Sunday, 20 April 2025

Social media teaching IR

 Switzerland lo 9000 పిల్లలపై స్టడీ జరిగింది. Social media use గురించి.



ఒక గ్రూపు పిల్లలకు సోషల్ మీడియాతో లాభాలు గురించి చెప్పి అది self expressionకి ఎలా ఉపయోగపడుతుందో నేర్పించారు. ఈ గ్రూపు పిల్లలు సోషల్ మీడియాలో బ్లాగుల్లో రాయడం మొదలెట్టారు. Ideas ని express చేయడం మొదలెట్టారు. కానీ  ఇతరుల పట్ల 

Disrespectful గా ఉండటం, bullying చేయడం వంటివి గమనించారు.


 

ఇంకొక గ్రూపు పిల్లలకు సోషల్ మీడియా చాలా ప్రమాదకరమైనది అని నేర్పించారు. వీళ్ళు సోషల్ మీడియా లో తక్కువగా రాశారు. కానీ ఇతరుల పట్ల respectful ధోరణి ప్రదర్శించారు.



సోషల్ మీడియా వాడే ఎంతో మంది adults లో కూడా మనం ఇటువంటి ప్రవర్తనలే గమనించవచ్చు.


Social media లో యాక్టివేట్ గా ఉంటూ రోజూ వివిధ అంశాలపై పోస్టులు రాసేవాళ్ళు ఉంటారు– అంటే వీళ్ళలో civic online engagement ఎక్కువ. అలాగే disrespect & bullying కూడా ఎక్కువే!


ఎపుడో గానీ సోషల్ మీడియా లో రాస్తూ civic engagementతక్కువగా ఉండేవాళ్ళు ఉంటారు– వారు ఇతరుల పట్ల వారి అభిప్రాయాల పట్ల గౌరవంగా ఉండటం కనిపిస్తుంది.



ఇది స్పష్టంగా ఏం చెబుతుంది friends. – మ‌నం డిజిటల్ ఎడ్యుకేషన్ లో ఎంత వెనకపడ్డామనే విషయం చెబుతుంది. 


Hi 

I'm Sruthi

I'm here to help you understand social media and online behaviour and improve digital literacy.


Keep following Essence Group 

Thank you

Friday, 11 April 2025

Love vs infatuation. IR

 Hi friends 


Welcome back to essence


ఒకరు పట్టించుకోకున్నా నీవు అతడు లేదా ఆమె గురించే ఆలోచిస్తూ ఉండిపోతున్నావా?


మీ మధ్యన ఏ మాటలూ జరుగుకున్నా జరిగినట్టు నీలో నీవే మాట్లాడుకుంటున్నావా?  


వారి అటెన్షన్ కోసం ప్రయత్నిస్తూ నిన్ను నీవు neglect చేసుకుంటున్నావా?


వారు చూసి నవ్వారని ఆనందపడి పోతన్నావా? అసలే రెస్పాన్సూ ఈయలేదని బాధపడిపోతూ ఏడుస్తున్నావా?


వారు లేకపోతే నీకు జీవితమే లేదు అనిపిస్తుందా...వారితోనే నీ జీవితం సంపూర్ణ మౌతుంది అనిపిస్తుందా...?


ఇదంతా ప్రేమ అనుకుంటున్నావా ??

కాదు. ఇది ప్రేమ కాదు.

ఇది infatuation.


అంటే "ప్రేమ భ్రమ".

ఫ్రెండ్స్ ఈ భ్రమ కొంత కాలం కొంతోగొప్పో అందరికీ ఉంటుంది. కానీ ఇదే నిజమని మీరు ఎక్కువ కాలం ఆలోచిస్తూ ఉన్నారంటే మీరు డేంజర్ జోన్ లో ఉన్నారని గుర్తుంచుకోవాలి.


మీకు ఒక అందమైన రంగుల కల ఉందనుకోండి. ఈ కలను వేరే వాడి ఇంటి గోడమీద వేస్తాను అంటే కుదురుతుందా?

Infatuation అంటే అదే!.


కాబట్టి ఫ్రెండ్స్ తొందర పడకండి. మీది లవ్వా ఇన్ఫాట్యుయేషనా అనేది మీరే ఆలోచించుకోండి.


ఆలోచిస్తారు కదూ..

కింద కామెంట్స్ లో మీ సమస్యలేమైనా ఉంటే చెప్పండి

Monday, 7 April 2025

Insta reel 3 love vs control

 Hi


Im Rama


మిమ్మల్ని ఎవరైనా ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశారా...


తొందరపడిపోకండి.

లవ్ నిజంగా గొప్పదే. Most happiest thing యే..


కానీ..కొందరు నిజానికి లవ్ చేయరు. 

They want to control.


వాళ్ళు లవ్ యూ అని రోజూ చెబుతూ..మీరు కూడా చెప్పాల్సిందే అని మొండిగా ఉన్నారా...మీరు కూడా చెప్పలేదేంటని తిట్టడం మొదలెట్టారా‌..మీరు తిరిగి చెప్పడం లేదని మీలో గిల్టీ ఫీలింగ్ తెప్పిస్తున్నారా? Blame game, guilt trip తో మిమ్మల్ని ముంచేస్తున్నారా...


Remember they are not loving you. 



లవ్ పేరుతో...లవ్ చేస్తున్నామని నమ్మించి.. They are trying to control you.


Just be smart.

Insta reel2 self worth vs social media

 Hi


I'm Sruthi 



సోషల్ మీడియా లో మీరు ఒక పోస్ట్ పెట్టి పదే పదే ఎన్ని లైక్ లు వచ్చాయో 

ఎన్ని కామెంట్స్ వచ్చాయో చెక్ చేసుకుంటున్నారా?



మీరు మీ పిక్ పెట్టి ఎన్ని లవ్ సింబల్స్ వచ్చాయో ..ఎన్ని పొగడ్తలు వచ్చాయో చెక్ చేసుకుంటూ ఉండిపోతున్నారా...


ఎక్కువ కామెంట్స్ ఎక్కువ లవ్ లు ఎక్కువ లైక్ లు వస్తే వావ్ అని మురిసిపోతూ...

దీనికి ఆపోజిట్ గా తక్కువ లైక్ లు లవ్వులు, నెగెటివ్ కామెంట్స్ వస్తే కృంగిపోతున్నారా...


గుర్తుంచుకోండి..ఇలా కనుక చేస్తున్నట్టైతే

మీరు మీ self worth ని గుర్తించకుండా దానికోసం వేరే వాళ్ళపై ఆధారపడుతున్నారని...అర్థం.


Validation comes from within

Self worth must know to self not to others.


Keep smiling

Insta reel1 cave behaviour

 Hi

This is Sridevi 



ఫ్రెండ్స్...!


 టఫ్ టైం వచ్చినప్పుడు 

 మగవాళ్ళు ఆడవాళ్ళు  వేరే వేరేగా ప్రవర్తిస్తుంటారు అనే విషయం మీకు తెలుసా..


టఫ్ టైం వచ్చినప్పుడు మగవాళ్ళేమో కేవ్ బిహేవియర్ ని చూపిస్తారు. ఆడవాళ్ళు టాకింగ్ బిహేవియర్ నుంచి చూపిస్తారు.


అంటే మగవాళ్ళు టఫ్ టైంలో ఒక గుహలో కూర్చున్నట్టు అన్నీ షట్ డౌన్ చేసుకుని, ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా గడుపుతూ ఆలోచిస్తూ ఉంటారు.

 అదే ఆడవాళ్ళు టఫ్ టైంలో  పదిమందితో మాట్లాడుతూ బాండింగ్ పెంచుకోవాలని చూస్తుంటారు.


అందుకే ఇంట్లో ఏదైనా issue వచ్చినపుడు...ఎందుకు ఈయన నాతో మాట్లాడడు అని ఆమె..

ఎందుకు ఈమె నన్ను వొంటరిగా వదిలేయకుండా సతాయిస్తుంది అని అతడూ అనుకోవడం చూస్తుంటాం కదూ!!


హహహ. ఇదే విషయం మీద గొడవలు కూడా ఐపోతుంటాయి.


కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే...ఇది men and women తత్త్వం లోనే తేడా ఉంటుందని.



Men  సైలెంట్ గా ఉండటం avoid చేయడం కాదు. స్ట్రాటజీ. తన కష్టం నుండి అధిగమించేందుకు ఒక స్ట్రాటజీ.

Women మాట్లాడటం, అర్థం చేసుకోక విసిగించడం కాదు. పంచుకోవడం..తద్వారా ఏర్పడే బంధం వలన వచ్చే సెక్యూర్ ఫీలింగ్.


చూశారా ఇద్దరూ ఒకే పని చేస్తున్నారు. ఆ కష్టం నుండి బయటపడే ప్రయత్నం. దారులు వేరు అంతే. ఇది అర్థం చేసుకుంటే...అసలు గొడవలెందుకొస్తాయి???


కదూ!!

Tuesday, 4 June 2024

Chayya Chayya - a song of mystics

 Chayya Chayya - a song of mystics


సంగీతం అందరినీ అలరిస్తుంది. కానీ ఒకే సంగీతం ఒక్కొక్కరికి ఒక్కోలా వినిపిస్తుంది. ఒక పాట ఒకరిలో దుఃఖాన్ని కలుగజేయువచ్చు. ఒకరిలో ఆనందాన్ని..ఒకరిలో గతం తాలూకు జ్ఞాపకాన్ని, మరొకరిలో వర్తమానపు వర్తమానాన్ని. ఇది చెవికి సంబంధించినది. చెవి ఒకొక్కరిలో ఒకలా సునిశిత శక్తిని కలిగి ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఆ సునిశిత శక్తి మరింత పెరగవచ్చు కూడా. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నాలో ఒకపాట కలిగించిన అలజడిని చెప్పడం కోసం.  ఆ పాట Dil Se.. సినిమాలోని ఛయ్య ఛయ్య పాట. 


పాటని ఎంజాయ్ చేయాలంటే భాష తెలిసి ఉండనవసరం లేదు.  ఆ పాట లిరిక్స్ ఏ భావోద్వేగాన్ని కలిగిస్తాయో , పాట లిరిక్స్ అర్థం కాకున్నా సంగీతాన్ని జాగ్రత్తగా వింటే అదే భావోద్వేగాన్ని పొందుతాం. ఎందుకంటే పాట ఒక రాగంలో కూర్చబడుతుంది. ఒక్కో రాగానికి కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలుంటాయి. కరుణ రసమా, శృంగార రసమా, రౌద్ర రసమా అనేది ఆ రాగం కూర్పులోనే ఉంటాయి. కాబట్టి పాట లిరిక్స్ అర్థం కాలేదు కాబట్టి పాట అర్థం కాలేదు అని చెప్పడం సంగీతాన్ని సరిగ్గా వినకపోవడం వలననే అని నా అభిప్రాయం.


హిందీ ఉర్దూ సరిగ్గా రాని రోజుల్లో ఈ పాటను విన్నాను. ఆ సంగీతం ఊపేసింది. ఇదేదో హృదయాన్ని తట్టి లేపే పాట అనిపించింది‌. బీబీసీ నిర్వహించిన సర్వేలో 155 దేశాలలో సంగీతం అభిమానులు ఈ పాటను తమకు ఇష్టమైన పాటల్లో మొదటి స్థానంలో ఉంటుందని చెప్పారు. గమనించండి వాళ్ళెవ్వరికీ హిందీ రాదు. కానీ తమ హృదయాల్లో మొదటి స్థానాన్ని ఇచ్చేశారు. ఇప్పటికీ ప్రపంచంలోని టాప్ పది పాటల్లో ఛయ్య ఛయ్య పాట  ఒకటిగా నిలబడింది. అదే సంగీతం మహత్యం. అలాగే నేనుకూడా ఈ పాట అర్థం తెలియకుండానే మొదటి స్థానాన్ని ఇచ్చేశాను నా హృదయంలో. సుఖ్విందర్ సింగ్ గాత్రం ఆ ఖంగుమనే గొంతు నచ్చేశాయి. షారుక్ ఖాన్ అభినయం స్టైల్ మెస్మరైజ్ చేశాయి. అందుకే ఈపాట పాడటం నేర్చేసుకున్నాను. ఈ పాటకి డాన్స్ కూడా చేసి రెండుమూడు చోట్ల ప్రైజ్ కూడా గెలుచుకున్పాను. గమనించండి నాకు ఆ పాట అర్థం తెలియకుండానే ఇదంతా జరిగింది.


ఆ తర్వాత ఒకరోజు అనుకోకుండా తమిళంలో ఈ పాట విన్నాను. ఏదో వేరేగా ఉందనిపించింది. హుషారు కంటే ఏదో బాధ కూడా ఈ పాటలో ఉందేమో అనిపించింది. కానీ పెద్దగా పట్టించుకోలేదు.   అదే సమయంలో తెలుగులో కూడా విన్నాను. పర్వలేదనిపించింది.  కానీ ఒకరోజు ఎందుకో మళ్ళీ ఒకసారి తమిళంలో విన్నాను.వింటూ ఉండగా వింటూ ఉండగా..ఇదొక మాయాజాలం లా అనిపించింది. ఎవరో ఒక సూఫీ ఆధ్యాత్మిక గురువు లాంటివాడు మంత్రాలు చదువుతున్నట్టుగా అనిపించింది. మళ్ళీ జాగ్రత్తగా విన్నాను. ఔను‌ ఇవి మంత్రాలే. పాట కాదు. 


ఒకరిమీద ప్రేమ కలగడం ఊరికే అలా జరగదు. ఒక వ్యక్తిని చూసినపుడు పుట్టే ప్రేమ శారీరకమైనది కాదు. మానసికమైన ది కూడా కాదు. అది లోలోపల ఉన్న ఆధ్యాత్మిక మంత్రకవాటాలను తట్టి లేపుతుంది. ప్రేయసి ఈ విశ్వ ప్రేమకీ దైవ ప్రేమకీ ఒక తలుపు వంటిది. ఆమెను లేదా అతడిని అన్వేషించడం ఆరాధించడం మన కొంతకాలం ఉండిపోయే ఈ భూమి మీద ఒక ఆధ్యాత్మిక అన్వేషణకి దారితీస్తుంది. ప్రేయసి ప్రేమాన్వేషణ దైవాన్వేషణ విడదీయరానివౌతాయి. అర్థంకాని తమిళంలో ఈపాట నన్ను ఇలా చేరింది. ఐతే పాటను వింటూ వందల సార్లు ఆ అనుభూతిని పొందాను. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఈ తమిళ హిందీ పాటల అర్థం తెలుసుకుందామని ప్రయత్నించాను‌. ఆశ్చర్యం. అవి నేననుకున్నట్టే ఉన్నాయి.


గుల్జార్ హిందీలో రాసిన పాట ఒక సూఫీ తాత్వికుడి కవిత నుండి ప్రభావితం చెందింది. దీనికి పంజాబీ జానపదాన్ని మిక్స్ చేసి రాశాడు గుల్జార్. టెక్నాలజీని వాడకంలో రెహ్మాన్ ఎంత ఆధునికుడో మానసికంగా అంత మార్మికుడు. మనసు విద్య తెలిసినవాడు. మిస్టిక్ కాని సంగీతజ్ఞుడు ఏమి మాజిక్ చేయలేడు. కాపీ రైట్స్ వంటి ప్రాపంచిక విషయాలకి ఒక మ్యూజిక్ మిస్టిక్ లొంగిపోయాడంటే అతడిలో మ్యాజిక్ మాయమైపోతుంది. కానీ రెహ్మాన్ అటువంటి వాడు కాదని అతడి ఆధ్యాత్మిక జర్నీ చూస్తే అర్థమవుతుంది. గుల్జార్ ఈ పాటను బుల్లే షాహ్ అనే సూఫీ కవి రాసిన జానపదం ఆధారంగా రాశాడు. నీ ప్రేమ నన్ను పిచ్చివాడిలా థయ్య థయ్యా  అని నృత్యం చేయించిందని రాశాడు బుల్లే షాహ్. ఒరిజినల్ పదం థయ్య థయ్యా. ఐతే తమిళంలో "థయ్యా థయ్యా తక థయ్య థయ్యా" అనే ఉంటుంది. అంటే బుల్లే షాహ్ అనుకున్నట్టు నృత్యానికి సంబంధించిన పదాన్నే తమిళంలో వాడారు. ఐతే గుల్జార్ హిందీలో దీన్ని మార్చాడు. థయ్యాను ఛయ్యా చేశాడు. అంటే నీడ. ప్రేమ నీడలో తలదాచుకున్నవాడి కాలికింద స్వర్గం ఉంటుందని రాశాడు. అదే సూఫీ ప్రేమతత్వం.


తమిళంలో, హిందీలో లిరిక్స్ లో అద్భుతమైన సూఫీ కవిత్వాన్ని ఈ మిస్టిసిజాన్నీ నిలబెట్టుకుంది ఈ పాట. కానీ తెలుగులో ఈ పాటను ఎవరు రాసారో అసలు  ఎందుకు రాశారో కూడా తెలియదు. ఆ రెండు భాషల్లో కవిత్వం విన్నాక సూఫీ తత్వాన్ని మాజిక్ నీ అనుభవించాక తెలుగు పాట కనీసం విని బుద్ధి కూడా కాదు. తమిళంలో థయ్యా థయ్యా తక థయ్య థయ్యా..ని ఐనా తెలుగు లో తీసుకోవలసింది. ఛయ్య అనే తెలుగుపదానికి ఏం అర్థమూ లేదు. పాట సాకీతో ఇలా మొదలౌతుంది.


అటవిబాటలో ఉన్న ఓ నా పిచ్చుకల్లారా

ఓపికతో పాదాలమీద 

ఎదురుచూస్తున్న ఆత్మల్లారా..

థయ్య థయ్యా అని నాట్యం చేద్దాం రండి.(తమిళం)


ఎవరి తల ప్రేమ నీడలో తలదాచుకుందో

వాడి కాళ్ళకింద స్వర్గం ఉంటుంది.

ప్రేమ నీడకు పోదాం పదండి. (హిందీ)


ఎంతటి అలకే కిన్నెరసాని 

మామను చేరే అల్లరివాణి

చల్ ఛయ్య ఛయ్య (తెలుగు)

తెలుగు లో చల్ ఛయ్య ఛయ్య ని అలాగే ఉంచేశారు. దారుణం.


తమిళంలో కవిత్వంతొ పల్లవి మొదలౌతుంది.


హృదయం ఎగిసిపడింది

దాని దరువు రొద నొప్పిగా మారింది.

ఒక పచ్చని చిలుక వచ్చి పోగానే

ఈ గుండెలో భయం మొదలైంది.

నాట్యం చేద్దాం రండి


హిందీలో సాకీ అర్థమే మరలా రిపీట్ ఔతుంది...

ప్రేమ నీడలో నడువు

నీ పాదం స్వర్గం మీద ఉంటుంది 

ప్రేమ నీడలోకి పోదాం పద.


తెలుగులో చూడండి...

చెలి కిలకిలలే చిటికెయ్య 

మది చెదిరి కథాకళి చెయ్య హొయ్య 

చల్ ఛయ్య ఛయ్య. 


ఏందో ఇది కదా! కిలకిలలే చిటికెయ్యడం.

ఆ తర్వాత చూడండి...


ఆమె కంటికి రెండువందలేళ్ళు

ముక్కందానికి మూడువందలు

ఆమె అందమైన కథకు 

ఐదొందలేళ్ళు

అరె,మనం బతకాలి కదా! (తమిళం)


ఆమె సుగంధంతో నిండి ఉంది

ఆమె భాష అందమైన ఉర్దూలా ఉంది

ఆమే నా పగలూ రాత్రీ 

నా ప్రపంచం కూడా..

ఆ సఖినే నా ప్రేయసి.(హిందీ)


ఓ కన్నియపై చూపున్నదయా

ఎదట పడే చొరవుండదయా

మనసాపలేక మాటాడలేక

ఒక ఖయ్యామై తయ్యారయ్యా(తెలుగు)

ఒమర్ ఖయ్యాం ని ఈ పంక్తులలోకి తేవడం ఒక్కటే బాగుంది.


ఆ తర్వాత మొదటి చరణం మొదట తెలుగు లో చూడండి

"ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా

ప్రతి చోట తనే అంటున్నదయా

తన వెంటపడే నా మనవి విని

ఏనాటికి కనిపించేనయ్యా

తన వెంటపడే నా మనవి విని

ఏనాటికి కనిపించేనయ్యా

ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా

ప్రతి చోట తనే అంటున్నదయా

తన వెంటపడే నా మనవి విని

ఏనాటికి కనిపించేనయ్యా  

తొలగేన మరీ ఈ మాయ తెరా

తన చెలిమి సిరీ నా కలిమి అనీ

తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి

తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి". ఈ  తెలుగు పదాలు చూడండి ఊరికే పాటకోసం ఏవో కొన్ని పదాలు నింపి నట్టు ఉన్నాయి కదూ.


ఇవే పంక్తులు తమిళంలో కవిత్వంతో ఎలా మారాయో చూడండి.


"ఒక్క చూపుతో 

నీవు నన్ను కరిగించావు

ఒక్క నవ్వుతో 

నీవు నన్ను తోసేశావు.

నా అహాన్ని కూల్చేశావు.

నీ సైగతో నన్ను 

నీ బానిస చేసుకున్నావు.

ఈ ఆరడుగుల వీరుణ్ణి

పట్టించుకోనైనా పట్టించుకోకుండా

నీ చరణదాసున్ని చేసుకున్నావు.

వర్షం పడేముందు

సన్నని తుంపర మాయమై నట్టు

ఆమె ఈరోజు మాయమైపోయింది.

నేను నిన్ను చూస్తే అగ్గి రాజేసుకుంటుంది

నీవు నన్ను చూస్తే ఒక మొగ్గ విచ్చుకుంటుంది.

నా మొదలే మొదలు

నా తుదనే తుదలు".


ముఖ్యంగా తమిళంలో ఈ భాగంలో సూఫీ మంత్రాలు చదువుతున్నట్టే ఉంటుంది. 


ఉర్దూ కవిత్వం చూడండి

" కొన్నిసార్లు పూవులు గర్వాన్ని ప్రదర్శిస్తాయి

కానీ అవి సువాసన వచ్చినప్పుడే 

మనకు కనిపిస్తాయి.

నేను ఆమెను తావీజు లాగా కట్టుకుంటాను.

అప్పుడామె ఎక్కడోచోట ఉర్దూ శ్లోకంలాగా దొరుకుతుంది.

ఆమే నా సంగీతం

ఆమే నా పవిత్ర శ్లోకం. 

ఇక్కడ షారుక్ ఖాన్ తావీజును వేసుకున్నప్పుడు చూపే భక్తిని నటనలో చూపిస్తాడు. హిందీలో ఒరిజినల్ పాట అని అర్థమౌతుంది. తమిళం పాట ఎందుకూ తగ్గకుండా ఉర్దూలోని సూఫీ తత్వాన్ని  ఓన్ చేసుకుంటే.. తెలుగు ఎటూ కాకుండా అర్థంలేని పాటను నిలబెట్టింది.


మొదటి చరణం ఎండింగ్ తెలుగు తమిళం హిందీలలో వరుసగా చూద్దాం


జాలిపడైనా ఓయ్ అనదే

మర్యాదకైన పరదా విడదే

అపరంజి చిలక శ్రమ పడిన ఫలితమై

నా వైపే వస్తూ ఉన్నదయా


ఓయ్ అనడం, పరదా విడటం అంతకుముందు సీన్ కి సంబంధించినవి. అంటే తెలుగు కవి సీన్ ని దృష్టిలో పెట్టుకొని రాశాడు పాపం. కానీ కవిత్వం కుదరలేదు. 


"నీవు కొండమీద దొరికిన వజ్రానివి

నా గుండెలో వేరుతొడుగున్నదానివి

నీవు ఒక్కరోజా రెండురోజులా?

లేక నా జీవితపు మూలాల్ని

ఎప్పటికీ తాకుతూనే ఉండిపోతావా??"(తమిళ్)


ఆమె మంచు బిందువుల్లా గా నడుస్తుంది.

స్వర్గం ఆమె పాదాలతోపాటు నడుస్తుంది.

ఒక్కోసారి తరుశాఖలమీద

ఒక్కోసారి ఆకులమీద

నేను గాలిలో కూడా ఆమె జాడ 

వెతుకుతున్నాను.( హిందీ)


రెండవ చరణం మొదలై ఎలా ముగుస్తుందో చూడండి

మూడు భాషల్లో


నేను ఆమె అందాన్ని ఆరాధిస్తాను‌

కానీ అది సూర్యకాంతి - నీడలాగా నన్ను మోసం చేస్తోంది.

ఆమె తన  రంగులను మార్చేస్తుంది.

నేను రూపాలను రంగులనూ అమ్ముకునేవాడిని.

ఎవరి తల ప్రేమ నీడలో తలదాచుకుందో 

అతడి పాదం కింద స్వర్గం ఉంటుంది.

ఆమే నా పగలూ రాత్రీ 

నా ప్రపంచం కూడా..

ఆ సఖినే నా ప్రేయసి.(హిందీ). హిందీలో పైనున్న పంక్తులు రిపీట్ ఔతాయి. కానీ తమిళంలో మళ్ళీ కవిత్వం నిండుతుంది ఈ పంక్తుల్లో.


"ఇంద్రధనుస్సు రెండు సార్లు రాదు.

ఒకసారి వస్తే మరోసారి రాదు.

స్టేషను దాటిన రైలు పాట

ఒకసారి దాటేశాక వినబడదు.

ఆ పాట పాడిన గొంతు

ఒకసారి పోయాక 

పాట మళ్ళీ వినబడదు.

నా సగం గుండె నీదే

నా సగం గుండెలో నిండినది నీవే

ఓ నా ప్రేమ జ్యోతీ!

ఓ నా జీవన సారమా!

నీవే నా దేవతవు

నీవు నిజానివా?

లేక నా కలవా?(తమిళం)


మదినూయలలూపే సొగసయ్యా

తొలి తూర్పు కాంతులే చెలి ఛాయా

పరువాల తరంగమే తానయ్యా

మహరాణి రూపు హరివిల్లయ్యా

మహరాణి రూపు హరివిల్లయ్యా  

ఎంతటి అలకే కిన్నెరసాని

మావని చేరే అల్లరి మానీ

ఎంతటి అలకే కిన్నెరసాని

మావని చేరే అల్లరి మానీ

చెప్పరయ్య నా జాణ తోటి

తన కంటపడే దారేదయ్యా


తెలుగులో కిన్నెరసాని,జాణ, అపరంజి చిలక, మహారాణి వంటి విశేషణాలతో నింపినట్టు కనిపిస్తుంది. హిందీలో తమిళంలో కనబడిన కవిత్వం తెలుగులో కనబడదు. హిందీలో సుఖ్విందర్ సింగ్ మ్యాజిక్ చేసినా, మనమీద దయవుంచి తమిళంలో అతడి గొంతును పాటలో చాలా కుదించారు. కానీ తెలుగులో పాట మొత్తం సుఖ్విందర్ సింగ్ తో పాడించడంతో బెడిసికొట్టింది. 


తమిళం పాటలోనే సూఫీ తరహా మంత్రాలలాగా వినిపిస్తుంది. సుఖ్విందర్ సింగ్ హిందీలో బాగా పాడాడు అనిపిస్తుంది. గుల్జార్ ఉర్దూ కవిత్వం అతడి గొంతుకు సరిపోయినట్టే అనిపిస్తుంది. కానీ తమిళంలో ఉండే మ్యాజిక్ హిందీలో లేదు. తమిళం పలికే విధానం ఆ కవిత్వం ఈ పాటకు మిస్టిసిజాన్ని తెచ్చాయి. తెలుగులో చెప్పడానికి ఇంకేం లేదు. సుఖ్వీందర్ సింగ్ ఎంత చెడగొట్టాడో లిరిక్స్ అంతే చెడగొట్టాయి.


విరించి విరివింటి

Thursday, 11 April 2024

The Roots of organic life

 Old text


పర్యావరణ దినోత్సవం సందర్భంగా గిరిజనుల మాటలు విందాం. విని ఒకసారి ఆ దిశగా ఆలోచిద్దాం.

-------------++


మేజర్ మూగీ సమ్నర్ ఆస్ట్రేలియాలోని నేరిండ్ఝెర్రీ తెగకు సంబంధించిన పెద్దమనిషిగా, ఆ సంస్కృతికి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మొన్న సత్య శ్రీనివాస్ గారి "మట్టి గూడు" పుస్తక ఆవిష్కరణ సమయంలో, వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఈ నేరిండ్ఝేర్రీ తెగ గురించి ఉటంకించారు. ఆ తెగ కథ చాలా ఆసక్తి కరమైనది. వెస్టర్నజేషన్ వలన ఎన్నో జాతులు తెగలు సంస్కృతులు అంతరించి పోతున్న తరుణంలో, ఆస్ట్రేలియా మూలవాసులైన ఈ తెగలు తమను తాము ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నాయి. తద్వారా తమ ఉనికిని, తమ సంస్కృతిని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మూగీ సమ్నర్ ఈ సంస్కృతిని నిలుపి ఉంచడం దిశగా కృషిచేస్తున్న మేధావి. మట్టి గూడు పుస్తకం చదివిన తరువాత మనం గొప్పవి అనుకుటున్న సంస్కృతులన్నీ గిరిజన సంస్కృతులను ఆటవికమైన సంస్కృతులుగా, అనాగరికమైన సంస్కృతులుగా ముద్ర వేసి మనలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మనం తెలుసుకుంటాం. మనకు పరిచయమున్న సంస్కృతులలోని ఇనార్గానిక్ లైఫ్ కూ మనకు పరిచయంలేని కొండజాతి సంస్కృతులలోని రిచ్ ఆర్గానిక్ లైఫ్ కూ సంబంధం లేదని తెలుసుకున్నపుడు, మనదసలు జీవరహిత సమాజమని గ్రహించగలుగుతాం. (ఆర్గానిక్ లైఫ్ కీ ఇనార్గానిక్ లైఫ్ కీ గల తేడాను సత్య శ్రీనివాస్ తో నేను చేసిన ఇంటర్వ్యూలో మీరు గ్రహించగలరు). కానీ నిజమైన ఆర్గానిక్ లైఫ్ మూలాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూలవాసుల జీవితాల్లో ఉన్నాయని చెప్పే వారు మనకు కరువయ్యారు. ఆ ప్రయత్నంలో సత్య శ్రీనివాస్ గారు ఉన్నారు. మేజర్ మూగీ సమ్నర్ ఇంటర్వ్యూ కూడా మనల్ని ఆ వివరాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఈ మొత్తం ఇంటర్వ్యూ The Roots of Organic life రెండు భాగాలుగా అనువాదం చేస్తున్నాను. 


------------ The Roots of organic life (part 1)-----------

నా పేరు మేజర్ సమ్నర్.

నేను నారింజేరి దేశం సభ్యుడను.

కూరంగ్ అనే ప్రదేశానికి చెందినవాడను. అది దక్షిణ ఆస్ట్రేలియాలో ఆగ్నేయ ప్రాంతంలో ఉంటుంది.

మా జాతి ప్రజలు ఆస్ట్రేలియాలోని అన్ని జాతుల ముందుగా వేలవేల సంవత్సరాలనుండి ఇక్కడ జీవించారు.

మాజాతి ప్రభుత్వ అధికారులతోనూ, చర్చి అధికారులతోనూ పరిపాలించబడతాము.

ఇది ఎక్కడైనా ఒకటే. అమెరికా, కెనడా వంటి ఎన్నో దేశాలలో గానీ ప్రపంచమంతటా ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. వారు మా కల్చర్ ని, మా భాషనూ, మా పండుగలనూ, సాంప్రదాయాలనూ కొల్లగొట్టారు. 

మాకు ఇంగ్లీషు నేర్పించారు. స్కూలుకు పంపించారు. ఇలా చేస్తే మాకు మంచి జరుగుతుందని చెప్పారు. 

కానీ ఈరోజు అవన్నీ నేర్చుకోవడమే మంచిదని అనుకుంటాను. అలా నేర్చుకోకపోతే మేమీదేశంలో బతకలేని పరిస్థితి. ఈ సమాజంలో బతకి బట్టగట్టాలంటే  ఈ మార్పు తప్పనిసరి.

కానీ మేము ఎక్కడినుండి వచ్చాము?. దేశంలోని ఏ ప్రాంతం నుండి, ఏ సంస్కృతి నుండి వచ్చాము?

మా పుట్టుక కథలేమిటి?. మా నారింజేర్రి గురించి, మా నేల ఆవిర్భావం గురించి కథలేమిటి?.

ఈ రోజు ఈ దేశంలో మా స్వంత భాషను కొంత మాట్లాడుతుంటాం. రాసుకోని ఆ భాషను మేము మాట్లాడగలం. కానీ మా అలసత్వం వలననో, ఇంగ్లీషు భాష నేర్చుకోవడం చాలా సులభం కావడంవలననో, మా భాషను కోల్పోయాం. 

మా నాట్య రీతులు, మా కళలకు సంబంధించిన, మా పుట్టుకకు సంబంధించిన కథలుగా చెప్పే మా నాట్య రూపాలు, జంతువులను అనుకరించే, జంతువుల వేటను అనుకరించే మా నాట్య కదలికలు, వీటి ద్వారా మేమెవరమనేది ప్రపంచానికి చెబుతాం. ఈ దేశంలో మా మూలవాసి తత్వాన్ని ఈ నృత్యాల్లో చెబుతాం. నేను ప్రపంచంలోని ఎన్నో దేశాలు తిరిగాను, లండన్, ఇండియా, దక్షిణ కొరియా, కెనెడా, అమెరికా, న్యూజీలాండ్ వంటి దేశాల్లో నృత్య రీతులనూ, పండుగలనూ చూశాను. కెనెడాలోని వినేపేగ్ చుట్టుపక్కల కొన్ని తెగలను చూశాను. ఎన్నో ఇతర ప్రదేశాలనుండి మూలవాసుల ద్వారా ఆహ్వానాన్ని అందుకున్నాను. మేము అంతా కలిసి మా అడవులకోసం మా పిల్లల కోసం నృత్యం చేశాం. నదికోసం నది ముందర నాట్యం చేశాం. మాప్రజలు, నా కుటుంబం అలాగే మాతో కలిసి వచ్చే జాతుల ప్రజలూ అందరూ నాట్యం చేస్తారు. ఆ విధంగా ప్రపంచం చుట్టేసి వచ్చాను. ఓరెగాన్ లో ఉండే అడవులనుండి వచ్చాను. వారిని చూసి వచ్చాను. వారు తమ ప్రజలను చూసుకునే విధానాన్ని చూశాను. వారి సంస్కృతిని చూశాను. వారి సాంస్కృతిక కేంద్రం ద్వారా వారు చేసే పనులనూ చూశాను. ఈ దేశంలోని మూలవాసులు కూడా అటువంటి పనులు చేయవలసిన అవసరం ఉంది. కానీ అదే విధంగా మేము మా ప్రాంతాన్ని, సంస్కృతినీ పరిరక్షించుకోవాలి. మా భూమికి మేమెలా సంబంధం నెరపుతున్నామో చూసుకోవాలి. 


మూలవాసుల దినోత్సవమని మనమొక రోజును గుర్తించాం. ఆ రోజు మేము దక్షిణ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలలో ఉండే పలు పాఠశాలలకు వెళ్లి, ఆ చిన్న పిల్లలతో ఒక రోజైనా గడుపుతుంటాం. కానీ అటువంటి ప్రోగ్రాంలు పెద్దవారితో చేస్తే కూడా బాగుంటుందనుకుంటున్నాం. మేము పెద్దలను కూడా ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మూలవాసులమైన మేము ఈ దేశాన్నీ, ఈ నేలనూ ఎలా ప్రేమిస్తామో గౌరవిస్తామో ఒకరినొకరం ఎలా గౌరవించుకుంటామో మేము చెప్పవలసిన అవసరం ఉంది. మేము జంతువులను వేటాడే విషయంలో కూడా జంతువును చంపిన తరువాత మాకు ఒక సాంప్రదాయ నృత్యం ఉంటుంది. ఒక పాట ఉంటుంది. అందులో ఆ జంతువు ఆత్మను గౌరవించడం ఉంటుంది. అది మాకోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. కానీ ఈ పద్దతి ప్రపంచంలోని ప్రజలు మరచిపోయారు. వారంతా తమ గురించి తామే ఆలోచించడం లో మునిగిపోయారు. ఇతరుల గురించి, తమ నేల గురించి ఆలోచించడం మరిచారు. మేము నృత్యం చేసేటపుడు మా పితరులను కూడా మాతో వచ్చి కలిసి ఆడమని వేడుకుంటాం. మీరెందుకలా చేస్తారని మీరడగవచ్చు. కానీ మేము అలాగే ఉన్నాం, అలాగే ఉంటాం. మా పితరులను మా జీవితాల్లోకి ఆహ్వానించుకుంటాం. అంతే కాకుండా మేము నృత్యం చేసేముందు కూడా మా పితరుల పర్మిషన్ తీసుకుంటాం. మా గురించి, మా నృత్యరీతుల గురించి ఇతరులకు తెలియజెప్పాలనుకున్నపుడు కూడా మా పితరుల అనుమతి అవసరం. మేము వారిని రమ్మని ఆహ్వానిస్తాం. అటువంటి సందర్భాల్లో మాతో కలిసి ఉండమంటాం. నేను చెప్పగలిగిందల్లా మా ప్రజల గురించి. మా సృష్టి కథల గురించి. ఇతరుల కథల గురించి చెప్పడానికి మాకేం హక్కు ఉందని? మాకే హక్కూ లేదు.


నేను నారింజేర్రి తెగకు చెందినవారిమైనప్పటికీ మా చుట్టు పక్కల ఉండే తెగల పండుగలకు అపుడపుడూ వెల్తుంటాం. అక్కడ నేను వారి పండగలలో పాల్గొనడానికి అనుమతి తీసుకుంటా. వారి పండగలను కలిపి జరుపుకోవడం వలన వారు ఆ సాంప్రదాయాలను మరిచిపోరు. ఆ విధంగా నేను వారిని ప్రోత్సహిస్తూ ఉంటాను. ఎందుకంటే వేల యేండ్లుగా జరుగుతున్న వేడుకలను మరలా వెలుగులోకి తీసుకురావడమన్నది ఒక రోజులో ఒక వ్యక్తితో జరిగే విషయం కాదు. మేము ఒకరి వేడుకలను ఒకరం గౌరవించుకుంటాం. వారి పద్దతులనుండి, వేడుకలనుండి ఎంతో నేర్చుకుంటాం. ఆ విధంగా సమాజంలో ఆ పురాతన పద్దతులను తీసుకువచ్చి, సమాజాన్ని పరిపుష్టం చేయవలసిన అవసరం కూడా ఉందనుకుంటాను. ఎందుకంటే మన ప్రపంచం ఇపుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచమంతా డబ్బుచుట్టు తిరుగుతోంది. ప్రజలందరూ స్వార్థం వైపే మొగ్గుచూపుతున్నారు. అంతా నేను,నేను, నాది అనుకుంటున్నారు. నాకేం కావాలి అనే ఆలోచిస్తున్నారు కానీ, ప్రపంచానికేం కావాలన్నది కాదు. చుట్టూ ఉండే మనుషులకేం కావాలన్నది కాదు. నేను నేను అనుకోవడంలో తప్పేమీ లేదు కానీ, పంచుకోవడమన్నదే లేకపోతే ఎట్లా?. నీ స్నేహితులతో బంధువులతో పంచుకోవాలి, ప్రజలతో పంచుకోవాలి, ఈ దేశ ప్రజలతో పంచుకోవాలి. ఇతర దేశాలతో పంచుకోవాలి. ఈ దేశం చాలా పెద్దది. ఇతర దేశాలనుంచి ఈ దేశానికి వచ్చేటపుడు, ముందుగా మాతో మాట్లాడాలి. మేము వారిగురించి ఏమనుకుంటామో వారు ముందుగా అర్థం చేసుకోవాలి. వారు ఇక్కడికి రావడాన్ని మేమెలా అనుకుంటామో వాల్లు తెలుసుకోవాలి. నేను ఒక గిరిజనుడితో మాట్లాడినపుడు, అతడు ఒక మాట అన్నాడు. ఈ దేశంలో మూలవాసులు, మూలవాసులు కాని వారూ ఉన్నారు. అటువంటపుడు ఈ ప్రభుత్వాలు గట్టిగా ఎందుకు ప్రశ్నించవు?. మా సరిహద్దులను దాటుకుని వచ్చే వారిని ఎందుకు ప్రశ్నించవు?. ఆధునికులు మొబైల్ ఫోన్లతో సాటిలైట్లతో మా నేల మీదకు వస్తున్నపుడు, వారు ఎందుకని మా పర్మిషన్ తీసుకుని రారు?. అన్నాడు. నేను ఆ విషయమై ఆలోచించాను. ప్రభుత్వాలు ఆ పని చేయాలనుకుంటాను. ఎవరంటే వారు ఇక్కడకు వచ్చి మేమేం దుస్తులు ధరించాలి, ఏ పనులు చేయాలి,ఏం చదవాలి ఏం చదవకూడదు అని చెప్పడం ఎందుకు?. 


మీరు ఇక్కడ కట్టబడిన పార్క్ ను చూశారా?. ఈ ప్రదేశాన్ని ఇంగ్లండులాగా కనిపించేలా చేశారు. వాల్లు ఇక్కడికి వచ్చి ఈ నేల మీద ముల్లకంచెలు పెట్టారు. నీవు నేల సారాన్ని పెంచే వ్యవసాయం కోసం కాకుండా నేలను ఎందుకు తవ్వేసినా నీవు మనిషివి కానట్టే. నీవు సంస్కృతి లేని వాడివే. నీకు ఏ మతమూ లేనట్టే. నీవు ఏ విషయాన్నీ నమ్మని గండశిలలాటివాడివనే అర్థం. కానీ వారు మమ్మల్ని ఏ పర్మిషనూ అడగలేదు. వారికి అడగడానికి ఏమీ లేదు కూడా..వారు మా సంస్కృతి గురించి మమ్మల్ని అడగలేదు. మా మూలాల గురించి, వేలవేలగా మా నాలుకమీద తిరుగాడే మా మూల కథల గురించీ వారు తెలుసుకోవాలనుకోలేదు. నేను స్కూలుకి వెల్లినపుడు పిల్లలను అడుగుతుంటాను. మన మూలవాసుల కథలు తెలుసునా అని. పిల్లలను మీరు బైబిల్ ని నమ్ముతారా అని అడుగుతుంటాను. పిల్లలు ఔను అంటుంటారు. బైబిల్ కేవలం రెండు వేల సంవత్సరాల క్రితంది మాత్రమే. మా మూలాలు తెలిపే మా కథలు వేలవేల సంవత్సరాలవి. మా కథలెంత పురాతనమైనవో ప్రజలకు తెలియదు. మూలవాసుల చరిత్ర చాలా పురాతనమైనదని వాల్లే చెబుతూ ఉంటారు. కానీ వచ్చి మమ్మల్ని మార్చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మా నీరు స్వచ్ఛమైనది. మా నేల స్వచ్ఛమైనది. ఇక్కడి జంతువులూ సవచ్ఛమైనవి. మేం కంగారు వంటి జంతువులను, చేపలనూ బెర్రీ ఫలాలనూ వాటి అనుమతి తీసుకుని తిన్నాం. చాలా సంపన్నవంతంగా ఫలవంతంగా ఈ దేశంలో బతికాం. ఎపుడైతే ఇతర జాతులవారు ఇక్కడికి వచ్చారో, మా జీవన రీతులు మాయమవడం మొదలైంది. కొత్తగా వచ్చిన జజ్బులతో దేశం మొత్తం అతలాకుతలమయింది. కలరా, మీసిల్స్, స్మాల్ పాక్స్ ఈ దేశంలోకి వచ్చి సర్వనాశనం చేశాయి. కొన్ని మూలవాసి తెగలు ఇప్పటికీ ఇటువంటి జబ్లులంటే ఏమిటో కూడా ఎరిగి ఉండవు. తెల్లవారు వచ్చాకే ఇదంతా జరిగింది. తెలియని కొత్త జబ్బునబారిన పడి మా ప్రజలు మరణించారు. 

సహజీవనమనే అంశాన్ని తీసుకున్నపుడు మేము ప్రపంచానికి సహజీవనమంటే ఏమిటో కలిసి ఉండటమంటే ఏమిటో నేర్పించదలచుకున్నాం. ఈ దేశంలో,ఎంతో మందికి వారి మూలాలు తెలియదు. వారు ఏ తెగ నుండి వచ్చారో, వారి కుటుంబ మూలాలు ఏమిటో తెలియదు. అంతా కలగాపులగం గా ఉంటుంది పరిస్థితి. వేరు వేరు జాతుల వారు ఉండే ఈ దేశంలో వేరు వేరు జాతుల నడుమ వివాహాలు జరుగుతున్నాయి. ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే ప్రజల్లో ఉండే ఇతర జాతుల పట్ల ఉండే వివక్షలు తొలగుతాయి. కానీ, అది జరగాలంటే ముందు ఈ దేశంలో ఉన్న, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూలవాసులతో మాట్లాడటం జరగాలి. అలాగే మనమంతా ఏ మూలాలనుంచి వచ్చామో తెలుసుకోవాలి. అపుడే మనం ఔను మనమంతా ఒక్కటని చెప్పగలం. తమ పర బేధాలు లేకుండా చెప్పగలం. ఇది జరగకపోతే మన వినాశనం తప్పదు. రెండు నెలల కిందట, చంద్రుడిలో ఉండే గనులకోసం వెతుకులాట మొదలైందని విన్నాను. అదే జరిగితే ఏమౌతుంది. ఈ దేశంలోని పురుషులు ఇంకో గ్రహం మీదకు గని తవ్వకాలకోసం వెల్లడం చాలా దారుణమైన విషయం. మన దేశంలో జరిగే గని తవ్వకాలన్నీ నిజంగా మనకు అవసరమైనవేనా?. లేక కేవలం స్వార్థం తో లోభంతో పుట్టిన అవసరాలా?. 


మనం మీడియా గురించి మాట్లాడుతూ ఉంటాం. విషయాలు బయటకు రావడానికి మీడియా ఎంతో అవసరమని వింటాం. కానీ మీడియా అనేది మూలవాసులకు సంబంధించినంత వరకూ నష్టకారకమే. టీవీల్లో, పత్రికల్లో ఎక్కడా మూలవాసుల ముఖాలు కనిపించవు. మీకు ఇక్కడి సిటీలు కనిపిస్తాయే కానీ ఇక్కడి మూలవాసులు మీడియాలో కనిపించరు. మా జీవితాల్ని ప్రపంచానికి చూపరు. మేము వేటలో పొందిన జంతు ఆహారాన్ని మొత్తం కమ్యూనిటీతో పంచుకుంటాం. కానీ ఆధునికులు తమ ఇంటిచుట్టూ కంచె నిర్మించుకుంటారు. ఇంకెవర్నీ లోపలికి రానీయరు. ఇంకో ఇరవై ముప్పై యేండ్ల తరువాత మనుషులు ఒకరికొకరు తెలియకుండా ఐపోతారు. ఇప్పటికే ఈ దేశంలో ఇంటి పక్కవాడి పేరు కూడా తెలియని వారు ఎందరో ఉన్నారు. నేను నాకు తెలియని వారితో మాట్లాడతాను. మాట్లాడితేనే కదా వారు నాకు తెలిసినవారు ఔతారు. మాట్లాడితేనే నేనెవరో ఎక్కడినుంచి వచ్చానో అవతలి వారికి అర్థమవుతుంది. వారి విషయాలు కూడా నాకు తెలుస్తాయి. పురాతన సమాజాల్లో లేని పోకడలు ఇపుడు కనిపిస్తున్నాయి. ఎదుటి వ్యక్తిని పలకరించేంత సమయం తీరిక ఎవరికీ లేవిపుడు. కానీ మొదట మనం పలుకరించడం మొదలు పెట్టాలి. అవతలివాడు పలుకకపోయినా పరవాలేదు. మొదట మనం పలుకరించడం మొదలు పెట్టాలి. ఏమో తరువాత ఎపుడైనా వాల్లూ స్పందించడం మొదలు పెడతారేమో. ఒక చిన్న విలువైన విషయాన్ని ప్రజల మనసులోకి ఇరికించటానికి ఎన్నో యేండ్లు పట్టవచ్చు. మన చుట్టూ పరిమితులు విధించుకుని మాట్లాడటం ఎంతవరకు సమంజసం. మనం ఓపెన్ అప్ కావాలి. మన గురించి, మన దేశం గురించి తెలుసుకోవడం చదువుకోవడం మంచిదే కావచ్చు. కానీ మనం తెలుసుకోవలసింది, చదువుకోవలసింది ఇతరులతో ఎలా మాట్లాడాలి ఎలా గౌరవించుకోవాలి అనే విషయం కూడా.


Part 2 ------------------------------------------------ 


నారింఝేర్రీ ప్రజలు వారి వారి సరిహద్దులు దాటి బయటకి పోతున్నారు. ఇతర మూలవాసుల కథలు వినడానికి పోతున్నారు. వాటిని విని మరల మాకు తెలియజేస్తున్నారు. ఇది మనకోసం మన స్వార్థం కోసం చేసుకోవడం కాదు. మనం ఇతరులను వినడం నేర్చుకోవాలి. వారి విద్యను మనం మన దేశానికి తీసుకురావాలి. మనం అందుకే బయటకు వెల్లాలి. ప్రజలను కలవాలి. ఇతర ప్రజల జీవితాలలో మనం ఒక భాగం కావాలి. మీడియాను ఉపయోగించడం ద్వారా మనం దానిని సాధించవచ్చు. అపుడే ప్రజలు ఒకరిని ఒకరు వినడం మొదలు పెడతారు. మనమంతా గ్లోబల్ వార్మింగ్ గూర్చి మాట్లాడుకోవాలి. మనం కార్లనూ టీవీలను ఉపయోగిస్తున్నాం. మనం కాల్లీడుచుకు కూర్చుని ఏదో ఒక జాతి మీద ఈ నిందను మోపలేం. మీవలననే ఇది జరిగిందని అనలేం. మనమంతా ఇందులో భాగస్వాములమే. ఈ దేశంలోకి ఎన్నో జాతులు వలస వచ్చాయి. వారు వారి వారి కల్చర్ ని ఇక్కడకు తీసుకు వచ్చారు. దానితో పాటు కొంత నెగేటివిటీని కూడా తీసుకువచ్చారు. మేము ధూపం ఇచ్చే వేడుకను చేసుకుంటాం. కాథలిక్కులలాగే. మా పూర్వీకులను ఈ నెగేటివిటీని తొలగించమని ప్రార్థిస్తూ ఈ ధూప వేడుకలు చేసుకుంటాం. ఇపుడు ఈ దేశంలో ప్రతీ ఒక్కరూ ఈ ధూప వేడుక లో పూర్వీకులను ప్రార్థిస్తే, ఇంకా మనం మంచిగా బతుకుతామేమో. మూలవాసులు వారిలో వారు పెండ్లిల్లు చేసుకున్నంతకాలం ఎటువంటి ఇబ్బందులూ లేవు. ఇపుడు పరిస్థితి లేదు. మనం అందరం ప్రజలం కలిసి ఉండాలి. జంతువులతో పక్షులతో వేరు వేరు జాతులతో కలిసి ఉండాలి. మన మధ్యన ఉన్న విబేధాలు కలిసి నాట్యం చేయడం ద్వారా మాట్లాడటం ద్వారా పెండ్లిల్లు చేసుకోవడం ద్వారా సమసిపోతాయి.


ఈ దేశం లోకి వచ్చిన ఇతర జాతుల వారు మాతో ఏమీ మాట్లాడలేదు. మాతో ఏమీ మాట్లాడకుండానే మేము ఎలా జీవించాలో శాసించడం మొదలు పెట్టారు. నాకు గుర్తు వుంది. మా నాయనమ్మ మా ఏరియాలో కొత్తగా స్థాంపించిన రేషన్ షాపు నుండి సరకులు తెచ్చుకునేది. తరువాత ఆ షాపు వేరే చోటకు తరలించబడింది. ఐనాగానీ ప్రజలు ఆ రేషన్ కోసం అంతంత దూరం వెల్లి సరుకులు తెచ్చుకునేవారు. అంటే ప్రజలు ఈ రేషన్ ఆహారానికి అలవాటు పడిపోయారు. వేటాడటం మరచి పోయారు. ఇపుడు ఫలితంగా డయాబెటిస్ గుండె జబ్బులు ఇంకా రకరకాల జబ్బులు. ఇవన్నీ మేము తినే ఆహారాన్ని మరవడం వల్ల వచ్చినవే. మేము ఎంత తిరిగినా ఈ దేశంలోనే తిరిగాం. వేరే దేశాలకు పోయి మేము అక్కడ మా పద్దతులను నేర్పించాలనుకోలేదు. మేము అందరి పద్దతులనూ గౌరవిస్తాం. ఈ రోజు ఆ గౌరవం లేదు. ఎందుకంటే మనం వెస్టర్న్ పద్దతులలో చదువుకున్నాం. వారి పద్దతిలో వారు మా పిల్లలను చదువుకోమన్నారు. మా పిల్లలు వారిని వారు కొత్తగా వేరేగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. నేనొక పుస్తకం చదివాను. ఒక ముసలామె రాసింది. ఆమెను ఒక మహారాణి అని అంటుంటారు. మా సంస్కృతిలో రాణులు రాజులూ ఉండరు. అదంతా పాశ్చాత్య సంస్కృతి. ఆమె ఒక పుస్తకంలో రాసింది. ఆమె చిన్న పిల్లగా ఉన్నపుడు మిషనరీ స్టేషన్ దగ్గర నివసించేదిట. ఒక చర్చి ఉండేదట. అందులో ఒక పెద్ద పుస్తకం ఉండేదట. ఆ పుస్తకంలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారట. వారు పెద్ద తోటలో నివసించే వారని అందులో రాసారట. ఆ తోటలో వారు నివసించేటపుడు అక్కడికి ఒక పెద్ద పాము వచ్చిందట. ఆ పాము వచ్చాక ప్రజలు ఒకరిని ఒకరు చంపుకోవడం మొదలు పెట్టారంట. ఆ పాము వచ్చాక వారు తమను తాము చూసి సిగ్గుపడటం మొదలు పెట్టారంట. వారు వారి శరీరాలు చూసుకుని సిగ్గుపడుతూ బట్టలతో కప్పేసుకున్నారంట. ఆమె ఏం చెప్పేదంటే..తెల్ల వారు అటువంటి పాములని చెప్పేది. తెల్లవారు వచ్చాకనే మేము మమ్మల్ని చూసుకుని సిగ్గుపడటం మొదలు పెట్టాము. మా శరీరాలను చూసుకుని సిగ్గు పడ్డాం. ఒకరినొకరం చంపుకున్నాం. మేము అల్కాహాల్ తాగడం మొదలు పెట్టాము. మాకు అంతకుముందు తెలియనివెన్నో చేయడం మొదలు పెట్టాము. తెల్లవారు మొదట మా దేశానికి వచ్చినపుడు, వారిని మేము మా పితరులుగా భావించాము. వారే ఈ రూపంలో తిరిగి వచ్చారని అనుకున్నాము. కానీ త్వరలోనే మేము గుర్తించామేమంటే మా దేశం రేప్ కి గురైందని. మా ప్రజలు రేప్ చేయబడ్డారని. వారు మా పితరులు కాదని మేమపుడు గుర్తించాం. ఈరోజు మాకు జరిగిన నష్టానికి ఇంకెవరినో బ్లేమ్ చేయవలసిన అవసరం లేదు. మా నష్టానికి మేమే కారకులం అనుకోవాలి. మేము ఇపుడు ఆల్కాహాల్ తాగుతాం. సిగరెట్ తాగుతాం. మేం చాలా ఎక్కువగా తింటాం, ఇవన్నీ చేస్తూ ఇంకెవరినో వేలెత్తి చూపడం చేయలేం. నేను మందుకీ, పొగకూ దూరమై ముప్పై యేండ్లయింది. అందరినీ అలాగే ఉండమని చెబుతుంటాను. ఎందుకంటే అది మన సంస్కృతి కాదు కాబట్టి.


ఇవన్నీ మనం ఆలోచిస్తూ క్రోడీకరిస్తే ఏమర్థమవుతుందంటే...మూల వాసులూ, మూలవాసులు కాని వారు కలిసి పోవాల్సిన అవసరం ఉంది అని. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రపంచం ముగియకుండా ఉండాలంటే ఆ పని చేసి తీరాలి. ఈ దేశం అనావృష్టిలో మగ్గుతోంది. వాతావరణం కలుషితమయింది. ఇపుడు పండిస్తున్న పంటలు ఎక్కువ నీటిని ఆశిస్తాయి. దానివలన జంతువులకు గొర్రెలకు తాగడానికి నీరు లేవు. కొంత నీరు మాత్రమే ఈ దేశంలో మిగిలి ఉంది. అన్నింటికీ మించి నీటిని జాగ్రత్తపరిచే వారు కరువయ్యారు. నదులలో నీటిని నింపడం గురించి మాట్లాడుతూ ఉంటారు. నదుల నుంచి నీటిని బియ్యం పడించడానికి పత్తి పండించడానికి మల్లిస్తుంటారు. వారికి పర్మిషన్ ఎవరిచ్చారు?. ఆస్ట్రేలియావంటి డ్రై ల్యాండ్ లో వరి పత్తి పండించడానికి ఎవరు వారికి పర్మిషన్ ఇచ్చారు?. ఆస్ట్రేలియా ప్రపంచంలో అన్నిదేశాలకంటే డ్రై దేశం. దానిలో దక్షిణ ఆస్ట్రేలియా మరీ ఎక్కువ. వరి పత్తి పండించడం. డ్యాములు కట్టడం. ఒక్కో డ్యామ్ సిడ్నీ హార్బర్ అంత పెద్దగా ఉంటుంది. చాలా నీటిని నిలువ ఉంచుకుంటారు. వరి పత్తి పొలాలకు మల్లించుకుంటారు. చాలా నీరు వృధాగా పారుతూ ఉంటుంది. ఈ దేశ మూల వాసులు వారి తోటలను పెంచుకోలేని పరిస్థితి. తాగడానికి సరిగా నీల్లు దొరకని పరిస్థితి. ఒకరోజు సరి సంఖ్యలో ఒకరోజు బేసి సంఖ్య వాహనాలలో తిరగాలి. ప్రజల జీవితాలు ఇలా మారటం చూస్తే సిగ్గేస్తూ ఉంటుంది. ఇందంతా ఏమిటనుకున్నారు?. ఇదంతా లోభత్వం. ఇదంతా స్వార్థం. నేను నా సంపాదన అనే స్వార్థం. మనం అనేది కాదు. అంతా నేను అనుకునేదే. ఈ దేశంలోనే కాదు. ప్రపంచమంతా ఇలాగే ఉంది. ఇంగ్లండ్ లో లాగా ఇంగ్లీషు మాట్లాడటం వచ్చేసింది. ఇంగ్లండు పార్లమెంటు వారికి ఈ దేశంలో ఇతర దేశాలలో సెటప్ ఉండాలి. ఇంగ్లీషు మాట్లాడేవారు కావాలి.


ప్రపంచానికి ఇపుడు మూలవాసులతో మాట్లాడే సమయం ఆసన్నమయిందనుకుంటాను. మా సంస్కృతిని కథలను వినాలి. ఈ నేల ఎందుకు సృష్టించబడిందో...ఈ నదులు కొండలూ పర్వతాలూ ఎందుకు సృష్టించబడ్డాయో తెలుసుకోవాలి. కొన్ని జంతువులు మనకు నాచీ నబడతాయి. నాచీ అంటే మా భాషలో మిత్రుడు. అటువంటి జంతువులను చంపడానికి వీలు లేదు. మనుషులు నివసించే చోట ఆ జంతువులు సుఖంగా ఉండాలి. ఇదంతా మన ప్రకృతిని కనిపెట్టుకుని ఉండటం. దాని బాగోగులు చూసుకోవడం. మనం ఈ ప్రపంచంలో కొన్నింటి బాగోగులు చూసుకోవాలి. అపుడే అవి జీవించగలుగుతాయి. అందులో కొన్ని జంతువులు ఉంటాయి. నీరు ఉంటుంది. వాటి బాగోగులు మనం చూసుకోవాలి. ఎందుకంటే మన దేశంలోని ప్రతీ భాగం మనలోని ఒక భాగం వంటిది. ఈ ప్రపంచంలోని ప్రతీ భాగం మనలో ఒక భాగం వంటిది. మనం ప్రపంచంలో ఒక భాగం. ప్రపంచంలోని మూలవాసుల నమ్మకం ఇది. ఈ భూమి మన తల్లి వంటిది. మనం దీని నుండి వచ్చాం. మరలా దీనిలోకే వెల్లిపోతాం. మనల్ని పూడ్చిపెట్టినా కాల్చివేసినా మరలా మనం మన తల్లిలోపలికే పోతాం. మా కథలు వీటి గురించి ఉంటాయి. మన దేశంలోని భాగాలను రక్షించుకోవడం. జంతువులను రక్షించుకోవడం. జంతువులు తినే ఆహారాన్ని రక్షించుకోవడం. జంతువుల ఆహారాన్ని నాశనం చేస్తే ఆ జంతువును నాశనం చేసినట్టే. ఒక జంతువును నాశనం చేస్తే నీవు దాని తినే ఇంకో జంతువునీ నాశనం చేసినట్లే. ఇది డోమినో ఎఫెక్ట్ లాంటిదే. ఒక దానిని జరిపితే అన్నీ కింద పడిపోతాయి కదా..అలాంటిదే. అందుకే మనుషులు ఆలోచించాలి. వారు చేసే పనులు దేనిని నాశనం చేస్తున్నాయో ఆలోచించాలి. యూరోపియన్లు తీసుకు వచ్చిన జంతువులు ఇక్కడ వాటిని నాశనం చేశాయి. చేపలను తినే యూరోపియన్ కఫ్ లు ఇక్కడికి ఎందుకు తేబడ్డాయి?. అవి మర్రీ నదిలోని చేపలన్నింటినీ నాశనం చేశాయి. కెయిన్ టోడ్ ని ఈ దేశం నలు మూలల్లోకి ప్రవేశ పెట్టారు. ఎందుకని?. ఇపుడు మనం ఏం చేయాలంటే కూర్చుని మాట్లాడుకోవాలి. ఆలోచించాలి. ఎవరికి వారు అన్నీ తెలుసనుకోవడం వలన లాభం లేదు. అపుడే మనం ఒకరినుంచి ఒకరం నేర్చుకోగలం. నేను మా మూలవాసులకే కాకుండా ఇతర పిల్లలకు కూడా ఈ నేల గురించిన విషయాలు నేర్పుతుంటాను. మనం ఈ భూమి మీద ఎక్కువ కాలం జీవించం. మన చుట్టూ ఉండే చిన్న ప్రదేశంలో మనం మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. ఇలా మనం ఇపుడు చేస్తే తప్ప అస్తవ్యస్తమై ఉన్న ఈ ప్రపంచం ఎపుడో గానీ తాను ఉన్నది ఉన్నట్టుగా మారడం మొదలవుతుంది. పాడైపోయిన నేలలు, నాశనం చేయబడుతున్న నదులు, సముద్రాలూ, సముద్ర జీవులూ, పక్షులూ, ఇవన్నీ రక్షింపబడతాయి. ఇవన్నిటికీ ఈ ప్రపంచంలో స్థానం ఉంది. యూరోపియన్లు మా ప్రదేశానికి వచ్చి మమ్మల్ని పనికి పెట్టుకున్నారు. ఇక్కడి నేలనూ వాతావరణాన్ని ఇంగ్లండులో ఎలా ఉంటుందో అలా తయారు చేసుకున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆ దేశం లాగా కనిపించేలా ఈ దేశాన్ని మార్చుకున్నారు. వాల్లు వారి దేశంలాగా కనిపించడాన్ని ఇష్టపడితే వారి దేశంలోనే బతకవచ్చును కదా. ఇక్కడకు రావడం ఎందుకు?. కానీ ఇపుడేం చేయలేం. మనం ఒకరికొకరం తెలుసుకోవాలి. ఒకరినుండి ఒకరం నేర్చుకోవాలి. వేరు వేరు మతాలూ, సంస్కృతులూ ఉన్నవారు ఇపుడిక్కడున్నారు. మనం అందరం కలిసి జీవించాలి. ఎవరికైనా సమస్య వస్తే ఒకరికొకరు మాట్లాడుకోవాలి. వారు మాతో మాట్లాడాలి. మేము ఎలాంటి అడ్డుగోడలూ పెట్టబోం. మాకు అడ్డుగోడలు అవసరం లేదు. మూల వాసులు శతాబ్దాల తరబడి ఎవరినీ దోచుకోలేదు. ఎవరినీ నాశనం చేయలేదు. కాలరాయలేదు. మేము అందరినీ కావాలనుకున్నాము. మాకు అందరూ కావాలి. మాకు మా నైబర్స్ కావాలి. 

నేను ప్రజలు నా మాట వింటారని నమ్ముతాను. నా మాటలతో శృతికలుపుతారని నమ్ముతాను. ప్రపంచంలోని మూలవాసుల వాణిని వినాల్సిన అవసరం ఉందని ప్రజలు గుర్తిస్తారని నమ్ముతాను. ఒకరినొకరం తెలుసుకుంటూ నేర్చుకుంటామని నమ్ముతాను. నన్ను మాట్లాడించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.  


End of interview


Translated into telugu by

 విరించి విరివింటి