Wednesday, 1 April 2015

విరించి ll  theistic declaration  ll
...............................................
ఈ కంపు సారాను తయారు చేసిందెవరు
కన్నీళ్ళు

ఈ అలోక నిద్రని పోయిందెవరు
వేదన

సారా తాగేసి కడుపునిండా
నిదుర పోయి రాత్రంతా
తెల్లవారుఝామున తేరుకున్న మనిషికి
మిగిలిందేమిటి?
నవ్వు పులుముకున్న నటన

నిద్ర పోయి లేచిన కళ్ళ తో
ప్రపంచాన్ని స్వచ్ఛంగా చూడాలనుకుంటాను
స్వచ్ఛత అనే ఆ తెర
కొన్ని క్షణాలే కళ్ళ ముందు
వేలాడుతుంటుందని తెలుసుకోనేలేను

ఆనందాన్ని ఊహల్లో
బాధల్ని వాస్తవాల్లో మోసే నేను
నా మనో సీమల్లోకి ఎగరాలనుకున్నప్పుడు
నేను నింపుకున్న అవాస్తవ మజిలీల దగ్గరే
సేద దీరుతుంటాను

నీవనే నిజం ఉంది చూశావూ
అది ఈ సారాయంత కూడా
సుఖాన్ని ఇవ్వలేదు

ఈ అనామక గుట్టమీది ఓ శిల్పమో
చేతులు పైకెత్తి వేలాడే శిలువనో
నా ఊహల్ని ఓలలాడిస్తున్నపుడు
నిజం నిప్పులాంటిదంటూ నీవు
నా ఆనందాల్ని కాల్చుకు తింటుంటావు

ఆ శిల్పంలో ఆ శిలువలో నీ తలకాయొకటి పెట్టి
నిజాన్ని కుక్క లాగా మొరుగుతుంటావు

అబద్దాలు సైతం అందంగా
ముస్తాబు చేసుకో గలిగే మేకప్ రూం లాంటి
నీ మనో సీమలో
నిజాలు నికృష్ట అనాచ్ఛాదిత దయ్యాల్లా
తిరుగాడుతుంటే
నీవింకా ఎట్లా బ్రతికున్నావోనని
ఆశ్చర్య పోతుంటాను

చల్...ఇక నీ ఇష్టం
అవాస్తవాల్ని ఆనందించే ఈ స్యీయజ్ఞాన మత్తులో..
ఈ సారాయినో..నిద్రనో..
ఆ శిల్పాన్నో, శిలువనో
ఏదో ఒకటి పట్టుకుని నేను జోగుతాను.

(happy all fools day)

1/4/15

No comments:

Post a Comment