Parasites, man and God.
దశావతారం సినిమాలో " దేవుడు లేడని ఎవరన్నారు? ఉంటే బాగుండేది" అంటాడు కమలహాసన్ ఒకచోట. నిజంగా దేవుడే ఉంటే ఇన్ని ఘోరాలను కలిగించేవాడే కాదు కదా అన్నది అతడి
ఉద్దేశ్యం. దాదాపు ఇదే అభిప్రాయాన్ని డార్విన్ కూడా వెలిబుచ్చుతాడు. Ichneumonidae అనే ఒక కందిరీగ జీవితాన్ని పరిశీలిస్తూ కరుణామయుడని చెప్పబడుతున్న దేవుడు కనుక ఉంటే ఈ కందిరీగను సృష్టించి ఉండేవాడు కాదు అంటాడు. స్టీఫెన్ గౌల్డ్ అనే మరో డార్వీనియన్ " నిజంగా దేవుడనే వాడు మంచివాడే ఐతే అతడి సృష్టి కేవలం మంచిని మాత్రమే ప్రతిబింబిస్తుంటే, మనమెందుకు బాధలతో కష్టాలతో విపరీతమైన అర్థంపర్థంలేని క్రూరత్వంతో నిండిపోయామంటాడు. ఈ కందిరీగ జీవితాన్ని పరిశీలిస్తే evil / చెడు/ క్రూరత్వం అనేది మనిషికి మాత్రమే చెందినదనీ ప్రకృతి దానిని లెక్కచేయదనీ అంటాడు. నిజమే కదా ప్రకృతిలోని ఏ జంతువూ తమకు చెడు జరిగిందని, జరిగుతుందని అందుకు ప్రతిగా మతాలను పుస్తకాలనూ దేవుళ్ళనూ సృష్టించుకున్న దాఖలాలు లేవు. చెడును అవి లెక్క చేయవు. సైతాన్, దయ్యం వంటివేవీ వాటిని తాకలేవు. శ్మశానాల్లో మనిషి తిరగలేడేమో గానీ మిగిలిన ఏ జంతువుకూ దయ్యం కాన్సెప్ట్ లేదు. భాషా శాస్త్రం ప్రకారం దేవుడు ప్రకృతి ఐతే దయ్యం వికృతి. కానీ మన చుట్టూ పరుచుకుని ఉన్న ప్రకృతికి దేవుడూ దయ్యం రెండూ లేవు.
Ichneumonidae అనే కందిరీగ గొంగళిపురుగులను బతికున్న శవాలుగా మార్చుకున్నా, గొంగళిపురుగు దానిని పట్టించుకోకుండా దేవునికి మొరపెట్టుకోకుండా బతికేస్తుంది. అది ఎంత క్రూరంగా గొంగళిపురుగుని తన జాంబీగా మార్చుకుంటుందో చూశాక డార్విన్ ఏమంటాడంటే ఇంత క్రూరత్వంతో ఐతే భగవంతుడు సృష్టి చేయలేడని. అంటే ఏమర్థమౌతుంది? ప్రకృతిలో క్రూరత్వం /evil కూడా ఒక భాగం. ఐతే జార్జ్ కార్లిన్ కూడా ఒకవేళ భగవంతుడు అనేవాడు ఉండింటే వాడు పురుషుడే ఐవుంటాడు. ఇంత ఘోరమైన సృష్టిని ఏ స్త్రీ కూడా చేయలేదంటాడు. ఒకవేళ జార్జ్ కార్లిన్ ఈ కందిరీగ గురించి తెలంసుకుని ఉండింటే క్రూరత్వం ఒక మగకు మాత్రమే కాదనే విషయం తెలుసుకునేవాడు. ఐతే మానవునికి సంబంధించినంత వరకూ క్రూరత్వమంతా పురుషుడిదే. పైగా దేవుడు తన రూపంలోనే మనిషిని సృష్టించాడని నమ్ముతాడు మనిషి. మనుషులు రాసుకున్న మత సాహిత్యం లో దేవుడు అంటే కేవలం పురుషుడే. స్త్రీలు కూడా పూర్తిగా లొంగిపోయారు ఈ భావనకు. మళ్ళీ మన టాపిక్ కి వస్తే, ఈకందిరీగ పరిణామ క్రమంలో తన తోకను stinger గా మలుచుకుంది. దీని ద్వారా అది గుడ్లను పెడుతుంది. అంటే ఇది ఆడకందిరీగ. ప్రకృతి క్రూరత్వానికి ఆడమగ తేడా లేదన్నది అందుకే. ఈ ఆడ కందిరీగ ఒక గొంగళిపురుగును వెతుక్కుని దాని మీదకు ఎక్కి తన stinger నుండి ఒక ఎంజైమ్ ను విడుదల చేస్తుంది. ఇదొక విషం. గొంగళిపురుగు వెంటనే స్తంభించి పక్షవాతం వచ్చినట్లు చచ్చుబడిపోతుంది. ఈ ఎంజైమ్ గొంగళిపురుగు మెటబాలిజంను చివరికి ప్రవర్తనను కూడా మార్చివేసే శక్తిని కలిగి ఉంటుంది. ఈ ఎంజైమ్ తో గొంగళిపురుగు చర్మాన్ని కరిగించి చర్మంలోనుండి లోపలికి తోకను పెట్టి అక్కడ గుడ్లను పెడుతుంది. అంటే ఇక గొంగళిపురుగు శరీరం కందిరీగ గుడ్లను పొదిగి ఇచ్చే మీడియంగా మారుతుంది. కోకిల తన గుడ్లను కాకి గూటిలో పొదుగుకోవడం దీని ముందు చాలా చిన్న విషయం.
ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ ఆడకందిరీగ తన శరీరంలోపల polydna అనే వైరస్ కి ఆశ్రయం ఇస్తుంది. ఈ వైరస్ జన్యు మెటీరియల్ ని పరిణామ క్రమంలో తనకు అనుగుణంగా మార్చుకుంది. తనకు అనుగుణంగా అంటే తను గుడ్లుపెట్టబోయే గొంగళిపురుగు తన గుడ్లకు సహకరించేందుకు అనుగుణంగా. అందుకే కందిరీగ తన గుడ్లతో పాటు ఈ వైరస్ లనూ stinger తో గొంగళిపురుగు లోపలికి పంపుతుంది. ఈ virus గొంగళిపురుగు ఇమ్యూన్ సిస్టంని అటాక్ చేసి దానిని బలహీన పరుస్తుంది. ఏదైనా ఒక ఫారిన్ బాడి శరీరంలోకి రాగానే దానిని మట్టుబెట్టేందుకు ఇమ్యూన్ సిస్టం సమాయత్తమౌతుందని మనకు తెలిసన అంశమే. ఇపుడు కందిరీగ గుడ్లు కూడా ఫారిన్ బాడిలు కాబట్టి గొంగళిపురుగు ఇమ్యూన్ సిస్టం వెంటనే యాక్టివ్ అయి ఆ గుడ్లను చంపేయలి. కానీ ఆ సిస్టంని అలా గుడ్లపై అటాక్ చేయనీయకుండా ఈ వైరస్ కాపాడుతుంది. ఈ వైరస్ గొంగళిపురుగు ఇమ్యూన్ సిస్టంని అతలాకుతలం చేసి పొదుగుతున్న కందిరీగ గుడ్లకు హాని కలిగించలేనంత బలహీనంగా ఆ సిస్టంను మర్చేస్తాయి. దానితో కందిరీగ గుడ్లు గొంగళిపురుగు లో హాయిగా ఎదిగి లార్వాలుగా మారతాయి. గొంగళిపురుగు శరీరధర్మాన్నంతా ఈ ఎదుగుతున్న లార్వా వైరస్లు తమ గుప్పిట్లో పెట్టుకుంటాయి. ఈ విధంగా ఒక గొంగళిపురుగు మీద వంద దాకా గుడ్లను పొదుగుకుంటాయి. గొంగళిపురుగు తన జీవితాన్నలా లార్వాలను మోస్తూనే కదిలిపోతూ ఉంటుంది. లార్వాలు మెల్లిగా గొంగళిపురుగు లోపలి భాగాలన్నింటిని తినేస్తుంటాయి. తర్వాత దశలోనుండి చిన్నపురుగులు బయటకి వచ్చేసరికి రోజూ కొద్ది కొద్దిగా చస్తూ జీవచ్ఛవంలా బతికిన గొంగళిపురుగు పూర్తిగా చనిపోతుంది.
ఈ కందిరీగ కథ ద్వారా మనకు ప్రకృతిలో evil ఉంది అని తెలుస్తుంది. అదెంత ఉన్నా ప్రకృతి దానిని పట్టించుకోకుండా గొంగళిపురుగులా సాగిపోతూనే ఉంటుందనీ తెలుస్తుంది. అందుకే దేవుడు సైతాన్ బాధ ప్రకృతికి లేదు. అది కేవలం మనుషులకే. ఐతే ఈ కందిరీగకి ఇంత evilness తనలో ఉందని తెలియదు. ఐతే డార్విన్ దానిలోని ఈవిల్ నెస్ ని చూసి దేవుడే కనుక ఉంటే ఇంతటి దారుణంగా సృష్టి చేయడని అన్నాడు. కానీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఈ కందిరీగ లోని క్రూరత్వాన్ని కూడా మనిషి తనకు అనుగుణంగా మలచుకోగలడు. అదే ఆధునిక విజ్ఞానం. ఎంతో క్రూరంగా ఉన్న ఈ కందిరీగలు దాదాపు పన్నెండు కోట్లమంది మనుషుల ప్రాణాలను కాపాడాయంటే నమ్మశక్యం కాదుగానీ అదే నిజం.
1970లో బ్రెజిల్ లో కర్రపెండలం పంటలకు తెల్లనల్లుల చీడపీడ మొదలైంది. బ్రెజిల్ లోని ప్రధాన పంటలలో కర్రపెండలం కూడా ఒకటి. అనావృష్టి ని కూడా తట్టుకుని పెరిగే మొక్కలివి. కానీ ఈ తెల్లనల్లుల దాడితో 20కోట్లమందికి జీవనాధారమైన కర్రపెండలం సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితి ని గమనించిన రుడాల్ఫ్ హెరెన్ అనే స్విట్జర్లాండ్ కీటక శాస్త్ర నిపుణుడు కందిరీగలు తెల్లనల్లులపై కూడా పరాన్నజీవిగా బతకగలదని కందిరీగ గుడ్లను కందిరీగలను విమానాల సహాయంతో ఈ పొలాలమీద చల్లించాడు. అక్కడినుండి వచ్చిన కందిరీగలు పైన చెప్పినట్లు తెల్లనల్లుల మీద ఆవాసం ఏర్పరచుకుని అనతికాలంలోనే తెల్లనల్లులను సర్వ నాశనం చేయగలిగాయి. దీనివలన ఆ ప్రాంతంలో దాదాపు ఇరవై లక్షలమందిని ఆకలి చావునుండి తప్పించినట్టైంది. అంటే ఇవి బయో ఎరువులుగా పని చేశాయి. వీటిని ఇపుడు చైనాలోనూ అమెరికా లోను వ్యవసాయ రంగంలో వాడటం మొదలైంది. పురాతన పుస్తకాలను ఫర్నీచర్ నీ ధ్వంసం చేసే చెదలను చిమ్మెటాలనూ కూడా నాశనం చేసేందుకు కూడా వీటిని వాడటం మొదలెట్టారు. దేవుడే సృష్టికర్త ఐవుండింటే పరాన్న జీవుల్లోని క్రూరత్వాన్ని కూడా మనిషివలె తనకు అనుకూలంగా మార్చుకోగలిగేవాడా. కాబట్టి దేవుడు అమాయకుడు. మనిషే దేవుడిని తన స్వార్థంకోసం మనిషి రూపంలో సృష్టించుకున్నాడు.
విరించి విరివింటి
No comments:
Post a Comment