Friday, 18 August 2023

Rajahussain analysis on my poem ఆశ్చర్యార్థకం

 పచ్చని తోటలు మన పిల్లలు..!..

వెఛ్చని నవ్వులు మన చిన్నారులు !!


*విరించి ‘ కవిత “ ఆశ్చర్యార్థకం “..

ఓ హృదయానుభూతి !!


“పిల్లలూ దేవుడూ చల్లని వారే...కల్ల కపటమెరుగని కరుణామయులే “ ,

అన్నాడో సినీకవి.


పిల్లల కంటే ఎక్కువైందీ,వాళ్ళ నవ్వుల 

కంటే స్వచ్ఛమైందీ ఏదీ లేదీలోకంలో 

బహుశా..  అందువల్లనే ఏమో? కనబడే  పిల్లల్ని ,కనబడని దేవుడ్ని ఒకే గాట కట్టాడు కవి.పిల్లల గురించి “విరించి “ ఓ మంచి కవిత రాశారు.ముందుగా ఆ కవిత చదవండి.!!


*ఆశ్చర్యార్థకం ! ....”.!!

---------------------------------


“పసిపాపల కన్నుల్లో

ఎగిరే పక్షులను

నిబిడీకృతమైన ఆశ్చర్యాన్నీ మాత్రమే 

చిత్రీకరించాలి.

పిల్లల తోటల్లో వాళ్ళ ఆటల్లో 

అన్ని పురాతన

సాంప్రదాయాలనూ విడనాడాలి.


మిన్నేటి తరగల మీదకు

ప్రసరించే వాళ్ళ చూపుల్లో..

నీ పెద్దరికపు మాటలు కృష్ణ బిలాలు

నీ ఉనికే వారి నిశ్చల మైదానంలో

పెరిగే ఏకైక కలుపుమొక్క


చుక్కల్ని కనుపాపల కింద ఏరడం

భువనభోంతరాళాల్ని నాలుక మీద 

చప్పరించటం

మెత్తని అరచేతుల మీద

ఆకాశాల్ని ఎత్తి పోయడం

పిల్లల ఆటలకు దిష్టి పెట్టగల వారే లేరు.

వాస్తవిక దుఃఖమయ ప్రపంచంలో

హక్కుల కోసం పోరాడుతూ

అధివాస్తవికత పిల్లల హక్కని గుర్తిద్దాం.


పుస్తకాలలో బందీగా ఉన్న పేజీలను చింపి

స్వేచ్ఛగా పేపర్లలాగా ఎగరనిచ్చే పిల్లలంటే

లైబ్రరీలో మూలకు మూలుగుతున్న

పుస్తకాలకైనా ఇష్టమే!


ప్రశ్నార్థకపు ముఖాల్నెన్నిటినో చూస్తూనే ఉంటాం

కనీసం ఆశ్చర్యార్థకం చూసిన ప్రతీసారి

ఓ పసిపాపేనే గుర్తుకు తెచ్చుకుందాం.


 ‌‌                         …….విరించి , 11/8/19


పిల్లలు సుకుమారులు.లోకం పోకడ తెలీని వారు . కల్లాకపటం ఎరుగని వాళ్ళ మనసు తెల్ల కాగితం లాంటిది. పిల్లలతో వ్యవహరిం

చేటప్పుడు మనం కూడా పిల్లలుగా మారి పోవాలి.ఈ లోకంలోని భేషజాల్ని,భావజాలా

న్ని పక్కన పెట్టాలి.ప్రశాంతమైనసరస్సుఅందా

ల్ని అలా చూస్తూ గడిపేయాలి గానీ, రాళ్ళు వేసి కల్లోలపరచకూడదు.పిల్లలతోమనం

 వ్యవహరించే తీరు కూడా అలాగే....... వుండాలి.వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడూ స్వేచ్ఛతో 

ఎగిరే పక్షుల్నే చూడాలి.ఏదో తెలీని నిబిడీకృత ఆనందాన్ని మాత్రమే దర్శించాలి.క్రమ శిక్షణ

 పేరుతో పాటించే పురాతన సాంప్రదాయాల్ని, కట్టుబాట్లను  విడనాడాలి.ఆకాశాన్నిఅందు

కోవాలి,చందమామను ముద్దాడాలన్న వాళ్ళ 

చిన్ని కోర్కెల మధ్య మన పెద్దరికాల్ని అడ్డు

తేకూడదు.స్వేచ్ఛ వాళ్ళ గుత్త సొత్తు.దాన్ని 

కట్టడి చేయడం కాని,ఆంక్షల ముళ్ళ కంచెలు

 వేయడం గానీ చేయరాదు.


మిన్నేటి తరగల మీదకు ప్రసరించే పిల్లల చూపుల్లో,మన పెద్దరికపు మాటలు ఎంతో  

లోతైన కృష్ణబిలాలు .అందుకే పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి.

ఆ లేత మనసులకుఎటువంటి బాధా కలగ

నీకూడదు.మన అహం..మన అధికారం,మన కాఠిన్యపు మాట తీరుపిల్లల పచ్చని మైదానంలో కలుపు మొక్క,కంకర రాయి కాకూడదు.


పిల్లలు శక్తిమాన్ లు. ఆకాశంలోని చుక్కల్ని సైతం కనుపాపలకిందకు తెచ్చి ఎంచగలరు.

భువనభోంతరాళాల్ని పిప్పరమెంటు బిళ్ళలా చేసి 👅 నాలుక మీద చప్పరించేయ గలరు.

వాళ్ళు అపర బ్రహ్మలు,విశ్వకర్మలు.వాళ్ళకు అసాధ్యమన్నది లేనేలేదు.అంతెందుకు సుతి

మెత్తని చిట్టి అరచేతుల మీద ఆకాశాన్ని ఎత్తి పోయడం వాళ్ళకే చెల్లు. పిల్లల ఆటపాటలకు

ద్రిష్టి పెట్టగలిగిన వాళ్ళు ఈ సృష్టి లోనే లేరు.

ఈ దుఃఖమయ,నిరామయ లోకంలో పిల్లల్ని

పిల్లల్లాగే వదిలేయాలి.అథివాస్తవికత వాళ్ళ జన్మహక్కన్న సంగతిని పొరపాటున కూడా 

మరిచిపోకూడదు.


ఏళ్ళతరబడి లోకంలో పాతుకు పోయిన ఆంక్షల హద్దుల్ని పిల్లల దరిచేరనీరాదు. పుస్తకాల్లో బందీలుగా పడివున్న పేజీలను చింపి పైకి ఎగరేసే పిల్లలంటే గ్రంథాలయాల్లో పడివున్న పుస్తకాలకు కూడా ఇష్టమే.(గ్రంథాల

యాల్లోని పుస్తకాలుఅరుదైనవి,అపురూప

మైనవి,అమూల్యమైనవి.)


లోకంలో రోజూ మనం ప్రశ్నార్థకమైన ముఖా

ల్ని ఎన్నింటినో చూస్తూనే వుంటాం.ఆ ముఖా

ల్లోఆశ్చర్యార్థకం ! చూసిన ప్రతీసారీ మనం 

ఓ పసిపాపను గుర్తుకు తెచ్చుకుంటే ఇక సమ

స్యేవుండదు.తండ్రులుగా పిల్లల పట్లచేసేతప్పు

లు తెలుసుకునే సరికేతెల్లారిపోతుంది.అందుకే

తాతలుగా పిల్లలకు దగచగరై, ఆతప్పుల్ని దిద్దుకుంటూ వుంటారు.పిల్లలు సున్నిత మన

స్కులు.శాసనాల్ని,బంధనాల్ని వాళ్ళ దరికి చేరకుండా కాపుకాయాలి.ఆ పచ్చని తోటలకు 

పెద్దలు కాపలా దార్లే గానీ, ముళ్ళ కంచెలు కారాదన్నది కవి అంతరంగం.


మంచికవిత అందించినందుకు

డా. విరించి విరివింటికి అభినందనలు !!


*ఎ.రజాహుస్సేన్.!!

No comments:

Post a Comment