Sunday, 28 December 2014

విరించి ll అమ్మా..మనమిపుడు ఏం చేద్దాం ll
.................................................
మా అమ్మ లాగే నీవూ ఓ అమ్మవి.
నీ గుండెలమీద అగ్గి కుంపటి రగిలే దాకా
నీ రొమ్ములమీద ఈ ప్రాతఃకాలం
బలిపీఠమై అరిచేదాకా
నీలో అమ్మతనాన్ని గుర్తించలేని
నా బ్రెయిన్ వాష్డ్ దేశభక్తిని చూసి
స్వచ్ఛందంగా సిగ్గుపడుతున్నాను.

రక్తం అద్దుకుని అయోమయంగా
అమాయకంగా ఎగిరివచ్చిన సీతాకోకచిలుకలు
మా తులిప్ పూవుల రెక్కలను ఆర్ద్రంగా తాకుతుంటే
తేనెలై  కురవాల్సిన మకరందం
కన్నీరై పూవులమీద జారిపోతుండటం చూసి
నీ ఒడిలో నా హృదయం పెట్టి
బోరున ఏడవాలని వుంది
మన సరిహద్దుల్లోని ముళ్ళ కంచె నుండి
మూతికూడా చొచ్చుకుని రాలేదు కదా..

మీ బిడ్డలు మా ఇంటికి శరణార్థులై వొచ్చినా
మా ఇంటి ఆడపడచులు మీఇంటీకి కోడళ్ళై వచ్చినా..
మానవత్వపు శ్మశానంలో ఎన్ని పీనుగలు దయ్యాలై లేస్తాయో..
బీటలు బారిన మన మనో భూముల్లో
ఎన్ని మోడువోయిన చెట్లున్నాయో..
మోదుగపూవుల కాలం వస్తుందా తల్లీ....

మన గడియారాల్లో ముల్లులు
ఒక మూలకి జరిగాయేమో..
సరిహద్దు రగిలించిన కాష్టమంతా
ఒక వైపు అమావాస్య వెన్నెల
మరో వైపు నెలవంక చీకటి ..అంతేగా.

చేతుల్లో పచ్చని చెట్లు
కాళ్ళల్లో వెచ్చనివేర్లూ పూయించాల్సిన నీవు
చేతులతో ఒకనికి మొక్కడానికి
కాళ్ళ ను ఇంకెవడో తొక్కడానికి అప్పగించి
అల్లా కి గాలిలో దీపం అర్పిస్తే...
మా మెదడు లేని కంకాళా లు వికృతంగా
వెక్కిరించడం తప్ప చేసిందేముందని...

అయినా చూసావా అమ్మా..
చేతుల్నించి జారిపోతున్న మన స్నేహాన్ని
పీక్కు తినడానికి ఎన్ని రాబందువులు
ఎదురుచూస్తున్నాయో...

శరీరమంతా ఉండగా చుట్టుకున్న కొంత కండ కోసం
నిండుగా అల్లుకున్న ఎముకల గూడుకోసం
అడవి గోడులా కొట్టుకునే గుండెకోసం
శిథిలాల్లో దాక్కున్న దేవుని కోసం
శిథిలమైన కొన్ని పుటల కోసం
వీపు మీద తుపాకుల్నీ
కడుపులో సూసైడ్ బాంబుల్నీ మోసే మన పిల్లల్ని చూసయినా
మనమేం చేద్దాం చెప్పు
మన ఎత్తుల నుండి కాస్త జారుదామా
ఇక్కడి నుండే మరింత దిగజారుదామా...?

19/ 12/ 14

No comments:

Post a Comment