో మనిషి పరలోకానకి వెళ్తాడని భావించి నిద్రలో మరణానికి జారుకోకుండా ప్రార్థనలు చేసేవారు. మెసపటోమియన్లు నిద్రను ఇహ పరలోకాలకు వారధిగా తలిచి దేవుళ్ళు కలల ద్వారా మాట్లాడతారని నమ్మారు. నిద్ర మెలకువలను 

యిన్ -యాంగ్ లుగా భావించి ఇవి రెండూ తటస్థంగా ఉండాలని చైనీయులు అనుకున్నారు. భారతదేశంలో   పూర్తి స్పృహతో నిద్రపోవడాన్ని యోగనిద్రగా అభివర్ణించారు. ఆయుర్వేదంలో ఆహా‌ర విహారాదులతోపాటు నిద్రకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఐతే ఇరవైయవ శతాబ్దంలో నిదురను మొదటిసారి శాస్త్రీయంగా అవగాహన చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. నిద్ర-మెలకువ చక్రం (sleep awake cycle) యొక్క పనితీరు అర్థమవడం మొదలైంది. తర్వాత టెక్నాలజీ పెరిగేకొద్దీ మెదడు ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్, పాలీసోమ్నోగ్రఫీ వంటివి అందుబాటులోకి రావడంతో నిదురను మరింత శాస్త్రీయంగా లోతుగా అధ్యయనం చేయడం సాధ్యపడింది. నిదుర గురించి అర్థమయ్యే కొద్దీ మానవజీవితంలో నిద్ర అనేది మనమనుకున్న దానికంటే ఎక్కువ ప్రాధాన్యత కలదని అర్థమవడం మొదలైంది. నిద్రలేమి మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం, కాన్సర్ వంటి భయంకరమైన దీర్ఘకాలిక రోగాలకు కారణమని అర్థమైంది. కొన్ని మానసిక జబ్బులకు లక్షణంగా మాత్రమే కాకుండా కొన్ని మానసిక జబ్బులకు కారణం కూడా నిద్రలేమి అనేది పరిణమించింది. జన్యువులలోనుండి నిదురకు సమాధానాలు దొరుకుతాయా అనే పరిశోధనా మొదలైంది. డిఎన్ఏను కనుక్కున్న వారిలో ఒకరైన క్రిక్ నిదురలోని రహస్యాలను డిఎన్ఏలో కనుక్కోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. అరుదైన జన్యు వ్యాధిగా progressive insomnia అనే జబ్బు ఒకటుందని అర్థమైంది. ఈ జబ్బు మధ్యవయసు వారిలో కనబడుతుంది. ఈ జబ్బు ఉన్న పేషంట్లకు నిద్ర రావడం పూర్తిగా ఆగిపోతుంది. పూర్తినిద్రలేమితో వీళ్ళు శల్యమై  ఒకటి రెండు సంవత్సరాలలో మరణిస్తారు. అంటే నిద్రలేమి మరణానికి కూడా కారణమౌతుంది. అందుకే ఇంత ప్రాముఖ్యత కలిగిన నిద్రను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం అయింది. 1950 లో REM stage sleep అనేది ఒకటుంటుందని తెలుసుకున్నాక నిదురను మరింత అర్థం చేసుకోవడం మొదలైంది.


మానవ వైజ్ఞానిక వికాసంలో నిదురది కూడా కీలకమైన పాత్ర. నిద్ర అనేదే లేకపోతే మనిషి మెదడు ఇంతగా వికసించేది కాదు. అసీమిత తారాగగనాలను సముద్రలోతులనూ సృష్టి రహస్యాలనూ అసలు ఛేదించేదే కాదు. కోట్ల సంవత్సరాలుగా పరిణామంలో నిదురను నిలుపుకుంటూ వచ్చాడే తప్ప నిదుర అనే ప్రక్రియ అంతరించిపోలేదంటే నిదుర మనకు తెలియని ఏదో అత్యంత అవసరమైన పని చేస్తోందని అర్థం. నిదురలో మనషి మెదడు అభివృద్ధి చెందుతుంది. మన నిదురలో NREM దశ(75-80min) REM(10-15min) దశ లని రెండు దశలుగా ఉంటాయి. ఈ రెండు కలిస్తేనే తొంభై నిమిషాల నిడివి గల ఒక సైకిల్ పూ‌ర్తవుతుంది. వీటికనుగుణంగా మెదడు తరంగాలను కొలవవచ్చు. మనం మెలకువతో ఉన్నపుడు బీటా తరంగాలు ఉంటాయి. నిదురకు ఉపక్రమించి కాసేపు రిలాక్స్ కాగానే ఆల్ఫా తరంగాలు మొదలవుతాయి. అపుడు మగతనిద్ర అనబడే stage 1 నిద్ర మొదలౌతుంది. ఈ దశలో తీటా తరంగాలుంటాయి. ఇది ఒక ఐదు నిమిషాలుంటుంది. ఆ తర్వాత stage 2 లో sleep spindles లేదా k complexes అనబడే తరంగాలుంటాయి. ఇది చాలా ముఖ్యమైన దశ. ఇది పదినిమిషాలుంటుంది. ఆ తర్వాత ఐదునిమిషాల కంటే తక్కువగాstage 3 దశలో డెల్టా తరంగాలుంటాయి.అప్పుడు  stage 4 తీటాతరంగాలతో గాఢనిద్రలోకి మనిషి జారుకుంటాడు. ఇది దాదాపు 45 నిమిషాలుంటుంది. ఆ తర్వాత మళ్ళీ రివర్స్లో 10 నిముషాలు స్టేజి3 దశకు చేరుకుంటాడు. అపుడు ఆల్ఫా బీటా తీటా తరంగాలతో కలగలిసిన REM stage ఉంటుంది. Rapid eye movement దశ. ఈ దశలో మనం గమనిస్తే మనిషితన కను గుడ్లను కదుపుతూ ఉంటాడు. ఈ దశలోనే మనిషి కలలనూ కంటాడు. ఇలా ఒక NREM , REM దశలు కలిస్తే ఒక సైకిల్. ఒక రాత్రిలో 5 నుండి 6 సైకిల్స్ జరుగుతుంటాయి.


ఐతే  మనిషి శరీరంలో NREM దశ ఒకపని చేస్తే REM మరో పని చేస్తుంది. NREM  దశలో శరీరం తన శక్తిని భద్రపరుచుకుంటుంది. మెదడులోని వివిధ న్యూరానుల మధ్య చలనాలు ఆగి ప్రశాంతత లభిస్తుంది. అంటే కండరాలు మెదడు అన్నీ.విశ్రాంతిని పొందుతాయి.  REM దశలో మెదడు కొంత యాక్టివ్ గా ఉంటుంది కానీ  శరీర కండరాలు ఇంతకుముందు దశలాగే నిస్సత్తువగా ఉంటాయి. ఐతే వృద్ధాప్యంలో లేదా పార్కిన్సన్  వంటి జబ్బులలో REM దశలో మెదడుతో పాటు కండరాలు కూడా యాక్టివ్ గా ఉండటంతో వీరు నిదురలోనే నడవడంవంటివి చేస్తుంటారు. అంటే వీరు తమ కలను తమకు తెలియకుండానే యాక్ట్ చేస్తారు.  REM దశలో వచ్చే కలలు అణచివేసి ఉంచిన కోరికలను తీర్చేవిగా ఉంటాయని సైకోఅనలిస్టులు చెబితే ఈ దశ కంటి కండరాల ఆక్సిజెనేషన్ కి పనికి వస్తుందని అనటమిస్టులు చెబుతారు. పిల్లల నిద్రలో REM దశ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, పిల్లలమెదడు వికసించేది ఈ దశలోనే. పిల్లల మొత్తం నిద్రలో ఎనభైశాతం REM దశనే ఆక్రమిస్తుందంటే వారి మెదడు ఎదుగుదలలో దీని ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. ఐతే పెద్దలలో ఇది చాలా తక్కువ సమయం ఆక్రమిస్తుంది. పెద్దలలో ఈ దశ మెదడు రిపేర్ కి పనికివస్తుంది. ఐతే ముఖ్యంగా మనం గమనించవలసిన అంశం ఒకటుందిక్కడ. రాత్రి పడుకుని పొద్దున అయ్యేకొద్దీ ఒక నిదుర సైకిల్ లో REM దశ సమయం పెరుగుతూ పోతుంది. అందుకే మనకు ఉదయం పూట పడే కలలు గుర్తుండిపోతాయి.  ఉదయం పూట త్వరగా లేచే అలవాటు లేని వ్యక్తిని ఉదయమే లేపామనుకోండి అతడు చాలా మటుకు REM నిద్రను కోల్పోతాడు. అదే పిల్లలైతే వారి మెదడును శక్తివంతం చేసే ఈ  REM దశను మరింతగా కోల్పోతాడు.


మనుషులలో నిద్రవిషయంలో రెండు రకాల వ్యక్తులుంటారు. మామూలు ఇంగ్లీషు భాషలో Early larks and late owls అని. Early bird , late bird అని కూడా అంటారు. రాత్రి ఎనిమిది తొమ్మిదికల్లా నిద్రపోయేవారినా early lark అనీ రాత్రంతా మేలుకుని ఏ మూడు నాలుగు గంటలకో నిదుర పోయే వాళ్ళను late owl అనీ అంటారు. ఐతే ఇవి వ్యక్తుల అలవాట్లకు సంబంధించినవి మాత్రమే కాక ఇవి జెనెటికల్లీ కూడా నిర్మితమై ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఒక వ్యక్తి లేటుగా పడుకోవడానికి అతడి అలవాట్లు కారణమా లేక అది జెనిటికల్ గా నిర్మితమైన అంశమా అని చెప్పడం కష్టం. కానీ సాధారణంగా యుక్తవయసులో late owl గా ఉన్నవారు కూడా వయసు పెరిగేకొద్దీ early lark గా మారడం కూడా గమనించవచ్చు. ఐతే సమాజం లేటుగా పడుకోవడాన్ని తప్పుగా చూస్తుంది. సమాజం మొత్తం తొందరగా నిద్రలేచి పనుల్లోకి పోయేవిధంగానే నిర్మించబడ్డది. ఒక స్టడీ ప్రకారం జనాభాలో 40 శాతం early larks 30శాతం late owls మిగిలిన 30% ఈ రెంటికీ మధ్యలో ఉంటారు. ఐతే దీర్ఘకాలిక జబ్బులు late owls లో కలగటానికి కారణం వారికి సరైన నిద్రను సమాజం కలిగించకపోవడమే. ఏ మూడు నాలుగ్గంటలకు పడుకున్న late owl ఐనా మళ్ళీ ఉదయమే లేచి స్కూలుకో కాలేజీకి ఆఫీసుకో పోవలసిందే. ఉదయమే లేవకపోతే  అతడిని బద్ధకస్తుడిగా మనం గుర్తిస్తుంటాం. పైగా తొందరగా పడుకోవచ్చు కదా అని వొత్తిడి చేస్తుంటాం. అతడికి జెనెటికల్ మేకప్ ప్రకారం నిద్రరాదు అని అంటే డాక్టర్ దగ్గరనుండి నిద్ర ట్యాబ్లెట్లు అలవాటు ఛచేస్తాం. పసి పిల్లలలో రోజుకి 16 గంటల నిద్ర అవసరం. స్కూలు వయసు పిల్లలకు పదిగంటల నిద్ర అవసరం. పెద్దవారికి ఎనిమిది గంటలు ముసలివారికి ఏడు గంటల నిద్ర అవసరం. ఐతే ఒక స్కూలు పిల్లగాడు late owl అనుకుందాం. ఏ రాత్రి పన్నెండు గంటలకో ఒంటిగంటకో పడుకుంటే ఉదయం ఆరుగంటలకు లేచి అతడు స్కూలుకి రెడీ కావలసి ఉంటుంది. అంటే అతడు తనకు అవసరమైన నిద్రను కోల్పోతున్నాడు. అంతమాత్రమే కాదు ఇందాకా చెప్పినట్టు ఉదయం పూట REM SLEEP STAGE ఎక్కువ గా ఉంటుంది. అది మెదడు పనితీరును అభివృద్ధి పరుస్తుంది అనుకుంటే ఉదయం పూట లేచిన late owl విద్యార్థి తనకు చాలా ముఖ్యమైన REM STage నిద్రను కోల్పోతాడం. దీనితో అతడిలో నిస్సత్తువ పెరగడం చదువులో వెనుకబడటం జరుగుతుంది. మన సమాజంలో నిదురకు సంబంధించిన అవగాహన పెరగలేదు కాబట్టి మన జీవితాన్ని బ్రహ్మ ముహూర్తంలోనే లేవడం వంటి ఆదర్శ భావనలతో మరింత కఠినతరంగా చేసుకుని నిదురను విస్మరిస్తుంటాం. శాస్త్రీయ దృక్పథం పెరిగేకొద్దీ అందుకు తగ్గ మార్పులను మనం చేసుకోవలసి ఉంటుంది.


దీర్ఘకాలిక జబ్బులకే కాకుండా రోడ్ యాక్సిడెంట్లకూ నిద్రలేమి ప్రధాన కారణం. ఆల్కాహాల్ కంటే నిద్రలేమివలన జరిగే యాక్సిడెంట్లే ఎక్కువగా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. చెర్నోబైల్ వంటి సంఘటనలు జరగడానికి కూడా అక్కడ పనిచేసేవారి నిద్రలేమి కూడా ఒక కారణమనే వాదన ఒకటుంది. ఫ్లైట్ యాక్సిడెంట్లకూ పైలెట్ల నిద్రలేమినే కారణమమనీ వారు సుదూర ప్రాంతాలకు తిరుగుతూ ఉండటంతో బయలాజికల్ గడియారం పనిచేయక వారి పనితీరులో లాజికల్ థింకింగ్ తగ్గి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందనీ పరిశోధనలు చెబుతున్నాయి. పైలట్లనే కాదు సాధారణ మనుషులు సైతం నిద్రలేమి వలన సరైన నిర్ణయాలు తీసుకొలేరు. పరీక్షలలో సరిగ్గా నెగ్గలేరు. ముఖ్యంగా విద్యార్థులకూ,  కఠినమైన పనులు చేసేవారికీ, ట్రక్కు డ్రైవర్లు, పైలెట్లు  వంటివారికి నిదురకు సంబంధించిన ఖచ్చితమైన షెడ్యుల్ ఉండవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా రాంకుల వెంట పరిగెట్టే యువత నిదురను అలక్ష్యం చేస్తూ చదవడం వలన మెదడు పనితీరును బండబారుస్తున్నారనే విషయం తెలుసుకోవాలి. సరైన నిదురలేకుండా చదివే extra time చదువు వలన లాభం లేకపోగా నష్టమే ఎక్కువ అని గుర్తెరగాలి. నిదుర రాకుడదని కాఫీ టీల మీద అధారపడుతూ చదివే చదువు శ్రేయస్కరం ఏవిధంగాను కాదు.


ఐతే నిద్రలేమితో పాటు ఈ మధ్య పెరుగుతున్న మరో సమస్య OSA (OBSTRUCTIVE SLEEP APNEA). డ్రైవర్లలో డెభ్భైశాతం మందికి ఈ సమస్య ఉందని దానిలో పది శాతం మందికి తీవ్రంగా ఉందని ఒక సర్వే చెబుతోంది. గొంతు కండరాలలోపల కొవ్వు పెరగడంవలన నిదురలో వీరి నాలుక నోటి కుహరంలో వెనుకకి పడిపోవడం గురకవస్తుంది. దాని వలన గాలి నోటిలోనే ఆగిపోయిసరైన ఆక్సిజన్ శరీరానికి అందదు. అప్పుడు శరీరంలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరిగి దాని ప్రభావంతో మెదడు సడెన్ గా యాక్టివ్ కావడంతో ఆ వ్యక్తి నిదురనుండి లేస్తాడు. దీనిని apnea cycle అంటారు. ఐతే ఈ లేవడం తనకు గుర్తు ఉండదు. ఇలా గంటలో 40 నుండి 100 apnea cycles జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి టాన్సిల్స్, లింఫ్ గ్రంధుల వాపు, చిన్న గాలి గొట్టాల వలన కూడా ఇలా జరగవచ్చు. ఐతే దీనిని పూర్తిగా అలక్ష్యం చేస్తారు. OSA బీపికి, గుండెజబ్బులకు, సడెన్ కార్డియాక్ డెత్ లకూ కారణం ఔతుంది. దీనిని సకాలంలో గుర్తించి CPAP వంటి మిషిన్ల సహాయంతో చికిత్స తీసుకోవాలి. లేకపోతే ఉదయం పూట ఎపుడంటే అపుడు పనులు చేస్తూ కూడా నిద్రపోవడం దీని ప్రధాన లక్షణం. డెభ్భైశాతం డ్రైవర్లలో ఈ లక్షణం గుర్తించారంటే మనం దీనిని ఎంతగా అలక్ష్యం చేస్తున్నామో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లకు ఏది ప్రధానమైన కారణమో అర్థం చేసుకోవచ్చు. ఐతే.  ఈ సమస్యలేవీ గుర్తించకుండా నిదుర రాకుండా ఉండేందుకు అలర్ట్ గా ఉండేందుకు కాఫీ టీ వంటి పదార్థాలని తీసుకుంటూ ఉంటారు. సుదూర ప్రాంతాలకు నడిపే డ్రైవర్లు నిదుర వచ్చినపుడల్లా వాహనం పక్కకు తీసుకుని కాఫీ తాగుతూ ఉంటారు. కాఫీ ఎఫెక్ట్ పోగానే బలవంతంగా ఆపుకున్న నిద్ర ఆపుకోలేని దశకు చేరి వాహనం నడుపుతుండగానే నిద్రపోతుంటారు. పరిణామం మనకు తెలిసినదే.


మనిషి ఎక్కువ సమయం పని చేసే కొద్దీ మెదడులో ఇంక చాలు అని చెప్పేందుకు అడినోసిన్ అనే పదార్థం నిండుతూ ఉంటుంది. అంటే  సాయంత్రం దాటి రాత్రి సమీపించే కొద్దీ మెదడులో ఎడినోసిన్ ఎక్కువగా చేరుతుంది. కానీ సాయంత్రం తాగే కాఫీ టీలలోని కెఫిన్ పదార్థం అడినోసిన్ రిసెప్టర్ లను నింపేసి నిదురను తాత్కాలికంగా నిలుపుదల చేస్తుంది. కానీ కెఫిన్ half life ఏడు గంటలు. సాయంత్రం ఒక కప్పు కాఫీ తాగితే దాని ప్రభావం పూర్తిగా తొలగిపోవడానికి అర్ధరాత్రి దాటి ఉదయానికి కూడా సమీపించవచ్చు. వృద్ధులలో కెఫిన్ పూర్తిగా తొలగడానికి మరింత సమయం పడుతుంది. ఐతే విపరీతంగా కెఫిన్ పదార్థాలకు (కొన్ని చల్లని పదార్థాలలో కూడా)ప్రజలు అలవాటు పడ్డారు. దీనితో సరైన నిద్ర లేక రాత్రులలో ఇబ్బంది పడుతూ పొద్దున లేవలేక లేచినా సరిగా ఏకాగ్రత నిలపలేక సతమతమౌతూ ఉంటారు. ఇవే మెల్లిగా దీర్ఘకాలిక జబ్బులకు దారి తీస్తాయి. ఉదయం పూట మీరు బలవంతంగా నిద్ర ఆపుకోవలసి వస్తున్నదా? నిదురపోకుండా ఉండేందుకు యాక్టివ్ గా ఉంటుందని కాఫీ తాగుతున్నారా లేదా సాయంత్రం వరకు మరోసారి లేదా పదే పదే కాఫీ లేదా టీ తాగకపోతే మీకు మగతగా నిస్సత్తువగా అనిపిస్తుందా..? ఐతే మీరు తప్పక అర్థం చేసుకోవలసిన అంశం మీకు సరైన నిద్ర లేదని. చాలా ఆఫీసులలో పని క్షేత్రాలలో యేళ్ళ తరబడి ఇదే రొటీన్ ని అలవాటు చేసుకున్నవారుతాము తక్కువగా నిదుర పోతున్నామని గుర్తించరు. Sleep debt(నిద్ర బాకీ) అని ఒక భావన ఉంది. ఒక వ్యక్తి తనకు కావలసిన నిద్ర పోకపోతే ఆ మిస్సైన నిద్ర మెదడులో sleep debt( గా స్టోరై ఉంటుంది. అవసరం వచ్చినపుడు ఆ వ్యక్తి ఆ మిగిలిన నిద్రను తీర్చుకుంటూ ఉంటాడు. సాధారణంగా మనిషిలో ఎనిమిది నుండి పదిగంటల sleep debt ఉంటుంది. ఐతే ఎపుడైతే ఇది యాభై గంటలను దాటుతుందో అది తీవ్రదశకు చేరుకున్నట్టు. వీళ్ళకు రక్తపోటు గుండెపోటు సడెన్ డెత్ పక్షవాతం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఆదివారాలో లేక పండగ సెలవు దినాలకో వీలైనంత నిద్రపోవడం వలన చాలామటుకు sleep debt తగ్గించుకోవచ్చు. కానీ అందుకు భిన్నంగా కాఫీ టీలతో మన శరీరాలను ఆరోజే ఎక్కువగా నింపుతుంటాం.


 కాఫీ ఫుడ్ సప్లిమెంట్ కాదు. ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వాడబడుతున్న సైకో యాక్టివ్ సబ్స్టెన్స్ కాఫీ. పెట్రోలియం తర్వాత అతి ఎక్కువగా వాణిజ్యమౌతున్న పదార్థం కాఫీ. మనం కృత్రిమ సైకో యాక్టివ్ సమాజాన్ని సృష్టించుకున్నాం. అందుకే నిద్రలేమి ఒక పాండెమిక్ గా మారింది. ఐతే నిద్రలేమికి విరుగుడుగా నిద్రమాత్రలను వాడటం సరైన పద్ధతి కాదు. చాలామంది డాక్టర్లుకూడా నిద్ర శుభ్రతను( sleep hygiene) పేషంట్లకు వివరించడంలో సఫలీకృతం కాలేకపోతున్నారు. పేషంట్ సాటిస్ఫాక్షన్ కోసమని నిదుర మాత్రలు రాయడం తప్పని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. పేషంట్లతో పాటు డాక్టర్లు కూడా నిద్ర శుభ్రతను అర్థం చేసుకుని పేషంట్ కి తగ్గట్టు కష్టమైజ్ చేయగలగాలి. Late owls ని గుర్తించి వారు మరీ త్వరగా నిదుర లేవడం వలన వారిని బద్ధకస్తులని వారిపై బలవంతంగా ఆదర్శాలను రుద్దడంవలన లాభం ఉండదనీ గుర్తించాలి. విద్యార్థులలో నిదుర ప్రాముఖ్యత గురించి కార్పోరేట్ స్కూళ్ళల్లో కాలేజీల్లో సెమినార్లు నిర్వహించి అవగాహన పెంచాలి. నిద్రకు సంబంధించి నిర్థారణ కాని జబ్బులు వందకు పైగా ఉన్నాయి. సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ జరగాలంటే ముందు నిద్రపైన అవగాహన పెరగాలి. నిద్ర సులువుగా కొట్టివేయవలసిన అంశం కాదనీ నిర్లక్ష్యం వహించవలసిన అంశం అసలే కాదనీ గుర్తెరగాలి. నిద్రకు ఆల్టర్నేటివ్ ఏదీ లేదు. అన్నానికి బదులు ఆకులు, అలములు, పళ్ళు తిని బతకవచ్చు. కానీ నిద్రకు బదులుగా మరేది లేదు. నిద్రపోవాల్సిందే. World sleep Society అందుకే నిదురపై అవగాహనను పెంచడంకోసం ప్రతిసంవత్సరం మార్చి 15 ను sleep day గా గుర్తించి అవగాహన కోసం ప్రయత్నిస్తోంది. 2024 సంవత్సరానికి గాను అందరికీ సమానమైన నిద్ర అవసరాన్ని గుర్తు తెస్తుంది. కొందరు "మాకు  చాలా తక్కువ సమయం నిద్ర సరిపోతుంది" అని గొప్పలు పోవడం చూస్తుంటాం. అది ఏమాత్రం గొప్ప కాదనీ అది తెలియని ఒక నిద్రసంబంధ జబ్బని గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి. అందుకే ఈ oxymoron "మేలుకోండి.. సరైన నిద్ర అవసరమని గుర్తించండి".



విరించి విరివింటి

17/3/24

Published in nava telangana

Friday, 15 March 2024

Genetic reality. Essay

 Genetic reality


ఆర్కపెలాగో అంటే ద్వీపాల సముదాయం. మన భూమి మీద వివిధ ప్రాంతాలలో ఈ ద్వీపాల సముదాయాలు ఉన్నాయి.  ఒక రకంగా ఇతర భూభాగాలైన పెద్ద ఖండాలనుండి వేరుచేయబడి ఉండటంతో మొక్కల జంతువుల మనుషుల గురించి చదవడానికి ఇవి ప్రకృతి సహజమైన బయోలాజికల్ ల్యాబ్స్ లాగా ఉపయోగపడతాయి. అందుకే ఆంథ్రోపాలజిస్టులూ, నేచురలిస్టులూ, బయాలజిస్టులు, జువాలజిస్టులు, బోటనిస్టులూ, పరిణామ వాదులు, పర్యావరణవేత్తలూ, డాక్టర్లూ ఈ ప్రాంతాలలో పరోశోధనలు చేయడానికి ఉత్సుకత చూపుతుంటారు. ఇలాంటి ద్వీప సముదాయాలలో పరిశోధనలు చేయాలన్న ఉత్సాహం ఇప్పటిది కాదు. పురాతన కాలం నుండి ఉన్నా 15 నుండి 17 వ శతాబ్దంలో కొలంబస్ , జేమ్స్ కుక్ వంటి వారి సాహసయాత్రలనుండి దీవులను గుర్తించడం వాటికి మ్యాపులు తయారుచేయడం మొదలైంది. ఆ తర్వాత వలసవాద దేశాలనుండి పరిశోధకులు పద్దెనిమిది, పంతోమ్మిదవ శతాబ్దం నుండి ఈ ప్రాంతాలకు వెళ్ళి పరిశోధనలు చేయడం మొదలైంది.    ఈ రెండు శతాబ్దాలు చాలా విచిత్రమైన ప్రపంచ పరిస్థితుల్లో ఉన్న శతాబ్దాలు. ఒకవైపు ఏజ్ ఆఫ్ ఎన్లైటెన్మెంట్ నుండి హేతుబద్ధ ఆలోచనలు శాస్త్రీయ దృక్పథమూ,  టెక్నాలజీ రూపంలో మైక్రోస్కోపు వంటి సైంటిఫిక్ యంత్రాలు స్పెసిమన్లను భద్రపరిచే టెక్నాలజీ రావడమూ జరుగుతుండగా మరోవైపు వలసవాదంతో ఆయాదేశాలు కొత్త ప్రదేశాలకు  పాకుతూ అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయవలసిన అవసరాలు ఏర్పడటమూ జరిగింది. బ్రిటిష్ ఫ్రెంచ్ డచ్చి ప్రభుత్వాలే స్వయానా సాహసయాత్రలను స్పాన్సర్ చేసి పరిశోధనలద్వారా వచ్చిన డాటా ఆధారంగా తన సామ్రాజ్యాలను విస్తరిస్తూ పోయిన తరుణమది. అలా ఆర్కపెలాగోలు వలసలకు అనుగుణమైనవిగా, వ్యవసాయానికి సహజవనరులకూ ఆలవాలమైనవిగా, కొల్లగొట్టడానికి అనువైనవిగా వలసవాదులకు తోచాయి. అందుకై వచ్చిన పరిశోధకుల పరిశోధనలు అక్కడ చూసిన కొత్తరకమైన మొక్కలు జంతువులు మానవులూ, ఇవన్నీ కొత్త లోకాలను వారికి పరిచయం చేశాయి. ఈ విచిత్రమైన పరిస్థితుల్లోంచే జీవపరిణామం అంటే ఏంటో అర్థమవడం మొదలైంది. ఎందరో నేచురలిస్టులు జీవ పరిణామాన్ని అర్థం చేసుకుని వివరించగలిగినా సరైన ఎవిడెన్సులు లేక చాలామటుకు ఊహాగానాలుగా మిగిలిపోగా తిరుగులేని ఎవిడేన్సు లతో జీవపరిణామాన్ని తీసుకువచ్చిన వారు చార్లెస్ డార్విన్, ఆల్ఫ్రెడ్ వాలెస్ లు. ఐతే డార్విన్ గలపాగోస్ ఆర్కపెలాగోలో(1831-1836) పరిశోధన చేస్తే దానికి కొంతకాలం తర్వాత వాలెస్ మలయ్ ఆర్కపెలాగోలో (1854 -1862) పరిశోధనలు చేశాడు. 


"ఓ కొలంబస్...! చంపే సైన్యమూ, అణు ఆయుధం, ఆకలిపస్తులూ, డర్టీ పాలిటిక్స్, పొల్యూషన్లేవీ కనబడలేని దీవి కావాలి ఇస్తావా?" అని జీన్స్ సినిమాలో పాట. నిజానికి నేచురలిస్ట్ లు ఇలాంటి కారణాలవలననే ఆర్కిపెలాగోలను తమ పరిశోధనకు ఎంచుకుంటారు. వీటిల్లోని జంతు వృక్ష జాతుల  వైవిధ్యం అవి అనువర్తనం (adaptation) చెందిన విధానమూ, వ్యాపించిన విధానమూ అంతరించిన(extinction) క్రమమూ ఎలాంటి ఇతర జీవుల ప్రభావం లేకుండా స్వచ్ఛంగా జరుగుతుందనే ఊహతో ఈ ద్వీపసముదాయాలు వీళ్ళని ఆకర్షించాయి. ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి పరిశోధనలు చేయాలంటే మొదట ఆ గట్స్ కావాలి. Eccentric గా తేడాసింగ్ లాగా కూడా ఉండాలి. డార్విన్, వాలెస్ లు అలాంటివారేనని చెప్పక తప్పదు. తమకంటూ ఎలాంటి సంస్థతో విశ్వ విద్యాలయాలతో సంబంధాలు లేకున్నా తమ సొంత నిర్ణయాలతో విక్రమార్క పట్టుదలతో వీళ్ళు సాహసయాత్రలు పరిశోధనలూ చేశారనే చెప్పాలి. డార్విన్ బీగిల్ లో తిరుగుతూ( నా ఇంతకు ముందు వ్యాసం చూడండి) తన స్పెసిమన్లను తయారుచేసుకుంటే వాలెస్ మలయా ఆర్కిపలాగోలోనే దాదాపు ఎనిమిది సంవత్సరాలు తిష్టవేసి కూర్చుని తన పరిశోధనలు చేశాడు. ఐతే మలాయ్ అర్కిపెలాగోలో ఎన్ని ద్వీపాలున్నాయనుకున్నారు?. చిన్నవీ పెద్దవి కలిపి ఇరవైయైదు వేల ద్వీపాలున్నాయి. ఇందులో మానవ నివాస యోగ్యమైనవి కొన్నే. ఐతే ఈ ద్వీప సముదాయాలలో అతడొక ముఖ్యమైన విషయాన్ని కనుగొన్నాడు. అదే ఈ వ్యాసంలోని ప్రముఖమైన అంశం. అదేంటంటే ఈ ప్రాంతంలోని ద్వీపాలను తూర్పు పడమర ద్వీపాలుగా విభజించుకుంటే పశ్చిమ ద్వీపాలలోని వృక్ష జంతుజాలం ఒకరకంగా ఉంటే తూర్పు ద్వీపాలలో మరోరకంగా ఉన్నాయి. ఇంకా స్పెసిఫిక్ గ చెప్పాలంటే పశ్చిమాన ఉన్న జావా,బాలీ, లంబోక్ దీవులలో ఉండే వృక్ష జంతువుల జాతులు తూర్పున ఉన్న బోర్నియో, సులవేసి దీవులకంటే భిన్నమైనవి. అంటే ఈ దీవులన్నీ పక్కపక్కనే ఉన్నా వీటి మధ్య దూరం అతి తక్కువగా ఉన్నా అక్కడ పెరుగుతున్న జంతు వృక్ష  జాతులు పూర్తిగా విభాన్నమైనవి. బాలిలో ఉండే జంతువు ఏదీ బోర్నియో లో లేదు. అలాగే బోర్నియో లో ఉండే జంతువు లేదా వృక్షరకమేదీ బాలిలో లేదు. ఇది విచిత్రం. ఇది గమనించిన వాలెస్ 1859 లో (ఈ సంవత్స‌రమే డార్విన్ Origin of species పుస్తకం వచ్చంది)తూర్పు పడమర దీవుల మధ్య ఒక ఊహాత్మక గీత గీశాడు. దానినే "వాలెస్ లైన్" అంటారు. సముద్రంలో గీసిన ఈ ఊహాత్మక గీతను దాటుతూ ప్రకృతి పూర్తిగా  అటు ఇటూ వేరుగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోవడం ఆంథ్రోపాలజిస్టుల వంతయింది. ఐతే ఈ ద్వీపాలు సముద్రంలో ఒకదానికొకటి దూరంగా విడివడినట్టు ఉంటాయి కాబట్టి ఏ ద్వీపానికాద్వీపం విభిన్న మైన వృక్ష జంతుజాలాలను కలిగి ఉంటుందని ఊహించాడు. ఈ ఊహలో నిజం లేకపోలేదు. కానీ ఇక్కడి పక్కపక్కని దీవులలో విభిన్నమైన జీవం ఉండటానికి అసలైన కారణంగా "కాంటినెంటల్ డ్రిఫ్ట్" ని  కనుగొన్నారు 20వ శతాబ్దంలో. ఇండోనేషియాలోని పడమర దీవులు యురేషియా ప్లేట్ లోని సుందా షెల్ లో  ఉంటే తూర్పు దీవులు ఆస్ట్రేలియా ప్లేటులోని సాహుల్ షెల్ కి సంబంధించినవి. కాంటినెంటల్ డ్రిఫ్ట్ జరిగిన సమయంలో సుందా, సాహుల్ షెల్ లు పక్క పక్కకు వచ్చి చేరడంతో ఇండోనేషియా పశ్చిమ దీవులలో ఆసియాకి సంబంధించిన వృక్ష జంతు జాతులుండగా, తూర్పు దీవులలో  ఆస్ట్రేలియా కి సంబంధించిన వృక్ష జంతుజాలాలు కనబడతాయి. 


వాలెస్ పరిశోధనలను 1863 లో పుస్తకంగ తెచ్చే సమయానికి మలాయ్ ద్వీపసముదాయాలను సందర్శించే ఆంథ్రోపాలజిస్టులు ఇతర నేచురలిస్టుల తాకిడి ఎక్కువైంది. ఐతే కొలోనియల్ సమయంలో రేసియల్ థియరీలు కూడా ఊపందుకున్నాయి. వాలెస్ తన అబ్జర్వేషన్ లతో పాటు అదనంగా చెప్పిన ఒక చిన్న అంశాన్ని పట్టుకుని ఆంథ్రోపాలజిస్టులు కోడిగుడ్డు మీద ఈకలు పీకడం మొదలెట్టారు. పొరపాటునో గ్రహపాటునో  వాలెస్ ఏం చెప్పాడంటే జంతు వృక్ష జాలలే కాకుండా తూర్పు పడమర దీవుల్లో మనుషుల మధ్య కూడా బేధాలున్నాయి, పడమర వైపు ఉండేవారి చర్మం తెల్లగానూ వెంట్రుకలు పలుచగనూ ఉంటే తూర్పు దీవులలో ఉండేవారి చర్మం నల్లగానూ వెంట్రుకలు మందంగా వొంకులు తిరిగి ఉందని చెప్పాడు. ఇదే తర్వాతి పరిశోధకులకు పనికిమాలిన పనిని కలిగించింది.  తమ రేసియల్ థియరీలతో ద్వీపసముదాయాలను చూడటానికి వచ్చిన కలోనియల్ ఆంథ్రోపాలజిస్టులు ఈ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపుతూ మరింత వివరించడం మొదలు పెట్టారు. వృక్ష జంతుజాలాల మధ్య విబేధాన్ని పక్కనబెట్టి ఇక్కడి మనుషుల మీద పడ్డారు. వాళ్ళ రాతల్లో తూర్పు దీవులలో నివసించే మనుషులమీద ఏహ్యభావం చిన్నచూపు కనబడ్డాయి.వారు జబ్బులతో ఉన్నారనీ, శుభ్రత అనేది లేకుండా చూడటానికి అసహ్యంగా ఉన్నారనీ, పైగా నమ్మదగిన వ్యక్తులుగా కనిపించడం లేదనీ రాయడం మొదలెట్టారు. వాలెస్ లైన్ ని వాళ్ళు "వాలెస్ ఆంథ్రోపాలజికల్ లైన్" గా మార్చారు. మనుషులను వారి బాహ్య ఆకారాల ఆధారంగా వారి సంస్కృతుల ఆధారంగా భాషల ఆధారంగా వేరు వేరుగా విభజించవచ్చని కొలోనియల్ ఆంథ్రోపాలజిస్టులు అనుకున్నారు. ఇదే రేషియలైజేషన్. వాలెస్ ఊహించిన వాలెస్ లైన్ కాలక్రమంలో వాలెస్ ఆంథ్రోపాలజికల్ లైన్ గా మారటం కలోనియల్ కాలంలోని రేసియల్ మైండ్ సెట్ ని ప్రతిబింబిస్తుంది.


అంతమాత్రమే కాదు సైన్సు అభివృద్ధి చెందుతున్న తరుణంలో మానవుడి నీచత్వం సైన్స్ ని కూడా  ఎలా భ్రష్టు పట్టించగలదో మనకు అర్థమౌతుంది. మానవుడు కులాలుగా మతాలుగా జాతులుగా విడిపోయి అందుకోసం యుద్ధాలు చేసుకోవడం చంపుకోవడం మానవుని భ్రష్టత్వానికి ఋజువులు. పరిశోధకుడు రచయిత ఐన ఆర్థర్ కోస్టలర్  ఏమంటాడంటే - మనిషి మెదడులో ఎక్కడో ఒక స్క్రూ లూజుగా ఉంది, మానవ పరిణామం లో ఎక్కడో ఏదో అంతుచిక్కని తప్పు జరిగిపోయిందని. మానవుడి మస్తిష్కం ఇతర అవయవాల మాదిరిగా కాకుండా చాలా వేగంగా పరిణామం చెందిందనీ అదే బహుశా అతడి స్క్రూ లూజ్ కావడానికి కారణం కావొచ్చనీ అంటాడు. మనం సైన్సు మనలోని మూఢత్వాన్నీ పక్షపాతాల్నీ( prejudices) తొలగించేయాలని కోరుకుంటాం. కానీ సైన్స్ ని ఆధారంగా చేసుకుని అచ్చం సైన్స్ లాగే కనబడే సూడోసైన్స్ ఈ మూఢత్వాలను మరింత పెంచుతూ ఉంటుంది. అలా వచ్చిండేదే "వాలెస్ ఆంథ్రోపాలజికల్ లైన్". కలోనైజేషన్ అమలుపరిచిన రేసియలైజేషన్ "జాతివాదం" పూర్తిగా సూడో సైంటిఫిక్. ఆ కాలంలో యూరోప్ లో ఆంథ్రోపాలజిస్టులు వైద్యంలో కూడా శిక్షణ పొందేవారు. వీళ్ళు మనుషులనూ, సమాజాన్నీ వారి శరీర ఆకృతలుగానే, ఎక్కువ తక్కువలుగా చూసేవారు. ఇదే భావజాలాన్ని వాళ్ళు మలయా ఆర్కపలాగోకి తీసికెళ్ళారు.. ఐతే ఈ వలసవాదులు South East asia లో నాటిన ఆనాటి రేసిస్టు విత్తనం తరువాత చాలా ఘోరమైన మలుపులు తీసుకుంది. ఆ ప్రాంత రాజకీయాలను ప్రభావితం చేసింది. పైకి కనిపించే శరీర లక్షణాల ఆధారంగా "వీళ్ళు నాజాతివాళ్ళు మిగిలిన వాళ్ళు పరాయిజాతివాళ్ళు" అని అక్కడి ప్రజలు నమ్మడం మొదలెట్టారు. విభజించు పాలించు అనేది వలసవాద ఎజెండా అని మనకు తెలిసిన విషయమే. ఐతే ఇండోనేషియా డచ్ వారి ఆధీనంలో ఉండేది. 


వెస్ట్ న్యూగీనియా* సమస్య తలెత్తినపుడు ఈ ప్రాతంలో మానవహననాలు జరగడానికి కారణం ఈ ఊహాత్మక 'ఆంథ్రోపాలజికల్ వాలెస్ లైన్' అందించిన భావజాలమే. వెస్ట్ న్యూగీనియా లో పపువా మలనేసియా జాతులవారు శతాబ్దాలుగా కలిసి నివసిస్తున్నారు. కానీ వారి మధ్య చిచ్చు రగిలింది. పపువా వారి చర్మం రంగును వెంట్రుకల మందంని బట్టి వారు తక్కువ జాతివారిగా వివక్షకు గురవడం మొదలైంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత  ఈ ప్రాంతాన్ని ఇండోనేషియా లో కలపాలని జాతీయవాద స్వాతంత్ర్య ఉద్యమాలు జరిగాయి. 1949 లో డచ్ వారినుంచి వెస్ట్ న్యూగీనియాకి విముక్తి లభించి ఇండోనేషియా లో కలిసిపోయారు. కానీ ఇండోనేషియా లోనే ఉండి నిరంతరం వివక్షకు గురయ్యే వెస్ట్ పపువా ప్రజలుమాత్రం ఇండోనేషియా నుండి స్వాతంత్య్రాన్ని కోరుకున్నారు. ఒకవైపు ఇండోనేషియా నేషనలిస్టులు తమదంతా ఒకే చారిత్రక, సాంస్కృతిక నేపథ్యమని వాదిస్తే పపువా నేషనలిస్టులు "వాలెస్ లైన్" ఆధారంగా తాము వేరే జాతికి చెందినవారిమని వాదించారు. కోల్డ్ వార్ లో భాగంగా అమెరికాతో పాటు ఇతర యూరోప్ దేశాలు ఇండోనేషియా వైపు, రష్యా వెస్ట్ పపువా వైపు మొగ్గుచూపాయి. ఐతే ఇప్పటికీ ఈ సమస్య రావణకాష్టమే. ఇప్పటికీ ఇండోనేషియా నుండి స్వాతంత్య్రంకావాలని ఆ ప్రాంతంలో ఘర్షణలు కొనసాగుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనలూ అక్రమ చట్టవ్యతిరేకమైన అరెస్టులు భావ ప్రకటన స్వేచ్ఛను హరించే చర్యలు కొనసాగుతున్నాయి.


విచిత్రం కదా!?. వాలేస్ చేసిన ఒక సైంటిఫిక్ పరిశోధన ఒక  సముద్రం గుండా సాగే ఊహాత్మక  సైంటిఫిక్ లైన్ ఆ తర్వాత కలొనియలిస్టుల చేతిలో పడి ఏ విధంగా మనుషులను జాతులుగా విడగొట్టిందో, అది చినికి చినికి గాలివానై  జాతి విద్వేషాలకు దారి తీసి ఈనాటికీ మండుతూ ఉందో...ఇదంతా విచిత్రంగా ఉంది కదూ!. అంటే ఇక్కడ మనం చూడవలసిన అంశం ఏమంటే -  సైన్సు ఏం చెబుతుంది, మనుషుల సాంస్కృతిక - రాజకీయ ప్రాధాన్యాలు ఏమి చెబుతీన్నాయనేది. జెనిటికల్ స్టడీస్ ప్రకారం ఆంథ్రోపాలజికల్ వాలెస్ లైన్ కి ఇవతల అవతల ఉన్న ప్రజలలో ఎలాంటి జన్యుపరమైన బేధాలూ లేవనీ,South east asia లోని ప్రజలందరూ ఒకే పూర్వీకుల జన్యువులు కలిగి ఉన్నారనీ, పలుమార్లు ఈ దీవులకు వివిధ ప్రాంతాలనుంచి వలసలు జరిగి పవివాహాలు జరిగి జెనిటికల్ మిక్సింగ్ జరిగిందనీ సైన్సు చెబుతోంది.   అందుకే ఈ ప్రాంత జనాభాలో జెనెటికల్ వేరియేషన్ అధికంగా ఉందనీ తెలుపుతుంది. ఒక ప్రాంతం కావొచ్చు లేదా ఒక దేశం కావొచ్చు ప్రస్తుతానికి దేశమనుకుందాం. జెనెటికల్ వేరియషన్ అనేది రెండు వేరు వేరు దేశాలకు చెందిన ప్రజలకంటే ఒక దేశంలోపల నివసించే జనాభాలో కనుక  ఎక్కువగా ఉంటే...ఆ దేశానికి ఇతర దేశాలనుండి వలసలు విపరీతంగా జరిగినట్టు అలాగే ఆ ఇతరదేశాలతో వివాహసంబంధాలు నెరపినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. విచిత్రం ఏంటంటే ప్రపంచంలో దాదాపు ప్రతీ దేశం లేదా ప్రాంతంలో ఇదె సినారియో ఉంది. అటు అమెరికాను తీసుకున్న యూరోపును తీసుకున్నా ఇటు తూర్పుదేశాలైన చైనా భారత్ లను తీసుకున్నా ఆయా జనాభాలలో జనెటికల్ వేరియేషన్ అధికంగా ఉన్నట్లు ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. అంటే సరిహద్దులు లేని, దేశాలనేవేవీ లేని ఒకానొక కాలంలోనే మనుషులు ఒక ప్రాంతంనుండి మరో ప్రాంతానికి వలసలు చేస్తూనే ఉన్నారనీ ప్రపంచంలో ఒకటీ అరా అలా ఎక్కడో మూలకు విసిరేసినట్టు ఉండే అమేజాన్ అడవులో అండమాన్ నికోబార్, సోలోమన్ పసిఫిక్ దీవుల వంటి ప్రాంతాల వాళ్ళు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలవారిలో జెనెటికల్ వేరియేషన్ అధికంగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే ఇపుడు మనం అనుకుంటున్న గ్లోబలైజేషన్ ఎపుడో జరిగింది.  దానవీర శూరకర్ణలో కొండవీటి వెంకటకవి రాసినట్టు జెనెటికల్ ఋజువులు ప్రత్యక్షంగా కనబడుతున్న ఈ ఆధునిక కాలంలో జాతి జాతి అనడం ఇపుడు వ్యర్థవాదం. 


శరీరాకృతిలోనూ జన్యుపరంగానూ మనుషులు వైవిధ్యాన్ని చూపుతున్నప్పటికీ వారి మధ్యన అడ్డుగోడలు లేవని అవి మసకబారిపోయాయని జన్యు శాస్త్రం తెలుపుతోంది. జీవశాస్త్ర పరంగా నిర్ధారించగల ఒక స్పష్టమైన జాతి అనేదేదీ లేదని ఆధునిక జన్యుశాస్త్ర మానవశాస్త్ర పరిశోధనలు రూఢీ చేస్తున్నాయి. పూర్వీకుల ఆధారంగా భాషా సంస్కృతి ఆధారంగా శరీర ఆకృతి ఆధారంగా మనం జాతులుగా విడగొట్టడమన్నది సంక్లిష్టమైన మానవ వైవిధ్యాన్ని అతి పలుచనచేయడమే. ఇవి స్టీరియోటైపులనూ విద్వేషాలనూ రెచ్చగొట్టే సూడో సైన్సులే తప్ప నిజమైన సైన్స్ కాదు. మానవులమందరం ఒక్కటే అని చెప్పగలిగి అందరినీ బంధువులని చేయగల శక్తి దేనికైనా ఉందా అంటే అది కేవలం సైన్స్ కి మాత్రమే ఉంది. ఐతే కలోనియల్ ఆంథ్రోపాలజిస్టులవలే అది జాతివిద్వేషాలను రెచ్చగొట్టే సూడో సైన్సు చేతిలో పడకుండా చూడవలసిందే. అంతేకాక తమ తాత్కాలిక పదవులకోసం రాజకీయ నాయకులు, వేల యేళ్ళ తరబడి జన్యువుల రూపంలో సాగిన మానవ సమూహాల ఏకాత్మకా శక్తిని కాదని జాతులు వేరు వేరని నమ్మబలుకుతుంటారు. కానీ అందరమూ ఒక తల్లి బిడ్డలమే అని తెలుసుకోగలగడమే జెనెటిక్ రియాలిటీ.


విరించి విరివింటి 

11/3/2024


*న్యూగీనియా అనేది South East Asia లో అతిపెద్ద ద్వీపం. దీనిని న్యూగీనియా హైలాండ్ అంటారు. గ్రీన్ ల్యాండ్ మొదటిదైతే న్యూగీనియా రెండవ అతిపెద్ద ద్వీపం. ఐతే దీనిలో పశ్చిమ భాగాన్ని వెస్ట్ న్యూగీనియా అనీ తూర్పుభాగాన్ని పపువా న్యూగీనియా అని అంటారు. వెస్ట్ న్యూగీనియా ఇండోనేషియా లో ఒకభాగమైతే పపువా న్యూగీనియా 1975 లో ఆస్ట్రేలియా నుండి విడివడి స్వతంత్ర దేశంగా మారింది.

Tuesday, 5 March 2024

1984, Big Boss and Beagle. Essay

 1984, Big Boss and Beagle


ఆ మధ్య ఒక స్కూలు అడ్వర్టైజ్మెంట్ ఒకటి చూశాను. తరగతి గదులను సీసీ కెమెరాలతో మానిటర్ చేస్తామని. గొప్పగానే చెప్పుకున్నారు. పది సంవత్సరాల క్రితం బెంగుళూరు స్కూల్ లో జరిగిన ఒక రేప్ కి రియాక్షన్ గా వెంటనే తరగతి గదుల్లో సీసీకెమెరాలను అమర్చాలనే భావన మొదలైంది. ప్రభుత్వాలూ ప్రజలు స్కూలు యాజమాన్యాలూ అప్పట్లో ఈ విషయమై కాస్త కంగారుగా హడావుడి చేశారు. ఆ సీసీకెమెరాలను తల్లిదండ్రుల సెల్ఫోన్ లకు కూడా అనుసంధానం చేస్తారంట. దానితో తల్లిదండ్రులు తమ సెల్ఫోన్ లోనే తమ పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోవచ్చంట. పిల్లల ప్రవర్తనను ప్రవర్తనలోని లోపాలను ఎక్కడికక్కడ గమనించి సరి చేసుకోవచ్చంట. పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు. ఎవరితో కూర్చున్నారు, చదువుతున్నారా, సరిగా వింటున్నారా లేదా వంటివన్నీ ఇంట్లోనో ఆఫీసులోనో కూర్చుని తల్లిదండ్రులు మానిటర్ చేసుకోవచ్చు. టీచర్లుకూడా పిల్లల ప్రవర్తనను గమనిస్తూ మార్పులు చేర్పులు చేసుకోవచ్చంట. ఇవన్నీ వీటికి గల లాభాలు గా చెబుతున్నారు. గతంలో ఎందరెందరో గొప్ప శాస్త్రవేత్తలు రచయితలు కవులు ఉదయించిన మన ప్రపంచంలో ఎపుడూ ఇంతగా పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టనవసరం రాలేదే. ఇపుడే ఎందుకు ఈ నిఘాల అవసరం వచ్చిందో మనకు అర్థం కాదు. ఈ సౌకర్యాలను ఉపయోగాంచుకుంటున్న తల్లిదండ్రులు దీనిపై గొప్పగానే చెప్పే అవకాశం ఉంది. ఇలా సీసి కెమెరాల నిఘా పెరిగాక తమ పిల్లల చదువులు బాగయ్యాయని చెప్పవచ్చు. అది నిజం కూడా కావొచ్చు. ఐతే దీనిలో పిల్లల ప్రైవసీకి సంబంధించిన దృక్కోణం మరుగున పడకూడదు. అథారిటేరియన్ పేరెంటింగ్ చేసే తల్లిదండ్రులు తమ పిల్లలపై మరింత కఠినమైన క్రమశిక్షణను రుద్దే అవకాశం లేకపోలేదు. ఈ సీసి ఫూటేజ్ బ్లాక్ మెయిల్ చేయడానికీ ఇతరులను కంట్రోల్ చేయడానికీ కుల మత జాతులుగా పిల్లలలో విభజనలు తేవడానికీ కూడా దోహదపడవచ్చు. ముఖ్యంగా పిల్లలకూ తల్లిదండ్రులకూ మధ్య ఉండవలసిన "నమ్మకం" అనేది పలుచనబారిపోతుంది. విద్యార్థి చెప్పిన ప్రతీ దానికీ ఆధారంగా సీసీ ఫూటేజ్ బేరీజు చేయబడుతుంది. అబద్ధం చెప్పడంలోని ఆనందం మిత్రులమధ్యన ఉండే చిన్నపాటి అలకలు ప్రేమలూ మధురస్మృతులు అన్నీ కనుమరుగై కేవలం "చదువు మాత్రమే"అనే ధోరణితో బాల్యం పాఠశాల జీవితం అనేవేవీ లేని ఒక తరం తయారు కావచ్చు. తప్పులనుండి నేర్చుకోవడం పోయి తప్పులే చేయకూడదు తప్పుచేయడమే పాపమనే ధోరణీ పెరగవచ్చు. పిల్లలు తమపై పెద్దవారు టీచర్ల తల్లిదండ్రుల రూపంలో నిరంతరం నిఘా పెడుతున్నారు అని చెప్పడం వలన వారు తమ సహజ గుణాన్ని కోల్పోయి కెమెరాకు అనుగుణమైన ప్రవర్తనను మాత్రమే అలవాటు చేసుకున్న కృత్రిమ జీవులుగా మారిపోవచ్చు. ముఖ్యంగా గుర్తించుకోవలసినది పిల్లలను చిన్నప్పటినుండే నిఘాకు అలవాటు చేయడం. రాబోయే నిఘాభరిత సమాజానికి సమాయత్తం చేయడం. తమ జీవితంలోని ప్రతి దశనూ నిఘాకిందికి తేబోతోన్న నియంతృత్వ రాజ్యాల జీవితాన్ని కండీషనింగ్ చేయడం.  తరగతిగదిని తరగతిగదిలాకాకుండా  బిగ్ బాస్ హౌజ్ గా మార్చేయడం. "Bigboss is watching you".


ఎవరీ బిగ్ బాస్?. మన తెలుగు లో బిగ్ బాస్ అని పేరు పెట్టారుగానీ అమెరికాలో దీని ఒరిజినల్ పేరు "బిగ్ బ్రదర్". 1984 నవలలో జార్జ్ ఓర్వెల్ ఒక డిస్టోపియన్ అంటే పూర్తి నియంతృత్వ దేశ స్వరూప స్వభావాలని మనకు చూపిస్తాడు. "Airstrip1" అనే ఆ దేశాన్ని పాలించే నాయకుడి పేరే "బిగ్ బ్రదర్". నాయకుడి పేరు మాత్రమే కాదు, ఇదొక కల్ట్ లీడర్ కి సింబల్. గోడల మీద ఆ లీడర్ బొమ్మ ఉంటుంది. కింద "Big brother is watching you" అని రాసి ఉంటుంది. పౌరుల జీవితాలను అనుక్షణం  నాయకుడు తన గుప్పిట్లో ఉంచుకోవడమే ఆ సింబల్. Dystopian దేశంలో నియంతృత్వం ఉంటుంది. ప్రజలందరిపై సంపూర్ణమైన నిఘా ఉంటుంది. మెజారిటీ ప్రజలు అణచివేతకి గురౌతుంటారు. నిచ్చెన మెట్ల సమాజంలో ఉన్నత అధమ తరగతుల జనాలమధ్యన పటిష్టమైన ఇనుప కచ్చడాలుంటాయి. సహజ వనరుల ధ్వంసం జరుగుతూ  అధికారం సంపద అంతా కొద్దిమంది చేతుల్లో ఉంటుంది.  ఐతే బిగ్ బ్రదర్ రియాలిటీ షోవాళ్ళు యాదృచ్చికంగా ఈపేరు పెట్టలేదు. ఒర్వెల్ నవల ఆధారంగానే ఈ షోకి బిగ్ బ్రదర్ అని పెట్ఠారు. ఇందులో భాగస్వామైన వ్యక్తి నిరంతరం కెమెరాలతో నిఘా పెట్టబడతాడు. అతడి ప్రవర్తన కంట్రోల్ చేయబడుతుంది. బిగ్ బ్రదర్ హౌజ్ ఒక డిస్టోపియన్ సొసైటీ. 1984 వలెనే ఇక్కడ ఎవరికీ కనిపించకుండా అందర్నీ తన కనుసన్నల్లో నిఘాపెట్టుకునే బిగస బ్రదర్ నియంతృత్వం ఉంటుంది. అతడే ఈ షోకి బాస్. అతడు చెప్పినట్లు వినాల్సిందే.  మీడియా కల్చర్ వోయిరిజం సెన్సేషనలిజం వంటివాటిని కూడబలుక్కునే "viewership totalitarianism" అది. ఆడే సభ్యులమధ్య పవర్ డైనమిక్స్ ఉంటాయి. Trp ల కోసం స్టేజ్డ్ డ్రామాని పండించడం సత్యాన్ని మానిపులేట్ చేయడం ఉంటుంది. వందల కెమెరాల తో పూ‌ర్తినిఘా పెట్టబడిన వాతావరణంలో వ్యక్తి తన స్వేచ్ఛను కోల్పోయేలా చేసే ఘట్టమది. ఈ డిస్టోపియన్ సమాజంలో అర్థం పర్థంలేని టాస్కులు ఈయబడతాయి. వాటిలో గెలవడం ఓడడమనే అంశం నిజ జీవితానికి ఏమీ సంబంధం లేనిది. ఏది నటననో ఏది నిజమో ఏది సత్యమో ఏది కాదో అనేదానితో నిమిత్తం లేకుండా entertainment కోసం అల్లబడిన గేమ్. దానికోసమై డిస్టోపియన్ సమాజ స్వరూపాన్ని చూపించిన ఓర్వెల్ గొప్పటి నవల మూలంకావడం అన్నది కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ యుగంలో కాదేదీ పిచ్చితనానికి అనర్హం అనేలా ఉంటుంది. ఐతే ఈ రియాలిటీ షో  కొంత కాలం మాత్రమే. నెల రోజులో నలభై రోజులో...అంతే. 


కానీ ఒక వ్యక్తి జీవితంలో ఐదేళ్ళు కొందరు వ్యక్తులతో మాత్రమే జీవించాల్సి వస్తే?. అది కూడా ఒక నౌక మీద?. మేధావిత్వమంతా పెద్దటి నుదురుతో తీక్షణమైన చూపులతో చురుగ్గా కనిపించే ఒక ఇరవై రెండేళ్ళ కుర్రవాడు, అపుడపుడే మొగ్గతొడుగుతున్న ప్రియురాలి (ఎమ్మా) ప్రేమను ఆ కలలను మనసులో మౌనంగా పదిలపరుచుకుంటూ, జ్ఞానాన్వేషణ కోసం సముద్రంలో బయలు దేరిన ఒక నౌకలో ఎక్కి కూర్చున్నాడంటే అతడు ఎలాంటి వాడై ఉండాలి?. ఇంగ్లాండ్ నుండి బయలుదేరి అట్లాంటిక్ సముద్రం దాటి సౌత్ అమెరికా ఖండ పశ్చిమ తీర దేశాల నుండి కొనసాగుతూ పసిఫిక్ సముద్రంలోని ద్వీపాలను చుట్టుముట్టి మళ్ళీ సౌత్ అమెరికా మీదుగా 64,000 కిమీ పూర్తి చేసి తిరిగి ఇంగ్లాండ్ చేరుకున్న ఒక నౌక. దాని పేరే "HMS Beagle". ఆ నవయువకుడే "చార్లెస్ డార్విన్". ఈ కాలపు మేధావులనబడేవారితో పోలిస్తే గతకాలపు మేధావులు చాలా నిజాయితీగా ధృడమైన సంకల్పంతో తీక్షణమైన మేధ కలిగి ఉన్నారా అనిపిస్తుంది. బిగ్ బ్రదర్ హౌజ్ లో పిచ్చి టాస్క్ లు చేసేవారికి వీరాభిమానులైపోయే మేధస్సు ఈ గతకాలపు మహనీయులు తీసుకున్న టాస్క్ లను ఎప్పటికి అర్థం చేసుకోగలుగుతుంది?. అసలు ఈ కాలపు 22 యేళ్ళ కుర్రవాడినుండి ఇది కనీసం ఆశించగలమా?. ఇంటిని బంధుమిత్రులనూ దేశాన్నీ వదిలి ఎక్కడో సుదూర ప్రాంతాలకు ఐదేళ్ళపాటు కేవలం జ్ఞానంకోసం నౌకాయానం చేసేందుకు సిద్ధపడే ఒక నవయువకుడి సాహసాన్ని మనం కొలవగలమా?. బ్రిటిష్ తన సముద్ర తీరాల్ని పెంచుకునే ఉద్దేశ్యంతో సౌత్ ఆఫ్రికా తీరాన్ని అక్కడి సముద్రపు స్థితిగతులను చదివేందుకు "HMS beagle" అనే నౌకను సిద్ధం చేసింది. కొంతమంది సివిల్ పాసెంజర్లతో నౌకా సిబ్బందితో సైంటిఫిక్ వ్యక్తులతో దాదాపు 65 మందితో సాగిన విచిత్రమైన, ప్రపంచగతిని సమూలంగా మార్చిన ప్రయాణమిది. 


ఐతే వెళుతున్న తీరప్రాంతాలలోని మొక్కలను జంతుజాలాల్ని పరిశీలించేందుకు ఒక నేచురలిస్ట్ కావాలని అనుకున్నారు. ఐతే వాళ్ళకి ఒక నేచురలిస్ట్ దొరికాడు. అతడు డార్విన్ కాదు. అతడి పేరు Robert McCormick. Official naturalist ఇతనే.

మరి డార్విన్ నౌకలోకి ఎలా వచ్చాడు. అది తెలుసుకోవాలంటే మనం మరో హీరో గురించి తెలుసుకోవాలి. అతడే నౌక కాప్టెన్ 26 యేళ్ళ "Robert Fitzroy". నౌకాయానం కాల్కులస్ హైడ్రోస్టాటిక్స్, ఆస్ట్రోనమీలో పట్టభద్రుడైన ఫిట్జ్ తన  పధ్నాలుగు యేళ్ళ వయసులోనే సౌత్ ఆఫ్రికా తీరం మీద  రెండేళ్ళపాటు నౌకమీద సాహసయాత్ర చేసిన ముక్కోపిగా ఫిట్జ్ మనకు తెలియాలి. ఈ ఐదేళ్ళ నౌకా ప్రయాణానికి అతడే సరైన లీడరని అతడిని నియమించారు. డార్విన్ మేనమామ రికమండేషన్ మీద డార్విన్ ఆ నౌకలోకి ఎంటర్ అయ్యాడు. ఐతే అందరూ అనుకున్నట్టు నేచురలిస్ట్ గా కాదు. పిట్జోయ్ కి మాటలు మాట్లాడిపెట్టే conversationalist గా. ఐదేళ్లు నౌకాయానం చేయాలంటే తనతో మాట్లాడేందుకు తనలా ఉన్నతతరగతికి చెందిని కేంబ్రిండ్జ్ యూనివర్సిటీ లో ఉన్నతమైన విద్యగరిపిన ఒక సహాయకుడు కావాలనుకున్నాడు ఫిట్జాయ్. అలా కావాలంటే ఊరుకోరు కనుక నేచురలిస్ట్ కావాలని తెలిసినవారి మధ్య అడ్వర్టైజ్మెంట్ లాంటిది ఇప్పించి డార్విన్ ని రప్పించుకున్నాడు. నౌకాయానం ఐదేళ్ళు చేయడమనేది పెద్ద టాస్క్. అంతకు ముందు బీగిల్ నౌక కెప్టెన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అంతేకాక ఫిట్జాయ్ మేనమామ గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకున్న చరిత్ర ఉండటంతో అంతటి మహత్తర నౌకాయానంలో తనకు సుసైడల్ ఆలోచనలు రాకుండా తనతో మాట్లాడేందుకు ఒక వ్యక్తి కావాలి. 26 యేళ్ళ యువకుడు 22 యేళ్ళ మరో చురుకైన యువకుడిని తనతో పాటు ఉండాలని కోరుకున్నాడు. ఫిట్జోయ్ ఏమీ మామూలు వ్యక్తి కాదు. అతడు అప్పటికే తన దగ్గర వివిధ జంతువుల మొక్కల సాంపుల్స్ కలెక్షన్ చేసి పెట్టుకున్నాడు. అతడు ఫించ్ పక్షుల మీద చేసుకున్న కలెక్షన్ డార్విన్ కలెక్షన్ కంటే గొప్పది. గలపోగాస్ ద్వీపంలో ఫిజ్జాయ్ కలెక్షనే డార్విన్ కి చాలా ఉపయోగపడింది. ఫిట్జాయ్ ఆహారం తీసుకునేటపుడు మాత్రమే డార్విన్ తో మాట్లాడేవాడు. వాళ్ళిద్దరూ వేరు వేరు భావజాలాలు కలిగిన మేధావులు. ఫిట్జోయ్ కి ముక్కుమీద కోపం. ఆయనకు "హాట్ కాఫీ"  అని పేరు. పైగా ఓడ కెప్టెన్. అథారిటెరియన్ ఫిగర్. అతడికింద సహాయకుడు మాత్రమే డార్విన్. అతడు క్రిస్టియన్ మతానుయాయుడు. డార్విన్ లో పరిశోధన లోతులు పెరిగేకొద్దీ "ఈ ప్రపంచం అనేది దైవ సృష్టి" అనే భావన అతనిలో పలుచనబడటం మొదలైంది. కానీ దానికి భిన్నమైన భావాలు గల కెప్టెన్ తో ఐదేళ్ళు సహవాసం. ఇది కదా టాస్క్ అంటే. ఫిట్జాయ్ ఒకసారి డార్విన్ మీద అరిచేసి హంగామా చేశాడు. తర్వాత డార్విన్ ని క్షమాపణలు వేడుకున్నాడనుకోండి. ఐతే  ఫిట్జాయ్ చెప్పే మాటలు వింటూ వింటూ తాను క్రైస్తవ సన్యాసినైపోతానేమోనని తన సోదరికి సరదాగా లేఖ రాసుకుంటాడు డార్విన్. ఐతే ఐదేళ్ళలో కనీసం ఒక్కసారి కూడా డార్విన్ తన ప్రశాంతతను కోల్పోలేదంటారు. ఇది మానవ చరిత్రలో చాలా అరుదైన విషయం. చాలా అరుదైన వ్యక్తి డార్విన్.  ఏ బిగ్ బాసు లేదా బిగ్ బ్రదర్ నిఘా అతని మీద లేదు. అతడి నిఘా అంతా అతడి పలిశోధన మీదే. ఎంత స్వీయ శక్తినో, స్వీయ సత్యసంధతనో చూడండి. ఇపుడు విద్యార్థులకు సీసీ కెమెరాలు కావాలంటున్నామంటే మన విద్యా వ్యవస్థలో లోపం ఎక్కడుందని ఆలోచిస్తున్నామా?. తరగతిగదుల్లో పిల్లలు రేపులకు గురౌతున్నారంటే మనం ఎటువంటి సమాజాన్ని నిర్మించుకుంటున్నామో తలపోస్తున్నామో. సంఘటనలు జరగగానే కంటితుడుపు knee jerk reactions తప్ప సమస్య మూలాలపై చర్చించి పరిష్కారాల దిశగా కదులుతున్నామా? ఐతే జీవిత చరమాంకంలో ఫిట్జాయ్ ఒకసారి బైబిల్ తలమీద పెట్టుకుని బైబిలే గొప్పదని దేవునిదే సృష్టి అని అరుస్తూ డార్విన్ ని తూలనాడతాడు. ఐతే చివరకి తన మేనమామలాగే గొంతుకోసుకుని చనిపోయాడు ఫిట్జాయ్. దానికి భిన్నంగా ఏ మతమూ అందించని  తన స్వీయ నిబద్ధతతో డార్విన్ చరిత్ర గతినే మార్చేశాడు. 


ఈ ప్రయాణంలో డార్విన్ స్వయంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  అరవై ఐదు వేలకు పైగా స్పెసిమన్లు తయారు చేసుకున్నాడు. సముద్ర తీరం వెంట తాను తిరిగిన వివిధ ప్రాంతాల మొక్కల, జంతులుల, శిలల, శిలాజాల స్పెసిమన్లు తయారు చేసుకున్నాడు. ఐదేళ్ళ విజ్ఞన సాహసయాత్ర అది. ఇదే అతడి సైంటిఫిక్ టెంపర్. ఇదే అతడి సునిశితమైన చురుకైన పరిశీలన. ఏమైపోయింది ఈనాడు మనకి?అంత ఓపిక !అంత పట్టుదల !అంతటి సాహసం! కొత్తవైపు, అసీమిత తారాగగనాల వైపు దూసుకుపోవాల్సిన నవయువత ఎటుపోయింది?  ఈశక్తులన్నీ ఎక్కడికి దిగజారిపోయాయి?. పట్టుమని ఐదు నిమిషాలు వేయి అక్షరాలు చదవలేని స్థితిలో ఉన్న యువత ఫాల్స్ హీరోలవైపు ఫాల్స్ గోల్స్ వైపు సాగిపోతోందెందుకు?.  కులాల రొచ్చులో మతాల పీకులాటల్లో లేకి  సినిమాల మోజులో , కాలాహరణం చేసే ఎంటర్టైన్మెంట్ భ్రమల్లో  పిచ్చివాళ్ళుగా ఫండమెంటలిస్టులుగా హీరో వర్షిప్ లతో ఎటు కునారిల్లు పోయారు మన యువత?  మనది కూడా డిస్టోపియన్ సమాజం కాదా?. లేదా దీనికి మరోపేరేదైనా పెట్టాలా?. ఏ సీసీకెమెరా నిఘా మనకు మరో డార్విన్ ని అందించగలదు?. ఏ పనికిమాలిన ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో టాస్క్ లు మనకు ప్రపంచంలో  నిజమైన టాస్కులేంటో చూపగలవు?.  ఎవరు వీరికి బిగ్ బ్రదర్?. Who is the Big brother that is watching and controlling us?


విరించి విరివింటి 


5/3/24

Sunday, 3 March 2024

Parasites, man and God. Essay

 Parasites, man and God.


దశావతారం సినిమాలో " దేవుడు లేడని ఎవరన్నారు? ఉంటే బాగుండేది" అంటాడు కమలహాసన్ ఒకచోట. నిజంగా దేవుడే ఉంటే ఇన్ని ఘోరాలను కలిగించేవాడే కాదు కదా అన్నది అతడి

ఉద్దేశ్యం. దాదాపు ఇదే అభిప్రాయాన్ని డార్విన్ కూడా వెలిబుచ్చుతాడు. Ichneumonidae అనే ఒక కందిరీగ జీవితాన్ని పరిశీలిస్తూ కరుణామయుడని చెప్పబడుతున్న దేవుడు కనుక ఉంటే ఈ కందిరీగను సృష్టించి ఉండేవాడు కాదు అంటాడు. స్టీఫెన్ గౌల్డ్ అనే మరో డార్వీనియన్ " నిజంగా దేవుడనే వాడు మంచివాడే ఐతే అతడి సృష్టి కేవలం మంచిని మాత్రమే ప్రతిబింబిస్తుంటే, మనమెందుకు బాధలతో కష్టాలతో విపరీతమైన అర్థంపర్థంలేని క్రూరత్వంతో నిండిపోయామంటాడు. ఈ కందిరీగ జీవితాన్ని పరిశీలిస్తే evil / చెడు/ క్రూరత్వం అనేది మనిషికి మాత్రమే చెందినదనీ ప్రకృతి దానిని లెక్కచేయదనీ అంటాడు. నిజమే కదా ప్రకృతిలోని ఏ జంతువూ తమకు చెడు జరిగిందని, జరిగుతుందని అందుకు ప్రతిగా మతాలను పుస్తకాలనూ దేవుళ్ళనూ సృష్టించుకున్న దాఖలాలు లేవు. చెడును అవి లెక్క చేయవు. సైతాన్, దయ్యం వంటివేవీ వాటిని తాకలేవు. శ్మశానాల్లో మనిషి తిరగలేడేమో గానీ మిగిలిన ఏ జంతువుకూ దయ్యం కాన్సెప్ట్ లేదు. భాషా శాస్త్రం ప్రకారం దేవుడు ప్రకృతి ఐతే దయ్యం వికృతి. కానీ మన చుట్టూ పరుచుకుని ఉన్న ప్రకృతికి దేవుడూ దయ్యం రెండూ లేవు.


Ichneumonidae అనే కందిరీగ గొంగళిపురుగులను బతికున్న శవాలుగా మార్చుకున్నా, గొంగళిపురుగు దానిని పట్టించుకోకుండా దేవునికి మొరపెట్టుకోకుండా బతికేస్తుంది. అది ఎంత క్రూరంగా గొంగళిపురుగుని తన జాంబీగా మార్చుకుంటుందో చూశాక డార్విన్ ఏమంటాడంటే ఇంత క్రూరత్వంతో ఐతే భగవంతుడు సృష్టి చేయలేడని. అంటే ఏమర్థమౌతుంది? ప్రకృతిలో క్రూరత్వం /evil కూడా ఒక భాగం.  ఐతే జార్జ్ కార్లిన్ కూడా ఒకవేళ భగవంతుడు అనేవాడు ఉండింటే వాడు పురుషుడే ఐవుంటాడు. ఇంత ఘోరమైన సృష్టిని ఏ స్త్రీ కూడా చేయలేదంటాడు. ఒకవేళ జార్జ్ కార్లిన్ ఈ కందిరీగ గురించి తెలంసుకుని ఉండింటే క్రూరత్వం ఒక మగకు మాత్రమే కాదనే విషయం తెలుసుకునేవాడు. ఐతే మానవునికి సంబంధించినంత వరకూ క్రూరత్వమంతా పురుషుడిదే. పైగా దేవుడు తన రూపంలోనే మనిషిని సృష్టించాడని నమ్ముతాడు మనిషి. మనుషులు రాసుకున్న మత సాహిత్యం లో దేవుడు అంటే కేవలం పురుషుడే. స్త్రీలు కూడా పూర్తిగా లొంగిపోయారు ఈ భావనకు. మళ్ళీ మన టాపిక్ కి వస్తే, ఈకందిరీగ పరిణామ క్రమంలో తన తోకను stinger గా మలుచుకుంది. దీని ద్వారా అది గుడ్లను పెడుతుంది. అంటే ఇది ఆడకందిరీగ. ప్రకృతి క్రూరత్వానికి ఆడమగ తేడా లేదన్నది అందుకే. ఈ ఆడ కందిరీగ ఒక గొంగళిపురుగును వెతుక్కుని దాని మీదకు ఎక్కి తన stinger నుండి ఒక ఎంజైమ్ ను విడుదల చేస్తుంది. ఇదొక విషం. గొంగళిపురుగు వెంటనే స్తంభించి పక్షవాతం వచ్చినట్లు చచ్చుబడిపోతుంది. ఈ ఎంజైమ్ గొంగళిపురుగు మెటబాలిజంను చివరికి ప్రవర్తనను కూడా మార్చివేసే శక్తిని కలిగి ఉంటుంది.  ఈ ఎంజైమ్ తో గొంగళిపురుగు చర్మాన్ని కరిగించి చర్మంలోనుండి లోపలికి తోకను పెట్టి అక్కడ గుడ్లను పెడుతుంది. అంటే ఇక గొంగళిపురుగు శరీరం కందిరీగ గుడ్లను పొదిగి ఇచ్చే మీడియంగా మారుతుంది. కోకిల తన గుడ్లను కాకి గూటిలో పొదుగుకోవడం దీని ముందు చాలా చిన్న విషయం. 


ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ ఆడకందిరీగ తన శరీరంలోపల polydna అనే వైరస్ కి ఆశ్రయం ఇస్తుంది. ఈ వైరస్ జన్యు మెటీరియల్ ని పరిణామ క్రమంలో   తనకు అనుగుణంగా  మార్చుకుంది. తనకు అనుగుణంగా అంటే తను గుడ్లుపెట్టబోయే గొంగళిపురుగు తన గుడ్లకు సహకరించేందుకు అనుగుణంగా. అందుకే కందిరీగ తన గుడ్లతో పాటు ఈ వైరస్ లనూ stinger తో గొంగళిపురుగు లోపలికి పంపుతుంది. ఈ virus గొంగళిపురుగు ఇమ్యూన్ సిస్టంని అటాక్ చేసి దానిని బలహీన పరుస్తుంది. ఏదైనా ఒక ఫారిన్ బాడి శరీరంలోకి రాగానే దానిని మట్టుబెట్టేందుకు ఇమ్యూన్ సిస్టం సమాయత్తమౌతుందని మనకు తెలిసన అంశమే. ఇపుడు కందిరీగ గుడ్లు కూడా ఫారిన్ బాడిలు కాబట్టి గొంగళిపురుగు ఇమ్యూన్ సిస్టం వెంటనే యాక్టివ్ అయి ఆ గుడ్లను చంపేయలి. కానీ ఆ సిస్టంని అలా గుడ్లపై అటాక్ చేయనీయకుండా ఈ వైరస్ కాపాడుతుంది. ఈ వైరస్ గొంగళిపురుగు ఇమ్యూన్ సిస్టంని అతలాకుతలం చేసి పొదుగుతున్న కందిరీగ గుడ్లకు హాని కలిగించలేనంత బలహీనంగా ఆ సిస్టంను మర్చేస్తాయి. దానితో కందిరీగ గుడ్లు గొంగళిపురుగు లో హాయిగా ఎదిగి లార్వాలుగా మారతాయి. గొంగళిపురుగు శరీరధర్మాన్నంతా ఈ ఎదుగుతున్న లార్వా వైరస్లు తమ గుప్పిట్లో పెట్టుకుంటాయి. ఈ విధంగా ఒక గొంగళిపురుగు మీద వంద దాకా గుడ్లను పొదుగుకుంటాయి. గొంగళిపురుగు తన జీవితాన్నలా లార్వాలను మోస్తూనే కదిలిపోతూ ఉంటుంది.  లార్వాలు మెల్లిగా గొంగళిపురుగు లోపలి భాగాలన్నింటిని తినేస్తుంటాయి. తర్వాత దశలోనుండి చిన్నపురుగులు బయటకి వచ్చేసరికి రోజూ కొద్ది కొద్దిగా చస్తూ జీవచ్ఛవంలా బతికిన గొంగళిపురుగు పూర్తిగా చనిపోతుంది. 


ఈ  కందిరీగ కథ ద్వారా మనకు ప్రకృతిలో evil ఉంది అని తెలుస్తుంది. అదెంత ఉన్నా ప్రకృతి దానిని పట్టించుకోకుండా గొంగళిపురుగులా సాగిపోతూనే  ఉంటుందనీ తెలుస్తుంది. అందుకే దేవుడు సైతాన్ బాధ ప్రకృతికి లేదు. అది కేవలం మనుషులకే. ఐతే ఈ కందిరీగకి ఇంత  evilness తనలో ఉందని తెలియదు. ఐతే డార్విన్ దానిలోని ఈవిల్ నెస్ ని చూసి దేవుడే కనుక ఉంటే ఇంతటి దారుణంగా సృష్టి చేయడని అన్నాడు.    కానీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఈ కందిరీగ లోని క్రూరత్వాన్ని కూడా మనిషి తనకు అనుగుణంగా మలచుకోగలడు. అదే ఆధునిక విజ్ఞానం. ఎంతో క్రూరంగా ఉన్న ఈ కందిరీగలు దాదాపు పన్నెండు కోట్లమంది మనుషుల ప్రాణాలను కాపాడాయంటే నమ్మశక్యం కాదుగానీ అదే నిజం. 


1970లో బ్రెజిల్ లో కర్రపెండలం పంటలకు తెల్లనల్లుల చీడపీడ మొదలైంది. బ్రెజిల్ లోని ప్రధాన పంటలలో కర్రపెండలం కూడా ఒకటి. అనావృష్టి ని కూడా తట్టుకుని పెరిగే మొక్కలివి. కానీ ఈ తెల్లనల్లుల దాడితో 20కోట్లమందికి జీవనాధారమైన కర్రపెండలం సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితి ని గమనించిన  రుడాల్ఫ్ హెరెన్ అనే స్విట్జర్లాండ్ కీటక శాస్త్ర నిపుణుడు కందిరీగలు తెల్లనల్లులపై కూడా పరాన్నజీవిగా బతకగలదని కందిరీగ గుడ్లను కందిరీగలను విమానాల సహాయంతో ఈ పొలాలమీద చల్లించాడు. అక్కడినుండి వచ్చిన కందిరీగలు పైన చెప్పినట్లు తెల్లనల్లుల మీద ఆవాసం ఏర్పరచుకుని అనతికాలంలోనే తెల్లనల్లులను సర్వ నాశనం చేయగలిగాయి. దీనివలన ఆ ప్రాంతంలో దాదాపు ఇరవై లక్షలమందిని ఆకలి చావునుండి తప్పించినట్టైంది. అంటే ఇవి బయో ఎరువులుగా పని చేశాయి. వీటిని ఇపుడు చైనాలోనూ అమెరికా లోను వ్యవసాయ రంగంలో వాడటం మొదలైంది. పురాతన పుస్తకాలను ఫర్నీచర్ నీ ధ్వంసం చేసే చెదలను చిమ్మెటాలనూ కూడా నాశనం చేసేందుకు కూడా వీటిని  వాడటం మొదలెట్టారు. దేవుడే సృష్టికర్త ఐవుండింటే పరాన్న జీవుల్లోని క్రూరత్వాన్ని కూడా మనిషివలె తనకు అనుకూలంగా మార్చుకోగలిగేవాడా. కాబట్టి దేవుడు అమాయకుడు. మనిషే దేవుడిని తన స్వార్థంకోసం మనిషి రూపంలో సృష్టించుకున్నాడు.


విరించి విరివింటి

Anti knowledge Essay

 Anti - Knowledge..(part 1)  ఇప్పటినుండి నా వాల్ మీద రాయబడే అంశాలపై విజ్ఞులు మంచి అర్థవంతమైన చర్చ చేసుకుంటే బాగుంటుందని సూచన. అంటే సమాజంగా మనం అందరం కలిసి ఆలోచించవలసిన కొన్ని విషయాలు ఇవి.  ఇంటర్నెట్ సోషల్ మీడియా యుగంలో మన ముందున్న ప్రధానమైన ఛాలెంజ్ "జ్ఞాన వ్యతిరేకత" (Anti Knowledge). ఏది నిరూపణ కాబడ్డ జ్ఞానమో దానిని వ్యతిరేకించేందుకు సమాయత్తమైతున్న ఒక స్థితి. ఈ స్థితి చరిత్రకు కొత్త కానేకాదు. ప్రతీ యుగంలో ప్రతీకాలంలో శాస్త్రీయ దృక్పథం ఒకరకంగా ఉంటే anti knowledge మరో రకంగా ఉండటం. ఇటువంటి వ్యక్తులు చరిత్రకు కొత్తకాదు. ఈ మన బ్రెయిన్ స్ట్రాం ఆ వ్యక్తులకు వ్యతిరేకంగా కూడా కాదు. కేవలం ఈ వ్యవహారం ఎలా సాగుతూ ఉంటుందో అని మనకు మనం చర్చించుకోవడానికి మాత్రమే.   "భూమి గుండ్రంగా ఉంది" అనేది నిరూపించబడిన జ్ఞానమైతే "లేదు మా మత పుస్తకంలో భూమి బల్లపరుపుగానే ఉంది కాబట్టి భూమి బల్లపరుపుగా ఉంది " అనడం anti -knowledge. మొదట మానవుడు భూమి బల్లపరుపుగానే ఉంది అనుకుని ఉండవచ్చు. కానీ రాను రాను అవగాహన పెరిగేకొద్దీ ఇది గుండ్రంగా ఉంటుందని అర్థమై ఉంటుంది. సైంటిఫిక్ అవగాహన నిరూపణ భూమి గుండ్రంగా ఉంటుందని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఐనా మేం నమ్మం భూమి బల్లపరుపుగానే ఉంది అనేలాంటి ఓ బ్యాచ్ చరిత్రలో ఎప్పటినుండో ఉంది. ఉంటుంది.   ఐతే ఇపుడు ఈ anti knowledge గురించి మరింత ఎక్కువగా చర్చించవలసిన అవసరం వచ్చింది. అందుకు కారణం సమాచార విప్లవం. Anti knowledge నిరూపితమైన సకల సైంటిఫిక్ అంశాలను తప్పని చెప్పే ఒక ప్రయత్నం చేయడంవలన దానిని ఎదుర్కోవడం ఒక పెద్ద ఛాలెంజ్ గా మారిందన్నది వాస్తవం. ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియా వచ్చిన తర్వాత Fact కంటే Fiction కి విలువ పెరిగింది. గత కొన్నిరోజులుగా నేను సోషల్ మీడియాలో గమనిస్తున్న అంశం ఏంటంటే మేధావి వర్గమని అనుకునే వారు కూడా fact నీ fiction నీ వేరు చేసి చూడలేనటువంటి ఒక అత్యైక ప్రమాదకర పరిస్థితి. ఇది సమాజానికి చాలా చెడును కలిగిస్తుంది. అందుకే ఒక చర్చగా మనం దీనిని ఎత్తుకుని ముందుకు సాగాలన్నది నాకున్న అభిప్రాయం.  Anti knowledge జ్ఞానానికి పూర్తిగా విభిన్నమైనది. మనిషికి జ్ఞానం ఒక్క పూటలోనో ఒక్క సంవత్సరంలోనో లేక ఒక్క పుస్తకం చదివేస్తేనో రాదు. సైంటిఫిక్ నిరూపణలు అలా ఒక మ్యాజిక్ లాగా జరిగిపోవు. సైంటిఫిక్ నిరూపణ కొన్ని ఏళ్ళ పరిశ్రమ. నిప్పు కనుక్కోవడం లేదా రాతి ఆయుధాలు చేసుకోగలగడం ఒక్కరోజులో ఠపీమని జరగలేదు. కొన్ని యుగాల చరిత్ర కొన్ని వేల ఏళ్ళ ఆలోచనలు ఒక్కోదాన్ని మనకు అందిస్తూ పోయాయి. అంటే ఏ జ్ఞానమైనా మనిషికి లేదా సమాజానికి ఠపీమని వచ్చేయదు. వచ్చిన జ్ఞానం ఎస్టాబ్లిష్ కావడానికి, ఆబ్జెక్టివ్ గా నిరూపణ కావడానికి ఇంకెంతో వ్యయప్రయాసలకు గురైతే తప్ప సాధ్యం కాదు.  కానీ గమనించి చూస్తే anti - knowledge దీనికి పూర్తిగా భిన్నంగా జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒక ఆగంతకుడు అకస్మాత్తుగా బయల్దేరి పైన చెప్పిన సైన్సంతా తప్పు. వాళ్ళంతా అబద్దాలు చెప్పేశారు. నేను మాత్రం నిజాలు చెప్పేస్తున్నాను. నేను మాత్రమే చెబుతున్నాను. అని ఎలాంటి వాదప్రతివాదాలు అవసరం లేకుండా సశాస్త్రీయ నిరూపణలు లేకుండా చెప్పడం చూస్తుంటాం. "సైంటిఫిక్ మెథడ్ " అంటే ఏంటో తెలియని కొందరు తమవద్ద నిరూపణలు ఉన్నాయని వ్యక్తిగత అభిప్రాయాలను తిరుగులేని నిరూపణలుగా చెబుతుంటారు. వీటిని ఫిక్షన్ గా మలచగలరు. అద్భుతమైన రసోప్రేతకమైన కథలా రక్తికట్టించగలరు. కానీ అదేదీ fact ఆధారిత నిరూపణ కిందకు రాదు. చెప్పొచ్చేదఘమంటే ఇటువంటి వారు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నారు.   ఎందకింతమంది ఉన్నారు అంటే సమాధానం సింపుల్. 1. కథ లేదా ఫిక్షన్ మనుషులను అబ్బురపరచినట్టు  "నిజం" "జ్ఞానం" అబ్బురపరచదు. కాబట్టి జనసామాన్యంలో మేధావులలో కథలు చెప్పేవారికి ఉన్నంత అప్పీలింగ్ జ్ఞానం చెప్పేవాడికి ఉండదు. 2. సాధారణ మనుషులు దాదాపుగా ఎవరూ సైంటిఫిక్ మెథడ్ ని ఒక పద్ధతి ప్రకారం నేర్చుకున్నవారు కారు. కాబట్టి జ్ఞానం , నిజం అందరి దారీ కాదు. కొందరి దారి మాత్రమే.   ఇన్ని మాటల బదులు ఉదాహరణలతో సాగుదాం. ఈ మధ్య కొందరు వచ్చారు. థైరాయిడ్ మందులు వాడకూడదనీ చాలా అపాయమనీ,అయోడైజ్డ్ ఉప్పు వాడకూడదనీ ఇది మరీ డేంజర్ అనీ..అయోడైజ్డ్ ఉప్పు వాడటం అంటే కార్పోరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడం అనీ( ఇదో డిఫెండర్ వాదన. దీనిని ముందు ముందు చూద్దాం).  ఒక అద్భుతమైన  రసోద్రేక కథను చెప్పడం మొదలెట్టారు. వాటిని వివరించమనీ నా వాల్ మీద కూడా కొందరు మిత్రులు అడిగారు. ఐతే ఇది కూడా Anti knowledge కి సంబంధించిన విషయం. దీనిని కూడా కథలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ కథ భూమి పుట్టినప్పటి నుండి మొదలౌతుంది.ఏ విధంగా ఈ అయోడిన్ అనే విషయం ఎంతటి సైన్సును పరివిధాలుగా తనలో కలుపుకుని ఎస్టాబ్లిష్ అయిందో చూడండి. ఈ విధమైన అవగాహన మనిషికి రావడానికి ఎన్ని సంవత్సరాల కృషి ఉందో గమనించండి.    భూమి ఏర్పడిన క్రమంలో కొన్ని భూభాగాల్లో అయోడిన్ తక్కువగగానూ కొన్ని భాగాల్లో ఎక్కువగాను ఉంది. మన ప్రపంచంలో భూమి పరిణామ క్రమంలో శిలలు ఏర్పడతాయి. Rocks. ఇవి సెడిమెంట్ rocks ,metamorphic rocks అని రెండురకాలు. మన భారతదేశంలో metamorphic rocks ఉన్నాయి. అంటే ఇవి తీవ్రమైన వేడికి ఒత్తిడికి లోను కావడం వలన ఏర్పడిన శిలలు. ఇటువంటి శిలలలో అయోడిన తక్కువగా ఉంటుంది. మరి అంత వేడి వత్తిడి ఎక్కడివి అని అడగవచ్చు. Continental drift దగ్గరికి వెళ్ళాలి. గోండ్వానా అని చిన్న చిన్న ముక్కలుగా ఉన్న ఒక ఖండం ఒకదానికి ఒకటి కలవడంతో పాంజియా అనే పెద్ద ఖండం ఏర్పడింది. ఆ పాంజియా హిందూ మహాసముద్రం లో ఈదుతూ వచ్చి యూరేషియా ప్లేట్ కి ఢీకొనడంతో భారతదేశం ఏర్పడింది. అందుకే మన దేశ శిలలు వేడినుండి ఒత్తిడినుండి పుట్టాయి. అందుకే మన శిలలలో అయోడిన్ తక్కువ. అలాగే మన మట్టిలో కూడా.  ఐతే, ప్రపంచంలో ఇలా శిలలలో మట్టిలో అయోడిన్ తక్కువగా ఉండే దేశాలను గుర్తించారు. ఇండియా, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, నైజీరియా, ఇండోనేషియా, చైనా , నేపాల్, ఇథియోపియా, మొజాంబిక్, సూడాన్ దేశాలలో మట్టిలో అయోడిన్ తక్కువ. ఈ ప్రదేశాలలో ఎందుకు తక్కువో చెప్పాలంటే పైన చెప్పిన జియోగ్రాఫికల్ కారణాలే కాకుండా వాతావరణ కారణాలూ ఉండవచ్చు. అతి వర్షపాతం నేలలో ఉండే అయోడిన్ని ఊడ్చిపాడేస్తుంది. అలాగే అనావృష్టి వలన నేలలో ఉప్పు శాతం పెరిగి మొక్కలు అయోడన్ ని శోశించలేవు. మన ఉత్తర భారతదేశంలోనూ ఉత్తర తూర్పు రాష్ట్రాలలోనూ క్షార నేలలు ఉన్నాయి. ఎపుడైతే నేలలో అధిక క్షార లక్షణాలు ఉంటాయో ఎక్కువ లవణాలు ఏర్పడి మళ్ళీ అయోడిన్ భరిత లవణాలు మొక్కలు గ్రహించలేనంతగా పెరుగుతాయి. అలాగే నగరీకరణలో భాగంగా అడవులను కూల్చడం వలన నేల కోసుకునిపోవడం వలన నేలలో అయోడాన్ తగ్గడం జరుగుతుంది. ఇదంతా చూడండి. దీని వెనుక ఎంత జ్ఞాన ఆధారం ఉందో. ఎంతో పరిశోధనలు ఎన్నో శాఖలనుండి చేయగా తేలినది ఏమి?. ప్రపంచంలోని కొన్ని దేశాల నేలలలో అయోడిన్ తక్కువగా ఉందని. అయోడిన్ మనిషికి ఎలా ఉపయోగం. అయోడిన్ థైరాయిడ్ గ్రంధి పనితీరును సక్రమంగా చేసే ఒక మినరల్. థైరాయిడ్ గ్రంధి మనిషి మెదడును నరాలనూ ఎదుగుదల నూ నియంత్రించే ఒక ముఖ్యమైన గ్రంధి.   అయోడిన్ నేలలో లేకపోతే ఏమౌతుంది..మనం తినే మొక్కలలో అయోడిన్ ఉండదు. తద్వారా మనిషిలో కూడా తగ్గుతుంది.. ప్రెగ్నెన్సీ లో సరైన అయోడిన్ లేకపోతే పుట్టే బిడ్డలో మెదడు ఎదుగుదల ఆగిపోతుంది. నరాల ఎదుగుదల ఆగిపోతుంది. ఫలితంగా సరైన బిడ్డలు పుట్టకపోవడం లేదా అంగవైకల్యం తో పుట్టడం లేదా అబార్షన్ జరగడం. పుట్టిన పిల్లలు చెవిటివారిగా మూగవారిగా  శారీరక ఎదుగుదల లేక మెంటల్లీ రిటార్డెడ్  గా పుట్టడం జరిగుతుంది. నేలలో అయోడిన్ అనే చిన్న మూలకం మనిషి పుట్టుకను ఎలా ప్రభావితం చేస్తుందో చూడండి. ఇదంతా ఎస్టాబ్లిష్ అయిన సైన్సు. ఎన్నో విధాలుగా పరిపరి విధాలుగా జియాలజీనుండి, అగ్రికల్చర్  నుండి, పర్యావరణ శాస్త్రం నుండి, వైద్య శాస్త్ర విభాగంనుండి అందిన ఇంతటి సమాచారం ఆధారంగా మనకు ఈ విషయం ఎస్టాబ్లిష్ అయింది. యేళ్ళ తరబడి కృషితో ఈ విషయం ఒక కొలిక్కి వచ్చింది. అందుకే 1960s లో ఇండియన్ గవర్నమెంట్ UNICEF సహాయంతో భారతదేశంలో పుట్టే పిల్లలు శారీరక మానసిక బలహీనులుగా పుట్టకూడదని ఒక సంకల్పంతో ఒక కమిటీ వేసి National Goitre Control Program అని 1962 లో మొదలుపెట్టింది. 1983 లో దానిని విస్తరించి National Iodine Deficiency Disorders Control Program (NIDDCP)అని ఉప్పుని అయోడైజ్డ్ చేయడం వలన విస్తృత ప్రయోజనాలున్నాయని రికమండేషన్ చేసి దీనిని ఒక నేషనల్ ప్రోగ్రాంగా చేపట్టింది. విస్తృతమైన అధ్యయనాలు పైలట్ స్టడీస్ దీనిని నిరూపించాయి. 1992 లో prevention of food adultration act తో ఇది కంపల్సరీ చేసింది. దీనితో దేశమంతటా అయోడైజ్డ్ ఉప్పు దొరకడం మొదలైంది. అయోడిన్ తక్కువ తో రాగల సకల జబ్బులనూ ఈ చిన్న పని చాలా సమర్థవంతంగా ఆపగలిగింది.ఇటువంటి ప్రోగ్రాంలు పైన చెప్పినటువంటి దేశాలలో కూడా అటునిటుగా ఉన్నాయి. అడవుల నరికివేత పెరిగా.భూసారం తగ్గుతున్న దేశాలు కూడా ఈ పద్ధతులను పాటించి తమ దేశ పిల్లలు cretinism బారిన పడకుండా ఉండేందుకు సన్నాహాలు చేసుకుంటూనే ఉంటారు.  చూడండి . ఒక జ్ఞానం నిరూపితమై ఎస్టాబ్లిష్ కాబడి ప్రజలలోకి వచ్చేందుకు ఎంతసమయం ఎంత అధ్యయనం జరిగిందో!. కానీ అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చేసి తన సొంత  అభిప్రాయాలను తెలుపుతూ అసలు అయోడైజ్డ్ ఉప్పు వాడటం డేంజర్ అని మొదలుపెట్టాడనుకోండి. ఇతడు జ్ఞాన వ్యతిరేకి. ఇతడిని నమ్మి జ్ఞానవ్యతిరేకతను విస్తృతం చేసేవారు ఏ మాత్రం ఆలోచించలేని సైంటిఫిక్ అవగాహన లేనివారిగా మనం పరిగణించవలసి ఉంటుంది.  విరించి విరివింటి