Thursday, 30 April 2015

విరించి ll మేలుకొలుపు ll
............................................
రాళ్ళూ రప్పలు కూడా ఏదో ఒకనాడు
నీపై తిరుగుబాటు చేస్తాయి.
అకస్మాత్తుగా నిద్రలేచిన అణుబాంబుల్లాగా
ఉన్న చోటి నుండే ముక్కలుగా పేలిపోతాయి.

నీ ముందు అద్దంలా నిలబడి ఉన్న ప్రపంచంలో
నీ  ప్రతిబింబం కళ్ళెదుటే కూలిపోతున్నపుడు
శరీరమంతా మొలిచిన వెర్రి గొంతుకతో
నీవు పెట్టే గావుకేకల్ని ఆస్వాదించేందుకు
పుట్టుకొచ్చే ప్రతీ ఆత్మా
నీవు పగలగొట్టిన రాయిదో
నరికి వేసిన చెట్టుదో
చంపేసిన జంతువుదో
చిదిమేసిన పూవుదో అయ్యుంటుంది

రెండు కాళ్ళు పొడుచుకొచ్చినంత మాత్రానికే
కళ్ళు నెత్తికెక్కిన నిన్ను
ప్రకృతంతా ఒక దయ్యంలానే చూస్తుంటుంది
పిడికిలంత బూడిదగా మిగిలే నీ అస్తిత్వ సంతకం
ప్రకృతి అందాల్ని తన కాలికింద చిదిమేస్తుంటే..
అణిగి ఉన్న ప్రతి మైదానమూ
ప్రతి పర్వతమూ
ప్రతి సముద్రమూ
ఏదో ఒక రోజు విప్లవమై లేచి వస్తుంది
నీవైన విప్లవాలే ప్రళయాలనుకునే అజ్ఞానంలో
నీవు మోస్తున్న చెత్తంతా
ఒక భూమి కుదుపుకో
ఒక ఎగిసిపడే అలకో
ధ్వంసమైనపుడు
నీ అస్తిత్వ అడ్రస్ లో..
కొన్ని దుమ్ము కణాలూ, ఇసుక రేణువులూ
కొన్ని కన్నీటి చుక్కలూ మాత్రమే మిగిలుంటాయి.

ఓ మనిషీ.. నీవు నిద్రలేచే సమయానికి
నీలో కలిగే మేలుకొలుపుకీ
ఒక్క అర నిమిషం మాత్రమే తేడా
నీ వసుధైక జీవనానికీ
విశ్వ ప్రళయానికీ నీ చైతన్యమే తేడా

30/4/15

Wednesday, 29 April 2015

విరించి ll  ముఖద్వారం  ll
.............................  ........  ......
ఓ అన్వేషీ..!
అక్షరాలతో నీవు గీసే కాగితపు బొమ్మలోకి
ఈ ఒంటరి ఉద్యానవనం
ఒదిగిపోయ్యేంత అమాయకమైందేమీ కాదు
కానీ నీ తలలో మెదిలే అనేక ప్రశ్నల్లో
ఒక ప్రశ్న కే నాదగ్గర సమాధానం దొరుకుతుంది
అది మాత్రమే తెలుసుకో.

కంచె చుట్టూ రాలి పడిపోయిన గులాబీల పాదాల చెంతో
ఎండి పోయిన చిగురుటాకుల మెత్తని పొత్తిళ్ళ లోనో
నీవొక మరణ మృదంగమై నిప్పుల్ని పాడుతుంటావు
విసిరేసిన నీళ్ళ డబ్బాల్నీ, పాత ఇనుప ముక్కల్నీ
ఒక జోలెలో వేసుకొని బంగారాల్ని ఊహిస్తుంటావు

వర్షంలో ఉతికి ఆరేసిన ఆకాశం మీద
సబ్బు నురగల్లా మేఘాలు జారిపోతున్నపుడు
కాగితపు పడవల్లోకి ఒక్క కవితనూ కూడా వొంపలేని నీవు
టప్పుమని పగిలిపోయే నీటి బుడగల్లోకి
చీపురు పుల్లల్ని గుచ్చుతుంటావు.

గులకరాళ్ళతో ఒకదాన్ని గురిచూసి ఇంకోదాన్ని కొట్టినా
చేతుల్లోని మట్టిని మింగి రక్తంలోకి ఇంకించుకున్నా
గాలి మూలుగులకీ, కుక్క మొరుగుళ్ళకీ ఉన్న తేడాని
తెలుసుకోవాలనే తపన నీ నిద్ర నీకెన్నటికీ కలిగించలేదు

నీవెంత నిరర్థక జీవివో
నీ వెతుకులాటలో ఎంత నిర్జీవం ఉందో చూసాక
నీవూహించే ప్రశ్నలను నేనూ వూహించగలను
కానీ వేల తారకలకు ఒకే చంద్రుడిలాగా
నీవొక ప్రశ్ననే పట్టుకు వేలాడుతుంటావు
ఉద్యానవనానికి బయటే తచ్చాడుతూ
చేతి గోళ్ళను ఆత్రంగా నమిలేస్తుంటావు

పైన వర్షాన్ని తిట్టుకుంటూ
కింద బురదలో జారుకుంటూ
పరిగెత్తే మనుషులను బలవంతంగా ఆపేసి
ఆ ఒక్క ప్రశ్ననే పదే పదే అడుగుతుంటావు
ఈ ఉద్యానవనానికి ముఖద్వారం ఎక్కడని
నీ ఈ ఒక్క ప్రశ్నకే నాదగ్గర సమాధానం వుంది
ఎందుకంటే ఆ ఒక్క సమాధానమే నేను
నీ కోసం ద్వారాల్ని తెరిచేవుంచాను
నాతో మాట్లాడటం కోసమే నీవిక నోరు తెరవాలి.

29/4/15

Saturday, 25 April 2015

విరించి ll పిడికిలి ll
..................................
పిడికిలి అంటేనే మూసి వుంచేది.
ఎత్తి పట్టినా, జై కొట్టినా
దాని స్వార్థాలు దాక్కునే వుంటాయి

శత్రు విజయాలకన్నా మిత్ర విజయాల్ని 
లెక్కపెడుతూ 
ఉత్సాహాల్ని తాగి ఉరకలెత్తే ప్రతివాడూ
గుంపుని పోగేసుకునేది
ఒక తలలేని గుండెకోసమే.

నీలో ఉరిమే ఉరుములకి
మురిసిపోయేవాడెపుడూ
నీ కడుపులోనే అగ్గి పెడుతుంటాడు
నీ ఖాళీ కడుపులో వాడికొక 
వెలిగే దారి కనుక్కొంటాడు

ఒక దండవేసి రెండు స్తోత్రాలు
గట్టిగా చదివినంత మాత్రానికే
భ్రమలో పదిమందిని వెనకేసుకు నిల్చుంటావు
నీ వెనుకనున్న వాడి ధీమా నీకుంటుందా చెప్పు?

నీ ఆవేశమూ నీ ఆకలీ
ఒక ఉదయాన్ని రగిలించడానికే తప్ప
నీ ఉదయాన్ని వెలిగించటానికి కాదు

వెలుగొక రోజుగా ఉదయించే సమయానికి
వెనుక వరసలు ముందుకు మారుతుంటాయి
చివరి వరుసకి మారిన నీ ఆవేశం, నీ ఆకలి వెనుక
ఎప్పటిలా ఒక అగాధమే నిలబడివుంటుంది.

24/4/15
విరించి ll భయంకర స్వప్నం ll
.......................................
నడి రాతిరి నిద్దురలో
హఠాత్తుగా ఉలిక్కిపడి నిద్రలేచినపుడు
సగంలో ఆగిపోయిన భయంకర స్వప్నం
శ్వాసలో కూడా క్రూరంగా వినిపిస్తుంటుంది
చీకటికి కూడా కొన్ని ఆకారాల్ని అంటించి
కంటి ముందు కాసేపు వేలాడుతుంటుంది

దయ్యాల్ని మనుషుల్లోనే కనుగొనే మనం
నిదురలో అందమైన కలల్ని ఎపుడో పోగొట్టుకున్నాం..
మనుషుల్లో నమ్మకాల్ని కోల్పోయిన మనం
స్వప్నాల్ని నమ్మే స్థితికే దిగజారుతుంటాం.

ఆనందాతిశయం లో పక్షులు కూసే కూతలూ
సాన రాళ్ళ మీద నూరుకునే మన మాటలూ
ఒకటే అనుకునే మనం
నిదురలో మనసు చేసే సహేతుక దాడిని
స్వప్నమనుకుని సర్ది చెప్పుకుంటాం.

తలా మొండెమూ భాగాల్ని 
ద్వేషంతో నింపుకున్న మనం
ఒట్టి కాళ్ళ తో నిదురలోకి జారుకున్నపుడు,
తల మొండెం కలిగిన మన రూపాన్ని
స్వప్నమనే అద్దంలో చూసుకునే సమయాన
మృత్యువును చూసినట్టే జడుసుకుంటాం.

భయంకర స్వప్నాల మధ్య ఊగిసలాడే
నడి రాతిరి నిదురను ప్రేమించే మనం
మనుషులందరూ కలిసి మెలిసి జీవించే
ఒక సుందర స్వప్నాన్నెందుకనో ప్రేమించనేలేము.

24/4/15

Tuesday, 21 April 2015

విరించి ll అడ కత్తెరలో వేడి వేడి ఛాయ్ ll
............ .................................
కొన్ని అన్యోన్య బంధాలుంటాయి
మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా
కప్పూ సాసర్ లాగా..

కాచి వడబోసిన వేడి వేడి ఛాయ్ ని
కప్పూ సాసర్ లోనే తాగాలి
ఖాళీ గా ఉండిపోయే కప్పూ సాసర్ కి
ఎలాంటి విలువా ఉండదు
వాటికి జీవం ఒచ్చేది 
ఛాయ్ నిండినపుడే కదా..

చిక్కటి ఛాయ్ ని కప్పు ఒడిసి పట్టుకున్నపుడు
అది ఒక సాసర్ మీద ఉంటేనే బాగుంటుంది

సాసర్ మీద కప్పూ
కప్పు కింద సాసరూ
ఎపుడూ నేను గొప్పంటే 
నేను గొప్పని
అనుకోవెందుకో అసలు
రెండూ కలిసుంటేనే కదా
చిక్కటి రుచికరమైన ఛాయ్ ని
నోటికి అందించగలిగేది.

పొగలు కక్కే వేడి వేడి ఛాయ్ ని
వేడిగానే తాగాలంటే
కప్పులోకే ఏకంగా పెదవులు దూర్చాలి
ఎంత వేగంగా ఆ వేడిని గొంతులోకి దింపాలో
అంత పైకి సాసర్ని ఎత్తి పట్టుకోవాలి

పొగలు కక్కే వేడి వేడి ఛాయ్ ని
మెల్లిగా చల్లగా తాగాలంటే
కప్పులోని ఛాయ్ ని సాసర్ లోకే వంచాలి
ఎంత వేడి ఛాయ్ అయినా
సాసర్ గర్భంలో కి వంచినపుడు
క్షణాల్లో చల్లబడాల్సిందే..
రుచి వేడి పర్యాయ పదాలే కావొచ్చు
సాసర్ మీదుగా ఛాయ్ ని తాగినపుడు
వేడీ చలువ కలిసిన ఒక కొత్త రుచినే ఆస్వాదించొచ్చు

ఏదో ఒక రోజు హఠాత్తుగా
కప్పు పగలినపుడో..
సాసర్ ముక్కలైనపుడో..
ఛాయ్ రుచి హీనమైపోతుంది
ఒంటరి జీవితం ఎవరికైనా దుర్భరమే మరి.

కానీ ఆధునికత పెరిగిన ఈ సమాజంలో
కప్పులూ,సాసర్లూ ఒంటరిగానే కనిపిస్తుంటాయి
ఛాయ్ ని ఆస్వాదించలేనట్టుగా మారిన కప్పులు
గప్ చుప్ బండ్లమీద సాసర్లు
భారంగానే జీవితాల్ని వెళ్ళదీస్తుంటాయి.

అక్కడక్కడా ప్లాస్టిక్ గ్లాసులు కూడా ఉంటాయి
చేతినిండా సరి పడని సైజులతో
నోటి నిండా అందని మూతులతో
వేడి వేడి ఛాయ్ లోకి
తమ ప్లాస్టిక్ సరుకును కూడా 
కొంచెం కొంచెం కడుపులోకి అందిస్తుంటాయి.
ఎపుడైనా వేడి వేడి ఛాయ్ ని 
ఈ గ్లాసుల్లో తాగాలనుకున్నపుడు
వేడి కాస్త తగ్గించుకోవాలంటే..
ఒక గ్లాసు లోంచి ఇంకో గ్లాసులోకే వంపి చల్లార్చుకోవాలి
లేదా..ఒక గ్లాసుని ఇంకో గ్లాసులోకే దూర్చుకోవాలి.
ఏం ఖర్మ రా బాబూ...

20/4/15

Saturday, 18 April 2015

విరించి ll మంగళ సూత్రం ll
...........................................
రాతిరి వసంతంలా విరబూసినపుడు
రొమ్ము మీది వెంట్రుకల పై
వెచ్చగా తగిలే ఆమె శ్వాస
నా రెండు చేతుల్లోకి ప్రేమని నింపి
దగ్గరికి హత్తుకునేలా చేస్తుంటుంది..

కానీ ఈ రాతిరి ఆమె ఒక
మధుర స్వప్నంలా అక్కడ ఒదిగిపోతుంది

రేపు ఉదయం నిద్రలేచే సమయానికి
ఆమె తలస్నానం చేసి తలకు చుట్టుకునే
టవల్ దెండానికి వేలాడుతుంటుంది

పొగలు కక్కే కాఫీ కప్పులో
ఆమె నింపే ఆత్మీయానురాగం
నాతో ఒక యుద్ధమే చేస్తుంటుంది

దేవుని గదిలో ఆమె పాడే సుప్రభాతమూ
విష్ణు సహస్ర నామమూ
మ్రోగించే దేవుని గంటా
నా మూగవోయిన చెవులను
చివుక్కుమని పిస్తాయి

చిక్కు ప్రశ్నల్లాంటి ఆమె తల వెంట్రుకల్ని
పొడుపు కథల్లాగా విప్పేసిన మేధావి దువ్వెన
రెండు శాంపిల్ ప్రశ్నలను ఎత్తి చూపినట్టుగా
రెండు వెంట్రుకలని పేర్చుకుని కనిపిస్తుంది

ఆడదాని అందానికి మనమిద్దరమే కదా
కారణమన్నట్టు
అద్దమూ దానిమీది బొట్టుబిళ్ళ
ఒకదానికొకటి కౌగిలించుకుని కనిపిస్తాయి.

తిని పారేసిన అంట్లూ
వేసుకుని విడిచేసిన బట్టలూ
కడుపులో దేవుతున్నట్టు ఆకలీ
అన్నీ ఆమె పుట్టింటికి వెళ్ళిందన్న విషయాన్ని
మైకులో చెవిపక్కనే చెబుతున్నట్టూ
చెట్టంత  మనిషిని చెట్టుకి కట్టేసి చూపుటున్నట్టూ
అనిపిస్తుంటాయి.

ఆహా ప్రియ సఖీ...!
నీవొక్కరోజు ఊరికెళితే
నేను నేనుగా లేను

నా స్మృతి పథంలో
నీవెన్ని గుర్తులని నాకోసం
ఇలా వదిలేసి వెళ్ళావో అనుకుంటాను

ఇల్లంతా ఇన్ని గుర్తులను నాకోసం
వదిలి వెళ్ళే నీకు
నా గుర్తుగా ఏదీ ఇవ్వలేకపోయానని
బాధపడుతున్న సమయాన....

నీవక్కడ, నీ పుట్టింటిలో..
ఇంటికి వచ్చిన ముత్తైదువలతో కూడి
కాళ్ళ కు పసుపు రాయించుకుని
నుదుటిమీద బొట్టు పెట్టించుకుని
మంగళ సూత్రాన్ని కళ్ళకు అద్దుకుంటుంటావు

నన్నూ..నా గుర్తునీ
మన జీవితంలో మరచి పోలేని ఒక ఙ్ఞాపకాన్నీ
నీ గుండెలపై దాచుకునే
ఓ..నా ప్రియ సఖీ..
నీవెంత మధుర మైనదానవి..!!

19/4/15





విరించి ll ఖాళీ జేబు ll
-----------------------------
ఒక్కోసారి మన దగ్గర
డబ్బులసలు ఉండనే ఉండవు
కొనాలను కున్న వస్తువు ఒక విగ్రహంలా
మన భావాల్లో పూజలు
అందుకుంటూనే ఉంటుంది

మన పడక  గదినైనా
పూర్తిగా నింపలేని కలలు
సుదీర్ఘ రాత్రుల్లో మనకు
నిద్రలేకుండా చేస్తుంటాయి

మన అభ్యర్థనలకు విసిగిపోకుాడదని
మనమొక మాట్లాడని  దైవాన్ని
తయారు చేసుకుంటాము

ప్రపంచాన్ని సృష్టించిన ప్రభువు
మనకోసం ఒక అద్భుతాన్ని
చేసేస్తాడని నమ్ముతుంటాం

ఇంత సమయంలో
ఇంత సంపాదించేయాలని
ఆ తరువాత హాయిగా బతికేయాలని
మరో ఆలోచన లేకుండా
భవిష్యత్తు లోకి దూకేసి
ప్రస్తుతానికి మరణిస్తుంటాం


ఖాళీ అంగీ జేబులోకి
చేతులు పెట్టినప్పుడల్లా
చేతివేళ్ళను తాకే గుండెను చూసి
ఇంకా బ్రతికే ఉన్నామని తెలుసుకుంటాం

కొనాలనుకున్న వస్తువు
బ్యాంకు వాడిచ్చిన అప్పుకో
స్నేహితుడిచ్చిన చేబదులుకో
లొంగి పోయినపుడు
ఆనందాతిశయం కలిగించిన తొందరలో
ఇంకో వస్తువు కూడా మన కలల్లోకి
దూకే ప్రయత్నంలో
మన గది మీదనే వేలాడుతూ
నిరీక్షిస్తుంటుందని తెలుసుకోలేము.

18/4/15