Tuesday, 30 December 2014

విరించి ll కొంగొత్తా దేవుడండీ...ll

మనిషికి ఎన్ని బహానాలు...

భాబాస మెంబరునని
భాయీ అని వాడోవీడో కావులించుకుంటాడని
సాని కొంపల్లో సార గుడిసెల్లో
కులమతాలు బట్టలూడదీసుకుంటాయని
డోపమైన్ డెఫిసిట్ లో
డోసెక్కువై డస్సున కక్కుకున్నా
తానొక పావ్లోవ్ కుక్కననే విషయం తెలుసుకోలేడు

చెడుగా ఎలా ఉండకూడదో ఆలోచించే మనిషికి
మంచిగా ఉండిపోవడంలో ఆనందం తెలియదెన్నడూ...

సిర్రోసిస్ వచ్చి ముడ్డిలో బొడ్డులో నరాలు ఉబ్బినా
గుండె కండరాలు సాగి దుబ్బగయినా
వెర్నిక్కే కర్సాకాఫ్ పిచ్చి తలకెక్కినా
పాంటు బెల్టులొ మొదటి బొక్కకి బాడీ జారదిగినా
కళ్ళ కింద క్యారీ బాగులు కండగా జారినా
బతకడానికి బలపాల్లా మందులు మింగినా
విత్  డ్రావల్ ఫిట్స్ తో వళ్ళంతా కుదిపినా..
పోయేదేముంది...? ఫక్తు వెధవ జీవితం
బతికితే మహా అయితే మరో ముండ
లేకపోతే మరో భార్యా బాధితుడి అండ

అంతేకదా...
చస్తే పోయేదేముంది..?
కట్టి వుంటే తాళి తెగుతుంది
బొట్టువుంటే బోడవుతుంది
ఆడ పిల్లుంటే ఇల్లు అంగడవుతుంది
మొగోడుంటే ఇంకో మెడనూలు ఊడుతుంది

అంతేకదా....
దేవుళ్ళు పుడితే లేనిది...
గా మనిషి పుడితే మందెందుకు బందు.?
సమాధుల మొక్కేటందుకా..?

తాటి చెట్లకూ ఈత చెట్లకూ నిచ్చనలు వేసి
వైకుంఠ పాళి ఆడితే అంత అలుసెందుకు..?

డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండు శవాలు
వల్లకాటికి పోతే అంత భయమెందుకు..?

బెల్టు షాపుల బొత్తాలు పీకి
సమాజాన్ని నగ్నంగా చూపితే అంత వణుకెందుకు..?

చెప్పాను కదా...రాలితే కొన్ని కన్నీటి బొట్లు
చెదిరితే కొన్ని నుదుటిమీది బొట్లు

అందుకే తాగేద్దాం
తప్పతాగే తప్పు తప్పకుండా చేసేద్దాం
నిషా తక్కువై, జీవిత నిషాణా ఎక్కినా
పుర్రె కలషంలో తీర్థం ఎండిపోయినా
అపర భగీరథునిలా తపించేద్దాం
మత్తుమందు మతం పుచ్చుకుందాం
బీరు షాపుల్నీ, బారు దారుల్నీ, దేవతల్లా పూజించేద్దాం
ఏమంటారు..?

26/11/14.

No comments:

Post a Comment