Friday, 29 January 2016

కవిత్వ సందర్భం 10

డామిట్ కథ అడ్డం తిరిగింది. పాత్రలు అక్కడే ఆగిపోయాయి
............................................................................
నాటకంలో ఆ నాటకం రాసిన రచయిత స్టేజీమీద చచ్చిపోతాడు. "డెత్ ఆఫ్ ద ఆథర్" అని నిర్దక్షిణ్యంగా ప్రకటించేస్తాడు రోలాండ్ బార్త్..  కంటి ముందు కదలాడే సజీవ పాత్రలు, ఆ పాత్రల్ని రక్తి కట్టించే నటులు అందరూ కలిసి రచయితను స్టేజి మీదనుంచి, ప్రేక్షకుల హృదయాల్లోంచి అప్పటికైతే తోసేస్తారు. నాటకం ముగిసిపోతుంది. కొంత కాలానికి నాటకంలోని పాత్రలూ చచ్చిపోతాయి. రచయితా' పాత్రలు కట్టిన నటులూ అందరూ చచ్చిపోతారు. ఆ నాటకాన్ని చవి చూసిన ప్రేక్షకుడు మాత్రం చచ్చిపోడు. తనకు తాను మరో ప్రేక్షకుడై పుట్టుకొస్తాడు. ఆ ప్రేక్షకుడు ఒక కవి అయ్యుంటే అసలే చావనీయడు. ఎవరినీ చావనీయడు. నాటకాన్నీ, రచయితనీ, పాత్రల్నీ, నటులనీ ఎవరినీ చావనీయడు. అలాంటి రచయిత గురజాడ, అలాంటి రచన కన్యాశుల్కం, అలాంటి కవి శివసాగర్. "డామిట్!  గురజాడా ! "  అనే కవితా శీర్షికతో మరలా గురజాడనీ ఆయన పాత్రల్నీ పునరుజ్జీవింప జేసి తీసుకొస్తాడు మనముందుకు. అలాంటి కవి ఒట్టి కవే కాదు విమర్శకుడు కూడా. మార్సిష్ట్ దృక్పథంతో గతి తార్కిక చారిత్రక భౌతిక వాదం తెలిసిన వాడే అయితే ఇక కవితే ఒక విమర్శగా మారిపోయే అవకాశం ఎక్కువ కదా.

ఈ కవితలో శివ సాగర్ అదే చేస్తాడు. అది కవిత మాత్రమే కాదు.1890 వ దశకం లో వచ్చిన  గురజాడ కన్యాశుల్కానికి 1980 వ దశకంలో వస్తున్న విమర్శ ఈ కవిత. ఒక రచన విలువను కొలమానాలతో నిర్ణయించే విమర్శకుల స్థాయి నుంచి దాటి,  చారిత్రక, తాత్విక నేపథ్యాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకునే విమర్శకుల స్థాయిని దాటి, ఆ రచన వర్తమానానికి, సమీప భవిష్యత్తుకు ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అని విశ్లేషించుకునే విమర్శకుని స్థాయికి ఎదిగి, దానిని ఈ కవితలో సాధిస్తాడు  కవి. గురజాడ రచన పుట్టిన విజయనగరం ప్రాంతం అప్పట్లో కన్యాశుల్కమనే సాంఘిక దురాచారానికి లోనయ్యి, ముక్కుపచ్చలారని పుత్తడి బొమ్మలని కాటికి కాళ్ళు చాచే వృద్ధులకిచ్చి డబ్బుకోసం పెళ్లిళ్ళు చేసేవారు. ఇలాంటి సాంఘిక సమస్యని నాటకాంశంగా తీసుకుని ఆ వ్యవస్థని అధిక్షేపిస్తూ గొప్పటి సటైర్ ని పండించారు గురజాడ గారు. కథలో కన్నీరు, కథనంలో వైచిత్ర్యమూ, మాటల్లో హాస్యమూ, శిల్పంలో వ్యంగ్యమూ, పాత్రల్లో సహజత్వమూ కలగలిపి ఆనాటి బ్రాహ్మణ అగ్రకులంలోని అభిజాత్యాల్ని సంస్కరణా చైతన్యమనే దుడ్డుకర్రతో చితకబాదారు. అగ్నిహోత్రావధానులూ, గిరీశం, లుబ్దవధానులూ, మధురవాణి, బుచ్చమ్మ, అచ్చమ్మ, అసిరిగాడు, అందరూ ఆనాటి సమాజానికి ప్రతినిధులు. నాటకం అయిపోయింది. అందరూ ఇండ్లకు వెళ్లిపోయారు. కొంతకాలం గడిచిపోతుంది. 'గొప్ప నాటకం' అన్న వారందరూ కొంత కాలానికి మరచి పోయారు. ఎందరో పోయారు. కాలం చేశేశారు. ఇపుడు ఎక్కడో ఒక కవి ఆ పాత్రలన్నీ ఏమైపోయాయని ఆలోచిస్తాడు. ఇఫుడున్న సమాజంలో వారు ఎలా ఉండేవారో అని ఊహిస్తూ కూచుంటాడు. ఊహతో సరిపుచ్చుకోక 'తత్వఘానం' తెలిసిన కారా మాస్టారునో, 'మహోదయం' రాసిన కెవీ రమణా రెడ్డినో కలిసి కించిత్ మంతనాలాడి బేరీజు వేసుకుంటాడు.

"ప్రవహించే కాలాన్ని
నీ పాత్రల పరిణామంతో
కొలుస్తున్నాను

కలహించే కాలాన్ని
నీపాత్రల పరిణామంతో
లెక్క కడుతున్నాను"

అక్కడితో ఆగక గురజాడతో ఏకంగా పేచీ పెట్టుకుంటాడు. ఏమని పేచీ?. ఆయన పాత్రలు సజీవమైనవని పేచీ. అవి చావకుండా ఇంకా బతికి ఉండటమే కాక కాలంతో పాటు మార్పు చెందుతున్నాయంటాడు. ఇంకా ఏమంటాడో చూడండి

"గురజాడా!
ఏం చెప్పను?
నీవు సృష్టించిన పాత్రలు
నీవు పెట్టిన హద్దుల్లో లేవు
పాత్రలు తీన్తేర్ అయిపోయాయి
కొన్ని పాత్రల పత్తా కూడా లేదు
పత్తేదారు చేయగల్గిందీ లేదు.

డామిట్! కథ అడ్డం తిరిగింది
పాత్రలు హద్దుమీరి పోయాయి"

ఇక ఒక్కో పాత్ర ప్రస్తుతం ఏం చేస్తుంది, ఏ పరిస్థితుల్లో వుంది అనేది కవితలో సింహ భాగం. ఈ పాత్రలన్నీ తమ హద్దులు దాటిపోయాయి. ఒక వస్తువులా నిర్దిష్టమైన పరిమాణం, నిర్ధారిత గుణమూ కలిగిన పాత్రలు పరిమాణం హద్దులు దాటి గుణాత్మక పరిణామానికి లోనవుతాయి. కాలానుగుణంగా అభివృద్ధి చెందుతాయి. గిరీశం ఏం చేస్తున్నాడుకున్నారు? సంస్కరణ వాదంతో, మాటకారి తనంతో పబ్బం గడుపుకునే చదువుకున్న బడాయికోరు గిరీశం, తన పరిధి హద్దుల్ని దాటిపోతాడు. 1980 దశకంలో మన రాష్ట్రంలో గిరీశం పేరు చెబితే మనకు గురజాడ పాత్ర గిరీశం ఒకరే గుర్తుకు రావాలి. కన్యాశుల్కం సినిమాలో ఆ పాత్ర పోషించిన వారు కూడా మనకు గుర్తుకువస్తే అది మన బాధ్యత కానే కాదు.

"రాజాగారి అండతో
తన యలోక్వెన్సీ తో
జాతిని లొంగదీసుకుని
దిబ్బ రాజ్యానికి
మహా మాంత్రికుడయ్యాడు
ప్రస్తుతం లోకాన్ని
మరమ్మత్తుఱచేస్తున్నాడు

పామర జనం కోసం
ప్రతి రోజూ ప్రాణాలర్పించి
తిరిగి,విచిత్రంగా లేస్తున్నాడు
తన జాతి కోసం
హెవెన్ లోని కరప్టెడ్ గాడ్ తో
డైలీ కొట్లాడుతున్నాడు
బ్రహ్మర్షి విశ్వామిత్రుడై
త్రిశంకు స్వర్గాన్ని
సృష్టించాలనుకుంటున్నాడు

నీ గిరీశం వెనుకటి గిరీశం కాదు
పరశు రాముడై
గొడ్డలి పట్టుకు తిరుగుతున్నాడు

'నా పేరు గిరీశమే
నినద భీషణ శంఖము
దేవదత్తమే కబడ్దార్!!'
అని గాండ్రిస్తున్నాడు

ప్రస్తుతం
కరప్షన్ చార్జీల్లో,
ఇరుక్కొని
విల విలా తన్నుకుంటున్నాడు"

 ఇక మధురవాణి. శూద్రకుని సంస్కృతనాటకం 'మృచ్ఛకటికం' ప్రభావం కన్యాశుల్కం మీద ఉందని తెలుసు కాబట్టే మధురవాణి పాత్రని 'నీ వసంత సేన' అని అంటాడు కవి. బుద్ధి ఛెప్పగల ప్రజ్ఞ, సమయోచిత చొరవ గల మధురవాణి,

 "కించిత్ తిక్క లేకుంటే
ఆమెలాంటి మనిషి మరి లేదని
అనిపించుకున్న మధురవాణి

'నీ వసంత సేన' మధుర వాణి
లోకం తీరుకు తిక్కరేగి, పిచ్చెక్కి
విశాఖ కరంచంద్ గాంధీ ఆస్పత్రిలో
చాలాకాలం కోమాలో వున్నది".   విశాఖలో కరంచంద్ గాంధీ ఆస్పత్రి అంటే కింగ్ జార్జి ఆసుపత్రియే. దానికి ఇలా పేరు మార్చాలని అనుకున్నారట. అక్కడ కోమాలో ఉన్నది మధురవాణిగా పాత్ర వేసిన సినీ నటి అయితే కాదని తెలిసినా కవి సారూప్యతల్ని మన మీదకి వదిలాడేమో.

ఇక 'ప్యూర్ డైమండ్ 'బుచ్చమ్మ విడో హౌజ్ నుండి వచ్చేసి, నాస్తికుణ్ణి పెండ్లాడిందనీ, 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్' పద్యాన్ని గొప్ప ఇంగ్లీషులాగా భ్రమింపజేసిన గిరీశం శిష్యుడు వేంకటేశం, ఖాదీ బండార్ లో కొలువుతీరి ఉన్నాడనీ, సురేంద్రనాథ్ బెనర్జీ కావడం కన్నా ఎన్జీవో సూరీడు కాగల్గడం గొప్పనుకుంటున్నాడనీ అంటాడు కవి. అందరం మర్ఛిపోయిన అచ్చమ్మ, రంగనాయకమ్మలా కత్తిలాంటి కలం పట్టి మనుష్యుల్లాంటి పశువుల్ని
'బలిపీఠం' మీద నిలబెడుతున్నదట. ఇలా గురజాడ గుర్తించిన పాత్రలే కాకుండా ఆయన కూడా గుర్తించని పాత్రలు నేషనల్ కాంగ్రేసు లో ఓటరు మహాశయులయ్యారనీ, అగ్ని హోత్రావధానుల గేదెను కాసిన అసిరిగాడు కమ్యూనిష్టయ్యాడనీ, అసిరి గాడి అన్న దళిత సంఘాన్ని భుజాలకెత్తుకున్నాడనీ, స్పష్టమైన సామాజిక వర్గ విభజననీ, వర్గ సంఘర్షణనీ కవితలో చూపుతాడు కవి. ఇక్కడే కవి చారిత్రక భౌతికవాద దృక్పథాన్ని అవలంబించి కవిత్వం చేస్తాడు. ఇలా కన్యాశుల్కంలోని ప్రతీ పాత్రనీ వివరిస్తూ సాగుతాడు. గురజాడకు ఒక ప్రోగ్రేస్ రిపోర్ట్ లాగా సమర్పిస్తాడు కవి. ఆ రిపోర్ట్ ఇప్పటికీ అలాగే ఉంది. పెద్దగా మారిందేమీ లేదు.

"ఇదీ పరిస్థితి!
ఇదీ నీవు ప్రేమించిన
నీ జాతి ప్రోగ్రెస్ రిపోర్ట్!
నీవు ప్రేమించిన నీ దేశం
నేడు రగులుతున్న రణరంగం
గుండెలేని మనిషి లేనట్లే
జెండాలేని మనిషి
ఇవ్వాల ఇక్కడ ఎవరూ లేరు"

గురజాడ రచనే కావచ్చు, మరేదైనా రచన కావచ్చు, ఆ కాలం నాటి పరిస్థితుల్లో ప్రగతిశీలమా కాదా అనే అంశం అభ్యుదయ రచనకు గీటురాయి అని అనుకున్నపుడు, నికరంగా ఈ పలానా సాహిత్యం యొక్క చరిత్ర ఇదీ, తాత్విక నేపథ్యం ఇదీ అని తెలియని రచనలని కూడా కేవలం వాచ్యార్థ పదబంధాలకు తల బాదుకుని బొప్పికట్టించుకుని మార్సిష్టు దృక్కోణంలో చీల్చి చెండాదాలనుకునే ఆధునిక విమర్శకులకి తన కవితలోనే చివరలో ఒక సంతృప్తికర సమాధానంలా ఒక వాక్యం ఉంటుంది. "చారిత్రక విభాత సంధ్యల/ మానవ కథ వికాసమెట్టిది?" అని. ఈ చారిత్రకత అనే ఇరు సంధ్యల నడుమదే కవికి ప్రధానంలా కనిపిస్తుందిక్కడ. చరిత్ర తొలి సంధ్యను వెతుకుతూ పోవాలి. మలి సంధ్యని వర్తమానంలో కనుగొనాలి కాబట్టి, చరిత్ర పూర్వం గురించిన బాధ ఈ కవికి లేదనేది స్పష్టం. మార్సిష్టు సాహిత్య విమర్శలోని పెద్ద దోషమే ఇదని వేల్చేరు వారు చెప్పే ఉన్నారు. నూతన పరిస్థితులనుంచి నూతన సత్యాలు ఉద్భవించినా వర్తమానంలోకి విరుచుకు పడని మనం గురజాడ పాత్రల్ని శివసాగర్ లా ఇంకాస్త ముందుకి కూడా జరపలేకున్నాం. అక్కడే ఆగిపోయి వున్నాం. డామిట్ కథ అడ్డం తిరిగింది. పాత్రలు అక్కడే ఆగిపోయాయి.

27/1/16

l ప్రచ్ఛన్న గీతంll

విరించి ll ప్రచ్ఛన్న గీతంll
..............................................
ఒక్కోసారి నీవు అందంగా నవ్వుతావు
ఒక్కోసారి పిడికిలి బిగించి బిగ్గరగా అరుస్తావు
ఒక్కోసారి భుజానికి ఓ వీరుడిని ఎత్తుకుని కన్పిస్తావు
ఒక్కోసారి కలల్ని కనులకు బిగించుకు కూర్చుంటావు
మిత్రమా..నా మాటగా వారందరికీ చెప్పు
నేనూ నీలాంటి వాడిననే చెప్పు

ఒక్కోసారి అమాయకంగా అనిపిస్తావు
ఒక్కోసారి కరడుగట్టిన తీవ్రవాదిలా కనిపిస్తావు
ఒక్కోసారి చేతుల్లో పలుచటి పూవులతో కనిపిస్తావు
ఒక్కోసారి మారణాయుధాలతో అందరినీ బెదిరిస్తావు
మిత్రమా..నామాటగా వారందరికీ చెప్పు
నేనూ నీలాంటి వాడిననే చెప్పు

ఒక్కోసారి నా ముందు అద్దంలా కన్పిస్తావు
ఒక్కోసారి అద్దంలోని ప్రతిబింబంలో వేరేలా కనిపిస్తావు
ఒక్కోసారి ముసుగేసిన ముష్కరుడిలా అగుపిస్తావు
ఒక్కోసారి ఏ ముసుగూలేని పసివాడిలా అనిపిస్తావు
మిత్రమా..నా మాటగా వారందరికీ చెప్పు
నేనూ నీలాంటివాడిననే చెప్పు

ఒక్కోసారి కవిత్వమేదో రాస్తూ కనిపిస్తావు
ఇంకోసారి రాసిందంతా కొట్టేస్తూ విసిగిస్తావు
ఒక్కోసారి పుస్తకాల్ని నమిలేస్తూ కనిపిస్తావు
ఇంకోసారి పుస్తకాల్ని చింపేస్తూ అగుపిస్తావు
మిత్రమా..నా మాటగా వారందరికీ చెప్పు
నేనూ నీలాంటి వాడిననే చెప్పు

చెప్పు మిత్రమా..తప్పక చెప్పు
మనసులోంచి పొంగుకొచ్చే గగ్గోళ్ళకి
నోరు సైలెన్సరుగా మారిపోయినపుడు..
వినిపించే వెర్రికేక లోకి ఇంకాస్త గట్టిగా అరిచి చెప్పు
కనిపించని అజ్ఞాత శక్తులన్నీ
గొంతునులిమి వేస్తున్నపుడు..
కాగితం మీదికి ఊదిన చివరి ఊపిరిలోకి ఒకింత బలంగా ఊది చెప్పు

హృదయాన్ని పలికించే కళ్ళ లోకి
మెదడుతో చూసే చూపులున్నంతకాలం
ఏకత్వాన్ని ప్రవహింపజేసే ఎర్రటి రక్తాల్లోకి
రంగుల్ని అద్దే రోజులున్నంతకాలం....
ఎండిన పెదవుల పగుళ్ళలోంచి
ముడతలు పడిన కాగితపు అంచుల్లోనుంచి
ఫోటోకు అతుక్కుపోయిన నవ్వులా చెప్పు
మెదడులో ఇరుక్కున్న గునపంలా చెప్పు
పదే పదే చెప్పు, నీ మాటగా చెప్పు
నేనూ నీలాంటి వాడిననే చెప్పు
నీవూ నేనూ మనమందరమూ మనుషులమని
వారందరితో నీవే నీవై చెప్పు.

26-1-16

కవిత్వ సందర్భం 9

ఆసుపత్రిలో కటిక చీకటి..
.................................
1975 సం లో నీలోఫర్ ఆసుపత్రి లోని నీయాన్ లైట్ల కాంతిలో ఎగురుతున్న కీటకాలని చూస్తూ, అదే లైట్లకింద వరండాలో నేలమీద పడుకుని ఉన్న పేద రోగుల్ని చూస్తూ ఒంటరిగా తిరుగుతోంది ఒక ఆకారం. చుట్టూ చిమ్మ చీకటి. రాత్రి చీకటి మాత్రమే కాదు. "నిశ్శబ్దపు పగటినిండా విరిసిన చీకటి"." చేతుల్నిండా గుండెల్నిండా నేత్రాల్నిండా చీకటి/చీకటి/ ఆ చీకటి కాలానికో పేరు పెట్టుకుంటే, అదే 'ఎమర్జెన్సీ కాలం'. "చీకటిలో విశ్లేషణ లేదు/ విబేధం లేదు/ చీకటిలో రోగ నిర్ణయం లేదు". చీకటి ఒక నియంత, అడ్డులేని అధికారి. "లాటరీలు వేయ్- గుర్రప్పందాలాడు/ శరీరాలు కోయ్- తార్రోడ్లు వేయ్/కళ్ళు పెరికేయ్- ఇళ్ళు లేపేయ్/ ఈమందు కాకుంటే ఆమందు/ రెగ్యులేషన్స్ -న్యూ రెగ్యులేషన్స్ / రివైజ్డ్ రెగ్యులేషన్స్". అన్నింటా ప్రతీ చోటా రెగ్యులేయన్స్, "ఎ సర్క్యులేషన్ ఆఫ్ డార్క్నెస్". ఆ చీకటిలో విశ్లేషణ లేదు, విబేధం లేదు. కోర్టులు లేవు, జైలు న్నాయి. ప్రెస్సులు లేవు, సప్రెస్సులున్నాయి. పార్లమెంటూ లేదు. కానీ.గవర్నమెంటు ఉంది. అదే రాష్ట్రపతి పాలన. మొత్తం ఈ చీకటి వ్యవస్థలో పని చేసేదేదయినా ఉందా అంటే ఉంది. అదే ఆసుపత్రి. ఎమర్జెన్సీ కేసులకోసం తెరవబడ్డ ఆసుపత్రి. ఆ ఆసుపత్రిలో ఒంటరిగా తిరిగే కవికి, ఈవ్వవస్థ మొత్తానికి ఈ ఆసుపత్రి ఒక ప్రతినిధిగా కనిపించింది. నియాన్ లైట్లకింద మెరుస్తూ చచ్చిపోయి బాగా వుబ్బిన తెల్లకుక్క కలేబరంలా ఆసుపత్రి కనిపించింది. తెలుపు నిజానికి శాంతికి గుర్తనుకుంటాం. కానీ కవి అంటాడు, "ప్రతీ నైచ్యమూ తెల్లదనం కింద దాగుంటుంది/ప్రతి క్రూరత్వమూ తెల్లదనం కింద రక్షణ పొందుతుంది".

'యథా రాజా తథా ప్రజా' అని నానుడి. ఒక వ్యవస్థలో సంస్థలు,వ్యక్తులూ ఆ వ్యవస్థ నడిచే తీరుకి ప్రతినిధులుగా కనిపిస్తుంటారు.  ఆ మధ్య ఫేస్బుక్ లో ఒక ఫోటో బాగా సర్క్యులేట్ అయింది. ఒక గవర్నమెంటు ఆఫీసులో అద్దాలకి అటువైపు, క్యూలో నిలబడి ఉన్న జనాలు-  ఇటువైపు ఉన్న ఉద్యోగిని ఆఫీసు పనులు చేయకుండా కంప్యూటర్ లో సోల్టేర్ ఆట ఆడుతూ  ఉంటుంది. అటు వైపు ఉన్న వారందరూ పాపం ఈవిడ తమ పనే చేస్తుందేమోననే ఆత్రుత లో అమాయకంగా కనిపిస్తుంటారు. కానీ నిజం అది కాదు. "పని చేయని ప్రభుత్వాలకు" ఈ ఫోటో ఒక ప్రతినిధి. అలాగే ఏ సంస్థా పని చేయని ఎమర్జన్సీ కాలంలో, పని చేస్తున్న ఏకైక సంస్థ ఆసుపత్రి. కాబట్టి ఆసుపత్రి ఆ వ్యవస్థనే ప్రతిబింబిస్తుంది. అందుకే కవి ఈ దీర్ఘ కవితలో ఆసుపత్రిని ప్రతినిధిగా తీసుకున్నాడు. దానిని ఏకసూత్రంగా ప్రతీకని చేసి, కవిత్వాన్ని చేసాడు. వాచ్యార్థంలో ఆసుపత్రిని గురించి చెబుతున్నట్టుగా ఉన్నా, అంతరార్థంలో ఆయన ఆ వ్యవస్థనే వివరిస్తున్నాడు. పుస్తకాన్ని బాణమనుకుని, ఈ బాణం మొత్తం వ్యవస్థకే తగలాలని గురిపెట్టబడిందని చెప్పుకున్నాడు. ఈ కవితలను శివారెడ్డి ఎందుకనో గానీ అలలు అన్నాడు. మొత్తం పన్నెండు అలలు. దీనిని ఆధునికులు కావ్యమన్నారు. సంప్రదాయకులు మామూలుగానే ఇదెలా కావ్యమని పెదవి విరిచారు. ఆధునిక కవిత్వంలోని ప్రతీకల, భావ చిత్రాల ప్రయోగం పరిచయంలేని సాంప్రదాయకులు అలాగే అంటారని మనం సర్ది చెప్పుకోవచ్చు. కానీ ప్రతీకే ఈ కావ్యానికి మూలస్థంభమని తెలియకపోతే నిజంగానే ఏమీ అర్థం కాదు. "Science gives conceptual knowledge of a situation; Art gives us the experience of that situation".  కాబట్టి ఆ కాలపు వ్యవస్థని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఈ ప్రతీకను అర్థం చేసుకుంటూ కవితో పాటు సాగాల్సిందే.

నిజంగానే ఎమర్జన్సీ పీరియడ్ కి ఆసుపత్రికీ సంబంధం ఉంది. ఈ కాలంలోనే అత్యధికంగా స్టెరిలైజేషన్ ఆపరేషన్లు జరిగాయి. ఆపరేషన్ చేయించుకున్న వారికి ప్రైజ్ మనీ మాట అటుంచి, చేయించుకోకపోతే ఉద్యోగాలు ఊడిపోతాయన్న భయమూ ఉంది. 'శరీరాలు కోయ్' అన్నది ఆదేశం.  ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ దాదాపు మగవారే కనుక వేసెక్టమీ ఆపరేషన్లు విపరీతంగా జరిగిపోయాయి. వేసెక్టమీ ఆపరేషన్ కీ పుంసత్వానికీ ఏమీ సంబంధం లేకపోయినా, ఎంతో మంది మగవారు పుంసత్వం కోల్పోయినట్లు బాధపడిపోవటం, రాజాజ్ఞ ఆ విధంగా రాజముద్రలా వారి శరీరాల మీద పడిపోవటం జరిగింది. 'ఇందిరా హఠావో! ఇందిర (ఇంద్రియము) బచావో!!'  అనే నినాదం దాకా ఇదంతా సాగింది. కాబట్టి ఆసుపత్రి ఇక్కడ ప్రతీకగా నిలిచింది. ఈ అసుపత్రియే ఇండియా.
"ఇంత ఆసుపత్రి
ఇంత పెద్దాసుపత్రి
ఇండియా అంత ఆసుపత్రి "..అని ఆసుపత్రి అంటే ఏదో కవి చెబుతున్నాడు. ఆసుపత్రి మీద పడగెత్తిన హస్తం. హస్తమంటే ఏమిటో, దేనికి ప్రతీకో విడమర్చనవసరం లేదనుకుంటాను. ఈ చేతుల గురించి ఒక భయంకర స్వప్నాన్ని కంటాడు కవి.
"స్వప్నం స్వప్నం
భయంకర స్వప్నం
అంతా నేలమట్టమయినట్టు కల
కలలో ఆసుపత్రి రాష్ట్రాల అసెంబ్లీ భవంతిలా గోచరించింది
ఆసుపత్రి పార్లమెంటు భవనంలా రూపుదిద్దుకుంది
మరుక్షణంలో మరుక్షణంలో
ఈ దేశపు పొలాలూ నదులూ అడవులూ కొండలూ
కర్మాగారాలూ- అన్నీ చేతులుగా మారి
భయంకరమైన పెద్ద పెద్ద చేతులుగా మారి
రాక్షస చేతులుగా మారి
చేతులే చేతులే చేతులే చేతులే
చేతులు దండెత్తి వచ్చి
చేతుల దండయాత్ర-
ఆసుపత్రిని పెళ్ళగించి వేశాయి.
ఆసుపత్రిని భూమట్టం చేశాయి.
నేల ఈనినట్టు చేతులే ఆకాశం వర్షించినట్లు చేతులే
చేతుల సైన్యాలు చేతుల సైన్యాలు ఎటు జూచినా
చేతుల సైన్యాలే చేతుల సైన్యాలే
చేతుల సైన్యాల సముద్రాలే - సముద్రాలే
అనల గీతాలు పాడుతూ  చేతులే- చేతుల మార్చ్
సముద్రాల చేతుల దండయాత్ర జైత్రయాత్ర
నేను చేతుల కాళ్ళ కింద దుమ్మయిపోయాను
భయంకర స్వప్నం రాక్షస స్వప్నం
ఓ రాజముద్రా..
కొన్ని కలలు నిజమవుతాయి
కొన్ని కళ్ళ సముద్రాలవుతాయి
కొన్ని చేతులు ఎర్ర సైన్యాలవుతాయి
కలలు నిజమవుతాయి కలలు నిజమవుతాయి"

డా. జీ. వీ. సుబ్రహ్మణ్యం గారు చేతులు ఎర్ర సైన్యాలకు ప్రతీకలంటూ, అవి కలలో నుండి ఇలలోకి దిగాలని కవి ఆశ పడుటున్నట్టుగా రాశారు. కానీ  నా ఉద్దేశం లో శివారెడ్డిగారి ఊహ అది కాదు. ఈ స్వప్నం లోని చేతులు కాంగ్రేసు ప్రభుత్వానికి, ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రతీకలు. అందుకే కవి తనకు చేతుల తో కలిగిన కష్టాన్ని  నేను చేతుల కాళ్ళ కింద దుమ్మయిపోయాను అని అంటాడు. సుబ్రమణ్యం గారన్నట్లు చేతులని ఎర్రసైన్యాలుగానే భావించి వుండింటే, భయంకర స్వప్నం రాక్షస స్వప్నం అని కవి అనడు అనేది నా అవగాహన. ఈ నేపథ్యంలో కొన్ని చేతులు ఎర్ర సైన్యాలవుతాయి అనేది సులభంగా అర్థమైనా, కొన్ని కలలు నిజమవుతాయి అనే వాక్యం ఈ భయంకర స్వప్నాన్ని గురించి అన్నది కాదని అర్థం అవుతుంది.

"శ్రవణ కుమారుడిక్కడే హత్య చేయబడ్దాడు
బుద్దుడిక్కడే పరమపదించాడు
చార్వాకుడు సత్యకామ జాబాలి వీళ్ళంతా
ఆపరేషన్ థియేటర్లో మరణించారు
వర్తమానం కూడా ఆపరేషన్ థియేటర్లో
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ.."
ఈ వాక్యాల్లో కవి పాఠకుడి కోసం ఎంత బాగా ప్రతీకను విశదపరుస్థున్నాడో తెలుస్తోంది.
ఇక ఆసుపత్రిలో డాక్టర్లు ఎలా ఉన్నారు?
"యమపాశాలు
మెడలో వేసుకు తిరుగుతున్న
సోగ్గాళ్ళు సోగ్గత్తెలు
యారగెన్సీని అలంకరించుకుని
నడుస్తున్న కురుపుల్లా వీళ్ళు
వీళ్లూ తెల్లగానే నవ్వుతారు.

యమపాశ అలంకారులు
రోగాల్ని పెంచుతారు
మనుషుల్ని ఖూనీ చేస్తారు మానసికంగా".

ఇక వైద్యులు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. ఈమాటలన్నీ సాధారణంగా వైద్యుల నోటినుంచి వింటూనే ఉంటాం. వాటికి కవి ఎంత బాగా ప్రతీకని కల్పించాడో ఈ వాక్యాలు నిరూపిస్తాయి.

"రక్తం లేదు
రక్తం తెచ్చుకోండి
ఆపరేషన్ ఆపరేషన్
మేజరాపరేషన్ చేయబోతున్నాం
రక్తం తెచ్చుకోండి
తెచ్చుకోండి, తెచ్చుకోండి తెచ్చుకోండి, కోండీ.

రక్తం తెచ్చుకోండి
పెద్దాపరేషన్ చేయబోతున్నాం

మీరంతా బుద్దిగా నడుచుకోండి
మేం రామరాజ్యం తెస్త౦

మీరంతా బాధ్యతెరిగి ప్రవర్తించండి
మేం సోషలిజానికి పచ్చరంగు వేస్తాం.

రక్తం తెచ్చుకోండి ఆపరేషన్ చేస్తాం
అన్నం తెచ్చుకోండి
తినమని చెబుతాం
కాళ్ళు తెచ్చుకోండి
నడవమని చెబుతాం
మీరే శాంతి తెచ్చుకోండి
సంతృప్తి తెచ్చుకోండి
సౌఖ్యం తెచ్చుకోండి
అందరూ సుఖమని
ఈ దేశం బ్లాక్ బోర్డు మీద
మువ్వన్నె జెండాతో.రాస్తాం
రక్తం తెచ్చుకోండి
ఆపరేషన్ చేయబోతున్నాం.

ఇంకా డాక్టర్లు ఏమంటారో చూడండి. ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటారో చూడండి. వ్యవస్థ ఇంతకు మించి అద్భుతంగా ఏమీ ఉండబోదు. ఇంతకు మించి నీచంగా కూడా ఉండబోదు.

కొన్ని వందల సార్లు చెప్పాను
మీరిక్కడ ఉండరాదని
మీరిక్కడ ఉండకూడదని
మీ ఉనికి పనికి రాదని
 మీ ఆలోచనల నీడ కూడా మేం భరించలేమని

మీరలా ధైర్యం కొండలానిలబడకూడదు
ఎక్కుపెట్టిన బాణంలా తయారవకూడదు

రోగిని మేం చూసుకుంటాం
లేచే,ఎర్రదుమ్ము మంటమీద నీళ్ళు మేం చల్తాం
మీకేం పని ఆ రోగి మీ రోగే
అయినా మేం లేమూ - మేం లేమా?
శరీరాన్ని అడవులుగా
నేత్రాల్ని అగ్ని పర్వతాలుగా మార్చి
మీరిక్కడ నిలబడకూడదు నిషిద్ధ స్థలం
పొండి పొండి పొండి వెళ్లిపొండి వెళ్ళ౦డి

ఏదీ నా సూదెక్కడ
వీళ్ళకో మత్తింజక్షనిస్తాను
ఏదీ నా కత్తెర వీళ్ళ తోకలు కత్తిరిస్తాను
ఏదీ నా అగ్గి పెట్టె
వీళ్ళ వాంఛలకి నిప్పు పెడతాను

నా ఆసుపత్రి నా ఆసుపత్రి
నా ప్రహరీ -నా అగడ్త -నా ముళ్ళకంచె
నా సొత్తు -నా ఆస్తి - నా పెళ్ళ౦-  నా బిడ్డలు
నా వారసులూ నా వర్గం నా సైన్యం-  శిరస్త్రాణం

డాక్టర్లు , నర్సులూ ఆసుపత్రి యాజమాన్యం, సెక్యూరిటీ అంతా ఆసుపత్రిని నడిపిస్తారు. అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటామంటారు. కాని జరిగేది వేరు.

"గద్దెలు- రోగి క్షేమాన్ని తర్కిస్తున్నాయి
కుర్చీలు- రోగి భవిష్యత్తుని అంచనా వేస్తున్నాయి
లాఠీలు- రోగి రోగిగానే జీవించేందుకు
కట్టుదిట్టంగా కాపలా కాస్తున్నాయి"     -  అంటూ కవి ప్రభుత్వాలు ఒక జెరెమీ బెంథెమ్ పానాప్టికాన్ లో కూర్చోని ప్రజల్ని పాలిస్తున్నట్టు ఊహిస్తాడు. ఇక ఆసుపత్రిలో ఆయాలుంటారు. ఫోకాల్టు పానాప్టిసిజంలో వీరంతా సర్వీయవలెన్స్ ను అనుభవించి చూసి వచ్చిన పబ్లిక్ సర్వెంట్స్. ఆయాల బిడ్డలూ ఆయాలే." చా నీళ్ళకీ ఆకూ వక్క కీ/..అంతేగా/..మీ దయ మా ప్రాప్తం/" అని బహిరంగ రహస్యంగా చేతులు చాచేవారే. ఇక రోగులంతా ఆసుపత్రిలో ప్రజలే. అశేషప్రజానీకమే. రోగానికి మందు కర్మయే అనుకునే వారే జీవితానికి కారణం పూర్వజన్మ సుకృతమనుకునే వారే. కనిపించని ఒకానొక శక్తికి ఒకానొక పానాప్టికల్ సర్వేయలెన్స్ కి భయపడే నిబద్దులే. "మిమ్మల్నేం అనలేదు బాబూ/ కోప్పడమోకు నాయనా/ ఆయుసుంటే అది బతుకుద్ది/ లేకుంటే లేదు/ ఎంతమంది పోవటం లేదు/... మీరూ ఈ ఆసుపత్రులూ మాకోసమేనటగా/ ..ఆకట్టె నాకెందుకు/ ఈ కట్టెనేంజేయాలని చూస్తున్నా/ మీరే కాత్త నిప్పంటించండి/ పుణ్యాత్ములు/ మీరే మసిచేసి ఈదేశం మీద చల్లండి".

ఇలా ఏక సూత్రతతో 90 పుటల సుదీర్ఘ కవిత, ప్రతీకాత్మకంగా రాయబడిన కావ్యం ఈ ఆసుపత్రి గీతం. ఏక ప్రతీకతో సాగే ఈ ఆసుపత్రి గీతం, తెలుగు కావ్యాలలో ప్రతీక వికాసాన్ని పరిశీలించేటపుడు శేషేంద్ర ' నా దేశం నా ప్రజలు' లాగా , 'గొరిల్లా' లాగా ఒక ఖచ్చితమైన మైలు రాయనే చెప్పాలి.

20/1/16

Tuesday, 12 January 2016

కవిత్వ సందర్భం 8 varavara rao

స్వేచ్ఛా గాలులు రాళ్ళని విసిరిన సమయంలో..
.....................................................
"దేవదారు వృక్షాల దేహ దారుఢ్యమూ
గుల్ మొహర్ కుసుమాల కోమలత్వమూ
మంచు వలె కరిగే మనసూ
సెలయేరులా ప్రవహించే జీవితేచ్ఛ" , ఎవరికి ఉంటాయి?.
ఎవరైతే ఇలాంటి వాతావరణంలో జీవిస్తుంటారో వారికి ఉంటాయి. పరిసరాలు మనుషులను ప్రభావితం చేస్తాయి కదా. ఇలాంటి జీవితం ఉన్నవారు కాశ్మీరీ ప్రజలు. అక్కడి వాతావరణం లానే అక్కడి సంస్కృతి కూడా విభిన్నమైనది. 'పాన్ ఇస్లామిక్' సంస్థల ప్రాపంచిక దృక్పథం కూడా అక్కడి ముస్లింలను ప్రభావితం చేయలేనంతగా ఆ సంస్కృతి కాశ్మీరీ జాతీయతను అభిమానించింది. రెండు శతృ దేశాల మధ్యన పడి నలిగి పోయిన ఈ భూతల స్వర్గ సీమ స్వేచ్ఛా వాయువులను పీల్చాలని తపిస్తోంది.  1990 నుంచి ఈ స్వేచ్ఛా కాంక్ష స్వతంత్ర, ప్రజాతంత్ర కాశ్మీర్ కావాలని కోరుకుంది. భారతదేశం నుంచి విముక్తిని కోరుకుంది. విలక్షణమైన తన సంస్కృతిని నిలబెట్టుకోవాలనుకుంది. అందుకే 'కాశ్మీర్ జాతీయతా వాదం' పుట్టుకొచ్చింది. విప్లవం పిడికిలిని ఊహిస్తుంది. పిడికిలి మూసే ఉంటుంది. ఆ మూతలో ఎవరి స్వార్థాలు వారివి ఉంటాయి. కాశ్మీరీ ఆజాదీ గ్రూపులలో స్థానికులకంటే మత రాజకీయ శక్తులు, పాకిస్థానీ అఫ్ఘనిస్థానీ శక్తులు వచ్చి చేరాయి. హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ ఇ తొబియా వంటి వారి చేతుల్లోకి స్వచ్ఛమైన వేర్పాటు వాద విప్లవం చేతులు మారింది. మతరాజకీయ రంగు పులుముకున్న ఈ మిలిటెంట్లలో స్థానిక యువకులు కేవలం ముప్పై శాతం మాత్రమే అని ఒమర్ అబ్దుల్లా ప్రకటన. ఇలాంటి సందర్భంలో కాశ్మీరీ పండిట్లను ఊచకోతలు కోసింది, కాశ్మీరీ అమాయకులయిన ముస్లిం యువకులను తీవ్రవాదులని ముద్ర వేసి చంపి వేసింది ఎవరు? అంటే చెప్పటం ఎంత సులభమో..ఈ మొత్తం వ్యవహారంలో అటు పండిత్ లయినా ఇటు ముస్లిం యువకులయినా, మొత్తానికి బలయింది గుల్ మొహర్ కుసుమాలు, కాశ్మీరీలు, అని మనం  గ్రహించలేక పోవటానికి కారణాలు వెతకటం అంత కష్టం.

2010 లో రెండు సంఘటనలు జరిగాయి, ఒకటి కాశ్మీరు లోయలో, ఒకటి  దక్కను పీఠభూమిలో. ఈ రెండు సంఘటనల్లో కామన్ విషయాలు ఎన్నో ఉన్నాయి. రెండిటి లక్ష్యం, ఆజాదీ. కాశ్మీరుకి ఇండియా నుంచి విముక్తి కావాలి. తెలంగాణాకు సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి విముక్తి కావాలి. కాశ్మీరుకీ ఇండియాకు చాలా విషయాల్లో పోలికలున్నాయి. కాశ్మీరు ఒక లోయ అయితే, తెలంగాణా ఒక పీఠభూమి. భారత దేశానికి స్వతంత్ర్యం వచ్చే నాటికి ఈ రెండూ కూడా భారత దేశంలో కలవనివి. ముస్లింలు ఎక్కువగా ఉండే కాశ్మీరు రాజు హరి సింగ్ ఒక హిందువు, హిందువులు అధికంగా ఉండే తెలంగాణా రాజు నిజాం ఒక ముస్లిం. కొన్ని షరతుల మీద భారత యూనియన్ లో కలిసిన ఈ రాజ్యాలు మొదటినుంచీ వివక్ష కు గురి అయ్యాయి. పాలకులు ఏ ప్రామిస్ లనీ నెరవేర్చిన పాపాన పోలేదు. అందుకే అవి రెండూ విముక్తినే కోరుకున్నాయి. అయితే కాశ్మీరుకి ఇండియా నుంచి, తెలంగాణాకి ఆంధ్రా వలస పాలకుల నుంచి.

2010 లో జూన్ మాసంలో తీవ్రవాదులనే నెపం తో ముగ్గురు కాశ్మీరీ యువకులను భారత సైన్యం కాల్చి చంపింది. వారంతా అమాయకులయిన స్థానికులని ఆ ప్రజలు తెలుసీకున్న రోజున అగ్రహోదగ్రులయ్యారు. రాళ్ళు చేతిలో పట్టుకున్నారు. ప్రభుత్వ ఆఫీసులను, వాహనాలను ధ్వంసం చేశారు. ఇనుప ముళ్ళ కంచెలను దాటుతూ  కర్ఫ్యూలను, సైనికులని ఎదిరిస్తూ రాళ్లనే తమ అస్త్రాలుగా మలచుకొని స్వేచ్ఛా నినాదాన్ని వినిపించారు.' క్విట్ కాశ్మీర్'  అన్నారు. కాశ్మీరులో ప్రతి ఏడుగురికీ ఒక సైనికుడు కాపలా ఎందుకని ఆక్రందించాయి. భారత సైనికులు చేసే మానభంగాల చిట్టా విప్పితే ద్రౌపది చీరంత అవుతుంది. శ్రీ కృష్ణుడు ఈ కాలంలో తిరిగి వస్తాడనే నమ్మకం లేదు కనుక అప్రస్తుతం. కానీ, ఈ unrest కి పోలిసులు పేల్చిన రబ్బరు తూ టాలకి ఎందుకనో నూటా పద్నాలుగు ప్రాణాలు గాలిలో కలిసాయి. 'ఎవరనుకున్నారు ఇట్లవునని?'  కాళోజి  గీతం ప్రతి మదిలో ఘోషించే ఉంటుంది, అక్కడ కాశ్మీరులో ఇక్కడ తెలంగాణాలో. అదే సంవత్సరం మే నెల ఇరవై ఎనిమిదిన మానుకోటలోకి సమైక్య శక్తులు శక్తి వంతంగా తెలంగాణ లోకి చొచ్చుకొని వద్దామనుకున్నాయి. 'కొండ'లు కాస్తా తెలంగాణా యాక్టివిస్ట్ ల మీదికి రాళ్ళను విసరాలని చూసాయి. స్వేచ్ఛను శ్వాసించే యువకులు స్టూడెంట్లూ రాళ్ళ లోకి కూడా స్వేచ్చా వాయువులను ఊదారు. శతృవు పారిపోయేదాకా తరిమారు.

ఈ స్వేచ్ఛా వాయువులని ఆఘ్రాణించి, రుచి చూసే వాడు కవి. వాటిని పది మందికి పంచే వాడు కవి. అలాంటి కవి వరవరరావు. కవి అనేవాడు ఎవడయినా  స్వతహాగా విప్లవకారుడే. అయితే ఆ విప్లవం కేవలం వైయుక్తిక చైతన్యమేనా లేక సమాజపు సమిష్టి చైతన్య స్థాయిదా అనేదాన్ని బట్టి, ఆ కవియొక్క స్థాయిని మనం నిర్ణయించవచ్చు. ఇంకొక అడుగు ముందుకేసి  విశ్లేషిస్తే , ఈ సామాజిక సమిష్టి చైతన్యం కవిలో, అతడి కవిత్వంలో ఒక కారణానికి కార్య రూపంలో ఉందా లేక ఒక కార్యానికి కారణమవుతుందా అనేదాన్ని బట్టి ఆ కవి ప్రాఫెట్ స్థాయికి ఎదిగాడా లేదా అనేది కూడా మనం అర్థం చేసుకోవలసి వుంటుంది. తన చుట్టూ ఉన్న సమాజం కేవలం కారణం మాత్రమే అయి, కవి కవిత్వం దానిని ప్రతిబింబించే, ప్రతిస్పందిచే ఒక ఎఫెక్ట్ గా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం నుంచి బయటపడి, తన కవిత్వమే ఒక కారణమయి, సమాజ పరిస్థితుల్ని దిశా నిర్దేశం చేయగల స్థాయికి ఎవరోగానీ చేరుకోలేరు. ఈ విధంగా వైయుక్తిక చైతన్య స్థాయినుంచి సామాజిక సమిష్టి చైతన్యాన్ని ప్రతిబింబించే స్థాయికి, అటుపై తానే ఆ సామాజిక చైతన్యానికి కారణమయ్యే స్థాయికి ఎదిగే క్రమమే కవి పరిణామం. వరవర రావుగారు ఈ మూడో స్థాయికి చేరుకున్న కవిలా కనిపిస్తారు. కవి అందుకున్న స్థాయికి పాఠకుడు అందుకుని చైతన్యం పొందాడా లేదా అనేది పూర్తిగా వేరే విషయం. ప్రస్తుతానికి దానిని వదిలేద్దాం.

'There are no facts , only Interpretations '  అన్న నీషే కాలం నుంచి వచ్చిన మనం, ఏదీ లాజికల్ గా జరగదని తెలుసుకోలేక పోవటం, ఇంకా గ్రీకు తత్వ వివేచనాలయిన లాజిక్ రీజన్ లకు అనుగుణంగానే చరిత్రను అర్థం చేసుకోవాలనుకోవటం, తెలుగు వారిమంతా ఒక్కటనో..లేక భారత దేశం గొప్పదనో అందుకే కలిసి ఉండాలనే లాజిక్ లకు తలలు బాదుకోవటం విచిత్రం. ఒక ప్రాంత ప్రజల కష్టాలనీ నష్టాలనీ బేరీజు చేసే విషయంలో అక్కడి సంస్కృతూలకూ, నమ్మకాలకూ విలువనివ్వలేని లాజిక్ లు నిలబడలేవు. లాజిక్ లు ఉద్యమాలని నడపవు. స్వేచ్ఛాకాంక్ష భవిష్యత్తుమీద నమ్మకాన్నిస్తుందే కానీ, లాజిక్ ని ఇవ్వదు. రాయి చేతిలోకి తీసుకుని విసిరేవాడిని లాజిక్ నడిపించదు. ఉద్యమం, దాని మీద నమ్మకం, ఆ నమ్మకాన్ని కలిగించే నాయకత్వం నడిపిస్తాయి. పీడిత  ప్రజల ఆకాంక్షలు నడిపిస్తాయి. కాశ్మీరు లోయలో ఒక ఉద్యమం ఉంది. సెపరేట్ కాశ్మీరు అని. దక్కన్ పీఠభూమిలో ఒక ఉద్యమం ఉంది. సెపరేట్ తెలంగాణా అని. ఈ రెండింటికీ మధ్య దూరం ఎంతో ఉన్నా, దాదాపు ఒకటే రకమైన ఉద్యమ భూమిక కలిగున్నాయి. అందుకే ఈ రెంటినీ కలుపుతాడు కవి ఈ కవితలో.

కశ్మీరు లోయ - దక్కన్ పీఠభూమి
----------------------------------------

ఆ లోయ
గాయపడిన హృదయమే చూడగల
గుండె లోతుల లోయ
తల ఎత్తి పోరాడే మనుషులే తెలియగల
గుండె బలమున్న లోయ

స్వర్గ నరకాలు,తొంగి చూసాయేమో కానీ
సూర్య చంద్రులక్కడ
వెలుగు నీడలు పారాడిన
ఆకాశ కుసుమాలే

దేవదారు వృక్షాల దేహ దారుఢ్యమూ
గుల్మొహర్ కుసుమాల కోమలత్వమూ
మంచువలె కరిగే మనసు
సెలఏరు వలె ప్రవహించే జీవితేచ్ఛ

కశ్మీరు నిద్రలేని ప్రజల కల
మేలుకున్న పోరాట,శక్తుల
నెరవేరని స్వప్నం

నిలువెల్లా ఒక స్వేచ్ఛాకాంక్ష
ఇనుప ముళ్ళ కంచెలుదాటి
కర్ఫ్యూల నెదిరించి
సైనిక వలయాల్లోకి
శరీరాయుధంగా మాత్రమే చొరబడి
తుపాకి గుండ్లకు నేలకూలే
తురాయి పిట్టల గుంపవుతుంది
కన్నీటి మంచు కరిగి
నెత్తురయి ప్రవహిస్తుంది

భారత మనోమోహన శాసనాలు
అమెరికాతో అణు ఒప్పందం,చేసుకున్నాక
ఐన్ స్టీన్ భయపడినట్లు
అక్కడి మనుషులకింక
ఆత్మరక్షణకు రాళ్ళే అందివచ్చాయి.

పసి పిల్లలూ నవ యువకులూ
మహిళలంతా
నిలువెల్లా ఆజాదీ జ్వాలలయి
కశ్శీరివ్వాళ కుంకుమ పూల వనమయింది
అణువణువున స్వేచ్ఛ రగుల్కొని
చిందుతున్న రక్తాలవి

జాలి పడకండి
ప్రజలుగా వాళ్ళతో జత కట్టండి

ఇండియాలోనే విడిపోతామంటే
దేశ ద్రోహమనే ఫాసిస్టులు
ఇండియా దురాక్రమణలో ఉన్న
ప్రజల్ని ఏం చేయగలరో ఊహించండి

పోలీసు చర్య పేరుతో
సైనిక దురాక్రమణ చేసిన యూనియన్
ఏడుగురికొక్క సైనికునితో
ఎన్నేళ్ళుగా అణచేస్తున్నారో యోచించండి

కశ్మీరు లోయకూ
దక్కన్ పీఠభూమికీ శత్రువొక్కడే
వాడు ఢిల్లీలో ఉన్న
అమెరికా కీలుబొమ్మ
శ్రీనగర్ గోల్ప్ క్లబ్ లోనూ
హైదరాబాదు సచివాలయంలోను
వాని తైనాతీలున్నారు

మానుకోటలో మనం విసిరిన రాయి
కాశ్మీరులో వాళ్ళు విసిరిన రాయి
గురి చూసిన శత్రువు వాడే
వానిపై కలిసి తలపడదాం రండి

అవును కలిసి తలపడాలి. ఒక్క తెలంగాణా మాత్రమే సిద్ధించింది. అయినా స్వేచ్ఛాకాంక్ష గల మనుషులు ఇంతటితో విశ్రమించరు.  కాశ్మీర్ నాదంటే నాదనే ఇరు దేశాల దౌర్జన్యాలనుంచి, హైదరాబాదు నేనే కట్టానని చెప్పుకునే తుగ్లకీలనుంచి, రెండు సంవత్సరాల్లో తెలంగాణాను మరలా కలిపేసుకుంటామనుకునే పసితనాల్లోంచి, తెలంగాణకు సంస్కృతి మేమే నేర్పించమనుకునే అధిపత్య గర్వాల్లోంచి ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటారు.  స్వేచ్ఛా గాలి ఎంతటి బలమైందో ప్రతిసారీ నిరూపిస్తూనే ఉంటారు.

13/1/16

Thursday, 7 January 2016

ఒకే ఒక్క మనుషుల ప్రపంచంలో వేల వేల ఊహా రేఖలు Kavitwa sandarbham 7

ఒకే ఒక్క మనుషుల ప్రపంచంలో వేల వేల  ఊహా రేఖలు.
.................................................... .................
సముద్రమొక అత్యద్భుత వ్వవస్థ. కళాకారుడి కంటికి ఏదయితే అత్యద్భుతంగా కనిపిస్తుందో, దాన్ని సింబాలిక్ గా ఉపయోగించుకోవాలనుకుంటాడు.  సముద్రం అలాంటిదే. సముద్రం ఒక కవికి ఒక్కోసారి ఒక్కో సింబల్ లాగా కనిపించవచ్చు. సముద్రపులోతు మనసుగా, కెరటాలు బాధను తెలిపే ఎమోషన్ లాగా, ఘోష ఆర్తనాదంలా కనిపించవచ్చు. నీరు కన్నీటిలా కనిపించవచ్చు. తీరం లక్ష్యం లాగా లేదా కఠిన శరీరంలాగానో అనిపించవచ్చు. అదే ఒక భావ కవికి తీరం ఆడదానిలా, సముద్రుడి కెరటాలు ఒడ్డును తాకే బలమైన కోరికల్లా కనిపించవచ్చు. సముద్రం అనగానే ఒక గంభీర దృశ్యం ఒకటి మనసులో వచ్చి కూచుంటుంది. కవి అక్కడ ఆగడు. తను చెప్పదలచుకున్న దానికోసం సముద్రపు దశని దిశనీ మార్చివేయగలడు. పరిసరాల ప్రభావం అచేతన స్థితిలో మనసులో ఒక బలమైన ముద్రని వేస్తున్నపుడు, బలవంతమైన,  తనకుతానే ఒక అత్యద్భుత వ్యవస్థ అయిన సముద్రాన్ని, లేదా ఇంకోదాన్ని తన బాధని తన వాదనని వినిపించటానికి కవి ఉద్యుక్తుడౌతాడు. తాను చెప్పదలచుకున్న ఏ విషయానికైనా ఒక నిర్దిష్టత సంపాదించుకోగలిగినపుడు, అనవసర వాక్యాల జోలికి పోకుండ, కొన్ని వాక్యాల్లోనే కవితను ముగించి, చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా విశదపరచటం సమర్థవంతమైన కవి చేయగలడు. అలాంటి కవియే దేవీ ప్రియ.

ఈ కవితలో మూల విషయం సముద్రాలను దేశాలు వాటాలు వేసి పంచుకోవటం. కవిత మొత్తం ఇదే అంశాన్ని చర్చిస్తున్నట్టుగా సాగుతుంది. ఈ మూల విషయానికి ఒక ప్రతీక స్థాయిని కలిగించే ప్రయత్నం కవితంతా గుప్తంగా సాగుతూ ఉంటుంది. సముద్రాన్ని జన సముద్రానికి ప్రతీకగా నిర్మించే ప్రయత్నం చివరిదాకా సాగి, చివరిలో గుట్టు విప్పుతున్నట్టుగా 'జనసముద్రాన్ని' బయటకు తీసుకువస్తాడు కవి. అదే సమయంలో మార్సిష్టు దృక్పథాన్ని జీర్ణించుకున్న కవిగా వర్గ సంఘర్షణని, వర్గ విభజననీ సూచిస్తాడు. చెప్పదలచుకున్న అంశం మీద కవికి స్పష్టత ఉందని అర్థం అవుతుందిప్పుడే. ఆ తిరగబడే సముద్రాలు వాచ్యార్థంలో సముద్రాలే కావచ్చు, కానీ భావ పరంగా జన సముద్రాలే. సముద్రాల జలాలని వాటా వేసుకోవటం కేవలం అప్పటి ఒక ప్రపంచ రాజకీయ చర్య కావచ్చు , కానీ దానిని మిషగా చూపిస్తూ, ప్రజల్ని వర్గాలుగా విడదీస్తున్న వ్యవస్థమీద గురిచూసి బాణం విసరటమే ఇక్కడ కవి లక్ష్యం. ఒక మూల విషయాన్ని వివరిస్తూ దాన్ని ప్రతీక స్థాయికి చేర్చుతూ,  చివరలో అసలు ఉద్దేశాన్ని బయట పెట్టడం. నాకు తెలిసినంత వరకూ ఇదొక కొత్తరకం కవిత్వ నిర్మాణ పద్దతి.

1958లో, 1960లో సముద్ర జలాల పంపకాల విషయంలో జనీవాలో చర్చలు జరిగినా, 1973 నుండి 1982 వరకు జరిగిన చర్చల ఫలితంగా  'LAW OF SEA' అనేదొకటి ఏర్పడింది. చారిత్రకంగా Maritime Boundary అనేది ఒక కొత్త కాన్సెప్ట్. కొలంబస్లూ, వాస్కోడీగామాలు ప్రపంచాల్ని కనుగొన్న తరువాత, ఒక దేశం ఇంకో దేశం మీద అధికారం చెలాయించటం నేర్చుకున్న తరువాత, ముఖ్యంగా అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో తన గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేసిన తరువాత, ఈ విషయం ప్రపంచ పటం మీద ఒక ప్రశ్నలా మొదలయింది. ఒక దేశం చుట్టూ ఉండే సముద్రంలో ఎంత దూరం వరకు ఆ దేశానికి అధికారం ఉంటుంది అనేది దేశాల మధ్య ఒక ప్రధాన సమస్యగా మారింది. ప్రతీ దేశానికీ సముద్ర తీరం వెంబడి ఒక 'బేస్ లైన్' ని ఆధారం చేసుకుని అక్కడి నుంచి పన్నెండు నాటికల్ మైళ్ళ వరకూ, ఉండే సముద్ర జల భాగాన్ని 'టెర్రిటోరియల్ వాటర్స్' అంటారు. అంటే ఈ రేఖ వరకూ ఉన్న సముద్ర భూభాగం ఆ దేశానికి సంబంధించినదే. ఈ రేఖ వరకూ సముద్రంలో ఇతర దేశాల ఓడలు కానీ, గగన తలంలో ఇతర దేశాల విమానాలూ, హెలికాఫ్టర్లు కానీ పర్మిషన్ లేకుండా తిరగటానికి వీల్లేదు. ఒక వేళ అలాంటివి తిరిగితే వాటిని పేల్చివేయటానికి ఆ దేశానికి సర్వ హక్కులూ ఉంటాయి. బేస్ లైన్ నుంచి 24 నాటికల్ మైల్స్ వరకు కంటిగస్ జోన్ (contiguous zone) అనీ, బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకూ ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ (exclusive economic zone) అనీ అంటారు. ఈ జోన్ లోని సముద్ర సహజ వనరులన్నీ ఆ దేశానికి సంబంధించినవే. జగడాలమారి ప్రపంకానికి లొసుగులు దొరకకుండా ఉండదు కదా...ఇలా ఎవరి సొత్తు వారికి విభజించి ఇచ్చినా...అసలు బేస్ లైన్ నే ఇంకాస్త ముందుకి తీసుకెళ్ళే ప్రయత్నాల్లో దేశాలన్నీ తలమునకలై ఉన్నాయని వేరే చెప్పనక్కరలేదనుకుంటాను. విచిత్రంగా సముద్ర జీవులకి వేటికీ ఈ సరిహద్దుల గురించి తెలియదు. విజ్ఞాన గని కదా మానవుడు- రేఖలు లేకపోతే ఊహా రేఖలు గీసుకోగలడు- ఊహల్లో జీవించేయగలడు.
"Marine organisms do not care about international boundaries;  they move where they will". అంటారు ఓషనోగ్రాఫెర్స్. Dante ఒక అడుగు ముందుకేసి "the sea hath no king but God alone"  అంటాడు. మనుషులకింతమంది దేవుళ్ళు కదా..అందుకే ఇన్ని గీతలు. ఊహా రేఖలు.

భూమినీ, నీటినీ ఆకాశాన్ని ఇలా చించుకుని పంచుకునే దుస్థితి బహుశా ఏ కవికీ నచ్చదనుకుంటాను. ఇలా చించి పంచుకుంటే సముద్రాలు ఘోషించవా అని కవి హృదయం అడగకుండా ఉండదనీ అనుకుంటాను. సముద్రాలు ఎవరివీ అనే ప్రశ్న ఉదయించినపుడు, 'శ్రమజలాల నదీ నదాల్ని/ సముద్రంలో సంగమింపజేసే జాలరివీరులవి'..అని చెప్పటంలో కవి ఏ మాత్రం వెనుకడుగూ వేయడనుకుంటాను. తరువాత కవితలో ఒచ్చే పదాలు 'తిమింగలాలు', 'షార్కు చేపలూ', 'అసంఖ్యాకమైన అమర కెరటాలూ' ఒక ప్రతీతాత్మక స్ఫురణతో పలికిన పదాలు. "సముద్రాలు ప్రపంచానివి కావు/ సముద్రాలదే ప్రపంచం" అని ఒక శాశ్వత సత్యంలాంటిది వ్యక్త పరిచిన కవి, కవిత చదివేటపుడు మాత్రం మనలో "మనుషులు ప్రపంచానికి సంబంధించిన వారు కాదు, మనుషులదే ఈ ప్రపంచం" అనే అవ్యక్త స్ఫురణను కలిగింప చేస్తాడు. చివరి స్టాంజా ఒక మడత విప్పినట్టుగా, పజిల్ సాల్వ్ చేసినట్టుగా చెబుతాడు.

తిరుగబడవా సముద్రాలు
భడవా వ్యాపారులు తమని భాగాలు వేసుకుంటుంటే

మరింత మరిగిపోవా
కుతకుత ఉడికే సముద్ర గర్భాలు
ఉద్యమాల రక్తంతో తడిసిన చేతులు తమని
మరింత ఉద్రేక పరుస్తుంటే,

ప్రతిఘటించవా జనసముద్రాలు
తమని వర్గాలుగా చీల్చి యేలుతుంటే,
ఒడ్డున కూర్చొని కొందరు
తమ సర్వస్వాన్నీ తాగి తూలుతుంటే.

ఈ చివరి స్టాంజాలోని ప్రతీ వాక్యంలోని ప్రతీ పదమూ ముఖ్యమైనదే. 'జన సముద్రాలు' అనే పదమే పజిల్ ని విప్పే పదం. ఇపుడు కవితనంతటినీ మరలా చదువుకుంటే అన్వయం కుదురుతుంది. సముద్రంతో మొదలైన ప్రయాణం మానవుడిదాకా అంతర్లీనంగా సాగుతుంది. ఒడ్డున కూర్చున్న కొందరు ఎవరో మనకు తెలియక కాదు, కుత కుత ఉడికే సముద్ర గర్భం ఎవరి అంతరంగమో కూడా మనకు తెలియక కాదు, కానీ ఒకటే ఆశ్చర్యం.. కుత కుత ఉడికిన ఇన్ని సముద్ర గర్భాలు ఒకేసారి ఎక్కడా లావాలాగా పెల్లుబికలేదేమని?. ఆలోచించవలసిన విషయమే.

ఘోషించవా సముద్రాలు !
...---------------........----...

ఘోషించవా సముద్రాలు
జెనీవా సభల్లో దేషాలు
తమని వాటాలు వేసి పంచుకుంటుంటే,
ప్రతిఘటించవా సముద్ర కెరటాలు
జాతీయజెండాలుఱతమ తలల మీద ఆడుతుంటే!

సముద్రాలు యెవరివి?
సముద్రాలు యుద్ధ నౌకలవి కావు
తాటి బొత్తాల పడవలవి,
సముద్రాలు దేశాధ్యక్షులవీ
నౌకా నిర్మాణ కేంద్రాల యజమానులవీ కావు,
శ్రమ జలాల నదీ నదాల్ని
సముద్రంలో సంగమింపజేసే జాలరి వీరులవి!

సముద్రాలు తిమింగలాలవీ
షార్కు చేపలవీ కావు,
నిరంతర చైతన్యంతో నీటిని జీవింపజేసే
అసంఖ్యాకమైన అమర కెరటాలవి.

సముద్రాలు ప్రపంచాధినేతల
నీలి నీలి కలలు కావు
సామ్రాజ్య సంస్థాపనాపరుల
శాశ్వత యుద్ధభూములు కావు
సముద్రాలు ప్రపంచానివి కావు
సముద్రాలదే ప్రపంచం.

తిరుగబడవా సముద్రాలు
భడవా వ్యాపారులు తమని భాగాలు వేసుకుంటుంటే,
మరింత మరిగిపోవా
కుతకుత ఉడికే సముద్ర గర్భాలు
ఉద్యమాల రక్తంతో తడిసిన చేతులు తమని
మరింత ఉద్రేక పరుస్తుంటే,
ప్రతిఘటించవా జనసముద్రాలు
తమని వర్గాలుగా చీల్చి యేలుతుంటే,
ఒడ్డున కూర్చొని కొందరు
తమ సర్వస్వాన్నీ తాగి తూలుతుంటే.

6/1/16