సినిమాతో ప్రపంచం.
How to understand world from cinema.
An insight
-----------------------
ఈ కాలం కాలేజీ పిల్లలతో మాట్లాడేటపుడు పూర్తిగా వేరే లోకం పిల్లలతో మాట్లాడుతున్నామనే స్పృహ మనకు ఉండాలి. ఒకప్పుడు ఫిక్షన్ మాత్రమే చదివిన వారి మాటలకూ ఫిక్షన్ తో పాటు నాన్ ఫిక్షన్ కూడా చదివిన వారి మాటలకూ తేడా స్పష్టంగా కనబడేది. ఐతే ఈ కాలం పిల్లలు ఫిక్షన్ చదవడం అటుంచి కేవలం ఫిక్షన్ మాత్రమే "చూసిన" వారు. చదివిన వారు కూడా కాదు. నాన్ ఫిక్షన్ అంటే వారి వరకు కేవలం పాఠ్య పుస్తకాలే.
ఐతే సినిమాలు సమాజం మీద మనుషుల విలువల మీద ప్రభావం చూపుతాయా అనేది నేను వాళ్ళకు వేసిన ప్రశ్న. ఐతే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇచ్చారు. కొందరు చూపుతుందనీ తమ మిత్రులు కొందరు సినిమాలు చూసే అమ్మాయిలకు సైట్ కొడుతుంటారనీ ఫైంటిగులు చేస్తుంటారనీ కొందరంటే, చాలామంది అదేం లేదనీ చూసి మరిచిపోతుంటామనీ సమాధానం ఇచ్చారు.
ఏదైనా రెండు నిమిషాల అడ్వర్టైజ్మెంట్ పలానాది కొనమని పదే పదే చెప్పడం వలన అది మన మీద ఇంపాక్ట్ చూపినపుడు రెండు మూడు గంటల సినిమా మన మీద ప్రభావం చూపుతుందా చూపదా అని అడిగాను. "చూపదు. అది వేరే ఇది వేరే. అడ్వర్టైజ్మెంట్ పదే పదే చూపిస్తారు. సినిమా ఒక్కసారే చూస్తాం కాబట్టి ప్రభావం ఉండదు అన్నాడు" ఒకబ్బాయి. నిజమే ఒక సినిమా చూపించకపోవచ్చు. కానీ వచ్చే ప్రతి సినిమా ఒకే రకమైన భావజాలాన్ని మోస్తూ అవే విలువలు వేరు వేరు సినిమాలలో రిపీటెడ్ గా చూపబడుతుంటే వాటి ప్రభావం ఉంటుందా ఉండదా అని అడిగాను. ఆలోచించి చెబుతామని అన్నారు. వారిని ఇంకో విషయం కూడా ఆలోచించమని చెప్పాను. ప్రతిరోజూ సినిమాలను ఆహారంలా తినే పరిస్థితిని తెచ్చిన ఓటీటీ గురించి చెప్పాను. గతంలో సగటున ఒక వ్యక్తి నెలకు ఒకటి రెండు సినిమాలు చూసే రోజులలో సినిమా ప్రభావం ఉండకపోయేదేమో. కొడవగంటి కుటుంబ రావు గారు కూడా సినిమా ల ప్రభావం సమాజంపై ఉంటుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కానీ ఇపుడు ఓటిటీ ప్రభావమా అని రోజూ సినిమా చూడవలసిందే..చూసిండేది ఊరికే ఉండకుండా పదిమందికీ రికమెండ్ చేయాల్సిందే. ఇపుడు సినిమా దగ్గరకు మనం పోవడం లేదు. సినిమానే మన దగ్గరకు వచ్చింది. మన ఇంట్లోనుండి మన చేతిలో సెల్ఫోన్ లోకి వచ్చేసింది. రోజర్ మాన్వెల్ అనే సినీ విమర్శకుడు ఏమంటాడంటే "సినిమాలు భోజనం లాంటివి అపుడపుడూ మంచిభోజనం దొరుకుతుంది. కానీ రోజూ భోజనం చేయాల్సిందే" నని. ఆయన పాతకాలపు విమర్శకుడు కాబట్టి వచ్చే ప్రతి సినిమా చూసేవాడేమో. ఐతే ఈ కాలం వారు ఓటీటీ వలన ప్రతి సినిమా ప్రతివారూ చూసే పరిస్థితి ఉంది. ప్రతిసినిమా చూడటానికి నేనేమైనా విమర్శకుడినా అనుకోవాల్సిన పనిలేదు. ఓటీటీకి Subscription చేశాం కాబట్టి అవసరమున్నా లేకున్నా చూడాల్సిందే. అలా ఎడతెగకుండా చూస్తూ ఉన్నప్పుడు సహజంగానే లోపాలంటూ ఒక విమర్శకుడు బయలుదేరుతాడు కదా. వివిధ దేశాల వివిధ భాషల సినిమాలను చూస్తున్నపుడు లోపలెక్కడో ఒక కంపారేటివ్ స్టడీవంటిది మొదలవంతుంది కదా. మన సినిమాలేంటి వేరే భాషల దేశాల సినిమాలేంటి అనే ధోరణి ఒకటి మొదలవాలి కదా. కానీ అలాంటిదేదీ ఈ యువతలో మొదలవలేదు అనిపిస్తుంది.
ఎందుకంటే వీళ్ళకు కాస్త వయసు వచ్చి తెలివి వచ్చేసరికి కేవలం ఫిక్షన్ మాత్రమే "చూసే" ఒక చారిత్రక సందర్భంలోకి అడుగు పెట్టేశారు.. అందునా ప్రతిరోజూ సినిమా చుట్టూనే ఓటీటీలు టీవీ ప్రోగ్రాంలతో నిండిన ఒక సందర్భంలో ఉన్నారు. అందుకే తాము సినిమా చూస్తామే తప్ప సినిమాను విమర్శించం అనీ విమర్శించడం మహాపాపం అనీ అన్నట్టుంటారు. ఐతే ఇటువంటి వారికి మొత్తానికి "సినిమా" అంటే ఇష్టం. కాబట్టి అది యే సినిమా ఐనా సరే ఇష్టపడుతుంటారు. వారు కష్టపడి తీస్తారు కాబట్టి విమర్శించకూడదని సినిమావాళ్ళకు విధేయత చూపుతుంటారు. అంతగా విమర్శించదలిస్తే "మీరు తీసి చూపండి చూద్దాం" అని ఎద్దేవా చేస్తూ ఉంటారు. వీళ్ళల్లో కొందరికి సినిమా మీద కంటే సినిమా హీరోలమీద ప్రేమ ఎక్కువ. ఆ హీరో ఎలాంటి సినిమా తీసినా వారికి నచ్చుతుందంతే. బాగాలేదనడానికే కాదు వారిలో వారు బాగాలేదని అనుకోడానికి కూడా ఇష్టపడరు. ముఖ్యంగా సినిమా విమర్శ అనేదొక సాహిత్యమనీ దానిని చదివితే తప్ప సినిమాని ఎలా అనలైజ్ చేయాలో తెలుస్తుందన్న విషయం వీరికి తెలియదు. ఐతే ఇలాంటి యువతతో పాటు జీవితంలో ఫిక్షన్ మాత్రమే చదివిన పెద్దవారు కూడా ఇలాంటి ధోరణి, అంటే సినిమాను విమర్శించరాదు,అనే ధోరణిని కలిగిఉంటారు. నాన్ ఫిక్షన్ పుస్తకాలు మనిషిలో ఒక క్రిటికల్ ఫ్యాకల్టీ ని డవలప్ చేస్తాయి. కానీ వాటిని చదివే నాథుడులేడు.
ఐతే ఈ పెద్దవారితో వచ్చిన చిక్కేమిటంటే OTT పుణ్యమా అని తమ దైనందిన జీవితంలో సినిమా ఒక భాగంగా నిండిపోయిందనీ ఎవరు ఏ సినిమా బాగుందని చెబితే దానిని వెంటనే చూసేందుకు conditioned ఐపోయి ఉవ్విళ్లూరుతూ నిరంతరం తమను తాము ఎంటర్టైన్మెంట్ కి మాత్రమే పరిమితం చేసుకున్నామనీ ఇది తమలో వచ్చిన మార్పు అనీ గుర్తించడంలో విఫలమౌతుంటారు. రోజూ టంచనుగా సినిమా చూడటమే తమ మీద పడిన ప్రభావమని గుర్తెరగకుండా సినిమాల వలన ఎలాంటి ప్రభావం ఉండదని చెబుతుంటారు. ఆ మధ్య ఒకాయన పోర్న్ సినిమాల ప్రభావం చూసేవారిపై ఏమీ పడదనీ పైగా పోర్న్ ఫిలింస్ వలన స్త్రీలపై అత్యాచారాలు తగ్గినట్టు ఆధారాలున్నాయని అన్నారు. అంటే సినిమా ప్రభావం ఉన్నట్టే కదా అన్నాను. ఆయన దృష్టిలో ప్రభావం అంటే చెడు ప్రభావం మాత్రమే. మంచి ప్రభావం ఉన్నపుడు చెడుప్రభావం కూడా ఉంటుంది కదా.
కాశ్మీరీ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి సినిమాలు ప్రాపగాండా సినిమాలు అన్న వారు వాటిని చూసిన జనాలు సినిమా థియేటర్లలోనే ఆవేశంతో రగిలిపోయినవారిని చూసినవారు ఇలాంటివి ఓట్లకోసం పాలకుల ప్రాపకం కోసం తీస్తుంటారనేవారు సైతం "అబ్బే సినిమాలు ప్రజలను వారి ఆలోచనలను అస్సలు ప్రభావితం చేయవు" అని అనడం చూస్తుంటాం. ఐతే ఈ డిబేట్ చాలా పురాతనమైనదే. ఇపుడంటే సినిమాలు వచ్చాయి కాని ఒకప్పుడు నాటకాలు మనుషులపై ప్రభావాన్ని చూపేవి.
మనం గ్రీకుల కాలంలో సాహిత్యాన్ని చూస్తే ముఖ్యంగా నాటకాల రూపంలో చాలా వీరోచితమైన గాధలు కనిపిస్తాయి. అక్కడ ఆ గాథలను రాసే రచయితను మనం గమనిస్తే అతడికి ఎలాంటి పరిమితులూ లేవు. ఊహకు పగ్గాలు లేవు. దేవుళ్ళు మనుషులతో మాట్లాడతారు. దేవదూతలు పాటలు పాడుతారు. నిజ జీవితంతో ఎలాంటి సంబంధం లేకుండా పాత్రల జీవితాల్ని ఊహాత్మకంగా చిత్రించడానికి వెసులుబాటు ఉండింది. అదేంటి నిజజీవితంలో ఇలా జరగదు కదా అని అడిగే విమర్శ కూడా ఏది లేదు. జీవితాతీత విమర్శాతీత భావనలను చాలా తీరికగా కథలుగా మలచేందుకు అనుగుణమైన స్థితి ఒకటి ఉండింది. ఐతే ఈ నాటకాలు ఆ పాత్రలు ప్రజల నిజజీవితంలో ఎలాంటి ప్రభావం చూపాయన్నది ఆసక్తికరమైన అంశం. ధైర్యాన్నీ వీరత్వాన్నీ పగనూ రాజ్యాధికారాన్నీ ఆదర్శాలుగా ఆ కథలు నిలపడంతో ఆ ప్రజలు వాటిని తమవిగా చేసుకున్నారు. గ్రీకులు చేసిన యుద్ధాలలో వారి సాహిత్యం లోని వీరోచిత గాథలలోని వీరుల శౌర్యప్రతాపాలు ప్రతిబింబించేవి. అంటే సాహిత్యం కళల యొక్క ప్రభావం వాటిని చూసి ఆనందించే ప్రజల మీద, వారి ఆదర్శాల మీద వారి విలువల మీద తప్పక ఉంటుంది. ఐతే ఆ సాహిత్యం లో నాటకాలలో చూపిన లార్జర్ దాన్ లైఫ్ పాత్రలతో తామే ఐడెంటిఫై కావలసిన అవసరం సాధారణ ప్రేక్షకుడికి లేనేలేదు. అతడికి ఈ పాత్రలన్నీ కల్పిత పాత్రలని స్పష్టంగా తెలుసు. కనుక ఆ పాత్రలకంటే ప్రభావం కంటే ఆ పాత్రల విలువల ఆదర్శాల ప్రభావమే ప్రేక్షకుడి మీద ఉంటుంది.
అలాగే "కరమజోవ్ సోదరులు" నవలలో డాస్టోయవస్కీ ఒక ఆసక్తికరమైన స్త్రీ గురించి వివరిస్తారు. ఆమె ఊహాలోకాల్లో విహరించే పాత తరానికి చెందిన అమ్మాయి అంటాడు. షేక్స్పియరు నాటకంలోని ఒఫీలియాతో తనను తాను పోల్చుకుంటూ తను కావాలనుకుంటే ఎంతో అలవొకగా పెళ్ళి చేసుకోతగిన ఒక వ్యక్తితో కూడా పెళ్ళి చేసుకోకుండా తానే లేనిపోనివి ఊహించుకుని పెళ్ళికి తానే అడ్డంకులు కలిగించుకుంటూ చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని వర్ణిస్తాడు. (Ophelia syndrome కి ఈ క్యారెక్టర్ కీ సంబంధం లేదు). అందుకే స్లావేకియన్ తత్వవేత్త జిజెక్ ఏమంటాడంటే - మనం ఫిక్షన్ ని తగినంత సీరియస్ గా తీసుకోవడం లేదని. Pervert's guide to cinema అనే డాక్యుమెంటరీలో ఆయన సినిమాలపై ఫ్రాయిడియన్ లాకానియన్ పద్దతులలో అద్భుతమైన విమర్శ చేస్తారు. నిజానికి ఫిక్షన్ నిజానికంటే నిజమైనదంటాడు జిజెక్. ఉదాహరణకు ఒఠ వీడియో గేంను ఆడేటపుడు ఆ ఆటలో వలె ఒక సాడిస్ట్ గా రేపిస్ట్ గా తన పర్సొనాని ఆ వ్యక్తి కలిగి ఉంటాడంటాడు. తనకు తాను చాలా బలహినమైన వ్యక్తిగనుక దాని స్థానంలో తాను చాలా బలమైన వ్యక్తిననీ, సెక్సువల్ గా శక్తివంతుడననీ ఒక సూడో ఇమేజ్ ని అతడు ఏర్పరుచుకుంటాడు. ఐతే ఇదే విషయాన్ని మనం ఇంకోరకంగా చదివితే బలమైన సాడిస్ట్ లేదా దారుణమైన రేపిస్ట్ అనేదే అతడి నిజమైన వ్యక్తిత్వం. కానీ సమాజం అలా ఉండటాన్ని ఒప్పుకోదు కనుక తనను తాను తగ్గించుకుని its just a game అనుకుంటూ ఆడుతుంటాడు. ఈ వర్చువల్ స్పేస్ లో తను స్వతంత్రంగా ఉండగలుగుతాడు. అక్కడ తనకు లభించే ఐడెంటిటీ అతడి true self కి దగ్గరగా ఉంటుంది అంటాడు.
అంటే ఏమి? ఇది కేవలం సినిమానే, కేవలం ఫిక్షన్ మాత్రమే అనడం వలన అతడు సులువుగా అందులోని పాత్రలతో తాదాత్మ్యం చెందడం అతడి true self అనేదతడు గ్రహించవలసి ఉంటుంది ప్రస్తుత ఓటీటీల కాలంలో సెల్ఫోన్లను బాత్రూమ్ లలోకి కూడా తీసికెళ్ళి తమకు నచ్చినదానిని రహస్యంగా చూసుకునే ఒక వాతావరణం ఏర్పడిన తర్వాత కూడా ఇది కేవలం ఫిక్షనే ఇది వ్యక్తి మీద ఎలాంటి ప్రభావమూ చూపదు అనేవాదనలో వ్యక్తి నిజ స్వరూపాన్ని కనబడనీయకుండా చేయడమే. వ్యక్తి స్వతహాగా క్రూరుడు. దుర్మార్గుడు. అవకాశవాది. రేపిస్ట్. దానిని ఒప్పుకోనంత వరకు సినిమా కేవలం ఫిక్షన్ లాగా అందులోని విపరీత పాత్రలు కేవలం పాత్రల్లాగా కనిపిస్తూ ఉంటారు. ఐతే సినిమాలతో ఏదో విధంగా సంబంధం ఉన్న రచయితలు, కవులు సినిమాలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపవని వాదించడం కనిపిస్తుంది. సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయా చేయవా అనే దానికంటే సమాజం సినిమాను ప్రభావితం చేస్తుందాలేదా అనేది ముఖ్యమని గుర్తించాలి. ఏ విలువలనైతే ఒక సమాజం తనలో కాలానుగుణంగా ఇముడ్చుకుంటుందో మార్చుకుంటుందో అవే విలువలు సినిమాలలో పునరుద్ఘాటించబడతాయి. పునరుద్ధరించబడతాయి. ద్విగుణీకృతం చేయబడతాయి. సినిమా తీసేవారి భావజాలాలు కూడా సినిమాల్లోకి ప్రవహిస్తూ ఉంటాయి. పలానా డైరెక్టరంతా ఫక్తు బ్రాహ్మణ వాదాన్ని రుద్దాడు అనేవారు కూడా సినిమాలు ఎలాంటి ప్రభావం చూపవని వాదన చేస్తుంటారు. సినిమా పెట్టుబడులు పెట్టేవారు భూస్వాములైతే ఆ సినిమాలలో ఫ్యూడల్ విలువలూ వ్యాపారులైతే వ్యాపారుల విలువలూ పూజారి వర్గం వారైతే బ్రాహ్మణ విలువలూ కనిపిస్తుంటాయనేది జగమెరిగిన సత్యం. దేశ కాలమానాలకు అనుగుణంగా సినిమాలు సాహిత్యమూ సాగుతుంటాయి. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి కథలు చదివితే తెలుగు ప్రాచీన సాహిత్యం మొత్తం చదివినట్టే అంటుంటారు విమర్శకులు. చార్లెస్ డికెన్స్ నవలల్లో అండర్ వర్ల్డ్ జీవితాన్ని తెలుసుకోవచ్చునంటారు. ఫ్రెంచ్ సాహిత్యం చదివి ఫ్రాన్స్ దేశ చరిత్రను తెలుసుకున్నాను అన్నాడు కారల్ మార్క్స్. అందుకే సాహిత్యం సమాజాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో సమాజం సాహిత్యాన్ని అంతే ప్రభావితం చేస్తుంది. సినిమాకు కూడా ఇది వర్తిస్తుంది. అందుకే సినిమా ద్వారా ప్రపంచ స్థితిగతులు అర్థం చేసుకోవచ్చంటాడు స్లావోజ్ జిజెక్..In order to understand today's world, we need cinema, literally.
అందుకే మోడెర్న్ సినీ కథకుడి స్థితిని మనం మొదట అంచనా వేయాలి. అతడు కేవలం తనకు తోచినది రాస్తూ పోతున్నాడనుకోవడానికి లేదు. గ్రీకు నాటక రచయిత వలె వీక్షకుడికి ఇదంతా వట్టి నటననే అనే స్పృహనేమీ అతడు కలిగించడం లేదు. పాత్రతో దేవతలో దేవదూతలో మాట్లాడటం లేదు. పాత్ర ధైర్యానికో వీరానికో ప్రతినిధి కాదు. పాత్రే నిజమైన మనిషివలె రియాలిటీని కప్పుకుని వచ్చినపుడు చుట్టూ ఉన్న జీవన పరిస్థితులు నిజజీవితాన్ని పోలినట్టు కనిపిస్తున్నపుడు ఈ పాత్రలు నిజజీవితంలో నిజంగా ఉన్నాయేమో అనేలా పాత్ర చిత్రీకరణ ఉంటుంది. కాబట్టి ఫిక్షన్షనేది నిజానికంటే ఎక్కువ నిజం. ఇది ఆ చూసే మనిషిలోన దాగిఉన్న realself కి ప్రతిరూపం.
పైన చెప్పుకున్నట్లు దాదాపు ఒకేరకమైన భావజాలాలుగల సినిమాలు , ఏ సినిమాలైతే ఫిక్షన్ ని నిజమైన నిజంలా చూపిస్తున్నాయో, ఏ నిజమైన నాన్ ఫిక్షన్ సాహిత్యాన్ని అబద్ధమని చెబుతున్నాయో,ఏ హీరోనైతే గొప్పగా చూపుతున్నాయో, ఏ చరిత్రనైతే మన నమ్మకాలకు అనుగుణంగా మారుస్తున్నాయో అవి పదే పదే చూపినపుడు ఆ విలువలే సమాజానివిగా ప్రతిబింబిస్తాయి. ఆ విలువలనే సమాజాలలోకి ఇంకిస్తాయి. ఆ విలువలను జనరలైజ్ చేస్తాయి. ఉదాహరణకు మడికట్టుకోవడం బ్రాహ్మణ ఇళ్ళలోనే కన్పించేది అందరిళ్ళల్లో ఉంటుందనిపించవచ్చు..పిండం కాకిముట్టడం దేశమంతా ఉందనిపించవచ్చు, తెలంగాణ మొత్తం తాగుతారనిచవచ్చు, రాయరసీమవాళ్ళంతా కత్తులు బాంబులు పట్టుకుని తిరగుతుంటారనిపించవచ్చు. ఈ భావజాలాలు ఎన్నికలలో కూడా ఓట్లుగా మలచుకోవచ్చు. అందుకే సమాజంలో మోస్ట్ వల్నరబుల్ గ్రూపైన యువత ఈ సినిమాలకు వాటి విలువలకు ప్రధానమైన టార్గెట్. రాసే రచయిత స్వతహాగా నేరాలూ ఘోరాలు చూసి ఉండకపోవచ్చు ఏ అమెరికాలోనో కూర్చుని భారతదేశ పల్లెల గురించి రాయవచ్చు. ఇంకా ఆలోచన ఎదగని, జీవిత నిజ స్వరూపం ఏదో తెలియని పరిణతి చెందిన మనసులు కలిగిలేని యువతీ సినిమాలందించే భావజాలాలను ఏమాత్రం పట్టించుకోకుండా సాగిపోతుందనే ఒక వాదన అసలు నిలుస్తుందా?.
విరించి విరివింటి
10/1/24
No comments:
Post a Comment