ఈ రోజు వ్యాసం - కొప్పర్తి గారి కవిత 'సుశీల' మీద
కవి సంగమం లో...
జీవన సూత్రాల్లో సిద్ధాంతాలు
-----------------------------------------
మనుషుల జీవన సూత్రాలు కొన్ని సిద్ధాంతాల ఆధారంగా నిర్వచింప బడుతూ, నిరూపించ బడుతూ ఉంటాయి. సిద్ధాంతాల మధ్య విబేధాలు ఎంత సహజమైనా అవి జీవన సూత్రాలను ఒక్కో కొత్త కోణంలోనుండి చూసే, చూపించే ప్రయత్నం చేస్తుంటాయి. ఏ సిద్ధాంతమూ పూర్తిగా తప్పూ కాదు, అట్లని పూర్తిగా ఒప్పూ కాదు. ఐనప్పటికీ, తమ తమ సిద్ధాంత కోణాలను బలపరుచుకోవటానికై అవి తమ చుట్టూ స్టీరియోటైప్ ఆలోచనలనూ, తద్వారా కొన్ని సామాజిక భ్రమలనూ కూడా పుట్టించడానికి అవసరమైన నేపథ్యాన్ని సృష్టించుకుంటాయి. ముఖ్యంగా జెండర్ రోల్స్ ని ఒకటీ రెండు అంశాల ఆధారంగా నిర్వచించాలని ప్రయత్నించినపుడు వాటి చుట్టూ ఎన్నో అపోహలు ఏర్పడటమే కాక, ఒకదానికొకటి వ్యతిరేకించుకుంటున్నట్టు కనబడే ఈ సిద్ధాంతాలు జెండర్ ఇనీక్వాలిటీలనూ, వాటి చుట్టూ ఉండే భ్రమలను శాశ్వతంగా కొనసాగిస్తాయే తప్ప పరిష్కారాలు చూపలేని అశక్తతను మూటకట్టుకుంటాయి. అన్ని సిద్ధాంతాల సంశ్లేషణ (synthesis) జరిగి ఒక సరయిన నిర్ణయానికి రావడానికి ఊపిరాడని పాత సిద్ధాంతాల, అపోహల స్థానంలో, లోతైన అవగాహన, పక్షపాత రహిత అధ్యయనమూ (unbiased research) అవసరం అవుతాయి.
ఫ్యూడల్ సమాజాల నుండి పారిశ్రిమిక సమాజాలకు మారే క్రమంలో కుటుంబంలో స్త్రీ పురుష పాత్రల తీరుతెన్నులు విపరీతమైన మార్పులకు లోనయ్యాయి. ఈ ఆధునిక సమాజాలు (గత సమాజాలతో పోల్చుకున్నపుడు) స్త్రీ జీవితంలో, ఆమె చేసే శ్రమలో విపరీతమైన మార్పులు తెచ్చి, అదే పురుషుని విషయంలో తక్కువ మార్పులు తెచ్చేసరికి సమాజంలో, కుటుంబంలో స్త్రీల పాత్రమీద చర్చ మొదలయ్యిందని చెప్పాలి. పారిశ్రామిక వ్యవస్థను నిర్వచించే వర్గ బేధం(class variation), స్త్రీ పురుషుల విషయంలో కూడా తీసుకురాబడి, స్త్రీ అస్తిత్వాన్ని పునర్విచించే ప్రయత్నం చేసింది. ఈ మార్పుల పర్యవసానం, 'సమాజం స్త్రీని చిన్న చూపు చూస్తోందనే' అవగాహనను తీసుకువచ్చింది. వేతన ఆధారిత (wage based) సమాజంలో స్త్రీ చేసే శ్రమ ఇంటికి బదులు ఇంటి బయటకు మారింది. పురుషులొక వర్గంగా, స్త్రీలు ఇంకో వర్గంగా ఏర్పడిన సమాజంలో స్త్రీకి బయటి పనులతో పాటు వేతనంలేని ఇంటి లోపలి పనులు, వారానికి దొరికే సగటు ఖాళీ సమయాన్ని ముప్పై ఆరు నుంచి ముప్పై రెండుగంటలకు కుదించి వేశాయి. శ్రమ దోపిడీ జరిగిందనే అవగాహనతో పురుషులు కొత్త పీడకులుగా కనిపించారు. ఈ ఆలోచనలు ఇలా వుంటే, ఇంకో వైపు స్త్రీకుండే మాతృత్వమనే సహజ గుణం స్త్రీని, సమాజంలో ఆమె స్థానాన్నీ, పాత్రనీ నిర్వహిస్తుందనే జీవ శాస్త్ర సంబంధమైన వాదం, స్త్రీని ఇంకో కోణం నుండి ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. మరణాల సంఖ్య అధికంగా ఉన్న పూర్వ సమాజాల్లో స్త్రీ, ఆయా సమాజాల్ని బతికించడం (survival of the societies) లో కీలక పాత్ర పోషించింది. సైన్సు అభివృద్ధి చెందని గత శతాబ్దం వరకూ ఈ పరిస్థితే ఉంది. నేటికీ, సగటు జీవిత వయస్సు యాభైకంటే (50 years) తక్కువగా ఎన్నో సమాజాలల్లో స్త్రీలు ఆయా సమాజాలు అంతరించిపోకుండా నిలబెడుతున్నారు. పిల్లల్ని ఒక ఆస్తిలాగా భావించే ఆ సమాజాల నుండి, మరణాల సంఖ్య తగ్గి, ముసలి వయసు వారు పెరిగిపోతున్న ఈనాటి సమాజాలకు మనం తరలిపోతున్నపుడు, సమాజంలో స్త్రీల పాత్ర ఇంటి కంటే ఇంటి బయటకు పయనమయ్యింది. మన భారతీయ సమాజం, ఈ ట్రాన్సిషన్ జోన్లో కొనసాగుతూ న్నపుడు, మారుతున్న జీవన విధానాలు, పెరుగుతున్న మధ్య తరగతి కుటుంబాలు, భారతీయ స్త్రీని ఏ సిద్ధాంతాలలోకి ఇరికించి నిర్వచింప ప్రయత్నించినా, కవి కొప్పర్తి మాత్రం ఇంకాస్త ముందుకు వెల్లి తన జీవిత భాగస్వామిని ఆమె స్వభావానుకూలంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడీ కవితలో.
స్త్రీ ఉద్యోగం చేయాలా, ఇంట్లో చాకిరీ చెయ్యాలా..? ఉద్యోగం చేసొచ్చి ఇంట్లో చాకిరీ కూడా చెయ్యాలా? అని అడిగినపుడు ఒక్కో సిద్దాంత వాదులొక్కో సమాధానం చెబుతారు, కానీ వీటన్నింటిలో ఆ స్త్రీకి మాత్రమే ఉన్న సహజమైన, ప్రత్యేకమైన స్వభావాన్ని మనం చూడలేనపుడు, ఈ సిద్ధాంతాలు అసంపూర్ణ పరిష్కారాలుగానే మిగిలిపోతాయి. ఇక్కడ కవి ఆమెలో ఉన్న ప్రత్యేకమైన గుణాలను కనుగొంటాడు. ఇది ఆ స్త్రీ మీద సంపూర్ణ అవగాహనను కలిగిస్తుందేగానీ, ఏదో ఒక సిద్ధాంతంలో కూర్చోబెట్టేయదు. ఒకప్పుడు తనకు సహధ్యాయి అయిన ఆమె, ఈ రోజు ఉద్యోగమెందుకు చేయటం లేదు అని అడగడంలో ఆమె ఇష్టానిష్టాలను పట్టించుకోనంత నిర్లక్ష్యం ఎంతుందో..ఆడవారికి ఉద్యోగమెందుకు, ఇంటి పనులు చూసుకోకుండా అనటంలో, ఆమె శ్రమను గుర్తించలేనంత నిర్లక్ష్యం అంతుంది. ఈ రెండు నిర్లక్ష్యాలకూ దూరంగా, ఒక భర్తగా మొదలై, కవితలో చివరకు ఒక మనిషిగా మిగులుతాడు. తన జీవిత భాగస్వామిని భార్యగా గుర్తించటంతో మొదలై చివరకు ఆమె తనను చుట్టుకుని ఉన్న ప్రకృతిగా వర్ణిస్తాడు. సామాజికంగా నెలకొనివున్న స్త్రీ పురుష వివక్షతను ఎక్కడా స్పృశించకుండానే, పరోక్షంగా ఆమె స్థానాన్ని తనకు సమానంగా నిలబెట్టడం ద్వారా, ఆమె ఇష్టానిష్టాల్నీ, ప్రవర్తనా రీతులకూ సంబంధించిన ఆమె సహజ స్వభావానికి పెద్ద పీట వేయడం ద్వారా, ఒక మానవీయ కోణాన్ని అందిస్తారు. అంతే కాకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలనుకోవడం, ఇంట్లో ప్రతీ చిన్న విషయాన్నీ పట్టించుకుని చక్కబెట్టడం, ఇంటి పనుల్లో ఆమె చూపే ఫైన్ మోటార్ డెక్స్టెరిటీని, ఇష్టంగా అలంకరించు కోవడం, వంటి విషయాలను చెబుతూ, "నా స్థూల ప్రపంచంలో ఆమె సూక్ష్మంగా ఉంటుంది/ ఆమె సూక్ష్మ ప్రపంచంలో నేను స్థూలంగా ఉంటాను" అనడం ద్వారా సోషియాలజిస్ట్ 'పార్సన్' చెప్పినటువంటి మధ్య తరగతి స్త్రీ పురుషుల వ్యక్తీకరణ/ నిమిత్తమాత్ర సిద్ధాంతాన్ని (expressive/instrumental theory) పునర్ప్రతిష్టిస్తారు.
సుశీల
-------------------------
కొప్పర్తి.
ఆమె నా మగ భార్య
నేనామె ఆడ భర్తని
నేనో ఎనబై కేజీల బస్తా
ఆమె అరవై నీలికలువ పూలబస్తా
ఆమె ఇంటి పని చేస్తుంది
నేను ఉద్యోగం చేస్తాను
చరిత్ర మానవుడు ప్రపంచము వంటి అంశాల భోధన నా కార్యక్రమం
పిల్లలు వంటపని. ఇంటిపని తోటపని పాకీపని వంటి పనులు ఆమె కాలక్షేపం
నాది పెద్ద ప్రపంచం లో చిన్న పాత్ర
ఆమెది చిన్న ప్రపంచం లో పెద్ద పాత్ర
నేను స్థూలం
ఆమె సూక్ష్మం
నా స్థూల ప్రపంచంలో ఆమె సూక్ష్మంగా ఉంటుంది
ఆమె సూక్ష్మ ప్రపంచంలో నేను స్థూలంగా ఉంటాను
మగ పనులు ఆడపనులు అంటూ వుండవు గాని
కష్టమైన పనులు సులువైన పనులు అంటూ ఉన్నపుడు
మొదటివన్నీ ఆమెవి
రెండోవి మాత్రమే నావి
ఉదాహరణకు
అటక మీద కెక్కవలసి వస్తే
పనికుర్రాడు తను ఉన్నపుడు వాణ్ణెక్కిస్తుంది
మేమిద్దరమూ ఉన్నపుడు తనెక్కుతుంది
బజారుల్లో బస్టాండుల్లో బరువైన వస్తువులు మోస్తూ ముందు నడుస్తుంది
రైల్లో అప్పర్ బెర్త్ ఆమెది
లోయర్ బెర్త్ నాది
ఇద్దరం కలిసి బజారెల్లిన ప్రతిసారి
ఆమె నడుద్దామంటుంది
నేను వాహనం తీస్తాను
బజారులో నడుస్తున్నప్పుడు కూడా
అన్ని పనులు చేసుకుంటూనే నా రక్షనభారం వహిస్తుంది
నేను బయట ఆమె ఇంట్లోనూ ఉన్నపుడు
నేను బయటే ఉంటానుగాని
ఆమె ఏక కాలం లో ఇంట్లోనూ బయట నాతోనూ ఉంటుంది
ఇంటెడు చాకిరి చేస్తుంది
ఇంటిని అద్దంలా ఉంచుతుంది
నిరంతరం చలిస్తూ చరిస్తూ ఉండడం వలన
ఇంట్లోఒకేచోట ఆమెని రెండుసార్లు చూడలేము
శ్రమించినంతసేపూ అలనటతో చమటతో చిత్తడిగా ఉంటుంది
స్నానం చేసిందంటే వెండిరేకులాంటి
గంజిపెట్టిన చీరలో పరిమళిస్తుంది
కట్టిన చీర చలువను తాజాదనాన్ని అణువణువుతో ఆస్వాదించడం
ఆమెకి తెలిసినంతగా ఎవరికైనా తెలుసోలేదో తెలీదు
శ్రమ ఆమె తత్వం
విశ్రాంతిలో ఆనందం ఉందనుకునేవాల్లకు
శ్రమలో సౌఖ్యం కోల్పోతామనుకునే వాళ్లకు
ఆమె వ్యతిరేక ఉధాహరన
విల్లులా వంగి ఆమె ఇల్లు తుడుస్తున్నపుడు
మునివేళ్లతో కత్తిపీట మీద కాయగూరలు తరుగుతున్నపుడు
ఒక అంచునంతా కుచ్చిల్లు పోసి రెండు గుప్పిళ్లమధ్య పట్టుకుని
రెండవ అంచుని
గాల్లోకి ఎగరేసి గింగిరాలు తిప్పుతూ బట్టలు బాదుతున్నపుడు
ఆమెలో
తరతరాలుగా ఈ దేశపు మహిళలు సాధించిన
నేర్పరితనపు వారసత్వం
అందిపుచ్చుకున్న అద్భుతలాఘవం
ఆవిష్క్రతమైన జీవవిన్యాసం
అది
నిత్యం
సత్యం శివం సుందరం
శ్రమ ఆమె తత్వం
శుభ్రత ఆమె మతం
శుభ్రంగా ఉంచవచ్చనే
ఆమె ఇంటిని వస్తువుల్నీ ఇష్టపడుతుంది
గజం ఎత్తు కరెన్సీ కట్టకావాలా
అంతే ఎత్తున్న కొత్తవస్తువు కావాలా అంటె
నోట్లకట్టని కడిగి తుడవలేము కాబట్టి
వస్తువు కావాలంటుంది
ఒకసారి మంచినీళ్లు తాగిన గ్లాసును
మళ్లీ బిందెలో ముంచి ఎంగిలి చేయకుండా ఉండడానికి
పెళ్లయిన కొత్తల్లోనే తెలివిగా
వాటర్ ఫిల్టర్ పేరుతో కుళాయి పద్దతి ప్రవేశపెట్టింది
వళ్లు తుడుచుకునే టవల్ తో
అన్నం చేయి తుడుచుకుంటే
టవల్ వెంటనే వైభవం కోల్పోయి
మళ్లీ వుతికిందాకా జిడ్డుచేయితుడుచుకునే గుడ్డగా మారిపోతుంది
ఇంట్లో మసిగుడ్డకు చేతిరుమాలుకు తేడావుండదు
రెండూ తెల్లమబ్బుతునకల్లా తళతళమంటుంటాయి
విడిచిన బట్టను చూసినప్పుడు తననొక విడిచిన బట్టగా భావిస్తుందనుకుంటాను
అందుకే ఉతుకుతున్నంతసేపు తనే శుభ్రపడుతూ ఉంటుంది
పొరుగూరు వెళ్లి తోటకు నీళ్లు పట్టని రోజున
నూటొక్కమొక్కల దప్పికంతా ఒక్కతే గొంతుకెత్తుకుంటుంది
తిరిగివచ్చి తోటకు నీళ్లుపడుతున్నప్పుడు
తానే ఒక నల్లరేగడి నేలగా మారిపోతుంది
వర్షాకాలం మొక్కలకు నీళ్లుపొయ్యక్కర లేదని
చాలామంది వృక్షప్రేమికులు సైతం సంతోషిస్తారు కాని
వృక్ష ప్రేమిక అయివుండి ఆమె
బట్టలు ఫెళ ఫెళా ఆరవనీ
ఇంటినీ వస్తువుల్నీ చెమరిస్తుందనీ
బయటంతా బురదగా మురికిగా వుంటుందనీ
వర్షాకాలాన్ని విసుక్కుంటుంది
ముసురు పట్టిన రోజంతా రెక్కలు తెగిన పక్షిలా తప తపా కొట్టుకుంటుంది
ఇల్లు కడిగి కడిగి
బట్టలు ఉతికి ఉతికి
తోటకు నీళ్లు పట్టిపట్టి
నూటనాలుగు అడుగుల లోతుకు తీసిన బోరుపంపు క్రింద
భూమి పొరల్లో ప్రవహించే అంతర్వాహినిని
పదేళ్లలో పీల్చేసి
చుక్క నీరు లేకుండా చేసిన
ఆమెది సతతహరిత పరిశుభ్రదాహం
ఆమె ఒక నిరంతర వేసవి
ఇంటికి తాళంపెట్టి ఊరెల్లాల్సి వచ్చినపుడు
వస్తువుల్ని చిందరవందరగా వదిలేసి వెల్లే
ఆ ఒక్క అవకాశాన్ని చేజేతులా జారవిడిచి
శుభ్రంగా వుంచే అలవాటునే పొదివి పట్టుకుని
వస్తువుల్ని సర్ధి
ఇంటినంతా తడిగుడ్డతో తుడిచాకే తాళం వేస్తుంది
బహుశా ఇంటిని తనతోపాటే తీసుకువెల్తుందని
ఎవరింటికి వెళ్లినా తన చుట్టూ
తన ఇంటినే ప్రతిష్టించుకుంటుందనీ అనుకుంటాను
ఇల్లే ఆమె ప్రపంచం కాబట్టి
ఇంటికి తాళం వేసే ముందులాగే
ప్రపంచానికి తాళం వేసేప్పుడు కూడా
ఇట్లాగే చేస్తుందని నాకు పొడగడుతూ ఉంటుంది
తన అస్తిత్వం తనకెంతో ఇష్టం
ముందు తనను తాను చూసుకుని ప్రేమించురుని
అభినందించుకున్నాకే
ఎవరి వంతయినా వస్తుంది
కాబట్టే ఎవరితోనూ నిమిత్తం లేకుండా
ఎవరితోనైనా
ఉల్లాసం గా
హల్లీసకమై పోతుంది
చదవడమంటే ఎంతో ఇష్టం
అప్పుడు నా సహ విద్యార్ధి
ఇవాల్టికి నా సహాద్యాయి
ఇంటికి తెచ్చిన పుస్తకం ఇద్దరిదీ
శరత్తూ ప్రేమచందూ
విశ్వనాధ శ్రీ పాద
రాహుల్ రావిశాస్త్రి ఎప్పడో పూర్తయిపోయారు
ఆమె మధ్యాన్నం న్యూస్పేపర్
రెండు పూటలా న్యూస్ చావల్
వారానికొక్కసారి పాడుతా తీయగా
రోజంతా పాడుతూ హాయిగా
ఆడ పిల్లకు అన్యాయం జరిగితే ఇంట్లోనే నిప్పులు చెరుగుతుంది
నచ్చనిదేదైనా కుండను చేసి బద్దలుకొడుతుంది
ఆమెకు పిట్టలిష్టం పిల్లలుష్టం
పువ్వులిష్టం నవ్వులిష్టం
పండ్లిష్టం
ఇంగువ ఇష్టం. సాంభ్రాణి ఇష్టం
కస్తూరీ కర్పూరాలిష్టం
దవనం ఇష్టం
మరువం మాచపత్రి ఇష్టం
అగరు పొగలిష్టం
అన్నింటికి మించి
కొత్తదనం ఇష్టం
కొత్తదనం లోని పరిమళం ఇష్టం
సాయి ఇష్టం
సాయం వేళ దీపారాధన ఇష్టం
సంధ్య సమీరం ఇష్టం
ఆధునికం ఇష్టం
ప్రాచీనం ఇష్టం
చీరలిష్టం
చిన్న చిన్న ఆభరణాలిష్టం
శ్రుతిమించని అలంకరణ ఇష్టం
మన జీవన సూత్రాలు ఏ సిధ్దాంతం లో వున్నాయో కాని
ఆమె మాత్రం మాత్రం
పనిలో వుంది
శుభ్రతలో వుంది
అందంలో ఉంది
మన ప్రాణధాతువులు ప్రాకృతమై ఉన్నాయో లేదో
కాని
ఆమె ప్రాణ రహస్యం మాత్రం
నీళ్లల్లో ఉంది
నిప్పుల్లో ఉంది
ఎండలో ఉంది
నేలలో ఉంది
అవును ఆమె ప్రకృతే
కాబట్టే ఆమెలో
జలప్రళయాలు
ఝంఝామారుతాలు
భూకంపాలు
అగ్ని విస్పోటాలు
పెచ్చరిల్లుతూ ఉంటాయి
నన్ను అతలాకుతలం చేస్తుంటాయి
నిజంగా
ఆమె ప్రకృతి
నేను మానవుణ్ణి
భ్రూణ హత్యలూ, వరకట్న సమస్యలూ, రాజకీయ ఉద్యోగ వివక్షలూ, స్త్రీ స్వేచ్ఛ వంటి సమస్యల సుడిగుండంలో ఆధునిక మహిళ ఉంటే, గృహిణి గృహ హింసలో అన్యాయానికి గురవుతున్నది. చదువుకున్న గృహిణులు పెరుగుతున్న మధ్యతరగతి సమాజంలో భార్యాభర్తలిద్దరి మధ్యా అవగాహనా రాహిత్యం లేకపోవటం, మానవీయ కోణంలో విలువలనూ అవసరాలనూ అర్థం చేసుకోవటం ఎంతో అవసరం. ఈ కవిత ఆ దిశగా చేసిన మొదటి ప్రయత్న౦. ఏర్పరచుకున్న పాక్షిక అభిప్రాయాల్ని వాటి చుట్టూ ఉన్న భ్రమల్నీ దాటి లోతుగా కొత్తగా ఆలోచించ వలసిన అవసరాన్ని గుర్తుచేస్తుంది.
కవిత్వ సందర్భం 29
22-11-16

No comments:
Post a Comment