Friday, 21 November 2014

  ||చేతి చెమట. ||కథ
[ఇది నిజంగా నా క్లినిక్ లో జరిగిన కథ]

అది నా క్లినిక్. ఆ రోజు ఉక్క పోతగా వుంది. పేషంట్లు విపరీతంగా వున్నారు.పట్టిన చమటని తుడుచుకోవడానికి కూడా టైం లేదు. ఇంతలో ఒక డెభ్భైయేల్ల ముసల్ది రొప్పుతూ వచ్చింది. ఆమెకి తోడుగా ఆమె కూతురు. వాల్లులోపలికి రాగానే చెమట వాసన. చికాకు ఇంకా పెరిగిపోయింది. ఆమె వదనం లో నాతో అన్నీ చెప్పేయాలని, తన లోపల ఉన్నదంతా కక్కేయాలనే ఆరటం...అదే నిజమేమో..భల్లున నామీద కక్కేసింది. వాంతి వాసన. నామీద పడ్డ వాంతి తుడుచుకుంటూ లేచాను. అక్కడినుండి ఆ వాసన నుండి,వెల్దామనుకున్నాను. ఆమె ని చూసాను. ఆమె లో ఉండేదేదో నన్ను ఆపేస్తోంది. నన్ను కట్టేస్తోంది. ఇంతలో కుర్చీలో కూర్చున్నది కాస్తా పక్కకి ఒరిగి పోయింది. "అమ్మా...అమ్మా..."ఆమె కూతురు అరుస్తోంది. నేను ఆమె పల్స్ చూస్తున్నాను. స్టెత్ తో గుండె చూస్తున్నాను. ఆమె తెలివితోనే ఉంది కానీ నీరసంగా వుంది.. ఆయాసంతో ఊపిరి గట్టిగా తీస్తోంది. "సిస్టర్...!!" కేకవేసాను. క్షణాల్లో ఆమెని స్ట్రెచర్ మీదకి మార్చాము..ఆమె కూతురు కూడా అందుకు సహాయం చేస్తున్నది. చిరిగిపోయిన జాకెట్టుని కప్పుకుంటూ తన శరీర భాగాల్ని కనిపించకుండా ఒకవైపు జాగర్త పడుతూ,  ఇంకో వైపు తన తల్లికోసం తల్లడిల్లిపోతున్న ఆ ముప్పై అయిదేల్ల మహిలని చూసాను. చిన్న జాకెట్ చిరుగులో ఆమె బీదరికాన్ని నగ్నంగా చూసాను. "డాక్టర్...ఏదో ఒకటి చేయండి...నాకు మా అమ్మ తప్ప ఎవరూలేరు..మీకాల్లు పట్టుకుంటాను డాక్టర్..." అని దండం పెడుతూంది..ఆ నమస్కారంలో ఎంత నమ్మకం..!!

బ్లడ్ షుగర్ నార్మల్..ECG తీసేసాము acute . .onset  LBBB ..అయ్యో మేజర్ హార్ట్ అటాక్..సెకన్ లలో 2D ECHO చేసేశాను. నేను గుండె స్కాన్ చేస్తుంటే ఆ ముసలమ్మ తన చేతితో నా చేతిని తడుముతోంది. నా చేతిలో తన జీవితం ఉందనుకుందేమో..,! స్కాన్ లో తెలిసిపోయింది. సందేహమే లేదు..మేజర్ హార్ట్ అటాక్..కేవలం ఇరవై శాతం హార్ట్ పనిచేస్తోంది. ఇలా కిల్లిప్స్ క్లాస్ ఫోర్ లో ఉండే వ్యక్తి బ్రతికే అవకాశం చాలా తక్కువ. వాల్ల అమ్మాయిని పక్కకి పిలిచాను. చూడమ్మా పెద్ద జబ్బు. వెంబడే ట్రీట్మెంటు ఇచ్చేయాలి. లేకపోతే ప్రాణాపాయం అంటుండగానే...అప్పటిదాకా బిగబట్టిన దుఃఖమేమో  ఆ.....!!!!!!!! అంటూ ఏడ్చేసింది.. అమ్మా ఇది ఏడ్వాల్సిన సమయం కాదు...అంటూఏదో చెప్పబోయాను..."మేము బీదోల్లం సారూ...మాకు ఎవరూ లేరు...నాకు అమ్మ..అమ్మ కు నేను. ఇండ్లల్లో చాకిరీ చేసి బతుకుతం సారూ.. ఇంత పెద్ద జబ్బు ఒస్తే...నేనేమిజెయ్యాలె దేవుడా."....అమ్మా వెంబడే ఉస్మానియాకు తీసుకు పోవాల అని నచ్చజెప్పి అత్యవసర మందులన్నీ ఇచ్చేసాను, నేనే ఒక ఆటో మాట్లాడి ఆమెని ఎక్కించాను. ఆటోలో కూర్చున్న ఆమె..అటువైపుకి కూర్చున్న తన కూతురితో ఏదో చెబుతోంది. అది వినగానే...ఆమె ఆటో దిగి నావద్దకి వచ్చి...సారూ ఫీజు ఎంతయింది...అంటూ ఆమె జాకెట్లోకి చేతులు పెట్టి నలిగిపోయిన కొన్ని కాగితం ముక్కల్ని తీసింది. నిజంగా అవి ఆమె జబ్బుకి కాగితంముక్కలే...అమ్మా నాకు ఏమీ వద్దు..ముందు ఆమెని త్వరగా ఉస్మానియా తీస్కెల్లు..అంటూండగా...ఆటోలో తలని ఒక మూలకి ఆనిచ్చి.."నీకష్టం నాకెందుకు సారూ..ఇప్పటిదంకా ఎంతచేసినవ్..నీకేనా ఊర్క ఒస్తయా సారూ..నీకూ పిల్లలుంటరు గదా...." నిజానికి ఆ కొద్ది నిముషాల్లో   మందులతో సహా ఆమెకయిన ఖర్చు ..rs 2500 / ఆహా....ఇంత బీదరికంలో ఎంత పెద్దని మనసు..నా కష్టానికి విలువ కట్టగల సంస్కారం ఇన్నిరోజులకి ఈ బీద అభాగ్యురాలిలో కనబడిందా..అనుకున్నాను. ఆ పాత నలిగిన నోట్లు ఆటోకే సరిపోవని అర్థం అయింది. జేబులో తడిమాను మూడొందలున్నాయి...ఒక్కసారి ATM  లు ఒచ్చినందుకు తిట్టుకున్నాను. సరేలే...అవి ఆటోవాడి జోబులో తురిమి..ఎక్కడా ఆపకుండా తీస్కెల్లమని చెప్పి పంపేసాను. నా ఛాంబర్ కి ఒచ్చాను..వాంతి వాసన..చెమట వాసన..నాకపుడు అసహ్యం వేయలేదు..ఇది మనిషి వాసన అనిపించింది.
నా కష్టానికి గుర్తింపు వాసన అనిపించింది. నా కల్లల్లో నీల్లు తిరిగాయి. గుండెలో బాధ..నన్ను గుర్తించిన మనిషి బ్రతకదు. నాకున్న అనుభవం ప్రకారం ఆమె బ్రతికే ఛాన్స్ చాలా చాలా తక్కువ. కానీ ఆమె బ్రతకాలి...ఆమె కూతురికోసం , నాకోసం బ్రతకాలి...వాల్లకుఎవరూ లేరన్నారు..కానీ కొంతసేపు నేను వాల్లకున్నాను..వాల్ల మనిషినయ్యాను. వెల్లేప్పుడు వాల్ల కూతురు కంటినిండా నీరు పెట్టుకుని..కృతజ్ఞతగా నాకు రెండు చేతులతో నమస్కరించింది కదా...ఎందుకై ఉంటుంది..ఇలా ఎన్నో ఆలోచనలు...ఆ తరువాత కొంతకాలం వరకూ ఆమె ఏమయ్యిందోనని ఆందోలన. మెడికల్ గా ఆమె బ్రతకదు...కానీ లోపల యేదో నమ్మకం...ఆమె క్షేమంగా తిరిగి రావాలని...

కానీ ఒకరోజు....ఒక కోటీష్వరుడు కార్లో వచ్చాడు. చేతినిండా బంగారంపెట్టుకున్నా సరిపోక పొట్టలో కూడా దాచుకున్నాడేమో...ఆయన బరువులో పొట్టనే సగముంటుంది.  కార్డియాక్ చెకప్ కి వేరె డాక్టర్ పంపితే ఒచ్చాడు. బయట రిసెప్షన్లో ECG, 2D ECHO, plus  కన్సల్టేషన్ కలిపి Rs 1250/-...అని చెప్పారు నా ష్టాఫ్. సరసరి లోపలికొచ్చాడు... "డాక్టర్ సాబ్ ...తోడం తగ్గించు...చాలా ఎక్కవ అయింది" అన్నాడు. నేను లోపల ఒక లేడీ పేషంట్ని చూస్తున్నాను. కనీసం ఆడవారున్నారు కదా అనే ధ్యాసకూడా లేకుండా ఒచ్చేసాడు. నాకు అలా పర్మిషన్ లేకుండా ఎవరైనా లోపలికి ఒస్తే చాలా కోపం ఒచ్చేస్తుంది. తమాయించుకున్నాను. "నేను సురేషన్న మనిషిని.. వాల్లింటి పక్కనే మాయిల్లు" . అని ఇంకా ఏదో చెప్పబోయాడు. సరేలే మొత్తంగా వెయ్యి కట్టండి బయట అని చెప్పి నేను ఆ లేడీ పేషంట్ హిస్టరీ తీసుకోవడంలో మునిగిపోయాను. సురేషన్న అంటే అక్కడి ఎమ్మెల్యే. రెండునిముషాల్లో నాకు ఫోన్. అది ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ది. "ఆ..విరించీ...!! ఆ పేషంట్ ఫోన్ చేస్తున్నాడమ్మా..వేయి చెప్పావంట గదా...ఒక రెండు వందలు తగ్గించమ్మా..వాడు హౌలేగాడు..తగ్గించేదాకా వినడు..ఓకేనా.. " అని టకాటకా చెప్పేసి ఫోన్ పెట్టేసాడు. అయ్యో ఇదేంటీ....ఇప్పుడైతే తగ్గించాను కదా... సరేలే అనుకున్నా...ఈలోగా లేడీ పేషంట్ ని చూసి పంపించేసాను. Next అని బెల్ కొట్టాను... ఈ మహానుభావుడే...అయితే ఒంటరిగా రాలేదు..నా ఫార్మాసిస్ట్ తో ఒచ్చాడు. "సార్ ..ఈయన నా ఫ్రెండు..మీరు 800  చెప్పారంటగదా..కొద్దిగా తగ్గీయండి...ఆరొందలట్లా తీసుకుంటే బాగుంటుంది." .అని నాకు మల్లీ తన ఫ్రెండుని పరిచయం చేసి వెల్లిపోయాడు....ఇంత లాబీయింగా...ఒక టెస్ట్ కోసం. షర్ట్ విప్పాడు..పడుకున్నాడు. 2D ECHO  చేస్తున్నాను..ఎన్నో ఆలోచనలు.  వాడి గుండెను చూస్తున్నాను..బలంగా వుంది...వీడి బలహీనమైన మనసుని చూడలేక పోతున్నానా ఈ మెషీన్లో అనిపించింది.. ఒక కోటీష్వరుడిలో ఇంత లోభమా...ఇలా తక్కువకు చేస్తూ నన్ను నేను తక్కువ చేసుకుంటున్నానా..దానికన్నా ఫ్రీగా చేస్తేనన్నా బాగుండేది.ఎంతమంది పేదలకు చేయలేదు..? నా ఆలొచనలు ఆ మనిషి గురకతో లేచొచ్చాయి. స్కాన్ చేస్తున్న పది నిముషాల్లోనే గుర్రు పెట్టేసాడు..మామూలు కాయమా అది...!  ఆయనలోని లోభత్వం శ్వాసలోని గాలిని కూడా బయటకి పోనిస్తున్నట్టులేదు. అయిపోయాక.."డబ్బులేమీ వద్దు.నేను బీదవారికి ఉచితంగానే చేస్తాను " అందామనుకున్నాను...కానీ ఒక పెద్దమనిషిని అవమానించకూడదని అనుకోవడంవల్లనో..ఈ మిషన్ కోసం నేను చేసిన అప్పులూ బ్యాంకు EMI లు జ్ఞాపకం రావటం వల్లనో ఆ మాట అనలేక పోయాను. ఆరు వందలతో నన్ను నేను కించపరచుకున్నాను. సరేలే..పోయేదేమీలేదు..పైవాడిచ్చేది ఇంతేనేమో..అనుకుంటూ..ఆ పేషంట్ కి సరిపడా మందులు రాసిచ్చాను. అంతచేసినా మందులు కొనుక్కుని వెల్లేటప్పుడు "బాగానే లాగారు దొంగనాకొడుకులు " అని గొణుక్కుంటూ వెల్తున్న అతన్ని చూసి ఆశ్చర్యపోయాను. కాల్ల కింద భూమి కదిలిపోయిందనిపించింది. ఏంటి..ఇంత చేసినా ఈ ఫలితం. నా దాతృత్వానికి గుర్తింపు లేకపోతే లేకపోయింది.కనీసం నా కష్టానికి...? ఎంత దారుణం. ఒక డాక్టరు కూడా మనిషే. అందరిలాగే ఖర్చులుంటాయ్, అప్పులుంటాయ్ అనుకోరా ఈ మనుషులు. సమాజంలో ప్రజలందరూ హాయిగా ఉన్నారంటే..సరిహద్దుల్లో సైనికులు..ఊర్లల్లో పోలీసులు..కినిక్ ఆసుపత్రుల్లో డాక్టర్లు పని చేయడం వల్లనే కదా...!! సమాజం మనుగడలో కీలక పాత్ర పోషించే డాక్టరుకి గౌరవం ఇంతేనా...?
అలా ఎందుకుగానీ ఈప్రొఫేషన్ ఎంచుకున్నానా అని ఆలోచిస్తు నెక్స్ట్ అని బెల్ కొట్టాను.

ఒక లేడీ వొచ్చి నా ముందు కూర్చుంది. "నమస్కారం డాక్టర్....గుర్తు పట్టారా...!!?"  ఆమె పలకరింపుతో యీలోకంలోకి ఒచ్చాను. ఈమెను ఎక్కడో చూసాను..తెలిసిన ముఖమే...కానీ గుర్తుకురావడం లేదు."  లేదమ్మా...నిన్ను చూసానుగానీ గుర్తు రావట్లేదు"  అన్నాను. "అవును డాక్టర్ చాలా రోజులయింది కాబట్టి మీరు గుర్తు పట్టలేరు...కానీ...మిమ్మల్ని నేను మరచి పోలేదు డాక్టర్ సార్. ఆ రోజు గుర్తుందా డాక్టర్..మా అమ్మని చూసారు..ముసలామె..మీ పైన వాంతి చేసుకున్నా ఆమెకి అన్నీ చేసారు...ఆఖరికి ఆటోకి డబ్బులు కూడా ఇచ్చి ఉస్మానియాకి పంపించారు...గుర్తుందా డాక్టర్....!!" ఆహా..నా ఖల్లల్లో ఆనందం...తప్పి పోయిన నా వాల్లు దొరికినంత ఆనందం..."ఆ ..ఆ  ...  అమ్మా..మీరా...?!!ఎలాఉన్నారు...మీ అమ్మ ఎలా వుంది..?"
"ఇంకెక్కడి అమ్మ సారూ...మీరు చెప్పినట్టు ఆ రోజే చచ్చిపోయింది...నేను ఒంటరినయ్యాను..." నా కల్లల్లో అయోమయం...అయినా ఆమె బీదరికాన్ని అవి వెతుకుతున్నాయి. ఆమె లో బీదరికం వెతకాల్సిన అవసరమే లేదు. పోతపోసిన బీదరికమే ఆమె. అయ్యో.....ఆమె కల్లుతుడుచుకుంటోంది. నేను లోపలే బాధ పడ్డాను. ఆమని ఓదార్చాలనుకోలేదు. తనవారనుకున్న వారి దగ్గర తన గోడుని వెల్లబోసుకుని ఏడవటానికే ఆమె ఇంతకాలం ఏడుపుని ఆపి ఉంచినట్టున్నది..బోరుమని ఏడ్చింది. నేను ఏమీ చేయలేకపోతున్నాను అయ్యో..నా ఈ తల్లికి నేను ఏమీ చేయలేక పోతున్నానే.. నా డాక్టర్ కోటు నా గొంతులో పెల్లుబికే బాధకి అద్భుతంగా ఆనకట్ట వేస్తోంది. అదే లేకపోతే...నేను మనిషినయ్యే వాడినేమో...కన్నీరుగా కరిగి పోయేవాణ్ణేమో....కాసేపట్లో ఆమె సర్దుకున్నది....మౌనం మా మధ్య కాసేపు స్వేఛ్ఛా విహారం చేసింది. ఆ మౌనం లో ఆ ముసలావిడ మా మధ్యనే ఉన్నది. సరే...అమ్మా..చెప్పు..నీకేమి బాధ..ఎందుకొచ్చావు...అని అడిగాను.. ఈమెకి ఏ ప్రాబ్లం ఉన్నా తీరుద్దామనుకున్నాను. మెడికల్ గా ఎంతసహాయమైనా ఫ్రీగా చేసేద్దామనుకున్నాను. చెప్పమ్మా..నీ ప్రాబ్లంఏంటి..? .." నా కేముంటది సారూ....ఏమీ లేదు... అయ్యాల మీరు మాకు మేలు చేసిండ్లు. మాయమ్మ నిన్ను ఊకె యాది చేసింది. ఈ రోజుల్ల ఊకే ఎవ్వలు చేస్తరు ..గసుంటిది నీవు చేసినవ్...నీ కష్టం ఒద్దు సారూ...మా యమ్మ నీకు ఎట్లన్నా నీ కష్టం పైసలిచ్చేయమన్నది....సచ్చిపోయేటపుడు కూడా మల్ల మల్ల యాది జేసి సచ్చింది...నేను గప్పుడే ఒచ్చెడిది...కాని పైసలు లేవుగద సారూ...ఇంటింట్ల పని చేసి గిప్పుడు తెచ్చిన సారూ..మన్నించు డాక్టరూ...." అంటూ...చేతిలో అప్పటిదాకా దాచిన రెండు అయిదొందల నోట్లని నా చేతిలో పెట్టేసి ..నమస్కారం చేస్తూ వెల్లిపోయింది. నేను మాట్లాడే లోపలే గిర్రున తిరిగి వెల్లిపోయింది..ఆ నోట్లమీద ఆమె చేతి చెమట.  అప్పటిదాకా ఆగిన కన్నీరు కట్టలు తెంచుకుని బయటకి ఒచ్చేసింది...గొంతులో దాగిన బాధ తన్నుకుని ఒచ్చేసింది...ఇది యేమి ఋణం..ఈమెది ఏమి ఐశ్వర్యం.. అలా ఏడుస్తూ బయటకి వెల్లి ఆమెని ఆపలేకపోయాను. బయట ఇంకా వున్న పేషంట్ల ముందర,నా ష్టాఫ్ ముందర ఏడవలేక..లోపలే ఏడ్చేసాను..నేను బాధతో ఏడ్చానా..ఒక కష్టం విలువ తెలిసిన వ్యక్తిని చూసినందుకు ఏడ్చానా..నన్ను కూడా ఒక మనిషిగా గుర్తించిన మానవతామూర్తిని చూసినందుకు ఏడ్చానా...ఆ ముసలమ్మకి..ఆమె బిడ్డకీ ఉన్న గుణ సంపదని చూసి ఆనందంతో ఏడ్చానా అని మీరు ఎవరు అడిగినా చెప్పలేను. కానీ..ఆ అక్కయ్య కోసం నేను ఎదురు చూస్తుంటాను. ఆమె వెయ్యి రూపాయలు నా దగ్గరే ఉన్నాయి. దాచి వుంచాను. అవి ఎంతో విలువైనవి. ఈ దేశంలో కష్టానికి విలువ లేదని అనిపించినపుడల్లా వాటిని చూసుకుంటాను..వాటి మీద ఆమె చేతి చెమట తడి యింకా మెరస్తూనే వుంది.

Wednesday, 5 November 2014

  ఓ స్త్రీ "రేపు" రా !!
ంంంంంంంం
అపుడెపుడో మా యింటి గోడమీద
వేలాడుతున్న జ్ఞాపకం
సెకండ్ షో సినిమాకి సాంతం
టికెట్లు ఇవ్వడం ఆపేసిన రోజులు
అర్ధ రాత్రి మగవాడు సైతం
ఒంటరిగా తిరగలేని రోజులు
ఒక చనిపోయిన ఆడ మనిషి
చదువుకున్న దయ్యమై తిరిగే రాత్రులు
"రేపు"కి అర్థం మార్చేసిన ఈకాలంలో
ఆ దయ్యం మల్లీ తిరిగితే
దేవతలా పూజిస్తాను
నిస్సహాయులైన నిర్భయలను పూనితే
గుడులే కట్టిస్తాను
స్త్రీకి స్త్రీయే రక్ష
అది దేవతయినా దయ్యమయినా
అందుకే ఆ మగరాక్షస మర్దిని కి
నా ఆహ్వానాలు
ఓ స్త్రీ 'రేపు' జరుగుతోందిక్కడ
తొందరగా మరలి రా...  

Tuesday, 4 November 2014

వృథా రోజులు
....ంంంంంంంంంం
ఎంత వృథాగా గడిపేశాను నా రోజుల్ని..!!
అదృశ్య శాసనాల మీద సదృశంగా జీవించాను
లోకం పోకడలలో లౌక్యం లేదనుకున్నాను
మనుషుల నీడల్లో వెలుగులు వెతుక్కున్నాను
మనసుల వాడల్లో ముత్యాలు దాచుకున్నాను
ఎండమావుల్లో అర్ఘ్యాలు వదులుకున్నాను
తిమిరంలో తీరాలు వెదుకుతున్నాను
ఆకాశంలో మానవతా ఉనికి ఉందనుకున్నాను
భూలోకంలో భూతదయ భ్రమపడ్డాను
సముద్రంలో నిశ్శబ్దం ఊహించాను
పిల్లకాలువలో ప్రలయం పారించాను
రాజకీయ రంగంలో రంకులు లేవనుకున్నాను
నాటకీయ రంగంలో రంగులు రావనుకున్నాను
అనవసరపు హంగులు అవసరం లేదనుకున్నాను
కానీ ఇది జీవితం కాదని ఇలా జీవించలేమని
ఈనాడే తెలుసుకున్నాను
అందుకే ఇంకో చిత్రం గీయదలచాను
ఇంకో కవిత రాయదలచాను
నా కుంచె మారలేదు
నేనూ మారలేదు
కాగితమే మారింది
కుంచెలో  కాగితం కరిగిపోయింది
కలంలో కాగితం ఒదిగిపోయింది
కాని కాలంలో కాగితం నలిగిపోతుంది
కాలంతో జీవితం కదిలిపోతుంది.
                     విరి.

Monday, 3 November 2014

అలజడి
....  ంంంంంంంంం
నా హృదయంలో రేగిన అలజడిని
వెంటనే ఆర్పేయకపోతే
పిచ్చెక్కిపోతాను
జరిగే ప్రతి సంఘటనకొక సంఘర్షణ
ప్రతీ సంఘర్షణకొక ప్రతిఘటన
ప్రతీ రూపానికో ప్రతిరూపం
ప్రతీ ప్రకోపానికో ప్రత్యాహారం
ప్రతీ అన్యాయానికో ప్రత్యామ్నాయం
ప్రతీ కదలికకొక విప్లవం
ప్రతీ పాటకొక పల్లవం
నాలోనేనే రగిలించుకుంటాను
రాయలేని కవితలా కాలం జారిపోతుంటే
కాలాన్ని కలంగా ఒడిసి పట్టి
విశ్వం నుదుటిమీద
రక్తసిరానై నేనుదయిస్తాను
జీవితపు ప్రతి చీకటి మలుపు దగ్గర
ఒక నిప్పుకణికనై
ప్రతీ చిక్కుకూడలి దగ్గర దిక్సూచినై
రక్తం తొణికిన ప్రతీ కదనంలో సవ్యసాచినై
కన్నీరొలికిన ప్రతీహృదయానికొక
నిలువుటద్దాన్నై
నిరాశతోనిష్క్రమించిన ప్రతీ యుగకవి
ఆత్మఘోషకి ప్రతిధ్వనినై
నేనుపడగలెత్తుతాను
కావ్యంతో కదంతొక్కుతాను
కాలంతో పదవులెత్తుతాను
కలంతో పెదవులెత్తుతాను
ప్రతి పదంతో పాతరేస్తాను
జనపదం లో జాతరేస్తాను.
                      ......విరి.
చిత్ర దర్శకుడు
ంంంంఃఃః

కళ కళ అంటావు
కళ కళ కోసం అంటుంటావు
కల్లల్ని కలంతోగెలికేస్తావు
కలల లోకాన్ని కంటిముందు
సినిమా తెరమీద నింపేస్తావు
నీకున్న పైత్యాన్ని, వైపరీత్యాన్ని
నీలో ఉన్న సైతాన్ని,వాతాన్ని
అన్నిటినీ కలిపి
మా జీవిత చిత్రంమీద
పోస్టర్ లా అతికిస్తావు
యదార్థ పదార్థమేదీ లేని కథలతో
సుఖార్థ ద్వంద్వార్థ సంభాషణలతో
అస్త్రాలు లేని, కుస్తీలు రాని
ముడతల హీరోలతో
వస్త్రాలు కొన్ని జాస్తీగా లేని
పడచు హీరోయన్ లతో
విరహంలేని ప్రణయగీతాలు
విషదంకాని ముష్టియుద్దాలు
శృతిమించిన శృంగారాలు
శృతికందని సంగీతాలు
 నీ సమాజంలో మనసులు లేవు
హీరోలకు వయసులు రావు
హీరోయిన్లకు వ్యక్తిత్వాలు లేవు
విలన్లకు వికృత చావు
రంగుల లోకంలో
తీరని కోరికలు తీరుస్తావు
నీ కళ కున్న బలమంతా
మాకున్న బలహీనత
అందుకేనీవు దార్శనికత ఉన్న కవివీ కావు
మండే రవి వీ కావు
చపలత్వ చలన చిత్ర దర్శకుడివి
విశృంఖలత్వ ప్రదర్శకుడివి
మా అల్పత్వం నుండి పుట్టుకొచ్చిన
కుహానా చిత్ర విద్వాంసుడివి
నయా జమానా విధ్వంసుడివి
                 విరించి.
కవి ప్రపంచం
..........ంంంంం...
నా ప్రేమని వ్యక్తపరుద్దామని
నీ వద్దకు ప్రతీరోజూ వస్తాను
కానీ ఏమీ చెప్పలేకపోతాను
ఒక్కసారిగా రెండు ప్రపంచాల భిన్నత్వం
ఆ సమయంలో నన్ను చుట్టుముట్టి
నన్నుక్కిరిబిక్కిరి చేసేస్తుంది
ఒక ప్రపంచం నాది, సొంతమైనది
అందమైనది, సున్నితమైనది
సుందరమైనది
కానీ ఊహాజనితమైనది
నిజానికి లేనిది
ఇంకో ప్రపంచం లోకానిది
లోకులది, నిజమై ఉన్నది
ఊహల్ని ఈసడించేది
కఠినమైనది,వాస్తవమైనది.
ఈ రెండు ప్రపంచాల భిన్నత్వం చూసి
చెబుతామనుకున్న విషయం మరచిపోతాను
కవినయినందుకు సిగ్గుపడతాను
అందరిలా లేనందుకు బాధ పడతాను
ఆశ్చర్యంలో మునిగిపోతాను

నా ప్రేమని వ్యక్త పరుద్దామని
నీ వద్దకు ప్రతీరోజూ వస్తాను
కానీ ఏమీచెప్పలేక పోతాను
మనసున పెంచుకున్న ప్రేమంతా
ఒక్క పదంలో ఇమిడి పోగలదా అని
ఆలోచనలో మునిగిపోతాను
సర్వ ప్రాణాలుా నీకర్పించడానికి
మాటలుకాక వేరే పద్దతి వుందా అని
వెతుకుతుంటాను
ఆ క్షణంలో నీవు నేనొక పిచ్చివాడిననుకుంటావు
ఏమిటో చెబుతానన్నావు యేమిటని అడుగుతుంటావు
నా బేల చూపులూ, పెగలని మాటలూ
గాలి నిట్టూర్పులూ చూసి
నాకేమీ అర్థం కాలేదంటూ
నీవు నవ్వుతూ వెల్లిపోతావు

నా ప్రేమనివ్యక్త పరుద్దామని
నీ వద్దకు ప్రతీరోజూ వస్తాను
కానీ ఏమీ చెప్పలేకపోతాను
ఒక అందమైన గులాబీకి
గంటలకొద్దీ మాటలు చెప్పి
జేబులో దాచుకుని వస్తాను
దాపరికం లేకుండా
నా సర్వస్వం నీవేనని చెప్పాలనుకుంటాను
లోకోత్తర వీరుడను
నీముందు భీరువుడనౌతాను
నా ప్రపంచమంతా ఆ క్షణంలో నీదవుతుంది
వ్యక్త పరుచడానికి నాకంటూ ఏదీ మిగలకుండా పోతుంది
హృదయం మాత్రం వేగంగా కొట్టుకుంటంది
ఆ వేగాన్ని అణచడం నాకు కష్టమైపోతుంది
దాని శబ్దం మాత్రమే
ఆ నిశ్శబ్దంలో నా చెవులకు వినిపిస్తుంటుంది
నా గుండె నీది కానందుకు ఆ శబ్దం
ఒక్క క్షణమైనా నీకు వినిపించదు
ఏమీ చెప్పలేని నన్ను చూసి
నీవు విసుక్కుని వెల్లిపోతావు
జేబులో పువ్వు వాడిపోతుంది
గుండె వేగాన్ని విని హడలివుంటుంది
మరుసటి రోజు గులాబీ నాకోసం మల్లీ పూస్తుంది
నా ప్రేమని వ్యక్త పరుద్దామని
నీ వద్దకు ప్రతీరోజూ వస్తాను.