Tuesday, 12 May 2015

విరించి  ll ఫ్యాషన్ షో ర్యాంప్  ll
.......................................
ఆ చివరిదాకా నడిచి పోవాలంటేనే
నాకు భయం.

ఆకలిని ఆలింగనం చేసుకున్న నడుము వంపులూ
స్త్రీత్వపు సహజత్వాన్ని,
చెమట రంధ్రాలతో సహా కప్పేసే మేకప్ లూ
పొగచూరుని అద్దుకున్న కనురెప్పలూ
ప్లాస్టిక్ నవ్వల్ని పులుముకున్న పెదవులూ
ఈకలూ, టోపీలూ, బికినీలూ
సాక్స్ లూ, స్టాకింగ్ లూ
హై హీల్ చెప్పులూ, గోల్డ్ సెక్విన్ స్వెట్టర్ లూ
నావంటూ ఏవీలేని నా వంటి మీది దుస్తులూ
బలవంతపు అనోరెక్సియాలతో మిగిలిన
బలహీనపు బొమికలూ, కండలూ..
ఒక నగ్నత్వపు సిల్హట్ లాగా
ఒక కరడు గట్టిన బానిస లాగా
ఒక్క స్త్రీగా తప్ప అన్ని విధాలుగా కనిపిస్తూ..

ఫ్యాషన్ షో ర్యాంపు మీద
అడుగులో అడుగు వేసుకుంటూ
ఈ మొదలు నుండి ఆ చివరి దాకా
నడిచిపోవాలంటేనే నాకు భయం.

చర్మపు పై పొరల్ని కూడా చొచ్చుకు పోలేని కళ్ళు
నాలో అందాల్ని అమాయకంగా వెతుకుతున్నపుడు
ప్రాణ మానాలు లేని కెమెరా లెన్స్ లు
నాలో అందాల్ని అతిశయంగా పట్టుకుంటున్నపుడు
ఫ్లడ్ లైట్ల వెలుగుల మధ్యన ఎందరి కళ్ళో మెరుస్తున్నపుడు
నా మనసొక్కటే ఎందుకనో మసిబారి వుంటుంది

శ్మశానంలా పడివున్న ర్యాంప్ మీద
ఒకరి తరువాత ఒకరు కాలిపోయే
మాంసపు ముద్దలు
అందాల్ని నటిస్తున్నపుడు
నిజ జీవితపు అందాలన్నీ
శిలువెక్కిన క్రీస్తుల్లాగా ప్రవచిస్తాయి
వేసిన  ప్రతి అడుగు వెనుక
మూసుకు పోయిన ద్వారాలెన్నో వెక్కిరిస్తాయి

ఖరీదయిన వలువలన్నిటినీ
ఒక అద్దం ముందు విప్పేసినపుడు
విలువల జీవితం ఒకటి నగ్నంగా
రోదిస్తూ కనిపిస్తుంటుంది
సహజంగా కనబడే ముఖమూ
అమాయకంగా కనిపించే ప్రతి అవయవమూ
అమ్ముడు పోయిన యవ్వనాన్ని
కోల్పోయిన జీవితాన్నీ
తాగిన సిగరెట్ ముక్కనీ
పీక్కుపోయిన దేహాన్నీ
ఇవన్నీ ఎందుకని ప్రశ్నిస్తాయి

కానీ అందమనే ఫ్యాక్టరీలో
శరీరాన్నీ మెదడునీ
ఫ్యాషన్ యంత్రానికి కుట్టేసుకున్న
పిడికిలెత్తని ప్రతీ శ్రామికురాలికీ తెలుసు
ఫ్యాషన్ షో ర్యాంప్ చివరి అంచే
తన చివరి మజిలీ అని.
ఎన్ని అడుగులు ముందుకు వేస్తే
అన్ని అడుగులు వెనుకకి వేయక తప్పదని.
ఆ చివరి అంచు
ఏదో ఒక రోజు కిందకు తోయక తప్పదని

అందుకే...
ఆ చివరిదాకా నడిచి పోవాలంటేనే
నాకు భయం.

12/5/15

Saturday, 9 May 2015

విరించి ll మేలి మలుపు ll
.....................................
మన మానవాత్మని మేల్కొల్పే
కొత్త చూపొకటి అక్కడ ఇరుక్కుని వుంది.
పలుగూ పారల్లాగా
మనమిద్దరమే ఇక పనిచేయాలి

రాగ ద్వేషాల్నీ, నిమ్నోన్నతాల్నీ వదిలి
హృదయాన్నొక్కటినే చేత పట్టుకుని
మనమక్కడికి చేరుకోవాలి.

చరిత్ర శిల్పం పగుళ్ళ లోంచి
వేదన లా బంక కారిపోతున్నపుడు
భవిష్యత్తు శిల్పం
ఒక స్పందనలా మనలో
గూడు కడుతున్నపుడు
దేవుడు పంపిన వర్తమానాన్నే
మన చేతుల్లో చదువుకోవాలి.

నినదించే పెదవుల మీద పాటలు పొంగినపుడు
కష్టించే చేతుల మీద చెమటలు మొలిచినపుడు
మన ఆచరణకి పుట్టిన బిడ్డలుగానే వాటిని గుర్తించాలి.

ఈ శరీరపు గోడలూ
తలుపులూ కిటికీల కింద
నలిగే పునాదుల్లో...
రెండు గట్టి ఇటుకల్లాగే
నీవూ నేనూ కలిసుండాలి

మన మానవాత్మల్ని
మంచి ముత్యాలుగా
కనుగొనబోయే మనం
మొదట రెండు
నత్త గుల్లలమే కావాలి

ఈ సమాజ శరీరంలో
మన ఆత్మోదయం
ఒక మేలి మలుపు కావాలి

9/5/15
విరించి ll  మధ్యాహ్నపుటెండ ll
.... .................................
ఈ రోజు మధ్యాహ్నం
ఆకాశాన్ని పిడకలమీద కాల్చినట్టుంది
పసరు వన్నెలతో తేలాల్సిన వెన్నెల
కాసింత మసిబారినట్టున్నది.

ఒక అందమైన పూవులాగా
వికసించాల్సిన ఈ రాతిరిని
ఏ మాత్రమూ కదలని మేఘాలూ
ఏ లక్ష్యమూ లేని గాలులూ
విడిచిన బట్టలు మోసే
గాడిదల్లానే మోస్తుంటాయి

చింతచెట్టు మీద పీనుగులా
నిదురకు వేలాడే నేను
ఒక స్వప్నపు భుజాన్నెక్కిన ప్రతీసారీ
ఏ జవాబూ లేని ప్రశ్నగానే
ఎగిరి పోతుంటాను

ఏ దీపాన్నీ వెలిగించలేని కన్నీటి చమురుతో
చీకటి ముసురు గడ్డకట్టినపుడు
చేతికి చిక్కిన ఈ కొన్ని మిణుగురులను
తూరుపు విత్తులుగా విసిరేస్తాను
ఈ మసిబారిన వెన్నెలతో విసిగి  పోయిన నేను
ఆ మధ్యాహ్నపుటెండలోనే నిదురిస్తాను
ఆ చెమటల్లోనే ఇక స్వప్నిస్తాను.

8/5/15
విరించి  ll ఇలా చెయ్యి. II
....................................
నిజాన్ని అలా నిప్పులమీద
ఎంత సేపని కాలుస్తావు?
బాంబు పెట్టి పేల్చు
అబద్దాలు వినే కర్ణభేరీలైనా పగులుతాయి

ఈ బుసలాంటి శబ్దాల్ని ఎంత సేపని
అలా అరుపుల్లాగా గాలిలో ఎగరేస్తావు?
ఒక కాగితం మీదికి ఊదిచూడు
పిడికిలెత్తిన గుండెల్నైనా అదిలిస్తుంది

ఈ మర్మావయవపు పుండు మీదే కదా
మార్మికతనంతా ప్రవచిస్తావు
నగ్న సమాజాన్ని అనుభవించి చూడు
నిర్వికార వ్రణమొకటి ఉదయిస్తుంది

అక్షరాల్ని అన్నం మెతుకుల్లాగా
ఎంతకని పొట్లంలో దాచుకుంటావు?
పొట్లం విప్పిచూడు
అక్షరాలా అవి దాడి చేస్తాయి.

అగ్ని స్నానం చేసే పదాల పంక్తిని
ఎంతకని ఉఫ్ఫున ఊదుతుంటావు
గుండెలకి హత్తుకుని చూడు
కొత్త జన్మలోకి పుట్టుకొస్తావు.

9/5/15



Tuesday, 5 May 2015

విరించి//   రాముడికి ఆంజనేయుడు.//

అది మా ఊరు. పల్లెటూరు. చాలా కాలం తరువాత ఎర్ర బస్సులో మా ఊరిలో దిగాను. బస్టాండు కొత్తగా కట్టారు. కానీ ఊరు పాతగానేఉంది. ఊర్లో జనాలూ పాతవారే. కానీ ఇంతకు ముందులా కలిసి ఉన్నారో,ఎవరికి వారే అయ్యారో సిటీ లో లాగా.."ఏం విరించీ..తాతను చూడ్డానికొచ్చావా, పెద్ద డాక్టరువయ్యావంట". కేకవేసాడు కిరాణా షాపులోనుండే. ఆయన పేరేదో ఉంది. వెటకారంగా అడిగాడా, ఇన్ఫర్మేషన్ కోసమడిగాడా, కన్ఫర్మేషన్ కోసమడిగాడా..ఏమో అడిగేసాడు. జవాబు చెప్పినా ఊర్కున్నాడా...ఏదో తన కూతుర్నిచ్చి ఇప్పుడే పెల్లి చేసేస్తానన్నంత ఇంటరాగేషన్. ఆయనకి కూతురుందో లేదో ..అది వేరేసంగతి.. ఎందుకడుగుతున్నాడో..అడుగుతున్నాడు కాబట్టి నేనెందుకు చెబుతున్నానో..చెప్పేవాడికి వినేవాడు లోకువలాగా లేదు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువలాగా ఉంది. సరే..ఈ ఊరు మారనంత వరకూ ఈ మనుషులు మారరనుకున్నాను. ప్రపంచం గ్లోబల్ విలేజ్..కానీ నా విలేజ్,అదే ఓ ప్రపంచం.  అవే రోడ్లు ,అవే సందులు, అవే పందులు. మారిందల్లా ఇండ్లమీద డీటీహెచ్ ఆంటెన్నాలు. అపుడే కనబడ్డాడు నా చిననాటి స్నేహితుడు రామాంజనేయులు. పలకరింపులో వెరైటీ, ఏదో రోజూ ఆఫీస్లల్లో లాగా కాజువల్గా పలకరించేసాడు. చాలాకాలం తరువాత కలిసినపుడు కల్లల్లో ఆశ్చర్యం, గొంతులో అద్భుతం ఇలాంటివేమీ లేకుండా పలకరిస్తే ఎక్కడో కాలుతుంది. నాకూ కాలింది. కానీ వాడి తాతకి చేయి కాలిందట. నన్ను ఒచ్చి చూసి మందులు రాసీయమని అడిగేసాడు. తప్పుతుందా..తరువాత ఒస్తానని చెప్పి తప్పించుకున్నాను.

నేను మారిపోయానా..? డాక్టరునని గర్వం ఎక్కిందని తాత ఇంటికొచ్చిన వాల్లు నాతో కాసేపు మాట్లాడినాక నిర్ధారించుకుని గుసగుసలాడుకుంటున్నారు. పల్లెటూల్లలో గుసగుసలకే నోల్లెక్కువ. అందులో నాకు పాము చెవులు, వినికిడెక్కువ. పల్లెటూర్లని మార్చగలమా..నా పిచ్చిగానీ కొన్ని రోజులుంటే నన్నే మార్చేసేలా ఉన్నారు జనాలు. ఒదిలేస్తే ప్రతీ ఒక్కల్లూ సలహాలిచ్చేవారే. ఈ పల్లెటూర్లో హాస్పిటల్ కట్టాలంటాడొకడు, పల్లెరుణం తీర్చుకోవాలంటాడింకొకడు. సిటీకొచ్చి ఒకసారి తప్పిపోయాడంట అందుకే సిటీ వేస్ట్ అంటాడు ఇంకో పెద్దమనిషి. మందులు రాసిస్తే, ఇంజక్షన్ ఇవ్వమంటాడు. ఇంజక్షన్ ఈయకపోతే వాడు డాక్టరే కాదు అనేది ఈ మనిషి లాజిక్. ఏంటీ ఉత్త గుండెకే డాక్టరువా..ఇంకేమీ చూడవా..మావోడైతే అన్ని చూస్తాడు పెదవి విరిచాడు ఇంకో మోతుబరి. ఇంతకీ మీవోడేమి డాక్టరయ్యా అంటే RMP  అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నంత గర్వంగా చెప్పాడు. గుండె జబ్బులు ఎవరికోగానీ రావు..ఏమి సంపాదించుకుంటావబ్బా..కష్టమే సందేహంవెలిబుచ్చాడు ఒక పెద్దాయన. డాక్టరంటే ఇంజక్షన్ ఇచ్చి ఇరవై రూపాయలు జేబులో ఏసుకునేట్టు వుండాల గానీ ఇదేందబ్బా..పెద్ద తప్పు పని చేసినవ్..అంటాడు ఇంకో పెద్దాయన. చదువుకున్న పాపానికి ఈ రేంజ్ లో పల్లె సమాజం కక్ష సాధిస్తుందనుకోలేదు. వీల్ల మాటలు చెవిలో జోరీగలనుకుందామంటే, కరెంటు కోతల పుణ్యానికి నిజంగానే జోరీగలు. ఇలా కాదని బయటకి వెల్తే, ఎక్కడపడితే అక్కడ నిలబెట్టి ఇంటర్వ్యూలు. ఆఖరికి ముక్కు మూసుకోవాల్సిన బహిర్భూమిలో కూడా ముక్కుతూ ఇంటరాగేషన్లు. ఊఊ..ఎక్కడ చదివినవ్...ఊఊఊ...ఏం చేస్తున్నావ్...పైనొక ప్రవాహం కిందొక ప్రవాహం ఒకేసారి వదలడానికి నేనేమన్నా నాగార్జున సాగర్ డ్యాం నా..?  గ్రామ స్వరాజ్యం మాట గాంధీతోనే పోయినా, గ్రామ ఇష్టారాజ్యం ఎప్పటికీ పోయేట్టు లేదు. ఇక్కడ మనుషులే తేడా అనుకుంటే మధ్య మధ్య లో గ్రామ సింహాలు. ఎప్పుడెందుకు మొరుగుతాయో అర్థంకాదు. కూలింగ్ గ్లాసులు కల్లకే కాదు శరీరంలో ఎక్కడ పెట్టుకున్నా మొరుగుతాయి. ఏమంటే ఎక్కడ కరుస్తాయోనని దించిన తల ఎత్తకుండా నడుస్తూ పోతున్నానా..ఒకే ఒక్క సిటీ పోకడ కనబడింది. టవంటీ ట్వంటీ మాచ్ని, ట్వంటీ మెంబర్స్ పైగా నిలబడి చూస్తున్నారు. విజన్ ట్వంటీ ట్హంటీ అంటే ఒకప్పుడు అర్థంకానిది ఇప్పుడయ్యింది. ఆ ఇరవై మందిలో ఒకడు రామాంజనేయులు. సచిన్ సిక్స్ కొట్టినట్టున్నాడు ఆనంద బూతులు తిడుతున్నాడు. డిటైల్స్ ఒద్దులేకానీ బూతుల నానా రక ప్రయోగాలు, సంధులూ, సమాసాలూ,  అలంకారాలూ ఎన్నుంటాయో..అ ఇ ఉ ఋ అనెడి అచ్చులకు అవే అచ్చులు పరమగునపుడు దీర్ఘమేకాదేశముగా వచ్చును..చిన్ణప్పటి సవర్ణ దీర్ఘసంధి డెఫినిషన్ మల్లీ గుర్తుకొచ్చింది. డాష్ డాష్ డాష్ బూతులకు అవే బూతులు పరమగునపుడు దీర్ఘ బూతులనేకము ఆవేశముగా వచ్చును అనే విషయం సచిన్ అవుటయితేగానీ నాకు అర్థం కాలేదు. ఎక్కడ నన్ను చూస్తాడోనని చూడనట్టే వెల్తున్నా..అనుకున్నామని అన్నీ జరుగుతాయా.."ఏం విరించీ ఎక్కడికి"...ఎక్కడికని చెప్పాలి..? "నా బొందకి రా... నా బొందకి" అందామనుకున్న , అందామనుకున్నవన్నీ అనేస్తామా..ఇందాకా చూసిన బూతుల వెల్లువ గుర్తుకొచ్చి ఆగిపోయాను. ఏనోట్లో ఏ నాలికుందో తెలియకపోతే వేరే పరిస్థితి. తెలిసినాక కూడానా..ఆ మాత్రం తెలివుందిలే అని నాలో నేను నవ్వుకున్నా..అల్ప సంతోషిని.

అలా వెల్లి ఆంజనేయ స్వామి గుడిలో కూర్చున్నాం. హైదరాబాదు విషయాలు చెప్పమంటాడు. ఏం చెప్పాలి.? ఏదో ఒకటి చెప్పాను. ఏమి చెప్పినా కంపేర్ చేస్తూ పల్లెనే గొప్పదంటాడు.గట్టిగా నవ్వేస్తున్నాడు.  సరేలే ఎవడి ఆనందం వాడిది. వాడి నవ్వులో వెటకారం కన్పిస్తుంది. నా సామాజిక కల్లకి వాడి నవ్వులో అణచివేత కన్పిస్తుంది. ఆకాశంమీద పడి పీక పిసికితే చక్కిలిగింతనుకుని నవ్వుతున్నట్లున్నది. నా డాక్టరు కల్లకి వాడి నవ్వులో రోగం కనిపిస్తున్నది. వొల్లంతా పాకిన విషజ్వరం ఈ మధ్యనే వొదిలినట్లున్నది. ఎన్ని మాఢనమ్మకాలు వాడిలో. వాడిని ఎన్నిటికో బానిసను చేసిన ఘనులెవ్వరు.?  సరేలే ఒదిలేద్దామంటే చిన్ననాటి మిత్రుడు. అవును పల్లె జీవితంలో మార్పు రాలేదు. అవే కష్టాలు. గ్రామం మారదు. దాని చుట్టూ లక్ష్మణ రేఖలు. కాపిటలిస్ట్ ప్రపంచంలో గ్రామం ఒక ముక్కలయిన కమ్యూనిష్టు రష్యా. సిటీ అగ్రవర్ణం కింద, గ్రామం అణచివేయబడ్డ దలిత వర్గం. వాడికి సిటీ అంటే నిజానికి భయం..అందుకే అది కనిపీయకుండా వెటకారం. గ్రామాన్ని సిటీ చేస్తామనే పెద్దలకు వీడి భయం కనిపించదు. గ్రామాన్ని మౌనంగానే ఉంచి సిటీల్లో చిందులేసే పెద్దలకు వీడి వెటకారం వినిపించదు. వాడిలో నాకు మూర్ఖత్వంగా కనిపిస్తున్నదంతా వాడికి పరతత్వంగా అనిపిస్తుంది. జీవితంనుండి ఎంతో పలాయనత్వం కనిపిస్తుంది. వాడి మాటలు నిజంగానే నన్ను మారుస్తున్నాయి.

సరే నేను వెల్తా అని వెల్లిపోయాడు. ఒంటరిగా కూర్చున్నాను. ఆంజనేయ స్వామి గుడి ముందర, రావి చెట్టుకింద. చిన్నప్పుడు ఇదే చెట్టుకింద రామాయణం ఆట ఆడుకునేవాల్లం. నేను రాముడు. రామాంజనేయులు ఆంజనేయుడు. ఋష్యమూక పర్వతం లో రాముడు ఆంజనేయున్ని చూడటం. గుర్తుపట్టడం. వాలి వధ. సీతమ్మ కోసం రాముడి ఆరాటం. ఆంజనేయుడి ఓదార్పు. సీతమ్మని వెదకడం.  ఆంజనేయ రాయబారం. లంకా దహనం. సీతజాడ రాముడికి చేరవేయడం. రామేశ్వరంలో రామసేతు నిర్మాణం. లంకా పయనం. లక్ష్మణ స్వామి మూర్ఛ. సంజీవినిని తేవడం. అన్నిటికంటే ఎక్కువసేపు ఆడేది  రామ రావణ యుద్దం. బాణాలు వేసుకోవడం. ఆంజనేయుడు గదతో యుద్ధం చేయడం. ఆ తరువాత రావణ సంహారం. సీతాసమేతుడై రాముడు ఆంజనేయుడి భుజములమీద అయోధ్య చేరడం. రామ పట్టభిషేకం. చివరి ఘట్టం ఆంజనేయుడు రాముని కౌగిలించుకొమ్మని కోరిడం. రాముడు కౌగిలించుకోవడం. అప్పటి ఆ కౌగిలింతలో ఎంతటి స్నేహం, ఈ ఘట్టం కోసం ఇంత ఆటా ఆడుకునే వాల్లం. ఒకరి కోసం ఒకరం ఆనంద మొగ్గలై విరబూసేవాల్లం. ఏమయిందీ రోజు..? ఎంతగా మారిపోయాం. ఒకరికొకరం కాకుండా పోయాం. ఎవరిదార్లో వాల్లం పోతున్నాం.

నేను హైదరాబాదు కి పయనమయ్యాను. తాత ఇంటినుండి బస్టాండుకి అర కిలోమీటరు పైనే. నడవాలి. ఈ గ్రామం నాదనలేక పోతున్నా. ఏ మార్పూ ఇక్కడ రానందుకు నా వూరు, పేరు పెద్ద హైదరాబాదని అబద్దాలు చెబుతున్నా. నిజంగానే నేను మారాను. నా ఊరినుండి విడిపోయాను. వేరు పడ్డాను. వేరేవాణ్ణయ్యాను. "విరించీ..నీ అడ్రస్సు ఇవ్వు హైదరాబాదు కొస్తే కలుస్తం"... "విరించీ.. నీ ఫోన్ నంబరు ఇవ్వు హైదరాబాదులో నీ హాస్పిటల్కి మా నాయనమ్మని తీసుకొస్తం".. "విరించీ..నీ మందులు బాగా పనిచేసినయ్..మా నాయన సల్లగా ఉండాల"...."విరించీ ..అప్పుడప్పుడొస్తూ వుండు ,అమ్మానాయనల్ని అడిగినట్టుచెప్పు" ... "ఏం గుర్తు పట్టలా...అయ్యోల్ల పిల్లగాడు..పెద్ద డాక్టరయినాడు. మంచోడు" .... నిజమా..? అంతకుముందు ఎంక్వైరీలనుకున్న , కాదు ఇపుడు అర్థమైంది. తమవారి గురించి పల్లె జనానికున్న ఆరాటం. ఆనందం. అపార్ట్మెంటుల్లో అపరిచితులం. కాబట్టే పల్లె పరిచయాల కి దూరమై వున్నాం. బస్టాప్ వెల్లే వరకు ఎన్ని గొంతులు. బస్ కోసం ఎదురు చూస్తున్నా. దూరంగా రామాంజనేయులు. ఉరుకుతూ ఒస్తున్నాడు. చెప్పు ఊడి పోయినట్టున్నది. ఈడ్చుకుంటూ ఉరుకుతున్నాడు. ఆగు ఆగని సైగ చేస్తున్నాడు. అపుడు గుర్తుకి వచ్చింది. వాల్ల తాతని చూసి మందులు రాయమన్నాడని. ఇపుడొచ్చేది లాస్ట్ బస్సు , ఇది మిస్ అయితే, రేపే. ఇపుడు నన్ను వాల్ల తాత దగ్గరికి రమ్మని బలవంతం చేస్తాడా..ఇంతలో హైదరాబాదు బస్సు ఒచ్చేసింది. రామాంజనేయులు కూడా ఒచ్చేసాడు. ఉరుకుతూ రావడం వల్ల రొప్పుతున్నాడు. "ఏం విరించీ వెల్తున్నావా..ఇంటికి పోతే తాత చెప్పాడు ఇపుడే బస్టాండుకి పోయావని. అందుకే బెగీత ఒచ్చినా. థ్యాంక్సబ్బా...ఒచ్చినందుకు". చేతిలో చేయి వేసి చెబుతున్నాడు.  "నిన్న గుడికాడ నీతో మాట్లాడినాక బాగనిపించింది. ఏదైనా మాట్లాడుకుంటెనె కదబ్బా బాధలు తగ్గుతై. పోయిరా...మల్లీ ఎప్పుడొస్తావ్. ఈపారి శానా దినాలుండాలె చూడు. నీతో శానా మాట్లాడాలె"... బస్సు హారన్ మ్రోగుతోంది. సరేబ్బా పోయిరా..చేయి తీసాడు. నా చేతిలో ఆకు వుంది.  ఇదేంటిది అని అడిగాను. "ఆంజనేయస్వామి గుడిది. రావి చెట్టు ఆకు. మర్చిపోయినవా. ఇది పుస్తకాల్లో పెట్టుకుంటే చదువు బాగొస్తదని చెప్పేటోడివి. నీకోసం తెచ్చినా. నీవు గొప్ప డాక్టరువి కావాలబ్బా. నా కోరికచూడు"... బస్సు కదులుతోంది. సరే పో..మల్లా రా.. బస్సు ఎక్కాను. చేతిలో ఆకు ఉంది. రామాంజనేయులు తాత చేయి కాలింది. వాడి తాత విషయం నేను మరచినా వాడు అడగలేదు. అడగకుండా అవమానించాడు. వాడు చేయి ఊపుతున్నాడు. నేను చేతికందకుండా పోతున్నాను. ఆంజనేయున్ని వదిలి రాముడు పోతున్నాడు. ఆంజనేయుడు ఆంజనేయుడిలాగే ఉన్నాడు. రాముడే మారాడు. డ్రైవరు సీటు వెనుకాల పలకమీద రాముడు ఆంజనేయున్ని కౌగిలించుకుంటున్నాడు పటంలో. రామ స్వామి ముఖం చూడలేకపోతున్నా. ఆంజనేయుడి కల్లల్లో ఆ కౌగిలింత తాదాత్మ్యత చూస్తున్నా.

16/11/12.
విరించి //  బ్రెయిన్ డ్రెయిన్// story.

ఆ రోజు ICCU లో నైట్ డ్యూటీ. కుర్చీలో కూర్చుని కునుకు తీస్తున్ణ నాకు ఒక పెద్ద అరుపుతో మెలకువ వచ్చింది. చూస్తే సిస్టర్ ఒక పేషంట్ కి ఐవీ కాన్యులా పెడుతోంది. వెల్లాను. వెయిన్స్ దొరకడం లేదు సర్, మీరు ట్రై చేస్తారా అని సిస్టర్ నా మీద భారం వేసేసింది. మనిషి లావుగా ఉండటం వల్ల   దాని మీద వల్లంతా ఎడిమా రావడంవల్ల నరాలు దొరకడం లేదు. పాపం ఆ పెద్ద మనిషి గట్టిగా అరుస్తోంది నొప్పికి. ఆమె తో పాటు వచ్చిన ఆమె కొడుకు చోద్యం చూస్తున్నట్టుగా నిలబడి ఉన్నాడు. "సర్ మీరు ఇలా వచ్చి ఆమె పక్కన నిలబడి ఆమెను కాస్త పట్టుకోండి". అని చెప్పాను. "డబ్బులు పాడేస్తున్నాంగా..ఈ పని మీదా మాదా..?" అన్నట్టు ఒక్క చూపు చూసాడు. నొప్పి ఉన్నపుడు మనవాడు ఎవడన్నా మన పక్కన ఉంటే బాగుంటుందనిపిస్తుంది ఎవరికైనా. ఆ విషయం వాల్ల కొడుకు కి తెలియదు. చెప్పే ఓపిక నాకూ లేదు. నరమయితే దొరికింది. హిస్టరీ తీసుకుని ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేసే సరికి రాత్రి మూడు గంటలయ్యింది. బాగా నీరసంగా వుంది. కాస్త పడుకుందా మనుకునే సరికి, బెడ్ నం వన్ పేషంట్ కార్డియాక్ అరెస్ట్. గైడ్లైన్స్  CPR చేసాము. లాభం లేక పోయింది. అందునా ఎనభై దాటి వుంటాయి. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్, వెంటిలేటర్ మీద వుంది. వాల్ల అటెండర్స్ కి విషయం చెప్పడానికి ఫోన్ చేస్తోంది హెడ్ సిస్టర్. ఎన్ని సార్లు చేసినా ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇపుడు ఈ ముసలావిడ డెత్ డిక్లేర్ చేయాలి. ఈ పేషంట్ అటెండర్స్ ఇంత నెగ్లిజన్సీ తో వుంటే ఎలా. ఆల్టర్నేట్ ఫోన నంబర్ కూడా ఇవ్వ లేదు. నేనూ ట్రై చేసాను. లాస్ట్ కి ఒకతను ఎత్తాడు. మాంచి నిద్రలో ఉన్నట్టున్నాడు. "ఏమయ్యా ఐ సీ సీయూ లో పేషంట్ని పాడేసి మీరు ఇంట్లో పడుకుంటే ఎలా. ఇక్కడ ఆమె కి సీరియస్ గా వుంది. మీరు వెంటనే రండి"  అని చెప్పి కోపంగా పెట్టేసాను. రెండు నిమిషాల్లో ఒక ముసలతను హడావిడీగా ఒచ్చాడు. నేను ఫోన్లో కోప్పడింది ఈ పెద్ద మనిషినైతే కాదు కదా అనుకున్నాను. "క్షమించండి డాక్టర్ గారూ...వారం రోజులుగా నిద్ర ఉండటం లేదు. అలా కుర్చీమీద కూర్చునే సరికి నిద్ర ఒచ్చేసింది..మా ఆవిడ కండీషన్ బాగా లేదా...?" ఎంతో వినయంగా అడుగుతున్నాడు. ఏం చెప్పాలి. చనిపోయిందని చెప్పాలా.? "అవునండి బాగాలేదు. చివరి ప్రయత్నం చేస్తున్నాము. మీకు ఏ విషయమూ కాసేపట్లో చెప్తాము" అన్నాను. ఒక సారి యేంటో అన్నట్టు చేతులని తిప్పి, పైకి చూసి దండం పెడుతున్నాడు. ఒక నిముషం కింద ఆయన కల్లల్లో వుండే ఆశ ఇప్పుడు లేదు. ఒకరకమైన పిచ్చిచూపుల్లా అనిపించింది. ఆయన బాధ పడుతున్నట్టు వేగంగా తీస్తున్న శ్వాస, పండ్లు లేకపోవడం వల్ల రెండు పెదవులూ కలుసుకున్నప్పుడు వచ్చే శబ్దమూ చెబుతున్నాయి.  ఆమె బెడ్ చుట్టూ కర్టెన్స్ వుండటం వల్ల ఆయనకి ఆమె చనిపోయిందనే విషయం తెలీదు. నేను మల్లీ బెడ్ దగ్గరికి పోయాను. ఇద్దరు సిస్టర్స్ నా ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఆ బెడ్ దగ్గరే చెరొకవైపు నిలబడుకుని ఉన్నారు. కర్టెన్ కి ఇటువైపు ఈమె మరణం..అటువైపు ఆయన ఆశ మరణం. రెండింటి మధ్యలో నేను. వారధిని. ప్రాణం పోసే వాడయినా తీసే వాడయినా దేవుడే..డాక్టర్ దేవుడి పనికి చేతి సహాయం మాత్రమేగా చేసేది.

కాసేపట్లో డిక్లేర్ చేసాము. ఆయన కి ఫ్లాట్ లైన్ ఈసీజీ చూపించాను ఇక నో మోర్ అన్నట్టు. ముఖం చిన్నదిగా చేసాడు. ఆయనలోని బాధని సిస్టర్ అర్థం చేసుకున్నట్టున్నది. ఓదార్చడానికని భుజంమీద చేయి వేసింది. అలా ఒక ఆసరా దొరకగానే ఆయన లో బాధ ఏడుపులా బయటికొచ్చింది.  అది జీవితాన్ని చూసి నవ్వుతున్నట్టుగా వుంది. "పోయిందమ్మా...నా జానకి నన్ను వదిలి పోయిందమ్మా...." పీలగా ఉన్న ఆయన శరీరంలో మనసు కూలబడిపోయినట్టన్నది. "నేను ఆమెని ఇక చూడలేనమ్మా ...ఎట్లారా భగవంతుడా...వేంకటేశ్వరా...."  ఇంత బాధని ఈ ముసలి దేహం ఏం తట్టుకుంటుందో అనిపించింది. ఆయనని ఓదార్చి బయటకి తీసుకెల్లాను. వంగి పోయివున్న ఈయనకి ఇక ఆసరా ఎవరున్నారో అనుకున్నాను.
మిగతా ఫార్మాలిటీస్ లో భాగంగా ఆమె డెత్ సర్టిఫికేట్ ఫిల్ చేస్తున్నాను. "సర్ ఆ ముసలావిడ చూసారా ఎంత అందంగా వుందో..ఆమె చనిపోతే బాధగా వుంది సర్" . వారం రోజులుగా దగ్గరుండి ఆమెకు సేవలు చేస్తున్న సిస్టర్ కల్లు చెమర్చాయి. "ఆమె గొప్పటి వీణా విద్వాంసురాలట సర్"  ఇంకో సిస్టర్ గుర్తు తెచ్చుకుంది. ఒక్కసారి ఆమె ముఖం చూసాను.పసుపు పచ్చటి మేని ఛాయ. నిండయిన శరీరం.  నిజమే. చేతిలో వీణ వాయిస్తూ ఈమె నవ్వుతూ వుంటే సరస్వతీ దేవిలా ఉంటుంది. అయినా బ్రహ్మ రాత తప్పదు కదా. ఐ సి సియు లో ఫోన్..."డాక్టర్ గారూ..నా పేరు రమాకాంత్. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్  ఫ్రం USA ..జానకమ్మ గారి రెండో సన్ ని...ఆమెకి నేనే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నది. ...ఆమె పోయిందట కదా డాక్టర్....ఓ షిట్...ఇపుడెలా డాక్టర్....సరే..ఓ పని చేయండి...మార్చురీలో పెట్టేద్దాం....ఫ్రీజర్ ఉంది కదా....ఓకే...నో ప్రాబ్లం...ఎంత ఖర్చయినా నో ప్రాబ్లం ...ఎందుకంటే ఆమెకి ట్రీట్మెంట్ ఇప్పించ్చేది నేనే.....థ్యాంక్యూ డాక్టర్...సీ యూ...." నేను yes, ok పదాలు తప్ప పెద్దగా మాట్లాడిందే లేదు. మరి కాసేపట్లో ఇంకో ఫోన్. "డాక్టర్ గారూ..అయామ్ రాజారాం....విషయం ఇప్పుడే తెలిసింది...సరే చేసేదేముంది..వయసొచ్చింది....ఆ ..నేను ఆమె పెద్ద సన్ ని. సైంటిస్ట్ ఫ్రం USA ...ఒక త్రీ ఫోర్ డేస్ కి మనకి మార్చురీ ఉంటుంది కదా....సేఫ్ సైడ్....ఎందుకంటే...నేను కాన్ఫరెన్సలో స్ట్రక్ అయ్యేలా వున్నాను....థ్యాంక్యూ డాక్టర్."  మల్లీ సేమ్ యస్ , ఓకే తప్ప పెద్దగా ఏమీ నేను మాట్లాడింది లేదు. విషయం నాకు అర్థం అయింది. బాడీ మార్చురీకి షిఫ్ట్ చేయబడింది.

డాక్టరుగా ఇలాంటి మరణాలు చూసీ చూసీ మనసు మొద్దుబారిపోతుందా యేమి. రోజూ ప్రపంచంలో  ఎంతో మంది చనిపోతూనే ఉన్నారు. కానీ మారుతున్న పరిస్థితుల్లో హాస్పిటల్లోనే ఎక్కువ మరణాలు. దీనికర్థం హాస్పిటల్స్ బాగా పెరిగాయి అనే కదా. సగటు జీవన కాలం పెరుగుతూ పోతోంది. అయినా కానీ డాక్టర్ల వల్లే మరణాలు జరుగుతుంటాయని మనుషుల నమ్మకం కాబోలు, ఒక రకమైన దాడిలాంటిదేదో రిసెప్షన్లో జరుగుతావుంది. ఒక పెద్దమనిషి డాక్టర్ల మీద దాడి చేయ ప్రయత్నిస్తున్న వ్యక్తికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. "పుట్టించే దేవుడే మనిషిని చంపుతున్నాడు. అలాంటి దేవుడికి మనం గుల్లు కట్టి పూజిస్తున్నాం. కానీ..మనం చచ్చేటపుడు బ్రతికించాలని తాపత్రయ పడే ఒక డాక్టరును నిర్దాక్షిణ్యంగా నిందిస్తున్నాం...దాడులు చేస్తున్నాం...ఇదెక్కడి న్యాయం..? "  చావులెంత చూస్తున్నానో దాడుల్నికూడా అంతే చూస్తుంటాను, నిత్యజీవితంలో భాగం లాగా.  మనుషులు కదా..ఆలోచించలేరని సర్ది చెప్పుకోవడమే. అందరి చూపూ ఈ గొడవ మీద వుంటే..మూలకి కూర్చున్న ముసలాయనకి ఇవేమీ పట్టనట్టున్నది. ఏదో లోకంలో ఉన్నట్టున్నాడు. నిర్లిప్తంగా..ఎవరో కాదు. జానకమ్మ గారి భర్త. ఇదేంటీ ఆమె చని పోయి అయిదు రోజులైంది..ఇక్కడున్నాడేంటి అనుకుని పోయి పలకరించాను. గుర్తు పట్టినట్టు లేడు. USA నుండి కొడుకులింకా రాలేదట. బాడీ మార్చురీలోనే వుందట. తరువాత రెండు రోజులు కూడా గమనిస్తూనేవున్నా. పేషంట్ లాంజ్ లో కూర్చునే ప్లేస్ మారుతుందే తప్ప వ్యక్తి మారట్లేదు. ఒక్కడే కనిపిస్తుంటాడు, చకోర పక్షిలా. ఆ మరుసటి రోజు సాయంత్రం డ్యూటీ అయిపోయాక ఇంటికి వెల్తుంటే, హాస్పిటల్ బయట ATM దగ్గర కనబడ్డాడు. పలకరించాను. పెద్దగా స్పందించలేదు. డబ్బులు జోబిలో పెట్టుకుని ఆటో కోసం చేయి చూపుతున్నాడు. ఆయన ఇంటికొకసారి పోవాలట. ఆరా తీస్తే మా ఇంటికి పోయే దారిలోనే వారి ఇల్లు. నా కార్ లో రమ్మన్నాను. కృతజ్ఞతతో ఒక్కసారి చూసి ఎక్కేసాడు. కార్ స్టార్ట్ చేసాను. కాసేపు దూరం పోయాక అదే నవ్వులాంటి ఏడుపుతో కుల్లుకొని ఏడుస్తున్నాడు. నా దిక్కు చూసి "యెవరూ రాలేదండి...ఆ మహా ఇల్లాల్ని చూడటానికి ఎవరూ రాలేదండి."  ఆ చివరి మాటలు అనలేక పోతున్నాడు. " ఆ చేత్తో ఎంత మందికి అన్నం పెట్టిందండి...అన్నపూర్ణండీ...వీణా సరస్వతండీ...కానీ ఎవరూ రాలేదండీ...జానకీ....!!" బోరుమని ఏడ్చాడు.." చూడండి...డబ్బులు పంపారు..ATM కి.. డబ్బులు...ఎవరికి కావాలండి డబ్బులు...వద్దండీ ...కొడుకులు వొద్దు. సముద్రం దాటితే పంచమహా పాతకాలు చుట్టుకుంటాయంటే...అంతా ట్రాష్ అనుకున్నాను...మన పెద్దలు ఊరికే చెప్పరుగా..మహాను భావులు ..రుషులు.. మొక్కాలండీ..కన్నతల్లికి చివరాఖరి చూపు లేకపోవడం పాతకంగాక ఏమిటి. స్కైప్ లో చూపాలట స్కైప్లో" ..నేను నా చేయితో ఆయన చేయి పట్టుకున్నాను..ఓదార్పుగా,.. ఆయన చేయి వణుకుతున్నది..."నాకు యిపుడు ఎవరూ లేరండీ తోడుగా...ఒంటరిని...ఈ వారం రోజులు నా జానకి శవమైనా నాతో వుంది మార్చురీలో....రేపెవరుంటారు.." .ఆ మాటలనలేక పోతున్నాడు. "అయ్యో ఈశ్వరా.!!!ఏమి జన్మనిచ్చావయ్యా జానకికి..ఇది చూట్టానికేనా ఇంత కాలం బ్రతికించావు..?!!"

ఆయనింటికి చేరుకున్ణాము. నన్ను లోపలికి రమ్మన్నాడు. కాదనలేకపోయాను, ఒంటరిగా ఉన్నాడని. బాబూ..నేను స్నానం చేసొస్తాను..కాసేపు కూర్చో...అని చెప్పి వెల్లాడు. సోఫా లో కూర్చున్నాను. పెద్ద ఇల్లు. సకల సౌకర్యాలూ ఉన్నాయి. అన్ని హంగులూ ఉన్నాయి. అటు మూలకి పాడుబడిన వీణ కనిపించింది..వెల్లి చూసాను. మీటితే...అదో రకంగా పలుకుతోంది..తీగలు సవరించక చాలారోజులైనట్టు వుంది. టీ పాయి మీద ఆల్బం కనిపించింది. అన్నీ కొడుకుల కోడల్ల మనవల్ల మనవరాల్ల ఫోటోలే...టీ షర్ట్ లో...లంగోటలో..నల్లని పేద్ద అద్దాలు పెట్టుకొని..ఆడవారైతే స్లీవ్లెస్ గౌన్లు వేసుకుని..ఒక్కోసారి టైట్ జీన్స్ వేసుకొని...ఒకసారి కారు ముందర..ఒకసారి వాటర్ ఫాల్స్ ముందర..ఇంకో సారి..ఏదో పార్క్ లో..ఇంకో సారి బొటన వేలు పైకి చూపిస్తూ..హాయ్ అని చేయి చూపుతూ..ఇంకో చోట చింపాంజి తో దిగినవి..తానా సభల్లో తెలుగు ముగ్గులేస్తూ..తెలుగు డాన్స్ లు చేస్తూ...ఒక చోట కాలోజీ పటానికి మొక్కుతూ...ఇంకోచోట చినజీయర్ స్వామితో...అమెరికాలో దసరా పండుగకు దుర్గామాతని పూజిస్తూ...ఏదో హోమం చేస్తూ..ఇలా రక రకాలయిన భంగిమల్లో దిగిన ఫోటోలున్నాయి. మామూలుగా చూసింటే నాకూ నచ్చేవేమో... ఇపుడెందుకో ఎబ్బెట్టుగా అనిపిస్తోంది..ఆ వస్రాల్లో నిండుదనం లేదనిపించింది వారి మనసుల్లాగానే..వారి అలంకరణల్లో..ఆ నవ్వుల్లో...మనిషితనం కన్నా ప్లాస్టిక్ దనం కనిపిస్తోంది.ఆత్మ శుద్ది లేని ఆచారమదియేల ...వేమన పద్యం గుర్తుకి వచ్చింది.. చూడలేక పోయాను. అటు పక్కనున్న డైరీ తీసాను..మొదటి పేపరు తీయగానే చక్కని తెలుగు అక్షరాలు. సీతా రామయ్య...జానకి అని. మిగతా అన్ని పేపర్లూ ఖాలీగా వున్నాయ్..కానీ ప్రతీ పేపర్లో పైన మూడు ఫోన్ నంబర్స్ ఉన్నాయ్..రాజారాం.....రమాకాంత్....మూడోది డాక్టర్ సుభాష్....ఫామిలీ డాక్టర్దేమో...యమర్జన్సీ కోసమని పెట్టుకుని వుంటారు. కానీ ఇలా ప్రతీ పేజ్ లో రాసుకోవడమే వింత....బహుషా ఏ పేపర్ లో చూసినా కనబడాలని కాబోలు వెతుక్కోకుండా..ఆడైరీలో నుండి ఒక కాగితం ముక్క కిందకి పడింది. చూస్తే...పాత ఇన్లాండ్ లెటర్...ఒకరి లెటర్ ఇంకొకరు చదవకూడదంటారు..కానీ చాలా పాతది...పాత కట్టడంమీద పేర్లు రాసుకున్నట్టు అక్షరాలు.

"చిరంజీవి లక్మణ్ కి..ఒరేయ్ తమ్ముడూ...మీ అన్నయ్య సీతా రామయ్య వ్రాయునది. మీ వదినా, నేనూ ఇచట కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించాము. నా జన్మ ధన్యమయింది.  ఈ అద్భుతమైన గయ క్షేత్రానికి నీవు రాకపోవడం బాధగావుంది. సరేలే కాలు విరిగితే నీవైనా ఏం చేయగలవు..ఈ మహాలయ పక్షాల్లో మన తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. దాదాపు ఆరు లక్షలమంది ఈసారి పితరులకు పిండ ప్రధానం చేశారట. తలకొరివి పెట్టడానికే దిక్కులేదనుకుంటాం..కానీ ఇన్ని లక్షలమంది వారి వారి తల్లిదండ్రులని తాతలని గుర్తుంచుకుని పిండ ప్రదానాలు చేస్తున్నారంటే, మన భారతీయ సంస్కృతి ఎంతగొప్పదో చూడు. వీల్లంతా పిచ్చోల్లట్రా వెధవాయ్..నీవూ నీ ఆదర్శ భావాలూ...తల్లి దండ్రులని గుర్తుంచుకోవడం, వారిని పూజించడం..చనిపోయినాక కూడా వారిని తలచుకోవడం ఆదర్శ భావాలు కాదట్రా...మనమేమన్నా ఎక్కడ పడితే అక్కడ తిని ఎక్కడ పడితే అక్కడ పడుకుని, దులుపుకుని పోవడానికి జంతువులమట్రా..షుంఠ... జంతువులేమన్నా చేస్తున్నాయా ఈ పిండప్రదానాలు అంటావు..విదేశాల్లో వారు చేస్తున్నారా, వారందరూ హాయిగాలేరా అంటావ్. హాయి గురించి కాదురా...మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనం మన కోసం ఇచ్చుకొనే గౌరవం. సరేలే మన గొడవ ఎపుడు తీరింది కనుక..ఏమైనా ఇంతకాలానికి మన తల్లిదండ్రులకి ఈ పాపపు లోకం నుండి విష్ణుపదానికి మోక్షం లభించింది. నేను చెబితే నీవు వినలేదు. నీ పిల్లల్నయినా నీవు మాతో పంపాల్సింది.జానకి వుందిగా చూసుకునేది.  వాల్లూ ఈ పద్దతులు తెలుసుకునే వారు. మన రాజారాం రమాకాంత్ ఎంత భక్తి శ్రద్ధలతో కూర్చున్నారనుకున్నావ్..పిండాలు పెట్టడానికి పిల్లలెందుకన్నయ్యా అంటావ్ కానీ..మనం వాల్లని కూడా తీసుకెల్లకపోతే రేప్పొద్దున వాల్లకివన్నీ ఎలా తెలుస్తాయ్ రా..మనం మన ఆస్థులనే కాకుండా మన పద్దతులని కూడా మన వారసత్వ సంపదగా మన పిల్లలకి ఇవ్వాలి కదరా..వాల్లు వాల్ల పిల్లలకి ఇస్తారు. ఈ విధంగా మన ధర్మం నిలుస్తుంది. హిందువుగా పుట్టినందుకు మన ధర్మం మనం పాటించాల్సిందే... సరే..మేము చుట్టుపక్కనున్న క్షేత్రాల్ని  కూడా చూసుకుని వస్తాం..ఇంటి పట్టాన వుండు. ఆ విరసం సరసం అంటూ తిరిగి జీవితంలో రసహీనంగా తయారుగాకు. అన్నయ్యను కాబట్టి చెబుతున్నా..ఇక నీ యిష్టం. ఉంటా.."

సీతారామయ్యని మల్లీ హాస్పిటల్ లో ఒదిలేశాను. జానకమ్మని మార్చురీ నుండి తీసుకొచ్చి, ఫ్రీజర్ లోకి షిఫ్ట్ చేస్తున్నపుడు చూసాను. వారంకి పైగా మగ్గి పోయింది. పచ్చని మేని ఛాయ నల్లగా మారిపోయింది. చర్మం పేస్ట్ లాగా అయిందనిపించింది. ఎక్కడ ముట్టుకుంటే అక్కడ గుంతలు పడుతున్నాయి. నిండుగా ఉన్న ఆమె శరీరం చిన్నగా బక్కగా కృంగిపోయింది. సీతా రామయ్య ఆమెని చూడలేకపోయాడు. "ఇలా అయిపోయిందేంటయ్యా నా జానకి. అది ఏం పాపం చేసిందయ్యా.... " అని కూలబడిపోయాడు. ఒకరిద్దరు బంధువులొచ్చినట్టున్నారు . సముదాయిస్తున్నారు. ఆమెని నేను కూడా చూడలేక పోయాను. అనాటమీ లాబ్ లో శవాన్ని చూడటం వేరు...నిండుగా చూసిన మనిషిని ఈ విధంగా చూడటం వేరు. అక్కడి నుండి వెల్లిపోయాను. మరుసటి రోజు పేషంట్ లాంజ్ లో సీతా రామయ్య కూర్చునే చోట చూశాను. ఇంకో ముసలతను ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. ఈలోకంలో ఉన్నట్టుగా లేడతను..ఎంతమంది సీతారామయ్యలో ఈ దేశంలో..బ్రెయిన్ డ్రెయిన్ అంటే అప్పుడే అర్థం అయ్యింది నాకు.
విరించి ll   మచ్చ. ll story

రాత్రి ఒంటిగంటకి కాశువాల్టీ నుండి ఫోను. "సర్ మీ ఫ్రెండు సుధీరట. అర్జంటుగా మిమ్మల్ని కలవాలంటున్నాడు".  బయట కుండపోతగా వర్షం. ఈ  వర్షానికి పేషంట్లే రారనుకుంటే, వాళ్ళతో పాటు బయటి బురద కూడా. కింద కాసువాలిటీ కి దిగాను. "నీ కాళ్ళు పట్టుకుంటా నన్ను బ్రతికించు అంటాడు" . ఏమయిందిరా అని అడిగితే ఏడుపు తప్ప మాట రాదు. ఇలా కాదని ఒక ఛాయ్ తాగించి నా రూంకి తీసుకెల్లాను. కాసేపు పిచ్చి చూపులు చూసాక "ఇవాల పేపరు చూశావా?"  అన్నాడు. పేపర్ లో సవా లక్ష రాస్తారు అవి చూసి ఏడుస్తామా .కొంపదీసి ఇపుడు పేపర్ చూసి ఏడవమంటాడా..? .."చూశావా?.... " గట్టిగా అడిగాడు. చూడలేదంటే చంపేసేలా ఉన్నాడు. మందేసుకొచ్చాడేమో.. చూశానని చెబితే ఏమి చూశావంటాడు..చూడలేదని చెబితే ఎందుకు చూడలేదంటాడు..అర్ధ రాత్రి ఈ ఇంటరాగేషన్ ఏంటో.."టైం దొరకలేదు" అన్నాను..తల పట్టుకుని నేలను చూస్తూ కూర్చున్నాడు. నేను వాడిని చూస్తూ...!!  చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండు. సినిమాలంటే ఆసక్తి.. కథ చెప్పడంలో మహా దిట్ట. కంటిముందే చూపిస్తాడు. ఇపుడేమో కల్లు కిందికేసాడు. బయట చినుకుల హోరు. లోపల దోమల జోరు. తప్ప ప్రపంచం లో మాటలు చచ్చిపోయాయన్నంత నిశ్శబ్దం. "ఈ రోజు డిష్ట్రిక్ట్ ఎడిషన్ లో గుర్తు తెలియని ఒక అమ్మాయి శవం గురించి రాశారు. ఆమె ని చంపింది నేనే"  అన్నాడు సీరియస్ గా ఎక్స్ ప్రెషన్ లేకుండా...నాకు ఫ్యూజులు ఎగిరి పోయాయి. అప్పుడే దగ్గర్లో పిడుగు పడింది. ఫ్యూజులు ఎగిరినట్టున్నాయి, కరెంటు పోయింది. వాడి ఏ ఎక్స్ ప్రెషనూ నాకు కనిపించకుండా..చీకటి తమాషాలాడుతుంది.  "జోకా..?" అడిగాను. "కాదు సీరియస్..నిజంగా నిజం"  అన్నాడు. ఇంతలో జనరేటర్ ఆన్ అయింది...ఏడుస్తున్నాడు..గట్టిగానే..జనరేటర్ సౌండూ, వాడి ఏడుపూ తప్ప ప్రపంచం అంతా నిదురపోతున్నట్టుంది. దగ్గరికి వెళ్ళి ఓదార్చాను. "ఏమైందిరా....!!" అని. నాకు నీ ఓదార్పు వద్దు. హెచ్ ఐ వీ టెస్ట్ చెయ్ మామా.. వెళ్ళిపోతాను అన్నాడు. "సీను సీను కీ సీటీ కొడతానులే గానీ ఏమయిందో చెప్పరా..." కొద్దిగా నవ్వాడు. అది నవ్వు అనేకన్నా ముఖంలో ఒకవైపు కనిపించే నిస్త్రాణ అనుకోవచ్చు.

"నిన్న బస్ స్టాప్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది. చూపులు కలిపింది. నవ్వింది. టైం అడిగింది..మాట కలిపింది. ఒక మాట ఒక మాట కలిపి కథ చేసింది. ఒక చినుకు ఒక చినుకు కలిపి సముద్రం చేసింది. నవ్వుల వెన్నెల్ని నా మనో ఫలకం మీద ఆరబోసింది. బస్సులొస్తున్నాయ్ ...పోతున్నాయ్..మనుషులొస్తున్నారు పోతున్నారు...కాలం ఆమె మాటలతో మరచిపోయింది. ఎవరో తెలియదు... ఎవరివని అడిగాను....అడగొద్దన్నది..ఏ ఊరన్నాను...చెప్పనన్నది...ఏం చేస్తుంటావన్నాను...తంతానన్నది...నాతో ఎందుకు మాటాడుతున్నావన్నాను ..తెలియదన్నది.. ఏం ఆశిస్తున్నావని అడగలేక పోయాను. ఏమీ లేదంటుందేమోనని..సిటీ చివర ఉన్న చిన్న బస్టాప్ అది. చిన్న మాట మాత్రమే చెప్పింది నాకు అర్థమయ్యేది..మనిషిగా బ్రతకాలనుందని. అందుకు నేనేమి చెయ్యాలని అడిగాను...మనిషిగా గుర్తించమన్నది. అక్షరాల్ని కథలుగా మలిచే నాకు, కథల్ని అక్షరాలుగా వొలిచే అమ్మాయి...పూవుల గురించి , వాటి రెక్కల గురించి, వాగుల గురించి, గుట్టల గురించి..దొంగల గురించి, దయ్యాల గురించి..కనబడిన వాటి మీద కామెంట్స్ కనపడని వాటిమీద అర్థంకాని కమిట్మెంట్స్..ఒక విషయం నుండి మరో విషయానికి.....ఒకొ సారి మౌన నిలయం..మరో సారి మాటల ప్రళయం..ఇంకో సారి అంతా లయం...ఆనందం..బాధ..కప్పేస్తూ..ముఖంలో అందం...ఎన్ని భావాలు పలికిస్తుందో ఆమె. కానీ ఆ భావాన్ని ఆస్వాదించే లోపు నక్షత్రంలా జారిపోతోంది. దూరం నుండి నక్షత్రం ఎంత చిన్నది..కానీ దగ్గరికెళ్ళి చూస్తే దానికదే మరో ప్రపంచం..మాకు తెలియని నీ ప్రపంచపు మహారణ్యపు చిక్కుదారులు..శ్రీ శ్రీ గుర్తుకొచ్చాడు.

 సాయంత్రం సడెన్ గా ఎటైనా పొదామా అన్నది...ఎటు పోదామని అడిగాను. నీవే చెప్పు..నన్ను ఎటు తీసుకు వెలతావని అడిగింది...అయోమయంలో నేను. సమాధానం ఇచ్చేలోపు..అలా పంట పొలాల్లోకి అన్నది..సరేనన్నాను...ఎందుకని అడిగాను...కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. సమాధానం లేదు. "నేను ముందు పోతుంటాను..నీవు నా వెనుకే రా"  అన్నది. ఆమె ముందు. నేను వెనుక. వెనుక వుండి నేను తీసుకెల్తున్నానా..? ముందు వుండి ఆమె నన్ను అనుసరిస్తుందా..? అపుడపుడూ వెనుకకి తిరిగి చూస్తోంది..నవ్వుతోంది...ముందుకి సాగిపోతోంది...చిన్న ఊరొచ్చింది..ఆమె వెంట్రుకలు పిల్లగాలికి రేగుతున్నాయి..చిన్న దారులొచ్చాయి..ఆమె నడుము అందం గా ఊగుతోంది..చిన్న కోనేరొచ్చింది...ఆమె జడ నడుం మీద ఆడుతోంది..ఊరు దాటిపోయింది..పచ్చని పంట పొలాలొచ్చాయి..ఒక గులాబీని తెంపింది....నా కిచ్చింది ..విసురుగా కొంత దూరం నడిచింది ...మళ్ళీ గులాబీని తీసేసుకుంది...కోపంగా బుంగమూతి పెట్టింది...మళ్ళీ నవ్వింది...ఒక చోట చున్నీ పరిచింది..నా ఒడిలో పడుకుంది...మళ్ళీ బరువులేని మాటలు..నన్ను తన ఒడిలో పడుకోమంది...మళ్ళీ ఎటూ తేలని మాటలు...పిచ్చిది కాదు కదా....? చీకటయ్యింది...నాతో ఒకటయ్యింది...

అపుడు మాట్లాడింది. తనకు బాల్యం లేదని. దొంగిలించబడ్డదట. ఆమె జీవితం కొందరి చేతుల్లో పావట. ఆమె ఎందరికో ఆటబొమ్మట. కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంది. తనకి ఇష్టం లేనిదంతా తన జీవితంలో నిండిందట.. చదువు లేదు. మంచం డబ్బులిచ్చింది. అందం మచ్చలనిచ్చింది. జీవితం అడగని లంచాన్నిచ్చంది. బలి పశువుని చేసింది. కడుపు ఎన్నడూ నిండలేదు.  అందం తన కడుపెపడూ  పండనీయదు.."తను శవమై ఒకరికి వశమై...తను పుండై ఒకడికి పండై"...అలిశెట్టి ప్రభాకర్ ఆర్తి కళ్ళ ముందు కనిపించింది. తనకి సర్వైకల్ కాన్సర్ అట. ఎక్కువ కాలం బ్రతకదట. తను శవమయ్యే వరకు తనువు ఇంకొకరి తపన తీర్చాల్సిందేనట. అందుకే ఆ కూపం నుంచి పారిపోయి వచ్చిందట. గట్టిగా నవ్వేసింది. నవ్వులో ఏడ్చేసింది. "సుధీర్ ...ఈ రోజు నేను మనిషినయ్యాను మొదటిసారి. నాకంటూ ఒక మిత్రుడున్నాడు. నా మాటలు విన్నాడు. నా అల్లరి కన్నాడు. నాతో కబుర్లు చెప్పాడు. నాకంటూ ఒక లవరున్నాడు..నా వెంట పడ్డాడు...నన్ను వెంబడించాడు... నాకు గులాబీనిచ్చాడు...నన్ను ఒడిలో పడుకోబెట్టుకున్నాడు. నా ఒడిలో పడుకున్నాడు..నన్ను వశపరుచుకున్నాడు..నేను వశపరుచుకున్నాను...నాకంటూ జీవితం ఉందని నిరూపించావు సుధీర్....నేను నీకు ఏమివ్వగలను. ఏమిచ్చినా పోగొట్టుకుంటావు." నేనేమీ చిన్న పిల్లాడినా పోగొట్టుకోవడానికి అన్నాను. "కాలం ఏదీ మిగలనీయదు సుధీర్..అన్నీ పోవాల్సిందే" ..సడన్ గా నా చేయి తన చేతిలోకి తీసుకుని పంటితో చేయి మీద గట్టిగా కొరికింది. నొప్పయింది. రక్తం కారింది. ఏంటిదని అడిగాను. "మచ్చల నా జీవితం" అని నవ్వేసింది. "నేనెన్ని గాయాలు మోసాను, ఆ గాయాలతోనే పోతాను సుధీర్..నా కోసం ఈ ఒక్క గాయం నీవు మోయి...నీ కోసం కాదు...నాకోసం మోయి. ఇది నీకు నా శిక్ష. మీ మొగ జాతికి నా శిక్ష. నీ మీదే నా సంతోషం తీర్చుకున్నాను..నీ మీదే నా కోపం చూపించాను..నన్ను క్షమించు సుధీర్ .." అని లేచి పరిగెత్తుతూ  చీకట్లో కలిసి పోయింది. నేను వెతికినా లాభం లేకపోయింది. అంతా కలలా జరిగి పోయింది".

షర్ట్ చేతుల్ని పైకి మడిచి మచ్చ చూపించాడు. సాక్షంగా. ఇది వీడల్లిన సినిమా కథ కాదని అప్పుడే నమ్మాను.
మా మధ్య మాటలు స్ట్రైక్ చేస్తున్నాయి. కరెంటొచ్చింది. జనరేటర్ సౌండు ఆగిపోయింది. పొద్దునయింది అప్పటికి.
లాబ్ తెరిచి వుంటారు అన్నాను. "వొద్దురా...ఆ అమ్మాయి మంచిది ..లోకం చెడ్డది...ఆమె నాకు ద్రోహం చేయదని నమ్ముతున్నాను". అన్నాడు.
అవును లోకం చెడ్డదని అపుడే వార్తలొస్తున్నాయి. గుర్తు తెలియని మహిళ పై పది మంది అమానుషం ..ఆపై హత్య.
మచ్చలేని సుధీర్ మనసులో ఏర్పడిన మచ్చ తన చేతి మచ్చని చిన్నదిగ  చేసింది.