Tuesday, 24 May 2016

కవిత్వ సందర్భం18 darbhasayanam

ఆత్మ హత్య భావ ప్రకటననా?
---------------------------------------

"పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప" అనే నినాదం గొప్పతనం తెలియనిది కాదు. ఎప్పటికి నిలిచి స్ఫూర్తిని అందించే నినాదం ఇది. ప్రాణాల్ని సైతం లెక్క చేయక ఉద్యమంలోకి  పరుగులేత్తి౦చిన నినాదం. ఐతే పోరు చేయకు౦డా ఆత్మహత్య చేసుకోవటం కూడా ఒక ఉద్యమమే అనుకునే రోజుల్లోకి మనం మెల్లిగా జరుతున్నాం అనిపిస్తుంది. ఉద్యమ లక్ష్యం తననుంచి ఒక నిస్వార్థ ప్రమేయాన్ని కాక్షించినపుడు ఉద్యమకారుడికి తన ప్రాణం ఒక సమిధలాగే తోస్తుంది. ఒకడు తన ప్రాణాన్ని అన్నిటికంటే చివరగా వదలాలని భావిస్తాడు. కానీ ప్రాణం వదలటం ఒక హీరోయిజం ఒక అమరత్వం అని భావింపజేసినపుడు అన్నింటికంటే ముందే తన ప్రాణాన్ని వదిలేయటానికి ఎవరైనా ఎందుకు జంకుతారు?. ప్రాణాల్ని తృణ ప్రాయంగా వదిలేవారి సంఖ్య విప్లవ తీవ్రతని తెలియజేస్తుందనే భ్రమ, ప్రాణం పోవటం వలన ఏర్పడిన శూన్యతను పైకి కనిపించనీయదు. ఉద్యమ లక్షం కోసం ప్రాణం వదిలిన వారిని అమరవీరులుగా హీరోలుగా పుస్తకాలుగా స్థూపాలుగా నిలబెట్టే తొందర, ఆత్మహత్యనూ ప్రాణం కోల్పోవటాన్నీ తాము ఫాంటసైజ్ చేస్తున్నామనే స్పృహను పోరాటంలో పాల్గొనే వారికి ఎరుక పరచదు. ప్రాణం పోవటం యుద్ధం లో కాకుండా ఆత్మహత్య చేసుకోవటం, అది కూడా ఉద్యమం లో ఒక భాగం గా గుర్తింపబడటం చూసినప్పుడు- వీటి వెనుక రాజకీయ శక్తుల స్వార్థాలు మనకు కనపడుతుంటాయి.  కానీ కవి, మనిషికి అగ్రజుడు. ప్రతి మనిషినీ ముందుండి నడిపించే వాడు. ప్రతీ చోట మానవీయ కోణాన్ని వెతికి పట్టుకుంటాడు. భ్రమల్ని పటాపంచలు చేస్తాడు. "Not a poem of mine had saved a single Jew from the gas chamber" అని కవి ఆడెన్ బాధపడినట్టు, అటువంటి పరిస్థితి తలెత్తకుండా తన మాటలు కనీసం ఒకరినైనా ఆత్మహత్యనుండి తప్పిస్తాయేమోనని తపన పడతాడు కవి, దర్భశయనం శ్రీనివాసాచార్య. ఏది పోరో ఏది పోరు కాదో ఒక అన్నలా తమ్ముడికి ఎరుక పరిచే ప్రయత్నం చేస్తాడు.

మన సమాజం ఆత్మహత్యను ఫాంటసైజ్ చేస్తుంది. ఆత్మహత్య చేసుకున్న వాణ్ణి హీరోని చేస్తుంది. వాడిని అమర వీరుడని కీర్తిస్తుంది. "తెలంగాణా అమర వీరులకు జోహార్లర్పిద్దాం, తెలంగాణా సాధిద్దాం" అని గోడలమీద పోస్టర్ల మీద కనిపించిన పిలుపులో అంతర్గతంగా తెలిసో తెలియకో ఆత్మహత్యను ప్రోద్బలించే మెసేజ్ దాగున్నది. చనిపోయిన వారి దగ్గరికి, ఆత్మహత్య చేసుకున్న వారి దగ్గరికి ఓదార్పుయాత్రలని మీడియాతో సహా వెడలి సానుభూతి వ్యక్తం చేసే నాటకంలో అన్యాయంగా తెలిసో తెలియకో చనిపోవటాన్ని ఫాంటసైజ్ చేయటం దాగివున్నది. చనిపోయిన రైతుకో , స్టూడెంటుకో అఘమేఘాల మీద ఎక్స్గ్రేషియాల్ని బహిరంగంగా టీవీల ముందు ప్రకటించడంలో తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చూపించుకోవడ౦లో  , ఐదు లక్షలు కాదు పది లక్షలివ్వాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుపట్టడంలో అన్యాయంగా తెలిసో తెలియకో ఆత్మ హత్యల్ని ఫాంటసైజ్ చేయటం దాగున్నది. మనం అటువంటి సమాజంలో ఉన్నాం. ఒకడ్ని అమరవీరుణ్ణి చేయటం ద్వారా తెలిసో తెలియకో ఇంకొకర్ని అమరవీరుడిలా అయేందుకు ప్రోద్బలం చేస్తున్నాం. మనం, మన చుట్టూ ఉన్న రాజకీయ సమాజం, అందరమూ తెలిసో తెలియకో  ఆత్మహత్యల్ని ఆమోదిస్తున్నాం. కవి ఆమోదించటం లేదు. అంతే తేడా.

కానీ తమ్ముడూ!
నీ నిష్క్రమణను
ఎప్పటికీ ఆమోదించలేను!  ఎప్పటికీ!

తెలంగాణా ఉద్యమం ఉధృతమవుతున్న దశలో నాయకుల అడ్డదిడ్డ ప్రకటనలు ఉద్యమ కారుల్లో అస్పష్టతని కలిగించింది. పూటకో మాట మారుస్తూ కొందరు, అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఇంకొందరు, కంప్లీట్ యూ టర్న్ తీసుకుని మరికొందరు ఉద్యమకారుల ఆశల మీద లక్షాలమీద నీళ్ళు కుమ్మరించారు. ఈ అయోమయ స్థితిని చూసి తట్టుకోలేక అనేకమంది విద్యార్థులు తమకు తెలంగాణా రాదేమోననీ, తమ చావుకేక నాటకాలాడే రాజకీయ నాయకులకు విప్లవ శంఖారావంలా వినిపిస్తుందేమోనని ఆశగా భ్రమ పడి తమ ప్రాణాల్ని స్వచ్ఛందంగా కోల్పోయారు. అయినా ఆ గోస ఇప్పటికీ ఎవ్వరికి పట్టినట్టు కనిపించదు. మా ఉద్యమంలో ఇంతమంది అసువులు బాశారని ఉద్యమ తీవ్రతని గొప్పగా తెలిపే ప్రయత్నం ఒకరు చేస్తే, అవన్నీ బూటకపు ఆత్మహత్యలని ఇంకొకరు నిర్ధాక్షిణ్యంగా కొట్టివేయడం జరిగేది. ఒక ఉద్యమ తీవ్రత అమాయకుల "బలిదానాల సంఖ్య" ఆధారంగా గుర్తించాలనుకోవటం ఈ సమాజపు మానవీయతను చిత్తశుద్ధినీ ప్రశ్నిస్తుంది. ఈరోజుకి తెలంగాణ సాధించుకున్న కారణం అర్థమవనివారు తాము దేనికోసం నిరాహార దీక్షలు చేస్తున్నారో గమనించుకోక ఈ ఆత్మ హత్యాల్ని నవ్వులపాలు చేస్తూనే ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసం సిగ్గును వొదిలేసారనుకోవటం సముచితం.

ఒకడెందుకు స్వచ్ఛందంగా నిష్క్రమించాడని
తడిగా యెడదతో యోచిస్తున్న వాళ్ళెందరు?
ఎవడి వ్యూహంలో వాడు మునకలేస్తున్నాడు తప్ప.

తెలంగాణా పోరాటాల గడ్డ. ఎన్నో దుఃఖాల్ని ఎదలో దాచుకుని ధైర్యంగా తెగించి బతికిన గడ్డ. ఆ గడ్డ మీది పిల్లలు స్వార్థపరుల పిరికివాళ్ళ ద్వంద్వ నీతుల్ని చూసి భయపడిపోవటాన్ని కవి తట్టుకోలేకపోతాడు. అపుడపుడే చిగురేసి రెండు పూలు పూసిన మొక్కల్లాంటి పసి పిల్లలు, ఎక్కడెక్కడో ఉన్న ఆకాశాన్ని గొంతులోకి తెచ్చుకుని "జై తెలంగాణా" అని ఉరిమిన పిల్లలు, అకస్మాత్తుగా అర్ధాంతరంగా అసువులుబాయటం చూసి చలించిపోయిన కవి ఈ శూన్యాన్నెలా భరించాలని తల్లడిల్లిపోతాడు. ఉండాల్సిన సమయంలో నువ్వుండకపోతే ఎట్లా? అని వాపోతాడు.

ఉండకూడని వాళ్ళు ఈ నేలను
పెత్తనాల్తో తొక్కుతున్న
దుర్భర సందర్భంలో
నువ్వుండకపోతే ఎట్లా?

అర్జున విషాద యోగం తరువాత "క్లైబ్యం మాస్మగమః" అంటూ భగవానువాచ మొదలైనట్టు, ఈ విషాదాన్నంతా దిగమింగుతూ  ఉద్యమకారులకు తమ ఉద్యమ మూలాలు, లక్షాలు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాడు కవి. పల్లెవలె- పల్లె లోని పొలం వలే ధైర్యంగా ఉండమంటాడు. నీవుంటే ఒక పిడికిలి ఉండేది, నేలకు మరింత చేవ వుండేదని ఉద్యమకారులకు తమ మట్టి వాసనను గుర్తుకు తెస్తాడు ఈ మట్టికవి. ఈ కవిత గతించిన ఉద్యమ కారులకు సంబంధించిన ఎలిజీలాగా ఉన్నా, అప్పటి తెలంగాణా ఉద్యమకారులను ఆత్మ హత్యల విషయమై మరోసారి ఆలోచించమని చెప్పినట్లుగా సాగుతుంది. ఉద్యమకారుల మరణాన్ని అమరత్వమని కీర్తించి పబ్బం గడుపుకునే ముసుగు కవులకు ముసుగు ఉద్యమకారులకూ భిన్నంగా, వారి మరణాన్ని కీర్తించి, వారి దుఃఖాన్ని మలిన పరచలేనంటూ వారి దుఃఖంతో సహానుభూతిని పొందుతాడిక్కడ కవి. నిష్రమణను నిరసనగా సంభావించే కాలమా ఇది అని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తాడు.

నీవు ఉండాల్సిన వాడివి!
(Srinivasacharya Darbhasayanam)
7-4-2010

--------------------------------
నీ పేరేదైతేనేం
వెంకటో శ్రీకాంతాచారో వేణుగోపాల్ రెడ్డో
అకస్మాత్తుగా అర్ధాంతరంగా హడావిడిగా
ఇక్కడొక శూన్యస్థలిని మిగుల్చుతూ
వెల్లిపోయావన్నదే-
ఎట్లా దిగమింగుకునేది

అపుడే లేచి చిగురేసి
ఒకట్రెండు పూలు పూసిన చెట్టు
ఉన్నట్టుండి,మాయమైపోతే
మిగిలే,శూన్యంలాంటి శూన్యం
ఎట్లా తట్టుకునేది

మొదలవడం
మొదలవడంతోనే
తుది తీరందాకా
వ్యాపించేంత
గొప్ప నమ్మకాన్నిచ్చావ్
ఎక్కడో ఉన్న ఆకాశాన్ని
గొంతులోకి
తెచ్చుకుని ఒక ఉరుము ఉరిమావ్
మెరుపై చటుక్కున మాయమవుతావని
అనుకోలేదు సుమా!
ఎట్లానమ్మాలి

హక్కును ప్రకటించడంతో మొదలై
అక్కడేనువ్వు అంతమవడం
ఎంత విషాదం!
అనేక విషాదాల్ని అడ్డుకోడానికేకదా
ఏ పోరైనా!
నీ నిష్క్రమణ మహా విషాదాన్ని మిగిల్చింది
ఎట్లా అధిగమించేది

నిష్క్రమణను నిరసన ప్రకటనగా
సంభావించే కాలమా ఇది
ఒకడెందుకు స్వచ్ఛందంగా నిష్క్రమించాడని
తడిగా యెదడతో యోచిస్తున్న వాళ్ళెందరు?
ఎవరి వ్యూహంలో వాడు మునకలేస్తున్నాడు తప్ప
మాటలు తప్ప మరే జీవన యోధత్వమూ
లేని వాళ్ళ సందడికేం
నిన్నోమాట, ఇవాళొకటి, రేపు మరోటి
ఎల్లుండి ఇంకొకటి- అవసరమైతే
మాటల్ని కొన్నాళ్ళు మానేసి కూడా
నిజమైన మాటగా పెకిలిన వాడివి
నిష్క్రమణలో  నిశ్శబ్దాన్ని ఇక్కడ మిగిల్చి
ఏ మాటను ప్రతిష్టిద్దామనుకున్నావు?
ఈ నేలెపుడూ నిష్క్రమించమనదు
ఈ ఆకాశమూ అనదు, చూట్టూ వున్న గాలి కూడా

మన వెనకాల ఎన్నెన్ని పోరాటాలు! ఎంతెంత నడక!
దుఃఖాల మీద దుఃఖాల మీద దుఃఖాల మీద
దుఃఖాలు పొర్లుకొచ్చినా తెగించి
బతకడమే
బతుకుతు బతుకు హక్కు కోసం
అలుపెరుగక గొంతెత్తడమే
మన చరిత్ర అదే కదా!

పల్లె నుంచే వచ్చావు కదా
ఎన్ని యాతనలున్నా అదెలా బతుకుతున్నదో
ఎందర్ని బతికిస్తున్నదో నీకు తెలియనిదా
మోసం ఋతువు చేసినా మనిషి చేసినా
ఉన్నపళంగా పొలాలు నిష్క్రమించలేదు కదా
ఎట్లా నిష్క్రమించావు నువ్వు?

దుఃఖపు ముద్ద అయింది నేనొక్కణ్ణేనా
శూన్యాన్ని మోస్తున్నది నీ ఇల్లూ వూరేనా
పోరాటాల్తో దుక్కి దుక్కైన ఈ నేల నేలంతా
చిత్తడి చిత్తడై పోయింది కన్నీటితో
ఎట్లా ఓదార్చేది.

నువ్వు వుండాల్సిన వాడివి!
ఉండకూడని వాళ్ళు ఈ నేలను
పెత్తనాల్తో తొక్కుతున్న
దుర్భర సందర్భంలో
నువ్వుండకపోతే ఎట్లా?

ఒక్కసారి నువ్వు యోచించి వుంటే
ఎంత బాగుండేది
నువ్వుండేవాడివి
ఒక గొంతుండేది
ఒక పిడికిలి వుండేది
నేలకు మరింత చేవ వుండేది
మరీ ముఖ్యంగా
నేలలాంటి ఒక కన్నతల్లికి
కడుపుకోత మిగిలేది కాదు

ఇవాళ
నీ మరణాన్ని కీర్తించి
నీ దుఃఖాన్ని మలినపరచలేను
నీ ఉద్వేగాన్నీ
ఉరిమే గొంతునూ
హత్తుకుంటాను
కానీ తమ్ముడూ!
నీ నిష్క్రమణను
ఎప్పటికీ ఆమోదించలేను!  ఎప్పటికీ!

నిజానికి ఆత్మహత్య చేసుకోవాలంటే ముందు ఆ వ్యక్తి మనసు దానిని ఆమోదించాల్సి ఉంటుంది. ఒక కష్టం కలిగినపుడు మనిషి మనసు తన ముందున్న అనేక పరిష్కారాలను స్కాన్ చేసుకుంటుంది. అపుడు ఆత్మహత్య అనే విషయం కూడా పైకి వస్తుంది. మొదట మనసు దానిని అంగీకరించదు, స్వీకరించదు. మరలా మనసు తన ముందున్న పరిష్కారాల్ని స్కాన్ చేసుకుంటుంది. మరలా ఆత్మ హత్య అనే విషయం పైకి వస్తుంది. మనసు మరలా స్వీకరించదు. ఇలా అనేక సార్లు జరిగిన తరువాత మనసు, పైకి వచ్చిన ఆత్మహత్య అనే విషయాన్ని స్వీకరించటం మొదలవుతుంది. కొంతకాలానికి అదే అసలైన పరిష్కారమనే నమ్మకాన్ని పెంచుకుంటుంది. దానిపై పని చేయటం మొదలవుతుంది. అదే ఇంక అంతిమ తీర్పులా భావనని స్థిరీకరించుకుంటుంది. ఫలితం ఆత్మహత్య. కానీ మనం నిర్మించుకున్న సమాజం మనిషి మనసు ఆమోదించేకంటే ముందే ఆత్మహత్యను ఆమోదిస్తున్నట్టుగా తయారయింది. చావుకు ఒక దేవుడుంటే వాడ్ని పిలిస్తే పలికే దైవంలా మార్చేసుకుంది. ఈ పరిస్థితి మారాలి. కవులు మార్చాలి. ఉద్యమం బతాకాలి. ఉద్యమకారులు  బతకాలి. వారి బలవంతపు చావును స్వార్థ శక్తులు ఉపయోగించుకోవటం మానాలి. ఇకపై ఎవరి బలవంతపు చావునైనా ఆమోదించలేని సమాజాన్ని తయారు చేసుకోవాలి.

18/5/16
కవిత్వ సందర్భం18

Monday, 9 May 2016

హిట్లర్ రక్త దానం చేశాడు
..................................
మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాటకంలో షైలాక్ ఒక మాట అంటాడు." మీరు సూదులతో గుచ్చితే మాకు రక్తం రాదా? మీరు చక్కిలి గింతలు పెడితే మాకు నవ్వు రాదా? మీరు విషం పెడితే మేము చచ్చిపోమా? మీరు మమ్మల్ని బాధిస్తే మేము పగ తీర్చుకోమా?" అని. యూదు జాతీయుడైన షైలాక్ క్రిస్టియన్ అయిన ఆంటోనియో ని అడుగుతాడు. ఈ నాటకంలో షైలాక్ విలన్. ఆంటోనియో హీరో. కానీ కేవలం యూదు జాతీయుడైనందుకే ఆంటోనియో షైలాక్ ని అసహ్యించుకుంటుంటాడు. అపుడు షైలాక్ పై మాటలడుగుతాడు. ఆంటోనియోలో గూడుకట్టుకున్న 'ఎథ్నోసెంట్రిసిటీ' ని ప్రశ్నించి, సంస్కృతులు వేరయినా మనుషులంతా ఒక్కటే అని చెప్పే ప్రయత్నం షైలాక్ చేసినా..,హిట్లర్ కి షైలాక్ మాటలు నెత్తికెక్కలేదు. నాజీలు షేక్స్పియర్ ని 'జెర్మానిక్ రైటర్' అని చెప్పుకున్నారు. మర్చంట్ ఆఫ్ వెనిస్ ని యూదుల వ్యతిరేక భావజాలంగా వాడుకున్నారు. తరువాత జరిగిన మారణ హోమం తెలియనిది కాదు. హిట్లర్ హామ్లెట్ ని 'ఆర్యన్ జర్మన్ సోల్జర్' గా భావిస్తే, స్టాలిన్ ఈ నాటకం కల్చర్ ని భ్రష్టు పట్టించేలా ఉందని రష్యాలో నిషేధించేసాడు. తమకంటే...తమ దేశం కంటే, తమ మతం కంటే, తమ సంస్కృతికంటే, తమ ప్రాంతం కంటే ఇంకేదీ గొప్ప కాదు. తామే గొప్ప, మిగితావంతా నీచాతినీచమైనవి, అనాగరికమైనవీ అని అనుకోవటం, చెప్పుకోవటం, అలా ప్రవర్తించటం ఎథ్నో సెంట్రిసిటీ అనిపించుకుంటుంది. యురోపియన్ ఇంపీరియలిజం పదహారవ శతాబ్దం నుంచి దీనిని ఉపయోగించి ఎన్ని దేశాల్ని, వాటి సంస్కృతుల్ని నీచాతినీచమైనవిగా చూపించి ప్రచారం చేసుకుందో మనకు తెలియనిదేం కాదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమనీ, సంపన్న దేశమనీ, ప్రపంచ దేశాలన్నింటికీ అండ అనీ అమెరికా చెప్పుకుంటూ చేసే గోబెల్ ప్రచారానికి కూడా ఎథ్నోసెంట్రిసిజమే కారణం.

మామతం గొప్పది, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడే అసలైన దేవుడు, మా మత గ్రంథమే అసలైన దేవుని వాక్యం, మా మతమే ముక్తికి ఏకైక మార్గం అని మనం ప్రతి రోజూ ఏదో ఒక మతం, ఏదో ఒక మూలన గగ్గోలు పెడుతూ  ఉండటం చూస్తూనే వుంటాం. మత ప్రచారకులే కాకుండా మతాన్ని  అవలంబించేవారు కూడా తమ దారే రహదారనీ, మిగతా దారులన్నీ దొడ్డిదారులే అని నమ్మటం చూస్తున్నపుడు, ఈ ఎక్సక్లూసివ్ థింకింగ్ కి రాజకీయ, సామాజిక కారణాలే కాక వైయుక్తిక కారణాలు కూడా ఏమైనా ఉండింటాయా అని అనిపిస్తుంటుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ "న్యూరోసిస్ మతము రెండూ కూడా మనిషి మనసులో పుట్టినవే " అంటాడు. యూదు జాతీయుడిగా విపరీతమైన యాంటీ సెమెటిక్ వివక్ష కు గురయినవాడు ఫ్రాయిడ్. "యూదుడినైనందుకు నాకు నేను తక్కువగా, పరాయిగా భావించేవాడినని" చెప్పుకున్నాడు. 'ఆలోచనల సర్వస్వమే' మనసనుకున్నా, మానవుని మెదడు నిర్మాణంలో మనసనేది ఎక్కడా భౌతికంగా కానరాదు. మనసనేది ఉందని అనడం కూడా ఒక మానసిక భావనగానే మిగిలిపోయింది. ఇది ఎలాగున్నా, మానవుడికి మతమనే భావన ఒక సహజ గుణం అనిపిస్తుంటుంది. ఈ గుణమే తమ మతమే గొప్పదనే భావనకు నాంది అనిపిస్తుంటుంది.

మనిషి ఒంటరిగా ఉన్నపుడు, తన మతమే గొప్ప అనో అనుకోవటానికి వీలు లేదు. ఇది సమిష్టిగా కొందరు కూర్చుని అనుకుంటే తప్ప సాధ్యం కాదు. మనిషి ఒక గ్రూపులో ఉన్నపుడే ఇలాంటి భావనలతో నిండి ఉంటాడు. గ్రూపు మనిషికి కొంత ఊరటనిస్తుంది. ఫలానా వారి గ్రూపు కంటే మా గ్రూపు గొప్పది అని గ్రూపు సభ్యులందరూ కలిసి అనుకోవటంలో చర్చ చేసుకోవటంలో ఉండే కిక్కే వేరప్పా.. అని చెప్పక తప్పదు. ఇతర గ్రూపుల విషయంలో విపరీతమైన ద్వేషాన్ని కలిగి ఉండటం, ఈ గ్రూపు వ్యక్తులకు మాంచి ఉత్సాహాన్ని కిక్కునూ ప్రసాదిస్తూ ఉంటుంది. గ్రూపులో సభ్యుడైన వ్యక్తులు మాత్రమే, ఒకరు చెప్పిన విషయం పట్ల సముఖతను వ్యక్తం చేస్తారు. గ్రూపు సభ్యుడు కాని వాడు చెప్పిన విషయం పట్ల విముఖతను ప్రదర్శించడు అని చెప్పటానికి వీలు లేదు కాబట్టి, గ్రూపులో సభ్యులు తమలో తాము సంభాషించుకున్నపుడు ఒక రకమైన దగ్గరితనాన్ని ఆనందాన్ని పొందగలుగుతారు.

 'ఎంపథీ' అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇతరుల విషయం పట్ల సానుభూతో, సమభావమో కలిగి ఉండటం. ఒకరికి ఒక కష్టం వచ్చినపుడు, లేదా సంతోషం కలిగినపుడు దానిని పంచుకోవటానికి, ఇంకొకరు కావాలి. ఆ ఇంకొకరు కూడా అదే గ్రూపులోని వ్యక్తులు అయివుంటే ఎంపథీ పొంగి పొరలుతుంది అనేది వాస్తవం. అయితే ఎంపథీ కి మనిషి మెదడులో నుండి ఉత్పత్తయ్యే ఆక్సిటోసిన్ అనే హార్మోనుకీ సంబంధం ఉంటుంది. తమ గ్రూపు గొప్ప దనాన్ని పదే పదే చెప్పుకోవటం ద్వారానో...లేదా ఇతర గ్రూపుల మూర్ఖత్వాన్ని తలుచుకుంటూ ఆవేశంతో ఊగిపోవటం వల్లనో..లేదా ఇతర గ్రూపుల వలన తమకు కలిగిన కష్టాల్ని ఆడిపోసుకోవటం వల్లనో..లేదా తమ గ్రూపు ఇతర గ్రూపుల మీద సాధించిన విజయాల్ని ఏకరువు పెట్టడం వల్లనో...ఇలాంటి విషయాల్ని ఒక గ్రూపు సభ్యులందరూ ఒక చోట కూర్చుని ఎంపథైజ్ అయినపుడు వారి వారి రక్తంలో ఆక్సిటోసిన్ హార్మోన్ లెవెల్స్ పెరిగిపోవటాన్ని సైంటిస్టులు గుర్తించారు. ఇది మత గ్రూపులకే వర్తిస్తుందనుకోవాల్సిన పని లేదు. ఏ గ్రూపుకైనా వర్తిస్తుంది. అథీస్టులందరూ ఒక చోట కూర్చుని మథీస్టులమీద దుమ్మెత్తి పోసుకుంటే ఆక్సిటోసిన్ ఇచ్చే కిక్కే వేరుగా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. అందుకే ప్రాచీన మత సంస్థలన్నీ గ్రూపు వాతావరణాన్ని ఏర్పరుచుకోటానికి ప్రయత్నించాయి. తయారు చేసుకున్న నమ్మకాల్నీ, విధుల్ని తూ చా తప్పకుండా సభ్యులందరూ పాటించాలని నియమాల్ని చేసుకున్నాయి. పాటించని వారినీ, నమ్మనివారినీ వెలేసాయి, అవసరం అనుకుంటే చంపేశాయి.

ఆక్సిటోసిన్ రక్తంలో ఉండాల్సినంత ఉంటే ఏ ఇబ్బందీ లేదు. దీనిని 'కడ్లింగ్ హార్మోన్' అంటారు. ప్రేమను బంధాన్ని పెంపోదించే హార్మోన్ ఇది. డబ్బూ, మార్కెట్టూ, ఇదే ప్రపంచం అనుకునే వెస్టర్న్ సివిలైజేషన్ మనిషిని విరీతమైన స్ట్రెస్ లోకి నెట్టివేస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మెదడు లోని హైపోథలామస్ నుంచి ఆక్సిటోసిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. అటువంటి సందర్భాల్లో ప్రేమ బంధమూ బంధుత్వమూ మరచి మనిషి ప్రవర్తిస్తుండటం మనం గమనిస్తుంటాం.  మనిషి మతం వైపుకు మరలటానికి అధిక ఒత్తిడి కలిగించే సమాజాలు ఏర్పడటానికీ సంబంధం ఉంటుంది. ఈ అధిక ఒత్తిడినుండి దూరంగా మరలటానికి మతం, తద్వారా మతం కలిగించే గ్రూపు భావన, తద్వారా అది కలిగించే ఆక్సిటోసిన్ సమతౌల్యత వంటివన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి వుంటాయి. వెస్టర్న్ సివిలైజేషన్ మీది విముఖత, ఇస్లామిక్ దేశాల్లో ఇస్లాం బలపడటానికి కారణమంటారు సోషియాలజిస్ట్ లు. స్ట్రెస్ ని తొలగించి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ని కలిగించే మత భావన ని వదులుకుని, విపరీతమైన ఒత్తిడిని విసిరి కొట్టడమే ఇది. అయితే ఈ హార్మోన్ మనుషులందరిలో ఉంటే మనుషులందరూ ఒకరికొకరు ప్రేమను పంచుకుంటూ ఉంటారు కదా అని మీరు అడగవచ్చు. కానీ ఈ హార్మోన్ అటువంటి యూనివర్సల్ భావనని కలిగించదట. అంటే 'విశ్వ మానవుడు' అనేది కేవలం ఒక మిథ్య మాత్రమే. ఈ హార్మోన్ కేవలం గ్రూపు భావననే పెంపొందిస్తుందట. తమ గ్రూపు మీద ప్రేమనూ, నమ్మకాన్నీ కలిగిస్తుందట. అంతే కాకుండా ఒక గ్రూపునే అట్టి పెట్టుకునేలా, వేరే గ్రూపులవైపు కన్నెత్తి కూడా చూడనీయకుండా కూడా చేస్తుందట. తద్వారా తయారు చేసుకున్న నియమాలని పాటించేలా, నీతి నిజాయితీ కలిగి ఉండేలా చూస్తుందట. పురాతన నాగరికతల్లో ఈ ఆక్సిటోసిన్ మనుషులు గ్రూపులుగా ఉండటానికి తద్వారా ప్రకృతినుంచి, క్రూర జంతువుల నుంచి సురక్షితంగా ఉండటానికి తోడ్పడిందట.

నూతన సైంటిఫిక్ రీసెర్చ్ ల ప్రకారం, ఆక్సిటోసిన్ మానవ అభివృద్ధిలో కీలకమైన పరిణామాత్మక పాత్రనే పోషించింది. గ్రూపు సభ్యుల మధ్య మైత్రినీ సఖ్యతనూ పెంచటం ద్వారా మానవ సమాజాలు ముందుకి కదిలేలా చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా, ఒక వ్యక్తికి ఆక్సిటోసిన్ ఇంజక్షన్ ఇచ్చి అతని ఇష్టాల్ని పరిశీలించినపుడు, అతడు తన మతం లేదా తన దేశం వారినే ఇష్ట పడినట్లు తెలుస్తోంది. అంతే కాక అనవసరం అయిన పరిస్థితుల్లో కూడా అవసరం ఉన్నట్టు భ్రమ కల్పిస్తూ తమ మతం లేదా దేశం వారిని కాక ఇతర మతం లేదా దేశం వారిని చంపటానికి కూడా వెనుకాడబోమని ఆక్సిటోసిన్ ఇంజక్షన్ పుచ్చుకున్న వ్యక్తులు చెప్పటం జరిగింది. ఇది నార్సిస్సిజంని సూచిస్తోంది. కాబట్టి ఆక్సిటోసిన్ హార్మోన్ కి రూపాయి కాయిన్ లాగా రెండు ముఖాలుంటాయి. ఎపుడూ బొమ్మనే పడుతుందనుకోటానికి వీలు లేదు. బొరుసు పడ్డప్పుడు మతం కాస్త మత్తుగా మారి, మత తీవ్రవాదానికి దారితీస్తుంది.  ఇలా ఆక్సిటోసిన్ ఎక్కువ మోతాదులో కలిగి ఉన్న వ్యక్తుల మాటలూ, ప్రవర్తనా మనం ఈ మధ్య చాలానే చూస్తున్నాం. కనీసం అటువంటి వారెవరైనా కనపడ్డప్పుడు, వేరే మతాలు నీచాతి నీచమైనవనీ తమ మతమే గొప్పదనీ, వేరే రాజకీయ పార్టీలు నీచాతి నీచమైనవనీ, తమ పార్టీయే గొప్పదనీ ఎవరు బీరాలు పోతున్నా, ఒకసారి రక్తంలో ఆక్సిటోసిన్ చెక్ చేసుకోమని చెబుదాం. లేదా హిట్లర్ రక్తమో..ఆంటోనియో రక్తమో ఏమైనా ఎక్కించుకున్నాడేమో అడుగుదాం.

9/5/16

(కవిత్వ సందర్భం 17) volga

ఓల్గా నుంచి గంగ వరకు
--------------------------------
ప్రతీ వ్యక్తికీ 'సెల్ఫ్ ఇమేజ్' అనేది ఒకటి వుంటుంది. తను సంపాదించన జ్ఞానం, తను బ్రతుకుతున్న సమాజం, ఈ సెల్ఫ్ ఇమేజ్ ని ఏర్పరచటంలో ప్రధాన భూమిక పోషిస్తాయి. సమాజాలు ఒక రోల్ మోడల్ ని తయారు చేసి మనుషుల సెల్ఫ్ ఇమేజ్ని ప్రభావితం చేయ చూస్తాయి. ఒకప్పటి రాముడూ, సీత అయినా, ఇప్పటి సిక్స్ ప్యాక్ హీరో లేదా జీరో సైజ్ బార్బీ గర్ల్ అయినా, సమాజం తయారు చేసే నమూనాలు. వీటిల్లోకి స్త్రీ పురుషులు ఇమిడిపోయేలా సమాజాలు వాటి వాటి మతాల్నీ, సంస్థలనీ నిర్మించుకుంటాయి. మగవాని విషయంలో ఎలాగా ఉన్నా, ఆడవారి విషయంలో మాత్రం ప్రాచీన కాలం నుండీ వివిధ సమాజాలు దాదాపు ఒకేరకమైన నమూనాల్ని బలపరుస్తూ వచ్చాయి. నేటికీ బలపరుస్తూనే ఉన్నాయి. స్త్రీని ఒక మాతృ మూర్తిగా, ఇంటికి దేవతగా, త్యాగశీలిగా మాత్రమే కాకుండా  పురుషుడి ఆధ్యాత్మిక చింతనకు అడ్డంకిగా, ముముక్షువులు త్యజించవలసిన వస్తువుగా, అనైతికత ప్రబలడానికి కేంద్ర బిందువుగా, యుద్ధాలు జరగటానికి కారకులుగా సమాజాలు నమూనాలు తయారు చేసి ఉంచాయి. ఇవి స్త్రీలను వంటింటి కుందేలుగా మార్చి ఒక వ్యక్తిత్వంలేని స్వేచ్ఛలేని బానిసగా మలిచాయి.

కానీ ఫ్రెంచ్ రష్యన్ విప్లవాలు, పారిశ్రామికీకరణ స్త్రీలలో ఆలోచనల్ని రేకెత్తించాయి. పరిశ్రమలు రాక పూర్వం ఒక ఇంటికి కావలసిన వస్తువులను ఒక మగవాడు సంపాదించగలిగితే, పరిశ్రమలు, మగవాడి సంపాదనకు ఆడవారి సంపాదనను కూడా అత్యావశ్యక్యం చేశాయి. సమాజం ఏర్పరిచిన సంస్థలు ఆడవారికి విద్య ఉద్యోగం అందించటమే ఎంపవర్మెంటని నినదించాయి. కానీ లోగుట్టు మాత్రం స్త్రీ రూపంలో ఒక కొత్త బానిస కావలసిన అవసరాన్ని దాచిపెట్టాయి. తక్కువ జీతాలకు దొరకే కొత్త బానిసత్వాన్ని 'స్త్రీ- శ్రమ శక్తి' రూపంలో పరిశ్రమలు దోచుకోవటం మొదలైంది. ఒక స్టడీ ప్రకారం స్త్రీలు, ప్రపంచ మొత్తం పనిలో 66 శాతాన్ని, 50 శాతం ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు, అయినా ప్రపంచ మొత్తం సంపాదనలో కేవలం 10 శాతాన్ని, సొంత ఆస్తిలో కేవలం  1 శాతాన్ని కలిగివున్నారుట. పారిశ్రమికీకరణ ఇత్యాది పరిస్థితులు, స్త్రీపురుషుల సమాన హక్కుల ప్రస్తావనని తీసుకునివచ్చింది.  స్త్రీలు సమాజంలోనూ, ఇంటిలోనూ, పనిలోనూ తాము అణచివేతకూ దోపిడికీ గురౌతున్నామని అపుడపుడే గుర్తించటం మొదలయింది. పాశ్చాత్య దేశాలలో స్త్రీ హక్కుల పోరాటాలు భారత దేశంకన్నా రెండువందల యేండ్ల ముందే మొదలయ్యాయి. కానీ 1960 తరువాతే స్త్రీ విముక్తి బృందాలు ఏర్పడి "ఫెమినిజం"గా ముందుకు వచ్చాయి. సిమన్ డి బ్యూవర్ రాసిన "సెకండ్ సెక్స్" అనే పుస్తకం(1949) ఎంతో మంది స్త్రీలను ప్రభావితం చేసింది. అలాగే అమెరికన్ రచయిత్రి బెట్టీ ఫ్రీడన్ రాసిన "ది ఫెమినిస్ట్ మిస్టిక్" పుస్తకమూ(1966)  ప్రభావాన్ని చూపింది. తెలుగులో స్త్రీవాద కవితోద్యమాన్ని ప్రభావితం చేసిన పుస్తకాల్లో దీనిని ఒకటిగా చెబుతారు. అటువంటి సమయంలోనే(1972)  తెలుగులో తొలిసారిగా స్త్రీవాద కవిత్వాన్ని వినిపించారు కవయిత్రి వోల్గా.

భారత స్త్రీ విషయంలో భారత సమాజం ఒక పకడ్బందీ నమూనాను తయారు చేసింది. స్త్రీ వాద ఉద్యమం మొదటిసారి ఈ పవిత్ర కార్యాల వెనుక, దాస్యాల వెనుక దాగి ఉన్న అణచివేతను గుర్తించగలిగింది. మొదటి సారి స్త్రీ తన జీవితాన్ని తాను తప్ప ఎందరో ప్రభావితం చేస్తున్నారని తెలుసుకోగలిగింది. ఈ అణచివేత తమని సమాజానికి దూరంగా ఉంచగలిగలిగిందని, భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా వెలివేసిందని గుర్తించగలిగింది.

ఎలా పుట్టానో ఎందుకు పెరిగానో
ఎవరికోసం జీవిస్తున్నానో
తెలియని వెర్రి తల్లిని
వెలివేయబడ్డ చీకటి బ్రతుకుని

ఇవి కవయిత్రి మాటలు. ఇవి తాత్విక భూమికను దాచుకున్న అతి సాధారణ వైయుక్తికోద్వేగాన్ని తెలిపే మాటలు. కానీ ఈ పదాల్లో భావన కానీ, తాత్వికతకానీ వైయుక్తికం కావు, ఇవి సామూహికం. ఇటువంటి కవిత్వం ప్రధానంగా స్త్రీ వాద కవిత్వంలో కనిపిస్తుంటుంది. కవయిత్రి ఓల్గా ఈ తత్వాన్ని ఇమడ్చుకుని సామూహిక గొంతుకను వైయుక్తికంగా వినిపించే ప్రయత్నం చేస్తారు. పురుషాధిపత్య సాహిత్యం, కుటుంబ హింస,అణచివేతకు గురైన  సామాజిక జీవితం ఇవన్నీ చివరికి తన మీద తనకి ఒక సెల్ఫ్ ఇమేజ్ ని పెంపొందిస్తాయి. అందులో ముఖ్యంగా శారీరక స్పృహను కలిగిస్తాయి. వేదన కలిగించే శారీరక స్పృహ ఆఖరికి స్త్రీని మాతృత్వాన్ని కూడా వద్దనుకునే పరిస్థితికి తీసుకుని పోతాయేమో అనటానికి "నేను పవిత్రామ  తల్లినీ కాను" అనే వాక్యాలే నిదర్శనం.

ఈ కవితా నిర్మాణం కవయిత్రి భావనా స్పష్టతకు అద్దం పడుతుంది. కవిత మొదటి భాగంలో కవయిత్రి పురుషాధిపత్య సమాజపు నమూనాలని చర్చిస్తూ తనను తాను మార్జినలైజ్ చేయబడిన వ్యక్తిగా గుర్తిస్తుంది. ఇక్కడ వైయుక్తికంగా సాగే కవిత్వం సామూహిక చేతనను స్పురిస్తూ సాగుతుంది. రెండవ భాగంలో సమాజంలోని ఉన్నత వర్గ స్త్రీ గా, మధ్య తరగతి స్త్రీగా, కూలీ పని చేసే బీద స్త్రీగా కవయిత్రి పరకాయ ప్రవేశం చేసి సమాజంలోని మూడు తరగతుల స్త్రీల బాధ ఒకలాగే ఉంటుందనే సత్యాన్ని బోధపరుస్తుంది. చివరి భాగంలో దీన్నంతా కాదంటూ తాను పంచాది నిర్మల వారసురాలిగా తనను తాను మార్పును కోరుకునే విప్లవకారిణిలా నిర్వచించుకుంటుంది. ఎవరీ పంచాది నిర్మల అంటే మహాకవి శ్రీశ్రీ నే చెప్పాలి.

స్త్రీ దేవతలను పూజిస్తారు
పురాణ కథానాయికలను గుర్తుంచుకుంటారు
ఝాన్సీ లక్ష్మీ బాయికి కన్నీటి వందనాలు చేస్తారు
సరోజినీ దేవిని పూల మాలలతో పొగడ్తలతో ముంచెత్తుతారు
అయినా, పంచాది నిర్మల పేరు మాత్రం వారిని వణికిస్తూనే ఉంటుంది*.

అన్నాడు శ్రీశ్రీ. 1970 నుండి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటి ఆడపిల్లకీ నిర్మల పేరు పెట్టుకోవటం మొదలయ్యిందంటే ఆమె ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. "తెగింపు సంఘం" ద్వారా మొదటిసారి మహిళల అణచివేతని, మద్యపాన విక్రయాలనీ, అధిక వడ్డీ ఋణాలనీ, నకిలీ మనుషులని, నకిలీ సమాజాన్నీ ఉద్యమంలా ప్రశ్నించిన ఆమె, పీడితుల పక్షం వహించింది కాబట్టి ప్రభుత్వాలు నకిలీ యుద్ధంలో చంపివేసి ఉంటాయని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను.

పంచాది నిర్మల వారసురాలిని
-----------------------------------------
అందమైన దోపిడికీ
పవిత్రమైన హింసకూ
న్యాయమైన దాస్యానికీ
బలైపోయిన నేను
భారత స్త్రీని

కొంతకాలం పతివ్రతని
కుష్టురోగుల ఎంగిళ్ళ కుక్కని
అనుమానాల అవమానాల
అగ్ని జ్వాలలకు ఆహుతిని

సహగమన జ్వాలల శలభాన్ని
కొంతకాలం ప్రబంధ కన్యని
నోరూరించే పంచదార చిలకని
రాజులకోసం రోదించిన కోయిలని
స్తనాల బరువుతో చచ్చిన శవాన్ని
మనిషిని కాను అష్టమ భోగాన్ని

ఆ పిమ్మట
పుట్టు వితంతువుని
మొగుడు చచ్చిన ముండని
ఎలా పుట్టానో ఎందుకు పెరిగానో
ఎవరికోసం జీవిస్తున్నానో
తెలియని వెర్రి తల్లిని
వెలివేయబడ్డ చీకటి బ్రతుకుని

ఇపుడో
ఒకవంక
భర్తల హోదాల అధికారాల
కార్లకూ బార్లకూ బందీని
ఫ్యాషన్ పరేడ్ పందాలలో పడి
నలిగిపోవటమేగానీ
స్వేచ్ఛ తెలియని విహంగాన్ని
ధనిక వర్గపు దరిద్రాన్ని

ఇంకోవంక
తినటం పిల్లల్ని కనటం తప్ప
మరేదీ పట్టని
పట్టించుకోడానికి తీరని
మర చక్రాన్ని

వేరొకవంక
పొద్దస్తమానం పని చేస్తే
వచ్చిన ఆడకూలీ డబ్బులతో
పిల్లలకింత గంజైనా పోద్దామంటే
తాగిన మొగుడి తన్నులనూ
ఆగని బిడ్డల ఏడుపునూ
భరించలేక
కన్నబిడ్డలకు విషం పెట్టిన
పవిత్ర మాతృ మూర్తిని

కానీ రేపు
నేను పతివ్రతామ తల్లిని కాను
ప్రబంధ కన్యను కాను
పంచదార చిలుకను కాను
ఫ్యాషన్ పెరేడ్ బొమ్మను కాను
పసిపాపల చంపే పాపిని కాను
పంచాది నిర్మల వారసురాలిని.

ఇప్పటికీ మూడు తరంగాలుగా స్త్రీ వాదం ముందుకి వొచ్చినా, వివిధ అంశాల మీద స్త్రీ వాద కవయిత్రులు ఉద్యమాలు చేస్తున్న స్త్రీల మీద ఆధిపత్యం కొనసాగుతూ నే ఉంది. స్వీయ మానసికోద్రేకాలకు లోనయ్యే ఆధునిక తెలుగు కవిత్వమైనా స్త్రీని ఈ రోజుకీ తక్కువ చేసి చూపుతూ నే వుంది. "ప్రబంధ కవిత్వానికి స్త్రీ అంటే శరీరం. భావ కవిత్వానికి స్త్రీ కేవలం హృదయం. అక్కడామెకు హృదయంలేదు ఇక్కడ ఈమెకు శరీరం లేదు" అని వేల్చేరుగారు తేల్చేసినా, మగవారి ఆధునికి కవిత్వం అంతకుమించి గొప్పగా సాగింది లేదు. అయినా కవయిత్రులు ఓల్గా నుంచి గంగ వరకు మనదేశంలో స్వచ్ఛంగా స్వచ్ఛందంగా తమ గొంతుకలను సవరించుకుంటూనే ఉన్నారు.

4/5/16
(కవిత్వ సందర్భం 17)

* శ్రీ శ్రీ రాసిన ఈ పోయెమ్ నాకు ఇంగ్లీషులో దొరికింది- ఇది నా తెలుగు స్వేచ్చానువాదం