Sunday, 27 November 2016

భూమి పాటll మైఖేల్ జాక్సన్
-----------------------------------------

సూర్యోదయం గురించి ఏమడుగుదాం
వర్షం గురించి ఏమడుగుదాం
నీవు నేనూ కలిసి పొందుదామనుకున్న
వాటన్నింటి గురించీ ఏమడుగుదాం..

మనుషుల మారణహోమాల గురించి ఏమడుగుదాం
మనకసల౦త సమయముందా..?
నీదీ నాదీ మనిద్దరివే అన్నావుగా
వాటన్నిటి గురించీ ఏమడుగుదాం...

ఎపుడైనా ఆగి చూశావా
ఇప్పటిదాకా మనం పారించిన రక్తాన్ని
నీవెపుడైనా ఆగి గమనించావా
కుమిలే భూమినీ ఏడ్చే సముద్రాల్ని

మనమేం చేశాం ఈ ప్రపంచానికి..
మళ్లొకసారి చూడు మనమేం చేశామో
మన వారసులకోసం మనం చేసిన
శాంతి ప్రతిజ్ఞ ఊసెక్కడ?
పుష్పించే వనాలెక్కడ
మనకసలు సమయమేదైనా మిగిలుందా?
నీది నాదీ మన ఇద్దరివీ అనుకున్న
ఆ కలలన్నీ ఎక్కడ..?

ఎపుడైనా ఆగి చూశావా..?
యుద్ధంలో అసువులు బాసిన పసిపిల్లల్ని..
నీవెపుడైనా ఆగి గమనించావా ..?
కుమిలే భూమినీ ఏడ్చే సముద్రాల్ని

నేనొకప్పుడు కలగనేవాన్ని
నక్షత్రాల అవతలివైపుకొకసారి పరికించేవాన్ని
ఇపుడు నేనెక్కడున్నానో నాకే తెలియడం లేదు
ఎక్కడికో దూరానికి విసిరివేయబడ్డానని తప్ప

ఓ మిత్రుడా..
నిన్నటి గురించిన మాటేమిటి?.
సముద్రాల గురించిన మాటేమిటి?.
స్వర్గాలు కూలిపోతున్నాయే..
నా శ్వాస కూడా బరువయ్యిందే..
నీ అవసరం నాకున్నపుడు
ఈ ఉదాసీనత ఎందుకు?

ఈ ప్రకృతి విలువెంత?
ఈ భూమితల్లి గర్భం కదా అది
ఈ జంతువుల మాటేమిటి?
వాటి సామ్రాజ్యాల్నే కూల్చేశాం కదా..
ఆ ఏనుగుల మాటేమిటి?
మనమీద నమ్మకాలెపుడో కోల్పోయాయవి
ఈ దుఃఖించే తిమింగలాల మాటేమిటి
సముద్రాల్ని కొల్లగొట్టేశాం కదనోయ్...
అడవుల్లో మన పాదముద్రల మాటేమిటి?
మొర పెట్టుకున్నా తగలబెట్టేశాం కదా..
ఈ పవిత్ర నేల సంగతేమిటి..?
మతాల పేర్లతో చింపి ముక్కలు చేశాం కదా..
సామాన్య మానవుడి సంగతేమిటి.?
మనమెపుడు వాడికి స్వేచ్ఛనివ్వలేమేమో కదా..
ఈ చనిపోతున్న పసి పిల్లల సంగతేమి.?
ఆ చిట్టి ఏడుపులు మనం వినలేకున్నామా..?

మనమెక్కడో తప్పు చేస్తున్నాం...
ఎందుకో ఎవరైనా చెబుతారా నాకు?

ఇపుడే పుట్టిన చిన్నపిల్లలు
వాళ్ల రాబోయే రోజులు
వాళ్ల కేరింతల మాటేమిటి?.
ఐనా మనిషి గురించి చెప్పవోయ్!!
ఆ తల్లడిల్లే మనిషి గురించి చెప్పు
అబ్రహం గురించి
చివరిగా ఇంకొక్కసారి మరణం గురించీ చెప్పు
మనమసలు ఎపుడైనా ఇంకెప్పుడైనా పట్టించుకుంటామా..?

 translation of Earth song of Michael Jackson

No comments:

Post a Comment