Monday, 1 January 2024

ఆత్మహత్యలు. వ్యాసం. నవతెలంగాణాలో ప్రచురితం.

 ఆత్మహత్యయలపై ఒక అవగాహన.

ఇది తీవ్రమైన సమస్య అంటే ఎవరూ పట్టించుకోవడం లేదు అనిపిస్తుంది. ప్రభుత్వాలు మొద్దు నిద్ర పోతున్నాయి. సుసైడ్ నోట్ అని ఈ వ్యాసానికి నేను పేరు పెట్టుకున్నాను. సూసైడ్ నోట్ లో ఉండే అంశాలలో ఒక ప్యాటెర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ఎలా వచ్చిందో చెప్పడానికి చేసిన ఒక అనాలిసిస్ ఈ వ్యాసం. 


ఈ ప్రపంచంలో ప్రతీ సంవత్సరం సగటున పదిలక్షల మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. పరిష్కారంలేని సమస్యగా శతాబ్దాల తరబడి మానవుడిని ఇబ్బంది పెడుతున్నది.  W.H.O  2019 గణాంకాల ప్రకారం రష్యాలో 21.6శాతం మరణాలు ఆత్మహత్యలుకాగా అమెరికాలో 14.5 శాతంగా ఉంది. మనదేశం  ఆత్మహత్య లలో41 వ స్థానాన్ని తీసుకుంది. ఐతే మనదేశంలో  NCRB 2020 లెక్కల ప్రకారం  ఆత్మహత్యలు11.3 శాతానికి పెరిగితే 2021 వ సంవత్సరంలో అత్యధికంగా 12 శాతానికా చేరాయి. ఒక్క 2021 సంవత్సరంలోనే 1.64 లక్షలమంది ఆత్మహత్య చేసుకున్నట్లు NCRB గణాంకాలున్నాయి. ఇది ప్రతీ సంవత్సరం పెరుగుతూండటం ఆందోళన కలిగించే విషయం. అత్యవసరంగా పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టవలసిన విషయం. చరిత్ర తెలిసినప్పటినుండి ఇప్పటిదాకా ఆత్మహత్య లతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం మానవుడు చేసిన యుద్ధాలలో చనిపోయినవారి సంఖ్యను దాటిపోయింది. అంటే ఇదెంత తీవ్రమైన సమస్యనో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా యువతలో మరణాలలో మొదటి ప్రధానకారణం first main reason for death ఆత్మహత్య. కాబట్టి రాబోయే తరాలను కాపాడుకోవడానికైనా ఇపుడన్నింటికంటే ఎక్కువగా మాట్లాడవలసిన సమస్యగా అర్థం చేసుకోవలసిన సమస్యగా మనముందు నిలిచింది. 


ఆత్మహత్య అనేది చాలా సంక్లిష్టమైనది విషయం. బహుముఖీనమైనది. జీవ రహాస్యాలను, ఖగోళ రహస్యాలనూ ఛేదించిన మనిషి  నేటికీ ఆత్మహత్యలకూ ఇదీ కారణం అని చెప్పలేకపోడం ఈ విషయంలో ఉన్న సంక్లిష్టతను తెలియజేస్తుంది. ఏదైనా ఒక కారణం వలన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అని నిర్ధారించేలోపే అందుకు పూర్తిగా వ్యతిరేక కారణాలతో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. ఒక మనిషి మొదటినుంచి డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతతో సతమతమౌతున్నాడు అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనుకునేసరికి అసలు ఎలాంటి మానసిక రుగ్మతలు లేని వ్యక్తి ఆత్మహత్య చేసుకుని కనిపిస్తాడు. చాలా బీదరికంలో ఉన్నాడు కుటుంబ పోషణ భారాన్ని మోయలేక, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు అనుకునేలోపే తరాల తరబడి తిన్నా తరగని ఆస్తులు కల వ్యక్తి ఆత్మహత్య చేసుకుని కనిపిస్తాడు. వయోభారం మోయలేక జబ్బులబాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని అనుకునే లోపే ఏ జబ్బులు లేని యువకుడు ఆత్మహత్యకు బలౌతుంటాడు. ఎవ్వరితోనూ కలవక ఒంటరి జీవితం గడిపే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అనుకునేలోపే అందరితో కలివిడిగా ఉంటూ మనమధ్య తిరిగే వ్యక్తి శవమై కనిపిస్తాడు. సమాజం ఆధునికమయ్యేకొద్దీ ఆత్మహత్యలు పెరుగుతాయని ఫ్రెంచి సోషియాలజిస్టు Emile Durkheim చెప్పే లోపే, లేదు ఆదిమ సమాజాలలోనే ఆత్మహత్యలు విపరీతంగా ఉండేవి అంటాడు Zilboorg అనే మరో సోషియాలజిస్టు.


అంతేకాక ఆత్మహత్యల గురించి స్టడీ చేయడంలో ఎన్నో సైంటిఫిక్ , మోరల్/ఎథికల్ అడ్డంకులు కూడా ఎదురవుతాయి. ఆత్మహత్యలను నోటిఫై చేయగలం కానీ అందుకు పూర్వరంగమైన ఆ ఆలోచనలను (suicidal ideation) , విఫల ప్రయత్నాలను(failed suicide attempts) నోటిఫై చేయలేం. Unnoticed గా ఉండిపోతాయి. ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారో అంతకు పదిరెట్లమంది లేదా వందరెట్లమంది బహుశా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుండవచ్చు. అందులో ఎంతోమంది విఫల ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత వారి బంధువుల ద్వారా లభించే సమాచారం సెకండరీ ఇన్ఫర్మేషనే తప్ప చనిపోయిన వ్యక్తి చెప్పే సమాచారం దొరకదు. లెటరు రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా అది ఆ వ్యక్తి మొత్తం పర్సనాలిటీని పట్టి ఇవ్వదు. క్షణికావేశంలో చేసేసుకున్నాడని అనుకుటుంటాం.  చనిపోతాననుకున్న వ్యక్తి ఇతడే అని మనం ముందుగానే పసిగట్టలేము. ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కనిపిస్తే ఆపే ప్రయత్నం చేస్తామే తప్ప అతడీ స్థితికి ఎందుకు వచ్చాడని అతడితో మాట్లాడుతూ ఇన్వెస్టిగేషన్ చేయలేము. ఆత్మహత్య నుండి బయటపడిన వ్యక్తిని మళ్ళీ గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగి అతడెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో దానిని రాబట్టలేం. 


ఐనా కానీ ఆత్మహత్యల విషయంలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త అవగాహనలు పెరుగుతూనే ఉన్నాయి. ఆత్మహత్యల చుట్టూ పేరుకుని ఉన్న అపోహలు తొలగిపోతూ ఉన్నాయి. ఐతే సినిమా వంటి మాధ్యమాలు, మీడియా వాటినింకా ప్రాథమిక దశలోనే అర్థం చేసుకుని తప్పుగా చూపిస్తూ ఉంటాయి. ఆత్మహత్య చేసుకునేవారు స్వార్థపరులన్నట్టుగా డైలాగులు రాయడం కనిపిస్తుంది. ఇలాంటి తప్పుడు ఐడియా జనాలలోకి పోకూడదు. ఆత్మహత్యను స్వార్థమని అనడం వాళ్ళని స్వార్థపరులు అనడం stigmatize చేయడమే. దీనివలన అందాల్సిన సహాయం అందకపోగా విక్టిమ్ బ్లేమింగ్ మొదలౌతుంది. క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మీడియా రాసేస్తుంది. అపుడు కూడా విక్టిమ్ దే తప్పు, చదువుకున్నాడుగా ఆ మత్రం ఆలోచించలేడా వంటి అని అనడం మొదలౌతుంది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించే వాడు ఎప్పుడూ చేసుకోడు అనడం. ఇది కూడా అపోహే. అలాగే సుసైడ్ చేసుకున్నాడు లేదా అటెంప్ట్ చేశాడు అంటే అతడు మానసిక రోగి అనడం. ఇదెంత అసంబద్ధమైనదో అంత భయంకరమైనది కూడా. డిప్రెషన్ లో ఉన్నాడనుకోవడం అందుకు కౌన్సెలింగ్ ఇప్పిస్తే ఆత్మహత్య ఆలోచనలు తగ్గిపోతాయనుకోవడం కనిపిస్తుంది. కానీ నిజానికి డిప్రెషన్ తో బాధపడేవారిలో suicidal ideation తప్పనిసరిగా ఉండాలని లేదు. డిప్రెషన్ ఉన్నవారిలో ఐదు శాతంకంటె తక్కువ మందిలోనే ఈ ఆలోచనలు ఉంటాయి. కానీ ఆత్మహత్యకు పాల్పడిన అందరిలో డిప్రెషన్ ఉంటుందనడం వలన లేదా మరేదో మానసిక జబ్బు ఉందని తలపోయడం వలన మనం సమస్యను తప్పుదారి పట్టించడమే ఔతుంది.  సూసైడ్ చేసుకుంటావా లేదా అలాంటి ఆలోచనలు వస్తుంటాయా?  అని ఒక కౌన్సిలర్ అడగడం వలన కూడా ఆ వ్యక్తి లో అలాంటి ఆలోచనలు మొదలవుతాయని మొగ్గతొడుగుతాయని మరో అపోహ. అందుకే అసలు అడగనే కూడదు. ఆ మాటనే మాట్లాడకుండా జాగ్రత్త పడాలనే ధోరణి ముఖ్యంగా తల్లిదండ్రులలో కనిపిస్తూ ఉంటుంది. కౌన్సెలింగ్ కి వెళితే అలాంటి ప్రశ్నలనడిగి మా పిల్లల్లో లేని ఆలోచనలను వారే తెప్పించారు అంటుంటారు. కానీ అడగడం వలననే వారిలో ఉన్న ఆలోచనలు తెలుస్తాయని మనం అవగాహన చేసుకోవాలి. ఆత్మహత్యలు వంశపారంపర్యంగా వస్తాయని వాటిని మనం ఆపలేమనే అపోహలు ఉంటాయి. ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని ఒక వ్యక్తి డిసైడ్ అయ్యాక మనం ఏం చేసినా ఆపలేమని, వారింక ఎప్పటికీ సూసైడ్ చేసుకోవలనే చూస్తూ ఉండిపోతారనీ అపోహ పడుతుంటారు. ఒకరింట్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకుని ఉండింటే ఆ ఇంటి వారితో సంబంధం కలుపుకోవడానికి కూడా వెనుకాడేవారు ఉంటారు ఇలాంటి అపోహలవలన. ఆత్మహత్య చాలా అరుదైన విషయమనీ పాజిటివ్ థింకింగ్ లేకపోవడంలలననే ఆలాంటి ఆలోచనలు వస్తుంటాయనీ మరో అపోహ. ఇలాంటి వారిని ఆనందంగా ఉండగలిగేలా చేసి, పాజిటివ్ దృక్పథంలోకి మార్చడంతో వారిలో ఇంక ఆత్మహత్య ఆలోచనలు రానేరావనీ అనుకుంటారు. తప్పుడు ఆలోచనలు చేయడం వలననే ఇవి వస్తున్నాయి కనుక ఈ ఆలోచనలు చేయడం ఆ వ్యక్తి తప్పిదమే అని ఆ వ్యక్తి పై మరింత ఒత్తిడి పెంచుతూ ఉంటారు. లేదా ఏదో ఆశించి తమ అభీష్టం నెరవేర్చుకునేందుకు ఇదొక నాటకంలా చేస్తున్నారని అంటారు. ఆ ఒక్క కారణం తప్న మరేమీ లేదని చనిపోవాలని ఏమీ అనుకోవడం లేదనీ వీరే తలపోసి వారిని తిడుతూ ఉంటారు. దో చిన్న బ్లేడుతోనో మరో ప్రమాదంలేని విధంగానో ఆత్మహత్య చేసుకున్నట.లు చేసి భయపెట్టాలని చూస్తున్నారనీ ఒకేసారి చనిపోయేంత ధైర్యం ఉంటే చచ్చి చూపాలనీ గేలి చేస్తూ ఉంటారు. చూడండి ఎంత దారుణమైన అపోహలతో మనం వారిని చూస్తుంటామో. ఈ సకల విధాల అపోహలూ మనుషులను వాస్తవానికి ఎంతగా దూరంగా జరిపేస్తాయో గమనించండి. ఇవి అసలు సమయంలో మనలను సరైన పద్ధతిలో ఆలోచింపనీయవు. సరైన చర్యలను తీసుకోనీయవు. 


రోజూ మన చుట్టూ ఉండే వ్యక్తులే ఆత్మహత్యకు పాల్పడతారు. కానీ గుర్తించడం ఎలా?  ఎవరు ఎపుడు ఆత్మహత్యకు పాల్పడతారో మనం చెప్పలేం కాబట్టి మారుతున్న సామాజిక మానసిక పరిస్థితులపై నిరంతరావగాహన పెంచుకునే దిశగా పనిచేయాలి. సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు సోషియాలజిస్టుల నడుమ exchange of information ఉండాలి. వాటిపై డిస్కస్ చేసుకోవడానికి వేదికలు ఏర్పడాలి. ముఖ్యంగా వ్యక్తిగత పర్సనాలిటీకి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత మన సమాజ పోకడలకు నమ్మకాలకు జీవన పరిస్థితులమార్పునకు ప్రాముఖ్యత ఉంటుందని గుర్తెరగాలి. అంటే ఆత్మహత్యలను అర్థం చేసుకోవడంలో వాటిని నివారించడంలో సైకాలజిస్టులకు సైకియాట్రిస్టులకు ఎంతటి పాత్ర ఉంటుందో సోషియాలజిస్టు లకు అంతకుమించిన పాత్ర ఉంటుందనే అవగాహన మనకు పెరగాలి. ఫ్రెంచ్ సోషియాలజిస్టు ఎమిలీ డుర్కిం చేసిన పరిశోధనలు మనలని ఆత్మహత్యలలోని సామాజిక కోణాన్ని కొత్తగా చూడగలిగే శక్తిని ఇస్తాయి. ఆయన పరిశోధనలన్నీ 1897లోనే ఫ్రెంచిలో పబ్లిష్ అయి ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. నేటికీ డుర్కిం పరిశోధన ఆత్మహత్యలకు సంబంధించిన గొప్ప పరిశోధనగా పరిగణించబడుతోన్నది. ఆ తర్వాత వివిధ పరిశోధనల ఆధారంగా ఈరోజు మనం ఆత్మహత్యల గురించిన అవగాహన పెంచుకుంటున్నప్పటికీ పైన చెప్పిన సైంటిఫిక్ ఎథికల్ కారణాలవలన ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నామని చెప్పక తప్పదు. ఫ్రెంచ్ లో ముద్రణ పొందిన తరువాత యాభై యేళ్ళకుగానీ డుర్కిం రచనలు ఇంగ్లీషులో లభ్యం కాలేదు. కానీ నూటా ఇరవైయేళ్ళ తరువాత కూడా ఆత్మహత్యలకు సంబంధించిన ఈ అవగాహనలు తెలుగు సమాజానికి అందకపోవడం కూడా కడు శోచనీయం. అందకపోవడమే కాక జ్ఞాన విస్తరణకు అవగాహనకు సరైన వేదికలు లేకపోవడం లేదా వేదికలను మనం ఏర్పాటు చేసుకోలేకపోవడం మన వెనుకబాటు తనాన్ని తెలియజేస్తుంది.


సూసైడ్ అనేది వ్యక్తిగతమైన అంశం కావొచ్చు కానీ సుసైడ రేట్ మాత్రం సూసైడ్ కి విభిన్నమైన సామాజిక అంశం అంటాడు డుర్కైం. ఒక సమాజంలో జరిగే ఆత్మహత్యల ఎక్కువ తక్కువలకు ఆ సమాజంలో జరిగే అంశాలతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ సామాజిక అంశాలను అర్థం చేసుకోలేనంత వరకు వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే వ్యక్తిగత కారణాలను కనుక్కోలేము. డుర్కైం దృష్టిలో సమాజమే అసలు కారణం. సమాజం వ్యక్తులయొక్క భావోద్వేగాలను వారి ప్రవర్తనలను తన అదుపాజ్ఞలలో ఉంచుకుంటుంది. దీనినే ఆయన Anomy అంటాడు.  ఉదాహరణకు మనం అందరం అనుకుంటాం ఒకవ్యక్తి కటిక పేదరికంలో ఉన్నపుడు ఆ క్షుద్బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు అనుకుంటాం. కానీ డుర్కీం పరిశోధనలో ఇది తప్పని తేలింది. పేదరికం ఆత్మహత్యలను కలుగజేయదు. ఒక రకంగా ఇది ఆత్మహత్యలనుండి రక్షిస్తుందని చెబుతాడు. దీనికి విరుద్ధంగా ఏ సమాజం ఐతే చాలా వేగంగా ఆర్థిక లేదా పారిశ్రామిక ప్రగతిని సాధిస్తుందో, లేదా ఏ సమాజంలో ఐతే ఆర్థిక ప్రగతి కొత్త పుంతలు తొక్కుతూ నడుస్తుంటుందో ఆ సమాజంలో ఆత్మహత్యలు పెరుగుతాయి. ఈ వేగంగా అభివృద్ధి చెందే సమాజం తనదైన కొత్త భావోద్వేగాలనూ కొత్తరకం ప్రవర్తనలనూ వ్యక్తులలో ప్రవేశపెట్టి వాటిని తన అదుపాజ్ఞలలో ఉంచుకుంటుంది. అందుకే ఇపుడున్న ఆధునిక సమాజపు నిత్య కృత్యం ఈ Anomy. ఉదాహరణకు విద్యార్థులలో పెరుగుతున్న ఆత్మహత్యలను Anomy తో ఎలా అర్థం చేసుకోగలమో చూద్దాం. విద్య కార్పోరేటైజేషన్ జరిగి వేగంగా అభివృద్ధి చెందుతున్న మన సమాజంలో వచ్చిన మార్పులనే చూసుకుంటే మంచి మార్కులు , మంచి ర్యాంకులు రావడం అనే కొత్త భావోద్వేగం అందరిలోకీ ప్రవేశపెట్టబడింది. విద్యార్థులు తల్లిదండ్రులు బంధు మిత్రులు టీచర్లు అందరూ కూడా మంచి మార్కులు  మంచి ర్యాంకులు అనే అంశం చుట్టే తమ భావోద్వేగాలను కలిగి ఉంటారు. ఒక సంవత్సరం లో జాయిన్ ఐన పిల్లలను కూర్చోబెట్టుకుని పోయిన సంవత్సరం టాప్ పదిమంది విద్యార్థుల  పేర్లు చెప్పమంటే చెప్పలేరు. అంటే పోయిన సంవత్సరం టాపర్స్ ని ఈసంవత్సరం గుర్తుపెట్టుకోలేం అలాగే పది సంవత్సరాల ముందరి టాపర్స్ని అసలు ఎవరూ గుర్తుపెట్టుకోలేరు ఇది ఒక ఆబ్జెక్టివ్ ట్రూత్. కానీ ఈ సంవత్సరం జాయిన్ ఐన అందరికీ టాప్ ర్యాంక్  రావాలి అనే కొత్త భావోద్వేగం సృష్టించబడటం సొసైటల్ ట్రూత్. ఇపుడు డుర్కైం ఏమంటాడంటే విద్యార్థి ఆబ్జెక్టివ్ ట్రూత్ లో జీవించడం మానేసి సొసైటల్ ట్రూత్ లో జీవించడం మొదలెడతాడు. ఈ సమాజం అతడిని ఆబ్జెక్టివ్ ట్రూత్ నుండి బలవంతంగా సొసైటల్ ట్రూత్ లోకి నెట్టివేస్తుంది అని. ఈ సోషల్ ట్రూత్ లో విద్యార్థి టాప్ ర్యాంకు సాధించడం చాలా చాలా ముఖ్యమైన ఏకైక విషయంగా మారుతుంది. ఒక విద్యార్థి కష్టపడి చదువుతూ కాలేజీ లెవెల్ వరకు మంచి మార్కులతో పాసవడమే కాకుండా  డిగ్రీ లేదా పీజీ వరకు చదవగలగడం వాళ్ళ కుటుంబం లోనే మొదటి సారి అనుకుందాం. ఇది ఆబ్జెక్టివ్ ట్రూత్. కానీ అతడు ఒక మంచి ర్యాంకు స్టూడెంట్ గా మారకపోవడం సోషల్ గా అపజయంగా గుర్తించబడుతుంది. డిగ్రీ చేయడం పీజీ చేయడం అనే అతడి ఆబ్జెక్టివ్ లక్ష్యం ఇపుడు టాప్ ర్యాంకు సాధించడం అనే దానికి మార్చబడింది. ఉన్న కొన్ని సీట్లకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఉన్నా అందరిలక్ష్యం టాప్ ర్యాకు సాధించడమేగా మారిపోతుంది. అంటే ఆధునిక సామాజిక చట్రం ప్రతి  విజయాన్ని నిర్వచిస్తుంది. బేరీజు చేస్తుంది. ఏది సరైనది, ఏది కాదనేది సమాజమే చెబుతుంది. లక్ష్యాలను నిర్దేశిస్తుంది. మనం సరైన పని చేశామా లేదా అన్నది సమాజమే చెబుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా లక్ష్యాలకు ఎలాంటి సరిహద్దులు లేవని చెబుతుంది. ఎపుడైతే సరిహద్దులు లేవో ఈ విన్నింగ్ గేమ్ కి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. మనం సినిమా సెలబ్రిటీలను చూసి ఉంటాం. వారికి డబ్బులో కానీ అభిమానంలో కానీ ఎలాంటి కొదువా ఉండదు. కానీ వారు చేరుకోవాలనుకున్న లక్ష్యాలకు సరిహద్దులు చెరిపివేయ బడ్డాక ఆ లక్ష్యం ఎప్పటికీ అందలేనంత దూరానికి చేరిపోతూనే ఉంటుంది. అందుకోలేని లక్ష్యాన్ని తట్టుకోలేక వీళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఒకరకంగా సమాజంలో ప్రివిలేజ్డ్ సెక్షన్ లవాళ్ళ జీవన విధానమే ఆదర్శవంతమైన జీవనవిధానంగా నిర్వచించబడుతుంది. ఆ ఆదర్శాలను అందుకోలేకపోవడం ఫెయిల్యుర్ గా చెప్పడడుతుంది. ప్రజలతో ఇదే నమ్మించబడుతుంది. ఒక విద్యార్థికి  నూటికి తొంభై ఐదు మార్కులు వచ్చి ఉంటాయి. ఆ విద్యార్థి వ్యక్తిగత విజయంగా కనుక దానిని తీసుకుంటే అతడు వచ్చిన సోషల్ బ్యాక్ గ్రౌండ్ కి అది చాలా పెద్ద విజయమై ఉండాలి. కానీ నూటికి నూరు మార్కులనే లక్ష్యం అతడికి ఈ కార్పోరేట్ సమాజం లక్ష్యంగా పెడుతుంది. విద్యార్థిగా అతడు వచ్చిన దూరాన్ని మరిచి వాళ్ళ తల్లిదండ్రులే ఎందుకు ఐదుమార్కులు తగ్గాయని గట్టిగా అడగడం మొదలు పెడతారు. బంధువుల అమ్మాయికి తొంభై ఏడొచ్చాయి నీకు రెండు మార్కుల తగ్గాయి నా తల ఎక్కడ పెట్టుకోవాలని తండ్రి ఆక్రోశిస్తాడు. ఫేస్బుక్ లో తోటి తల్లులు మా కొడుకుకి నూటికి నూరొచ్చాయని గర్వంగా పోస్ట్ పెడితే నీకు నూటికి తొంభై ఐదే వచ్చినందుకు పోస్ట్ చేయలేకపోయానని తల్లి కన్నీరు పెట్టుకుంటుంది. ఈ విద్యార్థి తన ఆబ్జెక్టివ్ ట్రూత్ నుండి సోషల్ ట్రూత్ కి నెట్టివేయబడ్డాడు. ఆ సోషల్ ట్రూత్లో ఇతడొక అపజయంపోందిన వాడు. సొసైటీ ఏర్పరచిన ఒక ఇమేజ్ (social image)/ social perfectionism లోకి తాను ఇంకా చేరలేకపోయాడు. ఇక తాళలేక చనిపోతాడు. ఇది Anomical suicide.


ఐతే ఇలా ఉన్న విద్యార్థులు/మనుషులు అందరూ ఆత్మహత్యలు చేసుకుంటారా?. చేసుకోకపోవచ్చు కానీ మొదట Anomy అనే పూర్వ రంగం సిద్ధమై ఉంటుంది. పైన చెప్పిన ఉదాహరణలోని విద్యార్థి ఆత్మహత్య చేసుకోవాలంటే Anomy అనే పూర్వరంగం మొదటి అంశమనుకుంటే  దీనితోపాటు మరో మూడు అంశాలు జతకూరుతాయి. 


1. సొంతమనుకునే వారు లేకపోవడం(Thwarted belonigingness). రెసిడెన్షియల్ కాలేజీలలో ఒంటరిగా ఉండిపోవడం. రక్త సంబంధికులకు దూరంగా ఉండటం వలన తాము ఒంటరివారిమనే భావన పెరిగిపోతుంది. దీనికి తగ్గ సంరక్షణ ఇచ్చేవారు కొరవడటం. అందరూ ఒంటరిగానే ఉన్నారుగా నీకేం రోగమొచ్చిందని తనవారే అనడం. చదువుకోవడం ఇంపార్టెంట్ ర్యాంకు రావడం ఇంపార్టెంట్ అంతేకానీ ఇవన్నీ పట్టించుకోనవసరం లేదని చెప్పినంత మాత్రాన ఒంటరితనం దూరమౌతుందా?. 


2. నేను భూమికి భారమనుకునే భావన.(perceived burdwnsomeness) తన ఉనికి తమ తల్లిదండ్రులకు భారమౌతుందనుకోవడం. తను బతికి ఉండటం తమ తల్లిదండ్రుల సామాజిక ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతుందనుకోవడం. వేరే విద్యార్థులు ర్యాంకులు,బంధువుల పిల్లలు ర్యాంకులు కొడుతుంటే తన అశక్తత తనవారికి తలవంపులు తెస్తుందనే భావన. 


3. తెగింపు.(Aquired dareness) కొందరిలో తమ శరీరానికి దెబ్బతగిలినా నొప్పి ఏమి కాదనే స్థితి ఉంటుంది. ఐతే సూసైడల్ ఆలోచనలు పెరిగేకొద్దీ నొప్పి తాలూకు భయాలు మెల్లిగా సన్నగిల్లడం మొదలౌతుంది్ చిన్న బ్లేడుతో కోసుకుని చూసినప్పుడు నొప్పి భరించగలిగే లాగే ఉందే అనే ఎరుక కలుగుతుంది. తెగింపు వస్తుంది. కొన్ని సెకన్లు ఓపిక పట్టడం అంతేకదా అనే మొండి ధైర్యం వస్తుంది. చిన్న దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోయేవాడు అంత పెద్ద బిల్డింగ్ నుండి ఎలా దూకాడో అని అంటుండటం చూస్తుంటాం. దానికి కారణం మెల్లిగా నొప్పి సంబంధింత సంవేదనాశీలత తగ్గిపోవడమే. ఎపుడైతే నొప్పిని తట్టుకునే శక్తి (increaswd pain tolerance) కొత్తగా అలవడుతుందో మరణం పట్ల నిర్లక్ష్యం (carelessness on death)  పెరగడం మొదలౌతుంది. 


Anomy పూర్వ రంగమూ, పైన చెప్పిన మొదటి రెండు అంశాలు కూడా కలిసి  suicide ideation ని కలిగిస్తాయి. తెగింపనే మూడో అంశం జతైనపుడు మాత్రమే suicide attempt మొదలుకావొచ్చు. అది పరిపక్వమైనపుడు పూర్తిస్థాయి ఆత్మహత్య గా మారవచ్చు. పై  ఉదాహరణ విద్యార్థులను తీసుకుని చెప్పినా ఇది అందరికీ దాదాపు ఇలాగే సాగే common pathway గా ఉండే అవకాశం ఉంది. మనం సూసైడ్ నోట్లను పరిశీలిస్తే తమ ఒంటరితనాన్నీ నిస్సహాయతనూ తట్టుకోలేకున్నామనీ అలాగే తాము ఇతరులకు భారమైనామనీ తమ తల్లిదండ్రుల  expectaions (social truth ) ని అందుకోలేక పోతున్నామనీ తమను క్షమించమనీ రాసి ఉండటం గమనిస్తాం.


మనం గణాంకాలను పరిశీలిస్తే ఆడవాళ్ళకంటే మగవాళ్ళలో ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఐతే కారణం పైన చెప్పినదే. మగవాళ్ళ అవసరాలు సోషల్ అవసరాలు. ఆడవాళ్లవి వ్యక్తిగత అవసరాలు. మగవాళ్ళు సోషల్ ట్రూత్ లో ఎక్కువగా జీవించవలసిన అవసరం ఉంటుంది. ఒకరకంగా ప్రతీ సమాజం ఆధునీకరింపబడుతూ గ్లోబలైజేషన్ కారణంగా వేగంగా సామాజిక మార్పులను సంతరించుకుంటున్న తరుణంలో ఆత్మహత్యలు కూడా , హత్యల వలనే సర్వ సాధారణంగా మారుతాయేమో సమాజంలో ఒక భాగమైపోతాయేమో అనిపించకమానదు. ఆత్మహత్యలు జరగని దేశమంటూ భూమి మీద లేదు. అంటే ఇదొక నిశ్శబ్ద పాండెమిక్ గా వ్యాపించడం మొదలైంది. చరిత్రను పరిశీలిస్తే ఆత్మహత్యలు కూడా పాండెమిక్ లవలె wave లుగా వొచ్చి పోతున్నట్టు కనబడుతుంది. ఎపుడెపుడు సామాజికాభివృద్ధి వేగవంతమైందో అప్పుడు ఆత్మహత్యలు పెరగడం గమనించవచ్చు. యూరోప్ లో రెనిసా సమయంలో ఆత్మహత్యలు పెరగడం మనకు ఒక ఉదాహరణ. ఐతే మళ్ళీ గత కొన్ని దశాబ్దాలుగా సూసైడ్ రేట్ పెరగడం కనిపిస్తుంది. ఇది గ్లోబలైజేషన్ ఎఫెక్ట్. ఈ వేవ్ తగ్గాలంటే సామాజిక మార్పుల వేగాన్ని తగ్గించాలి. ఇది చేయలేం కాబట్టి ఆత్మహత్యలతో సహజీవనం తప్పదు. అందుకే నివారణల చర్యలపై మన దృష్టిని సారించకతప్పదు.


డేవిడ్ ఫిలిప్ అనే సోషియాలజిస్టు 1940 నుండి 1970 వరకు గల న్యూస్ పేపర్లను పరిశీలించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటకు తీశాడు. మార్లిన్ మన్రో ఆత్మహత్య చేసుకున్న తర్వాత దేశంలో 12 % ఆత్మహత్యలు పెరగాయియని అతడు గమనించాడు. ఎపుడెపుడైతే ప్రముఖుల ఆత్మహత్యలు న్యూస్ పేపర్ల హెడింగ్ లలో కనిపించాయో ఆ తర్వాత నెలల్లో దాదాపు అదే విధంగా ఇతరుల ఆత్మహత్యల వార్తలు పెరగడం గమనించారు. డేవిడ్ ఫిలిప్ అంతటితో ఆగలేదు. ఈ ఆత్మహత్యలకూ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లకూ కూడా లింక్ ఉందని గమనించాడు. ఎవరైనా ఒక ప్రముఖుడు ఆత్మహత్య చేసుకోవడాన్ని పేపర్ల హెడ్ లైన్ లలో వేసినప్పుడల్లా self car crash కేసులు పెరగడం గమనించారు. సెల్ఫ్ కార్ క్రాష్ కేసులన్నీ దాదాపు ఆత్మహత్యలే. అంతే కాకుండా ప్రముఖుల హత్యలు జరిగినపుడు కార్ యాక్సిడెంట్లు పెరగడం గమనించారు. అంటే కార్ యాక్సిడెంట్ చేయడం కూడా ఒకరకమైన హత్యాయత్నమే. ఇవన్నీ నిరూపిస్తున్నది ఒకటే -  వార్త అనేది కేవలం విషయాన్ని మాత్రమే తెలపడం లేదు అది  వల్నరబుల్ సబ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఒక మెసేజ్ ని చాలా శక్తివంతంగా కమ్యూనికేట్ చేస్తున్నది. కాబట్టి వార్తను వ్యాప్తి చేయాలనుకునే వారు దేనిని చేయాలి దేనిని చేయకూడదు అనే విజ్ఞతతో తో ఉండాలి. అంటే ఆత్మహత్యలు పెరగడంలో పెరుగుతున్న సమాచార విప్లవం దానిపై అడ్డూ అదుపూ లేకపోవడం కూడా కారణాలుగా కనబడుతున్నాయి.


అందుకే హత్యలు ఆత్మహత్యలు సాధారణంగా ఒక క్లస్టర్ గా ఒకే గ్రూపులో దాదాపు ఒకే రకంగా ఒక సబ్ కల్చర్ లాగా జరుగుతూ ఉంటాయి. ఒక ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేసాడంటే వెనువెంటనే అటువంటి వాటిని వరుసగా చూస్తుంటాం. ఒక అమ్మాయి గ్యాంగ్ రేప్ కి గురైందంటే వెనువెంటనే అటువంటి కేసులే మరికొన్నింటిని చూస్తుంటాం. అలాగే ఒక బిజినెస్ మ్యాన్ ఒక హోటల్ రూంలో ఆత్మహత్య చేసుకున్నాడంటే వెనువెంటనే మరో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అలాంటి బిజినెస్ మనుషులే అదే విధంగా హోటల్ రూంలలో ఆత్మహత్య చేసుకోవడం చూస్తుంటాం. సినిమా హీరోలూ హీరోయిన్ల ఆత్మహత్యలు దాదాపు ఒకేరకంగా ఉండటం గమనిస్తాం. కాలేజీ స్టూడెంట్లు బిల్డింగుల మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని తరచూ వింటుంటాం. విఫల ప్రేమికులు నదిలోకి దూకడాలు కూడా మనం చూసి ఉంటాం.  రైతుల ఆత్మహత్యలు దాదాపు పోతపోసినట్టుగా ఒకేరకంగా పురుగుల మందు తాగడం వలనజరుగడం ఎన్నో సార్లు చూసి ఉండింటాం. అంటే ఇవన్నీ ఒక ప్యాటర్న్ ని ఎందుకు కలిగి ఉన్నాయి?. సినిమా హీరోలు , ప్రేమికులు రైతులు ఇలా ఒక్కోక్కరు ఒక్కో సబ్ కల్చర్ అనుకుంటే వారి ఆత్మహత్యలు దాదాపు ఒకే రకమైన సబ్ కల్చర్ లో జరుగుతుంటాయి. అవి కూడా ఒకటి జరిగిన వెంటనే దాని గురించి మనం పేపర్లలో టీవీల్లో చూసేలోపు అటువంటివే మరికొన్ని దర్శనం ఇస్తుంటుంది?. క్లస్టర్ లాగా ఒకేచోట గుమికూడినట్లు  కనిపిస్తుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది?.

దీనినే పవర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ పవర్ ఆఫ్ ఇమిటేషన్ అంటాం. యాసిడ్ దాడి చేసే వాడు కేవలం యాసిడ్ మాత్రమే పోయడం లేదు. ఈ విధంగా యాసిడ్ పోయవచ్చు అని వాడిలాంటి ఇతర ప్రేమోన్మాదులకు కమ్యూనికేట్ చేస్తున్నాడు. గ్యాంగ్ రేప్ చేసేవారు రేప్ మాత్రమే చేయట్లేదు ఇలా చేయవచ్చు అని కమ్యూనికేట్ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న బిజినెస్ మ్యాన్ ఆత్మహత్య చేసుకోవడమే కాక అచ్చం తనలాంటి స్థితిలో ఉన్న ఇతర వ్యాపారస్థులకు ఇదే పరిష్కారం అని కమ్యూనికేట్ చేస్తున్నాడు. పురుగులమందు తాగి చనిపోయిన రైతు ఇక వేరే మార్గంలేదని తోటి రైతులతో కమ్యూనికేట్ చేస్తున్నాడు. అంటే ఒక ఆత్మహత్య అచ్చం అలాంటి కండీషన్లోనే ఉండే ఇతరులకు, సులువుగా ప్రభావితం కాగలిగినటువంటి వారికి ( susceptible people)కి కమ్యూనికేట్ అయిందంటే ఆ ఇతరులు కూడా దానిని ఇమిటేట్ చేసే అవకాశాన్ని పెంచేస్తుంది. Imitation is a kind of self permission. ఇతరులు నడిచిన బాటలో నడవడం సులభం. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఏం చేస్తున్నాయంటే ఈ కమ్యూనికేషన్ ని చాలా సులభంగా చాలా ఎక్కువ మందికి చాలా తక్కువ సమయంలో అందజేస్తున్నాయి. 


నిజంగా ఆత్మహత్యలను ఆపాలనుకునే suicide sensitive సమాజాన్ని తయిరు చేయాలనుకుంటే ప్రజలలో చైతన్యం పలువిధాలుగా తీసుకుని రాగలగడం ఒక్కటే మార్గం. WHO ప్రకారం ప్రతీ మిలియన్ జనాభాకి 60 సైకియాట్రిస్టుల అవసరం ఉంటే మనదేశంలో ముగ్గురు మాత్రమే ఉన్నారనే ఈ ఒక్క వాస్తవం మనదేశం మానసిక పునరుత్తేజానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో చెబుతోంది. అంతేకాక మన సమాజం ఆత్మహత్య అనేది సామాజిక మూలాలున్న వ్యక్తిగత అంశమనే విషయంగా గుర్తించడానికి దానిచుట్టూ అనేక అపోహలూ ఉండిపోవడం అడ్డంకి. కాబట్టి సోషియాలజిస్టుల పాత్ర పెరగవలసి ఉన్నది. ముఖ్యంగా రాబోయే సామాజిక ఆర్థిక కుదుపుల సమయాలను సోషియాలజిస్టులు  ముందుగానే గుర్తించి సైకాలజిస్టులకు సమాచారం ఈయగలిగితే పెరగనున్న ఆత్మహత్యలను ఆపేందుకు ఒక అవకాశం కలుగుతుంది. స్టూడెంట్స్ ఆత్మహత్యల విషయంలో మనదేశం ప్రథమస్థానంలో ఉన్న సందర్భంలో సమాజంలోని వివిధ నిపుణుల మధ్యన సహకారం తప్ననిసరి కావలసిన తరుణం ఆసన్నమైంది. మీడియా పాత్ర కేవలం ఇబ్బడిముబ్బడిగా ఆత్మహత్య విషయాలను పాపులర్ వైరల్ చేయదగిన అంశాలలాగా పరిగణించకుండా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చే దిశగా ఉండకపోతే రాబోయే విపత్తును మనం సంపూర్ణంగా ఎదుర్కోలేం.


విరించి విరివింటి

No comments:

Post a Comment