Tuesday, 5 May 2015

విరించి//   రాముడికి ఆంజనేయుడు.//

అది మా ఊరు. పల్లెటూరు. చాలా కాలం తరువాత ఎర్ర బస్సులో మా ఊరిలో దిగాను. బస్టాండు కొత్తగా కట్టారు. కానీ ఊరు పాతగానేఉంది. ఊర్లో జనాలూ పాతవారే. కానీ ఇంతకు ముందులా కలిసి ఉన్నారో,ఎవరికి వారే అయ్యారో సిటీ లో లాగా.."ఏం విరించీ..తాతను చూడ్డానికొచ్చావా, పెద్ద డాక్టరువయ్యావంట". కేకవేసాడు కిరాణా షాపులోనుండే. ఆయన పేరేదో ఉంది. వెటకారంగా అడిగాడా, ఇన్ఫర్మేషన్ కోసమడిగాడా, కన్ఫర్మేషన్ కోసమడిగాడా..ఏమో అడిగేసాడు. జవాబు చెప్పినా ఊర్కున్నాడా...ఏదో తన కూతుర్నిచ్చి ఇప్పుడే పెల్లి చేసేస్తానన్నంత ఇంటరాగేషన్. ఆయనకి కూతురుందో లేదో ..అది వేరేసంగతి.. ఎందుకడుగుతున్నాడో..అడుగుతున్నాడు కాబట్టి నేనెందుకు చెబుతున్నానో..చెప్పేవాడికి వినేవాడు లోకువలాగా లేదు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువలాగా ఉంది. సరే..ఈ ఊరు మారనంత వరకూ ఈ మనుషులు మారరనుకున్నాను. ప్రపంచం గ్లోబల్ విలేజ్..కానీ నా విలేజ్,అదే ఓ ప్రపంచం.  అవే రోడ్లు ,అవే సందులు, అవే పందులు. మారిందల్లా ఇండ్లమీద డీటీహెచ్ ఆంటెన్నాలు. అపుడే కనబడ్డాడు నా చిననాటి స్నేహితుడు రామాంజనేయులు. పలకరింపులో వెరైటీ, ఏదో రోజూ ఆఫీస్లల్లో లాగా కాజువల్గా పలకరించేసాడు. చాలాకాలం తరువాత కలిసినపుడు కల్లల్లో ఆశ్చర్యం, గొంతులో అద్భుతం ఇలాంటివేమీ లేకుండా పలకరిస్తే ఎక్కడో కాలుతుంది. నాకూ కాలింది. కానీ వాడి తాతకి చేయి కాలిందట. నన్ను ఒచ్చి చూసి మందులు రాసీయమని అడిగేసాడు. తప్పుతుందా..తరువాత ఒస్తానని చెప్పి తప్పించుకున్నాను.

నేను మారిపోయానా..? డాక్టరునని గర్వం ఎక్కిందని తాత ఇంటికొచ్చిన వాల్లు నాతో కాసేపు మాట్లాడినాక నిర్ధారించుకుని గుసగుసలాడుకుంటున్నారు. పల్లెటూల్లలో గుసగుసలకే నోల్లెక్కువ. అందులో నాకు పాము చెవులు, వినికిడెక్కువ. పల్లెటూర్లని మార్చగలమా..నా పిచ్చిగానీ కొన్ని రోజులుంటే నన్నే మార్చేసేలా ఉన్నారు జనాలు. ఒదిలేస్తే ప్రతీ ఒక్కల్లూ సలహాలిచ్చేవారే. ఈ పల్లెటూర్లో హాస్పిటల్ కట్టాలంటాడొకడు, పల్లెరుణం తీర్చుకోవాలంటాడింకొకడు. సిటీకొచ్చి ఒకసారి తప్పిపోయాడంట అందుకే సిటీ వేస్ట్ అంటాడు ఇంకో పెద్దమనిషి. మందులు రాసిస్తే, ఇంజక్షన్ ఇవ్వమంటాడు. ఇంజక్షన్ ఈయకపోతే వాడు డాక్టరే కాదు అనేది ఈ మనిషి లాజిక్. ఏంటీ ఉత్త గుండెకే డాక్టరువా..ఇంకేమీ చూడవా..మావోడైతే అన్ని చూస్తాడు పెదవి విరిచాడు ఇంకో మోతుబరి. ఇంతకీ మీవోడేమి డాక్టరయ్యా అంటే RMP  అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నంత గర్వంగా చెప్పాడు. గుండె జబ్బులు ఎవరికోగానీ రావు..ఏమి సంపాదించుకుంటావబ్బా..కష్టమే సందేహంవెలిబుచ్చాడు ఒక పెద్దాయన. డాక్టరంటే ఇంజక్షన్ ఇచ్చి ఇరవై రూపాయలు జేబులో ఏసుకునేట్టు వుండాల గానీ ఇదేందబ్బా..పెద్ద తప్పు పని చేసినవ్..అంటాడు ఇంకో పెద్దాయన. చదువుకున్న పాపానికి ఈ రేంజ్ లో పల్లె సమాజం కక్ష సాధిస్తుందనుకోలేదు. వీల్ల మాటలు చెవిలో జోరీగలనుకుందామంటే, కరెంటు కోతల పుణ్యానికి నిజంగానే జోరీగలు. ఇలా కాదని బయటకి వెల్తే, ఎక్కడపడితే అక్కడ నిలబెట్టి ఇంటర్వ్యూలు. ఆఖరికి ముక్కు మూసుకోవాల్సిన బహిర్భూమిలో కూడా ముక్కుతూ ఇంటరాగేషన్లు. ఊఊ..ఎక్కడ చదివినవ్...ఊఊఊ...ఏం చేస్తున్నావ్...పైనొక ప్రవాహం కిందొక ప్రవాహం ఒకేసారి వదలడానికి నేనేమన్నా నాగార్జున సాగర్ డ్యాం నా..?  గ్రామ స్వరాజ్యం మాట గాంధీతోనే పోయినా, గ్రామ ఇష్టారాజ్యం ఎప్పటికీ పోయేట్టు లేదు. ఇక్కడ మనుషులే తేడా అనుకుంటే మధ్య మధ్య లో గ్రామ సింహాలు. ఎప్పుడెందుకు మొరుగుతాయో అర్థంకాదు. కూలింగ్ గ్లాసులు కల్లకే కాదు శరీరంలో ఎక్కడ పెట్టుకున్నా మొరుగుతాయి. ఏమంటే ఎక్కడ కరుస్తాయోనని దించిన తల ఎత్తకుండా నడుస్తూ పోతున్నానా..ఒకే ఒక్క సిటీ పోకడ కనబడింది. టవంటీ ట్వంటీ మాచ్ని, ట్వంటీ మెంబర్స్ పైగా నిలబడి చూస్తున్నారు. విజన్ ట్వంటీ ట్హంటీ అంటే ఒకప్పుడు అర్థంకానిది ఇప్పుడయ్యింది. ఆ ఇరవై మందిలో ఒకడు రామాంజనేయులు. సచిన్ సిక్స్ కొట్టినట్టున్నాడు ఆనంద బూతులు తిడుతున్నాడు. డిటైల్స్ ఒద్దులేకానీ బూతుల నానా రక ప్రయోగాలు, సంధులూ, సమాసాలూ,  అలంకారాలూ ఎన్నుంటాయో..అ ఇ ఉ ఋ అనెడి అచ్చులకు అవే అచ్చులు పరమగునపుడు దీర్ఘమేకాదేశముగా వచ్చును..చిన్ణప్పటి సవర్ణ దీర్ఘసంధి డెఫినిషన్ మల్లీ గుర్తుకొచ్చింది. డాష్ డాష్ డాష్ బూతులకు అవే బూతులు పరమగునపుడు దీర్ఘ బూతులనేకము ఆవేశముగా వచ్చును అనే విషయం సచిన్ అవుటయితేగానీ నాకు అర్థం కాలేదు. ఎక్కడ నన్ను చూస్తాడోనని చూడనట్టే వెల్తున్నా..అనుకున్నామని అన్నీ జరుగుతాయా.."ఏం విరించీ ఎక్కడికి"...ఎక్కడికని చెప్పాలి..? "నా బొందకి రా... నా బొందకి" అందామనుకున్న , అందామనుకున్నవన్నీ అనేస్తామా..ఇందాకా చూసిన బూతుల వెల్లువ గుర్తుకొచ్చి ఆగిపోయాను. ఏనోట్లో ఏ నాలికుందో తెలియకపోతే వేరే పరిస్థితి. తెలిసినాక కూడానా..ఆ మాత్రం తెలివుందిలే అని నాలో నేను నవ్వుకున్నా..అల్ప సంతోషిని.

అలా వెల్లి ఆంజనేయ స్వామి గుడిలో కూర్చున్నాం. హైదరాబాదు విషయాలు చెప్పమంటాడు. ఏం చెప్పాలి.? ఏదో ఒకటి చెప్పాను. ఏమి చెప్పినా కంపేర్ చేస్తూ పల్లెనే గొప్పదంటాడు.గట్టిగా నవ్వేస్తున్నాడు.  సరేలే ఎవడి ఆనందం వాడిది. వాడి నవ్వులో వెటకారం కన్పిస్తుంది. నా సామాజిక కల్లకి వాడి నవ్వులో అణచివేత కన్పిస్తుంది. ఆకాశంమీద పడి పీక పిసికితే చక్కిలిగింతనుకుని నవ్వుతున్నట్లున్నది. నా డాక్టరు కల్లకి వాడి నవ్వులో రోగం కనిపిస్తున్నది. వొల్లంతా పాకిన విషజ్వరం ఈ మధ్యనే వొదిలినట్లున్నది. ఎన్ని మాఢనమ్మకాలు వాడిలో. వాడిని ఎన్నిటికో బానిసను చేసిన ఘనులెవ్వరు.?  సరేలే ఒదిలేద్దామంటే చిన్ననాటి మిత్రుడు. అవును పల్లె జీవితంలో మార్పు రాలేదు. అవే కష్టాలు. గ్రామం మారదు. దాని చుట్టూ లక్ష్మణ రేఖలు. కాపిటలిస్ట్ ప్రపంచంలో గ్రామం ఒక ముక్కలయిన కమ్యూనిష్టు రష్యా. సిటీ అగ్రవర్ణం కింద, గ్రామం అణచివేయబడ్డ దలిత వర్గం. వాడికి సిటీ అంటే నిజానికి భయం..అందుకే అది కనిపీయకుండా వెటకారం. గ్రామాన్ని సిటీ చేస్తామనే పెద్దలకు వీడి భయం కనిపించదు. గ్రామాన్ని మౌనంగానే ఉంచి సిటీల్లో చిందులేసే పెద్దలకు వీడి వెటకారం వినిపించదు. వాడిలో నాకు మూర్ఖత్వంగా కనిపిస్తున్నదంతా వాడికి పరతత్వంగా అనిపిస్తుంది. జీవితంనుండి ఎంతో పలాయనత్వం కనిపిస్తుంది. వాడి మాటలు నిజంగానే నన్ను మారుస్తున్నాయి.

సరే నేను వెల్తా అని వెల్లిపోయాడు. ఒంటరిగా కూర్చున్నాను. ఆంజనేయ స్వామి గుడి ముందర, రావి చెట్టుకింద. చిన్నప్పుడు ఇదే చెట్టుకింద రామాయణం ఆట ఆడుకునేవాల్లం. నేను రాముడు. రామాంజనేయులు ఆంజనేయుడు. ఋష్యమూక పర్వతం లో రాముడు ఆంజనేయున్ని చూడటం. గుర్తుపట్టడం. వాలి వధ. సీతమ్మ కోసం రాముడి ఆరాటం. ఆంజనేయుడి ఓదార్పు. సీతమ్మని వెదకడం.  ఆంజనేయ రాయబారం. లంకా దహనం. సీతజాడ రాముడికి చేరవేయడం. రామేశ్వరంలో రామసేతు నిర్మాణం. లంకా పయనం. లక్ష్మణ స్వామి మూర్ఛ. సంజీవినిని తేవడం. అన్నిటికంటే ఎక్కువసేపు ఆడేది  రామ రావణ యుద్దం. బాణాలు వేసుకోవడం. ఆంజనేయుడు గదతో యుద్ధం చేయడం. ఆ తరువాత రావణ సంహారం. సీతాసమేతుడై రాముడు ఆంజనేయుడి భుజములమీద అయోధ్య చేరడం. రామ పట్టభిషేకం. చివరి ఘట్టం ఆంజనేయుడు రాముని కౌగిలించుకొమ్మని కోరిడం. రాముడు కౌగిలించుకోవడం. అప్పటి ఆ కౌగిలింతలో ఎంతటి స్నేహం, ఈ ఘట్టం కోసం ఇంత ఆటా ఆడుకునే వాల్లం. ఒకరి కోసం ఒకరం ఆనంద మొగ్గలై విరబూసేవాల్లం. ఏమయిందీ రోజు..? ఎంతగా మారిపోయాం. ఒకరికొకరం కాకుండా పోయాం. ఎవరిదార్లో వాల్లం పోతున్నాం.

నేను హైదరాబాదు కి పయనమయ్యాను. తాత ఇంటినుండి బస్టాండుకి అర కిలోమీటరు పైనే. నడవాలి. ఈ గ్రామం నాదనలేక పోతున్నా. ఏ మార్పూ ఇక్కడ రానందుకు నా వూరు, పేరు పెద్ద హైదరాబాదని అబద్దాలు చెబుతున్నా. నిజంగానే నేను మారాను. నా ఊరినుండి విడిపోయాను. వేరు పడ్డాను. వేరేవాణ్ణయ్యాను. "విరించీ..నీ అడ్రస్సు ఇవ్వు హైదరాబాదు కొస్తే కలుస్తం"... "విరించీ.. నీ ఫోన్ నంబరు ఇవ్వు హైదరాబాదులో నీ హాస్పిటల్కి మా నాయనమ్మని తీసుకొస్తం".. "విరించీ..నీ మందులు బాగా పనిచేసినయ్..మా నాయన సల్లగా ఉండాల"...."విరించీ ..అప్పుడప్పుడొస్తూ వుండు ,అమ్మానాయనల్ని అడిగినట్టుచెప్పు" ... "ఏం గుర్తు పట్టలా...అయ్యోల్ల పిల్లగాడు..పెద్ద డాక్టరయినాడు. మంచోడు" .... నిజమా..? అంతకుముందు ఎంక్వైరీలనుకున్న , కాదు ఇపుడు అర్థమైంది. తమవారి గురించి పల్లె జనానికున్న ఆరాటం. ఆనందం. అపార్ట్మెంటుల్లో అపరిచితులం. కాబట్టే పల్లె పరిచయాల కి దూరమై వున్నాం. బస్టాప్ వెల్లే వరకు ఎన్ని గొంతులు. బస్ కోసం ఎదురు చూస్తున్నా. దూరంగా రామాంజనేయులు. ఉరుకుతూ ఒస్తున్నాడు. చెప్పు ఊడి పోయినట్టున్నది. ఈడ్చుకుంటూ ఉరుకుతున్నాడు. ఆగు ఆగని సైగ చేస్తున్నాడు. అపుడు గుర్తుకి వచ్చింది. వాల్ల తాతని చూసి మందులు రాయమన్నాడని. ఇపుడొచ్చేది లాస్ట్ బస్సు , ఇది మిస్ అయితే, రేపే. ఇపుడు నన్ను వాల్ల తాత దగ్గరికి రమ్మని బలవంతం చేస్తాడా..ఇంతలో హైదరాబాదు బస్సు ఒచ్చేసింది. రామాంజనేయులు కూడా ఒచ్చేసాడు. ఉరుకుతూ రావడం వల్ల రొప్పుతున్నాడు. "ఏం విరించీ వెల్తున్నావా..ఇంటికి పోతే తాత చెప్పాడు ఇపుడే బస్టాండుకి పోయావని. అందుకే బెగీత ఒచ్చినా. థ్యాంక్సబ్బా...ఒచ్చినందుకు". చేతిలో చేయి వేసి చెబుతున్నాడు.  "నిన్న గుడికాడ నీతో మాట్లాడినాక బాగనిపించింది. ఏదైనా మాట్లాడుకుంటెనె కదబ్బా బాధలు తగ్గుతై. పోయిరా...మల్లీ ఎప్పుడొస్తావ్. ఈపారి శానా దినాలుండాలె చూడు. నీతో శానా మాట్లాడాలె"... బస్సు హారన్ మ్రోగుతోంది. సరేబ్బా పోయిరా..చేయి తీసాడు. నా చేతిలో ఆకు వుంది.  ఇదేంటిది అని అడిగాను. "ఆంజనేయస్వామి గుడిది. రావి చెట్టు ఆకు. మర్చిపోయినవా. ఇది పుస్తకాల్లో పెట్టుకుంటే చదువు బాగొస్తదని చెప్పేటోడివి. నీకోసం తెచ్చినా. నీవు గొప్ప డాక్టరువి కావాలబ్బా. నా కోరికచూడు"... బస్సు కదులుతోంది. సరే పో..మల్లా రా.. బస్సు ఎక్కాను. చేతిలో ఆకు ఉంది. రామాంజనేయులు తాత చేయి కాలింది. వాడి తాత విషయం నేను మరచినా వాడు అడగలేదు. అడగకుండా అవమానించాడు. వాడు చేయి ఊపుతున్నాడు. నేను చేతికందకుండా పోతున్నాను. ఆంజనేయున్ని వదిలి రాముడు పోతున్నాడు. ఆంజనేయుడు ఆంజనేయుడిలాగే ఉన్నాడు. రాముడే మారాడు. డ్రైవరు సీటు వెనుకాల పలకమీద రాముడు ఆంజనేయున్ని కౌగిలించుకుంటున్నాడు పటంలో. రామ స్వామి ముఖం చూడలేకపోతున్నా. ఆంజనేయుడి కల్లల్లో ఆ కౌగిలింత తాదాత్మ్యత చూస్తున్నా.

16/11/12.

No comments:

Post a Comment