Sunday, 27 November 2016

చాక్లెట్ తీపి

విరించి ll చాక్లెట్ తీపి ll
--------------------------------

చిట్టి చేతులను ముందుకు చాపుతూ
నా చెల్లెలి కూతురు అడుగుతుంది..
"మామా..! చాక్లెట్ కోనీయ్యవా" అని.

ఒక అమాయకపు లోకం లోంచి
ఈ లోకం లోకి తొంగి చూస్తున్నట్టు
తను చూసే చూపుతో..
నాలో ఎన్నెన్ని ప్రశ్నలుదయిస్తాయో..!

ఐదు రూపాయల ఓ చిన్న చాక్లెట్...
తన ప్రపంచాన్నంతా ఆనందంగా మార్చేస్తుందంటే...
ఆనందం తనలో ఉందో చాక్లేట్లో ఉందో అర్థం కాకుండా ఉంటుంది.
బాల్యంలోని తీపినంతా నాలికమీద ఆ చిన్నారి చప్పరిస్తుంటే
పెద్దగైపోయామని, తీపిని మనం అసహ్యించుకోవడంలో
అర్థమే లేదనిపిస్తుంటుంది.

ఈ పసిపిల్లల ఆనందాన్ని
ఐదు రూపాయలకూ
పదిరూపాయలకూ
అమ్ముకునే దౌర్భాగ్యుడెంత ముసలివాడో..
బాల్యాన్నెంతగా మరచిపోయాడో..

బుజ్జి నాలుకనీ, బుజ్జి పెదవులనూ
తీయటి మకరందంలా చేసుకుని, పాప నా చెవిలోకి వొంపుతుంది
"మామా..! నన్ను ఎత్తుకోవా"  అని.
ఒక కంపనీని భుజాలకెత్తుకున్నాననే భావనని
ఆ చిట్టి తల్లి తేలిక శరీరం తేలిక చేసేస్తుంటుంది.

27/11/16

No comments:

Post a Comment