Thursday, 31 March 2016

(కవిత్వ సందర్భం 13)

పిచ్చి మాటలు కాకపోతే..నగరంలో అందమెక్కడుంది?
............................
Poets are the unaknowledged legeslators of the world  అన్నాడు షెల్లీ. ప్రపంచం స్థిరంగా ఉండదు. కవి ద్రష్ట నిరంతరం మారుతున్న ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాడు.  మార్పును గుర్తించ గలిగిన వాడే మార్పును తీసుకురాగలడు. గుర్తించలేని వాడు ఆ మార్పులో ఒక భాగం అయి, కాలంలో అందరితోపాటూ కొట్టుకుపోతాడు. గ్రీకులు కవిత్వాన్ని Art of persuation  అన్నారు. కవిత్వం ఒప్పించగలగాలి. ఒప్పించగలిగినపుడే మార్పు సాధ్యం. అందుకు ముందుగా స్పష్టంగా మార్పును చూడగలగాలి. అందరికీ ఆధారం ఇంద్రియానుభవమే. కానీ గడించిన ఇంద్రియానుభవం కవిలో ఒక అవగాహనగా మారుతుంది. ఆ అవగాహన ఒక జ్ఞానంలా కవికి జ్ఞానబోధ చేస్తుంది. పొందిన జ్ఞానాన్ని ఒప్పించగలిగే ధారలా రసాత్మకంగా అక్షరీకరించే సాధనే కవిత్వం. కాలధర్మం ప్రకారం నూతనంగా పుట్టుకొచ్చే విలువల్నీ, అసలు ప్రపంచాన్నే తన కవిత్వంలో లిఖిస్తాడు బ్రహ్మలా కవి. అటువంటి కాలిక స్పృహ చారిత్రక నియతి కలిగిన కవి నందిని సిధారెడ్డి.

మన౦ పారిశ్రామికీకరణ దశను దాటేశాం. ప్రపంచీకరణ దశ మనది. పశ్చిమాన ఒకప్పుడు పారిశ్రామికీకరణ విరుచుకు పడితే సాహిత్యం దానిమీద తిరగబడింది. కానీ ప్రపంచీకరణ తిరుగుబాటును కూడా వ్యాపారం చేసింది. రాజకీయం చేసింది. ప్రతీ స్పందనకి లోతయిన రాజకీయార్థాలు ఆపాదించి మనిషిని వాని మానవత్వాన్ని శంకించింది. సామాజిక ఆత్మ పుచ్చిపోయింది. మనిషిని పూర్తిగా తనకు తాను కాని పరాయివాడిగా చేసింది. ప్రకృతి ఎన్నో సంపదలను ప్రసాదించింది మానవునికి. జల సంపద, వన సంపద, ఖనిజ సంపద, పర్వత సంపద, భూ సంపద ఇలా. కానీ డబ్బు అనే మనిషి సృష్టించుకున్న సంపద ఈ అన్ని సంపదలనూ నాశనం చేసింది. మలినం చేసింది. మనీ ఈజ్ ద మోడెర్న్ గాడ్ అన్నాడు వర్డ్స్ వర్త్.  కోటీశ్వరులూ, కటికదరిద్రులూ సంఖ్యలో పోటీపడే ఒక విచిత్ర వాతావరణాన్ని సృష్టించింది. గ్రామాలు నగరాలకీ సరిహద్దులే అంతరాలయ్యాయి. గ్రామ జీవిత విధానంలోకి నగరం చొచ్చుకొచ్చింది. నగరమనే మహారణ్యంలోలాగానే పులులు, నక్కలూ, పందులూ, గాడిదలూ గ్రామాల్లో మనిషి రూపాల్లో విరుచుకుపడ్డాయి. అన్నింటినీ కబళించాయి. గ్రామ ప్రజల సంబంధాల్లో డొల్లతనం కొత్తగా పైకి తేలింది. డబ్బును చూపించే దర్పమే ఆదర్శమైనపుడు మనుషుల బుగ్గల మీద పైపై నవ్వులు వెలిశాయి. ఏ మట్టి మీద నడిస్తే ఆ మట్టి సుగుణాలు నెత్తికి ఎక్కుతాయంటారు. అరికాలి మంట నెత్తికెక్కిందని సామెత. గ్రామ్యాన్ని కోల్పోయిన గ్రామం ప్రజల నెత్తిలో పత్తా లేకుండా పోయింది. పైకి అస్థిపంజరమే గ్రామం, శరీరమంతా నగరమే. ఎక్కడికి పోయాడా గ్రామ్యం నిండిన మనిషి?. స్వచ్ఛమైన పల్లె మనిషి. వాడి మాటల్లో ఆ తీయదనం ఏదీ?. డబ్బు చుట్టూతా తిరిగే రాజకీయం వాడి స్వచ్ఛమైన మాటలకు ఎంతటి విషాన్ని పూసిందో. డొల్లతనం, దబాయింపు, అరాచకత్వం ఎలా నిండిపోయాయి ఆ మాటల్లో?. ఎన్ని మధుర జ్ఞాపకాల జీవితం అతడి మాటలకి సొబగును అద్దిందో..అదంతా ఎక్కడ పోయింది?
"సులువుగా మరచిపోతాంగానీ
మన మాటల సొగసంతా సులువుగా అబ్బిందేమీ కాదు"
నిజమైన గ్రామం కనుమరుగయింది. గ్రామం అని పిలవబడుతున్న నగరం పుట్టింది. తన కంటి ముందు ఇటువంటి మార్పును స్పష్టంగా చూస్తాడు కవి. గ్రామంలాగానే ఎండిపోతున్న చెరువు ముందు నిలబడి ఈ గ్రామ ప్రపంచాన్నీ నగర ప్రపంచం ఎలా కబళించి వేసిందో చూస్తాడు కవి.

చెరువు గ్రామ జీవితానికి ఆధారం. నది గ్రామానికి కేవలం అలంకారమే. అది ఊరి బయట ఉండాల్సిందే. చెరువులాగా ఊరిలో జనాల మధ్య ఉండే అవకాశం లేదు. నది పొంగవచ్చు. చెరువు చల్లనిది, పొంగదు, ప్రాణం తీయదు. ప్రాణం నిలబెడుతుంది. నది నీరు పంటకు ఆనదు. ఆనాలంటే ఆనకట్టలు కట్టాలి. వృతాసురుడు గంగకు కట్టినట్లు, ఇప్పటి రాజకీయ నాయకులు కడుతున్నట్లు. ఏ రాష్ట్రానికా రాష్ట్రం కట్టుకోవాలి. జల వివాదాలతో కొట్టుకోవాలి. చెరువుకి ఇదేమీ పట్టదు. అది గ్రామాన్ని పట్టి ఉంచుతుంది. గ్రామాన్ని పట్టుకునే వుంటుంది. ఎక్కడికీ పారిపోదు. ఆనకట్ట అశాశ్వతం. కాంట్రాక్టర్ల కోసం అది ఎప్పటికయినా కూలాల్సిందే. చెరువు శాశ్వతం. కూలేది ఉండదు. పైగా ఎండాకాలం ఎండిపోతే పంటలు పండటానికి పైకి తేలే శిఖం భూమి. అందుకే కాకతీయులు చెరువులు నిర్మించారు. వేల ఎకరాలు సాగుకు నీరందించారు. గొలుసు కట్టు చెరువులు. ఒకటి నిండితే అన్నీ నిండుతాయి. బయ్యారం, గార్ల, రామప్ప, లక్కవరం ఇలా. ఈ రోజుకీ వాటికిందే సేద్యం. వాటి చుట్టూ అందమైన జీవితం. కుల వృత్తుల సందోహం. దిశాంబర ప్రకృతం. అసలు గ్రామమే ప్రకృతిలో ఒక భాగం. ఇక్కడ ఏదీ ప్రకృతికి వ్యతిరేకం కాదు. మాలిన్యం లేదు. కాలుష్యం లేదు. ఆకాశంలో పాల పిట్టల మల్లె పందిరి. సూర్య కిరణాలు పక్షుల్లా కోలాహలం. సురభిళ మందానిలం గ్రామం. కానీ ఇపుడేదీ?. నగరం కోసం గ్రామాల్ని తెగనరకటం మొదలయ్యింది చెట్లలాగా, చెరువులాగా. ఎన్ని పక్షులు, చేపలు గూడులేక క్షుద్భాతతో చచ్చిపోయివుంటాయో. రాజకీయం, డబ్బు వీటిని చూడనీయవు. పైపై మెరుగుల్ని మురికివాడల పక్కనే నిర్మిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం భూమిని భూమిలా ఉంచనీయదు. చెరువును చెరువులా ఉంచనీయదు. ఇదే కవి ఇంకో కవితలో అంటాడు,
"చెరువుదగ్గరికి వెల్లినపుడు
చెరువులానైనా ఉండాలి
చేపలానైనా ఉండాలి
ప్రొక్లెయినర్లా ఉండొద్దంటున్నాం

చెట్టు దగ్గరికి చేరినపుడు
పక్షిలానైనా ఉండాలి
బాటసారిలానైనా ఉండాలి
రంపం పట్టుకుని రావద్దంటున్నాం"

వ్యాపారానికి వావి వరసలే లేవు. ఇంక మంచీ చెడూ అనేదెందుకుండాలి. బడా ధనస్వాముల కోసం రాజకీయాలుంటాయి. పేదలకోసం ఉన్నట్టు బొంకుతాయి. గ్రామాల కోసం రైతుల కోసం కట్టబోయేదే విశ్వనగరమనీ, అందమైన నగరమనీ అబద్దాలు చెబుతాయి. నగరంలో అందమెక్కడుంది? పిచ్చి మాటలతో ప్రజల్ని పిచ్చి వాళ్ళని చేయటం కాకపోతే...!! రాజకీయాలు రైతుల జీవితాల్ని కకావికలం చేస్తాయి. రైతుని మైకు ముందు నిలబెట్టి ఏరోప్లేన్ ఎక్కే కల ఎప్పుడయినా కన్నావా అని అడుగుతాయి. ఏరోప్లేన్ లే ఎక్కడం ఒక మహాద్భుత జీవిత సాఫల్యమని నమ్మిస్తాయి. ప్రకృతిలో పుట్టిన రైతు ఇదేమీ అర్థం కాక తెల్ల మొఖం వేస్తాడు. ఇది కాదు రా జీవితం అని చెప్పలేని వాడు కదా రైతు.

'ఎండిన చెరువు ముందు' అనే ఈ కవిత అలాంటి ఒక చారిత్రక ఘట్టానిది. లోలోతుల్లో బాధని కలిగిస్తుంది. ఆలోచింప జేస్తుంది. మనం కోల్పోతున్న సౌందర్యాన్ని మనకు చూపిస్తుంది. ఎటువంటి జీవితం రాజకీయాల బారిన పడి ఎలా అయిపోయింది.
"కట్ట ఎక్కితే చాలు కడుపు నిండి పోయేది
కను చూపు మేరా
పచ్చని చేన్లతో
చమత్కారంగా కరచాలనం చేసేది
కథలు చెప్పేది.
బర్లమీద కెక్కి సిటీగొట్టె బర్రివాత పిలగాండ్లు
లయబద్దంగా బట్టలు ఉతికే చాకలి పడచులు
పిట్టలు కట్టిన రాగాలూ దాగుడు మూతలూ
తడల్లో చేపల సయ్యాటలూ
ఎంత కమ్మటి ప్రపంచాన్ని కుమ్మరించేవో అపుడు"

 .... అవును అప్పటి జీవితమంతా లయాత్మకమే , నాదాత్మకమే. అంతా కమ్మదనమే. చెరువులు కొల్లగొట్టే రాజకీయ నాయకులు ఇలాంటి కవిత్వం చదవాలి. ద్రష్ట అయిన కవి కవిత్వమే చదవాలి. గుర్తింపులేని న్యాయాధికారి కదా కవి.  ప్రపంచానికి అతడిచ్చే న్యాయం ఏమిటో తీర్పు ఏమిటో ఒకసారి గుర్తించాలి. భారత దేశం ఆత్మ పల్లెల్లో ఉందన్నాడు మహాత్ముడు. ఆత్మలేని దేశాన్ని కానుకగా ఇస్తామంటారు రాజకీయనాయకులు. ఆ ఆత్మ ఏమిటో ఈ కవితలో చూపుతాడు కవి. కవిత చదివాక మానసు మ్లానమౌతుంది. గుండె చెరువవుతుంది. కాలపు ఒక శకలం లా చెరువు మిగిలిపోతుందేమో అని భయం వేస్తుంది. ఆలోచింపజేస్తుంది. జీవనార్తి కళాత్మకత కలగలిపిన ఓక అద్భుత కవిత లోలోతులోకి చొచ్చుకుపోతుంది. దానికి ఇంకో మార్గం ఏముంటుంది?

ఎండిన చెరువు ముందు
________________________
ఊరిపానాదులన్నీ
చెరువుకట్తదిక్కే
మబ్బుల లేచిందగ్గర్నుంచీ
చీకటి చిక్కపడిందాక
నర సంచారమంతా అటు దిక్కే
కట్ట ఎక్కితే చాలు కడుపు నిండిపొయ్యేది
కను చూపుమేరా
పచ్చటి చేన్లతో
చమత్కారంగా కరచాలనం చేసేది.
కథలు చెప్పేది
బర్లమీదికెక్కి సీటిగొట్టే బర్రివాత పిలగాండ్లు
లయబద్ధంగా బట్టలుతికేచాకలి పడతులు
పిట్టలుకట్టిన రాగాలూ దాగుడు మూతలూ
తడల్లో చేపల సయ్యాటలూ
ఎంతకమ్మటి ప్రపంచాన్ని కుమ్మరించేవో అప్పుడు
సులువుగా మరచిపోతాం గాని
మనమాటల సొగసంతా సులువుగా అబ్బిందేం కాదు.
కరువుకు కాలానికి
మన అడుగులే తోడు
పాడుపడిన పానాది వెంట
ఎవరుమాత్రం ఎందుకు నడుస్తారు ?
మనిషిని బట్టే కాలం
ఎండిపొయిన చెరువ్వుముందు నిలబడితే
చూపు పెళ్లలు పెళ్లలుగా విరిగిపడుతుంటది.
వొఠ్ఠిపోయిన రైతుల్లా
నెత్తికి చేతులుపెట్టి
పంటగుండు కుములుతుంటది
ఒళ్ళంతా పగుళ్లతో
ఒండు ఒక ప్రక్కకు ఒత్తిగిలుతుంది
అప్పనంగ్గా వచ్చిన లొట్టపీసు చెట్లు
అపహాస్యంగా నవ్వుతయి
ఎండిన చెరువు
శవం మీద కప్పిన పాత చిరుగ్గుల దుప్పటిలా
పరచుకొని ఉంటది
మొండితుమ్మలు అల్లుకొని మొఖం గుర్తుపట్టటానికే ఉండదు
తుమ్మితే తూము ఊడిపడుతది
అలుగుమత్తడి
అంతదూరం నుంచే ఎక్కిరిస్తుంది
ఆవులించేగట్టు
శిఖం భూమిమీద శిలాశాసనాలు పూస్తయి
ఎండిన చెరువు ముందు నిలబడితే
పద్యం ఎండి పట్టున పగులుతుంది
పిట్టలు లెవ్వు పాటలు లెవ్వు
బుడుంగుమనే బుడుబుంగల జాడలేదు
కిరణాలకు ఎగిసిపడే చేపపిల్లల గురుతుల్లేవు
మైసమ్మ గుడిదిక్కు మల్లిచూసే మానవుడే లేడు
ఎండిన చెరువుని చూస్తే
ఏడుపు ఎగేసుకొస్తది
ఊరందర్నీ సాదిన చెరువు
ఉనికే ఉత్తదయింది
పాడుపడ్డరాజకీయంల
పానాది పాడుపడింది
ఇప్పుడు పానాదులన్నీ బస్టాండు దిక్కే.

30/3/16
(కవిత్వ సందర్భం 13)

Saturday, 26 March 2016

పితా పరిగేలూ - పిత్త పరిగెలు.
-------------------------------------
వాట్ అయామ్ సేయింగ్...
ఐ యావ్ ఫవర్...దే యావ్ ఫవర్
ఐ యావ్ మినిస్టర్ ..ఎ స్టేట్ మినిష్టర్...యి యాస్ అ కొడుకు
హౌ కెన్ దే బ్లేమ్ హిమ్...?
అంటే.. కొడుకున్నాడు కదాని బ్లేమ్ చేస్తారా?.
ఎటు పోతున్నాం మనం. దిస్ యీజ్ వెరీ దారుణం.
దే యావ్ మినిస్టర్...హి యావ్ కొడుకు..ఐ టూ యావ్ ఫవర్
వాటరాల్ దేకెన్ డూ...ఐ డూ...యెస్..ఐ కాన్ డూ.
యూ సీ...దేర్ ఈజ్ ఎ లేడీ గోయింగ్
అయాం ఆస్కింగ్...హౌ కెన్ దే బ్లేమ్ హిమ్?
హౌ కెన్ దే యూస్ దైర్ ఫవర్ ఆన్ హిమ్..? ఇన్ ఆ కామన్ కాపిటల్?
దిసాల్ ఐయామ్ ఆస్కింగ్.
విరించి ll భారత్ మాతాకీ జై ll
....................................
అవును మనం గెలిచాం
క్రికెట్లో వాడెవడో బలిసిన వాడు సిక్స్ కొట్టాడట
అందుకే మనం గెలిచామట
భారత్ మాతాకీ జై అనాల్సిందే
అంటావు సరే..!
రా.. ఒకసారి ఇటు వచ్చి చూడు

అవును మనం గెలిచాం
ఎవరెస్ట్ శిఖరం మీద ఇంకెవడో జండా పాతాడంట
అందుకే మనం గెలిచామట
భారత్ మాతాకీ జై అనాల్సిందే
అంటావు సరే..!
రా.. ఒకసారి ఇటు వచ్చి చూడు

అవును మనం గెలిచాం
దేశం కాని దేశంలో ఎవడో ఓ నగరానికి మేయర్ అయ్యాడంట
అందుకే మనం గెలిచామంట
భారత్ మాతాకీ జై అనాల్సిందే
అంటావు సరే..!
రా.. ఒకసారి ఇటు వచ్చి చూడు

అవును మనం గెలిచాం
ఇంకో దేశంలో డాక్టర్లూ ఇంజనీర్లంతా మనవారేనట
అందుకే మనం గెలిచామంట
భారత్ మాతాకీ జై అనాల్సిందే
అంటావు సరే..!
రా.. ఒకసారి ఇటు వచ్చి చూడు

అవును మనం గెలిచాం
టాప్ టెన్ ధనవంతుల్లో ముగ్గురు మనదేశం వారేనట
అందుకే మనం గెలిచామట
భారత్ మాతాకీ జై అనాల్సిందే
అంటావు సరే..!
రా.. ఒకసారి ఇటు వచ్చి చూడు

ఈ దేశ ఆకాశపు అంచు మీద
చంద్రుడు పీనుగులా చచ్చి పడి ఉన్నాడు చూడు
ఆ చంద్ర బింబంలో తరతరాలుగా ఏ మార్పూలేక
ఈ దేశపు ప్రతిబింబం గడ్డకట్టింది చూడు

విశాల భవంతుల మధ్య
ఇరుకు వీధుల్లో నిలబడినపుడు
రాళ్ళ వంటి మనుషుల నడుమ
పిచ్చి మొక్కల్లా ఎదిగొచ్చే పసి పిల్లల్ని చూడు

పొగ చిమ్మే ఇనుప చిమ్నీల మధ్య
పచ్చని చెట్లు నల్లబారుతున్నపుడు
శిథిల అవశేషంలా మిగిలిన వీధికుక్క
బక్క చిక్కిన కడుపును చూడు

జుయ్యని లేచే ఈగల మధ్య
తట్టలో పిడికెడు మెతుకులతో ఓ బిడ్డ
వడలిన పాలిండ్లతో ఓ తల్లీ..
బతుకు కాన్వాసు పై అతికిన జాకెట్టు ముక్క చూడు

ఇవన్నీ చూస్తున్నపుడు
నీ గొంతు సవరించుకో..
ఎత్తిన పిడికిలిని ఒక్క క్షణం ఆపి పట్టుకో..

కనుగప్పిన కామంతో
ఆడపిల్లను చెరుస్తావు చూడు
అప్పుడు అను
భారత్ మాతాకీ జై అను

చెంబులతో పొలాలకి ఉరికే
చెల్లెమ్మలను చూసినపుడు
అప్పుడు అను,
భారత్ మాతాకీ జై అను

యూనివర్సిటీ పుస్తకాల్లో
రాజకీయ జండాలు పేజీలైనపుడు
అప్పుడు అను
భారత్ మాతాకీ జై అను

అరే మేధావీ...!
రైతులు పంటలు పండిస్తే
కూర్చుని తిని బలిసిన మేధావీ..!
నీకేం తెలుస్తుంది
ఈ నేల మీద పుట్టిన ప్రతివాడికీ
తిండి పెట్టే రైతునడుగు చెబుతాడు
టన్నుల కొద్దీ పంటలు పండించే ఈ నేల
నీకు కన్న తల్లి అవుతుందో కాదో లెక్కలేసి చెబుతాడు

అరే మిత్రమా..!
నీ గొంతు మరోసారి సవరించుకో
ఎత్తిన పిడికిలిని ఒక్క క్షణం ఆపి పట్టుకో..
ఏది మన గెలుపో
ఏది మన ఓటమో ఇంకొక్క సారి గుర్తు తెచ్చుకో...
ఈ ఓటమి అంతం అయ్యేటట్టు
జోర్ సే బోలో..భారత్ మాతాకీ జై
గణేష్ నిమజ్జనంలో ముస్లిం నీళ్ళు అందిస్తున్నపుడు
జోర్ సే బోలో భారత్ మాతాకీ జై
పీర్ల పండుగలో హిందువులు పీర్లెత్తినపుడు
జోర్ సే బోలో భారత్ మాతాకీ జై
క్రిస్టమస్ రోజున ప్రతి ఇంటి ముందు నక్షత్రం వేలాడినప్పుడు
జోర్ సే బోలో భారత్ మాతాకీ జై
గొంతులో నరాలు చిట్లి పొయ్యేటట్టూ
ఆకాశానికి చిల్లులు పడేటట్టూ
గుండె లోతుల్లోంచి
ప్రేమంతా ఊడిపడేటట్టు
తిరంగా జెండా చేతులనిండా పట్టుకుని
ఔరేక్ బార్ జోర్సే బోలో
భారత్ మాతా కీ జై.

20/3/16

...............................................................
'మాతృ భూమి' అనే దానికి ఇంగ్లీషులో సరి సమానమైన పదం 'మదర్ ల్యాండ్'
ఈ ఇంగ్లీషు పదం వివిధ రూపాల్లో వివిధ దేశాల్లో ఉంది. మదర్ కంట్రీ అనే పదం ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు డిక్షనరీలో 1587 లోనే చోటు చేసుకుంది
పుట్టిన దేశాలకు 'ఫాదర్ ల్యాండ్' అనీ, 'మదర్ ల్యాండ్' అనీ జెండర్ ని కలుపుతూ వాడటం మన దేశానికే పరిమితమైన అంశం కాదు.
పితృస్వామ్యం ఉన్నటువంటి జర్మనీ వంటి దేశాల్లో ఫాదర్ ల్యాండ్ అనే వర్డ్ వాడారనీ, మాతృస్వామ్యం ఉన్న బ్రెజిల్ ఇటలీ మెక్సికో రష్యాలలో మదర్ ల్యాండ్ అని వాడారని తెలుస్తుంది. ప్రాచీన నాగరికతల వారు 'ఆంథ్రపోమెట్రిక్ మ్యాప్స్' లో ఆయా దేవతల స్వరుపాలని గీస్తూ దేశాల భాగాలను గుర్తించినట్లు మనకు తెలుస్తుంది. గ్రీకులు కూడా 'గైయా' అనే దేవతను భూ దేవతగా కొలుచుకున్నారు.
రష్యాలో వేరు వేరు పదాలు దేశంతో మనిషికి గల సంబంధాన్ని వివరిస్తాయి. 'రోదినా' అంటే మదర్ల్యాండ్ అనీ, 'ఒట్ఛినా' అంటే ఫాదర్ ల్యాండ్ అనీ అర్థాలున్నాయి. 'రష్యా మాతుష్క' అంటే మదర్ రష్యా అని. సోవియట్ నేషనల్ ఆంథంలో 'సింగ్ టు ద మదర్ ల్యాండ్, హోమ్ ఆఫ్ ద ఫ్రీ' అని గొప్పగా పాడుకోవటం ఉంటుందట. కోల్డ్ వార్ లో భాగంగా మదర్ ల్యాండ్ అనే వర్డ్ ని లేకుండా చేసే కుట్రలు జరిగాయని అంటారు. కానీ ప్రస్తుతం ఉన్న నేషనల్ ఆంథంలో ఫాదర్ ల్యాండ్ అనేపదమే ఉందట. టాల్స్టాయ్ కూడా రష్యాని ఫాదర్ ల్యాండ్ అనే ఉపయోగించాడట. కానీ రష్యా నుంచి వచ్చే అనేక ఫెయిరీ కథల్లో మదర్ ల్యాండ్ అనే వాడకమే ఉంటుందట.  {రష్యన్ భాష మీద సంస్కృతి మీద అవగాహన ఉన్న వారు ఇంకాస్త వివరాలు తెలిపితే బాగుంటుంది }
ప్రస్తుతం అమెరికన్ ఇంగ్లీషు డిక్షనరీల్లో కూడా 'మదర్ ల్యాండ్' అనే పదమే ఉందని గుర్తించాలి. పెంటగాన్ దాడులు జరిగాక అమెరికా ప్రభుత్వం 'హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఆక్ట్' అనేది ప్రవేశపెట్టినా, 'హోమ్ ల్యాండ్' అనే పదం డిక్షనరీల్లో ఇంకా స్థానం పొందలేదట. కానీ సగటు అమెరికన్ మదర్  ల్యాండ్ లేదా ఫాదర్ ల్యాండ్ అనే భావనతో దేశానికి కనెక్ట్ అయినట్లుగా ఈ హోమ్ ల్యాండ్ అనే పదం తో కనెక్ట్ కాలేకపోతున్నారట. ఇదంతా గోబెల్స్ నటన అని వాపోతున్నారట. మాతృదేశానికి జై అనటం అదేదో మత భావజాలానికి సంబంధించినదని మిన్నకుండటం ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం వంటిది. కొన్నేవో మత శక్తులు ఈ స్లోగన్ ని వాడుకుంటే, దానికి ప్రతిగా ఈ స్లోగన్ ని మతవాదివి అని తిట్టడం అర్థం లేని పనే. స్వతంత్ర్య సంగ్రామంలో  లేని మతం ఆ సమాజానికి కనిపించని బూతు ఈ సమాజానికి కనిపించటం సమాజం ఎటు పోతుందోనని చెప్పటానికి ఉదాహరణ. ఈ కవిత నిడివి చాలా పెద్దది. ఈ అబ్రిడ్జ్ వర్షన్ కి ఇంకా రెండింతలు ఉంటుంది. ఫోర్స్ తగ్గ కూడదని లెంత్ తగ్గించాల్సి వచ్చింది. కానీ ఇదే ఫైనల్ వర్షన్ లాఱఉంచేద్దామనే ధైర్యం ఇపుడు వచ్చింది.  ఈ కవిత మిత్రుడు 'చేగో'  కి అంకితం.

కవిత్వ సందర్భం12

రక్త మాంసాలతో తిరిగే యంత్రం
-------------------------------------------
Most dangerous man after Jesus Christ ఎవరు అంటే కార్ల్ మార్క్స్ అనే చెప్పాలి. ఒకరికొకరు సైద్ధాంతిక వ్యతిరేకులే. "ఏమి తినాలి? ఏమి తాగాలి? ఏమి కట్టుకోవాలి అనే విషయమై భయపడకండి. దేవుని  సామ్రాజ్యాన్ని ఆతడి నైతికతని కోరుకోండి" అంటాడు జీసస్. (మాథ్యూ 6: 31-33). కానీ ఎంగెల్స్ ప్రకారం మార్క్స్ దృక్కోణం దీనికి పూర్తిగా విరుద్ధమైనది. "మతమూ, శాస్త్రీయ  పరిజ్ఞానానమూ, కళ, రాజకీయమూ ఇత్యాది అన్నింటికంటే ముందు మనిషి తినాలి, తాగాలి, బట్ట కట్టాలి, ఒక ఇంట్లో నివసించాలి" అంటాడు మార్క్స్. మతం స్వర్గాన్ని ప్రతిపాదిస్తుంది, దాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడంటుంది. మార్క్స్ దేవుడి స్వర్గాన్ని పగలగొట్టి యుటోపియన్ సమాజాన్ని కడతానంటాడు. దేవుడిచ్చేదేంది, దాన్ని మనిషే సాధించుకోవాలంటాడు. ఎక్కడినుంచొచ్చాడీ మార్క్స్?. భూస్వామ్య వ్యవస్థలోని రైతు కూలీలు అనబడే కుళ్ళిన కళేబరాలు, ఒకానొక స్వేచ్ఛా స్వాతంత్యాల ఎరలో పారిశ్రామిక వ్యవస్థలోకి మారి..రైతు కూలీల నుండి ఫ్యాక్టరీ కూలీలుగా వేషం కట్టి, ఆలోచన చేయటం అనే అలవాటే మరచిపోయిన సమాంజంలోంచి ఒక ఆలోచనగా పుట్టుకొచ్చాడు. అందుకనేమో "ఒక వ్యక్తియొక్క సాంఘిక జీవితమే అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది" అంటాడు మార్క్స్. అది యూరోప్. అక్కడ ఫ్యాక్టరీ పొగగొట్టం లోంచి తన్నుకొచ్చే పొగ, చిమ్మ చీకటిలా, గతకాలపు చరిత్రలా, స్వార్థపరుల్లా చుట్టలు చుట్టుకుంటూ..పలుచనై పటాపంచలౌతూ నే వున్న తరుణం. 1775 సం నుండి 1850 సం మధ్యన వచ్చిన ఈ మార్పే పారిశ్రామిక విప్లవం. కాల్పనికమో, నిజమో, సాతాను అనేవాడు ఒకడు ఉన్నందుకు జీసస్ అనేవాడు ఉన్నాడు. కానీ కళ్ళ ముందు వాస్తవంగా,  వికృతంగా, భయంకరంగా ఫ్యాక్టరీ నిలబడి ఉన్నందుకు కారల్ మార్క్స్ అనే వాడూ ఉన్నాడు. ఆ ఫ్యాక్టరీ ఉన్న చోటు నుండి ప్రజల జీవితం లోకి పాకింది. మార్క్స్ పాకలేక పోయాడు. ఫ్యాక్టరీ ప్రజల జీవితాల్ని ఛిన్నాభిన్నం చేసేసింది. మార్క్స్ బాగు చేయలేక పోయాడు. కానీ ఆలోచనాపరుల, కవుల మెదళ్ళ లోకి పాకాడు. బాహ్య జీవితపు వాస్తవికతనూ, అంతర జీవితపు అవసరాన్ని గుర్తించే చైతన్యాన్ని రగిలించడానికి కాల్పనిక భ్రమలు తొలగించటానికి కవితలై కూడా దూకేశాడు.  అలా మార్క్స్ ను ఒక వాహికగా చేసుకున్న వాడు ఆవంత్స సోమసుందర్.

భారత దేశం సాధించుకున్న స్వాతంత్యం పారిశ్రామిక విప్లవాన్ని కూడా తీసుకువచ్చింది. యూరోప్ కంటే వంద సంవత్సరాలు వెనుకబడినా ఆ అవలక్షణాలన్నిటినీ పుణికి పుచ్చుకుని అక్కడున్నట్టుగానే ఇక్కడికీ వచ్చింది. అదే ధన మదం, అదే నీతిమాలినతనం. అదే నిర్దయనీ, అదే ఆకలినీ, అదే ప్రేత కళనీ తీసుకుని వచ్చింది అణువంతయినా తేడా లేకుండా.  దేవుడు కూడా అక్కడి లాగే ఇక్కడా మౌనంగానే ఉండి పోయాడు. దేవుడు చచ్చిపోయాడన్న  నీషే అరుపులు ఇక్కడి దాకా బహుశా వినపడి వుండవు. పైగా ఎప్పటిలాగానే ధనస్వాములు చచ్చి పోయిన దేవుడు బతికున్నాడని నమ్మించగలిగారు. దేవుడ్ని బతికించారు కూడా . అలా బతికొచ్చిన దేవుడు పెట్టుబడీ దారుడి నమ్మిన బంటై కూర్చున్నాడు. తనని  బతికించారన్న కృతజ్ఞత దేవుడితో పొంగి పొరలి వుంటుంది. ఇక పేదల అన్నార్తుల దీనారవాలని వినే ఓపికెందుకుంటుంది?. ఓపిక ఉన్నా ధనస్వామి విననీయడు. ఎందుకంటే కరిగించిన సీసం అన్నార్తుల నోట్లల్లో కాదు దేవుడి చెవుల్లో కదా పోయబడింది!.

అంచాతనే దేవుడు
ధనస్వామి నమ్మిన బంటై
పేదల అన్నార్తుల దీనారవముల
శ్రవణాలకు చేరువ కానీయడు
దేవుని శ్రవణ పుటమ్ముల
కరగించిన సీసం
పోశాడట ధనస్వామి
సందేహం దేనికి
స్నేహితుడా! యిది సత్యం.

అమాయకుడయిన డేవుడి చేతులూ కట్టివేయబడ్డాయి. సుకుమారులనూ, సోమరి పోతులనూ మాత్రమే సృష్టించడం మొదలు పెట్టాడు దేవుడు. ఆ సోమరి పోతులు తమకు సౌఖ్యాలు చేకూర్చేందుకు తమకు తామే కొత్త దేవుళ్ళయ్యారు. పెట్టుబడి దారులయ్యారు. దీనులనూ అన్నార్తులనూ సృష్టించి, సరికొత్త సృష్టికర్తలయ్యారు. సంపదని తామే సృష్టిస్తున్నాం అన్నారు. సంపదలేని వారిని తమ దాసులుగా చేసుకున్నారు. వారి శ్రమని దోచుకున్నారు. ఆర్థిక స్వేచ్ఛనీ స్వాతంత్యాన్నీ ఎరగా వేసి, విశ్వామిత్రుడి త్రిశంకు స్వర్గాన్ని మించి, దేవేంద్రుడి దేవలోక స్వర్గాన్ని మించి, ఒక అధునాతన స్వర్గాన్ని మలిచారు. దాని పేరే ఫ్యాక్టరీ. ఈ అన్నార్థులంతా అందులో బానిసలయ్యారు. వారంతా అక్కడొక కొత్త జాతిలా తయారయ్యారు. తద్వారా మానవ చరిత్రలో మునుపెన్నడూ లేని కొత్త మానవుడు, ఒకానొక సోమరిపోతు తనకోసం సృష్టించుకున్న మానవుడు, ఒకడు పుట్టుకొచ్చాడు. వాడి పేరు శ్రామికుడు. దినసరి కూలీ కోసం జీవితాన్ని అంకితం చేసుకునే అభాగ్యుడు. దద్దరిల్లే పేగులతో..రక్తం లాంటి స్వేదంతో..సున్నమైన ఎముకలతో దీనంగా నిస్తబ్దతగా, భయ భ్రాంతులతో, జీవకళా రహితంగా, యంత్ర ప్రాయంగా, చివరికి తానే ఫ్యాక్టరీ యంత్రంలో ఒక భాగంగా మారిన నవీన మానవుడే ఈ శ్రామికుడు అనబడే వాడు. అలా సోమరి పోతు పెట్టుబడి దారుడయ్యాడు. కష్ట పడి పని చేసే వాడు శ్రామికుడయ్యాడు. సృష్టి కర్త అనేవాడొకడుంటే, వాడు ధనవంతులకు దేవుడయ్యాడు, ధనవంతుడు శ్రామికుడికి దేవుడయ్యాడు. శ్రామికుడు యంత్రంలో ఒక భాగమయ్యాడు. ఫ్యాక్టరీ దేవాలయమయ్యింది. పెట్టుబడీదారి వ్యవస్థ మతమయ్యింది. అదంతా మనముందు ఈ కవితలా మారింది.

శ్రామికుడు తింటాడు, ఫ్యాక్టరీలో పని చేయటం కోసం. పడుకుంటాడు, పొద్దున్నే ఫ్యాక్టరీ సైరన్ వినటం కోసం . విశ్రమిస్తాడు ఫ్యాక్టరీలో సరిగా పని చేయటం కోసం. ఆదివారం సినిమాకు పోతాడు, సోమవారం నుంచి శని వారం దాకా ఫ్యాక్టరీలో ఉండటం కోసం. భార్యా పిల్లలతో కాసేపు గడుపుతాడు మనసులో పని భారాన్ని తగ్గించుకోవటం కోసం. పనిలో నిపుణత పెంచుకుంటాడు, ఫ్యాక్టరీలో మంచి పేరు తెచ్చుకోవటం కోసం. ట్రైనింగ్ సెంటర్ లలో ట్రైనింగ్ తీసుకుని స్కిల్ నేర్చుకుంటాడు, ఫ్యాక్టరీలో ఉద్యోగం ఊడకుండా ఉండటం కోసం. కానీ అందుకు ప్రతిగా ఫ్యాక్టరీ ఏదీ వాడికి మిగలనీయదు. కాళ్ళ నూ గోళ్ళనూ నల్ల బరుస్తుంది. బొబ్బలెక్కిస్తుంది. చార్లీ చాప్లిన్ మోడరన్ టైమ్స్ (Modern Times) లో చూపించినట్టు నరాలు పగిలిపోతాయి (Nervous Brakedown). ఊపిరి తిత్తుల్లో రంధ్రాలు పడతాయి (pnemoconiosis). ఫ్యాక్టరీ దగ్గునీ, ఉబ్బసాన్నీ క్షయ (TB) వ్యాధినీ అదనపు కానుకగా ఇస్తుంది. వాడి జీవితంలో ప్రతీ విషయాన్నీ factory ప్రభావితం చేస్తుంది.  పెట్టుబడి దారుడు మాత్రం శ్రామికుడి శ్రమ శక్తిని 'అదనపు విలువ'గా మార్చుకుని లాభాలు గడిస్తాడు. అవైలబుల్ డాటా ప్రకారం, 1950-60 దశకంలో తూ ర్పు యూరోప్ దేశాల్లో యంత్ర సామాగ్రి ఉత్పత్తి సగటున 500 శాతం పెరిగితే, 30 శాతం మరణాలు కేవలం పారిశ్రామికికరణ వల్లనే పెరిగాయట.

అదిగో అది ఫ్యాక్టరీ
శక్తిలేని హీనస్వరమున
అలసిన పెనుభూతంలా
బెబ్బులిలా
గర్జిస్తున్నది ఫ్యాక్టరీ
స్పృహ తప్పిన భుజంగం వలె
భుగభుగమని
పొగలెగజిమ్ముతోంది చిమ్నీ

పారిశ్రామికీకరణ శ్రామిక జీవితాల్నే కాదు. ప్రజలందరి జీవితాల్నీ ప్రభావితం చేస్తుంది. కొత్త నగరాలు ఏర్పడతాయి. పనికోసం గ్రామాల నుంచి నగరాలకు వలసలు పెరుగుతాయి. ఓవర్ క్రౌడింగ్ ఉంటుంది. కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ఫ్యాక్టరీ వేస్ట్స్ పారే నదులల్లో, చెరువుల్లో కలుస్తాయి. నదులు మూసీ కాలువలవుతాయి. చెరువులు హుసేన్ సాగర్లవుతాయి. నిశ్శబ్ద౦గా తెలియకుండానే లెడ్ వంటి విష పదార్థాలు ఆ చుట్టు పక్కల నివసించే వారి రక్తంలో ప్రవహిస్తాయి. అర్థం కాని జబ్బులొస్తాయి. ఆకు కూరల్లో, కూరగాయల్లో, తాగే నీటిలో ఉండాల్సిన దానికన్నా అధిక పీపీఎమ్ ల లోహాలు వచ్చి చేరుతాయి. అంతా సవ్యంగా జరుగుతున్నట్టు, జీడీపీ, పర్ కాపిటా ఇన్కమ్ పెరిగిపోతున్నట్టూ భ్రమలు అల్లుకుంటాయి. స్ట్రెస్ తో, జబ్బులతో క్వాలిటీ ఆఫ్ లైఫ్ (Quality of Life) మాత్రం  భయంకరంగా తయారవుతుంది.

కానీ ఈ కవితలో కవికి ఒక నమ్మకం ఉంటుంది. ఈ శ్రామికులంతా ఏకమై ధన్స్వామ్య దోపిడీ దుర్గాన్ని కూలగొట్టేస్తారని. "ప్రపంచ కార్మికులరా ఏకం కండి- పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప" అని కమ్యూనిస్ట్ మేనిఫెస్టో లో చివరి సారిగా అరిచిన మార్క్స్ ఒక నమ్మకాన్ని కవిలో కలిగించాడేమో. ఆ శుభ సమయం ఒచ్చేస్తున్నట్టు కలగంటాడు ఈ కవి.  "మనం ఉరి తీయాల్సిన చివరి కాపిటలిస్ట్ ఆ ఉరి తాడును మనకి అమ్మినవాడే అయ్యుంటాడు" అని అమాయకంగా మార్క్స్ అనుకున్నట్టు 1949 లో కవి రాసుకుంటాడు. ఆ అభ్యుదయ సమయం లో తెలుగునేలను తడిపిన హేతువాద దృక్పథం, ప్రజా సన్నితత్వం, వాస్తవిక చిత్రణ, సమస్యల విశ్లేషణలో మార్క్స్ సిద్ధాంతల సమన్వయము అన్ని కలగలిసిన "వజ్రాయుధం" లా కవి కనిపిస్తాడు. యూరోప్ లోని అనుభవాలు మనకూ ఎదురు కాకూడదని మనదేశ౦లో పారిశ్రామికీకరణ మొదలైన ఆ సమయంలోనే కార్మికుడిగా భారతీయుడు అవతరించిన తోలి దశ లొనే ఆ వ్యవస్థ డొల్లతనాన్ని మన ముందు కవితల పరుస్తాడు.

ఫ్యాక్టరీ (excerpts only)
.....................
అదిగో అది ఫ్యాక్టరీ
ధనమదాంద అధికారుల
కనికర రహిత గర్వం
ఆకృతియై
నిలిచిన ఫ్యాక్టరీ

అహంకార ధికృతిగా
భువి పేగులు దద్దరిల్ల
నీతిమాలి గర్జిస్తుందదిగో

చూస్తున్నావా
మానవులేనని పొరబడుతున్నావా?

రెండు కాళ్ళ పై కదిలే
యంత్రాంతర్భాగమ్ముల దేహమ్ములు
ప్రతీ స్వేదబిందువులో
రక్తం వాహినిగా ధారవోసి
తేనెను సమీకరించేందుకు మాత్రం
పుట్టిన కూలీలవి
చూస్తున్నావా?

వారా? మానవులా??
సత్స్వరూప వారసులా?
రక్తమాంసములు కలిగిన
యంత్రాంతర్భాగమ్ములు

అదిగో అది ఫ్యాక్టరీ
శక్తిలేని హీన స్వరమున
అలసిన పెనుభూతంలా
బెబ్బులిలా
గర్జిస్తున్నది ఫ్యాక్టరీ

నెత్తురు కక్కుతున్న
తూట్లు పడ్ద ఊపిరితిత్తులవలె
నల్లని పొగ చిమ్ముతోంది చిమ్నీ

స్నేహితుడా చూస్తున్నావా

అనితర సాధ్యమ్మగు
ప్రజాశక్తి సైన్యాలై
విలయకాల రౌద్రంతో
విప్లవ చైతన్యంతో
పురోగమిస్తున్నారదిగో

కార్మిక కోపాగ్నిచ్ఛటలకు
తాల లేని శలభంవలె
ధనస్వామి తపతపమని
పాదాంతం వణికిపోయి
విప్లవ శక్తికి
పాదాక్రాంతుడయే
శుభసమయమ్మిదే
ఆసన్నం అవుతున్నది
ఆరంభించిందపుడే

15/3/16
(కవిత్వ సందర్భం12)

విరించి ll అర్థరాత్రి కవిత ll
......................................
కండ్లు లేని నా మనోబుద్ధులకు
రెండు కండ్లు అతికించుకుంటాను..
నాలోపలికితొంగి చూసుకోవడానికి
ఈ ప్రపంచాన్నొక కిటికీ చేసుకుంటాను

సకలేంద్రియాలనూ
జీవితంలో ముంచి నానేసిన వాణ్ణి
ఉతికి, మలినాలన్నిటినీ కడిగి
గుర్తులుగా
ఎక్కడైనా ఆరేయటమే మిగిలిందిక

అవిగో..సింహపు అరుపులేవో
లోలోతుల కారడవుల్లోంచి
ప్రస్ఫుటంగా వినవస్తున్నాయి
ఒక పక్కకి ఒరిగి కూర్చుని
వినపడినదంతా ఎప్పటికప్పుడు రాసేసుకోవాలి
పేపరు మీద సింహమై గర్జించాలి.

ఎవరన్నారిక్కడ సముద్రంలేదని?
నేను నడుస్తున్నదంతా
జీవన సంద్రమే

ఈ బాధలు
ఎడతెగక మంత్రాలు చదివే ఋషులు
చెవులొడ్డి సరిగా వింటే చాలు
అద్భుతమైన బోధకులు

చీకటిగదిలో ఒంటరిగా ఏడుస్తున్నపుడో
విందు భోజన సమూహాల్లో
పదిమందితో కలిసి నవ్వుతున్నపుడో
నన్ను నేను అలంకరించుకుంటున్నట్టే వుంటుంది.
పగిలిన అద్దం ముక్కలా
ప్రపంచం చేతికి చిక్కినట్టు వుంటుంది.

రాత్రికి నిద్ర వస్తుందిలే అని
పని వత్తిడిలో వేలాడిన
పగటి హృదయావస్థ మీద
రాత్రి వేసిన సటైరే ఈ కవిత

అయితేనేం...
అనుభూతుల్ని కాల్చి
ఆ బూడిదను వంటికి పూసుకుంటాను
అర్థరాత్రి కవితయై శివుడిలా నిలబడతాను
సిరాను కంఠంలో దాచి
బాధామృతాన్ని లోకానికి పంచేస్తాను.

3/3/16