Saturday, 26 March 2016

విరించి ll భారత్ మాతాకీ జై ll
....................................
అవును మనం గెలిచాం
క్రికెట్లో వాడెవడో బలిసిన వాడు సిక్స్ కొట్టాడట
అందుకే మనం గెలిచామట
భారత్ మాతాకీ జై అనాల్సిందే
అంటావు సరే..!
రా.. ఒకసారి ఇటు వచ్చి చూడు

అవును మనం గెలిచాం
ఎవరెస్ట్ శిఖరం మీద ఇంకెవడో జండా పాతాడంట
అందుకే మనం గెలిచామట
భారత్ మాతాకీ జై అనాల్సిందే
అంటావు సరే..!
రా.. ఒకసారి ఇటు వచ్చి చూడు

అవును మనం గెలిచాం
దేశం కాని దేశంలో ఎవడో ఓ నగరానికి మేయర్ అయ్యాడంట
అందుకే మనం గెలిచామంట
భారత్ మాతాకీ జై అనాల్సిందే
అంటావు సరే..!
రా.. ఒకసారి ఇటు వచ్చి చూడు

అవును మనం గెలిచాం
ఇంకో దేశంలో డాక్టర్లూ ఇంజనీర్లంతా మనవారేనట
అందుకే మనం గెలిచామంట
భారత్ మాతాకీ జై అనాల్సిందే
అంటావు సరే..!
రా.. ఒకసారి ఇటు వచ్చి చూడు

అవును మనం గెలిచాం
టాప్ టెన్ ధనవంతుల్లో ముగ్గురు మనదేశం వారేనట
అందుకే మనం గెలిచామట
భారత్ మాతాకీ జై అనాల్సిందే
అంటావు సరే..!
రా.. ఒకసారి ఇటు వచ్చి చూడు

ఈ దేశ ఆకాశపు అంచు మీద
చంద్రుడు పీనుగులా చచ్చి పడి ఉన్నాడు చూడు
ఆ చంద్ర బింబంలో తరతరాలుగా ఏ మార్పూలేక
ఈ దేశపు ప్రతిబింబం గడ్డకట్టింది చూడు

విశాల భవంతుల మధ్య
ఇరుకు వీధుల్లో నిలబడినపుడు
రాళ్ళ వంటి మనుషుల నడుమ
పిచ్చి మొక్కల్లా ఎదిగొచ్చే పసి పిల్లల్ని చూడు

పొగ చిమ్మే ఇనుప చిమ్నీల మధ్య
పచ్చని చెట్లు నల్లబారుతున్నపుడు
శిథిల అవశేషంలా మిగిలిన వీధికుక్క
బక్క చిక్కిన కడుపును చూడు

జుయ్యని లేచే ఈగల మధ్య
తట్టలో పిడికెడు మెతుకులతో ఓ బిడ్డ
వడలిన పాలిండ్లతో ఓ తల్లీ..
బతుకు కాన్వాసు పై అతికిన జాకెట్టు ముక్క చూడు

ఇవన్నీ చూస్తున్నపుడు
నీ గొంతు సవరించుకో..
ఎత్తిన పిడికిలిని ఒక్క క్షణం ఆపి పట్టుకో..

కనుగప్పిన కామంతో
ఆడపిల్లను చెరుస్తావు చూడు
అప్పుడు అను
భారత్ మాతాకీ జై అను

చెంబులతో పొలాలకి ఉరికే
చెల్లెమ్మలను చూసినపుడు
అప్పుడు అను,
భారత్ మాతాకీ జై అను

యూనివర్సిటీ పుస్తకాల్లో
రాజకీయ జండాలు పేజీలైనపుడు
అప్పుడు అను
భారత్ మాతాకీ జై అను

అరే మేధావీ...!
రైతులు పంటలు పండిస్తే
కూర్చుని తిని బలిసిన మేధావీ..!
నీకేం తెలుస్తుంది
ఈ నేల మీద పుట్టిన ప్రతివాడికీ
తిండి పెట్టే రైతునడుగు చెబుతాడు
టన్నుల కొద్దీ పంటలు పండించే ఈ నేల
నీకు కన్న తల్లి అవుతుందో కాదో లెక్కలేసి చెబుతాడు

అరే మిత్రమా..!
నీ గొంతు మరోసారి సవరించుకో
ఎత్తిన పిడికిలిని ఒక్క క్షణం ఆపి పట్టుకో..
ఏది మన గెలుపో
ఏది మన ఓటమో ఇంకొక్క సారి గుర్తు తెచ్చుకో...
ఈ ఓటమి అంతం అయ్యేటట్టు
జోర్ సే బోలో..భారత్ మాతాకీ జై
గణేష్ నిమజ్జనంలో ముస్లిం నీళ్ళు అందిస్తున్నపుడు
జోర్ సే బోలో భారత్ మాతాకీ జై
పీర్ల పండుగలో హిందువులు పీర్లెత్తినపుడు
జోర్ సే బోలో భారత్ మాతాకీ జై
క్రిస్టమస్ రోజున ప్రతి ఇంటి ముందు నక్షత్రం వేలాడినప్పుడు
జోర్ సే బోలో భారత్ మాతాకీ జై
గొంతులో నరాలు చిట్లి పొయ్యేటట్టూ
ఆకాశానికి చిల్లులు పడేటట్టూ
గుండె లోతుల్లోంచి
ప్రేమంతా ఊడిపడేటట్టు
తిరంగా జెండా చేతులనిండా పట్టుకుని
ఔరేక్ బార్ జోర్సే బోలో
భారత్ మాతా కీ జై.

20/3/16

...............................................................
'మాతృ భూమి' అనే దానికి ఇంగ్లీషులో సరి సమానమైన పదం 'మదర్ ల్యాండ్'
ఈ ఇంగ్లీషు పదం వివిధ రూపాల్లో వివిధ దేశాల్లో ఉంది. మదర్ కంట్రీ అనే పదం ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు డిక్షనరీలో 1587 లోనే చోటు చేసుకుంది
పుట్టిన దేశాలకు 'ఫాదర్ ల్యాండ్' అనీ, 'మదర్ ల్యాండ్' అనీ జెండర్ ని కలుపుతూ వాడటం మన దేశానికే పరిమితమైన అంశం కాదు.
పితృస్వామ్యం ఉన్నటువంటి జర్మనీ వంటి దేశాల్లో ఫాదర్ ల్యాండ్ అనే వర్డ్ వాడారనీ, మాతృస్వామ్యం ఉన్న బ్రెజిల్ ఇటలీ మెక్సికో రష్యాలలో మదర్ ల్యాండ్ అని వాడారని తెలుస్తుంది. ప్రాచీన నాగరికతల వారు 'ఆంథ్రపోమెట్రిక్ మ్యాప్స్' లో ఆయా దేవతల స్వరుపాలని గీస్తూ దేశాల భాగాలను గుర్తించినట్లు మనకు తెలుస్తుంది. గ్రీకులు కూడా 'గైయా' అనే దేవతను భూ దేవతగా కొలుచుకున్నారు.
రష్యాలో వేరు వేరు పదాలు దేశంతో మనిషికి గల సంబంధాన్ని వివరిస్తాయి. 'రోదినా' అంటే మదర్ల్యాండ్ అనీ, 'ఒట్ఛినా' అంటే ఫాదర్ ల్యాండ్ అనీ అర్థాలున్నాయి. 'రష్యా మాతుష్క' అంటే మదర్ రష్యా అని. సోవియట్ నేషనల్ ఆంథంలో 'సింగ్ టు ద మదర్ ల్యాండ్, హోమ్ ఆఫ్ ద ఫ్రీ' అని గొప్పగా పాడుకోవటం ఉంటుందట. కోల్డ్ వార్ లో భాగంగా మదర్ ల్యాండ్ అనే వర్డ్ ని లేకుండా చేసే కుట్రలు జరిగాయని అంటారు. కానీ ప్రస్తుతం ఉన్న నేషనల్ ఆంథంలో ఫాదర్ ల్యాండ్ అనేపదమే ఉందట. టాల్స్టాయ్ కూడా రష్యాని ఫాదర్ ల్యాండ్ అనే ఉపయోగించాడట. కానీ రష్యా నుంచి వచ్చే అనేక ఫెయిరీ కథల్లో మదర్ ల్యాండ్ అనే వాడకమే ఉంటుందట.  {రష్యన్ భాష మీద సంస్కృతి మీద అవగాహన ఉన్న వారు ఇంకాస్త వివరాలు తెలిపితే బాగుంటుంది }
ప్రస్తుతం అమెరికన్ ఇంగ్లీషు డిక్షనరీల్లో కూడా 'మదర్ ల్యాండ్' అనే పదమే ఉందని గుర్తించాలి. పెంటగాన్ దాడులు జరిగాక అమెరికా ప్రభుత్వం 'హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఆక్ట్' అనేది ప్రవేశపెట్టినా, 'హోమ్ ల్యాండ్' అనే పదం డిక్షనరీల్లో ఇంకా స్థానం పొందలేదట. కానీ సగటు అమెరికన్ మదర్  ల్యాండ్ లేదా ఫాదర్ ల్యాండ్ అనే భావనతో దేశానికి కనెక్ట్ అయినట్లుగా ఈ హోమ్ ల్యాండ్ అనే పదం తో కనెక్ట్ కాలేకపోతున్నారట. ఇదంతా గోబెల్స్ నటన అని వాపోతున్నారట. మాతృదేశానికి జై అనటం అదేదో మత భావజాలానికి సంబంధించినదని మిన్నకుండటం ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం వంటిది. కొన్నేవో మత శక్తులు ఈ స్లోగన్ ని వాడుకుంటే, దానికి ప్రతిగా ఈ స్లోగన్ ని మతవాదివి అని తిట్టడం అర్థం లేని పనే. స్వతంత్ర్య సంగ్రామంలో  లేని మతం ఆ సమాజానికి కనిపించని బూతు ఈ సమాజానికి కనిపించటం సమాజం ఎటు పోతుందోనని చెప్పటానికి ఉదాహరణ. ఈ కవిత నిడివి చాలా పెద్దది. ఈ అబ్రిడ్జ్ వర్షన్ కి ఇంకా రెండింతలు ఉంటుంది. ఫోర్స్ తగ్గ కూడదని లెంత్ తగ్గించాల్సి వచ్చింది. కానీ ఇదే ఫైనల్ వర్షన్ లాఱఉంచేద్దామనే ధైర్యం ఇపుడు వచ్చింది.  ఈ కవిత మిత్రుడు 'చేగో'  కి అంకితం.

No comments:

Post a Comment