Monday, 31 August 2015

విరించి     ll తోటమాలి ll
.........................................
పొటుకు పెట్టిన ఇంటి పైకప్పులా
నీ నవ్వొక తీయటి పగులులా ఉంటుంది.
బకీటలకొద్దీ జ్ఞాపకాలు ఎన్ని నింపుకున్నా
పొటుకు పూడ్చలనిపించదెందుకో..

నీకేమి..?
రెండే రేకులుగల పూవొకటి విచ్చుకుంటే
ముప్పై రెండు చంద్రుళ్ళు మెరిసిపోయినట్లు
నోరంతా తెరచి హృదయమంతా ఊడి పడినట్లు
ఒక నవ్వుని పొరపాటున జార్చుకుని
వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళి పోతావు.

భూత భవిష్యత్తంతా తనకే తెలుసునని
గ్రంధాలు తెగరాసే మూర్ఖాగ్రేసరుడెవడూ
నేనో కవిగా మారటానికి
నీ నవ్వే కారణమని చెప్పలేకపోయాడు.

దారెంబడి బొట్లు బొట్లుగా నీటిని కార్చుకుంటూ
సాగిపోయే నీటి ట్యాంకర్ని కనుక్కోవటం
నాకు పెద్ద కష్టమేమీ కాదు..

కానీ ఈ జ్ఞాపకాల చెట్టుకింద రాలిపడే
తీయని పండ్లు తింటూ పెరిగిన నేను
మనసులోపలి పొరల్లో ఎన్ని కచ్చి కాయల్ని
మాగేసి ఉంటానో నీవు తెలుసుకున్నపుడు..
తోట యజమానిరాలిగా అయినా
ఈ జీవితకాలపు తోటమాలికి
తగినంత జీతమిచ్చి పోతావని ఎదురు చూస్తుంటాను.

30/8/15

Friday, 21 August 2015

విరించి   ll అసలైన ఉనికి ll
...................................
నాకు ఎపుడో తెలుసు భయ్యా..
నాతో నీవు ఎప్పటికీ సంధి కుదరని
యుద్ధాన్నే కోరుకుంటావని.

ఇక్కడ స్వీయ నిర్మిత సత్యాల కింద
బండ నిద్ర పోతున్న మనుషుల గుండెల్లోకి
ఎక్కడెక్కడో భూమి అట్టడుగు పొరల్లోంచి
భూకంపంలా పొడుచుకు దూకడమే
నాలో నీకు కావాలని.

కవితల్ని బాకుల్లా గుండెల్లోకి దింపి
జివ్వున చిమ్మిన రక్తపు మడుగుల్లోంచి
నేనొక రక్తాక్షరంలా పుట్టుకు రావడమే నీకు కావాలని.

ఛల్..ఎవరితో నాకేం పని.
నీ పనే నా పని పట్టడమైనపుడు..

కొవ్వు పట్టిన కవితల కింద
నీ వొక అగ్గిపుల్లని వెలిగించగలవేమో గానీ
అక్షరాల్ని నడుముకు చుట్టుకుని
సూసైడ్ బాంబర్ లా నీ నెత్తిలోనే పేలిపోతా..

నీ ఉనికి ఇక్కడెక్కడా లేదనీ తెలుసు
ఇదిగో ఇపుడే ఇక్కడ విచ్చలవిడిగే తిరిగే
సీతాకోక చిలుకలు ఈ విషయాన్ని నాతో చెప్పాయి.

నా నుంచి తప్పించుకున్నాననుకుని
ఒకానొక పాత కపాలపు కంటి బొక్కలో..
ఓపది మంది మిడి మేళం గాళ్ళతో
సన్నాయి నొక్కులు నొక్కుతుంటావని తెలుసు.
ఈ పాటికి రక్తాన్ని చప్పరించే నీ మెదడులోని సింహం
ఆకలితో చిక్కి శల్యమై ఉంటుందనీ తెలుసు.

ఇదిగో సముద్రాన్ని నీ మీదకు వలగా విసురుతున్నా..
కాచుకో..
సముద్రమంటే మీ ఇంటి బొచ్చు కుక్క కాదు
రెండు గొలుసులతో కట్టి మచ్చిక చేసుకోవడానికి.
ఈదుకుని తప్పిపోవటానికి సూది బెజ్జంలోకి
నీ బలిసిన బేజానంతా దింపి లాగాలి.

నీ పాత గన్ను వెనుక
ఒక కొత్త కన్నుతోనైనా గురిపెట్టి కాల్చు నన్ను
గన్ను పాతదా కొత్తదా అనేది కాదన్నయ్యా
తలకాయలోకి కవితలా బుల్లెట్ దిగిందా లేదా అనేది ప్రశ్న.

ఛ...నాకూ దొరికింది
ఒక కొత్త గన్నే దొరికింది.
కానీ బుల్లెట్ దింపుదామంటేనే..
పురాతన ద్వేషాన్ని మోసే
నీ పాత తలకాయ దొరికింది.

నీకు తెలుసు కద భయ్యా...
నీ పాదాన్ని నా గుండెమీద పెట్టి వొత్తినపుడు
శివుడి ఢమరుకనాదం లా
ఢమ ఢమ ఢమ ఢమ
నా పదాలు దద్ధరిల్లి పోతాయని...

అందుకే చెబుతున్నా..
ఇక్కడ భూకంపం రావాలి.
సునామీ పొంగాలి.
ఆలోచించు భయ్యా..
ఒంటరిగా చచ్చిపోయేలా ఆలోచించు.
భయం లేదు.
డౌటొస్తే అడుగు..
నీ చుట్టూ ఉన్న  చీకటిలోనే ఉంటుంది
నా అసలైన ఉనికి.

20/8/15

Tuesday, 18 August 2015

శ్రీమంతుడు...ఓ వ్యూ.
.....................
ఆకుక అతకదు పోకకు పొసగదు అని ఒక సామెత. లాజిక్ కి ఏమాత్రం అందకుంటే ఒకప్పుడు అలా అనేవారేమో. ఇపుడు శ్రీమంతుడు సినిమాకు కూడా సరిపోతుంది. సిటీలో కూర్చుని ఊరంటే ఇలా ఉంటుందేమో అని ఊహించుకున్నట్టు ఉండే ఒక ఊరుంటుంది. ఒకే ఒక్క ఇంటిని ఒకే ఒక్క గుడిసెని, ఒకే ఒక్క వీధిని చూపించేసి ఇదే ఊరు అని మనల్ని ఊహించుకోమంటాడు డైరెక్టరు. ఆ ఊర్లో గడీలాంటి ఓ పెద్ద భవనం. ఆజ్ యూజువల్ గా అది ఒక విలన్ ది ఐఉంటుంది. ఊరును మార్చేయాలని జగపతి బాబు ముందు చేతులు కాల్చుకుంటాడు. ఆ తరువాత ఆయన కొడుకు. తండ్రి మాటని అసలే మాత్రం పట్టించుకోక, ఓ మోస్తరు సామాజిక స్పృహ ఉన్న హీరోకి ఇరవై అయిదేల్లొచ్చినా తన సొంత ఊరేదో తెలియదు పాపం. ఆయన ప్రేమించిన అమ్మాయికి మాత్రం హీరోగారి తండ్రి హిస్టరీ కూడా తెలుసు.

ఏం చదివుంటాడో ఊహించలేం గానీ మన ముందు రూరల్ డెవలప్మెంట్ కోర్సు చేస్తూ నోట్స్ టకాటకా రాసేస్తూ కన్పిస్తాడు హీరో. అదేం ఊరో గానీ ఓ సర్పంచుగానీ, గ్రామ పంచాయితీ గానీ, పోలీస్ స్టేషన్ గానీ కనీసం ఊరి బయట చాయ్ కొట్లో పట్టుమని పదిమందిగానీ కనిపించరు. అలాంటి ఊరిని ఉద్ధరించటానికొచ్చేస్తాడు. దత్తత తీసుకోవటమంటే డబ్బు ఖర్చుపెట్టి ఒక రోడ్డు..ఒక స్కూలు, ఓ రోగులు కనిపించని ఆసుపత్రి కట్టించడమని మనం పర్యాయపదంగా తీసుకోవచ్చు. ఇక విలన్ పాత్రలు రొటీన్. ఒకటో తరగతి పిల్లగాడుకూడా ఊహించగలడు. హీరో చేసే ధీర కార్యాలకు అడ్డుపుల్లలు వేయటం. ఇక ఫ్లాష్ బ్యాక్ లో హీరో తండ్రికీ, విలన్ కీ ఒక నేతి బీరకాయ సంబంధం. ఓ...నువ్వా...?వీడు నీ కొడుకా...?అనే ఓ డైలాగ్ పడాలి కదా.

చివర్లో ఓ భీభత్సమైన ఫైట్. హీరో ఒక్కడే. పాత కాలంలో ఉండే కాటన్ బాక్స్ లు, డ్రమ్ముల స్థానంలో..సీసాలు పెట్టుకునే ట్రే లు ఉంటాయి. విలన్లు వాటికి గుద్దుకుని చచ్చిపోతుంటారన్నమాట. చివర్లో పెట్రోల్ పోసి విలన్లకి నిప్పంటిస్తాడు...ఎన్ని సినిమాల్లోనో కదా ఈ రొటీన్ సీన్. కాకపోతే ఓ ఛేంజ్. విలన్లు అలా మంటల్లో కాలి బూడిద ఐపోటుంటే...అచ్చం అలాగే విలన్ల చేత చంపబడిన తన తల్లో తండ్రో హీరోకి గుర్తుకు వచ్చి కండ్లు చెమర్చే సీన్ ఇక్కడుండదన్నమాట. మొత్తం పేలిపోయాక హీరో మంటల్లోంచి నడుచుకుంటూ ఒస్తుంటే..ఊరి వారంతా అమాయకమో, ఆనందమో తెలియని ముఖంతో ఎదురు వస్తుంటారన్నమాట. అక్కడ సినిమా ఐపోకముందే సినిమా హాలోడు లైట్లు వేస్తాడు ఇంక లెగండ్రా సామీ అని. మనం నడుస్తూ బయటకి పోతుంటే..అప్పటిదాకా దేబ్బపు ముఖాలు కాస్తా నవ్వుతూ గెంతుతూ కనిపిస్తుంటాయి. పక్కన పేర్లు పైకి పోతుంటాయి. అదీ సినిమా లెక్క.

మహేష్ బాబు శృతీ హాసన్ జంట జస్ట్ ఆసమ్. వారిద్దరినీ చూట్టానికో సినిమా తీసినట్టుంది. తప్పితే ఇంకేమీ లేదు. మహేష్ బాబు డైలాగ్స్ కొద్దిగా లాగి చెబితే బాగుంటుంది. చాలా చోట్లసలు ఏం చెబుతున్నాడో అర్థం కాదు. అఫ్కోర్స్ ఆ సినిమాలో మనోడు ఎవరికీ అర్థం కాడనుకోండి. మంచి పెర్ఫార్మెన్స్ చేయగల విలన్లను  మాత్రం ఎందుకూ ఉపయోగించుకోలేక పోయారు. రాజేంద్ర ప్రసాదు, జగపతి బాబు నటించినట్టుగా కన్పిస్తారు. తెలుగులో ఒచ్చిన ఓనమాలు సినిమాగానీ..హిందీలో ఒచ్చిన స్వదేస్ సినిమాకానీ చూసిన వారికసలిది సినిమాలాగా కనిపించదు. గ్రామం కోసం అనే కాన్సెప్ట్ తో ఒచ్చిన ఆ సినిమాలు మనల్ని ఆలోచింప జేస్తాయి. ఈ సినిమా కొంత బోర్ తో కూడిన ఎంటర్టైన్మెంటిస్తుంది. మహేష్ కోసం పోవచ్చు. శృతి కోసం పోవచ్చు. దట్స్ ఇట్.
విరించి ll ప్రియసఖి  ll
.................................
విరహానికి పురిటి నొప్పులొచ్చినట్టు
భారంగా, వేగంగా నడుస్తూ వస్తూందామె
ఎంతటి ప్రేమని కనబోతోందో అన్నట్టు.

సిగ్గుతో ఎర్రబడిన సాయం సంధ్యని
చెక్కిళ్ళ మీద మోస్తూ..
వసంతోత్సవ ముహూర్తమయిందనేమో
వడివడిగా
చంద్రుడిని పాలగ్లాసులా మోసుకొస్తుంది.

గాయాల్ని బుద్ధి పూర్వకంగానే తొలుచుకుని
బెరడు మీద కారే బంకని దాచుకునే
నా అల్పత్వాన్ని త్వరత్వరగా
తన చీరతో కప్పేయాలనే తొందరేమో పాపం..

తొట్రుపాటులో ఇంటి ముంగిలి గడప తట్టుకుని
దభాలున జారి పడిపోయినట్టున్నది
పాల గ్లాసులోంచి ఒలికిన పాలు
వెన్నెలలా ఆకాశమంతా పరుచుకుపోయాయి.

వెన్నెలలో మెరిసిపోయే చీరలో
ఏమందమని ఆమెది.
తడిసి ముద్దవ్వాలంటే..
ఆరుబయట కనీసం చిన్న గడ్డిపరకనైనా బాగుండు.

అదిగో జిగేలున మెరిసే ఆ చీరంతా విప్పి
నా ప్రియసఖా..అని నా కళ్ళు మూస్తూ
ఇపుడే నా కళ్ళ లోకి చేరింది నగ్నంగా

హృదయాకాశమంతా విశాలంగా పరుచుకుని
తెరలు తెరలుగా స్వప్నాల్లోకి కమ్ముకొచ్చే ఆమెను
గాఢనిద్రలా అనుభవించడమే ఇక మిగిలింది.

12/8/15
విరించిll  పంద్రాగష్టు ll
..................................
నేలబారుగా దించివున్న తలలను
రెపరెపలాడే మువ్వన్నెల జండాలా
ఈ ఒక్క రోజైనా
మనం ఎత్తి ఉంచుదాం.

రిగర్ మార్టిస్ ని నటించే శవం లాగైనా
చేతుల్ని కాసేపు బిర్ర బిగించి
మన జండాకు
మనం సాల్యూట్ కొడదాం.

అర్ధరాత్రి బయటి కొచ్చిన ఆడపిల్ల
స్వతంత్ర్యంగా నిర్భయంగా ఇంటికి చేరలేదు కనుక

అక్షరాస్యతలో ఆకలిని
నిరక్షరాస్యతలో పదవుల్ని
మనమే కనుక్కున్నాం కనుక

కులాల్ని మతాల్ని ఓట్లగా  మలుచుకుని
ఓట్ల ని నోట్లకు అమ్ముకున్నాం కనుక

పుకార్లని వార్తలుగా రెచ్చగొట్టి
వార్తలని అంగడి సరుకులా కొంటున్నాం గనుక

మరచిపోయిన జన గణ మన గీతాన్ని
తప్పులు లేకుండా పలుకుతున్నట్టు
పెదవులను కదిలించాలి కనుక

ఇంకాస్త గుడ్డిగా
ఇంకాస్త చెవిటిగా
ఇంకాస్త మూగిగా
మామూలుగా కన్నా ఇంకా ఒకింత ఎక్కవగా
మనం ఈ రోజు నటించాలి కనుక

రెప రెప లాడే మన జండా ముందు
ఏ అజండా లేని ఓ జడ పదార్థంలా
లాగేస్తున్న చేతిని కాసేపు సాల్యూట్ లా
నొప్పి పెడుతున్న మెడని కాస్త గర్వంగా
పట్టి ఉంచాలి కనుక

గాంధీజీ చేసిన మంచి పనుల్ని
నేతాజీ చేసిన వీరోచిత గాధల్నీ
ఊకదంపుడు ఉపన్యాసాల్లాగా
ఎప్పటిలాగే
ఆవులిస్తూ వినేసి..
ఆ పంచి పెట్టే మిఠాయిలేవో తినేసి..

కష్టానికి ఫలితంగా ఒచ్చిన సెలవు దినం కాబట్టి
టీవీలో ఒచ్చే సినిమాకో..
అదనంగా ఒచ్చే నిద్రకో
మనకు మనం అప్పగించేసుకుని
మన స్వాతంత్ర్యాన్ని మనమే
యదేచ్ఛగా ప్రకటించుకుందాం.

పంద్రాగష్టు పండుగ ఈ సారి
ఆదివారం రాలేదు కనుక
ఒకింత ఎక్కువగా సంబరపడిపోతూ
జైహింద్ అని కాస్త గట్టిగానే అరుద్దాం.

జైహింద్.

15/8/15

Friday, 7 August 2015

విరించి   ll షరా మామూలే ll
....................................
ఒక చోట
రెండు వందలా యాభై యేడు
తలలు ఎగిరి
రక్తాన్ని చిందిస్తాయి.

ఒక చోట
ఒకే ఒక్క తల
బిర్ర బిగుసుకు పోయి
రక్తం గడ్డ కట్టిపోతుంది.

ఎచ్చోటైనా ప్రాణాలు కదా..
అమాయకంగా పైకే లేస్తాయి
హాహాకారాలు ఎక్కడైనా ఆత్రంగా
మిన్నునే అంటుకొని ఉంటాయి.

న్యాయంకోసం అరిచే తూ నిక రాళ్ళు
తక్కెడ తట్టని కిందికి
ఇంకా కిందికి దిగజార్చుతాయి.
మత పిచ్చి తలకెక్కిన మానవుడు
పైన్నే, పైపైన్నే తేలిపోతాడు.

కళ్ళకు నల్లబట్ట కట్టుకుని మానవత్వం
మధ్య మధ్య లో
మౌనంగా నిరసన వ్యక్తం చేస్తుంది.

'ఏమిటిక్కడంతా రక్తం
మీ దేశంలో ఆకాశం
రోజుకి రెండుసార్లు ఎర్రబడుతుందా..?'
అవకాశం ఒచ్చినప్పుడల్లా
ఆశ్చర్యంగా అడుగుతాడొక దూరపు దేశంవాడు.

అవును.
రోజూ ఉదయం పూట
మామూలుగానే
సూర్యుడుదయిస్తాడు
సాయంత్రానికి
మామూలుగానే అస్తమిస్తాడు.

6/7/15.

Sunday, 2 August 2015

విరించి ll ప్రేమలేఖ కథ ll
.........................................

ఆ క్షణంలో ఆమె మబ్బు పట్టిన ఆకాశంలా ఉంది.

మబ్బులు ముసురుకొచ్చిన ఆకాశం
అందంగా ఉంటుందా అని అడిగితే
ఏం చెప్పగలుగుతాం?
జడివాన కురిసినట్టుగా కరుణిస్తుందో..
తుఫానులా విరుచుకు పడుతుందో..
హోరుగాలితో అంతా చుట్టచుట్టుకుని పోతుందో..
తెలియని వ్యక్తెవరో ముఖాన్ని గుచ్చిగుచ్చి చూస్తున్నట్టు
మిట్ట మధ్యాహ్నపు ఎండపొడ వళ్ళంతా ముల్లులు గుచ్చుతున్న
ఆ సమయంలో..నా యెదుట బస్టాప్ లో నిలబడిన
ఆమె మబ్బు పట్టిన ఆకాశంలా వుంది.

చంచల భావం కనిపించని నిర్మలమైన ఆమె కళ్ళు
తొట్రుపాటు లేకుండా నింపాదిగా ఊగే ఊపిరులు
'ఏమిటిది' అని ప్రశ్నిస్తున్నట్టుగా ముడిచిన భృకుటి
నా వెన్నులో భయోత్పాతాల్నే సృష్టించాయి.
చించి జీరండాలు పెడుతుందేమోనని
గజగజ వణికి పోతున్న చేతిలోని ప్రేమలేఖ కి
గుచ్చి ఉంచిన గులాబీ పూవు అక్కడొక
మేకపోతు గాంభీర్యాన్నే తలపిస్తున్నది.

ఝుయ్యని చెవిలో గాలి వీస్తోంది.
శబ్ద కాలుష్యంలా గుండె బాదుకుంటోంది.
గాలి కాలుష్యంలా ఊపిరి ఉక్కిరిబిక్కిరవుతోంది.
అయినా ఇద్దరి మధ్యనా ఎమర్జెన్సీ పీరియడ్ లాగా
నిశ్శబ్దం రాజ్యమేలిందంటాడు..
అమాయకంగా దూరంనుంచి చూస్తున్న కమ్యూనిష్టు స్నేహితుడు.
ఏం చూసొచ్చాడు కనుక?

మనసును వెళ్ళబోసుకోవడానికి
నోట్లో తడిలేని నాలుకసలు సరేపోదనీ..
లోపలున్న ప్రేమనే నిర్వేదాన్ని
రెండు కళ్ళూ తెలుప సామార్థ్యాన్ని కలిగేలేవనీ
ఆమెకు తెలుసో తెలియదో..
'ఊ మాట్లాడు...ఏదో మాట్లాడాలన్నావ్!!'
అని యెకాయెకిన రెండు కనుబొమ్మలూ ఎగిరేస్తే..
అగాధంలోకి జారిపోయి చెట్టుకొమ్మకు వేళ్ళాడినట్లు
చిన్న కాగితపు ముక్కను పట్టుకుని వేళ్ళాడక ఏం చేయగలను?

మనః కవాటాలు ఛేధించుకునే సమయానికి
శరీర నాడులు ఉలిక్కి పడి జవసత్వాలు నింపుకునే సమయానికి
మబ్బుల మాటునుండి సూర్యుడనవసరంగా ఊడిపడినట్లు
ఆమె వెళ్ళాల్సిన బస్సు రయ్యిన ఊడిపడుతుంది.

ఒక్క ఉదుటన కళ్ళతో తాగేసినట్టు నన్ను తాగేసి
పూల గుత్తుల్ని గంపకెత్తుకున్నట్టు ఆమె బస్సు ఎక్కేస్తుంది.
బరువుగా ఊపిరి లాగి నిట్టూరుస్తూ చెబుతాడు స్నేహితుడు
'బెటర్ లక్ నెక్స్ట్ టైం' అని.
ఆ మిట్ట మధ్యాహ్నం..
బరువుగా నాలుగు చినుకులు దబదబా రాలుతాయి.
అందమైన రంగురంగుల ఇంద్రధనుస్సు
దూరంగా కనిపిస్తుంటుంది.

31/7/15