Celiotomy fad -. A shaping of dangerous attutudes.
"గృహిణిలతో పోలిస్తే సెక్స్ వర్కర్లలో సెర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ prevalent గా ఉంది". అని ఒక పేపర్ పబ్లిష్ ఐతే.., సైన్స్ పట్ల అవగాహన లేనివాడు ఓహో సెక్స్ వర్కర్స్ సెక్స్ లో ఎక్కువగా పాల్గొంటారు కాబట్టి వారికి క్యాన్సర్ వచ్చిందేమోననుకుని అంగలారుస్తాడు. కానీ సైన్స్ చదివితే ఏమౌతుందంటే ఇదే ఇన్ఫర్మేషన్ మరో రకంగా అర్థమౌతుంది. ఏంటంటే- సామాజిక స్టిగ్మాలవలన, discrimination వలన సెక్స్ వర్కర్ లలో కాన్సర్ స్క్రీనింగ్ సరిగ్గా జరగదనీ, ఒకవేళ జరిగినా ఇవే పై కారణాలవలన వారికి సరైన మెరుగైన వైద్యం సకాలంలో అందే అవకాశం తగ్గుతుందని అర్థం అవుతుంది. అందువలన సర్వైకల్ కాన్సర్ పై జరిగిన ఈ కంపారేటివ్ స్టడీ సామాజిక వ్యవస్థను అర్థం చేసుకుని ఎక్కడ వైద్య సదుపాయాలు పెంచాలనే విషయానికి, అందుకు అవసరమైన చట్టాలు తేవడానికి ఉపయోగపడుతుందే తప్ప ఈ స్టడీని మరో discrimination కి ఊతంగా వాడటానికి కాదు.
ఐతే ప్రపంచ వ్యాప్తంగా సైన్సుని అర్థం చేసుకోలేని చాలా మంది సామాన్యులు తెలిసీ తెలియక కొన్ని చదివి కొన్ని పుకార్లను తోటివారితో పంచుకుంటూ వ్యాపింపజేస్తూ ఉంటారు. Woman sexuality చుట్టూ అలుముకున్న పుకార్లు చరిత్రకు కొత్తవి కావు. అవన్నీ తెలుసుకుంటే మానవ చరిత్రలో మగవాడు ఏర్పరచుకున్న వ్యవస్థల్లో స్త్రీల స్థానం ఏంటనేది అర్థమౌతుంది. సెక్స్ చుట్టూ స్త్రీ లపై జరిగిన దాష్టీకాలు ఎన్నో ఉన్నా రికార్డెడ్ ఐవున్నవి కొన్ని ఉన్నాయి. Early modern Europian history ని చూస్తే పదమూడవ శతాబ్దంలో వివాహం చేసుకోని ఒంటరి మహిళలను , భర్త చనిపోయిన మహిళలను , వృద్ధ మహిళలను, ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించిన మహిళలను, సమాజం విధించిన జెండర్ రోల్స్ ని కాదని పురుషులపై ఎదురుతిరిగాన మహిళలను మంత్రగత్తెలని చెప్పి చంపేవారు. ఎందుకంటే వీరు సెక్సువల్లీ యాక్టివ్ గా ఉంటారనీ వీళ్ళు దయ్యాలతో సంభోగిస్తారనే మూఢనమ్మకాలు వారిలో ఉండేవి. "The Name of the Rose" Novel by Umberto Eco లో ఒకరకంగా ఇది ప్రధానాంశంగా సాగుతుంది.
మనమిపుడు సైంటిఫిక్ గా చాలా ముందుకు పోయామనుకుంటాం. కానీ మోరల్ గా మనం, అంటే మనుషులం పదమూడవ శతాబ్దంకంటే ఇంకా పురాతనంలోనే ఆగిపోయాం. ఈ రోజుకీ వర్జినిటీకి స్త్రీ క్యారెక్టర్ కీ లింక్ పెట్టే ప్రబుద్ధత్వం నిలిచే ఉంది. తాము చేస్తే వీరత్వం ఆడవాళ్లు చేస్తే జారత్వం అనే పోకడలు ఈనాటికీ బలంగా వేళ్ళూనుకుని ఉన్నాయి. మెనుస్ట్రేషన్ 'మైల' అనీ అపవిత్రమనీ అది సాధారణ శారీరక ధర్మం కాదనీ అనుకునేవారు డాక్టరీ చదువుకున్నవారు కూడా ఉంటారు. ఇటువంటి సమయంలో కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు స్మార్ట్ ఫోనూ వంటివి మనకు దొరికాయి. స్త్రీలను మనుషులుగా కాకుండా వస్తువులుగా సంపదలుగా చూసే మత భావజాలాలూ ఎలాగూ కుప్పలు తెప్పలుగా మనచుట్టూ తిరిగే శవాల్లాగా నిండి ఉన్నాయి. కాబట్టి సైన్సు ఈ పాతుకుపోయిన మూఢనమ్మకాలను మరింత బలంగా చేయడానికే ఉపయోగించేవారు పెరిగిపోయారు. ఇరవైయ్యో శతాబ్దం ప్రారంభంలో స్త్రీల శారీరక మానసిక సమస్యలకు కారణం వారిలో ఉండే విపరీతమైన కామ కోరికలేనని ఒక మూఢనమ్మకం మొదలైంది. అప్పటి సామాజిక వ్యవస్థలు సరిగ్గా లేక సరైన సపోర్ట్ లేక కష్టాలు పడే యువతులు హిస్టీరిక్ గా ప్రవర్తించేవారు. ఐతే ప్రజలు వీళ్ళిలా ప్రవర్తించడానికి కారణం వారిలో నిబిడీకృతంగా ఉన్న కామ కోరికలే అని అనుకోవడం మొదలెట్టారు. అది ప్రజలలో ఎంతగా పెరిగిందంటే ఈ ప్రజల నమ్మకాలను ప్రోది చేస్తూ కొందరు డాక్టర్లూ బయలుదేరారు. ప్రజలు తానా అంటే వీళ్ళు తందానా అనేవారు. అంటే చదువుకుని సమాజానికి దారి చూపవలసిన డాక్టర్లు మూఢనమ్మకాలలో పడిపోతే జరిగే నష్టం ఇది. సామాన్యులతో పాటు సమాజపు దారి దీపాల వంటి వారుకూడా ఒకేరకమైన మూఢనమ్మకాలను కలిగి ఉంటే ఆ సమాజం పెంచి పోషించే విలువలు ఎలా మారుతాయో ఇదొక ఉదాహరణ. డాక్టర్ కుల్లింగ్ వుడ్ అనీ డాక్టర్ మరియోన్ సిమ్ అనేవాళ్ళు మహిళలలో కనిపించే ఈ హిస్టీరియా పెల్విక్ న్యూరోసిస్ తగ్గాలి అంటే కడుపు కోసి ఓవరీలనూ యుటిరస్ నీ తీసేస్తే బాగైతారని నమ్మి ఆ ఆపరేషన్ లు మొదలెట్టారు. దీనినే celiotomy అనేవారు. అపుడపుడే సర్జికల్ హైజీనాక్ మెథడ్స్ అనెస్తీషియా వంటివి అభివృద్ధి చెందడంతో చాలామంది మహిళలకు ఈ సర్జరీలు చేసి పడేశారు. ఇది ఒక డేంజర్ యాటిట్యూడ్ ని తెలుపుతుంది. సైన్సు మూఢనమ్మకాలకు మహిళలపై మోరల్ పోలీసింగ్ కూ పాల్పడటంతో వారిపై అనవసరంగా బలవంతపు సర్జరీలు జరిగాయి. (ఇటువంటివి తరువాత జరగలేదని కాదు).
సైన్స్ బోధన స్టిగ్మటైజ్ చేసేందుకు కాదు. అది enlighten చేసేందుకు జరగాలి. ఈ రోజు పొద్దున వచ్చిన రెండు మూడు వాట్సప్ ఫార్వర్డ్ లు చూశాక ఈ ముక్క రాద్దామనుకున్నాను. సర్వైకల్ కాన్సర్ సెక్సువల్లీ ట్రాన్స్ మిటెడ్ జబ్బనీ అనీ మల్టిపుల్ పార్టనర్లు ఉండేవారికీ సెక్స్ వర్కర్లకూ వాక్సిన్ వేయడం మంచిదనీ ఒక రైటప్ వచ్చింది. ఈ ధోరణి నాకు కొత్తగ అనిపించలేదు. ఇది మన సమాజంలో ఎప్పటినుంచో ఉన్న స్త్రీ అణచివేతలో భాగంగా వచ్చిన భావజాలమే. నా భయమంతా ఇదంతా రేప్పొద్దున విక్టిమ్ బ్లేమింగ్ కి దారి తీస్తుందేమోనని. రేప్ చేయబడిన స్త్రీ దే తప్పు అని ఈరోజు ఏవిధంగా మోరల్ పోలీసింగ్ నడుస్తుందో..అదే విధంగా రేప్పొద్దున కాన్సర్ బారిన పడిన అభాగ్యురాలిని టార్గెట్ చేస్తూ ఆమె క్యారెక్టర్ ని కించపరిచే రోజు వస్తుందేమోనని. దీనినే మనం celiotomy fad లో చూశాం. ఇవి సమాజాన్ని అన్ సైంటిఫిక్ పద్ధతులవైపు ఆటవికతవైపు మూఢనమ్మకాలవైపు తీసికెళ్ళే ధోరణులు. కాబట్టి సైంటిఫిక్ పేపర్లను మిస్ రీడ్ చేయకుండా అనుమానాలుంటే మంచి డాక్టర్ల తో చర్చించి నిజానిజాలు తెలుసుకోవడం మంచిది.
విరించి విరివింటి
6/2/24
No comments:
Post a Comment