Thursday, 11 May 2017

ఆగని యుద్థం
-----------------------

అపుడా అమ్మాయి బతికి వుండి, తిరగబడగలిగి ఉండింటే అప్పటికప్పుడు ఏమి చేయగలిగేదో దానినే, తమ తలలు బద్దలు కొట్టుకునేలా వాద ప్రతివాదాలు చేసుకుని చివరికి న్యాయాధీశులు చేస్తున్నారు. బలాత్కారం ఆపై దారుణమైన హత్య...రెండు దారుణమైన విషయాలే. నిర్భయకు ముందు ఆ తరువాత కూడా ఎన్నో ఇటువంటి సంఘటనలు జరిగాయి. జరుగుతున్నాయి. కొన్ని కోర్టు కేసులు కూడా ఉండిండొచ్చు. కానీ వాటి తీర్పు రావచ్చు రాకపోవచ్చు. న్యాయం జరగాలంటే ఖర్చవుతుంది, అందరూ ఖర్చులు భరించగలిగిన వారై ఉండగలరని అనుకోలేం. సమయమూ తీసుకుంటుంది. అందరూ సమయంకోసం వేచి చూడగల సహనం కలిగి ఉంటారనీ అనుకోలేం. అందరి విషయంలోనూ దేశ పౌరులు అదే విధంగా బాధిత కుటుంబాలకు క్యాండిల్ ర్యాలీలవంటి వాటితో నైతిక మద్దతు తెలుపుతారనీ ఆశించలేం. అందరి విషయంలోనూ మీడియా అదే విధమైనటువంటి కవరేజీ ఇచ్చి ప్రజలను చైతన్య పరుస్తుందనీ అనుకోలేం. బాధిత కుటుంబాలు ఎన్నో...కానీ ఎందుకో కొందరికే న్యాయం అనబడేది అందటం. కొందరు బాధితులకే తక్కువ సమయంలోనే తీర్పులు వెలువడటం. ఇలా ఎందుకు? అనే డౌట్ వచ్చినా దేశద్రోహమే అనే నేపథ్యం ఉన్నపుడు, అసలు ఉరి అనే ఆటవిక సాంప్రదాయమే మనకొద్దు అంటే, నిజంగా అర్థం చేసుకోగలిగినవారు ఎందరు?.

తప్పుకు శిక్ష పడాల్సిందే అనే భావన మనుషుల ప్రాథమిక అవగాహన. జెనిసిస్ లోని తొమ్మిదవ అధ్యాయంలో శిక్షను వేస్తాననే దేవుడూ, గీతలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాననే దేవుడూ కూడా మనిషి సృష్టే. మనుషుల చేసిన దేవుల్లు కదా. దుష్టులను శిక్షించే పాటే అయితే, అసలీ పనికిమాలిన దేవుడు దుష్టులను సృష్టించుట యేల? దుష్టులను సృష్టించుటా, ఆపై చంపుటా తానే చేస్తున్నాడంటే బహుశా దేవుడు పనిలేనోడే అయుంటాడు. అటువంటి దేవుడిని సృష్టించిన మనిషీ పనిలేనోడే అయుంటాడు. అందుకేనేమో మత భావనలను రూపుమాపుకోలేని వారిమిగా మనం మన న్యాయ శాస్త్రాలనూ రాసుకున్నాం. నిర్భయ కేసులో నిందితులకు మరణ శిక్ష వేయడం సరైనది కాదని వాదించిన ఒక డిఫెన్సు లాయరు," ఔనూ అంత రాత్రి సమయంలో ఆ అమ్మాయిని వారి తల్లిదండ్రులు ఇంకో అబ్బాయితో ఎలా పంపుతారండీ...?" అని అడుగుతాడు. "స్వీట్లను బజారులో ఉంచితే కుక్కలు తినకుండా ఎందుకుంటాయ"ని ఉదాహరణనూ చెబుతాడు. అందుకే రేప్ జరిగింది తప్ప నిందితులు ఉత్తమోత్తములు అంటాడు. ఇందులో మతాలు కలిగించే భావనలున్నాయి. బహుశా డిఫెన్సు లాయరు ఉద్దేశమూ కూడా నిందుతులకు శిక్ష పడటమే కావచ్చు. అందుకే పసలేని వాదనలను నిందితుల తరపున చేసి ఉండవచ్చు. అతడి వాదనలకు మత భావనల కలరింగు ఇవ్వడం కూడా ప్రజలతో దూరం కాకుండా చేసే ప్రయత్నమే. తీవ్రతరమైన ఇటువంటి కేసులలో తీర్పు ముందే ఊహించబడుతుంది కాబట్టి, డిఫెన్సు లాయరైనా ప్రజల భావనలతో తమ భావనలూ ఏకమని చెప్పుకోక తప్పదు. అందుకేనేమో వుడ్రో విల్సన్ కూడా  "సమాజ ఆలోచనలూ అలవాట్లూ ఘనీభవించిగా ఏర్పడిన స్వరూపమే న్యాయం" అని నిర్వచించాడు.

ఇపుడు దుష్ట శిక్షణ అవసరమే అనుకుంటే, అసలు దుష్టులను తయారు చేయడమెందుకు వారిని శిక్షించడమెందుకు అనేది మౌలికమైన ప్రశ్న. దుష్టులను తయారు చేసేది కూడా సమాజమే. డిఫెరెన్సెస్ ని ఒప్పుకోని సమాజాన్ని తయారు చేసుకోవడమే దీనికి కారణం. డిఫెరెన్సు కేవలం భౌతికంగానే కాక, మానసికంగా కూడా. ఒక వ్యక్తికంటే ఇంకో వ్యక్తి వేరుగా ఉంటే, వేరే జండర్ ఉంటే, వేరే కులం ఉంటే, వేరే మతం ఉంటే, వేరే ప్రాంతం ఉంటే, వేరే వస్త్రధారణ కలిగి ఉంటే....చివరికి ఒక విషయం పై వేరే అభిప్రాయం కలిగి ఉంటే కూడా...ఏ మాత్రం భరించలేని వారిమై పోవడం ఇందుకు కారణం. ఒకడు ఇంకో వ్యక్తిని ప్రేమిస్తాడు, ఆమె కాదంటుంది. అతడి అభిప్రాయంతో విబేధిస్తుంది. యాసిడ్ దాడి చేస్తాడు వాడు. ఒక నమ్మకానికో లేదా ఇంకో వాస్తవానికో ఒకరు ఒక అభిప్రాయం కలిగి ఉంటే, అందరూ అదే అభిప్రాయాన్నే కలిగి ఉండాల్సిందే అనేటువంటి భావనలు, మత భావనలతో సరితూగగల భావనలు, పెచ్చుమీరడమే దీనికి కారణం. నిర్భయ కేసులో మరలా ఉరి శిక్ష అంశం బయటికొచ్చింది. ఎప్పటిలాగానే మానవ హక్కుల వారు ఇది కూడదు అంటారు. జీవిత కాల శిక్ష సరిపోతుంది కదా మరణ శిక్ష ఎందుకు అంటారు. ఇక వారిపై యుద్ధ ప్రకటనమే జరుగుతుంది. వారి అభిప్రాయాన్ని చెప్పుకోనీయని ఇటువంటి సమాజంలోనే రేపులూ, మర్డర్లూ జరుగుతుంటాయని మనం, ముఖ్యంగా ఇటువంటివారిని 'మేధావులు' అంటూ ఎద్దేవా చేసేవారు, గమనించాలి. అభిప్రాయాలకు విలువనివ్వగలిగిన సమాజంలో రేపులు జరుగవలసిన అవసరం ఏముంటుంది. ఇద్దరి ఒప్పుకోలు మీద ఆధారపడి మాత్రమే ఇద్దరు మనుషుల మధ్య లైంగిక సంఘటన జరగడం అనేది నిజంగా అద్భుతమైన విషయమే కదా. స్త్రీల మీద ఆధిపత్యం చెలాయించాలనుకోవడం, వారిముందు తమ బలాన్ని ప్రదర్శించాలనుకోవడమూ కూడా స్త్రీలకంటే పురుషులు అధికులు అనే భావననుండి వచ్చినవే. "మేము అధికులం" అనుకోవడంలోనే "మీ అభిప్రాయాన్ని ఒప్పుకోం" అనడమూ ఉంది. ఆధిపత్య భావనలు తొలగి, సమభావనలు పెరిగి, అందరి అభిప్రాయాలనూ గౌరవించుకోగలిగిన సమాజంలో, వాటికి విలువనివ్వగలిగిన సమాజంలో దుష్టుల పుట్టుక నిజంగా ఉంటుందా?.

సమాజంలో దుష్టత్వం ఉంటేనే ప్రభుత్వం ఉంటుంది. ఇది ఒక ఫాల్స్ స్టేట్మెంటుగా తీసుకోవాలి. ప్రభుత్వం ఉంటేనే దుష్టత్వం ఉంటుంది సరి ఐనది. ప్రభుత్వం ఉండగానే, పాలకులు పాలితులు అనే ఆధిపత్య నిమ్న వర్గాలు ఏర్పడిపోతాయి. వర్గాల మధ్య అంతరాలు ఏర్పడతాయి. ప్రభుత్వం ఉనికిలో ఉండాలంటే సమాజంలో దుష్టత్వం ఉండాలి. దుష్టత్వం లేకుంటే ప్రభుత్వాలకు పెద్దగా పనేం ఉండదు. పౌరులు రెండు రకాలుగా విడిపోతారు. రాజ్య శాసనాలను గౌరవించే పౌరులు, గౌరవించని పౌరులు. వారికి తగిన పనిని కలిగించని ప్రభుత్వాలపై గౌరవం తగ్గించుకున్న పౌరులు వీరంతా. గౌరవించని పౌరులను దుష్టులుగా ప్రభుత్వాలు భావించాలి. దుష్టత్వంలో తీవ్రతలను బట్టి శిక్షలు విధించబడతాయి. ఇపుడు ప్రభుత్వం వీరికందరికీ పని కలిపించటం కష్టం. కొందరు కడుపు నింపుకోవటం కోసం వేరే పనుల్లోకి వెల్లిపోతారు. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. అఫ్ఘనిస్తాన్ వంటి ఎడారి ప్రాంతంలో పౌరులకు పని కలిగించటం ప్రభుత్వాలకు కష్టం. డెబ్భై శాతం యువత పని లేని వారిగా ఒక సమాజంలో ఎందుకుండాలి. అక్కడి మత సంస్థలకు అందుకే బలం ఉంటుంది. మతానికి సంబంధించిన విద్య నేర్చుకోవడమూ, మత తీవ్రవాదాన్ని కౌగిలించుకోవడమూ అక్కడి యువతకు ఉపాధి వంటిది. మత సంస్థలు తమకు సంపన్న దేశాల నుండి అందే నిధుల ద్వారా యువతను మత విద్య వైపు తిప్పడమూ, వారికి ఆ విధంగా ఉపాధి కలిగించటమూ జరుగుతుంది. మత విద్య నేర్చుకుని ఉపాధి పొందుతున్న యువత వలన రాజ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు ఎపుడైన తీవ్రవాద మూకలుగా చెలరేగితే తప్ప. అందుకే రాజ్యం వాటిని చూసీ చూడనట్టు ఉంటుంది. అంటే పరోక్షంగా ప్రోత్సహిస్తూంది. ఇపుడు మత సంస్థలనే మూసివేస్తే లక్షల సంఖ్యలో యువతకు ప్రభుత్వం పని కల్పించాల్సి ఉంటుంది. మత శిక్షణ పొందని నిరుపేద యువత డ్రగ్స్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి పనుల ద్వారా ఉపాధి పొందుతారు. వీరి వలనా ప్రభుత్వాలకు పెద్ద నష్టం ఉండదనే చెప్పాలి.

ఒక దేశంలో నియుద్యోగ యువత మత తీవ్రవాదం వైపు పోయే కంటే హత్యలూ, మానభంగాలూ, డ్రగ్స్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్, ప్రాస్టిట్యూషన్ వంటి అరాచకత్వం వాటి వైపు పోవడాన్ని అమెరికా, ఇండియా వంటి ఆధునిక సెక్యులర్ దేశాలు పరోక్షంగానైనా ప్రోత్సహిస్తాయి. వీటికి సంబంధించిన సంఘటనలు జరిగినపుడు కంటి తుడుపు చర్యలతో వాటిని పరోక్షంగా ప్రోత్సహిస్తాయి. మత తీవ్రవాదం కంటే ఇవి తక్కువ తీవ్రత కలిగినవిగా గుర్తిస్తాయి. రైడ్ లు చేయడమూ, కేసులు పెట్టడమూ, తీర్పులు వెలువరించడమూ, జైలుకు పంపడమూ, ఇత్యాది ద్వారా న్యాయ పోలీసు శాఖలకు పని కల్పించడమూ. దేరీస్ నో అండర్ వరల్డ్ విథౌట్ యాన్ ఓవర్ వరల్డ్ అని ఓ పెద్దాయన మాట. నిజానికి డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టడం ప్రభుత్వానికి చేతనవును. కానీ చేయదు. ఆల్కాహాల్ ను పూర్తిగా బ్యాన్ చేయలేదు. ఆల్కాహాల్ వలన మానభంగాలు పెరుగుతుంటాయని తెలిసినా, వాటిని పూర్తిగా నిర్మూలించలేదు. టీవీ సీరియల్స్ లో తాగే సీన్స్లలో కాషన్ నోటీస్ వేయకపోవడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి ఊరుకుంటుంది. అండర్ వరల్డ్ కీ ఓవర్ వరల్డ్ కీ సంబంధాలు చాలా డైరెక్టుగానే ఉంటాయి. డీమోనెటైజేషన్ జరగగానే, ఇండ్ల స్థలాల రిజిసట్రేషన్స్ తగ్గి పోవడం జరుగుతుంది. అయినా ప్రభుత్వం చెడునంతా కడగటం కోసమే అని నమ్మ బలుకుతుంది. చెడును అపుడపుడూ అదిలిస్తూండటం ద్వారా ప్రభుత్వాలు తాము పని చేస్తున్నాయని నిరూపించుకుంటూంటాయి, మనుషులు చేసిన దేవుడు, తానే దుష్టులను పుట్టించి తానే సంహరించి ఆ విధంగా తన ఉనికిని చాటుకుంటున్నట్టు. అవినీతి పై యుద్ధం, అరాచకత్వం పై యుద్ధం వంటివి యుద్ధాన్ని నిరంతరం కొనసాగించటానికే తప్ప యుద్ధాన్ని అంతం చేయడానికి కాదు. యుద్ధం విషయంలో అబ్రహం లింకన్ మాటలను ఈ సందర్భంగా చెప్పుకోవాలి.There is  no honorable way to kill , no gentle  way to destroy, there is nothing good in war except its ending. అది ఏ యుద్ధమైనా అంతే.

8/5/17
Virinchi Virivinti
సినిమా( బాహుబలి )కళ, కళాత్మకత
 ----------------------------------------

ఈ మధ్య వస్తున్న సినిమాలను చూస్తున్నపుడు, రియాలిటీని సబ్వర్ట్ చేయడం ఆర్ట్ కి ఉన్న బలమూ అదేవిధంగా బలహీనత కూడా అనిపిస్తూంటుంది. అందుకేనేమో ప్లేటో తన 'రిపబ్లిక్' లో కవులకూ కళాకారులకూ స్థానమే లేదుపొమ్మన్నాడు. ఒక సినిమాలోని ప్రతీ దృశ్యమూ డైరెక్టర్ యొక్క ఊహా శక్తి ఫలితమని , సినిమా ప్రత్యక్షంగా దర్శకుడి ప్రతిభ మాత్రమే అని, సినిమాలోని మిగిలిన కళాకారులు కేవలం పరోక్ష సహాయకారులేననీ చెప్పేది 'థియరీ ఆఫ్ ఆటరిజం(Theory of Auterism)'. 1967లో రోలాండ్ బార్థెస్(Roland Barthes) రాసిన వ్యాసం డెత్ ఆఫ్ ఆథర్( death of Author) అందరికీ అర్థమవడం జరిగిన తరువాత, ఈ ఆటరిజం చాలా చర్చనీయాంశమయింది. పోస్ట్ మోడెర్న్(post modern) థాట్ ని ప్రోత్సహించిన ఈ వ్యాసం, సినిమా ను కళ లనూ కూడా ప్రభావితం చేసింది. ఆటరిజం చెప్పినట్టు సినిమాను కేవలం దర్శకుడి మేథావిత్వపు ప్రొడక్ట్ గా మాత్రమే కాక, దానిని ఆ కాలపు పరిస్థితులకూ, సామాజిక సందర్భానికీ అనుగుణంగా వచ్చిన ప్రొడక్ట్ గా చూడాలనే అంశం తెరమీదకి వచ్చింది. పలానా సినిమాను దర్శకుడు ఆ విధంగా తీయడానికి ఆ కాలపు పరిస్థితులేమిటన్నది చర్చగా మారింది.

ప్రస్థుతం మన సమాజం హేతుబద్ధత వైపు కాకుండా, మనం ఎలా 'ఫీల్ (Feel)' అవుతామనే అంశం మీదే ఆధారపడి నిర్మితమై ఉంది. ఒక విషయం పట్ల నేను ఎలా ఫీలవుతాను, ఇంకొకరు ఎలా ఫీలవుతారు, మెజారిటీ సమాజ సభ్యులు ఎలా ఫీలవుతారు అనే అంశం ఆధారంగా నిర్మించబడుతోంది. మనం ఒక విషయం పట్ల 'ఎలా ఆలోచిస్తాం' అనేదానికంటే, 'ఎలా ఫీలవుతాం' అనేది ముఖ్యమయింది. ఆలోచనను అనుభూతి సబ్జుగేట్(subjugate) చేసేసింది. ఇపుడు మనకు ఆలోచనకంటే అనుభూతి, ఫీల్ ముఖ్యమైపోయింది. ఆలోచన హేతుబద్ధత వైపు పయనిస్తే అనుభూతి నమ్మకాల వైపు పయనింపజేస్తుంది. అనుభూతి పరమైన సమాజాన్ని కండీషనింగ్(conditioning) చేయడం చాలా సులభం. అందుకే మనకెన్నో అడ్వర్టైజ్మెంట్లు. కాపిటలిస్ట్ సొసైటీ, కాపిటలిస్ట్ వ్యాపారం, కాపిటలిస్ట్ రాజకీయాలూ' అనుభూతి'ని అందలం ఎక్కిస్తాయి. మనుషులందరూ అనుభూతి చెందుతారు. ఆ అనుభూతి, ఫీల్ నే అసలు సత్యమనుకోవడమూ ఉంటుంది. ఒక గాడిదను కట్టేసి గుర్రమని అనుభూతి చెందిన సమాజం, దానిని గుర్రమనే నమ్ముతుంది. వ్యాపారం చేసి గాడిదను అమ్మాలనుకునే వాడికి మనం ఆలోచనతో అది గాడిదలా గుర్తించడం కంటే అనుభూతితో గుర్రమని భావించేలా చేయగలగడమే కదా కావాలి. గాడిదను గుర్రమని నమ్మించడానికి దానిని అలా అనుభూతి చెందగల సమాజం కావాలి. అందం అంటేనే సత్యమనీ, సత్యమంటేనే అందమనీ, రిలీజియస్ గా నమ్మిన గ్రీకులూ ఒకప్పుడుండేవారు.( కీట్సు కవీ 'ఓడ్ ఆన్ ఏ గ్రీషియన్ అర్న్( Ode on a Grecian Urn) ' లో ఇదే పాడాడు. 'అందమే ఆనందమ'నీ మన తెలుగు కవులూ పాడారు). మరలా మనం ఇపుడు సరిగ్గా అటువంటి సమాజంలో ఉన్నాం. ఇటువంటి సమాజంలో మనుషులనూ కుక్కలనూ దాదాపు ఒకే విధంగా ట్రైన్ చేయవచ్చు. 'కుక్క వంటి విశ్వాసం' అనేది అనుభూతి వలన వచ్చేదే తప్ప ఆలోచనతో వచ్చేదేమీ కాదు కాబట్టి.

ఒక సినిమా చూసిన తరువాత 'ఏమని ఆలోచించావు' అని ఎవరూ అడగరు. 'ఎలా ఫీలయ్యావు' అనేదే అడుగుతారు. ఇపుడు ఆ ఫీలింగుకే పట్టంగట్టడం దర్శక మేధావులు చేయగలిగిన వ్యాపారం. శంకరా భరణం సినిమాలోలాగా "శుద్ధ హిందోళంలోకి ఆ రిషభం ఎలా వచ్చింది?" అని శంకర శాస్త్రి అడిగినట్టు, "పోస్ట్ మోడెర్న్ థాట్ ప్రాసెస్ లోకి కాల్పనికత ఎలా వచ్చి చేరింద"ని మనం ప్రశ్నించుకుంటే, బాహుబలి సినిమా సక్సెస్ కావడంలో మనం అందలమెక్కించుకున్న 'ఫీలింగ్' పాత్ర అర్థమౌతుంది. గంటకొట్టగానే జఠర రసం కార్చిన పావ్లోవ్ కండీషన్డ్ కుక్కకీ, సినిమా తీయగానే మనం కార్చే అనుభూతి రసానికీ దగ్గరి సంబంధం ఉంది. ఇది అర్థం చేసుకుంటే వీరాభిమానం పేరుతో కళను కళగా చూడాలనే ఊహతో, సినిమాను సినిమాలాగా చూడాలనే మిషతో చేసే సకల వాదాలూ అర్థమౌతాయి. సినిమా కళే అసలైన కళ అనుకునే వారికీ, సాంఘిక ప్రయోజనం లేనిదే కళ కాదనే వారికీ కాంట్  (Kant) చెప్పిన  'నిజమైన కళ' నిర్వచనం గానీ, దాని సకలాతీత(transcendental) స్థితిగానీ,  దాని ప్రయోజన రహిత ప్రయోజనాత్మకత(purposiveless purposiveness)  గానీ, అర్థం కావు. అంతేకాకుండా నిజ జీవిత ఒత్తిడితో నలిగిపోయిన కాపిటలిస్ట్ సొసైటీలో ఆలోచనకు బదులుగా 'ఫీలింగు' నిర్వహించే తాత్కాలిక ఉపశమన పాత్ర విస్మరించదగినదసలే కాదు కూడా. అందుకే దర్శక నిర్మాతల దృష్టి రియాలిటీని తమ కళాసృష్టి లో సబ్వర్ట్ (subvert) చేయడంలో కనిపిస్తుంది. పైన చెప్పినట్టు ఇది వ్యాపారాత్మకంగా వారి బలమూ, సామాజికపరంగా మన బలహీనతా కూడా.

ఓవర్ వెల్మింగ్ టెక్నాలజీ( Overwhelming Technology) మనలను వర్చువల్ రియాలిటీకి(Virtual reality) పరిచయం చేయడమే కాకుండా భౌతిక శాస్త్రాన్ని(physics) బలహీన పరిచింది కూడా. సిములేటెడ్ ప్రపంచంలో మనం భౌతికతను మరిచి పోయి, కేవలం టెక్నాలజీ అందించిన వర్చువల్ మెటీరియలిజాన్ని నమ్ముతున్నాం. ఒక కుర్చీని తయారు చేసే భౌతిక విద్యను ఒక కళగా అభ్యసించిన విద్యార్థి ఉన్నాడనుకుందాం.  'కూర్చోవడం' కుర్చీ సాంఘిక ప్రయోజనమనుకుంటే కుర్చీని కేవలం కూర్చోవడానికి అనువుగా చెక్కితే సరిపోతుంది కానీ కళాకారుడు దానికి నగిషీలు చెక్కి రంగులు వేసి అందంగా మలిచాడనుకుందాం. ఇలా చేయడం వలన కుర్చీ సాంఘిక ప్రయోజనం అయిన 'కూర్చోవడం' ఏమీ మారదు. కూర్చోవడం కాస్తా పడుకోవడంగా ఠకీమని ఐపోదు. అంటే కళకూ కళాత్మకతకూ సాంఘిక ప్రయోజనానికి మించిన ప్రయోజనం ఉంది. కానీ ఇపుడు కుర్చీని ఒకడు కంప్యూటర్లో గ్రాఫిక్స్ సహాయంతో సృష్టించాడనుకుందాం. దీనిని  'కళ' అనుకుంటే దాని సాంఘిక ప్రయోజనమైన కూర్చోవటం అన్నది ఇపుడేం కావాలి?. ఒకవేళ దీనిని 'కళ కాదు' అనుకుంటే మరి అసలు కళ అనేదెక్కడుందనే ప్రశ్న వస్తుంది. "దో ఆంఖే బారాహ్ హాత్" సినిమాలో బొమ్మ ఎద్దుతో చేసిన బుల్ ఫైటు చాలా ఎబ్బెట్టుగా వచ్చిందని, నిజమైన ఎద్దుతో తల పడతానని , రీ షూట్ చేయడానికి సిద్ధమయ్యాడు దర్శకుడు కథానాయకుడూ ఐన వి. శాంతారాం. కళ లోని స్వచ్ఛతను ప్రిసర్వ్ చేయడం కోసం అతడు నిజమైన ఆ బుల్ ఫైట్ లో కంటి చూపునూ కోల్పోవలసి వచ్చింది. ఇపుడు మనం డిజిటల్ గ్రాఫిక్స్ లో చూపించినదే కళాత్మకత అంటూన్నామంటే పిల్లొచ్చి గుడ్డును వెక్కిరించినట్టుగా భౌతిక శాస్త్రాన్ని టెక్నాలజీ ధిక్కరించినట్టుగా ఔతుంది. బ్లూమ్యాట్ లో, గ్రాఫిక్స్ అండతో, 'లేని దానిని' సిములేట్ చేసే డిసెప్టివ్ వర్చువల్ ప్రపంచంలో కళ దాని స్వంత పర్పస్ తో బతుకుతోందా?. సినిమా సినిమాలాగా బతుకుతోందా వ్యాపారంలాగా బతుకుతోందా అనేది తరచి చూచినపుడు దర్శకుడి కళా ప్రతిభ అతడి వర్చువల్ గ్రాఫికల్ డిపెండెన్సీ (Virtual graphical dependency) వలన తేలిపోతుందనేది గ్రహించాలి. గ్రాఫిక్స్ కోసం కథ రాసుకునే పరిస్థితుల వలన "థియరీ ఆఫ్ ఆటరిజం" ఇప్పటి వర్చువల్ డిపెండెన్సీ యుగంలో మరలా చర్చనీయాంశం కాబోతోంది.

10/5/17
విరించి విరివింటి

Friday, 5 May 2017

విరించి ll   పిల్లల పాట  ll
____________________________

టీచరులారా ప్రపంచం ముసలిగయ్యింది
కొంత బాల్యం కావాలిపుడు
చదువులూ ఉద్యోగాలూ ఉద్యమాలూ వదిలి
కేరింతలు కొట్టే ఆటలు కావాలిపుడు

ఒప్పుకుదాం టీచరు మహాశయా..!
నీవొక డాక్టరునో ఇంజనీరునో ఇంకొకరినో తయారు చేయగలవని.
ఒక పరిపూర్ణ బాల్యాన్ని తయారు చేయగలవా చెప్పు?

ఎండాకాలం సెలవుల్లో కూడా హోం వర్క్ రాసిచ్చే మీకు
భవిష్యత్తంటే ఒక రిసెషన్ కావచ్చు, యుద్ధమూ కావచ్చు, మరణమూ కావచ్చు
పొద్దున నిద్రలేవాలంటే కునుకుపాట్లు పడే బుజ్జిగాడికి
మరో రోజంటే ఎంత విసుగో ఎపుడైనా చూశారా?.

ఎండాకాలం మీకు చెమటా, చిరాకూ, అలసటా కావచ్చు.
కానీ ఎండాకాలపు సూరీడు పిల్లల చేతిలోని టార్చిలైటు
కావాలంటే చూడండి
మిట్ట మధ్యాహ్నం ఆటలో వాళ్ళు ప్రపంచాల్ని వెతుకుతున్నారు

దూరపు నక్షత్రాలను చూసినపుడు
మీ మనసులెంతగా తెరుస్తారో అంత చిన్న పిల్లలౌతారు
దగ్గరి నక్షత్రాలైన పిల్లలను ఎంత చిన్న పిల్లల్లా చూస్తారో
అంతగా మనసు పూవులై విచ్చుకుంటారు

అందుకే ఇపుడు పిల్లలతో కలిసి
పిల్లల్లాగే గట్టిగా అరుస్తూ ఈ మాటల్ని పాడుకుందాం.
నల్లబల్లలూ, చాక్ పీసులూ, స్కేలు బెత్తాలూ, హోంవర్క్ లూ
ఈ ఎండకు కాలి బూడిదైపోనీ..
ఆటలాడే పిల్లల కాళ్ళ కింద పడి నలిగిపోనీ..

5/5/17

Monday, 1 May 2017

సాములోరి ఆధ్యాత్మిక ఉచిత సలహాల మీద....

"ఆకలి, అజ్ఞానంతో అలమటిస్తున్న కోట్లాది ప్రజలు ఒకవైపుండగా, వారి శ్రమను ఆధారం చేసుకుని విద్యావంతులైన ప్రతీవాడూ నేరగాడే, ఇటువంటి ఉన్నత వర్గ విద్యావంతులందరూ పది వేల సంవత్సరాలనాటి మమ్మీలే"..అన్నాడు వివేకానందుడు. అటువంటి మమ్మీ ఇపుడు 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' పేరుతో కలియతిరుగుతూ,  రైతుల ఆత్మ హత్యలకు ఆధ్యాత్మిక లోపం కూడా ఒక కారణం అంటోందిపుడు. ప్రసంగాలు చేస్తూ కడుపులు నింపుకుంటున్న ఈ బుద్ధావతారాలకు తిన్నది సరిపోలేదేమో ఇపుడు రైతుల మీద పడి దోచుకునే పనిలో పడ్డారు. "ఆకలితో ఉన్న వాడికి గీతా బోధనలు కూడదన్నాడు" వివేకానందుడు. శ్రీ రవి శంకర్ ఇపుడు ఏకంగా యోగా ధ్యానాదులు నేర్పిస్తానంటాడు. సమస్యల పట్ల అవగాహనా లేమితనంతో ఈ స్వాములంగారు వాక్రుచ్చే సూచనలు వారి సామాజిక స్పృహలోని లోతులేనితనాన్ని తెలపటమే కాకుండా, వారిని నవ్వులపాలు కూడా చేస్తూ ఉంటుంది.  అసలు భారతదేశంలో యోగా అభివృద్ధి చెందడానికి ఇక్కడి పేదరికమే కారణం అనేది పాశ్చాత్యుల అవగాహన. తినడానికి తిండిలేని అర్భకులు యోగా పేరుతో కఠిన నియమాలు పాటిస్తూ, రోజుకు ఒక పూటనే తింటూ, పస్తులను 'పవిత్ర ఉపవాసాలు'గా మలుచుకునేవారనీ, ఆ విధంగా ఆకలి బాధలను అధిగమించే వారు కాబట్టే ఎండమిక్ గా ఉన్న క్షుద్భాధ ఈ దేశంలో యోగా వ్యాప్తి చెందటానికి ఉపయోగ పడిందన్నది వారి అవగాహన. బహుశా అందుకేనేమో "ఒక పూట తినే వాడు యోగి, రెండు పూటలు తినేవాడు భోగి, మూడు పూటలు తినేవాడు రోగి" వంటి నానుడులు పుట్టి వుంటాయి. ఈ రోజుటికీ ప్రతీ రోజు రాత్రికి పస్తులు పడుకుంటున్న భారతీయుల సంఖ్య ఇరవై కోట్లు. వీరినందరినీ తన శిష్యులుగా మలుచుకుంటే..వీరందరికీ యోగా నేర్పిస్తే..అనే క్షుద్ర ఆలోచన వచ్చిన శ్రీ రవి శంకర్ నిజంగా ధన్య జీవనే చెప్పాలి. బతికుండగా మమ్మీ కావడం బహు అరుదైన విషయం కాబట్టి.

గమనిస్తే యోగా మెడిటేషన్ వంటి సంప్రదాయాలు ప్రాక్ పశ్చిమ దేశాలలోని ఆశ్రమాలనుండి వచ్చినట్టుగా ఉంటుంది. మనదేశంలో ఎన్నో ఆశ్రమాలుండేవి, అందులో వందల సంఖ్యల్లో జనులూ ఉండేవారు. (ముఖ్యంగా మన దేశంలో బౌద్ధం ప్రబలిన తరువాత బౌద్ధారామాలు, కాషాయ వస్త్ర ధారణలూ పెరిగిపోయాయి. ప్రతీ ఒక్కరూ సన్యాసం తీసుకోవడం ఆ రోజుల్లో ఒక కల్ట్ ఫ్యాషన్ గా మారేసరికి వేలలో ఆశ్రమాలూ మొదలయాయి. నేటికీ పాశ్చాత్యులు యోగా ధ్యానాదులు టిబెటియన్ బౌద్ధానికి సంబంధించినవే అనుకుంటారు తప్ప భారత హిందువులకు సంబంధించినది అనుకోరు. ఇపుడు ఏలినవారు యోగా అనగానే టిబెట్ కాకుండా ఇండియా గుర్తుకు వచ్చేలా ప్రయత్నాలూ ముమ్మరం చేశారు.) ప్రతీ ఒక్కరికీ ఆకలి తప్పని పరిస్థితి అనుకుంటే ఇంత మందికి ఆహారం పెట్టగలగటం  ఆశ్రమ నిర్వాహకులకు పెద్ద పరీక్షే. ఆశ్రమ పెద్దయినటువంటి గురువుగారికి చాలా ఖర్చుతో కూడుకున్న విషయమే. అరకొర సౌకర్యాలూ, ఈతిబాధలూ ఎలాగూ ఉండేవి. ఇంత మందిలో కొంత మంది ముఖ్యంగా పిల్లలు మాత్రమే తిని మిగితా వారంతా ఏదో ఒక వ్యాపకంలో పడి ఆకలిని మరచి పోవాలంటే ఏమి చేస్తే బాగుంటుందనేది ఆశ్రమ నిర్వాహకుల ప్రధాన సమస్య. ఇంకా పుస్తకాలూ, ఫేస్బుక్ లూ, ఈడియట్ బాక్సులూ లేని కాలంలో, ఇంత మందిని ఏదో ఒక ఆకలి కానివ్వని వ్యాపకంలో పెట్టడం తప్పనిసరైంది. పని చేయించుకుని తగిన ఆహారం ఇవ్వక పోతే ఆశ్రమ వాసులు గోల చేస్తారు. బయటి ఏ శారీరక పనైనా ఆకలిని పెంచక తప్పదు. అందుకే ఓ మూలకు ముక్కు మూసుకుని మాట్లాడకుండా, అన్నం పెట్టడం లేదేంటని గోల చేయకుండా ఉంచాలంటే ఏం చెయాలి అని ఆలోచించినపుడు ప్రాణాయామం, ధ్యానం వంటి కూర్చుని ఆపసోపాలు పడే టెక్నిక్ లు కనుగోబడ్డాయి. యోగి అనిపించుకోవాలంటే వీలయినంత తక్కువ తినాలి. బేసిక్ మెటబాలిక్ రేటు తగ్గాలంటే శ్వాసను వీలయినంత మెల్లగా పీల్చి వదులుతుండాలి. భగవంతుడి మీదనో శ్వాస మీదనో ధ్యాసను మరలించాలి. ఎంత ఎక్కువ సేపు ధ్యానాదులు చేస్తే అంతెక్కువ శక్తి వస్తుందనీ నమ్మించాలి. ఈ విధంగా ఆశ్రమ నిర్వాహకులు ఖర్చులు తగ్గించుకుని సమర్థవంతంగా ఆశ్రమాలు,నడపగలిగేసరికీ రోజు రోజుకీ ఆశ్రమ వాసులు పెరిగిపోయేవారు. వారి తాకిడిని తగ్గించడానికి ఆశ్రమాల్లో,యోగా మెడిటేషన్ చుట్టూ కఠినాతి కఠినమైన నియమాలూ ఏర్పడటం మొదలైంది. బ్రహ్మచర్యాది యమనియమాదులూ ఇత్యాదివి. లావు మనుషులు అతిగా తినకుండా ఉండాలంటే వారిని ఆశ్రమం లో నుండి బయటకి ఉరికించేలా చేయాలంటే అష్ట వంకరలుగా తిరిగి, తలకిందులైపోయే ఆసనాలు వేయించాలి. బీదరికంతో కునారిల్లే ఆశ్రమాలలో  పరిస్థితులు మరోలా ఉండెవి. ఆశ్రమ వాసులు ప్రాణాయామంతో హైపర్ వెంటిలేట్ చేయడం వలన, పూరక రేచక కుంభకాల్లో కుంభకానికి అతి ప్రాధాన్యం ఇవ్వడం వలనా రక్తంలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరిగి ఒకరకమైన ఉన్మత్త స్థితికి జారిపోయేవారు. రక్తంలో ఒకటి నుండి ఎనిమిది శాతం వరకూ చేరిన కార్బన్ డై ఆక్సైడ్ వివిధ రకాల ఉన్మత్తాలకు గురిచేసేది. ఎనిమిది శాతం దాటిన వారిలో మెదడు పూర్తిగా స్పృహ కోల్పోయే పరిస్థితి ఉండేది. అదే అలౌకికానందం అనుకున్నారు. కొంత సమయం గడిచిన తరువాత కార్బన్ డై ఆక్సైడ్ లెవెల్స్ సాధారణ స్థితికి వచ్చేశాక తిరిగి మామూలు స్థితికి చేరుకునే వారు. (బహుశా ఇటువంటి చెడు ప్రభావాలు గమనించేమో తరువాతి యోగా స్కూల్సు కుంభకాన్ని అవసరం లేదన్నాయి, రేచకానికి అధిక ప్రాధాన్యత కలిగించాయి. దీనివలన కూడా ప్రమాదం లేకపోలేదు, అతిగా కార్బన్ డై ఆక్సైడ్ వాషవుట్ అవడం శ్వాస ప్రక్రియనే అకస్మాత్తుగా ఆపేయనూ గలదు. కానీ సహజంగానే ఎవ్వరైనాగానీ, రేచక ప్రక్రియ ఎక్కవ సేపు కొనసాగించలేరు గనుక ఒక విధంగా అంత ప్రమాద భరితం కాదనే చెప్పాలి). ధ్యానంలో కూర్చుని ఊపిరి బిగబడితే మొదట వచ్చే నిద్రకు కారణం తక్కువ మోతాదులో కార్బన్ డై ఆక్సైడ్ రక్తంలో చేరడం. ఈ కునుకుతీత అసలు నిద్రలోని ఆర్.ఈ.ఎమ్. స్టేజి నిద్రతో సరితూగుతుంది కాబట్టి ఒక రకమైన స్వప్నావస్థను కలిగిస్తుంది. ఆర్. ఈ. ఎమ్ నిద్రలోనే మనకు స్వప్నాలు వస్తాయి. వీటిని సాధకులు మెడిటేషన్ వలన కలిగిన దివ్యానుభూతులని సంబరపడిపోవడం జరుగుతూ  ఉంటుంది. మెడిటేషన్ కి ముందే దైవ సంబంధ విషయాలపై ట్యూన్ అయి వుంటారు కాబట్టి అది ప్రీ హిప్నోటిక్ స్టేజ్ గా పని చేసి, ఈ స్వప్నావస్థలో దైవ సంబంధమైన విషయాలు కనిపించేస్తూ ఉంటాయి. ఇక సాధకులు మెడిటేషన్ లో తమకు దైవ దర్శనం కలిగిందనీ, దైవ సందేశం వినిపించిందనీ ఆనందపడిపోవటమూ చూస్తూ ఉంటాం. ఇటువంటివన్నీ ఆ ఆశ్రమం లోని గురువర్యుల చలవగా ఆశీర్వాద ఫలంగా తపశ్శక్తిగా కీర్తించ బడుతూ  ఉంటుంది. అది ఆ ఆశ్రమంలో తక్కువ ఖర్చుతో జీవితం వెళ్ళబుచ్చటానికి అవసరమైన భూమికను కలగజేస్తుంటుంది. ఈ విధంగా ఆశ్రమ మేనేజ్మెంటు వారు ఖర్చులు తగ్గించుకోవడానికి కనిపెట్టిన కొత్త రూల్సుతో ఆశ్రమాలు చక్కగా నడిచేవని చెప్పాలి.

ఇపుడు శ్రీ రవి శంకర్ ఆధ్యాత్మిక గురువవుతాడా లేక యోగా గురువవుతాడా చెప్పడం కష్టమేమీకాదు. ఆయన ఆధ్యాత్మికనంతా యోగా ధ్యానాదులకే అపాదించేస్తాడు. ఆయనే కాదు ఆధ్యాత్మికత అంటే యోగా,యోగా అంటే ఆధ్యాత్మికత అనేది దాదాపు సో కాల్డ్ గురువర్యుల చింతన ప్రస్తుతానికి. అంతే కాకుండా ఒకప్పటిలా ఆశ్రమ వాసుల ఆకలికి ప్రత్యామనాయంగా కనుగొనబడిన యోగా, ఇపుడు ఆశ్రమ నిర్వాహకుల ధనాకలికి అనుగుణంగా వాడుకోబడుతుంది. యోగా ధ్యానాదులతో ప్రయోజనాలు లేవా అంటే ఉన్నాయి. శరీరాన్ని పలు విధాలుగా వంచగల, మౌనంగా కాసేపు ఆలోచించగల ఏ విషయమైనా యోగా ధ్యానంలవలె మనిషికి మంచే చేస్తుంది. అనవసర ఆలోచనలతో స్ట్రెస్ తో సతమతమయ్యే సగటు మానవునికి యమాది కఠిన నియమాలు కొంత వరకు ఉపశమనాన్ని కలిగించగలవు. లేటెస్ట్ గా యమాది నియమాలు కుదరవు కాబట్టి, పది ఆసనాలు, ఐదు రకాల ప్రాణాయామాలు, కొంత సేపు ధ్యానమూ వంటి ప్యాకేజీలూ ముందుకొచ్చేశాయి. అయితే జీవితంలోని అసలు సమస్యలు వదిలేసి ఈ యోగాది కార్యక్రమాలలోకి పలాయనం చెంది జీవించే వారూ లేకపోలేదు. ప్రతీ సమస్యకూ యోగాలో దివ్యమైన పరిష్కారం దొరుకుతుందని చెప్పేవారూ పెరిగిపోయారు. ఎయిడ్స్ కాన్సరు వంటి భయానక జబ్బులకూ ఈ జబ్బును పాకించారు. అంతే కాకుండా రజినీష్, మహేశ్ యోగీ, దీపక్ మహతా, యోగానంద వంటి వారి పుణ్యమాని "న్యూ ఏజ్ రిలీజియస్ కల్చర్" పాశ్చాత్య దేశాల్లో వేళ్ళూనుకుంటుండటంతో, రవిశంకర్ వంటి యోగా గురువులకూ అక్కడ గిరాకీ పెరిగింది. ఏ యోగా గురువు దెగ్గర చూసినా ముందు వరసల్లో వందల సంఖ్యలో ఫారీనర్స్ దర్శనమిస్తూంటారు. "ఆయనంటే ఏమనుకున్నావు..ఎంత మంది ఫారినర్స్ ఆయన దగ్గరికి వస్తుంటారు తెలుసా, ఏం వాళ్ళంతా పిచ్చోళ్ళా..?" అని పరమ భక్తులు మనమెపుడయినా ఆయన్ని శంకిస్తే వాపోతూంటారు. ఫారినర్స్ ముందు వరసలో ఉన్నారంటే ఆ గురువు పరమ ఉత్కృష్టమైన గురువనే నికృష్ట భావనలూ అధికమయ్యాయి. ఈ మెడిటేషన్ కునుకులల్లో వచ్చే పిచ్చి కలలను గొప్ప దివ్యానుభూతులని నమ్మేస్తూ, అవి కనిపించటం వెనుక ఉన్న అంతరార్థమేమిటని పిచ్చి భక్తులు అడుగుతుండగా, ఆకుకు అతకక పోకకు పొసగకా గురువర్యులం గారు సమాధానాలూ ఇస్తుంటారు. అదంతా భగవంతుడి కృపకంటే ఆ గురువర్యుని కృపే అనుకోవడమూ కద్దు. వారి వస్త్రాల మీద, ఇండ్లల్లో భగవంతుడి ఫోటోలకంటే ఈ గురువర్యుల ఫోటోలే ఎక్కువగా ఉంటాయనంలో సందేహమూ లేదు.

శ్రీ రవి శంకర్ వంటి యోగా గురువులు ప్రభుత్వ వేదికల మీద కనబడటంలో ఏలుతున్న వారి పాత్ర కంటే గత కాలపు మౌలిక రాజకీయ శక్తుల ఫెయిల్యూర్ ని సూచిస్తుంది. మొదటి సహస్రాబ్దిలో రోమ్ లో రాజకీయ శక్తులు బలహీన పడి విచ్ఛిన్నం చెందటం వలననే రోమన్ కాథలిక్ మత శక్తులు బలం పుంజుకున్నాయనేది నిష్ఠుర సత్యం. క్రూసేడులూ ఇటువంటి మత, రాజకీయ శక్తుల పరస్పర బలాల బేరీజుల్లోనే జరిగిపోయాయి. ఇపుడు శ్రీ రవి శంకర్ వంటి వారి వేదికా వైభవాలకు కుటుంబ రాజకీయ వ్యవస్థల వైఫల్యమే ప్రధాన కారణమనీ చెప్పవచ్చు. రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన విషయంలో ఇపుడు శ్రీ రవిశంకర్ అసంబద్ధ సూచనలను కేవలం ఒక రాజకీయ వర్గపు బలాఢ్యతగా మాత్రమే పరిగణ చేసి లెక్కించడం, మరొక రాజకీయ వర్గపు బలహీనతను చూడకపోవడమే అవుతుంది. రైతు ఆత్మహత్యల వంటి సీరియస్ సమస్యకు ఆధ్యాత్మికం వంటి పైపై పరిష్కారాలు చెప్పడం  బహుశా మన రాజకీయాల  "ఆల్ ఈజ్ వెల్" ధోరణిని చూపిస్తుంది. అంతా బాగుంది గానీ అల్లుని నోట్లో శని ఉంది కాబట్టే ఇలా జరిగింది కనుక శని గ్రహ శాంతి చేస్తే సరిపోతుందన్నట్టు, సమస్య మూలాలను వదిలి పూజా పునస్కారాలు చేసుకుంటే ఆత్మహత్యలు తగ్గుతాయని చెప్పడం చాలా దారుణమైన విషయం. ఒక వేళ ఈ స్వాములం వారు చెప్పినట్లు ఈ పొర్లు దండాలు ఆత్మహత్యలను నిజంగా ఆపేసేవే అనుకున్నా, అది కేవలం పాలకులకు వారి నిష్క్రియా పరత్వాన్ని తేలికచేసి, మొత్తానికే తప్పుదారి పట్టించి సమస్య తీవ్రతను ఇంకా పెంచేదిగా మాత్రమే మారుతుంది తప్ప మరోటి కాదు. నిజంగానే యోగాది కార్యక్రమాలకు మనిషిలో మార్పు తీసుకు రాగల శక్తే ఉంటే, మైకుల ముందు కోట్ల సంఖ్యలో ఉన్న రైతులకు ఉచిత సలహాలు ఇచ్చే బదులు వందల సంఖ్యలో ఉన్న రాజకీయ దురంధరులకు సలహాలిచ్చి రైతు సమస్యలపట్ల చిత్తశుద్ధి కలిగుండేలా వారి బుద్ధులను మార్చమని శ్రీ రవి శంకర్ సాములోరికి మా ప్రార్థన.

విరించి విరివింటి
1/5/17
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ మీద వివాదాలు అనవసరం.
చలన చిత్ర పరిశ్రమ ఇండియాలో ఎదగడానికి కృషి చేసిన వారికే అది ఇవ్వబడుతుంది.
కె. విశ్వనాథ్ అద్భుతమైన సాంఘిక సినిమాలు తీయలేదని, అతనికి ఇవ్వడంలో ఏవో మతలబులున్నాయనీ గొంతు చించుకునేవారికి ఒకమాట...
"సాంఘిక సినిమాలు తీసిన వారికే ఈ అవార్డు ఇస్తాం " అని ఎక్కడా ప్రకటించబడలేదు అనే విషయం గుర్తించాలి. కేవలం అటువంటి సినిమాలకోసమే అవార్డు ఇచ్చేటట్టుగా ఒక కొత్త అవార్డును మీరు మొదలుపెడితే బాగుంటుంది. అది అవసరం కూడా.
ఇక విశ్వనాథ్ కేవలం ఒక వర్గానికి చెందిన,ఒక సాంప్రదాయానికి చెందిన సినిమాలే తీసారనడంలో ఎటువంటి అనుమానమూ లేదు. కానీ అలా తీస్తే అవార్డులు ఇవ్వకూడదని దాదాసాహెబ్ అవార్డు కమిటీలు మడి కట్టుకోలేదనే విషయమూ గమనించాలి. ఇకపోతే కళాత్మక విలువలని కలిగి, సాహిత్య విలువలు కలిగి, బూతు, హింస ఇత్యాదివి లేకుండా, శృతి మించని హాస్యంతో, కుటుంబ సహితంగా కూర్చుని హాయిగా చూడగలిగిన సినిమాలు తీయటమే కాకుండా, ప్రయోగాలు చేయడం, వాటిని ప్రేక్షకులచే మెప్పింపజేసి విజయాలు సాధించడం, ఆ విధంగా నిర్మాతలను నిలబెట్టడం విశ్వనాథ్ గొప్పదనం. రొటీన్ కి భిన్నంగా ముసలివాడిని లీడ్ రోల్ లో పెట్టడం, అంధ, బదిర కథానాయక నాయికలతో అత్యద్భుత కళాత్మకతను ప్రదర్శించటం, పిచ్చి వాడిని కథానాయకుడిగా మలచగలగటం ఇటువంటిలెన్నో ఫార్ములాకు భిన్నంగా తీసి విజయం సాధించాడతడు. రొమాంటిసిజం సినిమా ఇండస్ట్రీని రాజ్యమేలె సమయంలో నిజ జీవితాలకు దూరమైన అవే కల్పనలతో అత్యంత అద్భుతాలని ఆయన తెరకెక్కించాడు. తెలుగులో కూడా కళాత్మక విలువలు గల సినిమాలు వస్తాయని అవీ ప్రేక్షకుల మన్ననలు అందుకోగలవనీ దేశానికి చాటిచెప్పాడు. ఇటువంటి సినిమా సాహసాలు చేసి అటు కమర్షియల్ గా ఇటు కళాత్మకంగా సక్సెస్ కావడం మామూలు విషయం కానేకాదు. కళాత్మక సినిమాలు కమర్షియల్ సినిమాలను కలపగగటం పెద్ద సాహసమే. అవి నిజానికి ఒకటే ఒరలో ఇమడలేని కత్తులుగా సినిమా పండితులు భావిస్తుంటారు.

ఇపుడున్న తెలుగు సినిమా వాతావరణం బూతు, హింస మాత్రమే కాక ఫార్ములా కథలనూ, ఫార్ములా కథనాలనూ మోసుకు తిరుగుతూంది. ఒక రకంగా అస్పష్టమైన రియలిజం ఇపిడిపుడు సినిమాల్లో కనిపిస్తున్నా, అది ఫార్ములాను దాటి బయటపడటం లేదు. రియలిస్టిక్ స్పృహ కేవలం పైపై విషయాలే నేటికీ మన సినిమాల్లో. కాలు కదిపితే టాటా సుమోలు పైకిలేచే ఊహల్లోనే ఇంకా మన దర్శకులూ, ప్రేక్షకులూ ఉన్నారు. ఒక హీరో ఇంట్రొడొక్షన్ సాంగు, కం ఫైటూ, హీరోయిన్ అందాల ఆరబోత, విలన్ హీరోయిన్ల రక్త సంబంధాలూ, నాలుగు ఫైట్లు, నాలుగు అర్థంలేని లేకి పాటలూ, ఒక ఐటం సాంగు, బీభత్సమైన క్లైమాక్సు, అర్థంకాని పాటలూ, సంగీతం పేరుతో శబ్దాల హోరూ... వంటి ఫార్ములాకు భిన్నంగా తీయగలిగిన దర్శక నిర్మాతలూ కరువయ్యారు. తీసి , బతికి బట్టగలిగిన వారు దాదాపూ లేరు. అటువంటి సమయంలో గత కాలపు సినిమాను రొటీన్ నుండి బయటపడేసి విజయాలు అందించిన కే. విశ్వనాథ్ కు ఇటువంటి సర్వోన్నత అవార్డు రావడం, సినిమా వర్గాలను కనీసం పునరాలోచించుకొనేలా చేయగలిగితే, మనం ముందు ముందు మంచి ప్రయోగాత్మక సినిమాలను చూడగలుగుతామేమో. ప్రయోగాలు చేయడం, కళాత్మక దృష్టితో మంచి సంగీత సాహిత్యాలు అందింటం, విలువలనూ హెల్తీ హాస్యాలనూ నమ్మడమూ, హింసా, బూతులను దూరం పెట్టడమూ వంటి సూత్రాలతో విశ్వనాథ్ విజయాలు సాధించినట్టయితే, తప్పకుండా సినిమా ఫీల్డ్ కి ఇదే అతడందించిన కాంట్రిబ్యూషన్ గా మనం గుర్తించాలి. కె.విశ్వనిథ్ గారిని దాదాసాహెబ్ అవార్డుతో గౌరవించటం, సినిమాల్లో కొత్తదనాన్ని, ప్రయోగాలను,విలువలనూ, సాహిత్య సంగీతాలనూ ఆహ్వానిండమే. కె. విశ్వనాథ్ గారికి శుభాకాంక్షలు.