Thursday, 31 March 2016

(కవిత్వ సందర్భం 13)

పిచ్చి మాటలు కాకపోతే..నగరంలో అందమెక్కడుంది?
............................
Poets are the unaknowledged legeslators of the world  అన్నాడు షెల్లీ. ప్రపంచం స్థిరంగా ఉండదు. కవి ద్రష్ట నిరంతరం మారుతున్న ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాడు.  మార్పును గుర్తించ గలిగిన వాడే మార్పును తీసుకురాగలడు. గుర్తించలేని వాడు ఆ మార్పులో ఒక భాగం అయి, కాలంలో అందరితోపాటూ కొట్టుకుపోతాడు. గ్రీకులు కవిత్వాన్ని Art of persuation  అన్నారు. కవిత్వం ఒప్పించగలగాలి. ఒప్పించగలిగినపుడే మార్పు సాధ్యం. అందుకు ముందుగా స్పష్టంగా మార్పును చూడగలగాలి. అందరికీ ఆధారం ఇంద్రియానుభవమే. కానీ గడించిన ఇంద్రియానుభవం కవిలో ఒక అవగాహనగా మారుతుంది. ఆ అవగాహన ఒక జ్ఞానంలా కవికి జ్ఞానబోధ చేస్తుంది. పొందిన జ్ఞానాన్ని ఒప్పించగలిగే ధారలా రసాత్మకంగా అక్షరీకరించే సాధనే కవిత్వం. కాలధర్మం ప్రకారం నూతనంగా పుట్టుకొచ్చే విలువల్నీ, అసలు ప్రపంచాన్నే తన కవిత్వంలో లిఖిస్తాడు బ్రహ్మలా కవి. అటువంటి కాలిక స్పృహ చారిత్రక నియతి కలిగిన కవి నందిని సిధారెడ్డి.

మన౦ పారిశ్రామికీకరణ దశను దాటేశాం. ప్రపంచీకరణ దశ మనది. పశ్చిమాన ఒకప్పుడు పారిశ్రామికీకరణ విరుచుకు పడితే సాహిత్యం దానిమీద తిరగబడింది. కానీ ప్రపంచీకరణ తిరుగుబాటును కూడా వ్యాపారం చేసింది. రాజకీయం చేసింది. ప్రతీ స్పందనకి లోతయిన రాజకీయార్థాలు ఆపాదించి మనిషిని వాని మానవత్వాన్ని శంకించింది. సామాజిక ఆత్మ పుచ్చిపోయింది. మనిషిని పూర్తిగా తనకు తాను కాని పరాయివాడిగా చేసింది. ప్రకృతి ఎన్నో సంపదలను ప్రసాదించింది మానవునికి. జల సంపద, వన సంపద, ఖనిజ సంపద, పర్వత సంపద, భూ సంపద ఇలా. కానీ డబ్బు అనే మనిషి సృష్టించుకున్న సంపద ఈ అన్ని సంపదలనూ నాశనం చేసింది. మలినం చేసింది. మనీ ఈజ్ ద మోడెర్న్ గాడ్ అన్నాడు వర్డ్స్ వర్త్.  కోటీశ్వరులూ, కటికదరిద్రులూ సంఖ్యలో పోటీపడే ఒక విచిత్ర వాతావరణాన్ని సృష్టించింది. గ్రామాలు నగరాలకీ సరిహద్దులే అంతరాలయ్యాయి. గ్రామ జీవిత విధానంలోకి నగరం చొచ్చుకొచ్చింది. నగరమనే మహారణ్యంలోలాగానే పులులు, నక్కలూ, పందులూ, గాడిదలూ గ్రామాల్లో మనిషి రూపాల్లో విరుచుకుపడ్డాయి. అన్నింటినీ కబళించాయి. గ్రామ ప్రజల సంబంధాల్లో డొల్లతనం కొత్తగా పైకి తేలింది. డబ్బును చూపించే దర్పమే ఆదర్శమైనపుడు మనుషుల బుగ్గల మీద పైపై నవ్వులు వెలిశాయి. ఏ మట్టి మీద నడిస్తే ఆ మట్టి సుగుణాలు నెత్తికి ఎక్కుతాయంటారు. అరికాలి మంట నెత్తికెక్కిందని సామెత. గ్రామ్యాన్ని కోల్పోయిన గ్రామం ప్రజల నెత్తిలో పత్తా లేకుండా పోయింది. పైకి అస్థిపంజరమే గ్రామం, శరీరమంతా నగరమే. ఎక్కడికి పోయాడా గ్రామ్యం నిండిన మనిషి?. స్వచ్ఛమైన పల్లె మనిషి. వాడి మాటల్లో ఆ తీయదనం ఏదీ?. డబ్బు చుట్టూతా తిరిగే రాజకీయం వాడి స్వచ్ఛమైన మాటలకు ఎంతటి విషాన్ని పూసిందో. డొల్లతనం, దబాయింపు, అరాచకత్వం ఎలా నిండిపోయాయి ఆ మాటల్లో?. ఎన్ని మధుర జ్ఞాపకాల జీవితం అతడి మాటలకి సొబగును అద్దిందో..అదంతా ఎక్కడ పోయింది?
"సులువుగా మరచిపోతాంగానీ
మన మాటల సొగసంతా సులువుగా అబ్బిందేమీ కాదు"
నిజమైన గ్రామం కనుమరుగయింది. గ్రామం అని పిలవబడుతున్న నగరం పుట్టింది. తన కంటి ముందు ఇటువంటి మార్పును స్పష్టంగా చూస్తాడు కవి. గ్రామంలాగానే ఎండిపోతున్న చెరువు ముందు నిలబడి ఈ గ్రామ ప్రపంచాన్నీ నగర ప్రపంచం ఎలా కబళించి వేసిందో చూస్తాడు కవి.

చెరువు గ్రామ జీవితానికి ఆధారం. నది గ్రామానికి కేవలం అలంకారమే. అది ఊరి బయట ఉండాల్సిందే. చెరువులాగా ఊరిలో జనాల మధ్య ఉండే అవకాశం లేదు. నది పొంగవచ్చు. చెరువు చల్లనిది, పొంగదు, ప్రాణం తీయదు. ప్రాణం నిలబెడుతుంది. నది నీరు పంటకు ఆనదు. ఆనాలంటే ఆనకట్టలు కట్టాలి. వృతాసురుడు గంగకు కట్టినట్లు, ఇప్పటి రాజకీయ నాయకులు కడుతున్నట్లు. ఏ రాష్ట్రానికా రాష్ట్రం కట్టుకోవాలి. జల వివాదాలతో కొట్టుకోవాలి. చెరువుకి ఇదేమీ పట్టదు. అది గ్రామాన్ని పట్టి ఉంచుతుంది. గ్రామాన్ని పట్టుకునే వుంటుంది. ఎక్కడికీ పారిపోదు. ఆనకట్ట అశాశ్వతం. కాంట్రాక్టర్ల కోసం అది ఎప్పటికయినా కూలాల్సిందే. చెరువు శాశ్వతం. కూలేది ఉండదు. పైగా ఎండాకాలం ఎండిపోతే పంటలు పండటానికి పైకి తేలే శిఖం భూమి. అందుకే కాకతీయులు చెరువులు నిర్మించారు. వేల ఎకరాలు సాగుకు నీరందించారు. గొలుసు కట్టు చెరువులు. ఒకటి నిండితే అన్నీ నిండుతాయి. బయ్యారం, గార్ల, రామప్ప, లక్కవరం ఇలా. ఈ రోజుకీ వాటికిందే సేద్యం. వాటి చుట్టూ అందమైన జీవితం. కుల వృత్తుల సందోహం. దిశాంబర ప్రకృతం. అసలు గ్రామమే ప్రకృతిలో ఒక భాగం. ఇక్కడ ఏదీ ప్రకృతికి వ్యతిరేకం కాదు. మాలిన్యం లేదు. కాలుష్యం లేదు. ఆకాశంలో పాల పిట్టల మల్లె పందిరి. సూర్య కిరణాలు పక్షుల్లా కోలాహలం. సురభిళ మందానిలం గ్రామం. కానీ ఇపుడేదీ?. నగరం కోసం గ్రామాల్ని తెగనరకటం మొదలయ్యింది చెట్లలాగా, చెరువులాగా. ఎన్ని పక్షులు, చేపలు గూడులేక క్షుద్భాతతో చచ్చిపోయివుంటాయో. రాజకీయం, డబ్బు వీటిని చూడనీయవు. పైపై మెరుగుల్ని మురికివాడల పక్కనే నిర్మిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం భూమిని భూమిలా ఉంచనీయదు. చెరువును చెరువులా ఉంచనీయదు. ఇదే కవి ఇంకో కవితలో అంటాడు,
"చెరువుదగ్గరికి వెల్లినపుడు
చెరువులానైనా ఉండాలి
చేపలానైనా ఉండాలి
ప్రొక్లెయినర్లా ఉండొద్దంటున్నాం

చెట్టు దగ్గరికి చేరినపుడు
పక్షిలానైనా ఉండాలి
బాటసారిలానైనా ఉండాలి
రంపం పట్టుకుని రావద్దంటున్నాం"

వ్యాపారానికి వావి వరసలే లేవు. ఇంక మంచీ చెడూ అనేదెందుకుండాలి. బడా ధనస్వాముల కోసం రాజకీయాలుంటాయి. పేదలకోసం ఉన్నట్టు బొంకుతాయి. గ్రామాల కోసం రైతుల కోసం కట్టబోయేదే విశ్వనగరమనీ, అందమైన నగరమనీ అబద్దాలు చెబుతాయి. నగరంలో అందమెక్కడుంది? పిచ్చి మాటలతో ప్రజల్ని పిచ్చి వాళ్ళని చేయటం కాకపోతే...!! రాజకీయాలు రైతుల జీవితాల్ని కకావికలం చేస్తాయి. రైతుని మైకు ముందు నిలబెట్టి ఏరోప్లేన్ ఎక్కే కల ఎప్పుడయినా కన్నావా అని అడుగుతాయి. ఏరోప్లేన్ లే ఎక్కడం ఒక మహాద్భుత జీవిత సాఫల్యమని నమ్మిస్తాయి. ప్రకృతిలో పుట్టిన రైతు ఇదేమీ అర్థం కాక తెల్ల మొఖం వేస్తాడు. ఇది కాదు రా జీవితం అని చెప్పలేని వాడు కదా రైతు.

'ఎండిన చెరువు ముందు' అనే ఈ కవిత అలాంటి ఒక చారిత్రక ఘట్టానిది. లోలోతుల్లో బాధని కలిగిస్తుంది. ఆలోచింప జేస్తుంది. మనం కోల్పోతున్న సౌందర్యాన్ని మనకు చూపిస్తుంది. ఎటువంటి జీవితం రాజకీయాల బారిన పడి ఎలా అయిపోయింది.
"కట్ట ఎక్కితే చాలు కడుపు నిండి పోయేది
కను చూపు మేరా
పచ్చని చేన్లతో
చమత్కారంగా కరచాలనం చేసేది
కథలు చెప్పేది.
బర్లమీద కెక్కి సిటీగొట్టె బర్రివాత పిలగాండ్లు
లయబద్దంగా బట్టలు ఉతికే చాకలి పడచులు
పిట్టలు కట్టిన రాగాలూ దాగుడు మూతలూ
తడల్లో చేపల సయ్యాటలూ
ఎంత కమ్మటి ప్రపంచాన్ని కుమ్మరించేవో అపుడు"

 .... అవును అప్పటి జీవితమంతా లయాత్మకమే , నాదాత్మకమే. అంతా కమ్మదనమే. చెరువులు కొల్లగొట్టే రాజకీయ నాయకులు ఇలాంటి కవిత్వం చదవాలి. ద్రష్ట అయిన కవి కవిత్వమే చదవాలి. గుర్తింపులేని న్యాయాధికారి కదా కవి.  ప్రపంచానికి అతడిచ్చే న్యాయం ఏమిటో తీర్పు ఏమిటో ఒకసారి గుర్తించాలి. భారత దేశం ఆత్మ పల్లెల్లో ఉందన్నాడు మహాత్ముడు. ఆత్మలేని దేశాన్ని కానుకగా ఇస్తామంటారు రాజకీయనాయకులు. ఆ ఆత్మ ఏమిటో ఈ కవితలో చూపుతాడు కవి. కవిత చదివాక మానసు మ్లానమౌతుంది. గుండె చెరువవుతుంది. కాలపు ఒక శకలం లా చెరువు మిగిలిపోతుందేమో అని భయం వేస్తుంది. ఆలోచింపజేస్తుంది. జీవనార్తి కళాత్మకత కలగలిపిన ఓక అద్భుత కవిత లోలోతులోకి చొచ్చుకుపోతుంది. దానికి ఇంకో మార్గం ఏముంటుంది?

ఎండిన చెరువు ముందు
________________________
ఊరిపానాదులన్నీ
చెరువుకట్తదిక్కే
మబ్బుల లేచిందగ్గర్నుంచీ
చీకటి చిక్కపడిందాక
నర సంచారమంతా అటు దిక్కే
కట్ట ఎక్కితే చాలు కడుపు నిండిపొయ్యేది
కను చూపుమేరా
పచ్చటి చేన్లతో
చమత్కారంగా కరచాలనం చేసేది.
కథలు చెప్పేది
బర్లమీదికెక్కి సీటిగొట్టే బర్రివాత పిలగాండ్లు
లయబద్ధంగా బట్టలుతికేచాకలి పడతులు
పిట్టలుకట్టిన రాగాలూ దాగుడు మూతలూ
తడల్లో చేపల సయ్యాటలూ
ఎంతకమ్మటి ప్రపంచాన్ని కుమ్మరించేవో అప్పుడు
సులువుగా మరచిపోతాం గాని
మనమాటల సొగసంతా సులువుగా అబ్బిందేం కాదు.
కరువుకు కాలానికి
మన అడుగులే తోడు
పాడుపడిన పానాది వెంట
ఎవరుమాత్రం ఎందుకు నడుస్తారు ?
మనిషిని బట్టే కాలం
ఎండిపొయిన చెరువ్వుముందు నిలబడితే
చూపు పెళ్లలు పెళ్లలుగా విరిగిపడుతుంటది.
వొఠ్ఠిపోయిన రైతుల్లా
నెత్తికి చేతులుపెట్టి
పంటగుండు కుములుతుంటది
ఒళ్ళంతా పగుళ్లతో
ఒండు ఒక ప్రక్కకు ఒత్తిగిలుతుంది
అప్పనంగ్గా వచ్చిన లొట్టపీసు చెట్లు
అపహాస్యంగా నవ్వుతయి
ఎండిన చెరువు
శవం మీద కప్పిన పాత చిరుగ్గుల దుప్పటిలా
పరచుకొని ఉంటది
మొండితుమ్మలు అల్లుకొని మొఖం గుర్తుపట్టటానికే ఉండదు
తుమ్మితే తూము ఊడిపడుతది
అలుగుమత్తడి
అంతదూరం నుంచే ఎక్కిరిస్తుంది
ఆవులించేగట్టు
శిఖం భూమిమీద శిలాశాసనాలు పూస్తయి
ఎండిన చెరువు ముందు నిలబడితే
పద్యం ఎండి పట్టున పగులుతుంది
పిట్టలు లెవ్వు పాటలు లెవ్వు
బుడుంగుమనే బుడుబుంగల జాడలేదు
కిరణాలకు ఎగిసిపడే చేపపిల్లల గురుతుల్లేవు
మైసమ్మ గుడిదిక్కు మల్లిచూసే మానవుడే లేడు
ఎండిన చెరువుని చూస్తే
ఏడుపు ఎగేసుకొస్తది
ఊరందర్నీ సాదిన చెరువు
ఉనికే ఉత్తదయింది
పాడుపడ్డరాజకీయంల
పానాది పాడుపడింది
ఇప్పుడు పానాదులన్నీ బస్టాండు దిక్కే.

30/3/16
(కవిత్వ సందర్భం 13)

No comments:

Post a Comment