Wednesday, 2 December 2015

Kavitwa sandarbham3 - చెరా రాసిన "వందేమాతరం" కవితలో దేశ ద్రోహమెక్కడుంది?.

చెరా రాసిన "వందేమాతరం" కవితలో దేశ ద్రోహమెక్కడుంది?.
...............................................................................

గ్లాసులో సగం దాకా నీరుందనేవాడు అధికార పక్షంవాడయితే, లేదోయ్ సరిగ్గా చూడు, సగం గ్లాసు ఇంకా ఖాలీగానే ఉంది అనేవాడు ప్రతిపక్షం వాడు. ఇద్దరూ ఒక సత్యాన్నే చెబుతున్నారు. కానీ ప్రాథమ్యాలు, స్వలాభాలు మారి, చెప్పే పద్ధతిలో మార్పులు చేసి, రెండు వేరు వేరు సత్యాల్లాగా భ్రమింపజేస్తున్నారు.

దేశం వెలిగిపోతోందని అధికార పక్షం వాడంటే, లేదోయ్ సరిగ్గా చూడు, అసహనం పెరిగిపోతోందని ప్రతిపక్షం వాడంటాడు. ఇద్దరూ రెండు వేరు వేరు సత్యాల్నే చెబుతున్నారు. కానీ, తాము చెప్పిన సత్యమే సత్యమని భ్రమింపజేస్తున్నారు.

గ్లాసులో నీరు ఒక ఆబ్జెక్టివ్ విషయం.కంటి ముందు కనిపించే దృగ్విషయం.
కానీ, ఇంత పెద్ద భారత దేశం గురించి, అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక మెతుకు పట్టుకుని చెప్పినట్టు, ఒకటి రెండు సంఘటనలాధారంగా నిర్ణయించి చెప్పటం సాధ్యమా?. అది అసలైన సత్యాన్నే చెబుతున్నట్టా?. "ఇదే సత్యం" అని మనతో నమ్మకంగా పలుకుతున్న ఇరు వర్గాల వారూ, వారి వారి రాజకీయ స్వలాభం కోసం నిర్మించుకున్న సత్యాలు, నిర్మిత సత్యాలు, కవిని ప్రభావితం చేస్తాయా?. కవి ఈ నిర్మిత సత్యాల ముసుగులోంచి, ముసురులోంచి బయటపడి అసలైన సత్యాన్ని దర్శించగలుగుతాడా?.  సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగే శక్తి, నిజాయితీ, నిబద్ధత కలిగిన కవి కన్ఫర్మేషన్ బయాస్ కి లోను కాకుండా పని చేయగలడా?.

కన్ఫర్మేషన్ బయాస్ అంటే ఏమిటి?. అంటే ఒక విషయం పై ముందే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని ఉండటమే కాక, ఆ తరువాత ఆ విషయానికి సంబంధించిన ఏ సమాచారాన్నైనా, మొదట ఏర్పరుచుకున్న అభిప్రాయ దృక్కోణం లోంచే చూడటం. 'నిక్కములే తోచుచుండు' కూడా కన్ఫర్మేషన్ బయాస్ వలననే. స్నేహం చెడిపోయాక ఏర్పడిన వ్యక్తిగత విద్వేషం. మనిషికుండే ఈ బేసిక్ నేచర్ ని ఉపయోగించుకుని, పాలక ప్రతి పక్షాలు తమ తమ క్యాంపైన్ ని మొదలుపెడతాయి. చివరికి వ్యాపార సంస్థలు కూడా మనం కొనుక్కునే ప్రతీ వస్తువునూ అడ్వర్టయిజ్మెంట్ల ద్వారా మనలో ఒక కన్ఫర్మేషన్ బయాస్ ని ఏర్పరచి మనల్ని తమకు అనుగుణంగా మలచుకుంటాయి. మన 'ఏషియన్ ఫుడ్స్' వండటానికి పల్లీ నూనె స్రేష్టమైనదైనా, పెద్ద పెద్ద పూరీల నడుమ చిన్న పిల్లగాడు ఉరుకుతూ  మనలోకి సన్ఫ్లవర్ నూనె నే మంచిదనే ఒక అభిప్రాయాన్ని ముద్ర వేశాడు. మనం కన్వీనియంట్ గా నమ్మేస్తాం. నూనెలో సహజంగా వచ్చే నురగ కనపడటకపోయేసరికి స్వచ్ఛంగా మనకోసం ప్యూరిఫై చేశారనుకుంటాం. కానీ కంపెనీ వాడి ప్యాకేజీలకు అనుగుణంగా నురగను తీసేసే హైలీ ఎసిడిక్ ఆడిటివ్స్ ని వాడతారని కన్వీనియంట్ గా మరచిపోతాం. అసలు తెలిసి ఉంటేనేకదా. కంపనీ వాడు తెలియనీయడు. చాలా గొప్పదనే నమ్మకాన్ని మన మనసులోకి చొప్పించేశాడు. ఈ విధంగా సంస్థలూ, వ్యవస్థలూ సత్యాలను నిర్మిస్తాయి. ఈ నిర్మిత సత్యాలు, ఒక రకమైన కన్ఫర్మేషన్ బయాస్ ఉన్న వారికందరికి అబ్సొల్యూట్ సత్యాల్లాగానే కన్పిస్తాయి. దాన్ని దాటి కొత్తగా ఆలోచించటమన్నది అసలుకే సాధ్యపడని విషయం అయిపోతుంది. కవి కూడా ఈ నిర్మిత సత్యాల్ని కాలరాయలేని పరిస్థితిలోకి పోవటం, పాలక పక్షమో ప్రతి పక్షమో ఇంకో కొత్త పక్షమో చేరిపోవటం సాహిత్య పరంగా దారుణమైన విషయమే అవుతుంది.

కానీ మనకు ఇలాంటి బయాస్ కి అతీతంగా కొంతమంది కవులు కన్పిస్తారు. ముఖ్యంగా దిగంబర కవులు. అయితే దిగంబర కవిత్వపు లక్షణాల్నీ లక్ష్యాలనీ చర్చించటం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. ( ఆ పనిని మునుముందు రాబోయే వ్యాసాల్లో చేయాలి అనుకుంటున్నాను). కానీ ఇక్కడ తమ స్వంత ఆలోచనా శక్తితో, ఎలాంటి ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ల ప్రభావానికీ లోను కాకుండా ఈ దిగంబర కవులు ఎలా సమాజాన్ని నగ్నంగా ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగారన్నది చాలా ముఖ్యవిషయం.  వారి నిబద్ధత, సత్య సంధత ఇపుడు మనకు ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది.  ఎందుకంటే ఇపుడు మనకు దొరికే ఇన్ఫర్మేషన్ అంతా కేవలం మీడియా ద్వారా లభించేదే. నిజానికి అది మనకు శుద్ధంగా చేరుతుందనే నమ్మకం లేదు. థియరీ ఆఫ్ సిమ్యులేషన్ అని ఉంది. బాద్రిల్లర్ ప్రతిపాదించినది.  'అసలు గల్ఫ్ యుద్ధం జరిగిందా?!' అని అడుగుతాడాయన. ఏమో ఎవరికి తెలుసు?. మనకు తెలిసిందంతా అమెరికన్  మీడియా చూపించినదే. అవి నిర్మిత సత్యాలయిండవచ్చు కదా!. వార్తలని కూడా స్టైలైజ్డ్ వర్షన్ లాగా ఫిక్షన్ లాగా చూపెట్టడం ప్రస్థుతం జరుగుతోంది. కొన్ని వార్తా ఛానల్స్ ఇంకాస్త అరాచకంగా 'పొలిటికల్ గాసిప్స్' ని ప్రసారం చేస్తున్నాయి. గాసిప్స్ అంటే పుకార్లు. పుకార్లు వార్తలెలా అవుతాయి?. పుకార్లని కనుక్కని, వీలైతే తయారు చేసుకుని ప్రజలకు చూపించటం జర్నలిజం అవుతుందా?. ఇలా వాస్తవమూ, ఫిక్షన్ కలిసిపోయిన ఈనాటి సమాజంలో, సత్య సంధుడైన కవి జాగరూకతతో ఉండక తప్పదు.

కవికి కార్య రంగం సమాజమే, కార్య ప్రేరణ సమాజమే, కవితా వస్తువూ సమాజమే అయినపుడు, సునిశిత దృష్టి కూడా అవసరమే. అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో కూర్చుని ఇండియా గురించి రాసే  వారికీ, అడుగు బయట పెట్టకుండా ఇంట్లో కూర్చుని రాసే వారికీ ఈ ప్రస్తుత సమాజానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి వస్తుంది?. అంతా మీడియా మీదనే కదా ఆధార పడేది. ఆ కవిత నిజమైన కవిత అవుతుందా. లేక ఒక వర్గం ని ఎలివేట్ చేసే అడ్వర్టయిజ్మెంటవుతుందా? ఇదేమీ ఎమోషన్ రి కలెక్టెడ్ ఎట్ ట్రాంక్విలిటి కాదుగా, భావ కవిత్వం రాసుకోవటానికి. సమాజాన్ని నగ్నంగా వర్తమానంలో ఉన్నది ఉన్నట్టు గా రాయాలి. అదిగో అలా రాసి ఒక దిశా నిర్దేశం చేసిన వారే దిగంబర కవులు. వీరి సామాజిక దృక్కోణం అస్తిత్వ వాదుల 'డిస్పెయిర్'( despair) కాదు. డిస్పెయిర్ మాత్రమే అయితే కవిత్వం రాయటమెందుకు, సార్త్రే 'నాసియా' చదివి సూయిసైడ్ చేసుకోవచ్చు. లేదా అల్బర్ట్ కామూ సృష్టించిన మెర్ సాల్ట్ లాగా మరణాన్ని చూసి దుఃఖ పడకుండా స్తబ్దుగా ఉండిపోయుండొచ్చు. మెర్ సాల్ట్ ని, రేయ్మండ్ బండ బూతుల లెటరు రాసియ్యమని అడిగినపుడు రాయనని అనటానికి కారణాలు కనిపించని స్థితిలో వీరేమీ లేరు. లేదా మెర్ సాల్ట్ లాగా 'దుఃఖాన్ని చూసి ప్రపంచం నిర్లిప్తంగా ఉండిపోతుందని తెలుసుకోగలగటమే ఎన్లైటన్మెంటు'  అనుకుని, ఒక భావాతీత ప్రశాంత స్థితిలోకి వీరు జారిపోనూలేదు.  అందుకు విరుద్ధంగా ధ్వంస రచన కు పూనుకున్నారు.

దిగంబర కవుల్లో ఒకరైన చెరబండ రాజు రాసిన "వందేమాతరం" కవిత, ఒక సత్యాన్ని ఎలాంటి ప్రలోభాలకీ లోనవకుండా దేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనముందు ఉంచుతుంది . ఈ కవితలో ఇంకో ప్రత్యేకత ఏమంటే 1965 లో చెరబండ రాజు చూసిన దేశ పరిస్థితికీ ఇప్పటికీ ఏ మాత్రం తేడా లేకపోవటం. అప్పటి పరిస్థితులకన్నా, ఇప్పటి పరిస్థితులకే ఈ కవిత ఇంకా చక్కగా అమరినట్టు కనిపించటం. తేడా ఉన్నదల్లా, ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్లని సమర్థవంతంగా మోస్తున్న మీడియా, అది ప్రజల్ని వర్గాలుగా చీల్చి ఒక్కొక్క వర్గాన్నీ ఒక నిర్మిత సత్యాన్ని నమ్మించగలిగి, అదే నిజమనుకొనే భ్రమలోనే ప్రజల్ని ఉంచగలగటం. చెరబండ రాజు కవితలో అరాచకం కనిపించదు. నిబద్ధతతో కూడిన దేశభక్తి కనిపిస్తుంది. అయితే దేశభక్తి అనే దాన్ని ఒక 'ఎమోషనల్ భావన'గా మార్చి వేసినపుడు ఈ పదమే హాస్యాస్పదం అవుతుంది. నిజానికి దేశమనే 'భావం' మిథ్య. కానీ 'దేశం' సత్యం. దీని వలన దేశ భక్తి రెండు రకాలుగా కనిపిస్తుంటుంది. దేశమనే పవిత్ర భావనలాంటి ద్వారా వచ్చిన భక్తి. ఇది ప్రేయసి లేదా దేవుడు స్థానంలో దేశాన్ని ఉంచటం వల్ల కలిగిన అవస్థ. అలాకాక దేశమనేది జవజీవాలు కలిగిన సత్యం లాగా తెలుసుకొని దానిలోని జీవులూ, వారి జీవితమూ, వేదనలూ, ఆకలిలోంచి వచ్చిన మానవతతో కూడిన దేశ భక్తి. దేశాన్ని ముందుకి నడిపించటం ఈ రెండవ రకం వారికి కేవలం ఒక భావన కాదు. యదార్థ సత్యం. వారికది ఒక పరిణామ విషయం. ఈ కవితలో ఇటువంటి భక్తి కనిపిస్తుంది. భారత దేశాన్ని తిట్టడం కాకుండా ఆమెని తమ స్వార్థానికి వాడుకుంటున్న శక్తుల మీద సటైర్ కన్పిస్తుంది. దీన్ని సరిగా అర్థం చేసుకోక పోతే, ఈ కవిత దేశ ద్రోహన్ని రెచ్చగొట్టేదానిలా కనిపిస్తుంది. అందుకనేమో కవితలో భారత దేశాన్ని కులటగా చిత్రించినట్టు గా అపార్థం చేసుకుని, చెరబండ రాజు మీద దాడి కూడా జరిగిందప్పట్లో. నిజానికి, ఇలా దిగజారిపోతున్న భారత దేశం మీద ప్రేమ దయ జాలి వంటివే కనిపిస్తాయి ఈ కవితలో. కవితలో నిరాశ కానీ, అసహ్యం కానీ కనిపించదు. కానీ ఒక ఆవేదన కనిపిస్తుంది. 'అమ్మా భారతీ, నీ గమ్యం ఏమిటి తల్లీ..!' అని అడగటంలో వ్వవస్థ మీద అసహ్యం ఎక్కడ కనిపించింది?.  సొల్యూషన్ కోసం అన్వేషణ కన్పిస్తుంది.

"దుండగులతో పక్క మీద కులుకుతున్న శీలం నీది".
ఈ దుండగులెవరు అంటే చెప్పటం కష్టం. దుండగులను ప్రోత్సహిస్తుందనే స్పృహ ఈ వాక్యంలో ఉంది. ఒక దేశం ఎందుకు దుండగులను ప్రోత్సహించాలి? ఎందుకు భరించాలి? అని మనం ప్రశ్నించుకుంటే విషయం చాలా పెద్దదవుతుంది. ఇక్కడ దేశం అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వమనుకోవాలి. రాజకీయ కారణాలే దుర్మార్గాల్ని ప్రోత్సహిస్తాయనేది అందరికి తెలిసిన విషయమే.

"అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది".
ఇంటర్నేషనల్ మార్కెట్ ఇపుడింకా ఎక్కువ అయింది. కానీ ఏకొద్దిగనో ఉండిన ఆ కాలంలోనే కవి గుర్తించి గర్హిస్తున్నాడు. తన అందాన్నే తాకట్టు పెట్టిందట. భారత దేశపు అందం ఏమిటి?. దాన్ని అంతర్జాతీయ విపణిలో తాకట్టు పెట్టి మనమేమి బదులుగా తెచ్చుకున్నాం అనేది మనం ఆలోచించాలి.

"సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది".
సంపన్నుల చేతుల్లోనే రాజకీయాలు, ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇది కవి యొక్క సునిశిత పరిశీలనకి తార్కాణమైన వాక్యం. ఇది ఇప్పటికీ మారలేదు. మారుతుందన్న నమ్మకం కూడా లేదు. ఈ విషయంలో నిత్య యవ్వనమే.

"ఊసినా దుమ్మెత్తి పోసినా చలనం లేని మైకం నీది".
దీనికి విరుద్థంగా ఇపుడు అతి చలనం కనిపిస్తుంది. దుమ్మెత్తి పోసే వారిలోనూ అతి, అలాగే స్పందించే వారిలోనూ అతి. చెరబండ రాజు సమయంలో లేని మీడియా అతి, మనకిపుడుంది. సమాచార విప్లవం సమాచారం కంటే అతినే అతిగా తీసుకుని వచ్చిందని టీవీ ముందు అయిదు నిముషాలు కూచుంటే చాలు. అర్థం అయిపోతుంది.

తరువాతి కవితంతా "రోటీ కప్డా అవుర్ మకాన్" లను అందించలేని దానిలా దేశాన్ని వర్ణిస్తాడు కవి . ఈ కవికి ఎంతటి లోతైన ముందు చూపుందో అనిపిస్తుంది. ఈ కవిత చూసే  తరువాత వచ్చిన ప్రభుత్వాలు రోటీ కపడా మకాన్ స్లోగన్ ఇచ్చాయేమో అనిపించినా, 1964 లో ఆకలి యువతరం(hungry youth) ప్రతినిధి గా కవి ఎంతగా నలిగి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.ఈ స్లోగన్ ఆనాటి అందరి అవసరం అనిపిస్తుంది.

"కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న ఎలుకల్నీ పంది కొక్కుల్నీ భరిస్తూ నిల్చున్న భారతివమ్మా!..నోటికందని సస్య శ్యామల సీమవమ్మా!."
దేశంలో అభివృద్ధి జరుగుతున్నదనే కవి రాశాడు. దేశం సస్య శ్యామలంగా ఉందనే రాశాడు.  కానీ ఆ ఫలాల్ని తినే ఎలుకలూ పందికొక్కులు వాటిని అందరికీ అందనివ్వటం లేదు. ఎంత నిష్కర్షగా కవి చెప్పాడు. ఒక సంస్థ  వారికి ఈ కవితలో దేశ దూషణ ఎక్కడ కనిపించింది?. ఎందుకు కనిపించింది?. ఎందుకు కవి మీద దాడి చేశారు?. మనం ఇంతకుముందు అనుకున్నట్టు 'కన్ఫర్మేషన్ బయాస్' అయివుండవచ్చు.

దేశ పరిస్థితులను ఎలాంటి బయాస్ కీ గురికాకుండా చూడగలిగే చూపు, నిజాయితీ కలిగిన చూపు  దిగంబర కవుల్లో కనిపిస్తుంది. దాన్ని ఈ తరం కవులం అందిపుచ్చుకోవాలి. దానికి సరి అయిన తరుణం ఇదే.  సమాచార విప్లవం పేరుతో మన ఆలోచనల్ని పూర్తిగా కొల్లగొట్టి, తన ఆలోచనలని మాత్రమే మనలో చొప్పించే మీడియా, మనల్ని మనకు కాకుండా చేస్తున్న మీడియా, విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా విజృభిస్తున్న ఈ తరుణం లోనే చెరా ఈ కవితలో చూపిన స్పిరిట్ ని అందిపుచ్చుకోవాలి. ముందు కవి తనకుతాను స్వచ్ఛందంగా మేల్కొని, తరువాత సమాజాన్ని మేల్కొలిపే యజ్ఞంలో తలమునకలవాలి.

ఓ నా ప్రియమైన మాతృదేశమా
తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా
దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది
అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది
సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది
ఊసినా దుమ్మెత్తి పోసినా చలనం లేని మైకం నీది
కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న
ఎలుకలూ పందికొక్కుల్నీ భరిస్తూ నుంచున్న భారతివమ్మా
నోటికందని సస్యశ్యామల సీమవమ్మా
వందేమాతరం వందేమాతరం
ఒంటిమీది గుడ్డలతో జండాలు కుట్టించి
వివస్త్రవై ఊరేగుతున్న ధైర్యం నీది
అప్పుతెచ్చి లేపిన మిద్దెల్లో, కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది
ఎండిన స్తనాల మీదికి ఎగబడ్డ బిడ్డల్ని, ఓదార్చలేని లోకం నీది
ఆకలికి ఎండి మాడి ఎరువు సొమ్ములతో వీధిన పడ్డ సింగారం నీది
అమ్మా, భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ
వందేమాతరం వందేమాతరం

2/12/15

Saturday, 28 November 2015

Recession / poem

విరించి ll  రిసెషన్  ll
..............................................
ఈ రోజు నీ మాటలు విన్నప్పటినుంచి
నాకెందుకనో ఒకింత భయంగా వుంది

ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ
ఈ రోజు నీవు చెప్పిన మాటలు
ఎందుకనో మొదటి సారి నాలో
ఒక ప్రేమ రాహిత్యాన్ని సృష్టించాయి.

మన మొదటిరాత్రి నాటి మల్లెల పరుపు మీద
మూసి ఉంచిన అకెడమిక్ సర్టిఫికేట్స్ ఫైల్ లాగా
ముడుచుకుని పడుకున్న నేను,
మరునాటి ఉదయానికల్లా
నిర్మలమైన నీ ప్రేమలో నలిగిపోయిన
పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్నయ్యాను.

ప్రతీ ఉదయం పూట, మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ ను
తయారు చేసి నీ చేతికి అందించేటపుడు
పీ హెచ్డీ థీసీస్ పేపర్లు అందించిన జ్ఞాపకం.
థీసీస్ చివరి రిఫరెన్స్ నోట్స్ లో..
పెండ్లీ, సంసారమూ
ఎంగిలి అంట్లూ, విడిచిన బట్టలూ
పిల్లలూ, ఆచారాలూ ఎట్సెట్రా
ఇంక్లూడ్ చేయక పెద్ద తప్పు పనే చేశాన్నేను.

పేరు ముందర ఒక 'డా' అక్షరం
పక్కన రెండు నిలువు గీతల్ని ఊహించుకున్నపుడు
మారిపోయే ఇంటి పేరును పట్టించుకోకపోవటం
నిజంగా నాదే తప్పు.

కానీ ఈ రోజు,
ఒక రిసెషన్ పరిగెత్తి వస్తేనో..
పిల్లల స్కూలు ఫీజులూ, పెట్రోలు ధరలూ
పెట్రేగి పోతేనో.., చివరికి ఇన్ని రోజులకు,
నేనూ ఓ ఉద్యోగం చేస్తే బాగుంటుందన్నావు చూడు..
మొదటి సారి నా చదువుకొక వాల్యూ ఇచ్చావు చూడు..
ఇంట్లో ఇన్నేళ్ళుగా పడి ఉన్న నన్ను
అవసరానికి పనికొచ్చే ఒక యంత్రంలా
నీవు కొత్తగా నన్ను డిస్కవరీ చేసినట్టనిపించింది.

నేనో యంత్రాన్నే...మనిషిని కాదని
నాకు నేనుగా తెలుసుకోగలిగినపుడు
ఆనందం స్థానంలో...ఒక భయం పుట్టుకొచ్చింది.
నిర్మలమైన నీ ప్రేమ వెనుక ఒక జగన్నాటకం రక్తికట్టింది.

కానీ, ఓ. కే. చెప్పేముందు ఒక్కటే కోరిక
ఈ రిసెషన్ ముగిసిపోయాక
నా సైన్ బోర్డ్ మీద ఏం రాసుకోవాలో ఇపుడే చెప్పు
డాక్టర్ అనా..గృహిణి అనా?

24/11/15

Kavitwa sandarbham 1-కదం త్రొక్కుతూ పదం పాడుతూ హృదయాంతరాళం గర్జిస్తూ...పదండి పోదాం.

కదం త్రొక్కుతూ  పదం పాడుతూ  హృదయాంతరాళం గర్జిస్తూ...పదండి పోదాం.
-------------------------------------------------------------------------------------------------

ఒక కవిని, అతడి కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సాధనాలూ పద్ధతులూ ఎన్నో వున్నా, వర్తమాన, అలాగే కడపటి భూతకాల సాహిత్య చరిత్ర కనుక మనకు తెలిసి వుండకపోతే, ఆ కవిత సంపూర్ణంగా అర్థమయిందని చెప్పగలగటం సాహసమే అవుతుంది. ఎందుకంటే కవి జీవితం, వ్యక్తిత్వం అలాగే అతడి కవిత అన్నీ కూడా కాలానితో అవినాభావ సంబంధాన్ని కలిగి వుంటాయి. కడపటి భూతకాలమూ, నేటి వర్తమాన పరిస్థుతులూ రెండూ కవి ఆలోచనల్ని ప్రభావితం చేస్తాయి, అలాగే కవి కూడా తన రచనలతో అతడి వర్తమాన, సమీప భవిష్యత్తునూ ప్రభావితం చేయగలుగుతాడు. మనకు చాలా మటుకు తాను జీవించి వున్న కాలం యొక్క ప్రభావానికి లోనయిన కవులే కనిపించినా...ఎక్కడో ఓ చోట ఒక మహా కవి, ఒక యుగ కవి, తాను నివసించిన కాలాన్ని శాసిస్తూ కూడా కనిపిస్తూంటాడు. అలాంటి కోవకి చెందిన వాడే శ్రీశ్రీ.

శ్రీశ్రీ మహా ప్రస్థానం పుస్తకంలోని కవితలు 1930 - 1940 సంll ల మధ్య కాలం లో రాసినవి. ఇలాంటి సమయంలో పశ్చిమ దేశాలయిన యూరోప్ అమెరికాల్లో మొదటి ప్రపంచ యుద్ధ ముగింపు ప్రభావమూ, గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ 1929,  తద్వారా హంగ్రీ థర్టీస్ వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి ప్రభావం పశ్చిమ దేశ సాహిత్యంలో పెను మార్పులు తీసుకువచ్చి, 'మోడెర్నిజం' అనే సాహిత్య దశ కనిపించటం మొదలయ్యింది. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా రాజకీయ సాంస్కృతిక రంగాల్లోనే కాక, సాహిత్య రంగంలో కూడా అధికారం మెల మెల్లగా బ్రిటీష్ చేతుల నుండి అమెరికాకు మారటం సంభవిస్తూ వుండింది. ఎజ్రా పౌండ్, టీ.ఎస్.ఇలియట్ వంటి అమెరికన్ కవులు మోడర్నిస్ట్ మానిఫెస్టోతో  ఆంగ్ల సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న తరుణమది. ఇక్కడ, భారత దేశంలో బ్రిటీష్ పరిపాలన ఉంది. దాని ప్రభావం వలన ప్రజా చైతన్యం, కేవలం రాజకీయ చైతన్యంగా మాత్రమే కాక ఇంకా రెండు రకాల చైతన్యాలుగా వృద్ధి చెందుతూ  వచ్చింది. మొదటగా, ప్రాచీన భారత వైభవాన్ని పునర్నిర్మించే దిశగా మత సంస్కరణలూ, సమాజోద్ధరణలూ ఊపందుకున్నాయి. అందుకు రాజా రామ్ మోహన్ రాయ్, స్వామీ దయానంద సరస్వతి, స్వామీ వివేకానందుడూ మున్నగు వారు తమతో నూతన చైతన్యాన్ని కూడా భారత సమాజం లోకి తీసుకు వచ్చారు. అందులో భాగంగానే ఏకేశ్వరోపాసన, పౌరాణిక సంస్కృతి స్థానే వైదిక సంస్కృతి యొక్క పునరుద్ధరణ, అగ్రవర్ణ ఛాందస వాద ఖండన, బాల్య వివాహాది మూఢ విశ్వాసాల ఖండన, విశ్వ మానవ అంకురార్పణ వంటి అంశాల్ని సమాజపు తెరమీదకి తెచ్చి ముందుకు నడిపించారు. మరో వైపు ఆంగ్ల విద్య పాశ్చాత్య సాహిత్య చైతన్యాన్ని కూడా అందించింది. బ్రిటీష్ లో వర్ధిల్లిన రొమాంటిసిజం మన దేశం లో కూడా తన ప్రభావాన్ని చూపించింది. బెంగాల్ లో రవీంద్రుడి మొదలు ఇక్కడ తెగులో విశ్వనాథ, కృష్ణ శాస్త్రి మున్నగు వారి చేత ప్రణయాలు, విరహాలు, వియోగాలు, విషాదాలూ అద్భుతంగా పలికించింది. ఇక్కడ గమనించినట్టైతే రాజకీయ చైతన్యానికి తప్ప, మిగిలిన ఈ రెండు చైతన్యాల్లో బ్రిటీష్ పాలనపై ఏహ్య భావమేమీ లేకపోగా, సానుకూల భావన కూడా అగుపిస్తుంది.

కానీ మొదటి ప్రపంచ యుద్ధం,  ప్రాశ్చాత్యానికి 'రెనీసా' అందించిన మానవత్వ భావననీ, 'రోమాంటిసిజం' అందించిన ప్రణయాది ప్రేమభావనల్నీ, విరహాది మేలంఖోలీని అకస్మాత్తుగా వెనుకకు లాగేసుకోవటం చేసింది. యుద్ధపు తరువాతి పరిస్థితులు మానవుడి స్థితి గతి ఏమిటని ప్రశ్నించాయి. ప్రపంచ వర్తమానం ఒక అయోమయావస్థకు నెట్టివేయబడేసరికి , 'గతకాలమే మేలు వచ్చే కాలము కంటెన్' అని విశ్వసించే రోజులెక్కువౌతున్నట్టనిపించింది. వేస్ట్ లాండ్, యులిసిస్ లు వర్తమానాన్ని చూసి పెదవి విరుస్తూ కనిపించాయి. చైతన్య స్రవంతిలో గొణుక్కుంటున్నట్టు వినిపించాయి. 'మంచి గతమున కొంచమేనోయ్, మందగించక ముందుకడుగెయ్యమ'ని దిశా నిర్దేశం చేసేవారు కావాల్సి వచ్చింది. సాహిత్య పరంగా పాశ్చాత్యాన్ని అనుసరించే భారత దేశం, ఈ పరిస్థితులనుంచి, చాలానే నేర్చుకుంటూ కనిపించింది. ఇక్కడి పరిస్థితులు కూడా ఇంచుమించు అక్కడిలాగా అస్ధవ్యస్థంగానే సాగుతున్నట్టుగా తెలుసుకోగలిగింది. అలాంటి సమయంలోనే దారిలో లాంతరులా తెలుగులో నవ యుగ వైతాళికుడిలా గురజాడ నవ సాహితీ లోకానికి రోడ్డు వేయటం మొదలెట్టాడు. ఆ తరువాత వచ్చిన శ్రీశ్రీ గురజాడ వేసిన రోడ్డును వెడల్పు చేయటం మొదలెట్టాడు. అందుకే ఛంధో బద్ద కవిత్వపు సర్ప కోరల్ని గురజాడ జాగ్రత్తగా పెకిలింప ప్రయత్నిస్తే,  శ్రీశ్రీ ఆ సర్ప పరిష్వంగం నుంచి పూర్తిగా తప్పించగే ప్రయత్నం చేసి విజయుడిగా నిలబడ్డాడు.

అందుకే 'మహా ప్రస్థానం' కవితలో వినిపించే పిలుపు మరో ప్రపంచపు పిలుపు. ఆధునికతవైపు నడవమని కవి మనల్ని పిలిచే పిలుపు. మనిషి మరణం తరువాత పొందే పరలోకమో, స్వర్గమో కాదు ఆ మరో ప్రపంచం. అట్టి స్వర్గాదులకు పోవాలంటే పదండి ముందుకు అనే బదులు, చావండి ఇపుడే అనవలసి వచ్చేది. కానీ పదండి ముందుకు పదండి తోసుకు అని అంటున్నాడంటే, అది ఇపుడే, ఈ క్షణమే, మనం మారిన తక్షణమే కనిపించే కొత్త ప్రపంచమే. అందుకే మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పైపైకి. ఉన్న స్థానం నుండి కేవలం ముందుకు మాత్రమే కాకుండా, కేవలం పైకి మాత్రమే కాకుండా , ముందుకీ ఆపై, పైకీ కూడా ఒకేసారిగా పయనం. ఈ కవిత తెలుగు సాహిత్యంలో ఒక ల్యాండ్ మార్క్. ఒక నవ్యత వైపు కదలమని వినిపించిన మొట్ట మొదటి పిలుపు. కదం త్రొక్కుతూ  పదం పాడుతూ  హృదయాంతరాళం గర్జిస్తూ...పదండి పోదాం. కవితలో కవి ఆ మరో ప్రపంచానికి ఎలా సమాయత్తమై పోవాలో..ఎవరు పోవాలో ఎవరు పోకూడదో స్పష్టంగా చెబుతాడు కానీ ఆ మరో ప్రపంచం ఎలా వుంటుందో చూచాయగా తప్ప స్పష్టంగా చెప్పడు.

మరో ప్రపంచానికి ఏ విధంగా పోవాలి?. కదం త్రొక్కుతూ,  పదం పాడుతూ,  హృదయాంతరాళం గర్జిస్తూ, దారి పొడగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ, ప్రభంజనం వలె హోరెత్తుతూ,  భావ వేగమున ప్రసరిస్తూ , సైనికుడి వలె, వర్షకాభ్రముల ప్రళయ ఘోషవలె, పెళపెళ విరుచుకు పడుతూ,  త్రాచుల వలెనూ, రేచుల వలెనూ, లక్ష్యాన్ని ఛేధించగల ధనంజయునిలా, నయగారా శివసముద్రమూ జలపాతాల వలె ఉరుకుతూ..ముందుకు సాగాలంటాడు. ఎంతటి ఆశని నమ్మకాన్ని ఇస్తున్నాడో కవి ఇక్కడ. ఇది దిశా నిర్దేశమే.  మరి అక్కడికి ఎవరు పోవాలి?. ఎముకలు కుళ్లిన వయస్సు మళ్లిన సోమరులు కాకుండా, నెత్తురు మండే శక్తులు నిండే సైనుకులే పోవాలి. 'వట్టిమాటలు కట్టి పెట్టోయ్ గట్టిమేల్ తల పెట్టవోయ్' అని గురజాడ అంటున్నట్టే వుంది కదా ఇక్కడ!.

మరి ఆ మరో ప్రపంచం ఏమిటి?. ఇందాకా చెప్పుకున్నట్టు మనిషి చచ్చాక పొందే పరలోకమో స్వర్గమో ఖచ్ఛితంగా కాదది. అందుకే ఈ మహా ప్రస్థానం మహాభారతంలో వచ్చే చివరి మరణం కాదు. పైగా అందుకు విరుద్ధంగా ఇది కొత్తగా మొదలయ్యే మహా ప్రయాణం. ఇది ఇలియట్ కవి వేస్ట్ ల్యాండ్ లోని 'క్రూర ఏప్రిల్ మాసం' లాంటి ప్రయోగం. అందుకే ఇది ప్రగతి వైపుకి, ఆధునికత వైపుకి ప్రయాణం. ఈ ధరిత్రి అంతటా ఆ మరో ప్రపంచం నిండి వుందట.  అంటే ఆధునికతనే ఆ మరో ప్రపంచం అన్నది మరోసారి స్పష్టం. పురాణేతిహాసాల్లోని స్వర్గమో, పరలోకమో అయితే ఇలా ధరిత్రి అంతటా నిండి ఉండదు కదా?. కవితలో ఈ మరో ప్రపంచానికి సంబంధించిన ప్రతీకలుంటాయి. వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం అని అడుగుతాడు కవి. ఆ జలపాతపు ఘోష అని ఉద్దేశం కావొచ్చు. కంచు నగారా విరామ మెరుగక మ్రోగిందని శబ్ద సంబంధ ప్రతీక ఇంకొకటుంటుంది. నయాగారా జలపాతంలా శివసముద్రంలా ఉరకండి అని జలపాతాల్ని ఇంకొక చోట రూపకాలంకారంలతో ఉద్రేకాల్ని స్తబ్ద ఉపమేయాలకి అద్దుతాడు కవి. నయాగారా ఉత్తర అమెరికాలో వుండటం, అక్కడే ఆధునిక సాహిత్య అంకురార్పణ జరగడం యాదృచ్చికం కాకపోవచ్చు. కానీ ఏ సంబంధం లేకుండా కర్ణాటక లో వుండే శివ సముద్రమనే జలపాతాన్ని కూడా కలపటం వల్ల, నిగూడార్ధ దృష్టితో కాక, ఇవి అతి పెద్ద జలపాతాలు కాబట్టి మాత్రమే కవితలోకి తీసుకున్నట్టనిపిస్తుంది.

కణ కణ మండే త్రేతాగ్ని, అగ్ని కిరీటపు ధగధగలు, ఎర్ర బావుటా నిగనిగలూ, హోమ జ్వాలల భుగ భుగలూ మరో ప్రపంచంలో కనబడటం లేదా అని అడుగుతాడు కవి. అగ్నికిరీటం జ్ఞానానికి, ఎర్ర బావుటా సోషలిజానికీ, హోమ జ్వాలలు పారిశ్రామిక శక్తికీ ప్రతీకలనుకోవచ్ఛు. అయితే శ్రీశ్రీ ఈ కవిత రాసే సమయానికి తనకి కమ్యూనిజం అంటే అవగాహన లేదన్నాడు కాబట్టి, ఇదమిత్తంగా ఎర్ర బావుటా అంటే ఇదీ అని చెప్పలేము. కాబట్టి ఈ మరో  ప్రపంచానికి సంబంధించిన ప్రతీకల్లో అర్థాన్ని అనిర్దిష్టంగా ఉంచబడింది. ఈ ప్రతీకల్ని అస్పష్ట అర్థస్ఫూర్తి కోసమే వాడుకున్నారు తప్ప, నిర్ధిష్టార్థంతో వాడుకోలేదు అనిపిస్తుంది. తద్వారా కవి యొక్క దృష్టి మరో ప్రపంచపు వివరణ పై కాక ఆ ప్రపంచం వైపుగా తిప్పటమే ప్రధానమనిపిస్తోంది. అలాగే త్రేతాగ్నిని జీవితం మొత్తం సాగే అగ్నిగా, అంటే నిరంతర జ్ఞానంగా భావన చేసి ఉండవచ్చు. శ్రౌత యాగాలల్లో ఈ త్రేతాగ్నులు వస్తాయి. గార్హపత్య, ఆవహనీయ, దక్షిణాగ్నులు. పెండ్లి అయినప్పడు లాజహోమంలో వెలిగించే ఆవహనీయ అగ్నిలా మొదలయ్యి, జీవితాంతము వరకు గార్హపత్య అగ్నిగా వ్యక్తిని నడిపి, చివరకు తన చితిని కూడా, అప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చిన అగ్నితో, దక్షిణాగ్నిలా ముగించే ఒక ప్రక్రియ ఇది.  అలాంటి ప్రక్రియని కొనసాగించే వ్యక్తిని అగ్ని హోత్రుడంటారు. మరో ప్రపంచంలో జీవిత మంతా అగ్నిహోత్రుడి తపస్సులా సాగే జ్ఞానాన్ని, కణ కణమండే త్రేతాగ్ని లా భావన చేసి ఉండవచ్చు. అగ్ని జ్ఞానానికి సిద్ధ ప్రతీక.

తరువాత ఈ కవితలో హరోం హరోం హర, అనే పదము కనిపిస్తుంది. శివుని ప్రమథ గణాలు వీరభద్రుని ఆధ్వర్యంలో దక్ష యజ్ఞాన్ని కూల్చినపుడు హర హర మహాదేవ అంటూ హరుడిని స్తుతించాయంటారు. దానికి తెలుగు రూపం హరోం హరోం హర అయిందనుకోవాలి. సంస్కృత వ్యాకరణం రీత్యా..'ఓం కారం' మంత్ర మధ్య భాగం లో రాదు. కాబట్టి, ఇది తెలుగు పదమే. లేదా శృతి సంబంధం కాక, కావ్య సంబంధమైన సంస్కృతమై ఉండిండాలి. అలాగే కవితలో ప్రళయానికి సంబంధించిన ప్రతీకలు కనిపిస్తాయి. ఎనభై లక్షల మేరువులు సముద్రాల తిరిగి జల ప్రళయ నాట్యం చేయటమనే దృశ్యం కనిపిస్తుంది. వీటి పరమార్థం బోధపడదు. 'సలసల కాగే చమురా కాదిది, ఉష్ణ రక్త కాసారం'  అనేది, యంత్రం కాదు మనిషి అనే భావనని ఇస్తోంది. దీని పరమార్థం కూడా ఇదమిత్తంగా ఇదీ అని చెప్పటం కష్టం. మరో ప్రపంచం మరో ప్రపంచం అనే కవితా ముఖభాగం శబ్ద పరంగా త్యాగరాజ కృతి 'భజ గోవిందం భజగోవిందం' తో సమానంగా ఉందనే ఇంకో పరిశీలన కూడా ఉంది. కవిత చాలా మటుకు వృత్త్యనుప్రాసాలంకారంలో కొనసాగుతుంది. దాని వలన నిజంగానే ప్రవాహ ఉధృతి కవిత గమనంలో కనిపిస్తుంది. వినిపిస్తుంది.

విప్లవాన్ని రగిలించే, విప్లవ నాయకుడు పుట్టాలంటే మొదట ఒక విప్లవ కవి పుట్టాలి. రష్యాలో ఒక లెనిన్ పుట్టడానికి ముందు, దాదాపు రెండు వందల సంవత్సరాలుగా ఆ నేలని విప్లవ భావాలతో తడిపేసిన పుష్కిన్, టాల్స్టాయ్, ఛేకోవ్, గొగోల్, తుర్జెనీవ్, దాస్తోయెవస్కీ లు పుట్టాల్సి వచ్చింది. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంకలనం 1950లో మొదటి ముద్రణతో మనముందుకు వచ్చింది. ఇపుడు యువ కవులు కూడా పుట్టుకు రావాలి. నవ్యత వైపు కొనసాగాలి. శ్రీశ్రీ కవిత్వంతో పాటు అతడు అనుసరించిన నవ్యత మనకు స్ఫూర్తి కావాలి.  రేపటి తరం విప్లవ నాయకులకోసం కవులు కవిత్వంతో ఇప్పటి ఈ నేలని సారవంతం చేయాలి. ఇప్పటికి ఇరవైకి పైగా పునర్ముద్రణలు పొందిన మహా ప్రస్థానం, మనల్ని మన ఆలోచనల్ని ఎంతగా ఆధునీకరించ గలిగిందో మనకు మనం సమీక్షించుకోవాలి.

చివరగా ఈ వ్యాసాల పై ఒక మాట. మనం అభిప్రాయాల్ని, లభించిన దృక్కోణాలాధారంగా ఎప్పటికప్పుడు సాధించుకుంటాము కాబట్టి, వీటికి మత సూత్రాల మాదిరిగా ఎమోషనల్ వ్యాల్యూని ఆపాదించి యూనివర్సాలిటీని ప్రతిపాదించవలసిన అవసరం లేదని చెప్పదలచాను. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే చర్చకు ఆస్కారమివ్వటం వలన కొత్త విషయాలను ఇచ్చిపుచ్చుకునే జ్ఞాన విస్తృతికి అవసరమైన సత్ వాతావరణాన్ని మనమే నెలకొల్పుకోవాలని మనవి.

శ్రీ శ్రీ కవిత 'మహా ప్రస్థానం' వ్యక్తమవటానికి గల చారిత్రక తాత్విక పరిస్ధితులను అవగాహన చేసుకోవటానే విషయంలో ఒక అడుగు ముందుకే వేయగలిగామని విశ్వసిస్తూ సెలవు. వచ్చే వారం మరొక కవిత్వ సందర్భంతో కలుద్దాం.

Kavitwa sandarbham 2- సరస్వతీ భక్తుల్లారా!..బ్రహ్మనే వెక్కిరిస్తారా!

సరస్వతీ భక్తుల్లారా!..బ్రహ్మనే వెక్కిరిస్తారా!
(కాళోజీ యాంటీ థీసీస్ లోంచి పుట్టుకొచ్చిన సింథెసిస్)

సాహిత్యానికేది ప్రమాణం. పదమా వాక్యమా అని ప్రశ్న వేసుకున్నపుడు, వాక్యమే ప్రమాణమని సమాధానం వస్తుంది.
పదం నిత్యం మార్పుకి గురవుతుంటుంది, మనుషుల కష్టాలూ బాధలు మారిపోతున్నట్టే పదాలూ మారిపోతాయి.
ప్రపంచ కష్టమే తన కష్టం కదా కవికి. బాధని ఒక కళగా అభ్యసించేవాడే కదా కవి.
కాలాన్ని పరిగెత్తించే వాడికి కాలానికి అనుగుణంగా భాష కూడా కావాలి. కొత్త పదాలు కావాలి.
వ్యాకరణం ఒక భాషలో ఉన్న వాక్యాల తీరు తెన్నులను విశద పరచటమే కాక,  కాలంతో పాటు  పదాలలో ఎటువంటి మార్పులు జరుగుతుంటాయో...మూల శబ్దమేదో, ప్రత్యయమేదో, ప్రత్యయం చేరటంతో శబ్దంలో వచ్చే మార్పులేవో, కాలానుగుణంగా ప్రత్యయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో, ఇలాంటి ఎన్నో విషయాల్ని వివరిస్తుంది.
ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, తెలుగు వారికి ఉన్న ఎన్నో సమస్యల్లో ఒక సమస్య,  ఎలాంటి తెలుగును సాహిత్యంలో వాడాలి అనేది.
ఇది ఎలాంటిదంటే వ్యాకరణం మన కోసమా...లేక మనం వ్యాకరణం కోసమా అనే ప్రశ్న వంటిది.

ఈ చర్చ ప్రధానంగా ఇరవైయవ శతాబ్దపు మొదటి అర్ధ కాలంలో తెర మీదికి వచ్చింది.
కావ్య భాష  అనబడే నిఘంటువు భాషకూ, ప్రతి రోజూ మనం మాట్లాడే తెలుగు భాషకూ అంతరం రాను రానూ విపరీతంగా పెరిగి పోయిందనే స్పృహ బహుశా అప్పటికి మనకు కలిగి ఉండటమే కారణం అయుండొచ్చు. బ్రిటీష్ పాలన తెచ్చిన ఆధునిక సాహిత్యం కూడా మనకీ స్పృహను కలిగించి ఉండవచ్చు.  తెలుగు కావ్య పరిశోధన చేసిన ఎందరో బ్రిటీష్ మేధావులు తోటి తెలుగు వారితో సరిగా మాట్లాడలేక పోయేవారట. మన వ్యాకరణం, నిఘంటువులు అన్నీ కావ్య భాషకు మాత్రమే రాసుకున్నవి కావటం వల్ల, ఎలా మాట్లాడాలో తెలియక తికమక పడేవారట. ఇలా గ్రాంధిక వ్యావహార భాషలుగా ఒక భాష చీలి పోయి వుంటే ఆ భాషని డైగ్లోస్సియా అంటారు. ప్రపంచంలోని ఇలాంటివి ఎన్నో భాషలున్నాయి. అందులో మన తెలుగూ ఒకటి.
మనకున్న సాహిత్యమంతా కావ్యాలే అనుకుంటే, వ్యాకరణ సూత్రానుసారమైన భాషనే కావ్యాల్లో వాడబడింది కాబట్టి ప్రస్తుత సాహిత్యానికి కూడా కావ్య భాషనే సరి అయినదని కొందరూ, కాదు వ్యావహారిక భాషనే సరైందని మరి కొందరూ వాదించారు. తెలుగు సాహిత్య లోకమంతా ఇలా యతాతథ వాదులూ, ఆధునిక వాదులని రెండు రకాలుగా చీలిపోయిందనుకోవాలి.

కావ్య భాషని కాదని, వ్యావహారిక భాషోద్యమాన్ని మొదటిసారి గిడుగు రామ్మూర్తి పంతులు గారు మొదలు పెడితే, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు వంటి వారు దాన్ని మరింత ముందుకి తీసుకు పోయారు. ఈ వ్యావహారిక భాషోద్యమానికి ఏమైనా చారిత్రకత తాత్వికత ఉందా అంటే, ఉంది అని చెప్పకతప్పదు.
దాని గురించి తెలుసుకునే ముందు అసలు కావ్య భాషంటే ఏమిటి?. తెలుగులో మొదటగా కావ్య భాష, మహాభారతాన్ని తెనిగించిన నన్నయతో మొదలైందని మనకు తెలుసు.
 నన్నయ భారత చరిత్ర కాలం రమారమి1050సం.

కోరాడ మహా దేవ శాస్త్రి గారి ప్రకారం,..(Historical grammer of Telugu-1961)
క్రీ పూ 600 నుంచి క్రీ. పూ. 300 వరకు చరిత్ర పూర్వ యుగం,
క్రీ పూ 300  నుంచి క్రీ..శ 1000  వరకు ప్రాచీనాంధ్ర యుగం,
క్రీ.శ. 100 నుంచి క్రీ. శ1600. వరకు మధ్యాంధ్ర యుగం,
క్రీ. శ1600 నుంచి నేటి వరకు ఆధునికాంధ్ర యుగం అనుకుంటే,

తెలుగులో ఆది కవి నన్నయ కాబట్టి, కావ్య భాష క్రీ.శ.1050 సమయంలో, మధ్యాంద్ర యుగంలో మొదలైందనుకోవచ్చు.
మరి అంతకు ముందు ఉన్న తెలుగేమిటి?.
దీనికి సమాధానం, బూదరాజు రాధాకృష్ణగారిస్తారు. ఆయన తెలుగునాట కావ్య భాష ఏనాడూ వ్యవహారంలో లేదని శాసనాధారాలతో నిరూపించారు. (Historical grammer of early Telugu -1963).
అంటే నన్నయ రాసినదైనా ఆనాటి వ్యావహారిక భాష కాదనేది అర్థమౌతుంది.

భాషా శాస్త్రం లో ఇటువంటి సిద్ధాంత గ్రంథాలు రాకముందే అభ్యుదయ కవులు సకల జనులకూ అర్థమయ్యే, వ్యావహారిక భాషలోనే సాహిత్య రచన జరగాలని ఉద్యమించారు.

మరి నన్నయ రాసిన మహా భారతానికి వ్యాకరణం ఏది? అంటే సమాధానం నన్నయ్యే చెప్పాలి.
శబ్దానుశాసనుడనని భారత అవతారికలో చెప్పుకున్న నన్నయే తెలుగుకి మొదటి వ్యాకరణం చేకూర్చి, సంస్కృత భారతాన్ని తెనిగించాడు. ఆ వ్యాకరణమే  నన్నయ కృత "ఆంధ్ర శబ్ద చింతామణి". ఇది సంస్కృత గ్రంథం.
భారత దేశంలో అచ్చు యంత్రం వచ్చాక అచ్చు వేయబడ్డ తాళ పత్ర గ్రంధాలన్నీ మను చరిత్ర, వసు చరిత్ర వంటి పౌరాణిక కావ్యాలకి అనుకరణలు మాత్రమేనని గమనించిన కందుకూరి వీరేశలింగం పంతులు, సంఘజనోద్ధరణకు ఇటువంటి భాష పనికిరాదన్నాడు. గురజాడ కూడా కదం తొక్కాడు. ఆ విధంగా ఇద్దరూ నవీన భాషోద్యమానికి చారిత్రక తాత్విక భూమికని కలిగించారు. ఆ అవసరాన్ని గుర్తించి వచన పద్య గద్యాల్ని ముందుకు నడిపించారు. తెలుగులో వ్రాయబడ్డా తెలుగు వారికి అర్థంకాని స్థితిలో కావ్య భాష ఉంది కాబట్టి, నిత్య జీవితంలోని భాషనే సాహిత్య భాషగా మార్చాలనే ఈ ప్రయత్నం, వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారు వ్యావహారిక భాషా వ్యాకరణం అనే గ్రంథాన్ని రాసే దాకా కొనసాగింది.

భాష లక్ష్యం అయితే, వ్యాకరణం ఒక లక్షణం. కానీ, లక్ష్యం స్థానంలో లక్షణమే ప్రధానమై కూర్చుదేంటని ప్రశ్నించే వారు తమ వాదాన్ని ఆ కాలంలో బలంగా వినిపించారు. 1952 లో శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయ స్వర్ణోత్సవాల సందర్భంగా శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు ఉపన్యసిస్తూ, ఫరీద్ అనే తెలంగాణా కవి రాసిన 'కన్నీటి కబురు' అనే పుస్తకాన్నీ అందులో వాడబడిన భాషనీ, శీర్షికతో సహా తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఆ మరునాడు జరిగిన కవి సమ్మేలనంలో శ్రీ పాద వారి విమర్శకు ప్రతి విమర్శగా కాళోజీ రాసిన కవితే 'సరస్వతీ భక్తుల్లారా!'. శ్రీ పాద గారి విమర్శలో గ్రాంధిక తెలుగు భాషపై ప్రీతియే కాక తెలంగాణా భాషమీద అవహేళన కూడా ఉండిందనే విషయం, కాలోజీ గారు ఈ మధ్య కాలంలో తెలంగాణా రచయితల వేదిక ప్రథమ వార్షికోత్సవ సమయంలో ఇచ్చిన అధ్యక్ష ఉపన్యాసంలో స్పష్టమౌతుంది. గిడుగు రామ్మూర్తి గారితో స్ఫూర్తిని పొందానని చెప్పుకుని వచనంలో కథలు రాసిన శ్రీపాద గారు, ఇలా వ్యావహారిక భాషని విమర్శించటం, ఈ అన్య కారణాలు ఉన్నాయనే ఊహకి ఊతమిస్తోంది.

కైతకు లక్షణాలున్నాయి కోటొక్కటి                               కన్నులకద్దుకుని భక్తులు పూజకై దాచుకున్నట్లు                    హైడ్రాలిక్ బ్రేక్సు కూడా ఫేలవుతున్నపుడు
వానిలో వ్యాకరణం కూడా ఒక్కటి                                మా నోట రాలిన మాట                                                   ప్రణయ జలనిధి నింపదలచిన ప్రవాహాన్ని
మీకు దాని సూత్రాలే సర్వస్వం.                                  ఆనోటా ఆనోటా                                                            ఆపడానికి మీ ఆనకట్టలు పనికొస్తాయా ?
గొంతుకు పోసుకుని వ్రేలాడి సతతం                             వినవిందై మనసుకు పసందై                                            హిమాలయ పర్వతాలే తలలు వంచుకుంటున్నపుడు
చేస్తారు ఆక్రందన, అంటారు కవిత్వం                            జపించి జపించి                                                             ఎన్నెన్ని జన్మాలెత్తి
'కైతకు వ్యాకరణమే పరమావధి                                  సూత్రాలలో బిగించి                                                        ఎంత పొంకంగా రాసినా లేఖకుడు
కాదు అసలే కాదు' అన్నాడు దాశరథి                          సారస్వత పూజా ద్రవ్యంగా                                               మహా రచయిత అనబడడు
మా రచనలో వ్యాకరణం మాత్రమే లేదు                        భద్రపరుచుకున్నారు మీ వైయాకరణులు                              వలయాలూ, చతుర్భుజాలూ
మీ రచనంతా వ్యాకరణం. మరేమీ కాదు                        అప్పుడప్పుడూ మేమన్నదే అయినది                                   వివిధ కోణాకారాలు
వ్యాకరణ సూత్రాలు పెట్టితే భట్టీ                                   మీ అప్ప కవీయం, కౌముది                                              నీటుగా రాసే రేఖా గణితజ్ఞుడు
కాదెప్పుడూ కైత పాకం గట్టి                                       సరస్వతీ భక్తుల్లారా  !                                                     మహా చిత్రకారుడనబడడు
పాతబాటల బట్టియే నడువగలరు మీరు                        బ్రహ్మనే వెక్కిరిస్తారా  !                                                    చిత్రకారుడు గీసిన
మా నడకలో పడుతుంది క్రొత్త త్రోవలకు తీరు                  మెరుపువలె పరుగిడు                                                    జీవితముట్టిపడే చిత్తరువులో
శతాబ్దాల తరబడి ప్రవాహంలో పడి                               మా ఊహా తరంగాలకు                                                    అవయవాల సొంపునుజూపే
రాపిడి ఫుణ్యాన రూపు రేఖలు దిద్దుకున్న                     బక్కెద్దులనాపే                                                              ఎత్తువంపుల కాధారమైన గీతలు
ముద్దు వచ్చే రాల్లను శివలింగాలని                             పగ్గాలు పనికొస్తాయా?                                                    వంకరటింకరగా ఉన్నాయన్న లేఖకుడు -
                                                                                                                                                         మా రచనల్లో తప్పులున్నాయనే వైయాకరణి

ఈ కవితలో, " సరస్వతీ పుత్రులారా..బ్రహ్మనే వెక్కిరిస్తారా" అనే వాక్యం చాలా తీవ్రమైన ధిక్కారాన్ని సూచిస్తుంది.
సరస్వతీ పుత్రులంటే వ్యాకరణం తెలిసిన పండితులు. బ్రహ్మ  అంటే కవు. కవి బ్రహ్మ అని తిక్కన బిరుదు.
బ్రహ్మనే ఆది కవి అంటాం. అతడు రచిస్తాడు కాబట్టి, విరించి అంటాం.
బ్రహ్మ రూపాలైన కవుల్ని, ఓ సరస్వతీ పుత్రులైన పండితులారా వెక్కిరిస్తారా? అని కవి ఆక్షేపణ.

గద్య తిక్కన వీరేశలింగం గారు 'సరస్వతీ నారద సంవాదం' అని ఒక కవిత రాశారు( 1887 ).
పదహారవ శతాబ్దంలో స్పెన్సర్ అనే కవి రాసిన టియర్స్ ఆఫ్ మ్యూజెస్ (Tears of Muses) అనే కవితను పోలి వుంటుంది
మ్యూజెస్ అంటే గ్రీకుల ఆరాధ్య చదువుల దేవత, మన సరస్వతీ అమ్మవారిలాగే.
ఒక రోజు నారదడు తన తల్లి సరస్వతి దేవి చాలా విచారకర వదనంతో ఉన్నట్టు గమనించి, కారణమేమని అడుగుతాడు.
నా బిడ్డలైన కవులు, రసాన్ని వదిలిపెట్టి పైపై మాటలతో విన్యాసాలు చేస్తున్నారనీ,
భావాన్ని కోల్పోయిన తన మాటలు తనకే అర్థం కాకుండా ఉన్నాయనీ,
వ్యాకరణాదులతో అలంకరించి తనకు సంకెల్లు వేస్తున్నారనీ, అవి నొప్పిని కలుగజేస్తున్నాయనీ సరస్వతీ దేవి బాధ పడుతుంది.
కవయః నిరంకుశః.
నిరంకుశత్వం భావ రసాల్ని పిండుకోవటంలో కాక భాషకు సంకెల్లు వేయటంలో ఏంటని అడిగినట్టుగా ఉంది కదూ ఈ సంవాదం. ఎంతో విశాలమైన సాహిత్యాన్ని, వ్యాకరణం బంధిస్తున్నట్టుగా వుంది కదూ..
ఏం సరస్వతీ భక్తులారా...బ్రహ్మనే వెక్కిరిస్తారా..?
"మా రచనలో వ్యాకరణం మాత్రమే లేదు
మీ రచనంతా వ్యాకరణం, మరేమీ కాదు".

మిగిలిన కవిత మొత్తం ఇవ్వబడిన అంశానికి యాంటీ థీసీస్ లాగా ఉంటుంది. ఒక ఆర్గ్యూమెంట్ ని వ్యతిరేకించటానికి సాగే ప్రతి వాదం లాగా సాగుతుంది. కాబట్టి తన వాదనకి తగ్గ సపోర్ట్ కోసం దాశరథిని కూడా ఖోట్ చేస్తాడు కవి.
"కైతకు వ్యాకరణమే పరమావధి
కాదు అసలే కాదు అన్నాడు దాశరథి" అని. ఇది కవితకు వచ్చిన అదనపు బలం.

కవితలో మొదట వ్యాకరణాన్ని నిర్వచిస్తాడు.
"కైతకు లక్షణాలున్నాయి కోటొక్కటి,
వానిలో వ్యాకరణం కూడా ఒక్కటి".

ఆ తరువాత కవిత మొత్తం ఆక్షేపణలతో స్టేట్మెంట్స్ తో సాగుతుంది.

ప్రతి వాదాన్ని పదే పదే బలంగా వినిపించాలి కాబట్టి, ఇటుకలు ఒకదాని తరువాత ఒకదాన్ని పేర్చినట్టు..థీసీస్ కి వ్యతిరేకంగా యాంటీ థీసీస్ ను ఒక క్రమ పద్ధతిలో నిర్మిస్తాడు కవి. ఇది మోడర్నిస్టు పద్దతి. ఈ క్రమంలో వ్యాకరణాన్ని బక్కెద్దులతో, ప్రళయ జలధిని ఆపలేని ఆనకట్టలతోనూ పోలుస్తాడు. వైయాకరణులను వలయాలూ చతుర్భుజాలూ రాసుకునే రేఖా గణితజ్ఞులతోనూ పోలుస్తాడు. జీవితముట్టిపడే చిత్రాన్ని చూసి, అవయవాల సొంపును చూసి, ఎత్తు వంపుల కాధారమైన గీతలు వంకరటింకరగా ఉన్నాయనుకునే రేఖాగణితజ్ఞుడిలాంటి లేఖకుడా..నీవా మా రచనల్లో తప్పులు వెతికేది అంటాడు.
ఈ కవితలో అప్పకవీయమనే శబ్దముంది. అపడపుడూ మేము మాట్లాడిన మాటలే మీ అప్పకవీయమైనదని అంటాడు కవి. నన్నయ సంస్కృతంలో రాసిన 'ఆంధ్ర శబ్ద చింతామణి'ని తెలుగు చేసిన వాడు, పదిహేడ శతాబ్దానికి చెందిన కాకునూరు అప్పకవి. అదే 'అప్పకవీయం'. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ వాస్తవ్యుడు కావడం వల్లేమో..ఈ అప్పకవీయం చాలా అవమానాల్ని మోస్తోందనిపిస్తోంది. అప్పకవిని కాళోజీ కూడా వదిలి పెట్టలేదు మరి.

ఏది ఏమైనా, వ్యావహారిక భాషోద్యమం రావటం, ఒక చారిత్రక అవసరం అయింది. దాని తర్వాత వచ్చిన అభ్యుదయ కవిత్వాలకి, అస్తిత్వ వాదాలకీ ఈ ఉద్యమం ఆలంబనగా నిలిచింది. అయితే వ్యావహారిక గ్రాంధిక భాషోద్యమాలు సైంద్ధాంతిక విబేధాల్నే కాక ప్రాంతీయ వ్యక్తిగత విబేధాల్ని కూడా మోసి ఉండవచ్చు అనిపిస్తుంది. అందువలన చైతన్యమూ మాధుర్యమూ వివేకమూ అందించవలసిన సాహిత్యం, తగవులనీ అణచివేతనీ కూడా అందించాయి. ఆ పునాదుల్లోంచి పుట్టుకొచ్చిన మనం ఆధునిక భాషని అందిపుచ్చుకున్నామేగానీ, ఆధునికతను కాదు. పాత భాషని ఒదిలించు కోవటంతో పాటు ఆ జీవన మాధుర్యాన్నీ, స్నేహశీలతనూ ఒదిలించుకున్నాం. పాత కొత్తల్లోని మంచిని గ్రహించి మనకు మనమే కొత్తగా సింథెసిస్ ని రూపొందించుకోలేకున్నాం.
చివరికి కాలమే గెలిచింది. మన భాషలో మనం కవిత్వం రాసుకునే రోజులొచ్చాయి.
చివరికి కాలమే గెలవాలి. సాహిత్యం మధురంగా, చైతన్య వంతంగా సాగాలి. పరిణామం చెందాలి.
అందుకే
కవి బ్రహ్మ, కాలో యం బ్రహ్మ. కాళోజీ బ్రహ్మ.

25/11/15

Thursday, 29 October 2015

Sick leave ( poem)

విరించి ll సిక్ లీవ్ ll
...............................
నా టేబుల్ కి ఎదురుగా
ఒంటరిగా కూర్చుని వున్న
అతడిని చూస్తే
ముడతలు పడిన రాళ్ళ ను చూసినట్టుంది

అయస్కాంతంలా అతుక్కుపోయే ఆ కళ్ళు
ఆకాశపు ఆవలి గట్టుని
దిగుడు బావుల్లోంచి వెతుకుతున్నట్టున్నాయి

పొగ గొట్టాల్లాంటి చేతివేళ్ళ నడుమ
ఎన్ని ఆలోచనలు బీడీ పొగలా మారివుంటాయో..

ఆ మసిబారిన పెదవుల నడుమ
ఊపిరితిత్తులు కాలిన వాసన

యంత్రపు శబ్దాల్ని చెవులకు బిగించుకుని
ఏకబిగిన మాట్లాడే అతడి మాటల్లో..
నామీదొక నిర్దాక్షిణ్యమైన నిర్లక్షం.

అపుడపుడూ మా మధ్య తారసిల్లే నిశబ్దంలోకి
అతడు కొత్తగా తొంగిచూస్తున్నట్టు కనిపించాడు.

తెరలుగా లేచే దగ్గు అంకాల నడుమ
నీటి ఒరిపిడికి నునుపు తేలి
బయటపడిన మైలు రాయిలా కనిపించాడు

సరే...సిక్ లీవ్ కి డాక్టర్ సర్టిఫికేటే కదా...!
ఇస్తానన్నాను.
రాసిస్తే మౌనంగా తీసుకున్నాడు.

శరీరాన్ని ఒక ఎక్స్ప్రెషన్ గా మార్చినవాడి దగ్గరినుంచి
నేనే ఎక్స్ప్రెషన్నీ ఆశించలేదనే చెప్పాలిపుడు.

అతడి కాలి కింద నలిపేసిన బీడీ ముక్కలో
అస్పష్టంగా ఒక నిప్పుకణం కనిపిస్తోందిపుడు.

28/10/15

Sunday, 25 October 2015

Telangana news of tomorrow

రేపటి తెలంగాణా వార్తలు
.................................        
* అంతరించి పోతున్న పులులు..ఐటం గర్ల్ లు గా మారి భారతదేశంలో కనుమరుగవుతున్న పులులు.

* ఐటం గర్ల్ స్థానం కోసం సడన్ గా పోటీ పెరిగిందంటున్న సినీ రాజకీయ విశ్లేషకులు

* తమని చివరికి ఒక దొంగతో పోల్చినందుకు మనోభావాలు దెబ్బతిన్నాయంటున్న ఐటం గర్ల్స్.

* ఐటం గర్ల్ ను సభా ప్రాంగణం లో చూసి కేరింతలు కొట్టి విజిల్లేసిన ఆంధ్రా జనం.

* ఐటం గర్ల్ గా మారినందుకు ఊరేగింపుగా పండగ చేసుకుంటూన్న అభిమానులు.

* తన బిడ్డ ఐటం గర్ల్ గా మారినందుకు అడవిలో ఉరేసుకున్న పులి.

* కొత్త ఐటం గర్ల్ కోసం ఐటం సాంగ్ ను రెడీ చేసుకుంటున్న దర్శకేంద్రుడు.

* ముంబాయి భామల అవసరం లేకుండా ఎట్టకేలకు తెలుగు నేలలోనే దొరికిన ఐటం గర్ల్.

* కొత్తగా వచ్చిన ఐటం గర్ల్,  తొడగొడుతూ,  మీసం తిప్పుతూ  డాన్స్ ఇరగదీసిందంటున్న అభిమాన సంఘాలు.

* చీకట్లో పనిచేసినందుకే తనకీ ఐటం గర్ల్ ఛాన్స్ ఒచ్చిందటున్న ఈ కొత్త భామ.

* తప్పించుకున్న పులి ఐటం గర్ల్ గా మారిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్న జూ అధికారులు.

Amaravathi. A telanganite view

అవశేషాంధ్రలో అమరావతి..తెలంగాణైట్ వ్యూ
..........................................................
ఇక ఈ రోజు నుండి ఆంధ్ర ప్రజలు హైదరాబాదు మీద ఉండే మమకారాన్ని వదలుకుని తమ స్వంత రాజధాని మీద మమకారాన్ని పెంచుకుంటారని ఆశించవచ్చు. తెలుగు వారికందరికీ హైదరాబాదు మీది మమకారం ఈ రోజుదికాదు. అది ఒకే సారి తెగిపోమంటే తెగిపోదు. తెలంగాణా వచ్చిన మరుక్షణమే "మీరిక హైదరాబాదుతో ఉండే మానసిక బంధాన్ని తెంచివేయాల్సిందే" అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తట్టుకోలేక పోయారు. ఉద్వేగానికి గురయ్యారు. దీనికంతటికీ కారణం అయిన కేసీఆర్ ను విమర్శించటం వల్ల వారి మనస్సును కాస్త శాంతింపజేసుకునే వారు. అకస్మాత్తుగా రాజధాని లేకుండా ప్రజలు పాలకులు కొంత అస్థిరతను అనుభవించి ఉండింటారు. అది గమనించే చంద్రబాబు ఘనంగా ప్రతిష్ఠాత్మకంగా నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన చేపట్టి ఉండింటాడు. దీనితో చంద్రబాబు, హైదరాబాదు పట్ల ఆంధ్రా ప్రజలకు మానసికంగా ఉండే కనెక్టివిటీని సమర్థవంతంగా అమరావతి వైపు తిప్పగలిగాడు. ప్రజలలో హైదరాబాదును తన్నుకుపోయిన తెలంగాణా పట్ల ఉండే వ్యతిరేకత కూడా దీనివల్ల సమసి పోతుంది. ఇకపై పక్క రాష్ట్రంలో పుల్లలు పెట్టకుండా ఎవరి రాష్ట్రాన్ని వారు అభివృద్ధి చేసుకునే పనిలో పడటం వల్ల మాత్రమే మంచి జరుగుతుందని తెలుసుకుంటారు. తెలుగు వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనే సెంటిమెంటు-సమైక్య వాదులు, ఇకనైనా కాస్త నోరు మూసుకుని ఉండే అవకాశం ఉంది. పనీ పాట లేక ఎంత సేపూ తెలంగాణా ప్రభుత్వాన్నీ, కేసీఆర్ నూ, తెలంగాణా ప్రజలనీ చులకన చేసి మాట్లాడే వెధవలకీ, పత్రికలకీ, ఛానల్స్ కి, ఇకపై వేరే పని దొరికింది కాబట్టి, వారి నోరూ కూడా మూలనపడే అవకాశముంది.

ఎటొచ్చీ రాయలసీమ వాసులు అసంతృప్తితో ఉన్నారు. అమరావతివల్ల సమీప భవిష్యత్తులో రాయలసీమకు ఒచ్చే లాభమేమీ కనిపించటం లేదనే ఉద్దేశం వారిలో కనిపిస్తున్నది. ఇప్పటికే ఒకసారి కర్నూలు ని రాజధానిగా చూసుకోవటంలో అవకాశాన్ని కోల్పోయిన వారు, మరలా ఇంకోసారి రాజధాని తమకి రాకుండా కాకుండా పోయిందనే బాధలో ఉన్నారు. ఇదే సమయంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర కల కూడా సాకారమౌతుందనే దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారు. అయితే ప్రజల్లో ఈ కోరిక ఎంత బలంగా ఉన్నదో..ఎంత బలమైన నాయకత్వం దీనిని పార్లమెంటుదాకా తీసుకు పోగలదో అనేది మునుముందు మనకు తెలిసే అవకాశమున్నా ప్రస్తుతానికి ఈ అంశం అకడక్కడా మిణుకుమంటూ కనిపిస్తుంది. తెలంగాణా కల అరవై యేండ్లకు సాకారమయింది. చైతన్య వంతులైన ప్రజలు, సమర్థ నాయకత్వం రెండూ కలిస్తేనే ఇలాంటి ఉద్యమాలు ముందుకు సాగుతాయి. ప్రత్యేక తెలంగాణా కల ఏ ఒకరిద్దరి కలనో కాకుండా యావత్ తెలంగాణా ప్రజల కల కనుక, ఆ ప్రజల్లోంచే ఒక బలమైన నాయకత్వం పుంజుకుంది. ప్రజల్లో బలంగా ఆ కోరిక లేనిదే ఒక్క కేసీఆర్ ఏమీ చేయలేడని, కేసీఆర్ మీద మాత్రమే నిప్పులు చెరిగే ఆంధ్రా మిత్రులు ఈ సందర్భంగా తెలుసుకోవాలి. అదే విధంగా ప్రత్యేక రాయల సీమ ని కాంక్షించే వారు మొదట ప్రజల్లో ఆ కోరిక ఎంతవరకు ఉందనేది తెలుసుకోవాలి. తెలంగాణాలోలాగా పల్లె పల్లెలో మనిషి మనిషిలో గూడు కట్టుకుని ఉన్న ఆ సాహిత్యం నిజంగా ఉందా అని పరిశీలించుకోలాలి. ఒక నాయకుణ్ణి విమర్శించటమో ఇంకో నాయకుణ్ణి పొగడటమో చేసినంత మాత్రాన ప్రత్యేక రాష్ట్రం రాదని, ప్రజల్లోనే ఉద్యమమన్నది రావాలని తెలుసుకోవాలి.

ఏది ఏమైనా అవశేషాంధ్ర ప్రదేశ్ కి ఒక రాజధాని ఉండటం, నిజమైన తెలంగాణా వాదులకి, పట్టిన దయ్యం విడిచిందన్నంత ఊరట.