విరించి ll అర్థరాత్రి కవిత ll
......................................
కండ్లు లేని నా మనోబుద్ధులకు
రెండు కండ్లు అతికించుకుంటాను..
నాలోపలికితొంగి చూసుకోవడానికి
ఈ ప్రపంచాన్నొక కిటికీ చేసుకుంటాను
సకలేంద్రియాలనూ
జీవితంలో ముంచి నానేసిన వాణ్ణి
ఉతికి, మలినాలన్నిటినీ కడిగి
గుర్తులుగా
ఎక్కడైనా ఆరేయటమే మిగిలిందిక
అవిగో..సింహపు అరుపులేవో
లోలోతుల కారడవుల్లోంచి
ప్రస్ఫుటంగా వినవస్తున్నాయి
ఒక పక్కకి ఒరిగి కూర్చుని
వినపడినదంతా ఎప్పటికప్పుడు రాసేసుకోవాలి
పేపరు మీద సింహమై గర్జించాలి.
ఎవరన్నారిక్కడ సముద్రంలేదని?
నేను నడుస్తున్నదంతా
జీవన సంద్రమే
ఈ బాధలు
ఎడతెగక మంత్రాలు చదివే ఋషులు
చెవులొడ్డి సరిగా వింటే చాలు
అద్భుతమైన బోధకులు
చీకటిగదిలో ఒంటరిగా ఏడుస్తున్నపుడో
విందు భోజన సమూహాల్లో
పదిమందితో కలిసి నవ్వుతున్నపుడో
నన్ను నేను అలంకరించుకుంటున్నట్టే వుంటుంది.
పగిలిన అద్దం ముక్కలా
ప్రపంచం చేతికి చిక్కినట్టు వుంటుంది.
రాత్రికి నిద్ర వస్తుందిలే అని
పని వత్తిడిలో వేలాడిన
పగటి హృదయావస్థ మీద
రాత్రి వేసిన సటైరే ఈ కవిత
అయితేనేం...
అనుభూతుల్ని కాల్చి
ఆ బూడిదను వంటికి పూసుకుంటాను
అర్థరాత్రి కవితయై శివుడిలా నిలబడతాను
సిరాను కంఠంలో దాచి
బాధామృతాన్ని లోకానికి పంచేస్తాను.
3/3/16
No comments:
Post a Comment