Tuesday, 24 May 2016

కవిత్వ సందర్భం18 darbhasayanam

ఆత్మ హత్య భావ ప్రకటననా?
---------------------------------------

"పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప" అనే నినాదం గొప్పతనం తెలియనిది కాదు. ఎప్పటికి నిలిచి స్ఫూర్తిని అందించే నినాదం ఇది. ప్రాణాల్ని సైతం లెక్క చేయక ఉద్యమంలోకి  పరుగులేత్తి౦చిన నినాదం. ఐతే పోరు చేయకు౦డా ఆత్మహత్య చేసుకోవటం కూడా ఒక ఉద్యమమే అనుకునే రోజుల్లోకి మనం మెల్లిగా జరుతున్నాం అనిపిస్తుంది. ఉద్యమ లక్ష్యం తననుంచి ఒక నిస్వార్థ ప్రమేయాన్ని కాక్షించినపుడు ఉద్యమకారుడికి తన ప్రాణం ఒక సమిధలాగే తోస్తుంది. ఒకడు తన ప్రాణాన్ని అన్నిటికంటే చివరగా వదలాలని భావిస్తాడు. కానీ ప్రాణం వదలటం ఒక హీరోయిజం ఒక అమరత్వం అని భావింపజేసినపుడు అన్నింటికంటే ముందే తన ప్రాణాన్ని వదిలేయటానికి ఎవరైనా ఎందుకు జంకుతారు?. ప్రాణాల్ని తృణ ప్రాయంగా వదిలేవారి సంఖ్య విప్లవ తీవ్రతని తెలియజేస్తుందనే భ్రమ, ప్రాణం పోవటం వలన ఏర్పడిన శూన్యతను పైకి కనిపించనీయదు. ఉద్యమ లక్షం కోసం ప్రాణం వదిలిన వారిని అమరవీరులుగా హీరోలుగా పుస్తకాలుగా స్థూపాలుగా నిలబెట్టే తొందర, ఆత్మహత్యనూ ప్రాణం కోల్పోవటాన్నీ తాము ఫాంటసైజ్ చేస్తున్నామనే స్పృహను పోరాటంలో పాల్గొనే వారికి ఎరుక పరచదు. ప్రాణం పోవటం యుద్ధం లో కాకుండా ఆత్మహత్య చేసుకోవటం, అది కూడా ఉద్యమం లో ఒక భాగం గా గుర్తింపబడటం చూసినప్పుడు- వీటి వెనుక రాజకీయ శక్తుల స్వార్థాలు మనకు కనపడుతుంటాయి.  కానీ కవి, మనిషికి అగ్రజుడు. ప్రతి మనిషినీ ముందుండి నడిపించే వాడు. ప్రతీ చోట మానవీయ కోణాన్ని వెతికి పట్టుకుంటాడు. భ్రమల్ని పటాపంచలు చేస్తాడు. "Not a poem of mine had saved a single Jew from the gas chamber" అని కవి ఆడెన్ బాధపడినట్టు, అటువంటి పరిస్థితి తలెత్తకుండా తన మాటలు కనీసం ఒకరినైనా ఆత్మహత్యనుండి తప్పిస్తాయేమోనని తపన పడతాడు కవి, దర్భశయనం శ్రీనివాసాచార్య. ఏది పోరో ఏది పోరు కాదో ఒక అన్నలా తమ్ముడికి ఎరుక పరిచే ప్రయత్నం చేస్తాడు.

మన సమాజం ఆత్మహత్యను ఫాంటసైజ్ చేస్తుంది. ఆత్మహత్య చేసుకున్న వాణ్ణి హీరోని చేస్తుంది. వాడిని అమర వీరుడని కీర్తిస్తుంది. "తెలంగాణా అమర వీరులకు జోహార్లర్పిద్దాం, తెలంగాణా సాధిద్దాం" అని గోడలమీద పోస్టర్ల మీద కనిపించిన పిలుపులో అంతర్గతంగా తెలిసో తెలియకో ఆత్మహత్యను ప్రోద్బలించే మెసేజ్ దాగున్నది. చనిపోయిన వారి దగ్గరికి, ఆత్మహత్య చేసుకున్న వారి దగ్గరికి ఓదార్పుయాత్రలని మీడియాతో సహా వెడలి సానుభూతి వ్యక్తం చేసే నాటకంలో అన్యాయంగా తెలిసో తెలియకో చనిపోవటాన్ని ఫాంటసైజ్ చేయటం దాగివున్నది. చనిపోయిన రైతుకో , స్టూడెంటుకో అఘమేఘాల మీద ఎక్స్గ్రేషియాల్ని బహిరంగంగా టీవీల ముందు ప్రకటించడంలో తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చూపించుకోవడ౦లో  , ఐదు లక్షలు కాదు పది లక్షలివ్వాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుపట్టడంలో అన్యాయంగా తెలిసో తెలియకో ఆత్మ హత్యల్ని ఫాంటసైజ్ చేయటం దాగున్నది. మనం అటువంటి సమాజంలో ఉన్నాం. ఒకడ్ని అమరవీరుణ్ణి చేయటం ద్వారా తెలిసో తెలియకో ఇంకొకర్ని అమరవీరుడిలా అయేందుకు ప్రోద్బలం చేస్తున్నాం. మనం, మన చుట్టూ ఉన్న రాజకీయ సమాజం, అందరమూ తెలిసో తెలియకో  ఆత్మహత్యల్ని ఆమోదిస్తున్నాం. కవి ఆమోదించటం లేదు. అంతే తేడా.

కానీ తమ్ముడూ!
నీ నిష్క్రమణను
ఎప్పటికీ ఆమోదించలేను!  ఎప్పటికీ!

తెలంగాణా ఉద్యమం ఉధృతమవుతున్న దశలో నాయకుల అడ్డదిడ్డ ప్రకటనలు ఉద్యమ కారుల్లో అస్పష్టతని కలిగించింది. పూటకో మాట మారుస్తూ కొందరు, అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఇంకొందరు, కంప్లీట్ యూ టర్న్ తీసుకుని మరికొందరు ఉద్యమకారుల ఆశల మీద లక్షాలమీద నీళ్ళు కుమ్మరించారు. ఈ అయోమయ స్థితిని చూసి తట్టుకోలేక అనేకమంది విద్యార్థులు తమకు తెలంగాణా రాదేమోననీ, తమ చావుకేక నాటకాలాడే రాజకీయ నాయకులకు విప్లవ శంఖారావంలా వినిపిస్తుందేమోనని ఆశగా భ్రమ పడి తమ ప్రాణాల్ని స్వచ్ఛందంగా కోల్పోయారు. అయినా ఆ గోస ఇప్పటికీ ఎవ్వరికి పట్టినట్టు కనిపించదు. మా ఉద్యమంలో ఇంతమంది అసువులు బాశారని ఉద్యమ తీవ్రతని గొప్పగా తెలిపే ప్రయత్నం ఒకరు చేస్తే, అవన్నీ బూటకపు ఆత్మహత్యలని ఇంకొకరు నిర్ధాక్షిణ్యంగా కొట్టివేయడం జరిగేది. ఒక ఉద్యమ తీవ్రత అమాయకుల "బలిదానాల సంఖ్య" ఆధారంగా గుర్తించాలనుకోవటం ఈ సమాజపు మానవీయతను చిత్తశుద్ధినీ ప్రశ్నిస్తుంది. ఈరోజుకి తెలంగాణ సాధించుకున్న కారణం అర్థమవనివారు తాము దేనికోసం నిరాహార దీక్షలు చేస్తున్నారో గమనించుకోక ఈ ఆత్మ హత్యాల్ని నవ్వులపాలు చేస్తూనే ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసం సిగ్గును వొదిలేసారనుకోవటం సముచితం.

ఒకడెందుకు స్వచ్ఛందంగా నిష్క్రమించాడని
తడిగా యెడదతో యోచిస్తున్న వాళ్ళెందరు?
ఎవడి వ్యూహంలో వాడు మునకలేస్తున్నాడు తప్ప.

తెలంగాణా పోరాటాల గడ్డ. ఎన్నో దుఃఖాల్ని ఎదలో దాచుకుని ధైర్యంగా తెగించి బతికిన గడ్డ. ఆ గడ్డ మీది పిల్లలు స్వార్థపరుల పిరికివాళ్ళ ద్వంద్వ నీతుల్ని చూసి భయపడిపోవటాన్ని కవి తట్టుకోలేకపోతాడు. అపుడపుడే చిగురేసి రెండు పూలు పూసిన మొక్కల్లాంటి పసి పిల్లలు, ఎక్కడెక్కడో ఉన్న ఆకాశాన్ని గొంతులోకి తెచ్చుకుని "జై తెలంగాణా" అని ఉరిమిన పిల్లలు, అకస్మాత్తుగా అర్ధాంతరంగా అసువులుబాయటం చూసి చలించిపోయిన కవి ఈ శూన్యాన్నెలా భరించాలని తల్లడిల్లిపోతాడు. ఉండాల్సిన సమయంలో నువ్వుండకపోతే ఎట్లా? అని వాపోతాడు.

ఉండకూడని వాళ్ళు ఈ నేలను
పెత్తనాల్తో తొక్కుతున్న
దుర్భర సందర్భంలో
నువ్వుండకపోతే ఎట్లా?

అర్జున విషాద యోగం తరువాత "క్లైబ్యం మాస్మగమః" అంటూ భగవానువాచ మొదలైనట్టు, ఈ విషాదాన్నంతా దిగమింగుతూ  ఉద్యమకారులకు తమ ఉద్యమ మూలాలు, లక్షాలు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాడు కవి. పల్లెవలె- పల్లె లోని పొలం వలే ధైర్యంగా ఉండమంటాడు. నీవుంటే ఒక పిడికిలి ఉండేది, నేలకు మరింత చేవ వుండేదని ఉద్యమకారులకు తమ మట్టి వాసనను గుర్తుకు తెస్తాడు ఈ మట్టికవి. ఈ కవిత గతించిన ఉద్యమ కారులకు సంబంధించిన ఎలిజీలాగా ఉన్నా, అప్పటి తెలంగాణా ఉద్యమకారులను ఆత్మ హత్యల విషయమై మరోసారి ఆలోచించమని చెప్పినట్లుగా సాగుతుంది. ఉద్యమకారుల మరణాన్ని అమరత్వమని కీర్తించి పబ్బం గడుపుకునే ముసుగు కవులకు ముసుగు ఉద్యమకారులకూ భిన్నంగా, వారి మరణాన్ని కీర్తించి, వారి దుఃఖాన్ని మలిన పరచలేనంటూ వారి దుఃఖంతో సహానుభూతిని పొందుతాడిక్కడ కవి. నిష్రమణను నిరసనగా సంభావించే కాలమా ఇది అని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తాడు.

నీవు ఉండాల్సిన వాడివి!
(Srinivasacharya Darbhasayanam)
7-4-2010

--------------------------------
నీ పేరేదైతేనేం
వెంకటో శ్రీకాంతాచారో వేణుగోపాల్ రెడ్డో
అకస్మాత్తుగా అర్ధాంతరంగా హడావిడిగా
ఇక్కడొక శూన్యస్థలిని మిగుల్చుతూ
వెల్లిపోయావన్నదే-
ఎట్లా దిగమింగుకునేది

అపుడే లేచి చిగురేసి
ఒకట్రెండు పూలు పూసిన చెట్టు
ఉన్నట్టుండి,మాయమైపోతే
మిగిలే,శూన్యంలాంటి శూన్యం
ఎట్లా తట్టుకునేది

మొదలవడం
మొదలవడంతోనే
తుది తీరందాకా
వ్యాపించేంత
గొప్ప నమ్మకాన్నిచ్చావ్
ఎక్కడో ఉన్న ఆకాశాన్ని
గొంతులోకి
తెచ్చుకుని ఒక ఉరుము ఉరిమావ్
మెరుపై చటుక్కున మాయమవుతావని
అనుకోలేదు సుమా!
ఎట్లానమ్మాలి

హక్కును ప్రకటించడంతో మొదలై
అక్కడేనువ్వు అంతమవడం
ఎంత విషాదం!
అనేక విషాదాల్ని అడ్డుకోడానికేకదా
ఏ పోరైనా!
నీ నిష్క్రమణ మహా విషాదాన్ని మిగిల్చింది
ఎట్లా అధిగమించేది

నిష్క్రమణను నిరసన ప్రకటనగా
సంభావించే కాలమా ఇది
ఒకడెందుకు స్వచ్ఛందంగా నిష్క్రమించాడని
తడిగా యెదడతో యోచిస్తున్న వాళ్ళెందరు?
ఎవరి వ్యూహంలో వాడు మునకలేస్తున్నాడు తప్ప
మాటలు తప్ప మరే జీవన యోధత్వమూ
లేని వాళ్ళ సందడికేం
నిన్నోమాట, ఇవాళొకటి, రేపు మరోటి
ఎల్లుండి ఇంకొకటి- అవసరమైతే
మాటల్ని కొన్నాళ్ళు మానేసి కూడా
నిజమైన మాటగా పెకిలిన వాడివి
నిష్క్రమణలో  నిశ్శబ్దాన్ని ఇక్కడ మిగిల్చి
ఏ మాటను ప్రతిష్టిద్దామనుకున్నావు?
ఈ నేలెపుడూ నిష్క్రమించమనదు
ఈ ఆకాశమూ అనదు, చూట్టూ వున్న గాలి కూడా

మన వెనకాల ఎన్నెన్ని పోరాటాలు! ఎంతెంత నడక!
దుఃఖాల మీద దుఃఖాల మీద దుఃఖాల మీద
దుఃఖాలు పొర్లుకొచ్చినా తెగించి
బతకడమే
బతుకుతు బతుకు హక్కు కోసం
అలుపెరుగక గొంతెత్తడమే
మన చరిత్ర అదే కదా!

పల్లె నుంచే వచ్చావు కదా
ఎన్ని యాతనలున్నా అదెలా బతుకుతున్నదో
ఎందర్ని బతికిస్తున్నదో నీకు తెలియనిదా
మోసం ఋతువు చేసినా మనిషి చేసినా
ఉన్నపళంగా పొలాలు నిష్క్రమించలేదు కదా
ఎట్లా నిష్క్రమించావు నువ్వు?

దుఃఖపు ముద్ద అయింది నేనొక్కణ్ణేనా
శూన్యాన్ని మోస్తున్నది నీ ఇల్లూ వూరేనా
పోరాటాల్తో దుక్కి దుక్కైన ఈ నేల నేలంతా
చిత్తడి చిత్తడై పోయింది కన్నీటితో
ఎట్లా ఓదార్చేది.

నువ్వు వుండాల్సిన వాడివి!
ఉండకూడని వాళ్ళు ఈ నేలను
పెత్తనాల్తో తొక్కుతున్న
దుర్భర సందర్భంలో
నువ్వుండకపోతే ఎట్లా?

ఒక్కసారి నువ్వు యోచించి వుంటే
ఎంత బాగుండేది
నువ్వుండేవాడివి
ఒక గొంతుండేది
ఒక పిడికిలి వుండేది
నేలకు మరింత చేవ వుండేది
మరీ ముఖ్యంగా
నేలలాంటి ఒక కన్నతల్లికి
కడుపుకోత మిగిలేది కాదు

ఇవాళ
నీ మరణాన్ని కీర్తించి
నీ దుఃఖాన్ని మలినపరచలేను
నీ ఉద్వేగాన్నీ
ఉరిమే గొంతునూ
హత్తుకుంటాను
కానీ తమ్ముడూ!
నీ నిష్క్రమణను
ఎప్పటికీ ఆమోదించలేను!  ఎప్పటికీ!

నిజానికి ఆత్మహత్య చేసుకోవాలంటే ముందు ఆ వ్యక్తి మనసు దానిని ఆమోదించాల్సి ఉంటుంది. ఒక కష్టం కలిగినపుడు మనిషి మనసు తన ముందున్న అనేక పరిష్కారాలను స్కాన్ చేసుకుంటుంది. అపుడు ఆత్మహత్య అనే విషయం కూడా పైకి వస్తుంది. మొదట మనసు దానిని అంగీకరించదు, స్వీకరించదు. మరలా మనసు తన ముందున్న పరిష్కారాల్ని స్కాన్ చేసుకుంటుంది. మరలా ఆత్మ హత్య అనే విషయం పైకి వస్తుంది. మనసు మరలా స్వీకరించదు. ఇలా అనేక సార్లు జరిగిన తరువాత మనసు, పైకి వచ్చిన ఆత్మహత్య అనే విషయాన్ని స్వీకరించటం మొదలవుతుంది. కొంతకాలానికి అదే అసలైన పరిష్కారమనే నమ్మకాన్ని పెంచుకుంటుంది. దానిపై పని చేయటం మొదలవుతుంది. అదే ఇంక అంతిమ తీర్పులా భావనని స్థిరీకరించుకుంటుంది. ఫలితం ఆత్మహత్య. కానీ మనం నిర్మించుకున్న సమాజం మనిషి మనసు ఆమోదించేకంటే ముందే ఆత్మహత్యను ఆమోదిస్తున్నట్టుగా తయారయింది. చావుకు ఒక దేవుడుంటే వాడ్ని పిలిస్తే పలికే దైవంలా మార్చేసుకుంది. ఈ పరిస్థితి మారాలి. కవులు మార్చాలి. ఉద్యమం బతాకాలి. ఉద్యమకారులు  బతకాలి. వారి బలవంతపు చావును స్వార్థ శక్తులు ఉపయోగించుకోవటం మానాలి. ఇకపై ఎవరి బలవంతపు చావునైనా ఆమోదించలేని సమాజాన్ని తయారు చేసుకోవాలి.

18/5/16
కవిత్వ సందర్భం18

No comments:

Post a Comment