జనాభా- పర్యావరణం -స్త్రీ వాదం
----------------------------------------------
ఎక్కడైతే స్త్రీలకు తమ శరీరాలపై తమకే అధికారం ఉంటుందో ఎక్కడైతే వారేం చేయాలో ఏం చేయకూడదో వారే నిర్ణయించుకోగలరో ఎక్కడైతే వారికి ఓటు హక్కు ఉంటుందో ఎక్కడైతే వారు విద్యావంతులో అక్కడ శిశు జననాల శాతం తగ్గుతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా సోషియాలజిస్టులకు ఉన్న అవగాహన. ఎక్కడైతే స్త్రీ లకు ఈ అనుకూవతలు లేవో అక్కడ జననాల శాతం ఎక్కువ, గృహ హింస ఎక్కువ. మనదేశం జనాభాలో చైనాను దాటేసి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. ఈ సందర్భంగా కూడా మనదేశంలో దీనిపై పెద్దగా చర్చ జరగడం లేదు. పాలకులకు దీనిపై ధ్యాస ఉన్నట్లు కూడా మనకు కనిపించడం లేదు. మన దేశంలో చివరి జనాభా గణన 2011లో జరిగింది. కరోనా పాండెమిక్ వలన 2021 లో జరగలేదు అనుకున్నా మళ్ళీ ఈ రోజువరకు దాని గురించిన ఆలోచన కూడా ఎక్కడా ఉన్నట్టు కనబడటం లేదు. కరోనా సమయంలోనే అమెరికా యూకేలు జనభా గణన చేయగలిగాయి. మనదేశం అదే సమయంలో కొన్ని రాష్ట్రాలలో ఎలక్షన్లను పెట్టగలిగింది కానీ జనగణనను మాత్రం వాయిదా వేసింది. 1872 నుండి మనదేశంలో ప్రతీ పది సంవత్సరాలకూ జనగణన జరుగుతున్నది. 1941 లో 61లో 71లలో యుద్ధాలవలన గణన కొంత ఆలస్యంగా జరిగినా ఇలా పూర్తిగా జరగకుండా ఉండటం దేశ చరిత్ర లో ఇదే మొదటిసారి. ఈ సారి దాదాపు పదివేల కోట్ల రూపాయల ఖర్చు రావొచ్చని అంచనావేసినా యాభైకోట్లమంది చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న డిజిటల్ ఇండియాగా ఆన్లైన్ మెథడ్ లో కూడా గణన చేసుకునే అవకాశం ఉంది. జనగణన లేకపోతే పాలసీలను చేయడమూ కష్టమే. కానీ పాలసీలకంటే మనకిపుడు గుళ్ళే ముఖ్యంగా ఉంటున్నాయి కనుక ప్రభుత్వాల తప్పిదము కూడా లేదేమో. ఐతే ఇపుడు140కోట్లు అని చెబుతున్నది ఐక్యరాజ్యసమితి డాటా ఆధారమే తప్ప నిజమైన జనగణన కాదు. మనం చైనా జనాభా ను నిజంగా దాటేశామా లేదా అనేది అపుడే తేలుతుంది. 2024 ఎలక్షన్ల తర్వాత జనగణన ఉండబోయే అవకాశం ఉంది.
ఐతే చైనాలో జనాభా తగ్గుముఖం పట్టింది. దానికి ఎన్నో కారణాలు. 1981 లో జనాభా నియంత్రణ కోసం "ఒక్కబిడ్డ చాలు" అని కఠిన చట్టాలు చేసింది. ఒక వేళ 1981 లో చైనా ఆ చట్టం చేయకపోయి ఉండింటే ఈ పాటికి 220కోట్ల జనాభాతో నిండిపోయేది చైనా. అంటే ఈ చట్టం వల్ల చాలామటుకు జనాభా నియంత్రణ జరిగిందన్నట్టే. ఐతే 2015 లో ఈ చట్టాన్ని ఎత్తేసి ఇద్దరిని కనండి అని చెప్పింది. విచిత్రం ఏమంటే ఈ చట్ట సవరణ తర్వాత కూడా చైనా జనాభా ఏమంతగా పెరగలేదు. ఇప్పుడు కొత్తగా వీలైనంత ఎక్కువ మందిని కనండని చైనా ప్రభుత్వం బోధించడం మొదలు పెట్టింది. ఎందుకంటే గత ఎనిమిదేళ్ళుగా వరుసగా జనాభా సగటు అంతకంతకూ తగ్గుతూ వచ్చింది. చివరికి అది ప్రస్తుతం ఏ పరిస్థితి కి చేరిందంటే చైనా ప్రభుత్వమే పూనుకుని జనాభా పెంచకపోతే విపత్కర పరిస్థితులు రాబోతాయని ప్రకటించేంతగా. జనాభాలో ముసలివాళ్ళు అధికంగా ఉండే దేశంగా చైనా మారింది. కొత్త తరంవారు పుట్టుక రావడం లేదు. కొత్త తరం రాకపోతే ఆర్థికంగా దేశం చితికిపోతుందనే భయాన్ని ఏ దేశమైన ప్రకటిస్తే దానిని డయపర్ల బిజినెస్ చేసుకునేవారి భయంగా కొఫీ అన్నన్ అప్పట్లో కొట్టివేశాడు. కానీ చైనాకు ఇపుడు అదే భయం పట్టుకుంది. జనాభా పెరగకపోతే ఆర్థికంగా చితికిపోతామేమో అనే యం మొదలైంది. ఒకవైపు జనాభా పెరిగేకొద్దీ సహజ వనరులు తరిగి పర్యావరణ విధ్వంసం జరుగుతుంది కాబట్టి జనాభాను తగ్గించుకోవాలని ప్రపంచ దేశాలు ఆలోచిస్తుంటే దానికి విభిన్నంగా చైనా జనభాను పెంచండని పిలుపునిస్తోంది.
ఇక్కడ ముఖ్యంగా గమనించవలసినది ఏంటంటే "ఒక్క బిడ్డ మాత్రమే"పాలసీని ఎత్తేసినా కూడా చైనాలో జనాభా పెరగకపోవడానికి కారణం - స్త్రీ విద్య. అక్కడ చదువుకున్న యువత వివాహాల పట్ల విముఖత చూపిస్తున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న గృహ హింసలు ఆడవారిపై దాష్టీకాలను చూసి మాకొద్దు బాబోయ్ ఈ పెళ్ళిళ్ళు అంటున్నారు. పైగా విడాకులు తీసుకోవాలంటే కూడా ఒప్పుకోకుండా బలవంతపు సంసారాలు కొనసాగేలా వస్తున్న కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. అంతేకాకుండా అక్కడ ఫెమినిజం ప్రభావం కూడా పెరిగింది. ప్రభుత్వాలు ఫెమినిస్టులను అరెస్టులు చేసి సతాయిస్తున్నా పెరుగుతున్న ఇంటర్నెట్ వాడకం, సోషల్ మీడియాలు ఫెమినిస్ట్ ఐడియాలజీని పట్టి లేపుతున్నాయి. చైతన్నాన్ని నింపుతున్నాయి. శిశువులను కనండని పిలుపునిస్తున్నారు సరే మరి ఆ శిశువును కనే స్త్రీ కి రక్షణ ఏదీ అని అడుగుతున్నారు. భర్తల రూపంలో, కుటుంబ బంధాల రూపంలో వ్యవస్థీకృతమైన అణచివేతను ఇంకేమాత్రం భరించలేమంటున్నారు. మాతృత్వం చుట్టూ అల్లుకున్న రొమాంటిసైజేషన్ ని కూల్చేస్తూ ఇది గృహహింస లో భాగమని గుర్తించగలుగుతున్నారు. కనబోయే పాప ఆడ శిశువైతే, పెరిగి పెద్దయ్యాక కూడా పరిస్థితులు మారుతాయని గ్యారెంటీ లేనపుడు కని పాడులోకంలోకి తీసుకురావడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. రాబోయే పర్యావరణ విధ్వంసాలకు యుద్ధాలకూ శిశువులను ఎందుకు ఆహ్వానించాలనే కొత్తరకం ఊహలతో యువత నిండిపోతున్నారు. (ఇలాంటి వారిని హైదరాబాద్ లో కూడా చూశాను) ఇదంతా చైనా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమనే వారూ ఉన్నారు కానీ దేశభవితను నిర్ణయించేది యువతే. ఆర్థికంగా బలమైన దేశమైనప్పటికీ స్త్రీ కి రక్షణలేని సమాజాన్ని వారు ఆహ్వానించలేకపోవడం ఆలోచనలో జరుగుతున్న విప్లవం అని చెప్పకతప్పదు. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ కూ స్త్రీ విద్యకూ స్త్రీ సాధికారతకూ సంబంధం చాలా లోతుగా ఉందని చెప్పక తప్పదు.
విరించి విరివింటి
24.1.24
No comments:
Post a Comment