కదం త్రొక్కుతూ పదం పాడుతూ హృదయాంతరాళం గర్జిస్తూ...పదండి పోదాం.
-------------------------------------------------------------------------------------------------
ఒక కవిని, అతడి కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సాధనాలూ పద్ధతులూ ఎన్నో వున్నా, వర్తమాన, అలాగే కడపటి భూతకాల సాహిత్య చరిత్ర కనుక మనకు తెలిసి వుండకపోతే, ఆ కవిత సంపూర్ణంగా అర్థమయిందని చెప్పగలగటం సాహసమే అవుతుంది. ఎందుకంటే కవి జీవితం, వ్యక్తిత్వం అలాగే అతడి కవిత అన్నీ కూడా కాలానితో అవినాభావ సంబంధాన్ని కలిగి వుంటాయి. కడపటి భూతకాలమూ, నేటి వర్తమాన పరిస్థుతులూ రెండూ కవి ఆలోచనల్ని ప్రభావితం చేస్తాయి, అలాగే కవి కూడా తన రచనలతో అతడి వర్తమాన, సమీప భవిష్యత్తునూ ప్రభావితం చేయగలుగుతాడు. మనకు చాలా మటుకు తాను జీవించి వున్న కాలం యొక్క ప్రభావానికి లోనయిన కవులే కనిపించినా...ఎక్కడో ఓ చోట ఒక మహా కవి, ఒక యుగ కవి, తాను నివసించిన కాలాన్ని శాసిస్తూ కూడా కనిపిస్తూంటాడు. అలాంటి కోవకి చెందిన వాడే శ్రీశ్రీ.
శ్రీశ్రీ మహా ప్రస్థానం పుస్తకంలోని కవితలు 1930 - 1940 సంll ల మధ్య కాలం లో రాసినవి. ఇలాంటి సమయంలో పశ్చిమ దేశాలయిన యూరోప్ అమెరికాల్లో మొదటి ప్రపంచ యుద్ధ ముగింపు ప్రభావమూ, గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ 1929, తద్వారా హంగ్రీ థర్టీస్ వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి ప్రభావం పశ్చిమ దేశ సాహిత్యంలో పెను మార్పులు తీసుకువచ్చి, 'మోడెర్నిజం' అనే సాహిత్య దశ కనిపించటం మొదలయ్యింది. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా రాజకీయ సాంస్కృతిక రంగాల్లోనే కాక, సాహిత్య రంగంలో కూడా అధికారం మెల మెల్లగా బ్రిటీష్ చేతుల నుండి అమెరికాకు మారటం సంభవిస్తూ వుండింది. ఎజ్రా పౌండ్, టీ.ఎస్.ఇలియట్ వంటి అమెరికన్ కవులు మోడర్నిస్ట్ మానిఫెస్టోతో ఆంగ్ల సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న తరుణమది. ఇక్కడ, భారత దేశంలో బ్రిటీష్ పరిపాలన ఉంది. దాని ప్రభావం వలన ప్రజా చైతన్యం, కేవలం రాజకీయ చైతన్యంగా మాత్రమే కాక ఇంకా రెండు రకాల చైతన్యాలుగా వృద్ధి చెందుతూ వచ్చింది. మొదటగా, ప్రాచీన భారత వైభవాన్ని పునర్నిర్మించే దిశగా మత సంస్కరణలూ, సమాజోద్ధరణలూ ఊపందుకున్నాయి. అందుకు రాజా రామ్ మోహన్ రాయ్, స్వామీ దయానంద సరస్వతి, స్వామీ వివేకానందుడూ మున్నగు వారు తమతో నూతన చైతన్యాన్ని కూడా భారత సమాజం లోకి తీసుకు వచ్చారు. అందులో భాగంగానే ఏకేశ్వరోపాసన, పౌరాణిక సంస్కృతి స్థానే వైదిక సంస్కృతి యొక్క పునరుద్ధరణ, అగ్రవర్ణ ఛాందస వాద ఖండన, బాల్య వివాహాది మూఢ విశ్వాసాల ఖండన, విశ్వ మానవ అంకురార్పణ వంటి అంశాల్ని సమాజపు తెరమీదకి తెచ్చి ముందుకు నడిపించారు. మరో వైపు ఆంగ్ల విద్య పాశ్చాత్య సాహిత్య చైతన్యాన్ని కూడా అందించింది. బ్రిటీష్ లో వర్ధిల్లిన రొమాంటిసిజం మన దేశం లో కూడా తన ప్రభావాన్ని చూపించింది. బెంగాల్ లో రవీంద్రుడి మొదలు ఇక్కడ తెగులో విశ్వనాథ, కృష్ణ శాస్త్రి మున్నగు వారి చేత ప్రణయాలు, విరహాలు, వియోగాలు, విషాదాలూ అద్భుతంగా పలికించింది. ఇక్కడ గమనించినట్టైతే రాజకీయ చైతన్యానికి తప్ప, మిగిలిన ఈ రెండు చైతన్యాల్లో బ్రిటీష్ పాలనపై ఏహ్య భావమేమీ లేకపోగా, సానుకూల భావన కూడా అగుపిస్తుంది.
కానీ మొదటి ప్రపంచ యుద్ధం, ప్రాశ్చాత్యానికి 'రెనీసా' అందించిన మానవత్వ భావననీ, 'రోమాంటిసిజం' అందించిన ప్రణయాది ప్రేమభావనల్నీ, విరహాది మేలంఖోలీని అకస్మాత్తుగా వెనుకకు లాగేసుకోవటం చేసింది. యుద్ధపు తరువాతి పరిస్థితులు మానవుడి స్థితి గతి ఏమిటని ప్రశ్నించాయి. ప్రపంచ వర్తమానం ఒక అయోమయావస్థకు నెట్టివేయబడేసరికి , 'గతకాలమే మేలు వచ్చే కాలము కంటెన్' అని విశ్వసించే రోజులెక్కువౌతున్నట్టనిపించింది. వేస్ట్ లాండ్, యులిసిస్ లు వర్తమానాన్ని చూసి పెదవి విరుస్తూ కనిపించాయి. చైతన్య స్రవంతిలో గొణుక్కుంటున్నట్టు వినిపించాయి. 'మంచి గతమున కొంచమేనోయ్, మందగించక ముందుకడుగెయ్యమ'ని దిశా నిర్దేశం చేసేవారు కావాల్సి వచ్చింది. సాహిత్య పరంగా పాశ్చాత్యాన్ని అనుసరించే భారత దేశం, ఈ పరిస్థితులనుంచి, చాలానే నేర్చుకుంటూ కనిపించింది. ఇక్కడి పరిస్థితులు కూడా ఇంచుమించు అక్కడిలాగా అస్ధవ్యస్థంగానే సాగుతున్నట్టుగా తెలుసుకోగలిగింది. అలాంటి సమయంలోనే దారిలో లాంతరులా తెలుగులో నవ యుగ వైతాళికుడిలా గురజాడ నవ సాహితీ లోకానికి రోడ్డు వేయటం మొదలెట్టాడు. ఆ తరువాత వచ్చిన శ్రీశ్రీ గురజాడ వేసిన రోడ్డును వెడల్పు చేయటం మొదలెట్టాడు. అందుకే ఛంధో బద్ద కవిత్వపు సర్ప కోరల్ని గురజాడ జాగ్రత్తగా పెకిలింప ప్రయత్నిస్తే, శ్రీశ్రీ ఆ సర్ప పరిష్వంగం నుంచి పూర్తిగా తప్పించగే ప్రయత్నం చేసి విజయుడిగా నిలబడ్డాడు.
అందుకే 'మహా ప్రస్థానం' కవితలో వినిపించే పిలుపు మరో ప్రపంచపు పిలుపు. ఆధునికతవైపు నడవమని కవి మనల్ని పిలిచే పిలుపు. మనిషి మరణం తరువాత పొందే పరలోకమో, స్వర్గమో కాదు ఆ మరో ప్రపంచం. అట్టి స్వర్గాదులకు పోవాలంటే పదండి ముందుకు అనే బదులు, చావండి ఇపుడే అనవలసి వచ్చేది. కానీ పదండి ముందుకు పదండి తోసుకు అని అంటున్నాడంటే, అది ఇపుడే, ఈ క్షణమే, మనం మారిన తక్షణమే కనిపించే కొత్త ప్రపంచమే. అందుకే మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పైపైకి. ఉన్న స్థానం నుండి కేవలం ముందుకు మాత్రమే కాకుండా, కేవలం పైకి మాత్రమే కాకుండా , ముందుకీ ఆపై, పైకీ కూడా ఒకేసారిగా పయనం. ఈ కవిత తెలుగు సాహిత్యంలో ఒక ల్యాండ్ మార్క్. ఒక నవ్యత వైపు కదలమని వినిపించిన మొట్ట మొదటి పిలుపు. కదం త్రొక్కుతూ పదం పాడుతూ హృదయాంతరాళం గర్జిస్తూ...పదండి పోదాం. కవితలో కవి ఆ మరో ప్రపంచానికి ఎలా సమాయత్తమై పోవాలో..ఎవరు పోవాలో ఎవరు పోకూడదో స్పష్టంగా చెబుతాడు కానీ ఆ మరో ప్రపంచం ఎలా వుంటుందో చూచాయగా తప్ప స్పష్టంగా చెప్పడు.
మరో ప్రపంచానికి ఏ విధంగా పోవాలి?. కదం త్రొక్కుతూ, పదం పాడుతూ, హృదయాంతరాళం గర్జిస్తూ, దారి పొడగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ, ప్రభంజనం వలె హోరెత్తుతూ, భావ వేగమున ప్రసరిస్తూ , సైనికుడి వలె, వర్షకాభ్రముల ప్రళయ ఘోషవలె, పెళపెళ విరుచుకు పడుతూ, త్రాచుల వలెనూ, రేచుల వలెనూ, లక్ష్యాన్ని ఛేధించగల ధనంజయునిలా, నయగారా శివసముద్రమూ జలపాతాల వలె ఉరుకుతూ..ముందుకు సాగాలంటాడు. ఎంతటి ఆశని నమ్మకాన్ని ఇస్తున్నాడో కవి ఇక్కడ. ఇది దిశా నిర్దేశమే. మరి అక్కడికి ఎవరు పోవాలి?. ఎముకలు కుళ్లిన వయస్సు మళ్లిన సోమరులు కాకుండా, నెత్తురు మండే శక్తులు నిండే సైనుకులే పోవాలి. 'వట్టిమాటలు కట్టి పెట్టోయ్ గట్టిమేల్ తల పెట్టవోయ్' అని గురజాడ అంటున్నట్టే వుంది కదా ఇక్కడ!.
మరి ఆ మరో ప్రపంచం ఏమిటి?. ఇందాకా చెప్పుకున్నట్టు మనిషి చచ్చాక పొందే పరలోకమో స్వర్గమో ఖచ్ఛితంగా కాదది. అందుకే ఈ మహా ప్రస్థానం మహాభారతంలో వచ్చే చివరి మరణం కాదు. పైగా అందుకు విరుద్ధంగా ఇది కొత్తగా మొదలయ్యే మహా ప్రయాణం. ఇది ఇలియట్ కవి వేస్ట్ ల్యాండ్ లోని 'క్రూర ఏప్రిల్ మాసం' లాంటి ప్రయోగం. అందుకే ఇది ప్రగతి వైపుకి, ఆధునికత వైపుకి ప్రయాణం. ఈ ధరిత్రి అంతటా ఆ మరో ప్రపంచం నిండి వుందట. అంటే ఆధునికతనే ఆ మరో ప్రపంచం అన్నది మరోసారి స్పష్టం. పురాణేతిహాసాల్లోని స్వర్గమో, పరలోకమో అయితే ఇలా ధరిత్రి అంతటా నిండి ఉండదు కదా?. కవితలో ఈ మరో ప్రపంచానికి సంబంధించిన ప్రతీకలుంటాయి. వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం అని అడుగుతాడు కవి. ఆ జలపాతపు ఘోష అని ఉద్దేశం కావొచ్చు. కంచు నగారా విరామ మెరుగక మ్రోగిందని శబ్ద సంబంధ ప్రతీక ఇంకొకటుంటుంది. నయాగారా జలపాతంలా శివసముద్రంలా ఉరకండి అని జలపాతాల్ని ఇంకొక చోట రూపకాలంకారంలతో ఉద్రేకాల్ని స్తబ్ద ఉపమేయాలకి అద్దుతాడు కవి. నయాగారా ఉత్తర అమెరికాలో వుండటం, అక్కడే ఆధునిక సాహిత్య అంకురార్పణ జరగడం యాదృచ్చికం కాకపోవచ్చు. కానీ ఏ సంబంధం లేకుండా కర్ణాటక లో వుండే శివ సముద్రమనే జలపాతాన్ని కూడా కలపటం వల్ల, నిగూడార్ధ దృష్టితో కాక, ఇవి అతి పెద్ద జలపాతాలు కాబట్టి మాత్రమే కవితలోకి తీసుకున్నట్టనిపిస్తుంది.
కణ కణ మండే త్రేతాగ్ని, అగ్ని కిరీటపు ధగధగలు, ఎర్ర బావుటా నిగనిగలూ, హోమ జ్వాలల భుగ భుగలూ మరో ప్రపంచంలో కనబడటం లేదా అని అడుగుతాడు కవి. అగ్నికిరీటం జ్ఞానానికి, ఎర్ర బావుటా సోషలిజానికీ, హోమ జ్వాలలు పారిశ్రామిక శక్తికీ ప్రతీకలనుకోవచ్ఛు. అయితే శ్రీశ్రీ ఈ కవిత రాసే సమయానికి తనకి కమ్యూనిజం అంటే అవగాహన లేదన్నాడు కాబట్టి, ఇదమిత్తంగా ఎర్ర బావుటా అంటే ఇదీ అని చెప్పలేము. కాబట్టి ఈ మరో ప్రపంచానికి సంబంధించిన ప్రతీకల్లో అర్థాన్ని అనిర్దిష్టంగా ఉంచబడింది. ఈ ప్రతీకల్ని అస్పష్ట అర్థస్ఫూర్తి కోసమే వాడుకున్నారు తప్ప, నిర్ధిష్టార్థంతో వాడుకోలేదు అనిపిస్తుంది. తద్వారా కవి యొక్క దృష్టి మరో ప్రపంచపు వివరణ పై కాక ఆ ప్రపంచం వైపుగా తిప్పటమే ప్రధానమనిపిస్తోంది. అలాగే త్రేతాగ్నిని జీవితం మొత్తం సాగే అగ్నిగా, అంటే నిరంతర జ్ఞానంగా భావన చేసి ఉండవచ్చు. శ్రౌత యాగాలల్లో ఈ త్రేతాగ్నులు వస్తాయి. గార్హపత్య, ఆవహనీయ, దక్షిణాగ్నులు. పెండ్లి అయినప్పడు లాజహోమంలో వెలిగించే ఆవహనీయ అగ్నిలా మొదలయ్యి, జీవితాంతము వరకు గార్హపత్య అగ్నిగా వ్యక్తిని నడిపి, చివరకు తన చితిని కూడా, అప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చిన అగ్నితో, దక్షిణాగ్నిలా ముగించే ఒక ప్రక్రియ ఇది. అలాంటి ప్రక్రియని కొనసాగించే వ్యక్తిని అగ్ని హోత్రుడంటారు. మరో ప్రపంచంలో జీవిత మంతా అగ్నిహోత్రుడి తపస్సులా సాగే జ్ఞానాన్ని, కణ కణమండే త్రేతాగ్ని లా భావన చేసి ఉండవచ్చు. అగ్ని జ్ఞానానికి సిద్ధ ప్రతీక.
తరువాత ఈ కవితలో హరోం హరోం హర, అనే పదము కనిపిస్తుంది. శివుని ప్రమథ గణాలు వీరభద్రుని ఆధ్వర్యంలో దక్ష యజ్ఞాన్ని కూల్చినపుడు హర హర మహాదేవ అంటూ హరుడిని స్తుతించాయంటారు. దానికి తెలుగు రూపం హరోం హరోం హర అయిందనుకోవాలి. సంస్కృత వ్యాకరణం రీత్యా..'ఓం కారం' మంత్ర మధ్య భాగం లో రాదు. కాబట్టి, ఇది తెలుగు పదమే. లేదా శృతి సంబంధం కాక, కావ్య సంబంధమైన సంస్కృతమై ఉండిండాలి. అలాగే కవితలో ప్రళయానికి సంబంధించిన ప్రతీకలు కనిపిస్తాయి. ఎనభై లక్షల మేరువులు సముద్రాల తిరిగి జల ప్రళయ నాట్యం చేయటమనే దృశ్యం కనిపిస్తుంది. వీటి పరమార్థం బోధపడదు. 'సలసల కాగే చమురా కాదిది, ఉష్ణ రక్త కాసారం' అనేది, యంత్రం కాదు మనిషి అనే భావనని ఇస్తోంది. దీని పరమార్థం కూడా ఇదమిత్తంగా ఇదీ అని చెప్పటం కష్టం. మరో ప్రపంచం మరో ప్రపంచం అనే కవితా ముఖభాగం శబ్ద పరంగా త్యాగరాజ కృతి 'భజ గోవిందం భజగోవిందం' తో సమానంగా ఉందనే ఇంకో పరిశీలన కూడా ఉంది. కవిత చాలా మటుకు వృత్త్యనుప్రాసాలంకారంలో కొనసాగుతుంది. దాని వలన నిజంగానే ప్రవాహ ఉధృతి కవిత గమనంలో కనిపిస్తుంది. వినిపిస్తుంది.
విప్లవాన్ని రగిలించే, విప్లవ నాయకుడు పుట్టాలంటే మొదట ఒక విప్లవ కవి పుట్టాలి. రష్యాలో ఒక లెనిన్ పుట్టడానికి ముందు, దాదాపు రెండు వందల సంవత్సరాలుగా ఆ నేలని విప్లవ భావాలతో తడిపేసిన పుష్కిన్, టాల్స్టాయ్, ఛేకోవ్, గొగోల్, తుర్జెనీవ్, దాస్తోయెవస్కీ లు పుట్టాల్సి వచ్చింది. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంకలనం 1950లో మొదటి ముద్రణతో మనముందుకు వచ్చింది. ఇపుడు యువ కవులు కూడా పుట్టుకు రావాలి. నవ్యత వైపు కొనసాగాలి. శ్రీశ్రీ కవిత్వంతో పాటు అతడు అనుసరించిన నవ్యత మనకు స్ఫూర్తి కావాలి. రేపటి తరం విప్లవ నాయకులకోసం కవులు కవిత్వంతో ఇప్పటి ఈ నేలని సారవంతం చేయాలి. ఇప్పటికి ఇరవైకి పైగా పునర్ముద్రణలు పొందిన మహా ప్రస్థానం, మనల్ని మన ఆలోచనల్ని ఎంతగా ఆధునీకరించ గలిగిందో మనకు మనం సమీక్షించుకోవాలి.
చివరగా ఈ వ్యాసాల పై ఒక మాట. మనం అభిప్రాయాల్ని, లభించిన దృక్కోణాలాధారంగా ఎప్పటికప్పుడు సాధించుకుంటాము కాబట్టి, వీటికి మత సూత్రాల మాదిరిగా ఎమోషనల్ వ్యాల్యూని ఆపాదించి యూనివర్సాలిటీని ప్రతిపాదించవలసిన అవసరం లేదని చెప్పదలచాను. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే చర్చకు ఆస్కారమివ్వటం వలన కొత్త విషయాలను ఇచ్చిపుచ్చుకునే జ్ఞాన విస్తృతికి అవసరమైన సత్ వాతావరణాన్ని మనమే నెలకొల్పుకోవాలని మనవి.
శ్రీ శ్రీ కవిత 'మహా ప్రస్థానం' వ్యక్తమవటానికి గల చారిత్రక తాత్విక పరిస్ధితులను అవగాహన చేసుకోవటానే విషయంలో ఒక అడుగు ముందుకే వేయగలిగామని విశ్వసిస్తూ సెలవు. వచ్చే వారం మరొక కవిత్వ సందర్భంతో కలుద్దాం.