Sunday, 25 October 2015

Highlites of Amaravathy inaugaration

అమరావతి శంకుస్థాపన హైలైట్స్.
..............,,........................
*రేవంత్ రెడ్డి సభా ప్రాంగణంలో కనబడగానే ఆంధ్రా జనం చప్పట్లు కొడుతూ కేరింతలు పెట్టారని ఒక టీవి ఛానల్ ఆంధ్ర ప్రజల్ని అవమానించింది.
మరీ దొంగను చూసి అంత ఆనంద పడే ప్రజలు ఆంధ్రా ప్రజలని అలా ఎలా చెప్పిందో అర్థం కాలేదు. ఆ ఛానల్ ఏదో సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదనుకుంటాను.

*"మా తెలుగు తల్లికీ మల్లె పూదండ" పాటను ఎందుకనో ఏడుపు పాటలా పాడిన సింగర్ సునీత. పాట ఎత్తుకున్నపుడు శ్రావ్యంగా వినిపించినా..పాట చివరికి వచ్చేసరికి మరీ బాధతో పాడుతున్నట్టుగా పాడింది. శంకుస్థాపన రోజు ఇలా పాడటమా?. నరేంద్ర మోడీ ఈ పాట విని ఖంగు తిన్నట్టే అనిపించింది.

*ఒక్క కేసీఆర్ ముఖం తప్ప అందరీ ముఖాల్లో ఎందుకనో నవ్వే కనిపించలేదు. ముఖ్యంగా మోడీ చంద్రబాబు అసలు నవ్వలేదు. మోడీ కి పుష్ప గుచ్ఛం ఇచ్చేటపుడు చంద్రబాబు ఎందుకనో వంగి వంగి నవ్వాడు. కేసీఆర్ మాత్రం చాలా నిర్మలంగా కనిపించాడు. వేదిక మీదే కాక కింద కూర్చుని ఉన్న నారా లోకేష్ తదితరుల ముఖాల్లో కూడా ఆనందం కనిపించనే లేదు.

*అనర్గళంగా ఉపన్యసించే కేసీఆర్ సూటిగా సుత్తి లేకుండా తెలంగాణా ప్రజల ఆకాంక్ష ని వినిపించారు. మూడు నిముషాల్లో తన ప్రసంగాన్ని ముగించేసాడు.

*చంద్రబాబు ఉపన్యాసం పేలవంగా సాగింది. గతం లో హైదరాబాదు నేనే కట్టాను అని అంటాడనుకున్నాం కానీ ఎందుకో ఆ ముక్క మరచినందుకేమో పేలవంగా ముగిసింది. ఎక్కడా ప్రత్యేక ప్రతిపత్తిని గురించి ఊసెత్తలేదు. పైన్నుంచి ఊసెత్తొద్దని ఆర్డర్స్ ఉండిండొచ్చు.

*అలవాటులో పొరపాటుగా చంద్రబాబు ఉపన్యాసాన్ని ముగిస్తూ...జై హింద్...జై జన్మభూమి..అని మరోసారి జన్మభూమిని వేదికనెక్కించాడు. అంటే సింగపూరు ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రజలందరూ ఉచితంగా పని చేసి రాజధాని కట్టుకోవాలని పిలిపిచ్చాడేమో. జై ఆంధ్ర ప్రదేశ్ ..జై అమరావతి అనకుండా జై జన్మభూమి అనటం అర్థంకాలేదు.

*పచ్చని బట్టలలో వేదిక మీద ఉన్న వారందరికంటే చాలా నీట్ గా హుందాగా చంద్రబాబు కనిపించాడు. మాట్లేడపుడు కూడా చెప్పదలచుకున్నది చాలా చక్కగా ప్రజెంట్ చేశాడనిపించింది.

*వెంకయ్య నాయుడు ఒక కన్ను మూసుకుని మాట్లాడినా రెండు రాష్ట్రాల గురించీ..తెలుగు ప్రజల గురించి మాట్లాడటంతో, కేంద్రం ఇరు రాష్ట్రాల అభివృద్ధికీ సహాయాన్నందిస్తుందన్న సందేశమిచ్చారు.

*నరేంద్ర మోడీ హిందీలోనే మాట్లాడింటే బాగుండేది. వెంకయ్య నాయుడు తెలుగు అనువాదం వల్లనేమో ఆయన సహజమైన ఫ్లో కాస్త తగ్గినట్టనిపించింది. ప్రత్యేక ప్రతిపత్తిని గురించి గానీ, ప్రత్యేక ప్యాకేజీగానీ ఏదైనా చెబుతాడేమో అని నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే...ఇంత మట్టి మొఖాన కొట్టి పోయాడని జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

*వేదిక మీద జరిగే అంశాలను వివరిస్తూ యాంకరింగ్ చేసిన సాయి కుమార్ అండ్ సునీతల మాట్లడే తీరు హుందాగా కాక సినిమా ఫక్కీలో జరిగింది. ఏదో సినిమా హీరోని మాట్లాడటానికి పిలుస్తున్నట్టు ఒక్కో నాయకున్ని పిలుస్తున్నపుడు ఆ నాయకులు కాస్త విసుక్కున్నట్టు కనబడింది.

*ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుడు జగన్ ని చంద్రబాబు నాయుడు పర్సనల్ గా వెళ్ళి పిలిచి ఉంటే బాగుండేది. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సభలో లేకపోవటం ఒక లోటుగానే వుంటుంది.

*మొత్తానికి చంద్రబాబు నాయుడు అనుకున్నట్టుగానే శంకుస్థాపనా కార్యక్రమాన్ని అదరగొట్టారనిపించారు..

Tuesday, 20 October 2015

REM (poem)

విరించి ll రెం (REM) II
................................
తలుపులెవరో బాదుతున్నారు.
అతడి ఒంటి నిండా రక్తం.
కాదు అతడి ఒంటి నిండా ఇంకు
వేలమంది ముందు వేదికనెక్కాను నేను
తలుపులు పగులగొట్టేశారు వాళ్ళు
ఇవ్వాల్సిందే గద్దించారు వాళ్ళు
ఒక ఇనుప ముక్క నా చేతిలో వుంది
ఎన్ని పదాలు కూర్చాను..ఎంతగా శ్రమించాను
అతడి ఒంటి నిండా రక్తం
కాదు కాదు అది రక్తం కాదు ఇంకు
వాళ్ళు నా ఇంటిలోకి దూరారు.
వాళ్ళు తలుపులు బద్దలు కొట్టేశారు.
నా భార్యా పిల్లలు ఎగిరి గంతేశారు.
నా తల్లిదండ్రుల కళ్ళ లో ఆనందం
అతడిని దారుణంగా చంపేశారు.
అవును అతడినే చంపేశారు
ఎంతగా నా వాళ్ళ ని దూరం చేసుకున్నాను.
నా చేతిలో ఒక కాగితం ముక్క ఉంచారు.
చంపి అవతలికి ఈడ్చేశారతన్ని.
జనాలందరూ చప్పట్లు చరిచారు
హాలంతా మారు మ్రోగేలా చప్పట్లు
ఇచ్చి తీరాల్సిందే పూనకం పట్టిన వాడిలా అరిచాను
నల్ల బ్యాడ్జీ ధరించి ఊరేగింపుగా నిరసన చేశాం
అలమారాలో అందంగా అలంకరించబడిన బహుమతి
ఇంటినిండా జనం గుమిగూడారు
పత్రికల్లో నా ఇంటర్వ్యూలు,ఫోటోలు.. నా మీద ఆర్టికల్సూ
అలమారా బద్దలు కొట్టేశారు వారంతా
నా నరాలు బిగుసుకున్నాయి
గుండెలనిండా గర్వం ఉప్పొంగింది
కాళ్ళు పట్టి ఒక మూలకి పాడేశారతని శవాన్ని
ఆనంద భాష్పాలు నా కంటిని కప్పేశాయి
నిన్నెపుడో మరచారు జనం అన్నారు వాళ్ళు
ఇది అన్యాయం అక్రమం అని గట్టిగా అరిచాం అందరమూ
ఎన్ని పదాలు కూర్చాను..ఎంతగా శ్రమించాను
ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపాను
ఎంతగా నా వారిని దూరం చేసుకున్నాను
అలమారాలోంచి బహుమతిని బయటకు లాగారు
నేను నా భార్య పిల్లలూ, అందరం అడ్డుకున్నాం
ఇస్తావా ఈయవా ఈ బహుమతిని..వారంతా బెదిరించారు
ఆ పెద్దమనిషి..నవ్వుతూ  నా మెడలో మెడల్ వేశాడు
నీ పుస్తకం నేనూ చదివాను గొప్పగా ఉందంటూ బహుమతి అందించాడు
గట్టిగా అరుస్తున్నాను నేను
నశించాలి నశించాలి దౌర్జన్యం నశించాలి
అతడి ఒంటినిండా రక్తం...కాదు కాదు అది ఇంకు
ఇంటినిండా జనం గుమిగూడారు...
ఇది అరుదైన బహుమతని కొనియాడారు
మరొక్క సారి ఆలోచించుకోండని ప్రాధేయపడింది భార్య.
అసలు ఇచ్చేయటమేంటని కసరుకున్నారు పిల్లలు

నాది నాది అని అరిచాను నేను
నాకిచ్చారు నాకిచ్చారని ఏడ్చాను
వెనక్కిచ్చేసేయ్ గద్దించారు వాళ్ళు
నా ఇన్నేళ్ళ కష్టం..ఇన్నేళ్ళ శ్రమ,కృషి
నా పదాలు..నా వాక్యాలు..నా కవితలు..
నా పేరుప్రఖ్యాతులు...నా బహుమతి
గట్టిగా నవ్వారు వాళ్ళంతా
నిన్నెపుడో మరచి పోయారు జనం..
వెనక్కిస్తే మళ్ళీ ఇపుడు గుర్తుచేసుకుంటారన్నారు
చరిత్రలో రాస్తారన్నారు.
అతడి ఒంటి నిండా రక్తం...అవునదిరక్తం
కాదది ఇంకు
ఆయన చచ్చి పోయాడు
నన్ను వీళ్ళు చంపేశారు
నా బహుమతిని చంపేశారు
ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో చంపేశారు..
అందరూ ఇచ్చారు..నీవూ ఇచ్చేయాలన్నారు
నిరసన జెండాలెత్తి...వెనక్కివ్వాల్సిందేనని అరుస్తున్నాను నేను
ఇంకొక్కసారి ఆలోచించండంటోంది భార్య

మూసి వుంచిన నా కనుగుడ్లు వణుకుతున్నాయి
నా నరాలు కండరాలు బిగుసుకున్నాయి
అతడు చచ్చిపోయాడు.
తెగిన ఏనుగు తలలు, కంకాళాలు
తలకిందులుగా నడిచే మనుషులు
జడలు విరబోసుకుని నవ్వే పిశాచాలు
వికృతమైన రూపంతో మీదికొచ్చిన దయ్యం...

చెమటలు చెమటలు..
నిద్రలోంచి దుడుక్కున లేచి కూర్చున్నాను నేను
మనోజవం మారుత తుల్య వేగం..
అలమారాలో బహుమతి నవ్వుతూ కనిపించింది.
ముఖం కడుక్కున్నాను.
నిరసన వాదులంతా బయట నాకోసం వేచి ఉన్నారు.
వెనక్కివ్వాల్సిందే..ఇక తప్పదు.

20/10/15

Siraa pootha (poem)

విరించి ll సిరా పూత ll
.................................................................
పరిస్థితులు ప్రచండ వేగంగా మారిపోతున్నందుకేమో..
ప్రపంచానికి కావలసినంత తీరిక దొరికినట్టున్నది
నా ఏడుపు మీద పడి ఒకటే ఏడుస్తున్నది.

రాయీ రప్పల నడుమ ఎండుతున్న మొండి తలకాయతో
పెన్ను రీఫిల్ లోకి గాలివూపుకుంటూ బతికేవాడిని
సిరా వాసనలోంచి పచ్చి రక్తపు వాసనని పిండాలని
బొట్లు బొట్లుగా అక్షర కొలిమిలో కాలిపోయే రసవాదిని

ఈ లోకం దూరంగా విసిరేయబడిన అసైలమని తెలిసికూడా
ఒక చేతిలో స్వర్గాన్నీ ఒక చేతిలో పరుసవేదినీ చేజిక్కించుకుని
ఊహల్లోంచి, చరిత్రల్లోంచి పదాలై జారిపోయే మనుషులకోసం
ఆశగా ఆత్రంగా వెతుకుతూ  పుస్తకాల్లోకి ఉరికినవాణ్ణి
చివరికి సమాధి పలకలమీది పదాలుగా మిగిలిపోయే
మనుషుల కథల్ని అదృశ్యంగా అల్లిందెవరో...

అదిగో..కలత నిద్రలో నడిచే ఆ పిచ్చివాళ్ళిపుడే వచ్చారు.
సిరానూ, మకిలి మనసుల్నీ నా ముఖమంతా పులిమి
నేనొక కవితగా కథగా నిలబడగలనో లేదో చూద్దామని బెట్టు చేశారు.

చచ్చిబతికిన వాడెపుడూ జీవితాన్ని కొత్తగానే చూడాలనుకుంటాడు
తెల్లని గోడమీది చిన్న మరకైనా పెద్దదిగానే కనిపిస్తుంటుంది.
మంచులా కురిసిన ఆశ, క్షణాల్లో నిరాశగా ఘనీభవిస్తుంటుంది
కాళ్ళ కింద జేబుర్లాడుతున్న చీకటి మెట్లకోసం తడుముకుంటుంది.
ఏ ఆకాశ వాణో..స్నేహితుడేసిన భుజం మీది చెయ్యో..
పలికే పదాలు నిజమైనపుడు పెదవులెందుకు వణుకుతాయని అడిగినట్టుంటుంది.
పౌర్ణమి ఆటుపోటుల తాకిడి దాటిన సముద్రానికి కాసింత తీరిక దొరికితే..
అలలన్నిటినీ అదిమి ప్రశాంతంగా పాడ్యమి నిదుర చేయాలని ఉంటుంది.

అయినా వేగంగా తిరిగే ప్రపంచంకదా..
కావలసినంత తీరిక దొరికినట్టున్నది.
నా ఏడుపు మీద పడి ఒకటే ఏడుస్తున్నది.
నా ఏడుపు చూసి నేనే నవ్వుకుంటానని దానికి తెలియనట్టున్నది.

17/10/15

Wednesday, 14 October 2015

Kankara raallu (poem)

విరించి ll కంకర రాళ్ళు ll
.....................................
మనమిద్దరమూ కలిసి తిరిగే రోజుల్లో
వారంతా ఎంతటి అనుమానాస్పదంగా చూసేవారు..!

అంకం తరువాత అంకంగా
ఒక షేక్స్పియర్ నాటకంలా
మన ఉద్వేగాలూ మన స్నేహాలూ
కలిసి జీవించేవి ఆ రోజుల్లో

ఇబ్బడిమబ్బడిగా మనుషులు తిరిగే వీధుల్లో
తెలియని ముఖాల మధ్య వెలిగి పోయే తెలిసినముఖాల్లా
అటునుంచి నీవూ ఇటు నుంచి నేనూ ఒకరికొకరం ఎదురుపడినపుడు
సంవత్సరాల తరబడి కలువని ప్రేమ జంటలాగ
ఒకరి ఛాతి మీద ఒకరి ఛాతిని వుంచి గట్టిగా హత్తుకునే వాళ్ళం

అయిదురూపాయల ఇరానీ ఛాయ్ ని వన్ బై టూ తాగుతూ
మధ్య మధ్య లో మలాయ్ లో చక్కర కలుపుకుని తింటూ
ఛాయ్ వాడు చేతులెత్తి దండం బెట్టి నెట్టివేసే వరకూ
గంటలు గంటలు అమ్మాయిల గురించి మాట్లాడుకునే వాళ్ళం

మిరపకాయ బజ్జీలోడి దగ్గర ముక్కులోంచి కారే కన్నీటిని తుడుచుకుంటూ
కట్లెట్ బండీ దగ్గర ప్యాస్ నింపిన పానీపూరీని
నోరంతా తెరచి కుక్కుకుంటూ
ఇండియా గ్రేట్ నెస్ గురించి చర్చించుకునే వాళ్ళం

చార్మినార్బ స్టాప్ లో బస్ గురించి వెయిట్ చేసే వారి మధ్యన కూర్చుని
దేశ రాజకీయాల గురించి, సినిమా హీరోల గురించి
ఊగిపోతూ  గొడవపడి..అదే కోపంతో వెళ్ళి పోయేవాళ్ళం

అడ్డదారిలో వచ్చి ట్రాఫిక్ పోలీసుకి దొరికి జేబులంతా గుల్ల చేసుకున్నపుడు
నో స్మోకింగ్ జోన్ లో స్మోకింగ్ చేసిన పొల్లగాడిని పొటుకు పొటుకు తిట్టి పంపించినపుడు
తెలంగాణోళ్ళమని చిన్న చూపు చూసిన సాలే గాణ్ణి పడేసి తొక్కినపుడు
అవసరమొచ్చిన ప్రతీ అడ్డమైన సందర్భాల్లో
మా కీ కసం అంటూ మనం చెప్పిన అబద్ధాల్లో..
ఊపర్ వాలాకీ కసం అంటూ మనం చెడగొట్టిన ప్రమాణాల్లో..
బేగం బజార్ సెంటు సీసాల్లాగా అమాయకమైన స్నేహమే గుభాళించేది.

ఆ రోజుల్ని ఈ రోజు గుర్తు చేసుకున్నప్పుడు
మనల్ని అనుమానాస్పదంగా చూసిన ముఖాలే గుర్తుకు వస్తాయి.
పాత బస్తీ అల్లర్ల లో మనల్ని చెదరగొట్టిన కంకర రాళ్ళే గుర్తుకు వస్తాయి

నేను హిందువుననీ
నీవు ముస్లిమువనీ..
మన స్నేహం ఈ లోక సమ్మతం కాదనీ
నమ్మకాల్ని కలిగున్న వారెవరూ
మనిషికి మరో మనిషి స్నేహం తప్ప
ఇంకేమీ అవసరం లేదని నమ్మగలిగిన వారైతే అయ్యుండరు

ఒక సూర్యుడూ..ఒక చంద్రుడూ
కలిసి ఉండలేరనుకునే లోకానికి
మనం గ్రహణాల్ని ఊతంగా చూపించలేక పోయాం
గ్రహణం మూఢనమ్మకం కాదు
ఆకాశం లో జరిగే అద్భుతమని చెప్పలేకపోయాం

అందుకే కదా నేస్తం
ఒకనాడు చిన్న చిల్లు కూడా లేని మన స్నేహం లాగే
ఇపుడు మనమధ్య పెరిగిన గోడకు చిన్న చిల్లు కూడా లేకపోయింది
ఇన్షా అల్లాహ్ అనుకుంటూ నీవు, నేను బాగుండాలనీ
రాముడి గుడిలో చేతులు జోడించి నేను, నీవు బాగుండాలనీ
కోరుకోవటమొక్కటి మనకు దేవుడిచ్చి ఉండకూడదనే మనం కోరుకుందాం.
మనరోజొకటి మనకోసం మునుముందు వేచి ఉంటుందనే ఆశపడదాం.

14/10/15

Friday, 9 October 2015

Oka kitikee deggara (poem)

విరించి ll ఒక కిటకీ దగ్గర ll
.......................................
ప్రతీ సాయంత్రమూ ఎందుకనో
మసిబారిన పాత జ్ఞాపకాల్ని వెంటబెట్టుకొస్తుంది.

ఆ చల్లటి నీరెండల్లో..
నీరెండలు చిత్రించే పొడుగాటి నీడల్లో
మంద్రంగా ఊగే పచ్చని చెట్లల్లో
ఇంటికి గుంపులు గుంపులుగా తిరిగెళ్ళే
పక్షుల్లో..ఆవుల మందల్లో
నావంటూ కానివాటన్నింటిలో
నా జ్ఞాపకాలెందుకు దాగున్నాయో
అర్థం కాకుండా ఉంటుంది.

ఏ సముద్రపు ఒడ్డో..నదీ తీరమో..
కనీసం చెరువు గట్టో లేని
ఈ మహా నగరంలో..
ఉతికిన  దుస్తులు ఆరేసుకోవడానికి తప్ప
పనికిరాని నా గది కిటికీ కూడా,
మండువేసవి ఉక్కపోతలో తెరుచుకున్న
ఒక కిటికీ రెక్కలా మారిపోయినపుడు
సాయంత్రపు నీరెండలలో దాగున్న జ్ఞాపకాలు
ఉప్పెనలా పిల్లగాలిలోకి దూరుతుంటాయి.
కిటకీ లోంచి కనిపించే కొత్తటి తారు రోడ్డు మీద
ఒక సన్నటి సంతోషం వేలాడుతూ  కనిపిస్తుంది.

రణగొణ శబ్దం  చేస్తూ బర్రున దూసుకు పోయే
కార్లూ, బైక్ లూ, బస్సులూ
నిశ్శబ్దంగా ఒక పద్దతిగా నడుస్తూ పోయే మనుషులూ,
ఎవరూ కూడా, ఏవీ కూడా
నాతో సంబంధం లేనట్టు
నన్ను పలకరించకుండా పోతున్నందుకు
నా సంతోషంలో ఒకరకమైన నిశ్శబ్దం అలుముకుని ఉంటుంది.

యూట్యూబ్ లో పిచ్చుక శబ్దాల్ని
ఇయర్ ఫోన్లో వినే నేను
కిటికీ లోంచి ఒక పిచ్చుకైనా కనిపిస్తుందని
ఆరాటపడటంలో తప్పేమీ లేదనుకుంటాను.
గూగుల్ పిక్చర్స్ లో
డెస్క్ టాప్ వాల్ పేపర్ లో
అందమైన పూలనూ, చెట్లనూ, లాండ్ స్కేప్ లనూ
చూసి ఆనందపడే నేను
తామూ ఇక్కడే ఉన్నామని తలలూపే పచ్చని చెట్లకోసమైనా
వెతకటంలో ఆశ్చర్యమేమీ లేదనుకుంటాను.

కిటికీ ఊచలు పట్టుకుని నిలబడుకున్నప్పుడు
అందమైన ఊహాలోకాలకు దూరంగా
ఎక్కడో కారాగారంలో ఉన్నట్టు ఉంటుంది.

చల్లని జ్ఞాపకం కోసం కిటికీ దగ్గర నిలబడిన
నన్ను చూసిన మా అమ్మ అంటుంది కదా..
"కన్నా..! దుమ్మూ, ధూలి, పొగ తో కాలుష్యమైపోయిన ఆ గాలి
నీ ఆరోగ్యానికి మంచిది కాదు..కిటికీ రెక్క మూసేయమని"
జ్ఞాపకాలతో పాటు కిటికీ రెక్కను మూసేసిన నేను
అమ్మ ఒడిలో ఆ ప్రకృతినంతా కలగంటూ పడుకుంటాను.

9/10/15
విరించి   ll నొప్పి అనుభవం ll
...................................................
రోజంతా తీవ్రమైన నడుము నొప్పితో
నొప్పిని మరచి పోవటానికి మధ్య మధ్యలో
కునుకులాంటి నిద్రతో గడిపేసాక
అర్ధరాత్రికి అయిదు నిముషాలముందు
ఈ విషయం గుర్తుకు వచ్చింది.

ఉదయం నిదుర లేచినప్పటినుంచి
సీలింగు మీద తిరిగే ఫ్యాను
గిర్రున తిరుగుతూ  కనిపించినప్పటికీ
నా కళ్ళు కూడా దానితో పాటు గిర్రున తిరగకుండా
దానినే నిర్లిప్తంగా చూస్తూ ఉంటాయి
రాత్రి పదకొండు యాభై ఐదు అయ్యే వరకు
ఈ ఫ్యాను ఎంతగా తిరిగి అలసిపోవాల్నో...

సీలింగు మీద బల్లితో సహవాసం చేశానని
ఎవరైనా ప్రగల్భాలు పలకొచ్చేమో..
కానీ, బల్లుల్లేని తెల్లటి సీలింగు మీద
ఆలోచనల్ని అతికించుకుని చదవాలనిపిస్తుంటుంది.
ఆలోచనలు రావాలని కోరుకునే ధ్యానమిదేనేమో..
బెడ్ మీదే పడుకుని బయటి లోకం తెలియనపుడు..
ఒక కిటికీ కూడా నా వైపు చూడనపుడు
ఉన్న ఆలోచనలు కూడా అరిగిపోయిన క్యాసెట్టులా
బరువైన తలను గిర్రున తిప్పేస్తాయి.

కుడివైపుకి తిరిగితే ఒక నొప్పి..
ఎడమవైపుకి తిరిగినా మరలా కలుక్కున అదేనొప్పి
కండరమో..నరమో..ఉడుం పట్టులా పట్టి..
నడ్డిని మొసలి చీల్చినట్టు చీలుస్తుంటే...
నెత్తి మీద ఇనుప ఫ్యాను రెక్కలు కాకుండా..
స్వర్గాలు కనిపిస్తాయా..
కంటి ముందు అప్సరసలూ నర్తిస్తారా?.

మధ్య మధ్యలో టీ బ్రేక్..టిఫిన్ బ్రేకూ..
లంచ్ బ్రేక్..డిన్నర్ బ్రేకూ నూ..
ఇక ఒకటీ రెండు బ్రేకులంటావా తప్పనిసరి.
బ్రేకు ఏదయినా..పదింతలయ్యే నొప్పి
ఆ తరువాత పది రకాల టాబ్లెట్లు.
ఒకటి పసుప్పచ్ఛగా జారుతున్నపుడే అనుకున్నా
కడుపులో టాబ్లెట్ల జనాభా పెరిగి
కిడ్నీని బంజారా హిల్స్ చేసుకున్నాయని.

అమ్మా..నాన్న..భార్య ఎవరో ఒకరు
అన్నం కలిపి ముద్దలు నోట్లో పెడుతూ
కాసేపు బాధ పడుతూ  నొప్పిని పదింతలు చేస్తూ
కాసేపు ధైర్యం చెబుతూ..నొప్పికి సున్నా చుడుతూ
ఈ పదిహేను రోజులూ సపర్యలు చేశారు.
కంటికి రెప్పలా అనే కదా మామూలుగా చెప్పేది..
అలాగేనన్నమాట.

రాత్రయ్యాక అందరూ పడుకున్నాక
దిక్కు తెలియని సమయంలో..
ఒక దిక్కుమాలిన ఆలోచన ఒచ్చింది
ఒస్తే ఒచ్చింది..
అదెప్పుడొచ్చినా కవితలాగే వస్తుందని తెలుసుకదా.

ఇంకేముంది చకచకా కవిత రాసేసాక..
నడుము నొప్పిలోని అనుభవ సారమంతా పిండేశాక
అర్ధ రాత్రికి అయిదు నిముషాలకు ముందు
ఈ విషయం గుర్తుకు వచ్చింది.
వేసి ఉంచిన ట్యూబు లైటు తీయనేలేదని.
ఇపుడెవరు తీయాలి..?
ఎడతెగక రాత రాసే కవిత తీయాలా..?
ఎడతెగక తీపు తీసే నొప్పి తీయాలా..?

7/10/15

Monday, 5 October 2015

భాను మూర్తి గారూ...నన్ను ఇరికించారా..?
మా ఇంట్లో మీరూ, హెచ్చార్కే గారూ, నేనూ ఎదురెదురుగా కూర్చుని ఒక అందమైన సాయంత్రాన్ని మన మాటలతో నింపేసిన రోజు గుర్తుకొస్తోందిప్పుడు. హెచ్చార్కే గారు రాసిన ఈ పోస్ట్, కల్యాణీ గారు రాసిన 'పిపీలక సోదరులారా' అనే వ్యాసం లోనిది. అందులో ఆమె మధ్యతరగతి మేధావులు రాజ్యం చేస్తున్న దౌర్జన్యాన్ని ఖండించాలని పిలుపునిచ్చింది. రాజ్య దౌర్జన్యాన్ని శతృవుగా, పాముగా,  మధ్యతరగతి వారందరూ చీమలుగా రాశారు. మొత్తానికి కల్యాణి గారి వ్యాసము కూడా ఇంకేదో వ్యాసానికి వ్యంగ్య సమాధానమనేది హెచ్చార్కే గారి సమాధానం చదివాక అర్థం అయింది. అసలును వదిలేసి మనం సమాధానాలు చదువుతూ పోయాము కాబట్టి, అసలు ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారో చూచాయగా తప్ప వివరంగా అర్థంకాలేదు.

అయితే హెచ్చార్కే గారి సమాధానం సడన్ గా మహాభారతమూ, బ్రాహ్మణులూ, శూద్రులూ ఎందుకొచ్చారో అర్థంకాలేదు. అసలు మొత్తానికీ ఏమీ అర్థం సరిగా కావటం లేదు కాబట్టి, ఈజీగా అర్థం అయిన ఈ ముక్క అందర్నీ ఆకర్షించింది. ప్రతీ పది పద్యాలకొకసారి బ్రాహ్మణులను పూజించాలని చెప్పిన ఆ మహాభారత పుస్తకమేదో, ఆ గ్రంధకర్త ఎవరో మనకు తెలియదు. ఆయన కూడా రిఫరెన్స్ ఇవ్వలేదు. మహా భారతం రాసిన వేద వ్యాసుడు పడవనడిపేవాడి కూతురైన సత్యవతికీ, పరాశరుడికీ కలిగిన కుమారుడు. జన్మ రీత్యా బ్రాహ్మణుడు అనటానికి లేదు. అయితే ఇక్కడ రెండే విషయాలు చెప్పదలచాను. ద్వాపర యుగం లో జరిగిన మహాభారత కథని, ఇపుడు ఈ సమాజానికి ఆపాదించి మాట్లాడుకోవటం విడ్డూరం. ఆ సమాజమే వేరు కదా. ఎంతో మార్పు వచ్చింది. గతి తార్కిక భౌతిక వాదం ప్రకారం ఆ మార్పు ఎక్కడినుంచో ఊడిపడదు. ఆ వస్తువు లోపలే ఉంటుంది. ద్వాపర యుగం నుంచి ఇప్పటి దాకా అసలు మార్పే జరగలేదంటే అది రీజన్ కి అతకదు. మహాభారతం ఒకప్పటి సాహిత్యంగా పరిగణిస్తే, నికరంగా చరిత్ర తెలియని సాహిత్యాన్ని కూడా మార్క్సిస్టు దృక్పథంతో విమర్శ చేయటం ఒక దోషమని వేల్చేరు నారాయణ రావుగారి అభిప్రాయం. ఆ విషయాన్ని అటు వదిలేస్తే...

మహభారత కాలంలో వర్ణాశ్రమ ధర్మం ఉండేది, కుల వ్యవస్థ కాదు. ఆ కాలంలో ప్రతీ నాలుగు సంవత్సరాలకొకసారి వర్ణాశ్రమ ధర్మం మార్చుకునే అవకాశం ఉండేదని బొజ్జాతారకం గారి ఒక పుస్తకంలో చదివినట్టు గుర్తు. రిఫెరెన్స్ తప్పక తరువాత ఇస్తాను. గీతలో కూడా శ్రీకృష్ణుడు 'చాతుర్వర్ణం మయా సృష్ట్వా గుణ కర్మ విభాగశః' అన్నాడు. గుణాన్ని బట్టి, కర్మని బట్టే ఆ కాలంలో వారి వారి వర్ణాన్ని నిర్ధారణ చేసేవారనేది స్పష్టం. రాధేయుడి ఉదంతమే ఇందుకు ఉదాహరణ. క్షాత్రమున్న వాడే క్షత్రియుడని, కర్ణుని క్షాత్ర పరిక్ష కు గురి చేసి, అతడు ఆ పరీక్షలో నెగ్గాకనే క్షత్రియుడయ్యి అంగ రాజ్యాధిపతి అయ్యాడు తప్ప, ఇప్పటి సమాజంలా క్షత్రియ కుమారుడు కాబట్టి క్షత్రియుడు కాలేదు. ఇక హెచ్చార్కే గారు, 'గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు' అనే అంశాన్ని ఉటంకించి ఇలా ప్రతీ పది పద్యాలకూ....అనే ఆరోపణ చేసినట్టైతే..ఆ సమాజంలో మేధావులనేవారు ఎవరైనా బ్రాహ్మణులనబడుతున్నారని అర్థం అవుతున్నది. అంటే మేథావులపై రాజ్య హింస ఉండేది కాదనేది కూడా స్పష్టం. గోవులు వ్యవసాయానికీ, ఎద్దులను కనటానికీ, తద్వారా రైతులకూ లాభం చేకూర్చుతాయి కాబట్టి, అవి శుభంగా ఉండాలి అని అంటే..కష్టజీవుల మీద కూడా రాజ్య దౌర్జన్యం లేదనేది స్పష్టం. మొత్తానికి మహాభారతం వర్గ పోరాటం కాదు. రాజ్యంకోసం ఒక రాజకుటుంబంలోని అన్నదమ్ముల మధ్య పోరాటం.

కాబట్టి హెచ్చార్కే గారు ఉటంకించిన ఈ ఉదాహరణ సందర్భానికి అతకదు. అయితే తరువాతి కాలంలో బ్రాహ్మణులు శూదృలమీద చేసిన దాష్టీకాలు ఖండించవలసిందే. దానికి మహాభారతాన్ని బూచిగా చూపటమంటే ఇంకా గతంలో, ద్వాపర యుగంలో జీవించటమే. హెచ్చార్కే గారు ఒకరు సేఫ్ పొజిషన్ లో కూర్చుని ఇంకొకరిని పోరాటం చేయండని పురమాయించటమేమిటని ప్రశ్నించారు. అంత వరకు బాగుంది. ఆ కాంటెక్స్ట్ల్ లో ఈ మహాభారత బ్రాహ్మణ ఉదాహరణ పొరపాటున ఒక రకంగా తొందరపాటున ఉటంకించి ఉంటారని నా అవగాహన. ఘటుగా రెస్పాండు అయ్యారు కాబట్టి ఇలాంటి తొందరపాటు పొరపాటు దొర్లి ఉంటుందని నా అవగాహన.  అయితే "మిమ్మల్ని కలాలు పట్టుకోమని ఎవరు నిర్ణయించారు, మీరే నిర్ణయించారు.. "అని అన్నపుడు, ప్రజల్ని కలాలు పట్టుకోమని ఇంకెవరు నిర్ణయించాలబ్బా అని నేను ఆలోచనలో పడ్డాను. మీరు రాయాలి, మీరు రాయకూడదు అని నిర్ణయించేవారున్నారా ఎవరైనా..? నాకైతే తెలియదు. వారెవరో చెబితే అసలు నేను రాయవచ్చో రాయకూడదో తెలుసుకుంటాను.