Saturday, 27 June 2015

అ కి అ వొత్తిస్తే...2
................................
* మల్లీ ఏం జేస్తవని అడుగుతౌ....శెప్పిన కదా...ఏంజేస్తం...ట్విట్టుతం.

* గుడ్డుమీద బొచ్చు పీకడమంటే ఏందో అనుకున్న...ట్వీటడం.

* పీకావులే నెట్టు మీద ట్వీటు

* ట్వీటు శతకం రాయలని  యోగిలా మారాడు.

* తెగేదాక లాగకూడదు. ఇదేమైనా తాళా?

* మండేలా చూపే నీదేలే...ఓ మిస్సయ్యా మిస్సయ్యా అయ్యా...నీ మైనస్సే చూశామయ్యా..

* ఆయన బ్రీఫాడు..నేను ట్విట్టాను.

* ప్రశ్నించడమంటే..ఏంటో అనుకోకండి. ట్విట్టర్ లో ట్విట్టడం.

* సంబంధం ఉందా లేదా అని కాదన్నయ్యా...ట్వుటానా లేదా అన్నది చూడాలి.

* తూ చ్..తొండి. ప్రశ్నిద్దామని ట్వీటితే...ఒక్క ట్వీటుకి ఇన్ని ప్రశ్నలా?.

అ కు అ వొత్తిస్తే...
..........................
* అవును అతడు గొప్ప నటుడు. ఎక్కడైనా.

* ట్విట్టర్ పిట్టి గంట కొట్టింది.

* నెల్సన్ మండేలా నేనూ సేమ్ టు సేమ్.

* నీతులు చెప్పడం ఇంత వీజీనా..?

* ఇలాంటి ప్రాబ్లంలు వస్తే...గట్టిగా పిలవండి. తప్పక వొస్తా...వొచ్చి ట్విట్టుతా.

* చివరికి వచ్చాడు...చూశాడు..ట్విట్టాడు.

* ఏయ్...మల్లీ ట్విట్టాడు.

* అవినీతిని అంతం చేద్దాం..ట్వీటుదాం.

* ఆయనెవరినీ తిట్టడు. మర్యాదగా ట్వీటుతాడు.

* సంవత్సరానికి ఒక ట్విట్టే.

Thursday, 25 June 2015

విరించి  ll అసంపూర్ణ శిల్పం  ll
...................................
కొన్ని ఆకస్మిక సాయంత్రాల్ని
మనకు మనమే సృష్టించుకుంటాం.

ఎపుడోకానీ ఎదురుపడని
తూ ర్పూ పడమర తిలకాల్లాగా
మనమపుడపుడూ యాదృచ్చికంగా
ఎదురుపడుతున్నట్టు నటిస్తుంటాం.

చల్లటి చిరుగాలి నిండిన ఆకాశంలా
మన చూపుల్ని కొన్ని క్షణాలు కలుపుకుంటాం

బరువైన గాలికి రెపరెపలాడే
నీ కనురెప్పలకీ..
చూసీ చూడక చూసే
నీ క్రీగంటి సిగ్గులకీ..
జరిగే సంధి కుదరని యుద్ధంలో
నిరాయుధ సైనికుడినై నిట్టనిలువునా
ఓడిపోతున్నందుకు ఒకింత గర్వపడిపోతాను.

'బాగున్నావా' అనీ ఒక ముక్క అడిగి
చేతులు నలుపుకుంటున్న నాకూ
'బాగున్నా' నని ముక్తాయింపుగా చెప్పి
ముంగురులు సరి చేసుకునే నీకూ
హృదయాల్లో మాటలు సెలయేళ్ళై
పారాలని ఉంటుందేమో...కానీ

నీటిమీద ఎగరాలని విసిరిన రాయి
డుబుక్కున మునిగిపోయినట్టు
మన మధ్య వీచే గాలిలో చుట్టుకుపోతాం

మన పక్కనుండి నడిచే మనుషులు
మ్రోగే హారను శబ్దాలూ
మన మీదినుంచి కదలని లోకుల చూపుల నడుమ
ఒక్క కౌగిలింతకి ఎన్ని గోడల్ని పగులగొట్టాలో..

చివరికి బలవంతపు రాయిలా కదిలే నేను.
చేతులు కట్టేసిన శిల్పిలా నీవు.
'మరి ఉంటాను' అనే గాటును మోస్తూ ఒక అసంపూర్ణ శిల్పం.

24/6/15

Tuesday, 23 June 2015

విరించి ll అప్పగింతలు  ll
...................................
ఆ సమయంలో నాన్న నాకు
కంట్లో వొత్తులు కాలిన
పాతుకుపోయిన దీపపు స్తంభంలా కనిపించాడు.

ఆకాశాన్ని ప్రతిబింబంగా ఎత్తి మోసే
మా వూరి చెరువు
ఎండిపోయినట్లుగా కనిపించాడు

ప్రేమ బంధాల్ని పట్టుకునీ పట్టుకునీ
మొద్దుబారిన చేతులను
మొదటిసారి కన్నీటితో కడుగుతూ కనిపించాడు

ఇన్ కం టాక్స్ పేయ్మెంట్స్ కీ
ఎల్ ఐ సీ పాలసీలకీ
సంపాదనంతా సరిపోయాక
ఆకులు రాలిన
మార్చి ముప్పై ఒకటి చెట్టులాగా కనిపించాడు

అడగకుండానే అన్నీ పెట్టే నాన్న
తనకన్నీ నేనే అనుకునే నాన్న
ప్రేమని మౌనంగా గంభీరంగా పంచే నాన్న
నన్నొక అయ్య చేతిలో పెట్టిన రోజున
తన గుండెల మీది బాధనెందుకో
దాచుకోలేక భళ్ళున కురిసే వానయ్యాడు.

తన కలలేమో కలతలేమో
కష్టాలేమో నష్టాలేమో...
ఎపుడూ ఎవరికీ అంతుబట్టని నాన్న
నా చేయి వదిలి పట్టుబడిపోయాడు.

ఆడపిల్లకి పెళ్ళంటే
అప్పగింతలంటే ఏమో కాదు
మొదటిసారి నాన్న కళ్ళలో నీళ్ళు చూడటమే.

23/6/15
ఏం మహాడుతున్నారు? హైద్రాబాదులో అసలు రాత్రి కావడం లేదు. ఎన్నో స్ట్రీట్స్ లైట్స్ పెట్టాం. ఆ విధంగా ముందుకు పోయాం. అర్ధ రాత్రికూడా మిట్ట మధ్యాహ్నం లా ఉంటుందంటే...కాహదనే పరిస్థితికొచ్చారు. ఎటు పొహోతున్నామని అడుగుతున్నాను.

ఏం మహాడుతున్నారు?.  హైదరాబాదులో ఎక్కడుంది వైద్యం. మంచి డాక్టర్లు లేరు. కార్పోరేట్ హాస్పిటల్స్ లేవు. నడుము నొప్పొస్తే.. విదేశాలనుండి హైదరాబాద్ నుండి కూడా పేషంట్స్ మా పల్లెటూరి ఆసుపత్రులకే వచ్చే పరిహిస్థితొచ్చింది.

ఏం మహాడుతున్నారు?. హైద్రాబాదు అందరిదీ. ఇక్కడ గుజరాతీ వాల్లు...పంజాబీ వాల్లు..బెంగాలీ వాల్లు ..బీహారీ తమ్ముల్లు..ఆంధ్రా వాల్లు...బంగ్లాదేశ్ వాల్లు...పాకిస్థాన్ వాల్లు కూడా ఉంటారు. ఏ ప్రాంతం వాల్లకి వాల్ల భాషనే అర్థం అయ్యే పరిస్థితి. అందు కోస్రం ఆయా పోలీస్ స్టేషన్ లు ఉండాలంటున్నాం. దానికి కూడా కాదనే పరిస్థితికొచ్చారు.

ఏం మహాడుతున్నారు? హైద్రాబాద్ నిజాం కట్టిహించాడంటున్నారు. కేవలం గవర్నమెంటు సంస్థల భవనాలు మాత్రమే ఆయన కట్టించిన పరిస్థితికొచ్చారు.. ప్రైవేటు సంస్థల కోస్రం ఏహీమీ కట్టివ్వలేదు. మేము  కట్టాం. గుండ్రంగా హైటెక్ సిటీని కట్టాం. ఆవిధంగా ముందుకు పోయాం.

ఏం మహాడుతున్నారు. ఈ రోజు ఓటుకి నోటంటున్నారు. ఫోన్ టాపింగ్ చేశారు. ఆధారాలున్నాయి. మాకూ పోలీసులున్నారు..మాకు ఏసీబీ ఉందంటే..మహాట్లాడని పరిస్థితికొచ్చారు. ఆంధ్ర ప్రజల కోస్రం మేము సెక్షన్ ఎయిట్ ముందుకి తీసుకొచ్చాం. దాన్ని కూడా కాహాదనే పరిస్థితికొచ్చారు. న్యూస్ ఛానల్స్ కి సమాచారం ఇచ్చే పరిస్థితొచ్చింది. ప్రజాస్వామ్యం ఎహుటు పోతుందని అడుగుతున్నాం. ఆ విధంగా ముందుకు పోతున్నాం.

Monday, 22 June 2015

లక లకలు
..................

* 'తెదే' పాపం తలా పిడికెడు

* వెయ్యబద్దాల్జెప్పైనా ఒక తప్పు కప్పేయాలన్నారు నాయకులు

* శిశుపాలుడే నయం వంద తప్పులు వేరు వేరుగా చేశాడు.

* 'నారా'యణ మంత్రం శ్రీమ'న్నారా'యణ భ 'జనం'

* ప్రశ్నించటం అంటే ఏమిటని ప్రశ్నిస్తున్నా?.

* చండ్ర పాపం, సండ్ర రోగం.

* నేటి యయాతి మత్తయ్య.

* నా శాయశక్తులా ప్రయత్నించాను. ఐయాం వెరీ సారీ...ప్చ్..ఆయనకే జబ్బూలేదు.

* చంద్రాలోపి మమ గురుః

* సెక్షన్ లతో కొడతా..

Thursday, 18 June 2015

విరించి ll అర్ధ వాక్యం ll
..................................  
ఖాళీ కాగితాల్లా ఒక్క గీతను కూడా
ఎత్తి చూపలేని నీ పెదవులతో
ఒక్కోసారెందుకనో..
న్యూస్ పేపర్లలాగా కొన్ని జండాల్ని మోస్తూ నినదిస్తావు.

తనకు తానే చుట్ట చుట్టుకున్న పాములాగా
మెదడునొక్కదాన్ని పడగలా విప్పుకుంటావు
గొర్రెల్లా తోకల్ని వెంబడించే మేఘాల్లాగా
చిక్కటి కారు మబ్బై ముసురుకుంటావు

పుకారునొకదాన్ని బాంబులా మెడకు చుట్టుకుని
నిన్ను నీవు పేల్చేసుకోవడమొకటే ఇపుడిక మిగిలింది.

నాలుగు రూపాయలకి కిలో లెక్కన పాత పేపర్లు అమ్ముడవుతాయి
పడగ విప్పలేని పాముల తలలకీ విష గ్రంధులు వేలాడుతాయి.
వెలిసి పోయిన వర్షపు మేఘం వెనుక సూర్యుడు మరింతగా వెలిగిపోతాడు
వాక్ స్వాతంత్ర్యానికి బ్రష్ చేయని నోటి పుకారే రారాజవుతుంది.

నీకు తెలియదు కానీ..
నీకన్నా ప్రాణంలేని నీ ప్రతిబింబమే ఎక్కువగా జీవిస్తుంది.
నీ ఆత్మ హత్య మరో బానిస బ్రతుకుకి బలాన్నిస్తుంది.
ప్రపంచ పటానికి సరిగ్గా ప్రశ్నలా కనిపించే దేశం నుండి
మనం రాసుకునే ఆశ్చర్యకర బ్రేకింగ్ న్యూస్ కి ఫుల్ స్టాపెందుకు పెట్టాలి?.
డెమోక్రసీ కదా...మన ఇష్టం. కామాలే పెట్టుకుందాం.

18/6/15