Thursday, 7 January 2016

ఒకే ఒక్క మనుషుల ప్రపంచంలో వేల వేల ఊహా రేఖలు Kavitwa sandarbham 7

ఒకే ఒక్క మనుషుల ప్రపంచంలో వేల వేల  ఊహా రేఖలు.
.................................................... .................
సముద్రమొక అత్యద్భుత వ్వవస్థ. కళాకారుడి కంటికి ఏదయితే అత్యద్భుతంగా కనిపిస్తుందో, దాన్ని సింబాలిక్ గా ఉపయోగించుకోవాలనుకుంటాడు.  సముద్రం అలాంటిదే. సముద్రం ఒక కవికి ఒక్కోసారి ఒక్కో సింబల్ లాగా కనిపించవచ్చు. సముద్రపులోతు మనసుగా, కెరటాలు బాధను తెలిపే ఎమోషన్ లాగా, ఘోష ఆర్తనాదంలా కనిపించవచ్చు. నీరు కన్నీటిలా కనిపించవచ్చు. తీరం లక్ష్యం లాగా లేదా కఠిన శరీరంలాగానో అనిపించవచ్చు. అదే ఒక భావ కవికి తీరం ఆడదానిలా, సముద్రుడి కెరటాలు ఒడ్డును తాకే బలమైన కోరికల్లా కనిపించవచ్చు. సముద్రం అనగానే ఒక గంభీర దృశ్యం ఒకటి మనసులో వచ్చి కూచుంటుంది. కవి అక్కడ ఆగడు. తను చెప్పదలచుకున్న దానికోసం సముద్రపు దశని దిశనీ మార్చివేయగలడు. పరిసరాల ప్రభావం అచేతన స్థితిలో మనసులో ఒక బలమైన ముద్రని వేస్తున్నపుడు, బలవంతమైన,  తనకుతానే ఒక అత్యద్భుత వ్యవస్థ అయిన సముద్రాన్ని, లేదా ఇంకోదాన్ని తన బాధని తన వాదనని వినిపించటానికి కవి ఉద్యుక్తుడౌతాడు. తాను చెప్పదలచుకున్న ఏ విషయానికైనా ఒక నిర్దిష్టత సంపాదించుకోగలిగినపుడు, అనవసర వాక్యాల జోలికి పోకుండ, కొన్ని వాక్యాల్లోనే కవితను ముగించి, చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా విశదపరచటం సమర్థవంతమైన కవి చేయగలడు. అలాంటి కవియే దేవీ ప్రియ.

ఈ కవితలో మూల విషయం సముద్రాలను దేశాలు వాటాలు వేసి పంచుకోవటం. కవిత మొత్తం ఇదే అంశాన్ని చర్చిస్తున్నట్టుగా సాగుతుంది. ఈ మూల విషయానికి ఒక ప్రతీక స్థాయిని కలిగించే ప్రయత్నం కవితంతా గుప్తంగా సాగుతూ ఉంటుంది. సముద్రాన్ని జన సముద్రానికి ప్రతీకగా నిర్మించే ప్రయత్నం చివరిదాకా సాగి, చివరిలో గుట్టు విప్పుతున్నట్టుగా 'జనసముద్రాన్ని' బయటకు తీసుకువస్తాడు కవి. అదే సమయంలో మార్సిష్టు దృక్పథాన్ని జీర్ణించుకున్న కవిగా వర్గ సంఘర్షణని, వర్గ విభజననీ సూచిస్తాడు. చెప్పదలచుకున్న అంశం మీద కవికి స్పష్టత ఉందని అర్థం అవుతుందిప్పుడే. ఆ తిరగబడే సముద్రాలు వాచ్యార్థంలో సముద్రాలే కావచ్చు, కానీ భావ పరంగా జన సముద్రాలే. సముద్రాల జలాలని వాటా వేసుకోవటం కేవలం అప్పటి ఒక ప్రపంచ రాజకీయ చర్య కావచ్చు , కానీ దానిని మిషగా చూపిస్తూ, ప్రజల్ని వర్గాలుగా విడదీస్తున్న వ్యవస్థమీద గురిచూసి బాణం విసరటమే ఇక్కడ కవి లక్ష్యం. ఒక మూల విషయాన్ని వివరిస్తూ దాన్ని ప్రతీక స్థాయికి చేర్చుతూ,  చివరలో అసలు ఉద్దేశాన్ని బయట పెట్టడం. నాకు తెలిసినంత వరకూ ఇదొక కొత్తరకం కవిత్వ నిర్మాణ పద్దతి.

1958లో, 1960లో సముద్ర జలాల పంపకాల విషయంలో జనీవాలో చర్చలు జరిగినా, 1973 నుండి 1982 వరకు జరిగిన చర్చల ఫలితంగా  'LAW OF SEA' అనేదొకటి ఏర్పడింది. చారిత్రకంగా Maritime Boundary అనేది ఒక కొత్త కాన్సెప్ట్. కొలంబస్లూ, వాస్కోడీగామాలు ప్రపంచాల్ని కనుగొన్న తరువాత, ఒక దేశం ఇంకో దేశం మీద అధికారం చెలాయించటం నేర్చుకున్న తరువాత, ముఖ్యంగా అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో తన గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేసిన తరువాత, ఈ విషయం ప్రపంచ పటం మీద ఒక ప్రశ్నలా మొదలయింది. ఒక దేశం చుట్టూ ఉండే సముద్రంలో ఎంత దూరం వరకు ఆ దేశానికి అధికారం ఉంటుంది అనేది దేశాల మధ్య ఒక ప్రధాన సమస్యగా మారింది. ప్రతీ దేశానికీ సముద్ర తీరం వెంబడి ఒక 'బేస్ లైన్' ని ఆధారం చేసుకుని అక్కడి నుంచి పన్నెండు నాటికల్ మైళ్ళ వరకూ, ఉండే సముద్ర జల భాగాన్ని 'టెర్రిటోరియల్ వాటర్స్' అంటారు. అంటే ఈ రేఖ వరకూ ఉన్న సముద్ర భూభాగం ఆ దేశానికి సంబంధించినదే. ఈ రేఖ వరకూ సముద్రంలో ఇతర దేశాల ఓడలు కానీ, గగన తలంలో ఇతర దేశాల విమానాలూ, హెలికాఫ్టర్లు కానీ పర్మిషన్ లేకుండా తిరగటానికి వీల్లేదు. ఒక వేళ అలాంటివి తిరిగితే వాటిని పేల్చివేయటానికి ఆ దేశానికి సర్వ హక్కులూ ఉంటాయి. బేస్ లైన్ నుంచి 24 నాటికల్ మైల్స్ వరకు కంటిగస్ జోన్ (contiguous zone) అనీ, బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకూ ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ (exclusive economic zone) అనీ అంటారు. ఈ జోన్ లోని సముద్ర సహజ వనరులన్నీ ఆ దేశానికి సంబంధించినవే. జగడాలమారి ప్రపంకానికి లొసుగులు దొరకకుండా ఉండదు కదా...ఇలా ఎవరి సొత్తు వారికి విభజించి ఇచ్చినా...అసలు బేస్ లైన్ నే ఇంకాస్త ముందుకి తీసుకెళ్ళే ప్రయత్నాల్లో దేశాలన్నీ తలమునకలై ఉన్నాయని వేరే చెప్పనక్కరలేదనుకుంటాను. విచిత్రంగా సముద్ర జీవులకి వేటికీ ఈ సరిహద్దుల గురించి తెలియదు. విజ్ఞాన గని కదా మానవుడు- రేఖలు లేకపోతే ఊహా రేఖలు గీసుకోగలడు- ఊహల్లో జీవించేయగలడు.
"Marine organisms do not care about international boundaries;  they move where they will". అంటారు ఓషనోగ్రాఫెర్స్. Dante ఒక అడుగు ముందుకేసి "the sea hath no king but God alone"  అంటాడు. మనుషులకింతమంది దేవుళ్ళు కదా..అందుకే ఇన్ని గీతలు. ఊహా రేఖలు.

భూమినీ, నీటినీ ఆకాశాన్ని ఇలా చించుకుని పంచుకునే దుస్థితి బహుశా ఏ కవికీ నచ్చదనుకుంటాను. ఇలా చించి పంచుకుంటే సముద్రాలు ఘోషించవా అని కవి హృదయం అడగకుండా ఉండదనీ అనుకుంటాను. సముద్రాలు ఎవరివీ అనే ప్రశ్న ఉదయించినపుడు, 'శ్రమజలాల నదీ నదాల్ని/ సముద్రంలో సంగమింపజేసే జాలరివీరులవి'..అని చెప్పటంలో కవి ఏ మాత్రం వెనుకడుగూ వేయడనుకుంటాను. తరువాత కవితలో ఒచ్చే పదాలు 'తిమింగలాలు', 'షార్కు చేపలూ', 'అసంఖ్యాకమైన అమర కెరటాలూ' ఒక ప్రతీతాత్మక స్ఫురణతో పలికిన పదాలు. "సముద్రాలు ప్రపంచానివి కావు/ సముద్రాలదే ప్రపంచం" అని ఒక శాశ్వత సత్యంలాంటిది వ్యక్త పరిచిన కవి, కవిత చదివేటపుడు మాత్రం మనలో "మనుషులు ప్రపంచానికి సంబంధించిన వారు కాదు, మనుషులదే ఈ ప్రపంచం" అనే అవ్యక్త స్ఫురణను కలిగింప చేస్తాడు. చివరి స్టాంజా ఒక మడత విప్పినట్టుగా, పజిల్ సాల్వ్ చేసినట్టుగా చెబుతాడు.

తిరుగబడవా సముద్రాలు
భడవా వ్యాపారులు తమని భాగాలు వేసుకుంటుంటే

మరింత మరిగిపోవా
కుతకుత ఉడికే సముద్ర గర్భాలు
ఉద్యమాల రక్తంతో తడిసిన చేతులు తమని
మరింత ఉద్రేక పరుస్తుంటే,

ప్రతిఘటించవా జనసముద్రాలు
తమని వర్గాలుగా చీల్చి యేలుతుంటే,
ఒడ్డున కూర్చొని కొందరు
తమ సర్వస్వాన్నీ తాగి తూలుతుంటే.

ఈ చివరి స్టాంజాలోని ప్రతీ వాక్యంలోని ప్రతీ పదమూ ముఖ్యమైనదే. 'జన సముద్రాలు' అనే పదమే పజిల్ ని విప్పే పదం. ఇపుడు కవితనంతటినీ మరలా చదువుకుంటే అన్వయం కుదురుతుంది. సముద్రంతో మొదలైన ప్రయాణం మానవుడిదాకా అంతర్లీనంగా సాగుతుంది. ఒడ్డున కూర్చున్న కొందరు ఎవరో మనకు తెలియక కాదు, కుత కుత ఉడికే సముద్ర గర్భం ఎవరి అంతరంగమో కూడా మనకు తెలియక కాదు, కానీ ఒకటే ఆశ్చర్యం.. కుత కుత ఉడికిన ఇన్ని సముద్ర గర్భాలు ఒకేసారి ఎక్కడా లావాలాగా పెల్లుబికలేదేమని?. ఆలోచించవలసిన విషయమే.

ఘోషించవా సముద్రాలు !
...---------------........----...

ఘోషించవా సముద్రాలు
జెనీవా సభల్లో దేషాలు
తమని వాటాలు వేసి పంచుకుంటుంటే,
ప్రతిఘటించవా సముద్ర కెరటాలు
జాతీయజెండాలుఱతమ తలల మీద ఆడుతుంటే!

సముద్రాలు యెవరివి?
సముద్రాలు యుద్ధ నౌకలవి కావు
తాటి బొత్తాల పడవలవి,
సముద్రాలు దేశాధ్యక్షులవీ
నౌకా నిర్మాణ కేంద్రాల యజమానులవీ కావు,
శ్రమ జలాల నదీ నదాల్ని
సముద్రంలో సంగమింపజేసే జాలరి వీరులవి!

సముద్రాలు తిమింగలాలవీ
షార్కు చేపలవీ కావు,
నిరంతర చైతన్యంతో నీటిని జీవింపజేసే
అసంఖ్యాకమైన అమర కెరటాలవి.

సముద్రాలు ప్రపంచాధినేతల
నీలి నీలి కలలు కావు
సామ్రాజ్య సంస్థాపనాపరుల
శాశ్వత యుద్ధభూములు కావు
సముద్రాలు ప్రపంచానివి కావు
సముద్రాలదే ప్రపంచం.

తిరుగబడవా సముద్రాలు
భడవా వ్యాపారులు తమని భాగాలు వేసుకుంటుంటే,
మరింత మరిగిపోవా
కుతకుత ఉడికే సముద్ర గర్భాలు
ఉద్యమాల రక్తంతో తడిసిన చేతులు తమని
మరింత ఉద్రేక పరుస్తుంటే,
ప్రతిఘటించవా జనసముద్రాలు
తమని వర్గాలుగా చీల్చి యేలుతుంటే,
ఒడ్డున కూర్చొని కొందరు
తమ సర్వస్వాన్నీ తాగి తూలుతుంటే.

6/1/16

No comments:

Post a Comment