Friday, 29 January 2016

కవిత్వ సందర్భం 9

ఆసుపత్రిలో కటిక చీకటి..
.................................
1975 సం లో నీలోఫర్ ఆసుపత్రి లోని నీయాన్ లైట్ల కాంతిలో ఎగురుతున్న కీటకాలని చూస్తూ, అదే లైట్లకింద వరండాలో నేలమీద పడుకుని ఉన్న పేద రోగుల్ని చూస్తూ ఒంటరిగా తిరుగుతోంది ఒక ఆకారం. చుట్టూ చిమ్మ చీకటి. రాత్రి చీకటి మాత్రమే కాదు. "నిశ్శబ్దపు పగటినిండా విరిసిన చీకటి"." చేతుల్నిండా గుండెల్నిండా నేత్రాల్నిండా చీకటి/చీకటి/ ఆ చీకటి కాలానికో పేరు పెట్టుకుంటే, అదే 'ఎమర్జెన్సీ కాలం'. "చీకటిలో విశ్లేషణ లేదు/ విబేధం లేదు/ చీకటిలో రోగ నిర్ణయం లేదు". చీకటి ఒక నియంత, అడ్డులేని అధికారి. "లాటరీలు వేయ్- గుర్రప్పందాలాడు/ శరీరాలు కోయ్- తార్రోడ్లు వేయ్/కళ్ళు పెరికేయ్- ఇళ్ళు లేపేయ్/ ఈమందు కాకుంటే ఆమందు/ రెగ్యులేషన్స్ -న్యూ రెగ్యులేషన్స్ / రివైజ్డ్ రెగ్యులేషన్స్". అన్నింటా ప్రతీ చోటా రెగ్యులేయన్స్, "ఎ సర్క్యులేషన్ ఆఫ్ డార్క్నెస్". ఆ చీకటిలో విశ్లేషణ లేదు, విబేధం లేదు. కోర్టులు లేవు, జైలు న్నాయి. ప్రెస్సులు లేవు, సప్రెస్సులున్నాయి. పార్లమెంటూ లేదు. కానీ.గవర్నమెంటు ఉంది. అదే రాష్ట్రపతి పాలన. మొత్తం ఈ చీకటి వ్యవస్థలో పని చేసేదేదయినా ఉందా అంటే ఉంది. అదే ఆసుపత్రి. ఎమర్జెన్సీ కేసులకోసం తెరవబడ్డ ఆసుపత్రి. ఆ ఆసుపత్రిలో ఒంటరిగా తిరిగే కవికి, ఈవ్వవస్థ మొత్తానికి ఈ ఆసుపత్రి ఒక ప్రతినిధిగా కనిపించింది. నియాన్ లైట్లకింద మెరుస్తూ చచ్చిపోయి బాగా వుబ్బిన తెల్లకుక్క కలేబరంలా ఆసుపత్రి కనిపించింది. తెలుపు నిజానికి శాంతికి గుర్తనుకుంటాం. కానీ కవి అంటాడు, "ప్రతీ నైచ్యమూ తెల్లదనం కింద దాగుంటుంది/ప్రతి క్రూరత్వమూ తెల్లదనం కింద రక్షణ పొందుతుంది".

'యథా రాజా తథా ప్రజా' అని నానుడి. ఒక వ్యవస్థలో సంస్థలు,వ్యక్తులూ ఆ వ్యవస్థ నడిచే తీరుకి ప్రతినిధులుగా కనిపిస్తుంటారు.  ఆ మధ్య ఫేస్బుక్ లో ఒక ఫోటో బాగా సర్క్యులేట్ అయింది. ఒక గవర్నమెంటు ఆఫీసులో అద్దాలకి అటువైపు, క్యూలో నిలబడి ఉన్న జనాలు-  ఇటువైపు ఉన్న ఉద్యోగిని ఆఫీసు పనులు చేయకుండా కంప్యూటర్ లో సోల్టేర్ ఆట ఆడుతూ  ఉంటుంది. అటు వైపు ఉన్న వారందరూ పాపం ఈవిడ తమ పనే చేస్తుందేమోననే ఆత్రుత లో అమాయకంగా కనిపిస్తుంటారు. కానీ నిజం అది కాదు. "పని చేయని ప్రభుత్వాలకు" ఈ ఫోటో ఒక ప్రతినిధి. అలాగే ఏ సంస్థా పని చేయని ఎమర్జన్సీ కాలంలో, పని చేస్తున్న ఏకైక సంస్థ ఆసుపత్రి. కాబట్టి ఆసుపత్రి ఆ వ్యవస్థనే ప్రతిబింబిస్తుంది. అందుకే కవి ఈ దీర్ఘ కవితలో ఆసుపత్రిని ప్రతినిధిగా తీసుకున్నాడు. దానిని ఏకసూత్రంగా ప్రతీకని చేసి, కవిత్వాన్ని చేసాడు. వాచ్యార్థంలో ఆసుపత్రిని గురించి చెబుతున్నట్టుగా ఉన్నా, అంతరార్థంలో ఆయన ఆ వ్యవస్థనే వివరిస్తున్నాడు. పుస్తకాన్ని బాణమనుకుని, ఈ బాణం మొత్తం వ్యవస్థకే తగలాలని గురిపెట్టబడిందని చెప్పుకున్నాడు. ఈ కవితలను శివారెడ్డి ఎందుకనో గానీ అలలు అన్నాడు. మొత్తం పన్నెండు అలలు. దీనిని ఆధునికులు కావ్యమన్నారు. సంప్రదాయకులు మామూలుగానే ఇదెలా కావ్యమని పెదవి విరిచారు. ఆధునిక కవిత్వంలోని ప్రతీకల, భావ చిత్రాల ప్రయోగం పరిచయంలేని సాంప్రదాయకులు అలాగే అంటారని మనం సర్ది చెప్పుకోవచ్చు. కానీ ప్రతీకే ఈ కావ్యానికి మూలస్థంభమని తెలియకపోతే నిజంగానే ఏమీ అర్థం కాదు. "Science gives conceptual knowledge of a situation; Art gives us the experience of that situation".  కాబట్టి ఆ కాలపు వ్యవస్థని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఈ ప్రతీకను అర్థం చేసుకుంటూ కవితో పాటు సాగాల్సిందే.

నిజంగానే ఎమర్జన్సీ పీరియడ్ కి ఆసుపత్రికీ సంబంధం ఉంది. ఈ కాలంలోనే అత్యధికంగా స్టెరిలైజేషన్ ఆపరేషన్లు జరిగాయి. ఆపరేషన్ చేయించుకున్న వారికి ప్రైజ్ మనీ మాట అటుంచి, చేయించుకోకపోతే ఉద్యోగాలు ఊడిపోతాయన్న భయమూ ఉంది. 'శరీరాలు కోయ్' అన్నది ఆదేశం.  ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ దాదాపు మగవారే కనుక వేసెక్టమీ ఆపరేషన్లు విపరీతంగా జరిగిపోయాయి. వేసెక్టమీ ఆపరేషన్ కీ పుంసత్వానికీ ఏమీ సంబంధం లేకపోయినా, ఎంతో మంది మగవారు పుంసత్వం కోల్పోయినట్లు బాధపడిపోవటం, రాజాజ్ఞ ఆ విధంగా రాజముద్రలా వారి శరీరాల మీద పడిపోవటం జరిగింది. 'ఇందిరా హఠావో! ఇందిర (ఇంద్రియము) బచావో!!'  అనే నినాదం దాకా ఇదంతా సాగింది. కాబట్టి ఆసుపత్రి ఇక్కడ ప్రతీకగా నిలిచింది. ఈ అసుపత్రియే ఇండియా.
"ఇంత ఆసుపత్రి
ఇంత పెద్దాసుపత్రి
ఇండియా అంత ఆసుపత్రి "..అని ఆసుపత్రి అంటే ఏదో కవి చెబుతున్నాడు. ఆసుపత్రి మీద పడగెత్తిన హస్తం. హస్తమంటే ఏమిటో, దేనికి ప్రతీకో విడమర్చనవసరం లేదనుకుంటాను. ఈ చేతుల గురించి ఒక భయంకర స్వప్నాన్ని కంటాడు కవి.
"స్వప్నం స్వప్నం
భయంకర స్వప్నం
అంతా నేలమట్టమయినట్టు కల
కలలో ఆసుపత్రి రాష్ట్రాల అసెంబ్లీ భవంతిలా గోచరించింది
ఆసుపత్రి పార్లమెంటు భవనంలా రూపుదిద్దుకుంది
మరుక్షణంలో మరుక్షణంలో
ఈ దేశపు పొలాలూ నదులూ అడవులూ కొండలూ
కర్మాగారాలూ- అన్నీ చేతులుగా మారి
భయంకరమైన పెద్ద పెద్ద చేతులుగా మారి
రాక్షస చేతులుగా మారి
చేతులే చేతులే చేతులే చేతులే
చేతులు దండెత్తి వచ్చి
చేతుల దండయాత్ర-
ఆసుపత్రిని పెళ్ళగించి వేశాయి.
ఆసుపత్రిని భూమట్టం చేశాయి.
నేల ఈనినట్టు చేతులే ఆకాశం వర్షించినట్లు చేతులే
చేతుల సైన్యాలు చేతుల సైన్యాలు ఎటు జూచినా
చేతుల సైన్యాలే చేతుల సైన్యాలే
చేతుల సైన్యాల సముద్రాలే - సముద్రాలే
అనల గీతాలు పాడుతూ  చేతులే- చేతుల మార్చ్
సముద్రాల చేతుల దండయాత్ర జైత్రయాత్ర
నేను చేతుల కాళ్ళ కింద దుమ్మయిపోయాను
భయంకర స్వప్నం రాక్షస స్వప్నం
ఓ రాజముద్రా..
కొన్ని కలలు నిజమవుతాయి
కొన్ని కళ్ళ సముద్రాలవుతాయి
కొన్ని చేతులు ఎర్ర సైన్యాలవుతాయి
కలలు నిజమవుతాయి కలలు నిజమవుతాయి"

డా. జీ. వీ. సుబ్రహ్మణ్యం గారు చేతులు ఎర్ర సైన్యాలకు ప్రతీకలంటూ, అవి కలలో నుండి ఇలలోకి దిగాలని కవి ఆశ పడుటున్నట్టుగా రాశారు. కానీ  నా ఉద్దేశం లో శివారెడ్డిగారి ఊహ అది కాదు. ఈ స్వప్నం లోని చేతులు కాంగ్రేసు ప్రభుత్వానికి, ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రతీకలు. అందుకే కవి తనకు చేతుల తో కలిగిన కష్టాన్ని  నేను చేతుల కాళ్ళ కింద దుమ్మయిపోయాను అని అంటాడు. సుబ్రమణ్యం గారన్నట్లు చేతులని ఎర్రసైన్యాలుగానే భావించి వుండింటే, భయంకర స్వప్నం రాక్షస స్వప్నం అని కవి అనడు అనేది నా అవగాహన. ఈ నేపథ్యంలో కొన్ని చేతులు ఎర్ర సైన్యాలవుతాయి అనేది సులభంగా అర్థమైనా, కొన్ని కలలు నిజమవుతాయి అనే వాక్యం ఈ భయంకర స్వప్నాన్ని గురించి అన్నది కాదని అర్థం అవుతుంది.

"శ్రవణ కుమారుడిక్కడే హత్య చేయబడ్దాడు
బుద్దుడిక్కడే పరమపదించాడు
చార్వాకుడు సత్యకామ జాబాలి వీళ్ళంతా
ఆపరేషన్ థియేటర్లో మరణించారు
వర్తమానం కూడా ఆపరేషన్ థియేటర్లో
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ.."
ఈ వాక్యాల్లో కవి పాఠకుడి కోసం ఎంత బాగా ప్రతీకను విశదపరుస్థున్నాడో తెలుస్తోంది.
ఇక ఆసుపత్రిలో డాక్టర్లు ఎలా ఉన్నారు?
"యమపాశాలు
మెడలో వేసుకు తిరుగుతున్న
సోగ్గాళ్ళు సోగ్గత్తెలు
యారగెన్సీని అలంకరించుకుని
నడుస్తున్న కురుపుల్లా వీళ్ళు
వీళ్లూ తెల్లగానే నవ్వుతారు.

యమపాశ అలంకారులు
రోగాల్ని పెంచుతారు
మనుషుల్ని ఖూనీ చేస్తారు మానసికంగా".

ఇక వైద్యులు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. ఈమాటలన్నీ సాధారణంగా వైద్యుల నోటినుంచి వింటూనే ఉంటాం. వాటికి కవి ఎంత బాగా ప్రతీకని కల్పించాడో ఈ వాక్యాలు నిరూపిస్తాయి.

"రక్తం లేదు
రక్తం తెచ్చుకోండి
ఆపరేషన్ ఆపరేషన్
మేజరాపరేషన్ చేయబోతున్నాం
రక్తం తెచ్చుకోండి
తెచ్చుకోండి, తెచ్చుకోండి తెచ్చుకోండి, కోండీ.

రక్తం తెచ్చుకోండి
పెద్దాపరేషన్ చేయబోతున్నాం

మీరంతా బుద్దిగా నడుచుకోండి
మేం రామరాజ్యం తెస్త౦

మీరంతా బాధ్యతెరిగి ప్రవర్తించండి
మేం సోషలిజానికి పచ్చరంగు వేస్తాం.

రక్తం తెచ్చుకోండి ఆపరేషన్ చేస్తాం
అన్నం తెచ్చుకోండి
తినమని చెబుతాం
కాళ్ళు తెచ్చుకోండి
నడవమని చెబుతాం
మీరే శాంతి తెచ్చుకోండి
సంతృప్తి తెచ్చుకోండి
సౌఖ్యం తెచ్చుకోండి
అందరూ సుఖమని
ఈ దేశం బ్లాక్ బోర్డు మీద
మువ్వన్నె జెండాతో.రాస్తాం
రక్తం తెచ్చుకోండి
ఆపరేషన్ చేయబోతున్నాం.

ఇంకా డాక్టర్లు ఏమంటారో చూడండి. ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటారో చూడండి. వ్యవస్థ ఇంతకు మించి అద్భుతంగా ఏమీ ఉండబోదు. ఇంతకు మించి నీచంగా కూడా ఉండబోదు.

కొన్ని వందల సార్లు చెప్పాను
మీరిక్కడ ఉండరాదని
మీరిక్కడ ఉండకూడదని
మీ ఉనికి పనికి రాదని
 మీ ఆలోచనల నీడ కూడా మేం భరించలేమని

మీరలా ధైర్యం కొండలానిలబడకూడదు
ఎక్కుపెట్టిన బాణంలా తయారవకూడదు

రోగిని మేం చూసుకుంటాం
లేచే,ఎర్రదుమ్ము మంటమీద నీళ్ళు మేం చల్తాం
మీకేం పని ఆ రోగి మీ రోగే
అయినా మేం లేమూ - మేం లేమా?
శరీరాన్ని అడవులుగా
నేత్రాల్ని అగ్ని పర్వతాలుగా మార్చి
మీరిక్కడ నిలబడకూడదు నిషిద్ధ స్థలం
పొండి పొండి పొండి వెళ్లిపొండి వెళ్ళ౦డి

ఏదీ నా సూదెక్కడ
వీళ్ళకో మత్తింజక్షనిస్తాను
ఏదీ నా కత్తెర వీళ్ళ తోకలు కత్తిరిస్తాను
ఏదీ నా అగ్గి పెట్టె
వీళ్ళ వాంఛలకి నిప్పు పెడతాను

నా ఆసుపత్రి నా ఆసుపత్రి
నా ప్రహరీ -నా అగడ్త -నా ముళ్ళకంచె
నా సొత్తు -నా ఆస్తి - నా పెళ్ళ౦-  నా బిడ్డలు
నా వారసులూ నా వర్గం నా సైన్యం-  శిరస్త్రాణం

డాక్టర్లు , నర్సులూ ఆసుపత్రి యాజమాన్యం, సెక్యూరిటీ అంతా ఆసుపత్రిని నడిపిస్తారు. అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటామంటారు. కాని జరిగేది వేరు.

"గద్దెలు- రోగి క్షేమాన్ని తర్కిస్తున్నాయి
కుర్చీలు- రోగి భవిష్యత్తుని అంచనా వేస్తున్నాయి
లాఠీలు- రోగి రోగిగానే జీవించేందుకు
కట్టుదిట్టంగా కాపలా కాస్తున్నాయి"     -  అంటూ కవి ప్రభుత్వాలు ఒక జెరెమీ బెంథెమ్ పానాప్టికాన్ లో కూర్చోని ప్రజల్ని పాలిస్తున్నట్టు ఊహిస్తాడు. ఇక ఆసుపత్రిలో ఆయాలుంటారు. ఫోకాల్టు పానాప్టిసిజంలో వీరంతా సర్వీయవలెన్స్ ను అనుభవించి చూసి వచ్చిన పబ్లిక్ సర్వెంట్స్. ఆయాల బిడ్డలూ ఆయాలే." చా నీళ్ళకీ ఆకూ వక్క కీ/..అంతేగా/..మీ దయ మా ప్రాప్తం/" అని బహిరంగ రహస్యంగా చేతులు చాచేవారే. ఇక రోగులంతా ఆసుపత్రిలో ప్రజలే. అశేషప్రజానీకమే. రోగానికి మందు కర్మయే అనుకునే వారే జీవితానికి కారణం పూర్వజన్మ సుకృతమనుకునే వారే. కనిపించని ఒకానొక శక్తికి ఒకానొక పానాప్టికల్ సర్వేయలెన్స్ కి భయపడే నిబద్దులే. "మిమ్మల్నేం అనలేదు బాబూ/ కోప్పడమోకు నాయనా/ ఆయుసుంటే అది బతుకుద్ది/ లేకుంటే లేదు/ ఎంతమంది పోవటం లేదు/... మీరూ ఈ ఆసుపత్రులూ మాకోసమేనటగా/ ..ఆకట్టె నాకెందుకు/ ఈ కట్టెనేంజేయాలని చూస్తున్నా/ మీరే కాత్త నిప్పంటించండి/ పుణ్యాత్ములు/ మీరే మసిచేసి ఈదేశం మీద చల్లండి".

ఇలా ఏక సూత్రతతో 90 పుటల సుదీర్ఘ కవిత, ప్రతీకాత్మకంగా రాయబడిన కావ్యం ఈ ఆసుపత్రి గీతం. ఏక ప్రతీకతో సాగే ఈ ఆసుపత్రి గీతం, తెలుగు కావ్యాలలో ప్రతీక వికాసాన్ని పరిశీలించేటపుడు శేషేంద్ర ' నా దేశం నా ప్రజలు' లాగా , 'గొరిల్లా' లాగా ఒక ఖచ్చితమైన మైలు రాయనే చెప్పాలి.

20/1/16

No comments:

Post a Comment