Sunday, 27 November 2016

భూమి పాటll మైఖేల్ జాక్సన్
-----------------------------------------

సూర్యోదయం గురించి ఏమడుగుదాం
వర్షం గురించి ఏమడుగుదాం
నీవు నేనూ కలిసి పొందుదామనుకున్న
వాటన్నింటి గురించీ ఏమడుగుదాం..

మనుషుల మారణహోమాల గురించి ఏమడుగుదాం
మనకసల౦త సమయముందా..?
నీదీ నాదీ మనిద్దరివే అన్నావుగా
వాటన్నిటి గురించీ ఏమడుగుదాం...

ఎపుడైనా ఆగి చూశావా
ఇప్పటిదాకా మనం పారించిన రక్తాన్ని
నీవెపుడైనా ఆగి గమనించావా
కుమిలే భూమినీ ఏడ్చే సముద్రాల్ని

మనమేం చేశాం ఈ ప్రపంచానికి..
మళ్లొకసారి చూడు మనమేం చేశామో
మన వారసులకోసం మనం చేసిన
శాంతి ప్రతిజ్ఞ ఊసెక్కడ?
పుష్పించే వనాలెక్కడ
మనకసలు సమయమేదైనా మిగిలుందా?
నీది నాదీ మన ఇద్దరివీ అనుకున్న
ఆ కలలన్నీ ఎక్కడ..?

ఎపుడైనా ఆగి చూశావా..?
యుద్ధంలో అసువులు బాసిన పసిపిల్లల్ని..
నీవెపుడైనా ఆగి గమనించావా ..?
కుమిలే భూమినీ ఏడ్చే సముద్రాల్ని

నేనొకప్పుడు కలగనేవాన్ని
నక్షత్రాల అవతలివైపుకొకసారి పరికించేవాన్ని
ఇపుడు నేనెక్కడున్నానో నాకే తెలియడం లేదు
ఎక్కడికో దూరానికి విసిరివేయబడ్డానని తప్ప

ఓ మిత్రుడా..
నిన్నటి గురించిన మాటేమిటి?.
సముద్రాల గురించిన మాటేమిటి?.
స్వర్గాలు కూలిపోతున్నాయే..
నా శ్వాస కూడా బరువయ్యిందే..
నీ అవసరం నాకున్నపుడు
ఈ ఉదాసీనత ఎందుకు?

ఈ ప్రకృతి విలువెంత?
ఈ భూమితల్లి గర్భం కదా అది
ఈ జంతువుల మాటేమిటి?
వాటి సామ్రాజ్యాల్నే కూల్చేశాం కదా..
ఆ ఏనుగుల మాటేమిటి?
మనమీద నమ్మకాలెపుడో కోల్పోయాయవి
ఈ దుఃఖించే తిమింగలాల మాటేమిటి
సముద్రాల్ని కొల్లగొట్టేశాం కదనోయ్...
అడవుల్లో మన పాదముద్రల మాటేమిటి?
మొర పెట్టుకున్నా తగలబెట్టేశాం కదా..
ఈ పవిత్ర నేల సంగతేమిటి..?
మతాల పేర్లతో చింపి ముక్కలు చేశాం కదా..
సామాన్య మానవుడి సంగతేమిటి.?
మనమెపుడు వాడికి స్వేచ్ఛనివ్వలేమేమో కదా..
ఈ చనిపోతున్న పసి పిల్లల సంగతేమి.?
ఆ చిట్టి ఏడుపులు మనం వినలేకున్నామా..?

మనమెక్కడో తప్పు చేస్తున్నాం...
ఎందుకో ఎవరైనా చెబుతారా నాకు?

ఇపుడే పుట్టిన చిన్నపిల్లలు
వాళ్ల రాబోయే రోజులు
వాళ్ల కేరింతల మాటేమిటి?.
ఐనా మనిషి గురించి చెప్పవోయ్!!
ఆ తల్లడిల్లే మనిషి గురించి చెప్పు
అబ్రహం గురించి
చివరిగా ఇంకొక్కసారి మరణం గురించీ చెప్పు
మనమసలు ఎపుడైనా ఇంకెప్పుడైనా పట్టించుకుంటామా..?

 translation of Earth song of Michael Jackson
ఈ రోజు వ్యాసం - కొప్పర్తి గారి కవిత 'సుశీల' మీద
కవి సంగమం లో...

జీవన సూత్రాల్లో సిద్ధాంతాలు
-----------------------------------------

మనుషుల జీవన సూత్రాలు కొన్ని సిద్ధాంతాల ఆధారంగా నిర్వచింప బడుతూ, నిరూపించ బడుతూ ఉంటాయి. సిద్ధాంతాల మధ్య విబేధాలు ఎంత సహజమైనా అవి జీవన సూత్రాలను ఒక్కో కొత్త కోణంలోనుండి చూసే, చూపించే ప్రయత్నం చేస్తుంటాయి. ఏ సిద్ధాంతమూ పూర్తిగా తప్పూ కాదు, అట్లని పూర్తిగా ఒప్పూ కాదు. ఐనప్పటికీ, తమ తమ సిద్ధాంత కోణాలను బలపరుచుకోవటానికై అవి తమ చుట్టూ స్టీరియోటైప్ ఆలోచనలనూ, తద్వారా కొన్ని సామాజిక భ్రమలనూ కూడా పుట్టించడానికి అవసరమైన నేపథ్యాన్ని సృష్టించుకుంటాయి. ముఖ్యంగా జెండర్ రోల్స్ ని ఒకటీ రెండు అంశాల ఆధారంగా నిర్వచించాలని ప్రయత్నించినపుడు వాటి చుట్టూ ఎన్నో అపోహలు ఏర్పడటమే కాక, ఒకదానికొకటి వ్యతిరేకించుకుంటున్నట్టు కనబడే ఈ సిద్ధాంతాలు జెండర్ ఇనీక్వాలిటీలనూ, వాటి చుట్టూ ఉండే భ్రమలను శాశ్వతంగా కొనసాగిస్తాయే తప్ప పరిష్కారాలు చూపలేని అశక్తతను మూటకట్టుకుంటాయి. అన్ని సిద్ధాంతాల సంశ్లేషణ (synthesis) జరిగి ఒక సరయిన నిర్ణయానికి రావడానికి ఊపిరాడని పాత సిద్ధాంతాల, అపోహల స్థానంలో, లోతైన అవగాహన, పక్షపాత రహిత అధ్యయనమూ (unbiased research) అవసరం అవుతాయి.

ఫ్యూడల్ సమాజాల నుండి పారిశ్రిమిక సమాజాలకు మారే క్రమంలో కుటుంబంలో స్త్రీ పురుష పాత్రల తీరుతెన్నులు విపరీతమైన మార్పులకు లోనయ్యాయి. ఈ ఆధునిక సమాజాలు (గత సమాజాలతో పోల్చుకున్నపుడు) స్త్రీ జీవితంలో, ఆమె చేసే శ్రమలో విపరీతమైన మార్పులు తెచ్చి, అదే పురుషుని విషయంలో తక్కువ మార్పులు తెచ్చేసరికి సమాజంలో, కుటుంబంలో స్త్రీల పాత్రమీద చర్చ మొదలయ్యిందని చెప్పాలి. పారిశ్రామిక వ్యవస్థను నిర్వచించే వర్గ బేధం(class variation), స్త్రీ పురుషుల విషయంలో కూడా తీసుకురాబడి, స్త్రీ అస్తిత్వాన్ని పునర్విచించే ప్రయత్నం చేసింది. ఈ మార్పుల పర్యవసానం, 'సమాజం స్త్రీని చిన్న చూపు చూస్తోందనే' అవగాహనను తీసుకువచ్చింది. వేతన ఆధారిత (wage based) సమాజంలో స్త్రీ చేసే శ్రమ ఇంటికి బదులు ఇంటి బయటకు మారింది. పురుషులొక వర్గంగా, స్త్రీలు ఇంకో వర్గంగా ఏర్పడిన సమాజంలో స్త్రీకి బయటి పనులతో పాటు వేతనంలేని ఇంటి లోపలి పనులు, వారానికి దొరికే సగటు ఖాళీ సమయాన్ని ముప్పై ఆరు నుంచి ముప్పై రెండుగంటలకు కుదించి వేశాయి. శ్రమ దోపిడీ జరిగిందనే అవగాహనతో పురుషులు కొత్త పీడకులుగా కనిపించారు. ఈ ఆలోచనలు ఇలా వుంటే, ఇంకో వైపు స్త్రీకుండే మాతృత్వమనే సహజ గుణం స్త్రీని, సమాజంలో ఆమె స్థానాన్నీ, పాత్రనీ నిర్వహిస్తుందనే జీవ శాస్త్ర సంబంధమైన వాదం, స్త్రీని ఇంకో కోణం నుండి ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. మరణాల సంఖ్య అధికంగా ఉన్న పూర్వ సమాజాల్లో స్త్రీ, ఆయా సమాజాల్ని బతికించడం (survival of the societies) లో కీలక పాత్ర పోషించింది. సైన్సు అభివృద్ధి చెందని గత శతాబ్దం వరకూ ఈ పరిస్థితే ఉంది. నేటికీ, సగటు జీవిత వయస్సు యాభైకంటే (50 years)  తక్కువగా ఎన్నో సమాజాలల్లో స్త్రీలు ఆయా సమాజాలు అంతరించిపోకుండా నిలబెడుతున్నారు. పిల్లల్ని ఒక ఆస్తిలాగా భావించే ఆ సమాజాల నుండి, మరణాల సంఖ్య తగ్గి, ముసలి వయసు వారు పెరిగిపోతున్న ఈనాటి సమాజాలకు మనం తరలిపోతున్నపుడు, సమాజంలో స్త్రీల పాత్ర ఇంటి కంటే ఇంటి బయటకు పయనమయ్యింది. మన భారతీయ సమాజం, ఈ ట్రాన్సిషన్ జోన్లో కొనసాగుతూ న్నపుడు, మారుతున్న జీవన విధానాలు, పెరుగుతున్న మధ్య తరగతి కుటుంబాలు, భారతీయ స్త్రీని ఏ సిద్ధాంతాలలోకి ఇరికించి నిర్వచింప ప్రయత్నించినా, కవి కొప్పర్తి మాత్రం ఇంకాస్త ముందుకు వెల్లి తన జీవిత భాగస్వామిని ఆమె స్వభావానుకూలంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడీ కవితలో.

స్త్రీ ఉద్యోగం చేయాలా, ఇంట్లో చాకిరీ చెయ్యాలా..? ఉద్యోగం చేసొచ్చి ఇంట్లో చాకిరీ కూడా చెయ్యాలా?  అని అడిగినపుడు ఒక్కో సిద్దాంత వాదులొక్కో సమాధానం చెబుతారు, కానీ వీటన్నింటిలో ఆ స్త్రీకి మాత్రమే ఉన్న సహజమైన, ప్రత్యేకమైన స్వభావాన్ని మనం చూడలేనపుడు, ఈ సిద్ధాంతాలు అసంపూర్ణ పరిష్కారాలుగానే మిగిలిపోతాయి. ఇక్కడ కవి ఆమెలో ఉన్న ప్రత్యేకమైన గుణాలను కనుగొంటాడు. ఇది ఆ స్త్రీ మీద సంపూర్ణ అవగాహనను కలిగిస్తుందేగానీ, ఏదో ఒక సిద్ధాంతంలో కూర్చోబెట్టేయదు. ఒకప్పుడు తనకు సహధ్యాయి అయిన ఆమె, ఈ రోజు ఉద్యోగమెందుకు చేయటం లేదు అని అడగడంలో ఆమె ఇష్టానిష్టాలను పట్టించుకోనంత నిర్లక్ష్యం ఎంతుందో..ఆడవారికి ఉద్యోగమెందుకు, ఇంటి పనులు చూసుకోకుండా అనటంలో, ఆమె శ్రమను గుర్తించలేనంత నిర్లక్ష్యం అంతుంది. ఈ రెండు నిర్లక్ష్యాలకూ దూరంగా, ఒక భర్తగా మొదలై, కవితలో చివరకు ఒక మనిషిగా మిగులుతాడు. తన జీవిత భాగస్వామిని భార్యగా గుర్తించటంతో మొదలై చివరకు ఆమె తనను చుట్టుకుని ఉన్న ప్రకృతిగా వర్ణిస్తాడు. సామాజికంగా నెలకొనివున్న స్త్రీ పురుష వివక్షతను ఎక్కడా స్పృశించకుండానే, పరోక్షంగా ఆమె స్థానాన్ని తనకు సమానంగా నిలబెట్టడం ద్వారా, ఆమె ఇష్టానిష్టాల్నీ, ప్రవర్తనా రీతులకూ సంబంధించిన ఆమె సహజ స్వభావానికి పెద్ద పీట వేయడం ద్వారా, ఒక మానవీయ కోణాన్ని అందిస్తారు. అంతే కాకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలనుకోవడం, ఇంట్లో ప్రతీ చిన్న విషయాన్నీ పట్టించుకుని చక్కబెట్టడం, ఇంటి పనుల్లో ఆమె చూపే ఫైన్ మోటార్ డెక్స్టెరిటీని, ఇష్టంగా అలంకరించు కోవడం, వంటి విషయాలను చెబుతూ,  "నా స్థూల ప్రపంచంలో ఆమె సూక్ష్మంగా ఉంటుంది/ ఆమె సూక్ష్మ ప్రపంచంలో నేను స్థూలంగా ఉంటాను"  అనడం ద్వారా సోషియాలజిస్ట్ 'పార్సన్' చెప్పినటువంటి మధ్య తరగతి స్త్రీ పురుషుల వ్యక్తీకరణ/ నిమిత్తమాత్ర సిద్ధాంతాన్ని (expressive/instrumental theory) పునర్ప్రతిష్టిస్తారు.

సుశీల
-------------------------
                      కొప్పర్తి.

ఆమె నా మగ భార్య
నేనామె ఆడ భర్తని
నేనో ఎనబై కేజీల బస్తా
ఆమె అరవై నీలికలువ పూలబస్తా
ఆమె ఇంటి పని చేస్తుంది

నేను ఉద్యోగం చేస్తాను

చరిత్ర  మానవుడు  ప్రపంచము వంటి అంశాల భోధన నా కార్యక్రమం
పిల్లలు  వంటపని. ఇంటిపని  తోటపని  పాకీపని వంటి పనులు   ఆమె  కాలక్షేపం

నాది పెద్ద ప్రపంచం లో చిన్న పాత్ర
ఆమెది చిన్న ప్రపంచం లో పెద్ద పాత్ర

నేను స్థూలం
ఆమె సూక్ష్మం
నా స్థూల ప్రపంచంలో ఆమె సూక్ష్మంగా  ఉంటుంది
ఆమె సూక్ష్మ ప్రపంచంలో నేను స్థూలంగా ఉంటాను

మగ పనులు ఆడపనులు అంటూ వుండవు గాని
కష్టమైన పనులు సులువైన పనులు అంటూ ఉన్నపుడు
మొదటివన్నీ ఆమెవి
రెండోవి మాత్రమే నావి
ఉదాహరణకు
అటక మీద కెక్కవలసి వస్తే
పనికుర్రాడు తను ఉన్నపుడు వాణ్ణెక్కిస్తుంది
మేమిద్దరమూ ఉన్నపుడు తనెక్కుతుంది

బజారుల్లో బస్టాండుల్లో బరువైన వస్తువులు మోస్తూ ముందు నడుస్తుంది
రైల్లో అప్పర్ బెర్త్ ఆమెది
లోయర్ బెర్త్ నాది
ఇద్దరం కలిసి బజారెల్లిన ప్రతిసారి
ఆమె నడుద్దామంటుంది
నేను వాహనం తీస్తాను
బజారులో నడుస్తున్నప్పుడు కూడా
అన్ని పనులు చేసుకుంటూనే నా రక్షనభారం వహిస్తుంది

నేను బయట ఆమె ఇంట్లోనూ ఉన్నపుడు
నేను బయటే ఉంటానుగాని
ఆమె ఏక కాలం లో ఇంట్లోనూ బయట నాతోనూ ఉంటుంది

ఇంటెడు చాకిరి చేస్తుంది
ఇంటిని అద్దంలా ఉంచుతుంది
నిరంతరం చలిస్తూ చరిస్తూ ఉండడం వలన
ఇంట్లోఒకేచోట ఆమెని రెండుసార్లు చూడలేము

శ్రమించినంతసేపూ  అలనటతో చమటతో చిత్తడిగా ఉంటుంది
స్నానం చేసిందంటే వెండిరేకులాంటి
గంజిపెట్టిన చీరలో పరిమళిస్తుంది
కట్టిన చీర చలువను తాజాదనాన్ని  అణువణువుతో ఆస్వాదించడం
ఆమెకి తెలిసినంతగా ఎవరికైనా తెలుసోలేదో తెలీదు

శ్రమ ఆమె తత్వం
విశ్రాంతిలో ఆనందం ఉందనుకునేవాల్లకు
శ్రమలో సౌఖ్యం కోల్పోతామనుకునే వాళ్లకు
ఆమె వ్యతిరేక ఉధాహరన

విల్లులా వంగి ఆమె ఇల్లు తుడుస్తున్నపుడు
మునివేళ్లతో కత్తిపీట మీద కాయగూరలు  తరుగుతున్నపుడు
ఒక అంచునంతా కుచ్చిల్లు పోసి రెండు గుప్పిళ్లమధ్య పట్టుకుని
రెండవ అంచుని
గాల్లోకి ఎగరేసి గింగిరాలు తిప్పుతూ బట్టలు బాదుతున్నపుడు
ఆమెలో
తరతరాలుగా ఈ దేశపు మహిళలు సాధించిన
నేర్పరితనపు వారసత్వం
అందిపుచ్చుకున్న  అద్భుతలాఘవం
ఆవిష్క్రతమైన జీవవిన్యాసం

అది
నిత్యం
సత్యం శివం సుందరం

శ్రమ ఆమె తత్వం
శుభ్రత ఆమె మతం
శుభ్రంగా ఉంచవచ్చనే
ఆమె ఇంటిని వస్తువుల్నీ ఇష్టపడుతుంది
గజం ఎత్తు కరెన్సీ కట్టకావాలా
అంతే ఎత్తున్న కొత్తవస్తువు కావాలా అంటె
నోట్లకట్టని కడిగి తుడవలేము కాబట్టి
వస్తువు కావాలంటుంది

ఒకసారి మంచినీళ్లు తాగిన గ్లాసును
మళ్లీ  బిందెలో ముంచి ఎంగిలి చేయకుండా ఉండడానికి
పెళ్లయిన కొత్తల్లోనే తెలివిగా
వాటర్ ఫిల్టర్ పేరుతో కుళాయి పద్దతి ప్రవేశపెట్టింది
వళ్లు తుడుచుకునే టవల్ తో
అన్నం చేయి తుడుచుకుంటే
టవల్ వెంటనే వైభవం కోల్పోయి
మళ్లీ వుతికిందాకా  జిడ్డుచేయితుడుచుకునే గుడ్డగా  మారిపోతుంది

ఇంట్లో  మసిగుడ్డకు చేతిరుమాలుకు తేడావుండదు
రెండూ తెల్లమబ్బుతునకల్లా తళతళమంటుంటాయి
విడిచిన బట్టను చూసినప్పుడు తననొక విడిచిన బట్టగా భావిస్తుందనుకుంటాను
అందుకే ఉతుకుతున్నంతసేపు తనే శుభ్రపడుతూ ఉంటుంది

పొరుగూరు వెళ్లి తోటకు నీళ్లు పట్టని రోజున
నూటొక్కమొక్కల దప్పికంతా ఒక్కతే గొంతుకెత్తుకుంటుంది
తిరిగివచ్చి తోటకు నీళ్లుపడుతున్నప్పుడు
తానే ఒక నల్లరేగడి నేలగా మారిపోతుంది

వర్షాకాలం  మొక్కలకు నీళ్లుపొయ్యక్కర లేదని
చాలామంది వృక్షప్రేమికులు సైతం సంతోషిస్తారు కాని
వృక్ష ప్రేమిక అయివుండి ఆమె
బట్టలు ఫెళ ఫెళా ఆరవనీ
ఇంటినీ వస్తువుల్నీ చెమరిస్తుందనీ
బయటంతా  బురదగా మురికిగా వుంటుందనీ
వర్షాకాలాన్ని విసుక్కుంటుంది
ముసురు పట్టిన రోజంతా రెక్కలు తెగిన పక్షిలా తప తపా కొట్టుకుంటుంది

ఇల్లు కడిగి కడిగి
బట్టలు ఉతికి ఉతికి
తోటకు నీళ్లు పట్టిపట్టి
నూటనాలుగు అడుగుల లోతుకు తీసిన బోరుపంపు క్రింద
భూమి పొరల్లో ప్రవహించే అంతర్వాహినిని
పదేళ్లలో పీల్చేసి
చుక్క నీరు లేకుండా చేసిన
ఆమెది సతతహరిత పరిశుభ్రదాహం
ఆమె ఒక నిరంతర వేసవి

ఇంటికి తాళంపెట్టి ఊరెల్లాల్సి వచ్చినపుడు
వస్తువుల్ని చిందరవందరగా వదిలేసి వెల్లే
ఆ ఒక్క అవకాశాన్ని చేజేతులా జారవిడిచి
శుభ్రంగా వుంచే అలవాటునే పొదివి పట్టుకుని
వస్తువుల్ని సర్ధి
ఇంటినంతా తడిగుడ్డతో తుడిచాకే తాళం వేస్తుంది
బహుశా ఇంటిని తనతోపాటే తీసుకువెల్తుందని
ఎవరింటికి వెళ్లినా తన చుట్టూ
తన ఇంటినే ప్రతిష్టించుకుంటుందనీ అనుకుంటాను

ఇల్లే ఆమె ప్రపంచం కాబట్టి
ఇంటికి తాళం వేసే ముందులాగే
ప్రపంచానికి తాళం వేసేప్పుడు కూడా
ఇట్లాగే చేస్తుందని నాకు పొడగడుతూ ఉంటుంది

తన అస్తిత్వం తనకెంతో ఇష్టం
ముందు తనను తాను చూసుకుని ప్రేమించురుని
అభినందించుకున్నాకే
ఎవరి వంతయినా వస్తుంది
కాబట్టే  ఎవరితోనూ నిమిత్తం లేకుండా
ఎవరితోనైనా
ఉల్లాసం గా
హల్లీసకమై పోతుంది

చదవడమంటే ఎంతో ఇష్టం
అప్పుడు నా సహ విద్యార్ధి
ఇవాల్టికి నా సహాద్యాయి
ఇంటికి తెచ్చిన పుస్తకం ఇద్దరిదీ
శరత్తూ ప్రేమచందూ
విశ్వనాధ శ్రీ పాద
రాహుల్ రావిశాస్త్రి ఎప్పడో పూర్తయిపోయారు

ఆమె  మధ్యాన్నం న్యూస్‌పేపర్
రెండు పూటలా న్యూస్ చావల్
వారానికొక్కసారి పాడుతా తీయగా
రోజంతా పాడుతూ హాయిగా

ఆడ పిల్లకు అన్యాయం జరిగితే ఇంట్లోనే నిప్పులు చెరుగుతుంది
నచ్చనిదేదైనా కుండను చేసి బద్దలుకొడుతుంది

ఆమెకు పిట్టలిష్టం  పిల్లలుష్టం
పువ్వులిష్టం  నవ్వులిష్టం
పండ్లిష్టం

ఇంగువ ఇష్టం. సాంభ్రాణి ఇష్టం
కస్తూరీ కర్పూరాలిష్టం
దవనం ఇష్టం
మరువం మాచపత్రి ఇష్టం
అగరు పొగలిష్టం

అన్నింటికి మించి
కొత్తదనం ఇష్టం
కొత్తదనం లోని పరిమళం ఇష్టం

సాయి ఇష్టం
సాయం వేళ దీపారాధన ఇష్టం
సంధ్య సమీరం ఇష్టం
ఆధునికం ఇష్టం
ప్రాచీనం ఇష్టం
చీరలిష్టం
చిన్న చిన్న ఆభరణాలిష్టం
శ్రుతిమించని అలంకరణ ఇష్టం

మన జీవన సూత్రాలు ఏ సిధ్దాంతం లో వున్నాయో కాని
ఆమె మాత్రం మాత్రం
పనిలో వుంది
శుభ్రతలో వుంది
అందంలో ఉంది

మన ప్రాణధాతువులు ప్రాకృతమై ఉన్నాయో లేదో
కాని
ఆమె ప్రాణ రహస్యం మాత్రం
నీళ్లల్లో ఉంది
నిప్పుల్లో ఉంది
ఎండలో ఉంది
నేలలో ఉంది

అవును ఆమె ప్రకృతే
కాబట్టే ఆమెలో
జలప్రళయాలు
ఝంఝామారుతాలు
భూకంపాలు
అగ్ని విస్పోటాలు
పెచ్చరిల్లుతూ ఉంటాయి
నన్ను అతలాకుతలం చేస్తుంటాయి

నిజంగా
ఆమె ప్రకృతి
నేను మానవుణ్ణి

 భ్రూణ హత్యలూ, వరకట్న సమస్యలూ, రాజకీయ ఉద్యోగ వివక్షలూ, స్త్రీ స్వేచ్ఛ వంటి సమస్యల సుడిగుండంలో ఆధునిక మహిళ ఉంటే,  గృహిణి గృహ హింసలో అన్యాయానికి గురవుతున్నది. చదువుకున్న గృహిణులు పెరుగుతున్న మధ్యతరగతి సమాజంలో భార్యాభర్తలిద్దరి మధ్యా అవగాహనా రాహిత్యం లేకపోవటం, మానవీయ కోణంలో విలువలనూ అవసరాలనూ అర్థం చేసుకోవటం ఎంతో అవసరం. ఈ కవిత ఆ దిశగా చేసిన మొదటి ప్రయత్న౦. ఏర్పరచుకున్న పాక్షిక అభిప్రాయాల్ని వాటి చుట్టూ ఉన్న భ్రమల్నీ దాటి లోతుగా కొత్తగా ఆలోచించ వలసిన అవసరాన్ని గుర్తుచేస్తుంది.

కవిత్వ సందర్భం 29
22-11-16

అద్దంలో మనిషి ll మైఖేల్ జాక్సన్ ll

అద్దంలో మనిషి ll మైఖేల్ జాక్సన్ ll
-------------------------------------------

ఒక్కసారిగా నా జీవితంలో
మార్పు వచ్చెయ్యాలని అనుకుంటాను

ఆ మార్పు ఎంతో హాయి గొల్పాలనీ,
ఎంతో విభిన్నంగా ఉండాలనీ
అన్నింటినీ సవ్యంగా చేసేయ్యాలనీ కోరుకుంటాను

ఒక మంచు కురిసే ఉదయం పూట
నా చలి కోటు కాలర్ ని పైకి లాగినపుడు
చెవిలోకి దూరే గాలి కోరుకునే మార్పే అది.

పసిపిల్లలు వీధుల్లో చేరి
పస్తులు పడుకుంటుంటే..
వారి అవసరాలని పట్టించుకోనంత
గుడ్డి వాడిలా బతికేయటానికి..
నేనెవర్ని?

వాళ్లు కోరుకునేదంతా
తమని పట్టించుకోని వేడి వేసవినీ
మూతమూసిలేని నీళ్ల బాటిల్ నీ
తోడుగా ఒక మనిషి ఆత్మనీ
అంతే కదా!!

వారంతా ఒకరినొకరు అనుసరిస్తూ
అక్కడక్కడే నడుస్తుంటారు
అచ్చం ఈ గాలి లాగే...
ఎందుకంటే ఇంటికి పోవడానికి
దాక్కోవడానికి వాళ్లకు ఏమున్నదని?

అందుకే నేను నిన్ను తెలుసుకోమంటాను
అద్దంలో కనిపించే మనిషితో నేను మొదలు పెడతాను
పద్దతులు మార్చుకోమని అతడినే మొదట అడుగుతాను
ఇంతకు మించిన స్వచ్ఛమైన సందేశమేదీ లేదంటాను
ఈ ప్రపంచం నివాస యోగ్యంగా కావాలంటే
నిన్ను నీవు మొట్టమొదట చూసుకోవాలంటాను
మార్పు నీలోనే రావాలంటాను

ఒప్పుకుంటాను
నేనొక స్వార్థ పూరితమైన ప్రేమ బాధితుడను
కానీ ఇక్కడ కొందరు ఉండడానికి ఇల్లు లేకుండా
నయా పైసా అప్పు పుట్టకుండా ఉన్నారే..
ఇది నేనేనా...
ఈ కొద్దిమంది మాత్రమే ఇలా ఒంటరిగా జీవిస్తున్నారని
నటిస్తున్నది నేనేనా..

లేలేత తొలి చిగురుకు ఐన లోతు గాయం
ఇంకెవరిదో పగిలిపోయిన హౄదయం
ఇంకొక తుడిచిపెట్టుకుపోయిన స్వప్నం
ఇవన్నీ గాలిలాగా తరలిపోతుంటాయి ఎందుకో తెలుసా.?
వాటికుండటానికి ఈ ప్రపంచంలో స్థానమెక్కడని?.
అందుకే నేను నాతో మొదలు పెడతాను
అద్దంలో కనిపించే మనిషితోనే నేను మొదలు పెడతాను
పద్దతులు మార్చుకోమని అతడినే మొదట అడుగుతాను

నీకింకా సమయముంది కాబట్టి
నీవిప్పుడే ఆ పని చేయాలి
హృదయాన్నెపుడో మూసుకున్న నీవు
ఆలోచించే నీ మనసునైతే మూసుకోలేవు కదా..!

ఆ మనిషిని
ఆ మనిషిని
ఆ మనిషిని
అద్దంలో కనిపించే ఆ మనిషిని
పద్దతులు మార్చుకోమని అడుగుతాను

నీవే నీవే నీవే
ముందుకు కదలాలి సోదరా
లే లేచి నిలబడు
లే లేచి నిలబడు
లే లేచి నిలబడు
లేచి నిలబడి నిన్ను నీవు నిలబెట్టుకో సోదరా

నీకు తెలుసు
నీకు తెలుసు
నీకు తెలుసు
ఈ మార్పేంటో నీకు తెలుసు
మార్చివేసేయ్ సోదరా..!!

(Micheal jackson " Man in the mirror" కి స్వేచ్చానువాదం.)
26-11-16

చాక్లెట్ తీపి

విరించి ll చాక్లెట్ తీపి ll
--------------------------------

చిట్టి చేతులను ముందుకు చాపుతూ
నా చెల్లెలి కూతురు అడుగుతుంది..
"మామా..! చాక్లెట్ కోనీయ్యవా" అని.

ఒక అమాయకపు లోకం లోంచి
ఈ లోకం లోకి తొంగి చూస్తున్నట్టు
తను చూసే చూపుతో..
నాలో ఎన్నెన్ని ప్రశ్నలుదయిస్తాయో..!

ఐదు రూపాయల ఓ చిన్న చాక్లెట్...
తన ప్రపంచాన్నంతా ఆనందంగా మార్చేస్తుందంటే...
ఆనందం తనలో ఉందో చాక్లేట్లో ఉందో అర్థం కాకుండా ఉంటుంది.
బాల్యంలోని తీపినంతా నాలికమీద ఆ చిన్నారి చప్పరిస్తుంటే
పెద్దగైపోయామని, తీపిని మనం అసహ్యించుకోవడంలో
అర్థమే లేదనిపిస్తుంటుంది.

ఈ పసిపిల్లల ఆనందాన్ని
ఐదు రూపాయలకూ
పదిరూపాయలకూ
అమ్ముకునే దౌర్భాగ్యుడెంత ముసలివాడో..
బాల్యాన్నెంతగా మరచిపోయాడో..

బుజ్జి నాలుకనీ, బుజ్జి పెదవులనూ
తీయటి మకరందంలా చేసుకుని, పాప నా చెవిలోకి వొంపుతుంది
"మామా..! నన్ను ఎత్తుకోవా"  అని.
ఒక కంపనీని భుజాలకెత్తుకున్నాననే భావనని
ఆ చిట్టి తల్లి తేలిక శరీరం తేలిక చేసేస్తుంటుంది.

27/11/16

Sunday, 13 November 2016

అసామాన్య వ్యవస్థలో అసామాన్య నిర్ణయాలు

అసామాన్య వ్యవస్థలో అసామాన్య నిర్ణయాలు
---------------------------------------------------------

"మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే" అన్న మార్క్స్ మాటలను కళ్ళారా చూడటానికి ఇపుడు మనదేశంలో నెలకొని ఉన్న పరిస్థితి నిలువెత్తు సాక్షంగా నిలుస్తున్నది. ఆర్థిక శాస్త్రం అనేది పుస్తకాలను చదువుకుని ఊహించినంత, గత చరిత్రను చూసి అంచనా వేసినంత సులువుగా ఏమీ ఉండదనేది మరోసారి నిరూపణ అయ్యింది. "ఈ విధంగా చేస్తే పరిస్థితి ఈవిధంగా జరుగుతుంది, ఇవ్విధమైనటువంటి ఫలితం వచ్చేస్తుంది" అని ఊహాగానాలు చేసేంత సులువుగా ఆర్థిక విషయాలు కొనసాగకపోగా, ఊహించని మలుపులతో ఊహించని సమస్యలతో నిరంతర జాగురూకత స్థితిని డిమాండ్ చేస్తుందనేది ఇపుడు మనకు అర్థం అవుతుంది. ఈ పెద్దనోట్ల నిలుపుదల విషయం మన ప్రభుత్వం తీసుకున్న 'అనాలోచిత చర్య' అనడానికి పూర్తి అవకాశం ఉన్నా, దాని వెనుక ఆర్థిక శాఖా విభాగం చేసిన కసరత్తు ఏ మాత్రం సరిపోనిదిగా తయారయింది. దేశంలో ప్రజల జీవితాల్ని తక్షణమే ప్రభావితం చేసే ఇంత పెద్ద నిర్ణయాన్ని ఏ మాత్రం ముందస్తు కసరత్తు లేకుండా చేశారా, ఊహించని పరిణామాల్ని అసలు ఊహించనే లేదా అనేటువంటి అనుమానాల్ని కలిగిస్తున్నది.

"బడాబాబులకు అనుకూలంగా జరిగింది" అన్న ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు. ఇది ప్రభుత్వ వ్యవహారాల్లో బడాబాబుల పెత్తనాన్ని అవమానించడమే. బూర్జువా సమాజపు ప్రభుత్వాల పనితీరుని సరిగా అంచనా వేయలేకపోవడమే.  అందుకే "బడాబాబుల కనుసన్నలలో జరిగిందనడం" సముచితమేమో. ఇది ఈ ప్రభుత్వం చేసింది కనుక, ఈ ప్రభుత్వం మీద బురద చల్లడం కాదుగానీ, ఏ ప్రభుత్వం చేసినా ఇంతకు మించి వేరేగా చేయలేదన్నది సత్యం. ప్రపంచ మార్కెట్టు విస్తరిస్తున్న తరుణంలో ప్రపంచమంతటా ఉన్న ప్రభుత్వాలన్నీ బడాబాబుల ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే కమిటీలుగా మారుతాయన్నాడు పెద్దాయన మార్క్స్. ఇంతకు మించి వేరేగా ఉండలేదు కాబట్టి, బడాబాబులకు ఇటువంటి నిర్ణయాలవలన ఏమీ అన్యాయం జరగలేదు అని బాధపడటంలో అర్థం కూడా లేదు. గత ప్రభుత్వాలే తీసుకుంటే లైసెన్స్ రాజ్ లోని లొసుగులనుండి ఎంత మంది బడాబాబులు ఉదయించారో తెలియక కాదు. లైసెన్స్ రాజ్ ల విషయంలోనే పరిస్థితి అలా ఉంటె, ఆర్థిక సవరణల యుగం లో ఇంతకు మించి వేరేగా ఉండదు. ఎలక్షన్లలో నాయకుల ప్రచారాలకు పెట్టుబడి ఎక్కడినుండి వస్తున్నదో, బడాబాబుల బడా బడా బ్యాంకు లోన్లకు ఋణమాఫీలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోలేనంత, అర్థం చేసుకోలేనంత బీరకాయ సంబంధమేంకాదీ వ్యవహారం. బడా బాబులంటే ఎవరు అంటే ఏ అంబానీనో, అగర్వాలో, థాపరో, టాటానో, బిర్లానో అనుకోవడం అంటే మనం ఇంకా పురాతన మైండ్ సెట్ తో నివసిస్తున్నట్టే. ఎనభై ఐదు శాతం మన పార్లమెంట్ సభ్యుల్ని ఈ విధంగా మనం అవమానించినట్లే. వీళ్లందరోఓ పార్లమెంటుకు ఎంపిక కావడానికిగల మినిమం క్వాలిఫికేషన్ అంతకుముందు వ్యాపారవేత్త అయుండటమే. మనమే ఎన్నుకంటాం వారిని, బాగా మాట్లాడుతున్నాడని, నిజాయితీగా పనిచేస్తాడనీ కాదు, బాగా డబ్బున్నవాడని. వీరిలో అస్మదీయులనూ తస్మదీయులనూ ఆయా ప్రభుత్వాలు గుర్తిస్తుంటాయి తప్ప, నిజానికి బడాబాబులెందరో మన దేశంలో.

మరి అటూ ఇటూ కాక ఎవరికోసమీ ఆకస్మిక నిర్ణయాలు?. ప్రభుత్వం( బడాబాబుల ప్రాథమ్యాలను పరిరక్షించే ప్రభుత్వం అని బై డీ ఫాల్ట్ గా చదువుకోవాలి) దేశంలోని నల్ల ధనాన్ని వెలికి తీయటంకోసమే అంటున్నపుడు, దేశంలోని సగంపైగా సంపద బడాబాబుల చేతిలో పోగుపడిఉండగా, ప్రభుత్వం బడాబాబుల కోసమే పని చేస్తూ ఉండగా, ఇక బ్లాక్ మనీ ఎవరి చేతిలో ఉన్నట్టు?. సామాన్యుడి చేతిలో ఉన్నట్టా..?. ఐతే ఈ దేశంలో సామాన్యుడి డెఫినిషన్ చాలా కష్టమైనది. ప్రతీ అసామాన్యుడూ తానో సామాన్యుడినే సుమా! అంటుంటాడు అనడానికి పరాకాష్ట రాజకీయ నాయకులు తమ ఆస్థి వివరాల్ని నిజాయితీగా బయటపెడుతున్నామని చెప్పుకోవడం. ఆ వివరాల్ని మనం వ్యక్తి పూజతోనో, కులం లేదా మతం పూజతోనో "అవునవును ఎంత నిజాయితీ పరుడో" అని నమ్మి సంతోషపడిపోవటం చేస్తుంటాం. ఇందులో, ఓటరు తన ఓటు నిజాయితీగల వాడికే పడిందని కొంతసేపు ఊగిపోయే ఆనందానికి లోనవడం తప్ప ఇంకోటి కనిపించదు. అంత వెర్రి వారిమి కనుకనే నిజాయితీకి మన దేశంలో అర్థాలే మారిపోతుంటాయి. పైగా నమ్మించే కార్యక్రమాలతో అనుసంధానకర్తగా ఉంటూన్న మీడియా, అవినీతి రహిత భారతదేశం కోసమే తాము పనిచేస్తుంటామని ఇంకో నమ్మకాన్ని ముందే మన మనసుల్లో నెలకొల్పుతూ ౦టుంది. ముఖ్యమంత్రాదులు సైంతం తమ ఆస్థి వివరాల్ని నిజాయితీగా తెలియజేస్తూ, అతి సామాన్యుడిలా బతికేస్తున్నాం, వాచీ లేదు, తినడానికి తిండిలేదు అని చెబుతున్నపుడు, అసలైన సామాన్యుడు "ఇంతకీ నేనెవర్నీ ..?" అని బహుబలి రేంజ్ లో అడగక తప్పదు.

మన వ్యవస్థే అసామాన్యంగా తయారైనపుడు సామాన్యుడనేవాడిని వ్యవస్థకి బయట మనం వెదకాల్సి ఉంటుంది. వ్యవస్థలో అంతగా పాలు పంచుకోని, పంచుకోలేని, పంచుకోనివ్వని మనిషినే మనం సామాన్యుడని నిర్వచించుకోవాల్సి  ఉంటుంది. కూతురి వివాహానికి ఒక పూటకోసం పది కోట్ల సెట్టింగ్ వేయగలిగిన సామాన్యుడు, కొడుకు మెడికల్ కాలేజీ సీటుని కోటిన్నరకు కొనుక్కునే సామాన్యుడు, ఐసీసీయూ లో ఒక రోజుకు యాభైవేలు సమర్పించి ట్రీట్మెంటు చేసుకోగల సామాన్యుడు, పది కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుని, పది రోజుల్లో ఇరవై కోట్లకు అమ్ముకునే సామాన్యుడు, బ్యాంకు లోను మీద బెంజ్ కారు కొనుక్కుని తిరిగే సామాన్యుడు, సంవత్సరంలో సంపాదించిన కోట్ల సంపాదనని కరెక్టుగా రెండున్నర లక్షలకు అటు ఇటుగా చూపించేసి చేతులు దులుపుకునే సామాన్యుడు, హోటల్ కి వెళ్ళి ఒక పూట భోజనానికి పది వేలు ఖర్చు పెట్టి, టిప్పు ఐదువందలు వేయగలిగిన సామాన్యుడు, లైసెన్సు కోసం లైన్లో నిలబడేబదులు ఐదువేలు లంచమిచ్చి పనిగావించుకునే సామాన్యుడు, మున్నగు వారందరూ ఈ వ్యవస్థ నిర్మించిన అతి సామాన్య ప్రజలుగా మనం చెప్పుకుంటే, వీరందరికీ ఈ జీవిత విధానాన్నీ, ఆలోచననీ, కలలనీ కల్పించిన అసామాన్య వ్యవస్థను ముందుగా తయారు చేసిందెవరని ప్రశ్నించాలి. నిజానికి వీటన్నింటికీ బయట, వీటితో ఏమాత్రం సంబంధం లేకుండాగా ఉంటుంది, పూట గడవడానికి కాయా కష్టం చేసే అసలైన సామాన్యుడు, వాడి జీవితం. "నేను సామాన్యుడిన"నుకునే ప్రతీ అసామాన్యుడూ ఈ రోజు బ్యాంకు ముందు లైన్లో నిలబడి తన సామాన్యత్వాన్ని ప్రదర్శిస్తూన్నపుడు, అసలైన సామాన్యుడి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఏలిన వారు చెప్పే నల్లధనం సంగతేమోగానీ, అసలు ఉండాల్సిన ధనం లేని వాడు బ్యాంకు ముందు ఎందుకు కనిపిస్తాడు?. అంతే గుడ్డిగా రాహుల్ గాంధీ అడుగుతాడు, "ఇక్కడ లైన్లో సూటు బూటు వేసుకున్న వారెవరైనా ఉన్నారా?" అని. సామాన్యుడి వేషధారణలమీద ఎంత నమ్మకమో ఆయనకు మరి.

నల్లధనం వెలికితీత అసామాన్యమైన మన వ్యవస్థను సామాన్యంగా తయారు చేస్తుందని నమ్మే అసామాన్యులందరూ వ్యవస్థలోని లోపాల్ని గుర్తించగలుగుతారనుకోవడం పొరపాటు. ఒకే  ఫ్రేం ఆఫ్ రిఫరెన్సులో ప్రభుత్వం, వ్యవస్థ సమాన వేగాలతో నడుస్తుంటాయన్న భౌతిక శాస్త్ర విషయాన్ని కొద్దిగా అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి ఈ పెద్దనోట్ల రద్దు విషయం వ్యవస్థలో నిజానికి కొంత మార్పు తేగలిగినా వ్యవస్థ మారనంతవరకూ అది నీటి మీద రాయేయడం తప్ప ఇంకేమీ కాదు.

13-11-16
విరించి విరివింటి