Sunday, 15 November 2020

శివమెత్తిన కమర్షియలిజం.

 

శివ’మెత్తిన కమర్షియలిజం!

కాలేజ్ కి వచ్చి చదువుకునే రోజులు ఎప్పుడో పోయాయి అంటాడు మల్లి పాత్రధారి. అదే మల్లి సినిమా కాసేపు ముందుకి జరిగాక “బాటనీ పాఠముంది మ్యాట్నీ ఆట వుంది సోదరా ఏది బెస్టురా అంటూ” క్లాసుల కంటే సినిమాలమీదే మక్కువ ఎక్కువని పాట పాడతాడు. శివ సినిమా కథంతా ఇటువంటి పారడాక్సులతో ముందుకు సాగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులు లోకల్ రౌడీల సహాయంతో కాలేజీల్లో అల్లర్లు గొడవలూ చేస్తుంటారనీ, యవ్వనోద్రేకం వలన ఆ గొడవల్లో విద్యార్థులు తలలు దూర్చి తమను తాము హీరోలుగా ఊహించుకుంటారనీ, ఆ విధంగా చదువుకు దూరమౌతారనీ సూత్రీకరిస్తుంది ఈ సినిమా. 1989 అక్టోబర్ లో రిలీజైన శివ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలు రాయిలా నిలించిందన్నది నిర్వివాదాంశం. కథలో బలం లేకపోయినా కథనం లో కొత్తదనం వలన ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారని చెప్పాలి. ఇప్పటికి ఇదో కల్ట్ సినిమా అని ఆదరించే వాళ్ళూ ఉన్నారు.  సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ, కెమెరా ఆంగిల్స్ కానీ, ఫైట్ సీక్వెన్స్ కానీ అన్నింట్లో కొత్తదనాన్ని తీసుకురాగలిగాడు రాంగోపాల్ వర్మ. సినిమా మొదటి సీన్ లో జరిగే ఫైట్ లో ‘ భవానీ’ అని గోడ మీద బొగ్గుతో రాసి ఉండటమే గానీ, చివరి ఫైట్ సీన్ లో సౌండ్ ఏమీ లేకుండా కేవలం శ్వాసలు మాత్రమే వినిపించటం కానీ, దర్శకత్వ ప్రతిభను తెలిపేవిగా ఉంటాయి.

వర్మకు ఉండే గ్యాంగ్ స్టర్ అబ్సెస్సన్ ఈ శివ సినిమాతో మొదలై నేటికీ కొనసాగుతుండటం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక సిగ్గరి ఐన కాలేజ్ స్టూడెంట్ ఒక గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు అనే కథాంశంతో వచ్చినా, దాదాపు ఇదే అంశంతో సత్య, కంపెనీ, రక్త చరిత్ర, బెజవాడ, గాయం,రౌడీ, వంగవీటి వంటి సినిమాలు ఇప్పటికీ తీస్తూ ఉండటం వలన, శివ సినిమా ను ఈ రోజు చూస్తే ఏదో కొత్త unique సినిమా చూసామన్న ఫీలింగ్ కలగటం లేదు. మరల మరలా అదే కథాంశంతో సినిమాలు తీయటం వలన, శివ సినిమాకు ఉండే ప్రత్యేకతను వర్మనే స్వయంగా చంపేశాడని చెప్పాలి. ఐతే కథనంలో ఎంత కొత్తదనం ఉన్నా, శివ సినిమాలోని పాత్రల చిత్రణలో అదే స్టీరియోటైప్ లను కొనసాగించాడు. ముఖ్యంగా హీరోయిజం, విలనిజం లను హైప్ చేసి చూపటంతో వర్మ కమర్షియల్ గా హిట్ చేయగల సినిమాను ఇవ్వగలిగాడే తప్ప గొప్ప సినిమాను ఇవ్వలేకపోయాడు. హీరో చేతితో పీకగానే సైకిల్ చైన్ ఊడివచ్చేస్తుందన్నంత హీరోయిజం, కెమెరా ముందు తాను చూపించదలచుకున్న రియలిస్టిక్ పిక్చర్ ను స్టేజ్ మీది డ్రామాగా గా మార్చేసింది.  విలన్ ను మొదటినుంచీ ఒక గ్యాంగ్స్టర్ గానే పరిచయం చేసినప్పటికీ అతడెందుకు గ్యాంగ్స్టర్ అయ్యాడో అనే మానవీయ కోణం కనపడకపోగా విలన్ అంటే క్రూరంగా కర్కశంగా నే ఉంటాడు, పసి పిల్లలను కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు అనేటువంటి స్టీరియోటైప్ ను వదలలేక పోయాడు. దానివలన చందమామ కథ లోని రాక్షసులకూ, షాడో నవలల్లోని విలన్లకు మధ్యన ఎక్కడో ఈ సినిమా విలన్ కనిపిస్తాడు. ఐతే సినిమా కథలో కనిపించే రాజకీయాలు ఏంటో అర్థం కాదు. రాజకీయ నాయకులు, కాలేజీలో స్టూడెంట్ లీడర్లను ఉపయోగించుకుని చేసే ఘనకార్యాలు ఏమిటో కూడా చూపనేలేదు. అమ్మాయిలను ఏడిపించడం, లెక్చరర్ లను విసిగించటం తప్ప వీళ్ళు మిగితా స్టూడెంట్లను రాజకీయాలవైపు తిప్పిన దాఖలాలేవీ కనబడవు. ఆ కాలేజీ స్టూడెంట్స్ కూడా చాలా పేలవంగా రాజకీయ చైతన్యం లేని పప్పు సుద్దల్లా కనిపిస్తూ ఉంటారు. స్టూడెంట్ లీడర్లు, కాలేజీల్లో అరాచకాలు చేయడానికే ఉంటున్నారనీ, అటువంటి సమయంలో కాలేజీలోకి ఈ రాజకీయ శక్తులు ఎంటర్ కాకుండా ఒక సిగ్గరి ఐన యువకుడు తిరగబడతాడనీ, ఆ క్రమంలో అతడే మరో గ్యాంగ్ స్టర్ గా మారి ఆ రౌడీ లను హతమార్చేస్తాడనీ కథ. ఐతే కాలేజీ లో ఎక్కడా రెండు వ్యతిరేక పార్టీలున్నట్టుగా, మనకు కనిపించదు. వాటి అజెండాలుగానీ, స్టూడెంట్ సమస్యల మీద వాళ్ళ పోరాటాలు గానీ మనకు సినిమాలో మచ్చుకైనా కనిపించవు.  భవానీ అనే రౌడీ ఎందుకు కాలేజీ వ్యవహారాలలోకి జె.డీ. అనే కుర్రాడిని ఎగదోస్తాడో కూడా చూపలేదు. విజయవాడలో కథ జరుగుతుండగా, అక్కడి లోకల్ పాలిటిక్స్ లోని కుల, మత రాజకీయాల కనీస ఊసే లేకుండా “మమ” అనిపిస్తాడు దర్శకుడు. కానీ తెలంగాణా ప్రాంత యాసను మాత్రం బాగానే అపహాస్యం చేయగలిగాడు. అంతేగాక, హింసను మరింత భయంకరంగా చూపటం లో సఫలమయ్యాడు.

మొత్తానికి కాలేజీలలోకి రాజకీయ శక్తులు రావటం మంచిది కాదనే సందేశమేమైనా ఇస్తున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ అదీ నిజం కాదు. ప్రజాస్వామ్యం లో విశ్వవిద్యాలయాల్లో కాలేజీ రాజకీయాలు విద్యార్థుల చైతాన్యాన్ని పెంచటమే కాక, భవిష్యత్తులో ప్రశ్నించే పౌరులనూ, బాధ్యతగల రాజకీయ నాయకులను ఎన్నుకోగలగటం లోనూ కావలసినంత భూమికను ఏర్పరుస్తాయి. మంచి నాయకులుగా ఎదగటం, బాధ్యతగల పౌరులుగా మరలటం కాలేజీ రాజకీయాలు నేర్పిస్తాయి. చర్చలు ప్రతి చర్చలు చేయగల ప్రజాస్వామిక వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. రాజకీయ చైతన్యం ఉండాల్సినంతగా లేకపోతే మనదేశానికి కావలసిన నాయకులను ఎన్నుకొనగలిగే స్థితిలో పౌరులు ఉండలేరు. అందుకే ప్రజాస్వామిక కాలేజీ రాజకీయాలు దేశానికి బలాన్నిస్తాయే తప్ప, కార్పోరేట్ యాజమాన్యాలు ప్రచారం చేస్తున్నట్టు కెరియర్ ను పాడు చేయవు. ఐతే శివ సినిమాలో మాత్రం కాలేజీ రాజకీయాలు కేవలం ఒక గ్యాంగ్ స్టర్ సంస్కృతిని పెంచి పోషిస్తాయి అనే విధంగానే, తప్పుడుగా చూపటం జరిగింది.  విద్యార్థి రాజకీయాలు కేవలం అమ్మాయిలను ఏడిపించటానికి కాలేజీల్లో వెధవ వేషాలు వేయటానికీ, హీరోయిజం చూపటానికి తప్ప ఎటువంటి బాధ్యతనూ ఇవ్వలేవని చూపటం జరిగింది. తెలిసో తెలియకో స్టూడెంట్ పాలిటిక్స్ లోకి ఎవరైనా ఎంటర్ ఐతే పర్యవసానాలు ఇలా దారుణంగా ఉంటాయని భయపెట్టేలా ఉంటుంది ఈ సినిమా. గణేష్ పాత్ర ధారి హీరోతో రెండు సందర్భాలలో స్పష్టంగా మర్యాదగా చెబుతాడు, “మీరంతా చిన్న పిల్లలు ఈ రాజకీయాలు పెద్దవాళ్ళ విషయాలు, అనవసరంగా తల దూర్చకండి” అని. కానీ ఆ రెండు సందర్భాలలో హీరో, గణేష్ ను అవమానించి పంపుతాడు. దీన్నిబట్టి హీరోలో ఉండే తలబిరుసుతనం, హీరో వర్షిప్ మీద ఉండే అభిమానం అతడిని అలా గ్యాంగ్ స్టర్ నుంచి చేసిందనుకోవాలా?. “ఎవరో ఒకరు పూనుకుని వ్యవస్థను మార్చాలి” అని హీరో అనటంలో, ఆ ఆపద్బాంధవుడను నేనే అని చెప్పుకోవటం కనిపిస్తుంది. సినిమా మొత్తం మీద డమ్మీ పాత్రలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కనిపిస్తూ ఉంటాడు. పోలీస్ వ్యవస్థ కూడా గ్యాంగ్స్టర్ల ముందర దిగదుడుపే అన్నమాట. ఐతే హీరో కూడా గ్యాంగ్స్టరే కానీ హీరో కాబట్టి “మంచి గ్యాంగ్స్టర్” అన్నమాట. అంటే శివ సినిమా మొత్తానికి తేల్చేదేమంటే, గ్యాంగ్ స్టర్ లు రెండు రకాలు. ఒకటి, సమాజాన్ని మార్చటం కోసమై గ్యాంగ్స్టర్ గా మారిన శివ వంటి మంచి గ్యాంగ్స్టర్ లైతే, రెండోరకం, సమాజాన్ని నాశనం చేయటం కోసం, లేదా సమాజం మీద పడి దోచుకుంటూ, అందర్నీ భయపెట్టడం కోసం గ్యాంగ్స్టర్ గా మారిన భవానీ వంటి చెడ్డ గ్యాంగ్స్టర్ లన్నమాట. శివ ఆ విధంగా కమర్షియల్ గా హిట్ కొట్టగల సినిమా ఫార్ములా గ్యాంగ్స్టర్.

No comments:

Post a Comment