Genetic reality
ఆర్కపెలాగో అంటే ద్వీపాల సముదాయం. మన భూమి మీద వివిధ ప్రాంతాలలో ఈ ద్వీపాల సముదాయాలు ఉన్నాయి. ఒక రకంగా ఇతర భూభాగాలైన పెద్ద ఖండాలనుండి వేరుచేయబడి ఉండటంతో మొక్కల జంతువుల మనుషుల గురించి చదవడానికి ఇవి ప్రకృతి సహజమైన బయోలాజికల్ ల్యాబ్స్ లాగా ఉపయోగపడతాయి. అందుకే ఆంథ్రోపాలజిస్టులూ, నేచురలిస్టులూ, బయాలజిస్టులు, జువాలజిస్టులు, బోటనిస్టులూ, పరిణామ వాదులు, పర్యావరణవేత్తలూ, డాక్టర్లూ ఈ ప్రాంతాలలో పరోశోధనలు చేయడానికి ఉత్సుకత చూపుతుంటారు. ఇలాంటి ద్వీప సముదాయాలలో పరిశోధనలు చేయాలన్న ఉత్సాహం ఇప్పటిది కాదు. పురాతన కాలం నుండి ఉన్నా 15 నుండి 17 వ శతాబ్దంలో కొలంబస్ , జేమ్స్ కుక్ వంటి వారి సాహసయాత్రలనుండి దీవులను గుర్తించడం వాటికి మ్యాపులు తయారుచేయడం మొదలైంది. ఆ తర్వాత వలసవాద దేశాలనుండి పరిశోధకులు పద్దెనిమిది, పంతోమ్మిదవ శతాబ్దం నుండి ఈ ప్రాంతాలకు వెళ్ళి పరిశోధనలు చేయడం మొదలైంది. ఈ రెండు శతాబ్దాలు చాలా విచిత్రమైన ప్రపంచ పరిస్థితుల్లో ఉన్న శతాబ్దాలు. ఒకవైపు ఏజ్ ఆఫ్ ఎన్లైటెన్మెంట్ నుండి హేతుబద్ధ ఆలోచనలు శాస్త్రీయ దృక్పథమూ, టెక్నాలజీ రూపంలో మైక్రోస్కోపు వంటి సైంటిఫిక్ యంత్రాలు స్పెసిమన్లను భద్రపరిచే టెక్నాలజీ రావడమూ జరుగుతుండగా మరోవైపు వలసవాదంతో ఆయాదేశాలు కొత్త ప్రదేశాలకు పాకుతూ అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయవలసిన అవసరాలు ఏర్పడటమూ జరిగింది. బ్రిటిష్ ఫ్రెంచ్ డచ్చి ప్రభుత్వాలే స్వయానా సాహసయాత్రలను స్పాన్సర్ చేసి పరిశోధనలద్వారా వచ్చిన డాటా ఆధారంగా తన సామ్రాజ్యాలను విస్తరిస్తూ పోయిన తరుణమది. అలా ఆర్కపెలాగోలు వలసలకు అనుగుణమైనవిగా, వ్యవసాయానికి సహజవనరులకూ ఆలవాలమైనవిగా, కొల్లగొట్టడానికి అనువైనవిగా వలసవాదులకు తోచాయి. అందుకై వచ్చిన పరిశోధకుల పరిశోధనలు అక్కడ చూసిన కొత్తరకమైన మొక్కలు జంతువులు మానవులూ, ఇవన్నీ కొత్త లోకాలను వారికి పరిచయం చేశాయి. ఈ విచిత్రమైన పరిస్థితుల్లోంచే జీవపరిణామం అంటే ఏంటో అర్థమవడం మొదలైంది. ఎందరో నేచురలిస్టులు జీవ పరిణామాన్ని అర్థం చేసుకుని వివరించగలిగినా సరైన ఎవిడెన్సులు లేక చాలామటుకు ఊహాగానాలుగా మిగిలిపోగా తిరుగులేని ఎవిడేన్సు లతో జీవపరిణామాన్ని తీసుకువచ్చిన వారు చార్లెస్ డార్విన్, ఆల్ఫ్రెడ్ వాలెస్ లు. ఐతే డార్విన్ గలపాగోస్ ఆర్కపెలాగోలో(1831-1836) పరిశోధన చేస్తే దానికి కొంతకాలం తర్వాత వాలెస్ మలయ్ ఆర్కపెలాగోలో (1854 -1862) పరిశోధనలు చేశాడు.
"ఓ కొలంబస్...! చంపే సైన్యమూ, అణు ఆయుధం, ఆకలిపస్తులూ, డర్టీ పాలిటిక్స్, పొల్యూషన్లేవీ కనబడలేని దీవి కావాలి ఇస్తావా?" అని జీన్స్ సినిమాలో పాట. నిజానికి నేచురలిస్ట్ లు ఇలాంటి కారణాలవలననే ఆర్కిపెలాగోలను తమ పరిశోధనకు ఎంచుకుంటారు. వీటిల్లోని జంతు వృక్ష జాతుల వైవిధ్యం అవి అనువర్తనం (adaptation) చెందిన విధానమూ, వ్యాపించిన విధానమూ అంతరించిన(extinction) క్రమమూ ఎలాంటి ఇతర జీవుల ప్రభావం లేకుండా స్వచ్ఛంగా జరుగుతుందనే ఊహతో ఈ ద్వీపసముదాయాలు వీళ్ళని ఆకర్షించాయి. ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి పరిశోధనలు చేయాలంటే మొదట ఆ గట్స్ కావాలి. Eccentric గా తేడాసింగ్ లాగా కూడా ఉండాలి. డార్విన్, వాలెస్ లు అలాంటివారేనని చెప్పక తప్పదు. తమకంటూ ఎలాంటి సంస్థతో విశ్వ విద్యాలయాలతో సంబంధాలు లేకున్నా తమ సొంత నిర్ణయాలతో విక్రమార్క పట్టుదలతో వీళ్ళు సాహసయాత్రలు పరిశోధనలూ చేశారనే చెప్పాలి. డార్విన్ బీగిల్ లో తిరుగుతూ( నా ఇంతకు ముందు వ్యాసం చూడండి) తన స్పెసిమన్లను తయారుచేసుకుంటే వాలెస్ మలయా ఆర్కిపలాగోలోనే దాదాపు ఎనిమిది సంవత్సరాలు తిష్టవేసి కూర్చుని తన పరిశోధనలు చేశాడు. ఐతే మలాయ్ అర్కిపెలాగోలో ఎన్ని ద్వీపాలున్నాయనుకున్నారు?. చిన్నవీ పెద్దవి కలిపి ఇరవైయైదు వేల ద్వీపాలున్నాయి. ఇందులో మానవ నివాస యోగ్యమైనవి కొన్నే. ఐతే ఈ ద్వీప సముదాయాలలో అతడొక ముఖ్యమైన విషయాన్ని కనుగొన్నాడు. అదే ఈ వ్యాసంలోని ప్రముఖమైన అంశం. అదేంటంటే ఈ ప్రాంతంలోని ద్వీపాలను తూర్పు పడమర ద్వీపాలుగా విభజించుకుంటే పశ్చిమ ద్వీపాలలోని వృక్ష జంతుజాలం ఒకరకంగా ఉంటే తూర్పు ద్వీపాలలో మరోరకంగా ఉన్నాయి. ఇంకా స్పెసిఫిక్ గ చెప్పాలంటే పశ్చిమాన ఉన్న జావా,బాలీ, లంబోక్ దీవులలో ఉండే వృక్ష జంతువుల జాతులు తూర్పున ఉన్న బోర్నియో, సులవేసి దీవులకంటే భిన్నమైనవి. అంటే ఈ దీవులన్నీ పక్కపక్కనే ఉన్నా వీటి మధ్య దూరం అతి తక్కువగా ఉన్నా అక్కడ పెరుగుతున్న జంతు వృక్ష జాతులు పూర్తిగా విభాన్నమైనవి. బాలిలో ఉండే జంతువు ఏదీ బోర్నియో లో లేదు. అలాగే బోర్నియో లో ఉండే జంతువు లేదా వృక్షరకమేదీ బాలిలో లేదు. ఇది విచిత్రం. ఇది గమనించిన వాలెస్ 1859 లో (ఈ సంవత్సరమే డార్విన్ Origin of species పుస్తకం వచ్చంది)తూర్పు పడమర దీవుల మధ్య ఒక ఊహాత్మక గీత గీశాడు. దానినే "వాలెస్ లైన్" అంటారు. సముద్రంలో గీసిన ఈ ఊహాత్మక గీతను దాటుతూ ప్రకృతి పూర్తిగా అటు ఇటూ వేరుగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోవడం ఆంథ్రోపాలజిస్టుల వంతయింది. ఐతే ఈ ద్వీపాలు సముద్రంలో ఒకదానికొకటి దూరంగా విడివడినట్టు ఉంటాయి కాబట్టి ఏ ద్వీపానికాద్వీపం విభిన్న మైన వృక్ష జంతుజాలాలను కలిగి ఉంటుందని ఊహించాడు. ఈ ఊహలో నిజం లేకపోలేదు. కానీ ఇక్కడి పక్కపక్కని దీవులలో విభిన్నమైన జీవం ఉండటానికి అసలైన కారణంగా "కాంటినెంటల్ డ్రిఫ్ట్" ని కనుగొన్నారు 20వ శతాబ్దంలో. ఇండోనేషియాలోని పడమర దీవులు యురేషియా ప్లేట్ లోని సుందా షెల్ లో ఉంటే తూర్పు దీవులు ఆస్ట్రేలియా ప్లేటులోని సాహుల్ షెల్ కి సంబంధించినవి. కాంటినెంటల్ డ్రిఫ్ట్ జరిగిన సమయంలో సుందా, సాహుల్ షెల్ లు పక్క పక్కకు వచ్చి చేరడంతో ఇండోనేషియా పశ్చిమ దీవులలో ఆసియాకి సంబంధించిన వృక్ష జంతు జాతులుండగా, తూర్పు దీవులలో ఆస్ట్రేలియా కి సంబంధించిన వృక్ష జంతుజాలాలు కనబడతాయి.
వాలెస్ పరిశోధనలను 1863 లో పుస్తకంగ తెచ్చే సమయానికి మలాయ్ ద్వీపసముదాయాలను సందర్శించే ఆంథ్రోపాలజిస్టులు ఇతర నేచురలిస్టుల తాకిడి ఎక్కువైంది. ఐతే కొలోనియల్ సమయంలో రేసియల్ థియరీలు కూడా ఊపందుకున్నాయి. వాలెస్ తన అబ్జర్వేషన్ లతో పాటు అదనంగా చెప్పిన ఒక చిన్న అంశాన్ని పట్టుకుని ఆంథ్రోపాలజిస్టులు కోడిగుడ్డు మీద ఈకలు పీకడం మొదలెట్టారు. పొరపాటునో గ్రహపాటునో వాలెస్ ఏం చెప్పాడంటే జంతు వృక్ష జాలలే కాకుండా తూర్పు పడమర దీవుల్లో మనుషుల మధ్య కూడా బేధాలున్నాయి, పడమర వైపు ఉండేవారి చర్మం తెల్లగానూ వెంట్రుకలు పలుచగనూ ఉంటే తూర్పు దీవులలో ఉండేవారి చర్మం నల్లగానూ వెంట్రుకలు మందంగా వొంకులు తిరిగి ఉందని చెప్పాడు. ఇదే తర్వాతి పరిశోధకులకు పనికిమాలిన పనిని కలిగించింది. తమ రేసియల్ థియరీలతో ద్వీపసముదాయాలను చూడటానికి వచ్చిన కలోనియల్ ఆంథ్రోపాలజిస్టులు ఈ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపుతూ మరింత వివరించడం మొదలు పెట్టారు. వృక్ష జంతుజాలాల మధ్య విబేధాన్ని పక్కనబెట్టి ఇక్కడి మనుషుల మీద పడ్డారు. వాళ్ళ రాతల్లో తూర్పు దీవులలో నివసించే మనుషులమీద ఏహ్యభావం చిన్నచూపు కనబడ్డాయి.వారు జబ్బులతో ఉన్నారనీ, శుభ్రత అనేది లేకుండా చూడటానికి అసహ్యంగా ఉన్నారనీ, పైగా నమ్మదగిన వ్యక్తులుగా కనిపించడం లేదనీ రాయడం మొదలెట్టారు. వాలెస్ లైన్ ని వాళ్ళు "వాలెస్ ఆంథ్రోపాలజికల్ లైన్" గా మార్చారు. మనుషులను వారి బాహ్య ఆకారాల ఆధారంగా వారి సంస్కృతుల ఆధారంగా భాషల ఆధారంగా వేరు వేరుగా విభజించవచ్చని కొలోనియల్ ఆంథ్రోపాలజిస్టులు అనుకున్నారు. ఇదే రేషియలైజేషన్. వాలెస్ ఊహించిన వాలెస్ లైన్ కాలక్రమంలో వాలెస్ ఆంథ్రోపాలజికల్ లైన్ గా మారటం కలోనియల్ కాలంలోని రేసియల్ మైండ్ సెట్ ని ప్రతిబింబిస్తుంది.
అంతమాత్రమే కాదు సైన్సు అభివృద్ధి చెందుతున్న తరుణంలో మానవుడి నీచత్వం సైన్స్ ని కూడా ఎలా భ్రష్టు పట్టించగలదో మనకు అర్థమౌతుంది. మానవుడు కులాలుగా మతాలుగా జాతులుగా విడిపోయి అందుకోసం యుద్ధాలు చేసుకోవడం చంపుకోవడం మానవుని భ్రష్టత్వానికి ఋజువులు. పరిశోధకుడు రచయిత ఐన ఆర్థర్ కోస్టలర్ ఏమంటాడంటే - మనిషి మెదడులో ఎక్కడో ఒక స్క్రూ లూజుగా ఉంది, మానవ పరిణామం లో ఎక్కడో ఏదో అంతుచిక్కని తప్పు జరిగిపోయిందని. మానవుడి మస్తిష్కం ఇతర అవయవాల మాదిరిగా కాకుండా చాలా వేగంగా పరిణామం చెందిందనీ అదే బహుశా అతడి స్క్రూ లూజ్ కావడానికి కారణం కావొచ్చనీ అంటాడు. మనం సైన్సు మనలోని మూఢత్వాన్నీ పక్షపాతాల్నీ( prejudices) తొలగించేయాలని కోరుకుంటాం. కానీ సైన్స్ ని ఆధారంగా చేసుకుని అచ్చం సైన్స్ లాగే కనబడే సూడోసైన్స్ ఈ మూఢత్వాలను మరింత పెంచుతూ ఉంటుంది. అలా వచ్చిండేదే "వాలెస్ ఆంథ్రోపాలజికల్ లైన్". కలోనైజేషన్ అమలుపరిచిన రేసియలైజేషన్ "జాతివాదం" పూర్తిగా సూడో సైంటిఫిక్. ఆ కాలంలో యూరోప్ లో ఆంథ్రోపాలజిస్టులు వైద్యంలో కూడా శిక్షణ పొందేవారు. వీళ్ళు మనుషులనూ, సమాజాన్నీ వారి శరీర ఆకృతలుగానే, ఎక్కువ తక్కువలుగా చూసేవారు. ఇదే భావజాలాన్ని వాళ్ళు మలయా ఆర్కపలాగోకి తీసికెళ్ళారు.. ఐతే ఈ వలసవాదులు South East asia లో నాటిన ఆనాటి రేసిస్టు విత్తనం తరువాత చాలా ఘోరమైన మలుపులు తీసుకుంది. ఆ ప్రాంత రాజకీయాలను ప్రభావితం చేసింది. పైకి కనిపించే శరీర లక్షణాల ఆధారంగా "వీళ్ళు నాజాతివాళ్ళు మిగిలిన వాళ్ళు పరాయిజాతివాళ్ళు" అని అక్కడి ప్రజలు నమ్మడం మొదలెట్టారు. విభజించు పాలించు అనేది వలసవాద ఎజెండా అని మనకు తెలిసిన విషయమే. ఐతే ఇండోనేషియా డచ్ వారి ఆధీనంలో ఉండేది.
వెస్ట్ న్యూగీనియా* సమస్య తలెత్తినపుడు ఈ ప్రాతంలో మానవహననాలు జరగడానికి కారణం ఈ ఊహాత్మక 'ఆంథ్రోపాలజికల్ వాలెస్ లైన్' అందించిన భావజాలమే. వెస్ట్ న్యూగీనియా లో పపువా మలనేసియా జాతులవారు శతాబ్దాలుగా కలిసి నివసిస్తున్నారు. కానీ వారి మధ్య చిచ్చు రగిలింది. పపువా వారి చర్మం రంగును వెంట్రుకల మందంని బట్టి వారు తక్కువ జాతివారిగా వివక్షకు గురవడం మొదలైంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఈ ప్రాంతాన్ని ఇండోనేషియా లో కలపాలని జాతీయవాద స్వాతంత్ర్య ఉద్యమాలు జరిగాయి. 1949 లో డచ్ వారినుంచి వెస్ట్ న్యూగీనియాకి విముక్తి లభించి ఇండోనేషియా లో కలిసిపోయారు. కానీ ఇండోనేషియా లోనే ఉండి నిరంతరం వివక్షకు గురయ్యే వెస్ట్ పపువా ప్రజలుమాత్రం ఇండోనేషియా నుండి స్వాతంత్య్రాన్ని కోరుకున్నారు. ఒకవైపు ఇండోనేషియా నేషనలిస్టులు తమదంతా ఒకే చారిత్రక, సాంస్కృతిక నేపథ్యమని వాదిస్తే పపువా నేషనలిస్టులు "వాలెస్ లైన్" ఆధారంగా తాము వేరే జాతికి చెందినవారిమని వాదించారు. కోల్డ్ వార్ లో భాగంగా అమెరికాతో పాటు ఇతర యూరోప్ దేశాలు ఇండోనేషియా వైపు, రష్యా వెస్ట్ పపువా వైపు మొగ్గుచూపాయి. ఐతే ఇప్పటికీ ఈ సమస్య రావణకాష్టమే. ఇప్పటికీ ఇండోనేషియా నుండి స్వాతంత్య్రంకావాలని ఆ ప్రాంతంలో ఘర్షణలు కొనసాగుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనలూ అక్రమ చట్టవ్యతిరేకమైన అరెస్టులు భావ ప్రకటన స్వేచ్ఛను హరించే చర్యలు కొనసాగుతున్నాయి.
విచిత్రం కదా!?. వాలేస్ చేసిన ఒక సైంటిఫిక్ పరిశోధన ఒక సముద్రం గుండా సాగే ఊహాత్మక సైంటిఫిక్ లైన్ ఆ తర్వాత కలొనియలిస్టుల చేతిలో పడి ఏ విధంగా మనుషులను జాతులుగా విడగొట్టిందో, అది చినికి చినికి గాలివానై జాతి విద్వేషాలకు దారి తీసి ఈనాటికీ మండుతూ ఉందో...ఇదంతా విచిత్రంగా ఉంది కదూ!. అంటే ఇక్కడ మనం చూడవలసిన అంశం ఏమంటే - సైన్సు ఏం చెబుతుంది, మనుషుల సాంస్కృతిక - రాజకీయ ప్రాధాన్యాలు ఏమి చెబుతీన్నాయనేది. జెనిటికల్ స్టడీస్ ప్రకారం ఆంథ్రోపాలజికల్ వాలెస్ లైన్ కి ఇవతల అవతల ఉన్న ప్రజలలో ఎలాంటి జన్యుపరమైన బేధాలూ లేవనీ,South east asia లోని ప్రజలందరూ ఒకే పూర్వీకుల జన్యువులు కలిగి ఉన్నారనీ, పలుమార్లు ఈ దీవులకు వివిధ ప్రాంతాలనుంచి వలసలు జరిగి పవివాహాలు జరిగి జెనిటికల్ మిక్సింగ్ జరిగిందనీ సైన్సు చెబుతోంది. అందుకే ఈ ప్రాంత జనాభాలో జెనెటికల్ వేరియేషన్ అధికంగా ఉందనీ తెలుపుతుంది. ఒక ప్రాంతం కావొచ్చు లేదా ఒక దేశం కావొచ్చు ప్రస్తుతానికి దేశమనుకుందాం. జెనెటికల్ వేరియషన్ అనేది రెండు వేరు వేరు దేశాలకు చెందిన ప్రజలకంటే ఒక దేశంలోపల నివసించే జనాభాలో కనుక ఎక్కువగా ఉంటే...ఆ దేశానికి ఇతర దేశాలనుండి వలసలు విపరీతంగా జరిగినట్టు అలాగే ఆ ఇతరదేశాలతో వివాహసంబంధాలు నెరపినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. విచిత్రం ఏంటంటే ప్రపంచంలో దాదాపు ప్రతీ దేశం లేదా ప్రాంతంలో ఇదె సినారియో ఉంది. అటు అమెరికాను తీసుకున్న యూరోపును తీసుకున్నా ఇటు తూర్పుదేశాలైన చైనా భారత్ లను తీసుకున్నా ఆయా జనాభాలలో జనెటికల్ వేరియేషన్ అధికంగా ఉన్నట్లు ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. అంటే సరిహద్దులు లేని, దేశాలనేవేవీ లేని ఒకానొక కాలంలోనే మనుషులు ఒక ప్రాంతంనుండి మరో ప్రాంతానికి వలసలు చేస్తూనే ఉన్నారనీ ప్రపంచంలో ఒకటీ అరా అలా ఎక్కడో మూలకు విసిరేసినట్టు ఉండే అమేజాన్ అడవులో అండమాన్ నికోబార్, సోలోమన్ పసిఫిక్ దీవుల వంటి ప్రాంతాల వాళ్ళు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలవారిలో జెనెటికల్ వేరియేషన్ అధికంగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే ఇపుడు మనం అనుకుంటున్న గ్లోబలైజేషన్ ఎపుడో జరిగింది. దానవీర శూరకర్ణలో కొండవీటి వెంకటకవి రాసినట్టు జెనెటికల్ ఋజువులు ప్రత్యక్షంగా కనబడుతున్న ఈ ఆధునిక కాలంలో జాతి జాతి అనడం ఇపుడు వ్యర్థవాదం.
శరీరాకృతిలోనూ జన్యుపరంగానూ మనుషులు వైవిధ్యాన్ని చూపుతున్నప్పటికీ వారి మధ్యన అడ్డుగోడలు లేవని అవి మసకబారిపోయాయని జన్యు శాస్త్రం తెలుపుతోంది. జీవశాస్త్ర పరంగా నిర్ధారించగల ఒక స్పష్టమైన జాతి అనేదేదీ లేదని ఆధునిక జన్యుశాస్త్ర మానవశాస్త్ర పరిశోధనలు రూఢీ చేస్తున్నాయి. పూర్వీకుల ఆధారంగా భాషా సంస్కృతి ఆధారంగా శరీర ఆకృతి ఆధారంగా మనం జాతులుగా విడగొట్టడమన్నది సంక్లిష్టమైన మానవ వైవిధ్యాన్ని అతి పలుచనచేయడమే. ఇవి స్టీరియోటైపులనూ విద్వేషాలనూ రెచ్చగొట్టే సూడో సైన్సులే తప్ప నిజమైన సైన్స్ కాదు. మానవులమందరం ఒక్కటే అని చెప్పగలిగి అందరినీ బంధువులని చేయగల శక్తి దేనికైనా ఉందా అంటే అది కేవలం సైన్స్ కి మాత్రమే ఉంది. ఐతే కలోనియల్ ఆంథ్రోపాలజిస్టులవలే అది జాతివిద్వేషాలను రెచ్చగొట్టే సూడో సైన్సు చేతిలో పడకుండా చూడవలసిందే. అంతేకాక తమ తాత్కాలిక పదవులకోసం రాజకీయ నాయకులు, వేల యేళ్ళ తరబడి జన్యువుల రూపంలో సాగిన మానవ సమూహాల ఏకాత్మకా శక్తిని కాదని జాతులు వేరు వేరని నమ్మబలుకుతుంటారు. కానీ అందరమూ ఒక తల్లి బిడ్డలమే అని తెలుసుకోగలగడమే జెనెటిక్ రియాలిటీ.
విరించి విరివింటి
11/3/2024
*న్యూగీనియా అనేది South East Asia లో అతిపెద్ద ద్వీపం. దీనిని న్యూగీనియా హైలాండ్ అంటారు. గ్రీన్ ల్యాండ్ మొదటిదైతే న్యూగీనియా రెండవ అతిపెద్ద ద్వీపం. ఐతే దీనిలో పశ్చిమ భాగాన్ని వెస్ట్ న్యూగీనియా అనీ తూర్పుభాగాన్ని పపువా న్యూగీనియా అని అంటారు. వెస్ట్ న్యూగీనియా ఇండోనేషియా లో ఒకభాగమైతే పపువా న్యూగీనియా 1975 లో ఆస్ట్రేలియా నుండి విడివడి స్వతంత్ర దేశంగా మారింది.
No comments:
Post a Comment