Friday, 18 August 2023

Rajahussain analysis on my poem ఆశ్చర్యార్థకం

 పచ్చని తోటలు మన పిల్లలు..!..

వెఛ్చని నవ్వులు మన చిన్నారులు !!


*విరించి ‘ కవిత “ ఆశ్చర్యార్థకం “..

ఓ హృదయానుభూతి !!


“పిల్లలూ దేవుడూ చల్లని వారే...కల్ల కపటమెరుగని కరుణామయులే “ ,

అన్నాడో సినీకవి.


పిల్లల కంటే ఎక్కువైందీ,వాళ్ళ నవ్వుల 

కంటే స్వచ్ఛమైందీ ఏదీ లేదీలోకంలో 

బహుశా..  అందువల్లనే ఏమో? కనబడే  పిల్లల్ని ,కనబడని దేవుడ్ని ఒకే గాట కట్టాడు కవి.పిల్లల గురించి “విరించి “ ఓ మంచి కవిత రాశారు.ముందుగా ఆ కవిత చదవండి.!!


*ఆశ్చర్యార్థకం ! ....”.!!

---------------------------------


“పసిపాపల కన్నుల్లో

ఎగిరే పక్షులను

నిబిడీకృతమైన ఆశ్చర్యాన్నీ మాత్రమే 

చిత్రీకరించాలి.

పిల్లల తోటల్లో వాళ్ళ ఆటల్లో 

అన్ని పురాతన

సాంప్రదాయాలనూ విడనాడాలి.


మిన్నేటి తరగల మీదకు

ప్రసరించే వాళ్ళ చూపుల్లో..

నీ పెద్దరికపు మాటలు కృష్ణ బిలాలు

నీ ఉనికే వారి నిశ్చల మైదానంలో

పెరిగే ఏకైక కలుపుమొక్క


చుక్కల్ని కనుపాపల కింద ఏరడం

భువనభోంతరాళాల్ని నాలుక మీద 

చప్పరించటం

మెత్తని అరచేతుల మీద

ఆకాశాల్ని ఎత్తి పోయడం

పిల్లల ఆటలకు దిష్టి పెట్టగల వారే లేరు.

వాస్తవిక దుఃఖమయ ప్రపంచంలో

హక్కుల కోసం పోరాడుతూ

అధివాస్తవికత పిల్లల హక్కని గుర్తిద్దాం.


పుస్తకాలలో బందీగా ఉన్న పేజీలను చింపి

స్వేచ్ఛగా పేపర్లలాగా ఎగరనిచ్చే పిల్లలంటే

లైబ్రరీలో మూలకు మూలుగుతున్న

పుస్తకాలకైనా ఇష్టమే!


ప్రశ్నార్థకపు ముఖాల్నెన్నిటినో చూస్తూనే ఉంటాం

కనీసం ఆశ్చర్యార్థకం చూసిన ప్రతీసారి

ఓ పసిపాపేనే గుర్తుకు తెచ్చుకుందాం.


 ‌‌                         …….విరించి , 11/8/19


పిల్లలు సుకుమారులు.లోకం పోకడ తెలీని వారు . కల్లాకపటం ఎరుగని వాళ్ళ మనసు తెల్ల కాగితం లాంటిది. పిల్లలతో వ్యవహరిం

చేటప్పుడు మనం కూడా పిల్లలుగా మారి పోవాలి.ఈ లోకంలోని భేషజాల్ని,భావజాలా

న్ని పక్కన పెట్టాలి.ప్రశాంతమైనసరస్సుఅందా

ల్ని అలా చూస్తూ గడిపేయాలి గానీ, రాళ్ళు వేసి కల్లోలపరచకూడదు.పిల్లలతోమనం

 వ్యవహరించే తీరు కూడా అలాగే....... వుండాలి.వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడూ స్వేచ్ఛతో 

ఎగిరే పక్షుల్నే చూడాలి.ఏదో తెలీని నిబిడీకృత ఆనందాన్ని మాత్రమే దర్శించాలి.క్రమ శిక్షణ

 పేరుతో పాటించే పురాతన సాంప్రదాయాల్ని, కట్టుబాట్లను  విడనాడాలి.ఆకాశాన్నిఅందు

కోవాలి,చందమామను ముద్దాడాలన్న వాళ్ళ 

చిన్ని కోర్కెల మధ్య మన పెద్దరికాల్ని అడ్డు

తేకూడదు.స్వేచ్ఛ వాళ్ళ గుత్త సొత్తు.దాన్ని 

కట్టడి చేయడం కాని,ఆంక్షల ముళ్ళ కంచెలు

 వేయడం గానీ చేయరాదు.


మిన్నేటి తరగల మీదకు ప్రసరించే పిల్లల చూపుల్లో,మన పెద్దరికపు మాటలు ఎంతో  

లోతైన కృష్ణబిలాలు .అందుకే పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి.

ఆ లేత మనసులకుఎటువంటి బాధా కలగ

నీకూడదు.మన అహం..మన అధికారం,మన కాఠిన్యపు మాట తీరుపిల్లల పచ్చని మైదానంలో కలుపు మొక్క,కంకర రాయి కాకూడదు.


పిల్లలు శక్తిమాన్ లు. ఆకాశంలోని చుక్కల్ని సైతం కనుపాపలకిందకు తెచ్చి ఎంచగలరు.

భువనభోంతరాళాల్ని పిప్పరమెంటు బిళ్ళలా చేసి 👅 నాలుక మీద చప్పరించేయ గలరు.

వాళ్ళు అపర బ్రహ్మలు,విశ్వకర్మలు.వాళ్ళకు అసాధ్యమన్నది లేనేలేదు.అంతెందుకు సుతి

మెత్తని చిట్టి అరచేతుల మీద ఆకాశాన్ని ఎత్తి పోయడం వాళ్ళకే చెల్లు. పిల్లల ఆటపాటలకు

ద్రిష్టి పెట్టగలిగిన వాళ్ళు ఈ సృష్టి లోనే లేరు.

ఈ దుఃఖమయ,నిరామయ లోకంలో పిల్లల్ని

పిల్లల్లాగే వదిలేయాలి.అథివాస్తవికత వాళ్ళ జన్మహక్కన్న సంగతిని పొరపాటున కూడా 

మరిచిపోకూడదు.


ఏళ్ళతరబడి లోకంలో పాతుకు పోయిన ఆంక్షల హద్దుల్ని పిల్లల దరిచేరనీరాదు. పుస్తకాల్లో బందీలుగా పడివున్న పేజీలను చింపి పైకి ఎగరేసే పిల్లలంటే గ్రంథాలయాల్లో పడివున్న పుస్తకాలకు కూడా ఇష్టమే.(గ్రంథాల

యాల్లోని పుస్తకాలుఅరుదైనవి,అపురూప

మైనవి,అమూల్యమైనవి.)


లోకంలో రోజూ మనం ప్రశ్నార్థకమైన ముఖా

ల్ని ఎన్నింటినో చూస్తూనే వుంటాం.ఆ ముఖా

ల్లోఆశ్చర్యార్థకం ! చూసిన ప్రతీసారీ మనం 

ఓ పసిపాపను గుర్తుకు తెచ్చుకుంటే ఇక సమ

స్యేవుండదు.తండ్రులుగా పిల్లల పట్లచేసేతప్పు

లు తెలుసుకునే సరికేతెల్లారిపోతుంది.అందుకే

తాతలుగా పిల్లలకు దగచగరై, ఆతప్పుల్ని దిద్దుకుంటూ వుంటారు.పిల్లలు సున్నిత మన

స్కులు.శాసనాల్ని,బంధనాల్ని వాళ్ళ దరికి చేరకుండా కాపుకాయాలి.ఆ పచ్చని తోటలకు 

పెద్దలు కాపలా దార్లే గానీ, ముళ్ళ కంచెలు కారాదన్నది కవి అంతరంగం.


మంచికవిత అందించినందుకు

డా. విరించి విరివింటికి అభినందనలు !!


*ఎ.రజాహుస్సేన్.!!

Sunday, 15 November 2020

శివమెత్తిన కమర్షియలిజం.

 

శివ’మెత్తిన కమర్షియలిజం!

కాలేజ్ కి వచ్చి చదువుకునే రోజులు ఎప్పుడో పోయాయి అంటాడు మల్లి పాత్రధారి. అదే మల్లి సినిమా కాసేపు ముందుకి జరిగాక “బాటనీ పాఠముంది మ్యాట్నీ ఆట వుంది సోదరా ఏది బెస్టురా అంటూ” క్లాసుల కంటే సినిమాలమీదే మక్కువ ఎక్కువని పాట పాడతాడు. శివ సినిమా కథంతా ఇటువంటి పారడాక్సులతో ముందుకు సాగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులు లోకల్ రౌడీల సహాయంతో కాలేజీల్లో అల్లర్లు గొడవలూ చేస్తుంటారనీ, యవ్వనోద్రేకం వలన ఆ గొడవల్లో విద్యార్థులు తలలు దూర్చి తమను తాము హీరోలుగా ఊహించుకుంటారనీ, ఆ విధంగా చదువుకు దూరమౌతారనీ సూత్రీకరిస్తుంది ఈ సినిమా. 1989 అక్టోబర్ లో రిలీజైన శివ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలు రాయిలా నిలించిందన్నది నిర్వివాదాంశం. కథలో బలం లేకపోయినా కథనం లో కొత్తదనం వలన ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారని చెప్పాలి. ఇప్పటికి ఇదో కల్ట్ సినిమా అని ఆదరించే వాళ్ళూ ఉన్నారు.  సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ, కెమెరా ఆంగిల్స్ కానీ, ఫైట్ సీక్వెన్స్ కానీ అన్నింట్లో కొత్తదనాన్ని తీసుకురాగలిగాడు రాంగోపాల్ వర్మ. సినిమా మొదటి సీన్ లో జరిగే ఫైట్ లో ‘ భవానీ’ అని గోడ మీద బొగ్గుతో రాసి ఉండటమే గానీ, చివరి ఫైట్ సీన్ లో సౌండ్ ఏమీ లేకుండా కేవలం శ్వాసలు మాత్రమే వినిపించటం కానీ, దర్శకత్వ ప్రతిభను తెలిపేవిగా ఉంటాయి.

వర్మకు ఉండే గ్యాంగ్ స్టర్ అబ్సెస్సన్ ఈ శివ సినిమాతో మొదలై నేటికీ కొనసాగుతుండటం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక సిగ్గరి ఐన కాలేజ్ స్టూడెంట్ ఒక గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు అనే కథాంశంతో వచ్చినా, దాదాపు ఇదే అంశంతో సత్య, కంపెనీ, రక్త చరిత్ర, బెజవాడ, గాయం,రౌడీ, వంగవీటి వంటి సినిమాలు ఇప్పటికీ తీస్తూ ఉండటం వలన, శివ సినిమా ను ఈ రోజు చూస్తే ఏదో కొత్త unique సినిమా చూసామన్న ఫీలింగ్ కలగటం లేదు. మరల మరలా అదే కథాంశంతో సినిమాలు తీయటం వలన, శివ సినిమాకు ఉండే ప్రత్యేకతను వర్మనే స్వయంగా చంపేశాడని చెప్పాలి. ఐతే కథనంలో ఎంత కొత్తదనం ఉన్నా, శివ సినిమాలోని పాత్రల చిత్రణలో అదే స్టీరియోటైప్ లను కొనసాగించాడు. ముఖ్యంగా హీరోయిజం, విలనిజం లను హైప్ చేసి చూపటంతో వర్మ కమర్షియల్ గా హిట్ చేయగల సినిమాను ఇవ్వగలిగాడే తప్ప గొప్ప సినిమాను ఇవ్వలేకపోయాడు. హీరో చేతితో పీకగానే సైకిల్ చైన్ ఊడివచ్చేస్తుందన్నంత హీరోయిజం, కెమెరా ముందు తాను చూపించదలచుకున్న రియలిస్టిక్ పిక్చర్ ను స్టేజ్ మీది డ్రామాగా గా మార్చేసింది.  విలన్ ను మొదటినుంచీ ఒక గ్యాంగ్స్టర్ గానే పరిచయం చేసినప్పటికీ అతడెందుకు గ్యాంగ్స్టర్ అయ్యాడో అనే మానవీయ కోణం కనపడకపోగా విలన్ అంటే క్రూరంగా కర్కశంగా నే ఉంటాడు, పసి పిల్లలను కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు అనేటువంటి స్టీరియోటైప్ ను వదలలేక పోయాడు. దానివలన చందమామ కథ లోని రాక్షసులకూ, షాడో నవలల్లోని విలన్లకు మధ్యన ఎక్కడో ఈ సినిమా విలన్ కనిపిస్తాడు. ఐతే సినిమా కథలో కనిపించే రాజకీయాలు ఏంటో అర్థం కాదు. రాజకీయ నాయకులు, కాలేజీలో స్టూడెంట్ లీడర్లను ఉపయోగించుకుని చేసే ఘనకార్యాలు ఏమిటో కూడా చూపనేలేదు. అమ్మాయిలను ఏడిపించడం, లెక్చరర్ లను విసిగించటం తప్ప వీళ్ళు మిగితా స్టూడెంట్లను రాజకీయాలవైపు తిప్పిన దాఖలాలేవీ కనబడవు. ఆ కాలేజీ స్టూడెంట్స్ కూడా చాలా పేలవంగా రాజకీయ చైతన్యం లేని పప్పు సుద్దల్లా కనిపిస్తూ ఉంటారు. స్టూడెంట్ లీడర్లు, కాలేజీల్లో అరాచకాలు చేయడానికే ఉంటున్నారనీ, అటువంటి సమయంలో కాలేజీలోకి ఈ రాజకీయ శక్తులు ఎంటర్ కాకుండా ఒక సిగ్గరి ఐన యువకుడు తిరగబడతాడనీ, ఆ క్రమంలో అతడే మరో గ్యాంగ్ స్టర్ గా మారి ఆ రౌడీ లను హతమార్చేస్తాడనీ కథ. ఐతే కాలేజీ లో ఎక్కడా రెండు వ్యతిరేక పార్టీలున్నట్టుగా, మనకు కనిపించదు. వాటి అజెండాలుగానీ, స్టూడెంట్ సమస్యల మీద వాళ్ళ పోరాటాలు గానీ మనకు సినిమాలో మచ్చుకైనా కనిపించవు.  భవానీ అనే రౌడీ ఎందుకు కాలేజీ వ్యవహారాలలోకి జె.డీ. అనే కుర్రాడిని ఎగదోస్తాడో కూడా చూపలేదు. విజయవాడలో కథ జరుగుతుండగా, అక్కడి లోకల్ పాలిటిక్స్ లోని కుల, మత రాజకీయాల కనీస ఊసే లేకుండా “మమ” అనిపిస్తాడు దర్శకుడు. కానీ తెలంగాణా ప్రాంత యాసను మాత్రం బాగానే అపహాస్యం చేయగలిగాడు. అంతేగాక, హింసను మరింత భయంకరంగా చూపటం లో సఫలమయ్యాడు.

మొత్తానికి కాలేజీలలోకి రాజకీయ శక్తులు రావటం మంచిది కాదనే సందేశమేమైనా ఇస్తున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ అదీ నిజం కాదు. ప్రజాస్వామ్యం లో విశ్వవిద్యాలయాల్లో కాలేజీ రాజకీయాలు విద్యార్థుల చైతాన్యాన్ని పెంచటమే కాక, భవిష్యత్తులో ప్రశ్నించే పౌరులనూ, బాధ్యతగల రాజకీయ నాయకులను ఎన్నుకోగలగటం లోనూ కావలసినంత భూమికను ఏర్పరుస్తాయి. మంచి నాయకులుగా ఎదగటం, బాధ్యతగల పౌరులుగా మరలటం కాలేజీ రాజకీయాలు నేర్పిస్తాయి. చర్చలు ప్రతి చర్చలు చేయగల ప్రజాస్వామిక వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. రాజకీయ చైతన్యం ఉండాల్సినంతగా లేకపోతే మనదేశానికి కావలసిన నాయకులను ఎన్నుకొనగలిగే స్థితిలో పౌరులు ఉండలేరు. అందుకే ప్రజాస్వామిక కాలేజీ రాజకీయాలు దేశానికి బలాన్నిస్తాయే తప్ప, కార్పోరేట్ యాజమాన్యాలు ప్రచారం చేస్తున్నట్టు కెరియర్ ను పాడు చేయవు. ఐతే శివ సినిమాలో మాత్రం కాలేజీ రాజకీయాలు కేవలం ఒక గ్యాంగ్ స్టర్ సంస్కృతిని పెంచి పోషిస్తాయి అనే విధంగానే, తప్పుడుగా చూపటం జరిగింది.  విద్యార్థి రాజకీయాలు కేవలం అమ్మాయిలను ఏడిపించటానికి కాలేజీల్లో వెధవ వేషాలు వేయటానికీ, హీరోయిజం చూపటానికి తప్ప ఎటువంటి బాధ్యతనూ ఇవ్వలేవని చూపటం జరిగింది. తెలిసో తెలియకో స్టూడెంట్ పాలిటిక్స్ లోకి ఎవరైనా ఎంటర్ ఐతే పర్యవసానాలు ఇలా దారుణంగా ఉంటాయని భయపెట్టేలా ఉంటుంది ఈ సినిమా. గణేష్ పాత్ర ధారి హీరోతో రెండు సందర్భాలలో స్పష్టంగా మర్యాదగా చెబుతాడు, “మీరంతా చిన్న పిల్లలు ఈ రాజకీయాలు పెద్దవాళ్ళ విషయాలు, అనవసరంగా తల దూర్చకండి” అని. కానీ ఆ రెండు సందర్భాలలో హీరో, గణేష్ ను అవమానించి పంపుతాడు. దీన్నిబట్టి హీరోలో ఉండే తలబిరుసుతనం, హీరో వర్షిప్ మీద ఉండే అభిమానం అతడిని అలా గ్యాంగ్ స్టర్ నుంచి చేసిందనుకోవాలా?. “ఎవరో ఒకరు పూనుకుని వ్యవస్థను మార్చాలి” అని హీరో అనటంలో, ఆ ఆపద్బాంధవుడను నేనే అని చెప్పుకోవటం కనిపిస్తుంది. సినిమా మొత్తం మీద డమ్మీ పాత్రలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కనిపిస్తూ ఉంటాడు. పోలీస్ వ్యవస్థ కూడా గ్యాంగ్స్టర్ల ముందర దిగదుడుపే అన్నమాట. ఐతే హీరో కూడా గ్యాంగ్స్టరే కానీ హీరో కాబట్టి “మంచి గ్యాంగ్స్టర్” అన్నమాట. అంటే శివ సినిమా మొత్తానికి తేల్చేదేమంటే, గ్యాంగ్ స్టర్ లు రెండు రకాలు. ఒకటి, సమాజాన్ని మార్చటం కోసమై గ్యాంగ్స్టర్ గా మారిన శివ వంటి మంచి గ్యాంగ్స్టర్ లైతే, రెండోరకం, సమాజాన్ని నాశనం చేయటం కోసం, లేదా సమాజం మీద పడి దోచుకుంటూ, అందర్నీ భయపెట్టడం కోసం గ్యాంగ్స్టర్ గా మారిన భవానీ వంటి చెడ్డ గ్యాంగ్స్టర్ లన్నమాట. శివ ఆ విధంగా కమర్షియల్ గా హిట్ కొట్టగల సినిమా ఫార్ములా గ్యాంగ్స్టర్.

Tuesday, 5 November 2019

ఖడ్గం (2002)vs వీర్ జారా(2004)

"ఊరికొక్క అంజాద్ భాయ్ ఉండింటే ఈ దేశం ఎపుడో బాగు పడేది".

ఇది ఖడ్గం సినిమాలో ముస్లిం పాత్ర వేసిన ప్రకాశ్ రాజ్ ను ఉద్దేశించి బ్రహ్మాజీ చెప్పే డైలాగ్. గుజరాత్ లో మారణకాండ జరిగిందని ఇక్కడి లోకల్ ముస్లింలు తిరుపతి నుండి బస్సులో తిరిగివస్తున్న హిందువులను కత్తులతో నరకడానికి ఒస్తున్నట్టుగా ఒక అభూత కల్పన కలిగిస్తాడు దర్శకుడు. దానిని  ముస్లిం అయిన ప్రకాశ్ రాజ్ అడ్డుకుని, హిందూ ముస్లింల మధ్య ప్రేమను కలిగిస్తాడన్నమాట. చాలా నాటకీయంగా సాగే ఈ సన్నివేశంలో దర్శకుడు ఏమి చెప్పదలచుకున్నాడనేది విదితమే. ఊరికొక్క అజాంద్ భాయ్ లేడనీ, అందుకే ఈ దేశం ఇలా ఉందనీ చెప్పడంలో దర్శకుడి ఉద్దేశం ఏమిటి?. ఊర్లలో ఉండే ప్రతీ ముస్లీమూ హిందూ వ్యతిరేకి అని చెప్పదలచుకున్నాడా?. ఇది ఖచ్ఛితంగా ప్రశాంతంగా జీవిస్తున్న మన ముస్లిము సోదరులను తక్కువ చేసి మాట్లాడటమే. సగటు హిందువు ముస్లిం అంటేనే పాకిస్థాన్ కి చెందిన వాడు అని అనుకునే ఒక స్టీరియోటైప్ మనస్తత్వంతో శ్రీకాంత్ పాత్ర మనకు కనిపిస్తుంది. సిగరెట్ కాలుస్తూ ఎదురుగా ముషారఫ్ నూ, బిన్ లాడెన్ ఫోటోలను కోపంగా చూస్తూ..సగటు ముస్లిం పాకిస్థానీయుడే అనే అర్థం వచ్చేలా, సగటు ముస్లీం తీవ్రవాదే అని అర్థం వచ్చేలాగా, మేము (అంటే హిందువులు )సెక్యులర్ గా ఉండటం వలననే మీరు ఈ దేశంలో ఉండగలుగుతున్నారని శ్రీకాంత్ పాత్ర ద్వారా చెప్పించడం అసంబద్ధంగా తోస్తుంది. కానీ దానికి విరుగుడుగా ప్రతీ మాటకూ తన దేశభక్తిని నిరూపించుకోవలసి రావడం, తనది ఈ దేశమే అని అరిచి చెప్పుకోవాల్సిన అవసరం ప్రకాశ్ రాజ్ పాత్రలోని అంజాద్ భాయ్ కి మల్లీ మల్లీ కలగడం, చూసినపుడు సగటు ముస్లిం పడే బాధ మనకు కనిపిస్తూంటుంది. ఆ సినిమాలోని శ్రీకాంత్ పాత్రధారి కలిగున్న భావజాలమే మనలో చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. దీనినే ఇస్లామోఫోబియా అంటున్నాం. ఈ సినిమా మొత్తం ఇటువంటి ఇస్లామో ఫోబియాను పెంచి పోషించేలా ఉంది. ఇపుడు సినిమా చూసిన సగటు మానవుడు హాలు నుండి బయటకు వెల్లేటపుడు ఏ భావజాలంతో పోతాడనేది ముఖ్యం. వాడి మనసులో హిందువులను కాపాడిన అంజాద్ భాయ్ ఉంటాడా, హిందువులపై కత్తులతో దాడి చేసిన ముస్లిములు ఉంటారా?. పైగా సినిమాలో అంజాద్ భాయ్ లాంటివాడు ఊరికొకరుకూడా లేడంటాడు కదా..

ఇక, హిందూ ముస్లిం పాత్రల ఆహారయంలో స్టీరియో టైపింగ్ ఈ సన్నివేశంలో దారుణంగా ఉంటుంది. ప్రతీ ముస్లిం పైజామాతో , టోపీతో, కల్లకింద కాటుకతో, గడ్డంతో కనిపిస్తాడు. ఇక తిరుపతి నుండి వచ్చే బస్సులో గుండు కొట్టించుకోని, తిరునామం పెట్టుకోని హిందువంటూ ఉండడన్నమాట.
ఆహార్యానికి సంబంధించిన ఇటువంటి స్టీరియో టైపులు దాదాపు ప్రతీ సినిమాలోనూ కనిపిస్తాయి.

ఈ సినిమా మొదటిసారి చూసినపుడు చాలా అసహ్యంగా అనిపించింది. కార్గిల్ వార్ జరిగి ప్రజలందరూ పాకిస్థాన్ మీద కోపంగా ఉన్న తరుణంలో అదే కోపాన్ని మంచి బిజినెస్ లాగా మలచుకున్నాడు కృష్ణవంశీ. చివరి క్లైమాక్స్ సీన్ లో ఆంటాగోనిస్ట్ తో జిహాద్ అని భయంకరంగా అరిపించడం దగ్గరినుంచి బాంబుని డీ ఫ్యూజ్ చేసే వరకు చిన్న పిల్లల ఆట లాగా అనిపిస్తుంది. ఇండియాలో ఉంటూ ఐఎస్ఐ ఉగ్రవాదిగా ఒక ముస్లిం యువకుడు శిక్షణ పొంది ఇక్కడ అరాచకాలు సృష్టిస్తుంటే, ఇక్కడి దేశభక్తులైన పోలీసులు, సినిమా వేశాలకోసం తిరిగే ఒక జూనియర్ ఆర్టిస్టు, అతడి ముస్లిం మిత్రుడు కలిసి, అతడిని చంపటం, ఆ యువకుడు ఈ ముస్లిం మిత్రుడి సొంత తమ్ముడే అయుండటం బేసిక్ గా సినిమా కథ. ఇంకో ఐఎస్ఐ ఉగ్రవాదిని చెరనుంచి విడిపించటం కోసం బాంబుబ్లాస్ట్ లు చేయడం వంటి నాటకీయతో సినిమా కథ నడుస్తుంది. ఈ సినిమాలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ముస్లిముల దేశభక్తిని గురించి పదే పదే సినిమాలో చెప్పించడం. వారిని పదే పదే శంకించడం. రెండోది, పాకిస్థాన్ దేశాన్నే కాకుండా సగటు పాకిస్థానీయుడు కూడా శత్రువుగా చూపటం. పాకిస్థాన్ లో ఉన్న వారంతా తీవ్రవాదులే అనేలాగా చూపించడం. ఒక సీన్ లో పాకిస్థానీయులను, అంటే అందరినీ, బద్మాషులనీ, కిరాయి సాలేగాండ్లనీ ప్రకాశ్ రాజ్ తో అనిపించటం ద్వారా, సగటు పాకీస్థానీయులందరినీ అసహ్యించుకునేలా చేస్తాడు దర్శకుడు. కార్గిల్ సమయంలో సగటు భారతీయుడిలో ఉండే ఎమోషన్ ను బాగానే క్యాష్ చేసుకున్నాడు కృష్ణవంశీ. అసలు భారతదేశానికి దేనితో శతృత్వం ఉంది అని మనం ప్రశ్నించుకోవాలి. పాకిస్థాన్ ప్రభుత్వం తోనా లేక పాకిస్థాన్ ఫారిన్ పాలసీతోనా, కాశ్మీరు విషయంలో పాకిస్థాన్ పాలకుల వైఖరితోనా, పాకిస్థాన్ లో ఉన్న భారత వ్యతిరేక శక్తులతోనా లేక పాకిస్థాన్ లోని సామాన్య ప్రజలతోనా లేక పాకిస్థాన్ అనే పదంతోనా, లేక మొత్తంగా పాకిస్థాన్ అనే దేశంతోనా?. పాకిస్థాన్ లో ఉండే సగటు పౌరునికి, పాకిస్థాన్ ని పాలించే నియంతలు చేసే ఆగడాలకు ఏమిటి సంబంధం?. ఎలాంటి సంబంధమూ ఉండదు, అని తెలిసినా, ప్రతీ పాకిస్థానీయుడిని, అక్కడుండే చిన్నారులనూ కూడా వదలకుండా ద్వేషించడమంటే, శత్రువుగా చూడటమంటే చాలా దారుణమైన విషయమే. ఇండియాలో ఉండే సగటు ముస్లిం పౌరుడికి పాకిస్థాన్ లోని భారత వ్యతిరేక శక్తులకూ ఏమిటి సంబంధం?. నిజానికి ఏమీ ఉండదు. కానీ ప్రతీ సాధారణ ముస్లీముకి పాకిస్థాన్ లోని తీవ్రవాదులతో సంబంధం ఉంటుందనుకోవడం పూర్తిగా మూర్ఖత్వం, అజ్ఞానం.

 దాదాపు ఇదే సమయంలో యాష్ చోప్రా తీసిన వీర్ జారా అనే బాలీవుడ్ సినిమా వచ్చింది. ఈ సినిమా పాకిస్థానీయులు కూడా మనలాగా మనుషులే అని చూపించే ప్రయత్నం చేసినట్టనిపిస్తుంది. ఒక భారతీయ ఖైదీని విముక్తం చేయడానికోసం అక్కడి యంగ్ లాయర్ పడే తపన మనకు కనిపిస్తుంది. పాకిస్థాన్ అంటేనే బూచి అని చూపించిన ఖడ్గం సినిమాకూ ఒక పాకిస్థానీ ముస్లిం అమ్మాయికీ భారత హిందూ అబ్బాయికీ మధ్య ప్రేమకథను చూపించే వీర్ జారాకు సంబంధమే లేదు. మనుషులలో ఉండే మానవీయ కోణాన్ని తట్టిలేపే ఇటువంటి సినిమా ముందు చిన్నపిల్లల ఆటలాగా ఉండే ఖడ్గం సినిమా వెలవెల పోతుంది. ఈ సినిమా చివరిలో ఒక కవితను చదువుతాడు షారుఖ్ ఖాన్.
వారంటారు ఈ దేశం నాది కాదని
మరెందుకని ఈ దేశం నా దేశంలా అనిపిస్తుంది.
వారంటారు నేను వారిలాగా లేనని
మరెందుకు నాకు వారంతా నాలాగే కనిపిస్తున్నారు.
(అదే కవితలో ఆ యంగ్ లాయర్ గురించి చెబుతూ..)
ఆమె అంటుంది నేను తనకేమీ కాను అని
మరెందుకు నాకోసం తను ప్రపంచంతో పోరాడుతోంది
ఆమె అంటుంది నేను ఆమెలాగా లేనని
మరెందుకు ఆమె నాకు నాలాగే అనిపిస్తుంది...

ఇలా సాగే కవిత మనలో మానవత్వాన్ని రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక ఏకత్వాన్నీ చూపుతుంది. ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్ లో జోహారులు అందుకున్న ఈ సినిమా, జర్మన్ ఫ్రెంచి భాషల్లోకి కూడా అనువదించబడి అక్కడ కూడా ఘన విజయాల్ని సాధించిన ఈ సినిమా, బాలీవుడ్ ఒక మైలురాయి అని చెబుతారు. పాకిస్థాన్ లో కూడా ఘన విజయం సాధించిన ఈ సినిమా, పాకిస్థాన్ పట్ల అక్కడి ప్రజల పట్ల ఒక సానుకూల భావన ఏర్పడటానికి ఇటువంటి సినిమాలు దోహదం చేస్తాయి.

30/7/17

Thursday, 11 May 2017

ఆగని యుద్థం
-----------------------

అపుడా అమ్మాయి బతికి వుండి, తిరగబడగలిగి ఉండింటే అప్పటికప్పుడు ఏమి చేయగలిగేదో దానినే, తమ తలలు బద్దలు కొట్టుకునేలా వాద ప్రతివాదాలు చేసుకుని చివరికి న్యాయాధీశులు చేస్తున్నారు. బలాత్కారం ఆపై దారుణమైన హత్య...రెండు దారుణమైన విషయాలే. నిర్భయకు ముందు ఆ తరువాత కూడా ఎన్నో ఇటువంటి సంఘటనలు జరిగాయి. జరుగుతున్నాయి. కొన్ని కోర్టు కేసులు కూడా ఉండిండొచ్చు. కానీ వాటి తీర్పు రావచ్చు రాకపోవచ్చు. న్యాయం జరగాలంటే ఖర్చవుతుంది, అందరూ ఖర్చులు భరించగలిగిన వారై ఉండగలరని అనుకోలేం. సమయమూ తీసుకుంటుంది. అందరూ సమయంకోసం వేచి చూడగల సహనం కలిగి ఉంటారనీ అనుకోలేం. అందరి విషయంలోనూ దేశ పౌరులు అదే విధంగా బాధిత కుటుంబాలకు క్యాండిల్ ర్యాలీలవంటి వాటితో నైతిక మద్దతు తెలుపుతారనీ ఆశించలేం. అందరి విషయంలోనూ మీడియా అదే విధమైనటువంటి కవరేజీ ఇచ్చి ప్రజలను చైతన్య పరుస్తుందనీ అనుకోలేం. బాధిత కుటుంబాలు ఎన్నో...కానీ ఎందుకో కొందరికే న్యాయం అనబడేది అందటం. కొందరు బాధితులకే తక్కువ సమయంలోనే తీర్పులు వెలువడటం. ఇలా ఎందుకు? అనే డౌట్ వచ్చినా దేశద్రోహమే అనే నేపథ్యం ఉన్నపుడు, అసలు ఉరి అనే ఆటవిక సాంప్రదాయమే మనకొద్దు అంటే, నిజంగా అర్థం చేసుకోగలిగినవారు ఎందరు?.

తప్పుకు శిక్ష పడాల్సిందే అనే భావన మనుషుల ప్రాథమిక అవగాహన. జెనిసిస్ లోని తొమ్మిదవ అధ్యాయంలో శిక్షను వేస్తాననే దేవుడూ, గీతలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాననే దేవుడూ కూడా మనిషి సృష్టే. మనుషుల చేసిన దేవుల్లు కదా. దుష్టులను శిక్షించే పాటే అయితే, అసలీ పనికిమాలిన దేవుడు దుష్టులను సృష్టించుట యేల? దుష్టులను సృష్టించుటా, ఆపై చంపుటా తానే చేస్తున్నాడంటే బహుశా దేవుడు పనిలేనోడే అయుంటాడు. అటువంటి దేవుడిని సృష్టించిన మనిషీ పనిలేనోడే అయుంటాడు. అందుకేనేమో మత భావనలను రూపుమాపుకోలేని వారిమిగా మనం మన న్యాయ శాస్త్రాలనూ రాసుకున్నాం. నిర్భయ కేసులో నిందితులకు మరణ శిక్ష వేయడం సరైనది కాదని వాదించిన ఒక డిఫెన్సు లాయరు," ఔనూ అంత రాత్రి సమయంలో ఆ అమ్మాయిని వారి తల్లిదండ్రులు ఇంకో అబ్బాయితో ఎలా పంపుతారండీ...?" అని అడుగుతాడు. "స్వీట్లను బజారులో ఉంచితే కుక్కలు తినకుండా ఎందుకుంటాయ"ని ఉదాహరణనూ చెబుతాడు. అందుకే రేప్ జరిగింది తప్ప నిందితులు ఉత్తమోత్తములు అంటాడు. ఇందులో మతాలు కలిగించే భావనలున్నాయి. బహుశా డిఫెన్సు లాయరు ఉద్దేశమూ కూడా నిందుతులకు శిక్ష పడటమే కావచ్చు. అందుకే పసలేని వాదనలను నిందితుల తరపున చేసి ఉండవచ్చు. అతడి వాదనలకు మత భావనల కలరింగు ఇవ్వడం కూడా ప్రజలతో దూరం కాకుండా చేసే ప్రయత్నమే. తీవ్రతరమైన ఇటువంటి కేసులలో తీర్పు ముందే ఊహించబడుతుంది కాబట్టి, డిఫెన్సు లాయరైనా ప్రజల భావనలతో తమ భావనలూ ఏకమని చెప్పుకోక తప్పదు. అందుకేనేమో వుడ్రో విల్సన్ కూడా  "సమాజ ఆలోచనలూ అలవాట్లూ ఘనీభవించిగా ఏర్పడిన స్వరూపమే న్యాయం" అని నిర్వచించాడు.

ఇపుడు దుష్ట శిక్షణ అవసరమే అనుకుంటే, అసలు దుష్టులను తయారు చేయడమెందుకు వారిని శిక్షించడమెందుకు అనేది మౌలికమైన ప్రశ్న. దుష్టులను తయారు చేసేది కూడా సమాజమే. డిఫెరెన్సెస్ ని ఒప్పుకోని సమాజాన్ని తయారు చేసుకోవడమే దీనికి కారణం. డిఫెరెన్సు కేవలం భౌతికంగానే కాక, మానసికంగా కూడా. ఒక వ్యక్తికంటే ఇంకో వ్యక్తి వేరుగా ఉంటే, వేరే జండర్ ఉంటే, వేరే కులం ఉంటే, వేరే మతం ఉంటే, వేరే ప్రాంతం ఉంటే, వేరే వస్త్రధారణ కలిగి ఉంటే....చివరికి ఒక విషయం పై వేరే అభిప్రాయం కలిగి ఉంటే కూడా...ఏ మాత్రం భరించలేని వారిమై పోవడం ఇందుకు కారణం. ఒకడు ఇంకో వ్యక్తిని ప్రేమిస్తాడు, ఆమె కాదంటుంది. అతడి అభిప్రాయంతో విబేధిస్తుంది. యాసిడ్ దాడి చేస్తాడు వాడు. ఒక నమ్మకానికో లేదా ఇంకో వాస్తవానికో ఒకరు ఒక అభిప్రాయం కలిగి ఉంటే, అందరూ అదే అభిప్రాయాన్నే కలిగి ఉండాల్సిందే అనేటువంటి భావనలు, మత భావనలతో సరితూగగల భావనలు, పెచ్చుమీరడమే దీనికి కారణం. నిర్భయ కేసులో మరలా ఉరి శిక్ష అంశం బయటికొచ్చింది. ఎప్పటిలాగానే మానవ హక్కుల వారు ఇది కూడదు అంటారు. జీవిత కాల శిక్ష సరిపోతుంది కదా మరణ శిక్ష ఎందుకు అంటారు. ఇక వారిపై యుద్ధ ప్రకటనమే జరుగుతుంది. వారి అభిప్రాయాన్ని చెప్పుకోనీయని ఇటువంటి సమాజంలోనే రేపులూ, మర్డర్లూ జరుగుతుంటాయని మనం, ముఖ్యంగా ఇటువంటివారిని 'మేధావులు' అంటూ ఎద్దేవా చేసేవారు, గమనించాలి. అభిప్రాయాలకు విలువనివ్వగలిగిన సమాజంలో రేపులు జరుగవలసిన అవసరం ఏముంటుంది. ఇద్దరి ఒప్పుకోలు మీద ఆధారపడి మాత్రమే ఇద్దరు మనుషుల మధ్య లైంగిక సంఘటన జరగడం అనేది నిజంగా అద్భుతమైన విషయమే కదా. స్త్రీల మీద ఆధిపత్యం చెలాయించాలనుకోవడం, వారిముందు తమ బలాన్ని ప్రదర్శించాలనుకోవడమూ కూడా స్త్రీలకంటే పురుషులు అధికులు అనే భావననుండి వచ్చినవే. "మేము అధికులం" అనుకోవడంలోనే "మీ అభిప్రాయాన్ని ఒప్పుకోం" అనడమూ ఉంది. ఆధిపత్య భావనలు తొలగి, సమభావనలు పెరిగి, అందరి అభిప్రాయాలనూ గౌరవించుకోగలిగిన సమాజంలో, వాటికి విలువనివ్వగలిగిన సమాజంలో దుష్టుల పుట్టుక నిజంగా ఉంటుందా?.

సమాజంలో దుష్టత్వం ఉంటేనే ప్రభుత్వం ఉంటుంది. ఇది ఒక ఫాల్స్ స్టేట్మెంటుగా తీసుకోవాలి. ప్రభుత్వం ఉంటేనే దుష్టత్వం ఉంటుంది సరి ఐనది. ప్రభుత్వం ఉండగానే, పాలకులు పాలితులు అనే ఆధిపత్య నిమ్న వర్గాలు ఏర్పడిపోతాయి. వర్గాల మధ్య అంతరాలు ఏర్పడతాయి. ప్రభుత్వం ఉనికిలో ఉండాలంటే సమాజంలో దుష్టత్వం ఉండాలి. దుష్టత్వం లేకుంటే ప్రభుత్వాలకు పెద్దగా పనేం ఉండదు. పౌరులు రెండు రకాలుగా విడిపోతారు. రాజ్య శాసనాలను గౌరవించే పౌరులు, గౌరవించని పౌరులు. వారికి తగిన పనిని కలిగించని ప్రభుత్వాలపై గౌరవం తగ్గించుకున్న పౌరులు వీరంతా. గౌరవించని పౌరులను దుష్టులుగా ప్రభుత్వాలు భావించాలి. దుష్టత్వంలో తీవ్రతలను బట్టి శిక్షలు విధించబడతాయి. ఇపుడు ప్రభుత్వం వీరికందరికీ పని కలిపించటం కష్టం. కొందరు కడుపు నింపుకోవటం కోసం వేరే పనుల్లోకి వెల్లిపోతారు. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. అఫ్ఘనిస్తాన్ వంటి ఎడారి ప్రాంతంలో పౌరులకు పని కలిగించటం ప్రభుత్వాలకు కష్టం. డెబ్భై శాతం యువత పని లేని వారిగా ఒక సమాజంలో ఎందుకుండాలి. అక్కడి మత సంస్థలకు అందుకే బలం ఉంటుంది. మతానికి సంబంధించిన విద్య నేర్చుకోవడమూ, మత తీవ్రవాదాన్ని కౌగిలించుకోవడమూ అక్కడి యువతకు ఉపాధి వంటిది. మత సంస్థలు తమకు సంపన్న దేశాల నుండి అందే నిధుల ద్వారా యువతను మత విద్య వైపు తిప్పడమూ, వారికి ఆ విధంగా ఉపాధి కలిగించటమూ జరుగుతుంది. మత విద్య నేర్చుకుని ఉపాధి పొందుతున్న యువత వలన రాజ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు ఎపుడైన తీవ్రవాద మూకలుగా చెలరేగితే తప్ప. అందుకే రాజ్యం వాటిని చూసీ చూడనట్టు ఉంటుంది. అంటే పరోక్షంగా ప్రోత్సహిస్తూంది. ఇపుడు మత సంస్థలనే మూసివేస్తే లక్షల సంఖ్యలో యువతకు ప్రభుత్వం పని కల్పించాల్సి ఉంటుంది. మత శిక్షణ పొందని నిరుపేద యువత డ్రగ్స్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి పనుల ద్వారా ఉపాధి పొందుతారు. వీరి వలనా ప్రభుత్వాలకు పెద్ద నష్టం ఉండదనే చెప్పాలి.

ఒక దేశంలో నియుద్యోగ యువత మత తీవ్రవాదం వైపు పోయే కంటే హత్యలూ, మానభంగాలూ, డ్రగ్స్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్, ప్రాస్టిట్యూషన్ వంటి అరాచకత్వం వాటి వైపు పోవడాన్ని అమెరికా, ఇండియా వంటి ఆధునిక సెక్యులర్ దేశాలు పరోక్షంగానైనా ప్రోత్సహిస్తాయి. వీటికి సంబంధించిన సంఘటనలు జరిగినపుడు కంటి తుడుపు చర్యలతో వాటిని పరోక్షంగా ప్రోత్సహిస్తాయి. మత తీవ్రవాదం కంటే ఇవి తక్కువ తీవ్రత కలిగినవిగా గుర్తిస్తాయి. రైడ్ లు చేయడమూ, కేసులు పెట్టడమూ, తీర్పులు వెలువరించడమూ, జైలుకు పంపడమూ, ఇత్యాది ద్వారా న్యాయ పోలీసు శాఖలకు పని కల్పించడమూ. దేరీస్ నో అండర్ వరల్డ్ విథౌట్ యాన్ ఓవర్ వరల్డ్ అని ఓ పెద్దాయన మాట. నిజానికి డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టడం ప్రభుత్వానికి చేతనవును. కానీ చేయదు. ఆల్కాహాల్ ను పూర్తిగా బ్యాన్ చేయలేదు. ఆల్కాహాల్ వలన మానభంగాలు పెరుగుతుంటాయని తెలిసినా, వాటిని పూర్తిగా నిర్మూలించలేదు. టీవీ సీరియల్స్ లో తాగే సీన్స్లలో కాషన్ నోటీస్ వేయకపోవడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి ఊరుకుంటుంది. అండర్ వరల్డ్ కీ ఓవర్ వరల్డ్ కీ సంబంధాలు చాలా డైరెక్టుగానే ఉంటాయి. డీమోనెటైజేషన్ జరగగానే, ఇండ్ల స్థలాల రిజిసట్రేషన్స్ తగ్గి పోవడం జరుగుతుంది. అయినా ప్రభుత్వం చెడునంతా కడగటం కోసమే అని నమ్మ బలుకుతుంది. చెడును అపుడపుడూ అదిలిస్తూండటం ద్వారా ప్రభుత్వాలు తాము పని చేస్తున్నాయని నిరూపించుకుంటూంటాయి, మనుషులు చేసిన దేవుడు, తానే దుష్టులను పుట్టించి తానే సంహరించి ఆ విధంగా తన ఉనికిని చాటుకుంటున్నట్టు. అవినీతి పై యుద్ధం, అరాచకత్వం పై యుద్ధం వంటివి యుద్ధాన్ని నిరంతరం కొనసాగించటానికే తప్ప యుద్ధాన్ని అంతం చేయడానికి కాదు. యుద్ధం విషయంలో అబ్రహం లింకన్ మాటలను ఈ సందర్భంగా చెప్పుకోవాలి.There is  no honorable way to kill , no gentle  way to destroy, there is nothing good in war except its ending. అది ఏ యుద్ధమైనా అంతే.

8/5/17
Virinchi Virivinti
సినిమా( బాహుబలి )కళ, కళాత్మకత
 ----------------------------------------

ఈ మధ్య వస్తున్న సినిమాలను చూస్తున్నపుడు, రియాలిటీని సబ్వర్ట్ చేయడం ఆర్ట్ కి ఉన్న బలమూ అదేవిధంగా బలహీనత కూడా అనిపిస్తూంటుంది. అందుకేనేమో ప్లేటో తన 'రిపబ్లిక్' లో కవులకూ కళాకారులకూ స్థానమే లేదుపొమ్మన్నాడు. ఒక సినిమాలోని ప్రతీ దృశ్యమూ డైరెక్టర్ యొక్క ఊహా శక్తి ఫలితమని , సినిమా ప్రత్యక్షంగా దర్శకుడి ప్రతిభ మాత్రమే అని, సినిమాలోని మిగిలిన కళాకారులు కేవలం పరోక్ష సహాయకారులేననీ చెప్పేది 'థియరీ ఆఫ్ ఆటరిజం(Theory of Auterism)'. 1967లో రోలాండ్ బార్థెస్(Roland Barthes) రాసిన వ్యాసం డెత్ ఆఫ్ ఆథర్( death of Author) అందరికీ అర్థమవడం జరిగిన తరువాత, ఈ ఆటరిజం చాలా చర్చనీయాంశమయింది. పోస్ట్ మోడెర్న్(post modern) థాట్ ని ప్రోత్సహించిన ఈ వ్యాసం, సినిమా ను కళ లనూ కూడా ప్రభావితం చేసింది. ఆటరిజం చెప్పినట్టు సినిమాను కేవలం దర్శకుడి మేథావిత్వపు ప్రొడక్ట్ గా మాత్రమే కాక, దానిని ఆ కాలపు పరిస్థితులకూ, సామాజిక సందర్భానికీ అనుగుణంగా వచ్చిన ప్రొడక్ట్ గా చూడాలనే అంశం తెరమీదకి వచ్చింది. పలానా సినిమాను దర్శకుడు ఆ విధంగా తీయడానికి ఆ కాలపు పరిస్థితులేమిటన్నది చర్చగా మారింది.

ప్రస్థుతం మన సమాజం హేతుబద్ధత వైపు కాకుండా, మనం ఎలా 'ఫీల్ (Feel)' అవుతామనే అంశం మీదే ఆధారపడి నిర్మితమై ఉంది. ఒక విషయం పట్ల నేను ఎలా ఫీలవుతాను, ఇంకొకరు ఎలా ఫీలవుతారు, మెజారిటీ సమాజ సభ్యులు ఎలా ఫీలవుతారు అనే అంశం ఆధారంగా నిర్మించబడుతోంది. మనం ఒక విషయం పట్ల 'ఎలా ఆలోచిస్తాం' అనేదానికంటే, 'ఎలా ఫీలవుతాం' అనేది ముఖ్యమయింది. ఆలోచనను అనుభూతి సబ్జుగేట్(subjugate) చేసేసింది. ఇపుడు మనకు ఆలోచనకంటే అనుభూతి, ఫీల్ ముఖ్యమైపోయింది. ఆలోచన హేతుబద్ధత వైపు పయనిస్తే అనుభూతి నమ్మకాల వైపు పయనింపజేస్తుంది. అనుభూతి పరమైన సమాజాన్ని కండీషనింగ్(conditioning) చేయడం చాలా సులభం. అందుకే మనకెన్నో అడ్వర్టైజ్మెంట్లు. కాపిటలిస్ట్ సొసైటీ, కాపిటలిస్ట్ వ్యాపారం, కాపిటలిస్ట్ రాజకీయాలూ' అనుభూతి'ని అందలం ఎక్కిస్తాయి. మనుషులందరూ అనుభూతి చెందుతారు. ఆ అనుభూతి, ఫీల్ నే అసలు సత్యమనుకోవడమూ ఉంటుంది. ఒక గాడిదను కట్టేసి గుర్రమని అనుభూతి చెందిన సమాజం, దానిని గుర్రమనే నమ్ముతుంది. వ్యాపారం చేసి గాడిదను అమ్మాలనుకునే వాడికి మనం ఆలోచనతో అది గాడిదలా గుర్తించడం కంటే అనుభూతితో గుర్రమని భావించేలా చేయగలగడమే కదా కావాలి. గాడిదను గుర్రమని నమ్మించడానికి దానిని అలా అనుభూతి చెందగల సమాజం కావాలి. అందం అంటేనే సత్యమనీ, సత్యమంటేనే అందమనీ, రిలీజియస్ గా నమ్మిన గ్రీకులూ ఒకప్పుడుండేవారు.( కీట్సు కవీ 'ఓడ్ ఆన్ ఏ గ్రీషియన్ అర్న్( Ode on a Grecian Urn) ' లో ఇదే పాడాడు. 'అందమే ఆనందమ'నీ మన తెలుగు కవులూ పాడారు). మరలా మనం ఇపుడు సరిగ్గా అటువంటి సమాజంలో ఉన్నాం. ఇటువంటి సమాజంలో మనుషులనూ కుక్కలనూ దాదాపు ఒకే విధంగా ట్రైన్ చేయవచ్చు. 'కుక్క వంటి విశ్వాసం' అనేది అనుభూతి వలన వచ్చేదే తప్ప ఆలోచనతో వచ్చేదేమీ కాదు కాబట్టి.

ఒక సినిమా చూసిన తరువాత 'ఏమని ఆలోచించావు' అని ఎవరూ అడగరు. 'ఎలా ఫీలయ్యావు' అనేదే అడుగుతారు. ఇపుడు ఆ ఫీలింగుకే పట్టంగట్టడం దర్శక మేధావులు చేయగలిగిన వ్యాపారం. శంకరా భరణం సినిమాలోలాగా "శుద్ధ హిందోళంలోకి ఆ రిషభం ఎలా వచ్చింది?" అని శంకర శాస్త్రి అడిగినట్టు, "పోస్ట్ మోడెర్న్ థాట్ ప్రాసెస్ లోకి కాల్పనికత ఎలా వచ్చి చేరింద"ని మనం ప్రశ్నించుకుంటే, బాహుబలి సినిమా సక్సెస్ కావడంలో మనం అందలమెక్కించుకున్న 'ఫీలింగ్' పాత్ర అర్థమౌతుంది. గంటకొట్టగానే జఠర రసం కార్చిన పావ్లోవ్ కండీషన్డ్ కుక్కకీ, సినిమా తీయగానే మనం కార్చే అనుభూతి రసానికీ దగ్గరి సంబంధం ఉంది. ఇది అర్థం చేసుకుంటే వీరాభిమానం పేరుతో కళను కళగా చూడాలనే ఊహతో, సినిమాను సినిమాలాగా చూడాలనే మిషతో చేసే సకల వాదాలూ అర్థమౌతాయి. సినిమా కళే అసలైన కళ అనుకునే వారికీ, సాంఘిక ప్రయోజనం లేనిదే కళ కాదనే వారికీ కాంట్  (Kant) చెప్పిన  'నిజమైన కళ' నిర్వచనం గానీ, దాని సకలాతీత(transcendental) స్థితిగానీ,  దాని ప్రయోజన రహిత ప్రయోజనాత్మకత(purposiveless purposiveness)  గానీ, అర్థం కావు. అంతేకాకుండా నిజ జీవిత ఒత్తిడితో నలిగిపోయిన కాపిటలిస్ట్ సొసైటీలో ఆలోచనకు బదులుగా 'ఫీలింగు' నిర్వహించే తాత్కాలిక ఉపశమన పాత్ర విస్మరించదగినదసలే కాదు కూడా. అందుకే దర్శక నిర్మాతల దృష్టి రియాలిటీని తమ కళాసృష్టి లో సబ్వర్ట్ (subvert) చేయడంలో కనిపిస్తుంది. పైన చెప్పినట్టు ఇది వ్యాపారాత్మకంగా వారి బలమూ, సామాజికపరంగా మన బలహీనతా కూడా.

ఓవర్ వెల్మింగ్ టెక్నాలజీ( Overwhelming Technology) మనలను వర్చువల్ రియాలిటీకి(Virtual reality) పరిచయం చేయడమే కాకుండా భౌతిక శాస్త్రాన్ని(physics) బలహీన పరిచింది కూడా. సిములేటెడ్ ప్రపంచంలో మనం భౌతికతను మరిచి పోయి, కేవలం టెక్నాలజీ అందించిన వర్చువల్ మెటీరియలిజాన్ని నమ్ముతున్నాం. ఒక కుర్చీని తయారు చేసే భౌతిక విద్యను ఒక కళగా అభ్యసించిన విద్యార్థి ఉన్నాడనుకుందాం.  'కూర్చోవడం' కుర్చీ సాంఘిక ప్రయోజనమనుకుంటే కుర్చీని కేవలం కూర్చోవడానికి అనువుగా చెక్కితే సరిపోతుంది కానీ కళాకారుడు దానికి నగిషీలు చెక్కి రంగులు వేసి అందంగా మలిచాడనుకుందాం. ఇలా చేయడం వలన కుర్చీ సాంఘిక ప్రయోజనం అయిన 'కూర్చోవడం' ఏమీ మారదు. కూర్చోవడం కాస్తా పడుకోవడంగా ఠకీమని ఐపోదు. అంటే కళకూ కళాత్మకతకూ సాంఘిక ప్రయోజనానికి మించిన ప్రయోజనం ఉంది. కానీ ఇపుడు కుర్చీని ఒకడు కంప్యూటర్లో గ్రాఫిక్స్ సహాయంతో సృష్టించాడనుకుందాం. దీనిని  'కళ' అనుకుంటే దాని సాంఘిక ప్రయోజనమైన కూర్చోవటం అన్నది ఇపుడేం కావాలి?. ఒకవేళ దీనిని 'కళ కాదు' అనుకుంటే మరి అసలు కళ అనేదెక్కడుందనే ప్రశ్న వస్తుంది. "దో ఆంఖే బారాహ్ హాత్" సినిమాలో బొమ్మ ఎద్దుతో చేసిన బుల్ ఫైటు చాలా ఎబ్బెట్టుగా వచ్చిందని, నిజమైన ఎద్దుతో తల పడతానని , రీ షూట్ చేయడానికి సిద్ధమయ్యాడు దర్శకుడు కథానాయకుడూ ఐన వి. శాంతారాం. కళ లోని స్వచ్ఛతను ప్రిసర్వ్ చేయడం కోసం అతడు నిజమైన ఆ బుల్ ఫైట్ లో కంటి చూపునూ కోల్పోవలసి వచ్చింది. ఇపుడు మనం డిజిటల్ గ్రాఫిక్స్ లో చూపించినదే కళాత్మకత అంటూన్నామంటే పిల్లొచ్చి గుడ్డును వెక్కిరించినట్టుగా భౌతిక శాస్త్రాన్ని టెక్నాలజీ ధిక్కరించినట్టుగా ఔతుంది. బ్లూమ్యాట్ లో, గ్రాఫిక్స్ అండతో, 'లేని దానిని' సిములేట్ చేసే డిసెప్టివ్ వర్చువల్ ప్రపంచంలో కళ దాని స్వంత పర్పస్ తో బతుకుతోందా?. సినిమా సినిమాలాగా బతుకుతోందా వ్యాపారంలాగా బతుకుతోందా అనేది తరచి చూచినపుడు దర్శకుడి కళా ప్రతిభ అతడి వర్చువల్ గ్రాఫికల్ డిపెండెన్సీ (Virtual graphical dependency) వలన తేలిపోతుందనేది గ్రహించాలి. గ్రాఫిక్స్ కోసం కథ రాసుకునే పరిస్థితుల వలన "థియరీ ఆఫ్ ఆటరిజం" ఇప్పటి వర్చువల్ డిపెండెన్సీ యుగంలో మరలా చర్చనీయాంశం కాబోతోంది.

10/5/17
విరించి విరివింటి

Friday, 5 May 2017

విరించి ll   పిల్లల పాట  ll
____________________________

టీచరులారా ప్రపంచం ముసలిగయ్యింది
కొంత బాల్యం కావాలిపుడు
చదువులూ ఉద్యోగాలూ ఉద్యమాలూ వదిలి
కేరింతలు కొట్టే ఆటలు కావాలిపుడు

ఒప్పుకుదాం టీచరు మహాశయా..!
నీవొక డాక్టరునో ఇంజనీరునో ఇంకొకరినో తయారు చేయగలవని.
ఒక పరిపూర్ణ బాల్యాన్ని తయారు చేయగలవా చెప్పు?

ఎండాకాలం సెలవుల్లో కూడా హోం వర్క్ రాసిచ్చే మీకు
భవిష్యత్తంటే ఒక రిసెషన్ కావచ్చు, యుద్ధమూ కావచ్చు, మరణమూ కావచ్చు
పొద్దున నిద్రలేవాలంటే కునుకుపాట్లు పడే బుజ్జిగాడికి
మరో రోజంటే ఎంత విసుగో ఎపుడైనా చూశారా?.

ఎండాకాలం మీకు చెమటా, చిరాకూ, అలసటా కావచ్చు.
కానీ ఎండాకాలపు సూరీడు పిల్లల చేతిలోని టార్చిలైటు
కావాలంటే చూడండి
మిట్ట మధ్యాహ్నం ఆటలో వాళ్ళు ప్రపంచాల్ని వెతుకుతున్నారు

దూరపు నక్షత్రాలను చూసినపుడు
మీ మనసులెంతగా తెరుస్తారో అంత చిన్న పిల్లలౌతారు
దగ్గరి నక్షత్రాలైన పిల్లలను ఎంత చిన్న పిల్లల్లా చూస్తారో
అంతగా మనసు పూవులై విచ్చుకుంటారు

అందుకే ఇపుడు పిల్లలతో కలిసి
పిల్లల్లాగే గట్టిగా అరుస్తూ ఈ మాటల్ని పాడుకుందాం.
నల్లబల్లలూ, చాక్ పీసులూ, స్కేలు బెత్తాలూ, హోంవర్క్ లూ
ఈ ఎండకు కాలి బూడిదైపోనీ..
ఆటలాడే పిల్లల కాళ్ళ కింద పడి నలిగిపోనీ..

5/5/17

Monday, 1 May 2017

సాములోరి ఆధ్యాత్మిక ఉచిత సలహాల మీద....

"ఆకలి, అజ్ఞానంతో అలమటిస్తున్న కోట్లాది ప్రజలు ఒకవైపుండగా, వారి శ్రమను ఆధారం చేసుకుని విద్యావంతులైన ప్రతీవాడూ నేరగాడే, ఇటువంటి ఉన్నత వర్గ విద్యావంతులందరూ పది వేల సంవత్సరాలనాటి మమ్మీలే"..అన్నాడు వివేకానందుడు. అటువంటి మమ్మీ ఇపుడు 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' పేరుతో కలియతిరుగుతూ,  రైతుల ఆత్మ హత్యలకు ఆధ్యాత్మిక లోపం కూడా ఒక కారణం అంటోందిపుడు. ప్రసంగాలు చేస్తూ కడుపులు నింపుకుంటున్న ఈ బుద్ధావతారాలకు తిన్నది సరిపోలేదేమో ఇపుడు రైతుల మీద పడి దోచుకునే పనిలో పడ్డారు. "ఆకలితో ఉన్న వాడికి గీతా బోధనలు కూడదన్నాడు" వివేకానందుడు. శ్రీ రవి శంకర్ ఇపుడు ఏకంగా యోగా ధ్యానాదులు నేర్పిస్తానంటాడు. సమస్యల పట్ల అవగాహనా లేమితనంతో ఈ స్వాములంగారు వాక్రుచ్చే సూచనలు వారి సామాజిక స్పృహలోని లోతులేనితనాన్ని తెలపటమే కాకుండా, వారిని నవ్వులపాలు కూడా చేస్తూ ఉంటుంది.  అసలు భారతదేశంలో యోగా అభివృద్ధి చెందడానికి ఇక్కడి పేదరికమే కారణం అనేది పాశ్చాత్యుల అవగాహన. తినడానికి తిండిలేని అర్భకులు యోగా పేరుతో కఠిన నియమాలు పాటిస్తూ, రోజుకు ఒక పూటనే తింటూ, పస్తులను 'పవిత్ర ఉపవాసాలు'గా మలుచుకునేవారనీ, ఆ విధంగా ఆకలి బాధలను అధిగమించే వారు కాబట్టే ఎండమిక్ గా ఉన్న క్షుద్భాధ ఈ దేశంలో యోగా వ్యాప్తి చెందటానికి ఉపయోగ పడిందన్నది వారి అవగాహన. బహుశా అందుకేనేమో "ఒక పూట తినే వాడు యోగి, రెండు పూటలు తినేవాడు భోగి, మూడు పూటలు తినేవాడు రోగి" వంటి నానుడులు పుట్టి వుంటాయి. ఈ రోజుటికీ ప్రతీ రోజు రాత్రికి పస్తులు పడుకుంటున్న భారతీయుల సంఖ్య ఇరవై కోట్లు. వీరినందరినీ తన శిష్యులుగా మలుచుకుంటే..వీరందరికీ యోగా నేర్పిస్తే..అనే క్షుద్ర ఆలోచన వచ్చిన శ్రీ రవి శంకర్ నిజంగా ధన్య జీవనే చెప్పాలి. బతికుండగా మమ్మీ కావడం బహు అరుదైన విషయం కాబట్టి.

గమనిస్తే యోగా మెడిటేషన్ వంటి సంప్రదాయాలు ప్రాక్ పశ్చిమ దేశాలలోని ఆశ్రమాలనుండి వచ్చినట్టుగా ఉంటుంది. మనదేశంలో ఎన్నో ఆశ్రమాలుండేవి, అందులో వందల సంఖ్యల్లో జనులూ ఉండేవారు. (ముఖ్యంగా మన దేశంలో బౌద్ధం ప్రబలిన తరువాత బౌద్ధారామాలు, కాషాయ వస్త్ర ధారణలూ పెరిగిపోయాయి. ప్రతీ ఒక్కరూ సన్యాసం తీసుకోవడం ఆ రోజుల్లో ఒక కల్ట్ ఫ్యాషన్ గా మారేసరికి వేలలో ఆశ్రమాలూ మొదలయాయి. నేటికీ పాశ్చాత్యులు యోగా ధ్యానాదులు టిబెటియన్ బౌద్ధానికి సంబంధించినవే అనుకుంటారు తప్ప భారత హిందువులకు సంబంధించినది అనుకోరు. ఇపుడు ఏలినవారు యోగా అనగానే టిబెట్ కాకుండా ఇండియా గుర్తుకు వచ్చేలా ప్రయత్నాలూ ముమ్మరం చేశారు.) ప్రతీ ఒక్కరికీ ఆకలి తప్పని పరిస్థితి అనుకుంటే ఇంత మందికి ఆహారం పెట్టగలగటం  ఆశ్రమ నిర్వాహకులకు పెద్ద పరీక్షే. ఆశ్రమ పెద్దయినటువంటి గురువుగారికి చాలా ఖర్చుతో కూడుకున్న విషయమే. అరకొర సౌకర్యాలూ, ఈతిబాధలూ ఎలాగూ ఉండేవి. ఇంత మందిలో కొంత మంది ముఖ్యంగా పిల్లలు మాత్రమే తిని మిగితా వారంతా ఏదో ఒక వ్యాపకంలో పడి ఆకలిని మరచి పోవాలంటే ఏమి చేస్తే బాగుంటుందనేది ఆశ్రమ నిర్వాహకుల ప్రధాన సమస్య. ఇంకా పుస్తకాలూ, ఫేస్బుక్ లూ, ఈడియట్ బాక్సులూ లేని కాలంలో, ఇంత మందిని ఏదో ఒక ఆకలి కానివ్వని వ్యాపకంలో పెట్టడం తప్పనిసరైంది. పని చేయించుకుని తగిన ఆహారం ఇవ్వక పోతే ఆశ్రమ వాసులు గోల చేస్తారు. బయటి ఏ శారీరక పనైనా ఆకలిని పెంచక తప్పదు. అందుకే ఓ మూలకు ముక్కు మూసుకుని మాట్లాడకుండా, అన్నం పెట్టడం లేదేంటని గోల చేయకుండా ఉంచాలంటే ఏం చెయాలి అని ఆలోచించినపుడు ప్రాణాయామం, ధ్యానం వంటి కూర్చుని ఆపసోపాలు పడే టెక్నిక్ లు కనుగోబడ్డాయి. యోగి అనిపించుకోవాలంటే వీలయినంత తక్కువ తినాలి. బేసిక్ మెటబాలిక్ రేటు తగ్గాలంటే శ్వాసను వీలయినంత మెల్లగా పీల్చి వదులుతుండాలి. భగవంతుడి మీదనో శ్వాస మీదనో ధ్యాసను మరలించాలి. ఎంత ఎక్కువ సేపు ధ్యానాదులు చేస్తే అంతెక్కువ శక్తి వస్తుందనీ నమ్మించాలి. ఈ విధంగా ఆశ్రమ నిర్వాహకులు ఖర్చులు తగ్గించుకుని సమర్థవంతంగా ఆశ్రమాలు,నడపగలిగేసరికీ రోజు రోజుకీ ఆశ్రమ వాసులు పెరిగిపోయేవారు. వారి తాకిడిని తగ్గించడానికి ఆశ్రమాల్లో,యోగా మెడిటేషన్ చుట్టూ కఠినాతి కఠినమైన నియమాలూ ఏర్పడటం మొదలైంది. బ్రహ్మచర్యాది యమనియమాదులూ ఇత్యాదివి. లావు మనుషులు అతిగా తినకుండా ఉండాలంటే వారిని ఆశ్రమం లో నుండి బయటకి ఉరికించేలా చేయాలంటే అష్ట వంకరలుగా తిరిగి, తలకిందులైపోయే ఆసనాలు వేయించాలి. బీదరికంతో కునారిల్లే ఆశ్రమాలలో  పరిస్థితులు మరోలా ఉండెవి. ఆశ్రమ వాసులు ప్రాణాయామంతో హైపర్ వెంటిలేట్ చేయడం వలన, పూరక రేచక కుంభకాల్లో కుంభకానికి అతి ప్రాధాన్యం ఇవ్వడం వలనా రక్తంలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరిగి ఒకరకమైన ఉన్మత్త స్థితికి జారిపోయేవారు. రక్తంలో ఒకటి నుండి ఎనిమిది శాతం వరకూ చేరిన కార్బన్ డై ఆక్సైడ్ వివిధ రకాల ఉన్మత్తాలకు గురిచేసేది. ఎనిమిది శాతం దాటిన వారిలో మెదడు పూర్తిగా స్పృహ కోల్పోయే పరిస్థితి ఉండేది. అదే అలౌకికానందం అనుకున్నారు. కొంత సమయం గడిచిన తరువాత కార్బన్ డై ఆక్సైడ్ లెవెల్స్ సాధారణ స్థితికి వచ్చేశాక తిరిగి మామూలు స్థితికి చేరుకునే వారు. (బహుశా ఇటువంటి చెడు ప్రభావాలు గమనించేమో తరువాతి యోగా స్కూల్సు కుంభకాన్ని అవసరం లేదన్నాయి, రేచకానికి అధిక ప్రాధాన్యత కలిగించాయి. దీనివలన కూడా ప్రమాదం లేకపోలేదు, అతిగా కార్బన్ డై ఆక్సైడ్ వాషవుట్ అవడం శ్వాస ప్రక్రియనే అకస్మాత్తుగా ఆపేయనూ గలదు. కానీ సహజంగానే ఎవ్వరైనాగానీ, రేచక ప్రక్రియ ఎక్కవ సేపు కొనసాగించలేరు గనుక ఒక విధంగా అంత ప్రమాద భరితం కాదనే చెప్పాలి). ధ్యానంలో కూర్చుని ఊపిరి బిగబడితే మొదట వచ్చే నిద్రకు కారణం తక్కువ మోతాదులో కార్బన్ డై ఆక్సైడ్ రక్తంలో చేరడం. ఈ కునుకుతీత అసలు నిద్రలోని ఆర్.ఈ.ఎమ్. స్టేజి నిద్రతో సరితూగుతుంది కాబట్టి ఒక రకమైన స్వప్నావస్థను కలిగిస్తుంది. ఆర్. ఈ. ఎమ్ నిద్రలోనే మనకు స్వప్నాలు వస్తాయి. వీటిని సాధకులు మెడిటేషన్ వలన కలిగిన దివ్యానుభూతులని సంబరపడిపోవడం జరుగుతూ  ఉంటుంది. మెడిటేషన్ కి ముందే దైవ సంబంధ విషయాలపై ట్యూన్ అయి వుంటారు కాబట్టి అది ప్రీ హిప్నోటిక్ స్టేజ్ గా పని చేసి, ఈ స్వప్నావస్థలో దైవ సంబంధమైన విషయాలు కనిపించేస్తూ ఉంటాయి. ఇక సాధకులు మెడిటేషన్ లో తమకు దైవ దర్శనం కలిగిందనీ, దైవ సందేశం వినిపించిందనీ ఆనందపడిపోవటమూ చూస్తూ ఉంటాం. ఇటువంటివన్నీ ఆ ఆశ్రమం లోని గురువర్యుల చలవగా ఆశీర్వాద ఫలంగా తపశ్శక్తిగా కీర్తించ బడుతూ  ఉంటుంది. అది ఆ ఆశ్రమంలో తక్కువ ఖర్చుతో జీవితం వెళ్ళబుచ్చటానికి అవసరమైన భూమికను కలగజేస్తుంటుంది. ఈ విధంగా ఆశ్రమ మేనేజ్మెంటు వారు ఖర్చులు తగ్గించుకోవడానికి కనిపెట్టిన కొత్త రూల్సుతో ఆశ్రమాలు చక్కగా నడిచేవని చెప్పాలి.

ఇపుడు శ్రీ రవి శంకర్ ఆధ్యాత్మిక గురువవుతాడా లేక యోగా గురువవుతాడా చెప్పడం కష్టమేమీకాదు. ఆయన ఆధ్యాత్మికనంతా యోగా ధ్యానాదులకే అపాదించేస్తాడు. ఆయనే కాదు ఆధ్యాత్మికత అంటే యోగా,యోగా అంటే ఆధ్యాత్మికత అనేది దాదాపు సో కాల్డ్ గురువర్యుల చింతన ప్రస్తుతానికి. అంతే కాకుండా ఒకప్పటిలా ఆశ్రమ వాసుల ఆకలికి ప్రత్యామనాయంగా కనుగొనబడిన యోగా, ఇపుడు ఆశ్రమ నిర్వాహకుల ధనాకలికి అనుగుణంగా వాడుకోబడుతుంది. యోగా ధ్యానాదులతో ప్రయోజనాలు లేవా అంటే ఉన్నాయి. శరీరాన్ని పలు విధాలుగా వంచగల, మౌనంగా కాసేపు ఆలోచించగల ఏ విషయమైనా యోగా ధ్యానంలవలె మనిషికి మంచే చేస్తుంది. అనవసర ఆలోచనలతో స్ట్రెస్ తో సతమతమయ్యే సగటు మానవునికి యమాది కఠిన నియమాలు కొంత వరకు ఉపశమనాన్ని కలిగించగలవు. లేటెస్ట్ గా యమాది నియమాలు కుదరవు కాబట్టి, పది ఆసనాలు, ఐదు రకాల ప్రాణాయామాలు, కొంత సేపు ధ్యానమూ వంటి ప్యాకేజీలూ ముందుకొచ్చేశాయి. అయితే జీవితంలోని అసలు సమస్యలు వదిలేసి ఈ యోగాది కార్యక్రమాలలోకి పలాయనం చెంది జీవించే వారూ లేకపోలేదు. ప్రతీ సమస్యకూ యోగాలో దివ్యమైన పరిష్కారం దొరుకుతుందని చెప్పేవారూ పెరిగిపోయారు. ఎయిడ్స్ కాన్సరు వంటి భయానక జబ్బులకూ ఈ జబ్బును పాకించారు. అంతే కాకుండా రజినీష్, మహేశ్ యోగీ, దీపక్ మహతా, యోగానంద వంటి వారి పుణ్యమాని "న్యూ ఏజ్ రిలీజియస్ కల్చర్" పాశ్చాత్య దేశాల్లో వేళ్ళూనుకుంటుండటంతో, రవిశంకర్ వంటి యోగా గురువులకూ అక్కడ గిరాకీ పెరిగింది. ఏ యోగా గురువు దెగ్గర చూసినా ముందు వరసల్లో వందల సంఖ్యలో ఫారీనర్స్ దర్శనమిస్తూంటారు. "ఆయనంటే ఏమనుకున్నావు..ఎంత మంది ఫారినర్స్ ఆయన దగ్గరికి వస్తుంటారు తెలుసా, ఏం వాళ్ళంతా పిచ్చోళ్ళా..?" అని పరమ భక్తులు మనమెపుడయినా ఆయన్ని శంకిస్తే వాపోతూంటారు. ఫారినర్స్ ముందు వరసలో ఉన్నారంటే ఆ గురువు పరమ ఉత్కృష్టమైన గురువనే నికృష్ట భావనలూ అధికమయ్యాయి. ఈ మెడిటేషన్ కునుకులల్లో వచ్చే పిచ్చి కలలను గొప్ప దివ్యానుభూతులని నమ్మేస్తూ, అవి కనిపించటం వెనుక ఉన్న అంతరార్థమేమిటని పిచ్చి భక్తులు అడుగుతుండగా, ఆకుకు అతకక పోకకు పొసగకా గురువర్యులం గారు సమాధానాలూ ఇస్తుంటారు. అదంతా భగవంతుడి కృపకంటే ఆ గురువర్యుని కృపే అనుకోవడమూ కద్దు. వారి వస్త్రాల మీద, ఇండ్లల్లో భగవంతుడి ఫోటోలకంటే ఈ గురువర్యుల ఫోటోలే ఎక్కువగా ఉంటాయనంలో సందేహమూ లేదు.

శ్రీ రవి శంకర్ వంటి యోగా గురువులు ప్రభుత్వ వేదికల మీద కనబడటంలో ఏలుతున్న వారి పాత్ర కంటే గత కాలపు మౌలిక రాజకీయ శక్తుల ఫెయిల్యూర్ ని సూచిస్తుంది. మొదటి సహస్రాబ్దిలో రోమ్ లో రాజకీయ శక్తులు బలహీన పడి విచ్ఛిన్నం చెందటం వలననే రోమన్ కాథలిక్ మత శక్తులు బలం పుంజుకున్నాయనేది నిష్ఠుర సత్యం. క్రూసేడులూ ఇటువంటి మత, రాజకీయ శక్తుల పరస్పర బలాల బేరీజుల్లోనే జరిగిపోయాయి. ఇపుడు శ్రీ రవి శంకర్ వంటి వారి వేదికా వైభవాలకు కుటుంబ రాజకీయ వ్యవస్థల వైఫల్యమే ప్రధాన కారణమనీ చెప్పవచ్చు. రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన విషయంలో ఇపుడు శ్రీ రవిశంకర్ అసంబద్ధ సూచనలను కేవలం ఒక రాజకీయ వర్గపు బలాఢ్యతగా మాత్రమే పరిగణ చేసి లెక్కించడం, మరొక రాజకీయ వర్గపు బలహీనతను చూడకపోవడమే అవుతుంది. రైతు ఆత్మహత్యల వంటి సీరియస్ సమస్యకు ఆధ్యాత్మికం వంటి పైపై పరిష్కారాలు చెప్పడం  బహుశా మన రాజకీయాల  "ఆల్ ఈజ్ వెల్" ధోరణిని చూపిస్తుంది. అంతా బాగుంది గానీ అల్లుని నోట్లో శని ఉంది కాబట్టే ఇలా జరిగింది కనుక శని గ్రహ శాంతి చేస్తే సరిపోతుందన్నట్టు, సమస్య మూలాలను వదిలి పూజా పునస్కారాలు చేసుకుంటే ఆత్మహత్యలు తగ్గుతాయని చెప్పడం చాలా దారుణమైన విషయం. ఒక వేళ ఈ స్వాములం వారు చెప్పినట్లు ఈ పొర్లు దండాలు ఆత్మహత్యలను నిజంగా ఆపేసేవే అనుకున్నా, అది కేవలం పాలకులకు వారి నిష్క్రియా పరత్వాన్ని తేలికచేసి, మొత్తానికే తప్పుదారి పట్టించి సమస్య తీవ్రతను ఇంకా పెంచేదిగా మాత్రమే మారుతుంది తప్ప మరోటి కాదు. నిజంగానే యోగాది కార్యక్రమాలకు మనిషిలో మార్పు తీసుకు రాగల శక్తే ఉంటే, మైకుల ముందు కోట్ల సంఖ్యలో ఉన్న రైతులకు ఉచిత సలహాలు ఇచ్చే బదులు వందల సంఖ్యలో ఉన్న రాజకీయ దురంధరులకు సలహాలిచ్చి రైతు సమస్యలపట్ల చిత్తశుద్ధి కలిగుండేలా వారి బుద్ధులను మార్చమని శ్రీ రవి శంకర్ సాములోరికి మా ప్రార్థన.

విరించి విరివింటి
1/5/17