Wednesday, 30 December 2015

విరించి || తరగతి గదిలో ఓ మూల ||
...............................
ఆ మూలలోని
ఆ నిశ్శబ్దం
ఆ రోజు
మా అందరితోనూ మాట్లాడింది.

సైలెన్స్ సైలెన్స్ అని అరవాల్సిన
అవసరం లేకుండానే
నిశ్శబ్దం ఆ గది అంతా
సహజ సిద్ధంగానే పరుచుకుని ఉంది

ప్రగతి వైపు నడిపించే తారు రోడ్డులా
ఒక నల్లటి బోర్డూ..
ఎంసెట్, ఐఐటీ కలల్ని
లెక్చర్లుగా లిఖించే
ఒక తెల్లటి చాక్ పీసూ..
ఆ లేలేత ముఖాల పిల్లల ముందు
తలదించుకుని నిలబడివున్నాయి.

భవిష్యత్తును భూతంగా చూపించే నేను
నాకు నేనొక ప్రేతంగా అనిపించ సాగాను
ఆ తరువాతి రోజయిన ఈరోజు
ఒక దయ్యంలా తరగతి గదిలోకడుగు పెట్టాననుకున్నాను

ఆ మూలగా కూర్చుని
పాఠం వింటున్నట్టుగా నటిస్తూ
నిదురపోయే ఆ పిల్లగాడు..
మీదకు విసిరిన చాక్ పీస్ ముక్కకు బదులుగా
చిరునవ్వు విసిరే ఆ కుర్రవాడు
వాడొక్కడే ఈరోజు మిస్సింగ్..
ఔను వాడొక్కడే మిస్సింగ్.

మార్కులు మార్కులు..
తరగతి గది మూలలో
ఒక చెదిరిపోని రిమార్కు

ర్యాంకులు ర్యాంకులు..
తరగతి గది మూలలో
ఆత్మహత్య చేసుకున్న ఒక ర్యాంకు

ఇపుడు తరగతి గదిలో
ఆ మూలనుండి ఓ నిశ్శబ్దం
మా అందరితోనూ మాట్లాడింది.
అల్లరి చేయటం శాశ్వతంగా ఆపేసి
మా అందరితోనూ నిశ్శబ్దంగా మాట్లాడింది
ఔను ఎన్నో విషయాలు మాట్లాడింది.

30/12/15

కవిత్వ సందర్భం- 6

ఏదీ...! ఎక్కడుంది ఆ ఇంధనం?.
...........................................
సునామీ అంటే అందరికీ తెలుస్తుంది. మెటియో సునామీ అంటే ఎవరికీ తెలియదు. కాదు, తెలియనీయలేదు. చేతకాని కొయ్యగుర్రం లాంటి ప్రభుత్వాలు, వ్యవస్థలు మనకు ఎన్నో విషయాల్ని తెలియనీయవు. దాచిపెడతాయి. సముద్రంలో భూకంపం వస్తే, సునామీ వస్తుందని మనకందరకూ తెలుసు. కానీ ఈ మధ్య వచ్చిన కమల్ హాసన్ 'దశావతారం' సినిమా, ప్రకృతికి మూర్తిమత్వాన్ని కలిగించి, బయో టెర్రరిజం నుంచి తనను తాను కాపాడుకోవటానికి ప్రకృతి ఉపయోగించిన అస్త్రమే సునామీ అనే ఊహతో ఒక సందేశాన్ని ఇచ్చింది. అందులో నిజం లేక పోవచ్చు. కానీ సునామీ లాంటి ఒక విపత్తు ఎన్నో ఆలోచనలను కూడా మోసుకొస్తుంది అనటానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. సాధారణంగా ఒక విపత్తు పుట్టుకొచ్చిన తర్వాత భాష, మాటలు అన్నీ నిశ్శబ్దాన్ని పులుముకుంటాయి. వాతావరణం మౌనంగా ఉండిపోతుంది.  కానీ కవి హృదయం, అక్కడి నుండి ఆ నిశబ్దం నుండి ముందుకు సాగుతుంది. అందుకే Maurice Blanchot అంటాడు, It is not you who will speak: let the disaster speak in you.  అని.

అలా ఒక విపత్తు వచ్చిన తరువాత, పోయెట్రీ ఆఫ్ డిసాస్టర్, పుట్టుకొస్తుంది. అలా వచ్చిందే నగ్నముని రాసిన కొయ్యగుర్రం. ఈ పన్నెండు కవితల చిన్న పుస్తకం మహాకావ్యమా కాదా అనే వివాదాన్ని కూడా సృష్టించింది. ఆ వివాదాలతో ఈ కవితలో చర్చించిన విపత్తుకి ఎలాంటి సంబంధం లేదు. ఈ అనవసర వివాదాల వల్ల కవి హృదయం అర్థం చేసుకునే వ్యవస్థ మరలా దారితప్పింది. అయినా కానీ విపత్తు సృష్టించిన నష్టానికి పోటీగా వివాదాలు ఉంటుంటాయి. సృష్టించబడతాయి. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్టు, ఏ విషయాన్నయినా తప్పుదారి పట్చించటం ప్రభుత్వాలకి వెన్నతో పెట్టిన విద్య.  వాటిని చర్చించటం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. నగ్నముని ఈ విపత్తుని చూసి రాసుకున్న కవితలు స్వానుభవాన్నీ, రాజకీయ వాతావరణాన్నే కాకుండా...సామాజిక కోణాన్ని కూడా ఎత్తి చూపుతాయి. ఒక ఖచ్చితమైన ప్రయోజనాన్ని ఆశించి, నగ్నముని కవిత్వం చేశాడు.

ఈ వ్యవస్థ లో
పుట్టడం మోసపోవడానికే
పెరగటం మోసపోవడానికే
ప్రేమించటం మోసపోవడానికే
నమ్మడం మోసపోవడానికే

జీవితం చివర్న పొంచున్నది మాత్రమే
మృత్యువు కాదు
అజ్ఞానంలోనూ మూర్ఖత్వంలోనూ
బతుకు భయంలోనూ ద్వంద్వ జీవితంలోనూ
నయవంచనలోనూ ప్రతీక్షణం వెంటాడేది
మృత్యువే.

ఈ వాక్యాలన్నీ అకస్మాత్తుగా మృత్యువు కౌగిలిలోకి జారిపోయిన అభాగ్యులను చూసిన తరువాత వచ్చినవే. ప్రకృతే మోసం చేయలేదు, సముద్రమే మోసం చేయలేదు. వ్యవస్థ మొత్తంగా మోసం చేసింది. 1977 లో దివిసీమ లో తుఫాను చెలరేగింది. మన ట్రోపికల్ ప్రదేశాల్లో వచ్చే తుఫానులకూ, టెంపరేట్ దేశాల్లో వచ్చే తుఫానులకూ తేడా వుంటుంది. నీరు వేడెక్కి ఆవిరవటం మూలాన ఏర్పడే అల్పపీడనం తన చుట్టూ వుండే అధిక పీడన గాలుల్ని ఆకర్షిస్తుంది. ఈ అల్ప పీడన ద్రోణి ఎపుడయితే తీరం దాటుతుందో, దానితో పాటుగా సముద్రం కూడా పొంగి జనావాసాలను ముంచెత్తుతుంది. దీన్నే 'మెటియో సునామీ' అంటారు. వాతావరణ విశేషాలను తెలిపే శాస్త్రాన్ని 'మెటియొరాలజీ' అంటారు కాబట్టి, మెటియో సునామీ అనే పదం అలా వచ్చింటుంది. అలాంటిదే దివి సీమను 1977 novamber 19 న తాకింది. రాత్రికి రాత్రే గ్రామాలు ఈ  meteo tsunami లేదా storm surge బారిన పడి మునిగి పోయాయి. ఎప్పటిలాగే అనధికారిక మరణాల సంఖ్య విపరీతంగా పెరిగి పోయింది. అనధికార మరణాలు 50000 ఐతే, అధికారికంగా ప్రకటితమైన మరణాలు 10000 నాలుగు లక్షల పశుపక్షాదులు చనిపోయాయి. లక్షల ఎకరాల పంట నష్టం వాటిల్లింది. ఈ హృదయ విదారకర విషయాన్ని ఒక చోట ఇలా చెబుతాడు.

వృక్షాలపై పక్షులపై సమస్త జంతుజాలం పై
చీకటి ముసుగు హఠాత్తుగా కప్పి
నీటితో పేనిన తాల్లతో గొంతులు బిగించి
కెరటాల్తో,కాటేసి వికటాట్టహాసంతో
బుసలు కొడుతూ  పరవళ్ళు తొక్కింది
మనిషి బతికుండగా దాహం తీర్చలేని
ఉప్పునీటి సముద్రం
మిగిలింది కెరటాలు కాదు
శవాల గుట్టలు

శవాల గుట్టల్ని తీసేయటానికి కాకులూ గద్దలూ రాబందులూ లేకపోయినా ఫరవాలేదు, ప్రజాసేవ చేయటానికి పోటీలు పడే నాయకులున్నారనీ, కాంట్రాక్టర్లున్నారనీ అంటాడు.
ఈ కావ్యంలో కవి బాధంతా కనిపిస్తుంది. ఈ విపత్తులో చనిపోయిన వారందరూ పేదవారే. కవి కోపమంతా ప్రభుత్వం మీద, మతాలమీద, వ్యవస్థ మీద. అప్పటి ప్రభుత్వాలు తమ చేతకాని తనాన్ని వెనుకేసుకొచ్చాయేమో...ఈ పాపాన్ని ప్రకృతిమీదకి నెట్టివేసి చేతులు దులుపుకోజూసాయేమో, కొయ్యగుర్రంలా హృదయం లేని స్తబ్ద ప్రభుత్వాలమీద వ్యంగ్య విమర్శనాస్త్రాలను ఎక్కుపెడతాడు కవి.

ఒక విపత్తు జరిగాక, మేలుకునే ప్రభుత్వాలు నిజంగా మేలుకుంటాయా అంటే - లేదనే చెప్పాలి. కంటి తుడుపు చర్యగా ఎక్స్గ్రేషియాలు ప్రకటించేసి కొంత హడావుడి ప్రకటనలు చేసి నిమ్మకుండిపోతాయి. ఎందుకంటే పోయిన ఆ ప్రాణాలన్నీ నిర్భాగ్యులవే. ఎందుకంటే అనాథ శవాలు, కంకాళా లూ ఎలాంటి సంజాయిషీ కోరవు. అదే, పదవిని ఒంటినిండా బట్టగా చుట్టుకున్న నాయకుడు చనిపోతే, దేశ జండా విషాదంగా తలదించుకుంటుంది. ఈ పరిస్థితి ఇప్పటికీ మారలేదు. తీర ప్రాంతాల్ని ముంచెత్తే తుఫానులనుండి పూర్తి రక్షణ కలిగించటానికి ఇప్పటిదాకా ఎలాంటి సమర్థమైన చర్యలు చేపట్టనేలేదు. మద అడవుల ని పెంచాల్సిన ప్రభుత్వాలు అడవుల నరికివేతను విచ్చలవిడిగా కొనసాగిస్తున్నాయి.  ఔట్ వార్డ్ సూయిజ్ లు కూడా ఇప్పటికీ అదే శిథిలావస్థలో ఉన్నాయట. ఇకపై ఎపుడు ఉప్పెన వచ్చినా మరలా ఇలాంటి విపత్తే సంభవించబోతోందని అందరికీ తెలుసు. కానీ ఏమీ చేయలేని కొయ్యగుర్రం వ్యవస్థ మనది. ఇంకో విషాదమేమంటే ఈ విపత్తుకి గుర్తుగా కట్టిన స్థూపం కూడా కబ్జా పాలయిందట. ఇలాంటి కొయ్యగుర్రం వ్యవస్థని తగలబెట్టగల ఇంధనం కనిపెడతానన్నాడు నగ్నముని. ఏదీ..ఎక్కడుంది ఆ ఇంధనం. ఆ ఇంధన అవసరం అప్పటికన్న ఇప్పుడే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. చివరి విందు లో తనను ఎవరు మోసం చేస్తారో జీసస్ కి తెలుసు, హన్తకులెవరో మనకు తెలుసు- నెపం కాసేపు ప్రకృతిమీదకు ఎవరు తోసేస్తారో కూడా మనకి తెలుసు. అందుకే విపత్తు వ్యవస్థలోనే ఉంది. ఏదీ! ఎక్కడుంది ఆ ఇంధనం?.

30/12/15

Friday, 25 December 2015

కవిత్వ సందర్భం 4

ఈనాటికైనా మనం అసలులమా? నీడలమా?.
..............................................................

అభ్యుదయ కవితోద్యమాన్ని భావ కవిత్వపు ఫ్రేం ఆఫ్ రిఫరెన్సు ద్వారా చూసి, అటు ఆధునికతకూ, ఇటు భావ కవిత్వానికీ వారధిలా నిలిచాడు తిలక్. వస్తువు అభ్యుదయ కవిత వలె కొత్తది. శైలి భావ కవిత వలె రమ్యమైనది. ఆంగ్ల మోడర్నిస్ట్ కవులు కళాకారులుగా మిగిలిపోయారు. తోటి కళాకారుల కోసం రాసుకున్నారు. క్యూబిజం, డడాయిజం, సర్రియలిజం అంటూ కళ లో కవితలో ప్రయోగాలు చేశారు. తద్వారా సంక్లిష్టమైన సాహిత్యాన్ని అందించారు. కానీ అభ్యుదయ కవులు ప్రయోగాలు చేస్తూ ప్రజల వైపే నిలబడ్డారు. ప్రజల్లో తామూ ఒకరిగా నిలబడ్డారు. వెస్టర్న్ కవుల రొమాంటిసిజం పంతొమ్మిదవ శతాబ్దం మొత్తం సాగినా, తెలుగులో ఇరవైయవ శతాబ్దపు తొలి రెండు మూడు దశాబ్దాలకు పరిమితమైంది. అంతరించి పోతున్న భావ కవిత్వపు ఛాయల్లో నిలబడి అభ్యుదయ కవితను పలికించిన వాడు తిలక్. అమృతం కురిసిన రాత్రి కవితా సంకలనం లో 'నీడలు' అనే కవిత లో తిలక్ మనల్నందరినీ దగ్గరగా చూడటమే కాక మనలో ఒకడిగా కనిపిస్తాడు. రాత్రి పడుకునే ముందు ఆశల్నీ ఆశయాలనీ నెమరు వేసుకుని, ఉదయం నిద్రలేచాక అంతా మామూలే మనకు. యథాతథం.

నీడకూ, ప్రతిబింబానికీ తేడా ఉంటుంది. రెంటికీ ఒకానొక వస్తువే ఆలంబన. కానీ ప్రతిబింబం వస్తువుకి డిస్టార్టెడ్ వర్షన్ కాదు. వస్తువుకి కాపీ. కుడి ఎడమలే మార్పు. అద్దం ముందు నిలబడితే తెలిసిపోతుంది. కానీ, నీడ వస్తువుని పోలి లేదు. కురచది. వక్రమైనది. నీడ— అనే పదాన్ని ఎన్నో రకాల అర్థాల్లో వాడవచ్చు. ఈ కవితలో 'హిపోక్రసీ' అనే అర్థం స్పురిస్తుంది. ఎవరికి హిపోక్రసీ?. హిపోక్రసీ ఆఫ్ ఎ కామన్ మాన్. తిలక్ 'నీడలు' కవితలో ఈ కామన్ మాన్ మధ్యతరగతి మనిషి గా కనిపిస్తాడు. ఒక వ్యక్తి సంపాదన ఆధారంగా ఉన్నత, మధ్య, బీద తరగతికి చెందిన వాడనే విభజన ఉంది. మధ్య తరగతిలో మళ్ళీ అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్,  లోవర్ మిడిల్ క్లాస్ అని విభజన. ఈమధ్యటి లెక్కల ప్రకారం భారత దేశంలో మిడిల్ క్లాస్ 3 శాతం మాత్రమే. దాదాపుగా మిగిలిన వారందరూ బిలో మిడిల్ క్లాస్ వారేనట. బీదరికం నుంచి బయట పడి, వారంతా బిలో మిడిల్ క్లాస్ వారిగా మారిపోయారే తప్ప, మిడిల్ క్లాస్ వారిగా ఇంకా మారలేదట. ఆ సంగతి అటుంచితే, మేము మధ్యతరగతి మనుష్యులమని తమకు తాము చెప్పుకునే వారే ఈ ప్రపంచంలో ఎక్కువట. అంటే, మనుషులకి సంబంధించినంత వరకు ఈ 'మధ్య తరగతి' అనేది ఒక మానసిక స్థితికి సంబంధించినదే కానీ, ఎకనామికల్ డెఫినిషన్స్ కి సంబంధించినది కాదన్నది స్పష్టం. ఎకనామిస్ట్ ల డెఫినిషన్స్ తో మనకు సంబంధం లేదిక. మనమంతా మధ్య తరగతి మనుష్యులమే. ఇది అమెరికా లో అయినా, ఆస్ట్రేలియాలో అయినా అంతే. తమకు తాము మధ్య తరగతి వారిమని అనుకోవటం లో ఒక తృప్తి ఉంటుంది. రిడక్షన్ ఆఫ్ కాగ్నిటివ్ డిస్సోనాన్స్ అన్నమాట. హిపోక్రసీలో ఉండే గోపి (గోడమీద పిల్లి) తత్వం మనకు కలిసొస్తుందన్నమాట.

తనకు అనుకూలంగా ఉన్న వ్యవస్థలో ఉన్నది ఉన్నట్టుగా ఉండాలనుకునే వాడు వ్యవస్థను పరిపాలిస్తూ ఉంటాడు. తనకు అననుకూలంగా ఉన్న వ్యవస్థలో సమూలంగా మార్పు రావాలని కోరుకునే పీడితుడు తిరుగుబాటు చేస్తాడు. కానీ వ్యవస్థ తనకు అనుకూలంగా ఉందో ప్రతికూలంగా ఉందో తెలియక, తెలుసుకోలేక, దేన్ని ఔననాలో దేన్ని కాదనలో అర్థం కాక, ఊగిసలాడుతూ ఉండేవాడు కామన్ మాన్. మధ్య తరగతి మనిషి. అందుకే తనతో పాటు భారమైన హిపోక్రసీని కూడా మోసుకు తిరుగుతాడు. భూస్వామ్య వ్యవస్థ పతనమై పెట్టుబడిదారీ వ్యవస్థ కుదురుకుంటున్న సమయంలో సమాజంలోకి అకస్మాత్తుగా పుట్టుకొచ్చాడు ఈ మధ్యతరగతి మనుష్యుడు. అపుడే ఈ మధ్యతరగతి మానసికావస్థ కూడా పుట్టి వుండాలి. అదే సమయంలో వెస్టర్న్ రొమాంటిసిజం ద్వారా సాహిత్యంలోకి అడుగుపెట్టిన అతడు, రొమాంటిక్ పీరియడ్ లో దేవుడిని సైతం పక్కకు నెట్టి తానే 'ప్రొటాగొనిస్ట్' గా మారిపోయాడు. ఇరవైయవ శతాబ్దపు భారతదేశంలోకి శరత్ సాహిత్యం ద్వారా చొచ్చుకొని వచ్చాడు. పుట్టినప్పటి నుంచి ప్రపంచం మొత్తాన్నీ తన హిపోక్రసీతో నెట్టుకొచ్చాడు. ఇప్పటికీ పెద్దగా మార్పేమీ లేదు. ఎందుకంటే ప్రతీ ఒక్కరూ తమకు తాము మధ్యతరగతి మనుష్యులమని అనుకునేవారే. అస్తవ్యస్థ వ్యవస్థలో రిడక్షన్ ఆఫ్ కాగ్నిటివ్ డిస్సోనాన్స్ తో తమకు తాము సమాధాన పరచుకునే వారే.

ఈ కవిత శీర్షిక నీడలు. ఈ మనుష్యులు - "గతించిన కాలపు నీడలు" అంటాడు ఒకచోట. ఈ వాక్యంలోని 'నీడలు' పదాన్ని శీర్శిక లాగా వాడాడేమో అనిపించినా, నీడలు పదాన్ని హిపోక్రసీ తో నిండిన మధ్యతరగతి మనుషులు అనే అర్థంలో వాడి ఉండింటాడనిపిస్తుంది. కవిత మొత్తంలో ఒక మనిషిలో హిపోక్రసీని చూపిస్తాడు. తన చిన్నమ్మ కు మనుషుల గురించి తాను చెబుతున్నట్టు ఉంటుంది కవిత. ఆ చిన్నమ్మ శరత్ నవల్లోని ఒక స్త్రీ అయుండవచ్చని నా ఊహ. ఊహ మాత్రమే. ఆధారాలు లేవు. కవితలో "మనుషల స్వభావం ఇలాగే ఉంటుంది క్షమించేసెయ్ , ఓ.చిన్నమ్మా..!" అని అడుగుతున్నట్టు ఉంటుంది. "చిన్నమ్మా! వీల్లందరూ మధ్యతరగతి మనుషులు" అని ఒక చోట చెప్పి, వారి స్వభావాలూ, దైనందిన జీవితాలూ తెలుపుతాడు. కవితలో సగటు మనిషిని మనం దాదాపుగా చూడగలుగుతాం. డెఫినిషన్ అండ్ బేసిక్ కారక్టరిస్టిక్స్ ఆఫ్ కామన్ మాన్ ని మనం ఈ కవితలో నుంచి తీసుకోవచ్చు. ఒక పార్టీని నడిపించటం కోసం ఇంకో పార్టీని పెట్టుకుని హిపోక్రసీని ప్రదర్శించిన పవన్ కళ్యాణ్, ఫైవ్ స్టార్ హోటల్ లో కామన్ మాన్ కోసం పార్టీ పెట్టి హిపోక్రసీని బట్టయబలు చేసిన పవన్ కళ్యాణ్, మనుషుల హిపోక్రసీ ని వర్ణించే ఈ కవితను తన పార్టీ ఓపెనింగ్ స్పీచ్ లో వాడుకోవటం,  పీక్స్ ఆఫ్ ది హిపోక్రసీ.

చిన్నమ్మా వీళ్ళందరూ, సగం సగం మనుష్యులు,
 మరోసగం మరుగున పడిన భయస్థులు/బాధాగ్రస్థులు. ( అంటే అననుకూల ఆలోచనలే చేయలేని వారు)
భారతం భాగవతం చదువుతారు.( అంటే  ఎస్కేపిస్టులు)
పాపం పుణ్యం కేటాయిస్తారు. (మేథో అసంబద్ధత తగ్గించుకోవటం కోసం)
డైలీ పేపరు తిరగేస్తారు/ జాలీగా ఉన్నట్టు నటిస్తారు. (ఈ కాలంలో అయితే బిజీగా ఉన్నట్టు నటిస్తారు అనుకోవాలి).

"వాచకాలలో నీతుల్ని వల్లిస్తూ/దరిద్రంలో హరిద్రాశోభల్ని గుర్తిస్తూ"...గ్లోరిఫికేషన్ ఆఫ్ పావర్టీ ప్రతీ మతం లోనూ కనిపించే విషయం. మతాలకి ఆలంబన మధ్యతరగతి ప్రజలే. మతం వారి కాగ్నిటివ్ డిసోనాన్స్ ని రెడ్యూస్ చేసే అద్భుతమైన మందు . "ధైర్యంలేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ"...ప్రతీ ధర్మమూ పీడితుల్ని పీడకులకు గులాం కమ్మంటుంది. అందరికన్నా పెద్ద పీడకుడు దేవుడు. ఆ తరువాత రాజు, ఆ తరువాత పూజారి. నీవు భరించు, ఇవన్నీ పరీక్షలు. ఆ తరువాతే మోక్షం. నారు పోసిన వాడు నీరు కూడా పోస్తాడు. అదే ధర్మం.

మౌఢ్యం వల్ల బలాఢ్యులు
అవివేకం వల్ల అవినాశులు
వీల్లందరూ మధ్య తరగతి మనుష్యులు. (ఇంతకన్నా డెఫినిషన్ ఏం కావాలి. అయినా ఇంకా పొడిగించి నిర్వచిస్తే..)
సంఘపు కట్టు బాట్లకి రక్షకభటులు
శ్రీమంతుల స్వేచ్ఛావర్తనకి నైతిక భాష్యకారుల
శిథిలాలయాలకు పూజారులు.

కవితలో దాదాపు ఈ మధ్యతరగతి వాల ని నిర్వచించి, వివరించి చివరిలో ఈ పరిస్థితి మారాలి అంటాడు. ఇలాంటి వారి మధ్య డైనమైట్ లు పేలాలి, డైనమోలు తిరగాలి. ఈ కవిత చెప్పిన కాలమంతా ఒకానొక సాయంకాల మనుకుంటే, ఈ రాత్రికంతా ఏదో జరిగి, రేపు ఉదయానికల్లా మార్పురావాలి అంటాడు. "కాళరాత్రిలో కంకాళాలు చెప్పే రహస్యం తెలియాలి/ దారిపక్కన మోడు చెట్ల బాధలు వినాలి/పచ్చికలో దాక్కున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి". ఈ పంక్తుల్లో ఈ రాత్రికల్లా అభ్యుదయం జరిగిపోవాలి అనే సూచన కన్పిస్తుంది. "రేపటి ఉదయానికల్లా ఈ వేళ వెలుగుల్ని సమకూర్చూకోవాలి". సంఘ సంస్కారమే వెలుగులనుకోవాలి. కవి చిన్నమ్మతో ఈ హిపోక్రసీని క్షమించమంటాడు. ఆడదానికి సాహసం పనికి రాదనే వీళ్ళని, ఈ సాంప్రదాయకులను విడిచి వెళ్ళొద్దనీ, వీళ్ళంతా నీ బిడ్డలనీ అంటాడు. కవిత చివరలో ఆ పని తానే చేయపూనుకున్నట్టు కనిపిస్తాడు కవి. ఇదిగో చిన్నమ్మా..! చీకటి పడుతోంది. దారంతా గోతులు. ఇల్లేమో దూరం. . చేతిలో దీపం లేదు. ధైర్యం ఒకటే కవచం.

కవితలో చెప్పినట్టు, ఈ మధ్య తరగతి వారి మధ్య, ఏ డైనమైటూ పేలలేదు. ఏ డైనమోలూ తిరగలేదు. కాళరాత్రి కంకాళాలూ ఏ రహస్యాల్నీ చెప్పలేదు, మోడు చెట్ల ఏ బాధల్నీ మనం అనువదించుకోలేదు, పాముల్ని బుట్టలోకి పట్టలేదు, మనం ఏ వెలుగులూ సమకూర్చుకోలేదు. మధ్య తరగతి స్థానం నుండి ఒక్క అంగుళం కూడా ముందుకు జరగలేదు. ఇది మన సేఫ్ జోన్. అందుకే మనం నీడలం. అసలులం కాదు.

చిన్నమ్మా
వీళ్ళ మీద కోపగించకు
వీళ్ళనసహ్యించుకోకు

నిన్నెన్నెన్నో అన్నారు. అవమానాల పాల్చేశారు
అవినీతి అంటగట్టారు
ఆడదానికి సాహసం పనికిరాదన్నారు

చిన్నమ్మా వీళ్ళందరూ భయపడిపోయిన మనుష్యులు
రేపటి గురించి భయం, సంఘ భయం
అజ్ఞాతంగా తమలో దాగిన తమను చూసి భయం
గతంలో కూరుకుపోయిన మనుష్యులు
గతించిన కాలపు నీడలు

చిన్నమ్మా
వీళ్ళందరూ తోకలు తెగిన ఎలకలు
కలుగుల్లోంచి బయటకి రాలేరు
లోపల్లోపలే తిరుగుతారు
మౌఢ్యంవల్ల బలాఢ్యులు
అవివేకం వల్ల అవినాశులు
వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు
సంఘపు కట్టుబాట్లకి రక్షకభటులు
శ్రీమంతుల స్వేచ్ఛా వర్తనానికి నైతిక భాష్యకారులు
శిథిలాలయాలకు పూజారులు

చిన్నమ్మా వీళ్ళందరూ సగం సగం మనుషులు
మరోసగం మరుగున పడిన భయస్తులు, బాధాగ్రస్తులు
భారతం భాగవతం చదువుతారు
పాపం పుణ్యం కేటాయిస్తారు
డైలీ పేపరు తిరగేస్తారు
జాలీగా ఉన్నట్లు నటిస్తారు

చప్పబడిన నిన్నటి మాటల్నే మాట్లాడుతుంటారు
కప్పబడిన నిన్నటి కలల్నే తలుచుకుంటారు
సన్నంగా పళ్ళ సందున నవ్వుకుంటారు
హఠాత్తుగా జడుసుకుంటారు
నిటారుగా నిలబడలేరు

వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు
చెల్లా చెదురైన మూగ సత్యాలు
కల్లాకపటం తెలియని కబోది గుంపులు
తమని తాము మోసగించుకునే విద్యాధికులు, విదూషకులు
తమ చెట్టుని తామే నరుక్కునే అమాయకులు
సంప్రదాయకులు

చిన్నమ్మా వీళ్ళ ని విడిచి వెళ్ళిపోకు
వీళ్ళందరూ నీ బిడ్డలు
ఆకలి అవసరం తీరని కష్టాల గడ్డలు
వాచకాలలో నీతుల్ని వల్లిస్తూ
దరిద్రంలో హరిద్రా శోభల్ని గుర్తిస్తూ
ఓపికలేని భార్యలకు సహనాన్ని బోధిస్తూ
ధైర్యంలేని తమ స్వభావాల్ని ధర్మమని పిలుస్తూ
బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ళ మధ్య
డైనమైట్ పేలాలి
డైనమోలు తిరగాలి

కాళరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి
దారి పక్క నిల్చిన మోడు చెట్ల బాధని అనువదించాలి.
పచ్చికలో దాక్కున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి
రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి.

చిన్నమ్మా
నేను వెళ్ళొస్తాను
చీకటి పడుతోంది
చిటారు కొమ్మల్లో నక్షత్రం చిక్కుకుంది
శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతుంది
దారంతా గోతులు, యిల్లేమో దూరం
చేతిలో దీపం లేదు, ధైర్యమే కవచం.

9/12/15

కవిత్వ సందర్భం- 5

పట్టాభి రాముడిలో లేని కొంటెదనం పఠాభి రాముడిలో ఉండొచ్చు. అది ఆయుధం కూడా కావొచ్చు.
..............................................................................................................................
పల్లెటూరి గోధూళి వేళలూ, పిచ్చుక శబ్దాలు, పచ్చిక బయళ్ళ స్థానంలో...నగరం లోని బిజీ లైఫులూ, రణగొణ ధ్వనులూ, ఇరుకు సందులూ వచ్చి చేరితే..
ఆకాశం లోని జాబిల్లి నక్షత్రాలు, నగరం లోని మిణుకు మిణుకుమనే ఎలక్ట్రిక్ బల్లుల ముందు పేలవంగా, దరిద్రంగా, అనవసరంగా కనిపిస్తే..
ప్రేయసి కనులను, కనుబొమ్మలనూ, హృదయాన్ని, కరుణను వర్ణించే చోట ప్రియురాలి అధరాలు, వక్షోజాలూ, నడుము వంపులూ, చుంబనాలూ, కౌగిలింతలూ వెచ్చగా అనిపిస్తే...
ఒకప్పటి ప్లెటోనిక్ లవ్ స్థానంలో ఇప్పటి వన్ నైట్ స్టాండ్ సంబంధాలు స్త్రీ పురుషుల మధ్యన కనిపిస్తే....
ప్రస్తుత గ్లోబల్ ప్రపంచంలో ఉన్న మనకు ఏమనిపిస్తుంది?.

ఆ! దీనిలో కొత్తేముంది. రోజూ వింటున్నదే కదా..!  అనిపించటంలో మనకు వింత ఏమీ ఉండదు కానీ, 1930 వ దశకం లో, భావ కవిత్వపు నశాలో తేలియాడే సమయంలో, అకస్మాత్తుగా కవితల్లోకి ఇలాంటి నగర జీవితమూ, కామమూ వంటి వస్తువులతో ఒక ఫుస్తకం  'ఫిడేలు రగాల డజను'లా వస్తే ఏమౌతుంది?. రాగాల డజను కాదిది, రోగాల డజను అని అనాల్సి వస్తుంది. వలపు పస్తులతో నవసి మతి చెడిన యువకుని ఉన్మత్త ప్రేలాపన( mad ravings) గా స్పురిస్తుంది. ఇలా అంటారని ముందే తెలుసేమో పఠాభికి, అందుకే పద్యాల నడ్డి విరగ్గొట్టడానికి వచ్చేస్తున్నానంటూ, అహంభావ కవినంటూ ముందే ప్రకటించేసుకున్నాడు.
1939 లో ముద్రితమైన ఈ పుస్తకం తెలుగులో మొదటగా ప్రచురితమైన వచన కవిత్వపు పుస్తకం అనే విషయం చాలా మందికి తెలియక పోవటం ఎందుకంటే, చాలామందికి ఇది రాగాల డజనుగా కన్నా రోగాల డజను లాగా కనిపించటం. శ్రీశ్రీ రాసిన అభ్యుదయ కవితలు అప్పటికే పత్రికల్లో ప్రచురితమైనా అది పుస్తకం రూపంలో వచ్చింది మాత్రం 1950 లోనే. అభ్యుదయ కవిత్వానికి పఠాభి వలన ప్రత్యక్ష ప్రయోజనం ఏమీ లేకపోయినా పరోక్ష ప్రయోజనం విస్మరించదగినది కాదని వేల్చేరు నారాయణ రావు గారెందుకన్నారో తెలియనిదయినా, నగర జీవితాన్ని తెలుగు సాహిత్యంలోకి ప్రవేశ పెట్టిన వాడిగా పఠాభి మనకు వేస్ట్ ల్యాండు ఇలియట్ ని గుర్తుకు తెస్తాడు.

ఇదే ఫిడేలు రాగాల డజనులో మనకొక సీత కనిపిస్తుంది. అయితే ఈమె రామాయణంలోని సీత కాదు. రామాయణం సీతను గురించి తలుచుకునే 'ఆధునిక సీత'. ఈ సీత, కవితలో 'పఠాభి' అనే వ్యకికి స్నేహితురాలు. అయితే కవితలోని ,ఈ పఠాభి, కవి పఠాభి కాదు. ఆ విషయాన్ని పుస్తకం ముందే రాసుకున్నాడు పఠాభి. అలాగే కవితలోని పఠాభి, రామాయణంలోని పట్టాభి రాముడూ కాడు. కవితలోని విషయమేమంటే, ఈ ఆధునిక సీత, కవి పఠాభితో కాక కవితలోని పఠాభితో, రామాయణంలోని సీతా రాముల గురించి చర్చించుకోవటం. కవితకు రామాయణం, అందునా విశ్వనాథ వారి రామాయణం వస్తువయినా, కవిత నడవటానికి బలమైన ప్రోద్బలం కలిగించినది మాత్రం ముద్దుకృష్ణ రాసిన 'అశోకం' నాటకం. పఠాభి, ఉపజ్ఞ ఉన్న కవిగా పేరుతెచ్చుకున్నా..ఆ ఉపజ్ఞ చమత్కార రచనకే పరిమితమైందని అప్రతిష్ఠ ఉన్నా..గెస్టాల్ట్ థియరీ ప్రకారం, నేర్చుకోవటమన్నది అంతకుముందున్న జ్ఞాన సంపద మీద ఆధారపడుతుందని, మనకు ఈ కవిత చదివినపుడు, దీనికి 1934 లో వచ్చిన 'అశోకం' నాటకం ప్రోద్బలమని తెలుసుకున్నపుడు  అర్థం అవుతుంది. పఠాభి కవితలోని సీత, రాముడి సతిగా ఉండటం కన్నా రావణుని ప్రియురాలిగా ఉండి, "హృదయం ఉన్న రావణున్ని తన ప్రేమతో అమరుణ్ణిగా చేయగలనని"  అమాయకంగా నమ్మే ఆధునిక మహిళ. ఈ పిచ్చి నమ్మకానికి ప్రభావం ముద్దుకృష్ణ నాటకం అశోకం మాత్రమే. కాబట్టి వాల్మీకీ లాగా ఉపజ్ఞ వలన పఠాభికి దానంతట అదే వచ్చేసిన ఆలోచన కాదు. పఠాభి సీత "మాం హి ధర్మాత్మనః పత్నీం శచీమివ శచీ పతే" (నేను ధర్మాత్ముడైన రాముని భార్యను ఎట్లనగా శచి ఇంద్రుని భార్య అయినట్లు) అని ధైర్యంగా పలకగలిగిన వాల్మీకీ రామాయణంలోని సీతైతే కాదు.

అయితే కవితలో తనకు తాను రాముడిగా కన్నా రావణుడిగా ఉండటం వల్ల ఏమి లాభమో కవి చెప్పటం మనల్ని అబ్బుర పరుస్తుంది. ఎందుకంటే సీత అనే తన ప్రియురాలిని, ఆమె పెదవులను పది మూతులతో, ఆమె వదనమును ఇరవై కనులతో గ్రోలాలని ఉబలాటపడే ఫక్తు కొంటె కుర్రాడు పఠాభి.  అక్కడి సీత రావణుడు వేసిన ఎరలో చిక్కుకోలేదు గానీ, ఇక్కడి ఈ ఆధునిక సీత ఈ ప్రతిపాదనకి ఈజీగా పడిపోయిందట. అందుకే తన ధర్మ సహచారిణి అయిందంటాడు!. ధర్మ సహచారిణి అయింది అనటం, ఈ సీత ఆ సీతమ్మని పతివ్రతా శిరోమణి అనీ, భారతీయ స్త్రీ మూర్తీ అని అనటం, అలా సీతమ్మ లా ఉండగలగటం ఒక అపూర్వ భాగ్యమనటం పఠాభికి రామాయణం మీద గౌరవాన్నే సూచిస్తున్నాయి. ముద్ధు కృష్ణ లాగా రామాయణాన్ని వికృతం చేసే పని పెట్టుకోలేదు. చలం లాగా పురాణాల పట్ల గౌరవభావాన్నే చూపించాడు. అంతే కాకుండా రామాయణ కథని కాస్త కొంటెగా కవితలోని పఠాభి పాత్ర వినియోగించుకుని, ఈ ఆధునిక సీతను సొంతం చేసుకోవటానికి ఉపయోగించుకున్నట్టు అనిపిస్తుంది. ఇది టోటల్ గా సరదాగా రాసిన కవితగానే నాకు అర్థం అయింది. కృష్ణ శాస్త్రి అమూర్త ప్రేయసికి, విరుద్ధంగా పఠాభి మూర్త కామాక్షిని, లీలనూ ప్రవేశపెట్టాడేమో కానీ, సీత ని మాత్రం కాదని నాకనిపించింది. ఈ కవితలో సీతని సొంతం చేసుకోడానికి ఆధునిక పఠాభి తన కొంటెదనాన్నే చూపించాడనుకుంటాను. 1972 లో తన ఫీడేలు రాగాలు కు ఇంగ్లీషు రాసిన పీఠిక లో ఇలా అంటాడు "Baffoonery, egoism, and sex were all part of my arsenal". ఈ కవితలోని కొంటేతనమనే ఆయుధం చాందసులకు ఎంత షాక్ ఇచ్చిందో తెలియదు కాని...కవితలోని ఆధునిక సీతకు మాత్రం గిలిగింతలు పెట్టించి ఉంటుందని చెప్పక తప్పదు. కొంటె పఠాభి కదా మరి!!.

సీత
.....
సీత నా సహాధ్యాయిని, సీతా నేను గలసి
నవీనమగు విశ్వనాథ సత్యనారాయణ కృతి
రామాయణ మహా కావ్యమును
పఠించినాము

పఠన ముగిసిన తర్వాత
సీతవంక జూచి, సీత ఆలోచనలోచనాల
వంకజూచి, ప్రశ్నించా ఈలాగ!

"రామాయణాన్నంతా విన్నావు గదా,
ఆదర్శ  పురుషుండనబడు పురాణయుగం
నాటి రామయ్యతో
కవన జవ గమనుల మయి
భూతకాల కాలాడవిలోకి జొచ్చుకొని పోయి
కలిశాము గదా, అతన్ని
అనుసరించి అడవికి పొయాము
మరుగున నుండి వాలిని పరిమార్చుట జూచినాము

ఇదంతా చూచాక,
సీతా నువు పురాణ యుగం నాటి
రామయ్య సతి సీతలాగా
వుండాలని వాంఛిస్తావా? చెప్మా"

ఇటులనేను వచించటము విని
అనింది!
"పఠాభీ ! పతివ్రతా శిరోమణి సీత
భారతీయ స్త్రీమూర్తి సీత
అట్టి సీతగావుండే భాగ్యం
అది అందరాని అపూర్వ మహాభాగ్యం కదా!

కానీ సీతగా వుంటానికి నేను
కోరినా, రామయ్య సతిగా వుంటానికి మాత్రం
ఒప్పుకోను ఏమాత్రం నేను"

"బలే మాట అన్నావు సీతా, బలే"

"రామయ్య సతిగా నుంటకన్నా
రావణుని ప్రియురాలిగా వుండి
హృదయంగల అసురుణ్ణి అమరుణ్ణిగా
చేసివుండేదానిని నా ప్రేమ బలంతో

అది సరే పఠాభీ! నీకేమన్నా
రామయ్యగా వుండాలని కోరికవుందా?"

"ఆ ! ఏమ్మాటన్నావు, సీతా !
నీకు రామయ్య సతిగా వుంట ఇచ్ఛ లేకున్న
నాకు మటుకు
రామయ్యగా వుంటమ్ ఎలా యిష్టం ఉంటుంది?
రామయ్యగా వుండేదాని కంటే
రావణుని గావాలని నా వాంఛ
పది మూతులతోనూ, నీ పెదవులను
మృదు శరీరమును, వదనమును అదుముతాను
ఇరవయి కళ్ళ సంకెళ్ళ తో నిన్ను
నిరతము బందీ చేస్తాను

నా వక్షానికి లాగుకొని
చిక్కని కవుగిలింతలో
అయిక్యం చేసుకొంటాను నిను నాలో సీతా!! ".

సీత నా సహ ధర్మచారిణి
ఇపుడు.

Sunday, 6 December 2015

ll అమ్మతనం ll poem

విరించి  ll  అమ్మతనం  ll
...............................................
మనం పులులుగా, సింహాలుగా
నక్కలుగా తోడేళ్ళుగా పుట్టలేదుర బిడ్డా..
అందుకే మనల్ని చంపేస్తారు.

మనకు కోరలు లేవు
వాడిగా గోళ్ళూ లేవు
మనసులో ఎవరి మీదా కోపాలు లేవు
అందుకే మనల్ని చంపేస్తారు

మనకు ఏ శక్తులూ లేవు
ఏ విద్యలూ రావు. ఏ పవిత్రతా మనలో లేదు.
ఏ కిరీటాలూ, గుడులూ లేవు
కానీ మనుషులు మనకు దైవత్వం అంటగడతారు

మనం దేవతలమూ కాము
దయ్యాలమీ కాము
మనుషులం అంతకన్నా కాము
అయినా ఈ మనుషులెందుకో
మనకు పూజలు చేస్తున్నారు
అయినా ఈ మనుషులెందుకో
కసిగా మన పీకల్ని కోస్తున్నారు.

వాళ్ళంతా చిన్న పిల్లలుగా అంబాడినపుడు
ప్రేమ తో పలుచని పాలిచ్చినదాన్ని
నా కంటి ముందు పెరిగి పెద్దయిన ఈ పిల్లలకు
ఈ బలిసిన నా కండను ధారబోయలేనా?.
అమ్మను కదరా బిడ్డా...!
వారి ఆనందానికి అడ్డు తెలపగలనా?
అమ్మ మనసు కదరా బిడ్డా...!

ఎక్కడెక్కడో గడ్డి మేసి
సాయం నీరెండల్లో నీ కోసం పరిగెత్తుకొచ్చినపుడు
నా పొదుగు మీద నీ చిన్న నోరు ఉంచి పొడుస్తావు చూడు
అపుడు కాళ్ళను పాతేసినట్టు నిలబడి పోతాను చూడు
అది నొప్పి కాదురా బిడ్డా...అమ్మతనం రా!
నీ కోసం దాచిన పాలను, ఇంకొకడొచ్చి పిండుతున్నపుడు
నిశ్చలంగా నిలబడి పోతాను చూడు
అది చేతగాని తనం కాదురా బిడ్డా...అమ్మతనమేరా!

పాల కోసం నోరు తెరిచి ఏ పసి బిడ్డలోనైనా
నిన్నే చూసుకుంటాను చూడు
అది పిచ్చితనం కాదురా బిడ్డా...అమ్మతనమేరా!

పాలంతా గటగటా తాగేసి
చెంగు చెంగు న నీవు ఎగురుతుంటావు చూడు
తన బిడ్డకి నేను పాలిచ్చినందుకు ఇంకెక్కడో తల్లి
చేతులెత్తి మొక్కుతుంటుంది చూడు
అపుడు మౌనంగా కారే కన్నీరు ఏడుపసలే కాదురా బిడ్డా..
గర్వంతో నిలబడిన అమ్మతనమేరా!

కానీ బిడ్డా..
నీవు చెప్పగలిగితే నా మాటగా వాళ్ళకు చెప్పు.
నాకుగాదులూ లేవు ఉషస్సులూ లేవు
నాదైన జీవితం లేదు, నాదైన గొంతుక లేదు
నాకో పేరూ లేదు, మతమూ లేదు
ఒక్క అమ్మతనం తప్ప.
పొదుగులో ఒట్టిపోయిన పాలు తప్ప.

నీవు చెప్పగలిగితే నా మాటగా వాళ్ళకు చెప్పు
ఈ పండగ రోజు నన్ను ఆకలితో కోసుకు తినమను
కోసి కారం పెట్టడం ఒక ఆనందకర విషయమే అయినా
ఆ ఆనందాన్ని నాకు తెలవనీయకమను
ఇంతకాలం ప్రేమను నటించినట్లే
ఆ చివరి క్షణం నా ముందు ఆకలిని నటించమను

ఈ పిచ్చి చివరి కోరిక కూడా పిచ్చితనం కాదురా బిడ్డా..
అమ్మతనమేరా బిడ్డా..!

ఈ గోడు నీకయినా అర్థమయిందారా తండ్రీ..
మన 'అంబా' అనే అమ్మ భాష మనుషులకు అర్థం కాదు కదరా తండ్రీ..
అంబా...అంబా...అంబా...

6/12/15

Wednesday, 2 December 2015

Kavitwa sandarbham3 - చెరా రాసిన "వందేమాతరం" కవితలో దేశ ద్రోహమెక్కడుంది?.

చెరా రాసిన "వందేమాతరం" కవితలో దేశ ద్రోహమెక్కడుంది?.
...............................................................................

గ్లాసులో సగం దాకా నీరుందనేవాడు అధికార పక్షంవాడయితే, లేదోయ్ సరిగ్గా చూడు, సగం గ్లాసు ఇంకా ఖాలీగానే ఉంది అనేవాడు ప్రతిపక్షం వాడు. ఇద్దరూ ఒక సత్యాన్నే చెబుతున్నారు. కానీ ప్రాథమ్యాలు, స్వలాభాలు మారి, చెప్పే పద్ధతిలో మార్పులు చేసి, రెండు వేరు వేరు సత్యాల్లాగా భ్రమింపజేస్తున్నారు.

దేశం వెలిగిపోతోందని అధికార పక్షం వాడంటే, లేదోయ్ సరిగ్గా చూడు, అసహనం పెరిగిపోతోందని ప్రతిపక్షం వాడంటాడు. ఇద్దరూ రెండు వేరు వేరు సత్యాల్నే చెబుతున్నారు. కానీ, తాము చెప్పిన సత్యమే సత్యమని భ్రమింపజేస్తున్నారు.

గ్లాసులో నీరు ఒక ఆబ్జెక్టివ్ విషయం.కంటి ముందు కనిపించే దృగ్విషయం.
కానీ, ఇంత పెద్ద భారత దేశం గురించి, అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక మెతుకు పట్టుకుని చెప్పినట్టు, ఒకటి రెండు సంఘటనలాధారంగా నిర్ణయించి చెప్పటం సాధ్యమా?. అది అసలైన సత్యాన్నే చెబుతున్నట్టా?. "ఇదే సత్యం" అని మనతో నమ్మకంగా పలుకుతున్న ఇరు వర్గాల వారూ, వారి వారి రాజకీయ స్వలాభం కోసం నిర్మించుకున్న సత్యాలు, నిర్మిత సత్యాలు, కవిని ప్రభావితం చేస్తాయా?. కవి ఈ నిర్మిత సత్యాల ముసుగులోంచి, ముసురులోంచి బయటపడి అసలైన సత్యాన్ని దర్శించగలుగుతాడా?.  సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగే శక్తి, నిజాయితీ, నిబద్ధత కలిగిన కవి కన్ఫర్మేషన్ బయాస్ కి లోను కాకుండా పని చేయగలడా?.

కన్ఫర్మేషన్ బయాస్ అంటే ఏమిటి?. అంటే ఒక విషయం పై ముందే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని ఉండటమే కాక, ఆ తరువాత ఆ విషయానికి సంబంధించిన ఏ సమాచారాన్నైనా, మొదట ఏర్పరుచుకున్న అభిప్రాయ దృక్కోణం లోంచే చూడటం. 'నిక్కములే తోచుచుండు' కూడా కన్ఫర్మేషన్ బయాస్ వలననే. స్నేహం చెడిపోయాక ఏర్పడిన వ్యక్తిగత విద్వేషం. మనిషికుండే ఈ బేసిక్ నేచర్ ని ఉపయోగించుకుని, పాలక ప్రతి పక్షాలు తమ తమ క్యాంపైన్ ని మొదలుపెడతాయి. చివరికి వ్యాపార సంస్థలు కూడా మనం కొనుక్కునే ప్రతీ వస్తువునూ అడ్వర్టయిజ్మెంట్ల ద్వారా మనలో ఒక కన్ఫర్మేషన్ బయాస్ ని ఏర్పరచి మనల్ని తమకు అనుగుణంగా మలచుకుంటాయి. మన 'ఏషియన్ ఫుడ్స్' వండటానికి పల్లీ నూనె స్రేష్టమైనదైనా, పెద్ద పెద్ద పూరీల నడుమ చిన్న పిల్లగాడు ఉరుకుతూ  మనలోకి సన్ఫ్లవర్ నూనె నే మంచిదనే ఒక అభిప్రాయాన్ని ముద్ర వేశాడు. మనం కన్వీనియంట్ గా నమ్మేస్తాం. నూనెలో సహజంగా వచ్చే నురగ కనపడటకపోయేసరికి స్వచ్ఛంగా మనకోసం ప్యూరిఫై చేశారనుకుంటాం. కానీ కంపెనీ వాడి ప్యాకేజీలకు అనుగుణంగా నురగను తీసేసే హైలీ ఎసిడిక్ ఆడిటివ్స్ ని వాడతారని కన్వీనియంట్ గా మరచిపోతాం. అసలు తెలిసి ఉంటేనేకదా. కంపనీ వాడు తెలియనీయడు. చాలా గొప్పదనే నమ్మకాన్ని మన మనసులోకి చొప్పించేశాడు. ఈ విధంగా సంస్థలూ, వ్యవస్థలూ సత్యాలను నిర్మిస్తాయి. ఈ నిర్మిత సత్యాలు, ఒక రకమైన కన్ఫర్మేషన్ బయాస్ ఉన్న వారికందరికి అబ్సొల్యూట్ సత్యాల్లాగానే కన్పిస్తాయి. దాన్ని దాటి కొత్తగా ఆలోచించటమన్నది అసలుకే సాధ్యపడని విషయం అయిపోతుంది. కవి కూడా ఈ నిర్మిత సత్యాల్ని కాలరాయలేని పరిస్థితిలోకి పోవటం, పాలక పక్షమో ప్రతి పక్షమో ఇంకో కొత్త పక్షమో చేరిపోవటం సాహిత్య పరంగా దారుణమైన విషయమే అవుతుంది.

కానీ మనకు ఇలాంటి బయాస్ కి అతీతంగా కొంతమంది కవులు కన్పిస్తారు. ముఖ్యంగా దిగంబర కవులు. అయితే దిగంబర కవిత్వపు లక్షణాల్నీ లక్ష్యాలనీ చర్చించటం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. ( ఆ పనిని మునుముందు రాబోయే వ్యాసాల్లో చేయాలి అనుకుంటున్నాను). కానీ ఇక్కడ తమ స్వంత ఆలోచనా శక్తితో, ఎలాంటి ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ల ప్రభావానికీ లోను కాకుండా ఈ దిగంబర కవులు ఎలా సమాజాన్ని నగ్నంగా ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగారన్నది చాలా ముఖ్యవిషయం.  వారి నిబద్ధత, సత్య సంధత ఇపుడు మనకు ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది.  ఎందుకంటే ఇపుడు మనకు దొరికే ఇన్ఫర్మేషన్ అంతా కేవలం మీడియా ద్వారా లభించేదే. నిజానికి అది మనకు శుద్ధంగా చేరుతుందనే నమ్మకం లేదు. థియరీ ఆఫ్ సిమ్యులేషన్ అని ఉంది. బాద్రిల్లర్ ప్రతిపాదించినది.  'అసలు గల్ఫ్ యుద్ధం జరిగిందా?!' అని అడుగుతాడాయన. ఏమో ఎవరికి తెలుసు?. మనకు తెలిసిందంతా అమెరికన్  మీడియా చూపించినదే. అవి నిర్మిత సత్యాలయిండవచ్చు కదా!. వార్తలని కూడా స్టైలైజ్డ్ వర్షన్ లాగా ఫిక్షన్ లాగా చూపెట్టడం ప్రస్థుతం జరుగుతోంది. కొన్ని వార్తా ఛానల్స్ ఇంకాస్త అరాచకంగా 'పొలిటికల్ గాసిప్స్' ని ప్రసారం చేస్తున్నాయి. గాసిప్స్ అంటే పుకార్లు. పుకార్లు వార్తలెలా అవుతాయి?. పుకార్లని కనుక్కని, వీలైతే తయారు చేసుకుని ప్రజలకు చూపించటం జర్నలిజం అవుతుందా?. ఇలా వాస్తవమూ, ఫిక్షన్ కలిసిపోయిన ఈనాటి సమాజంలో, సత్య సంధుడైన కవి జాగరూకతతో ఉండక తప్పదు.

కవికి కార్య రంగం సమాజమే, కార్య ప్రేరణ సమాజమే, కవితా వస్తువూ సమాజమే అయినపుడు, సునిశిత దృష్టి కూడా అవసరమే. అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో కూర్చుని ఇండియా గురించి రాసే  వారికీ, అడుగు బయట పెట్టకుండా ఇంట్లో కూర్చుని రాసే వారికీ ఈ ప్రస్తుత సమాజానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి వస్తుంది?. అంతా మీడియా మీదనే కదా ఆధార పడేది. ఆ కవిత నిజమైన కవిత అవుతుందా. లేక ఒక వర్గం ని ఎలివేట్ చేసే అడ్వర్టయిజ్మెంటవుతుందా? ఇదేమీ ఎమోషన్ రి కలెక్టెడ్ ఎట్ ట్రాంక్విలిటి కాదుగా, భావ కవిత్వం రాసుకోవటానికి. సమాజాన్ని నగ్నంగా వర్తమానంలో ఉన్నది ఉన్నట్టు గా రాయాలి. అదిగో అలా రాసి ఒక దిశా నిర్దేశం చేసిన వారే దిగంబర కవులు. వీరి సామాజిక దృక్కోణం అస్తిత్వ వాదుల 'డిస్పెయిర్'( despair) కాదు. డిస్పెయిర్ మాత్రమే అయితే కవిత్వం రాయటమెందుకు, సార్త్రే 'నాసియా' చదివి సూయిసైడ్ చేసుకోవచ్చు. లేదా అల్బర్ట్ కామూ సృష్టించిన మెర్ సాల్ట్ లాగా మరణాన్ని చూసి దుఃఖ పడకుండా స్తబ్దుగా ఉండిపోయుండొచ్చు. మెర్ సాల్ట్ ని, రేయ్మండ్ బండ బూతుల లెటరు రాసియ్యమని అడిగినపుడు రాయనని అనటానికి కారణాలు కనిపించని స్థితిలో వీరేమీ లేరు. లేదా మెర్ సాల్ట్ లాగా 'దుఃఖాన్ని చూసి ప్రపంచం నిర్లిప్తంగా ఉండిపోతుందని తెలుసుకోగలగటమే ఎన్లైటన్మెంటు'  అనుకుని, ఒక భావాతీత ప్రశాంత స్థితిలోకి వీరు జారిపోనూలేదు.  అందుకు విరుద్ధంగా ధ్వంస రచన కు పూనుకున్నారు.

దిగంబర కవుల్లో ఒకరైన చెరబండ రాజు రాసిన "వందేమాతరం" కవిత, ఒక సత్యాన్ని ఎలాంటి ప్రలోభాలకీ లోనవకుండా దేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనముందు ఉంచుతుంది . ఈ కవితలో ఇంకో ప్రత్యేకత ఏమంటే 1965 లో చెరబండ రాజు చూసిన దేశ పరిస్థితికీ ఇప్పటికీ ఏ మాత్రం తేడా లేకపోవటం. అప్పటి పరిస్థితులకన్నా, ఇప్పటి పరిస్థితులకే ఈ కవిత ఇంకా చక్కగా అమరినట్టు కనిపించటం. తేడా ఉన్నదల్లా, ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్లని సమర్థవంతంగా మోస్తున్న మీడియా, అది ప్రజల్ని వర్గాలుగా చీల్చి ఒక్కొక్క వర్గాన్నీ ఒక నిర్మిత సత్యాన్ని నమ్మించగలిగి, అదే నిజమనుకొనే భ్రమలోనే ప్రజల్ని ఉంచగలగటం. చెరబండ రాజు కవితలో అరాచకం కనిపించదు. నిబద్ధతతో కూడిన దేశభక్తి కనిపిస్తుంది. అయితే దేశభక్తి అనే దాన్ని ఒక 'ఎమోషనల్ భావన'గా మార్చి వేసినపుడు ఈ పదమే హాస్యాస్పదం అవుతుంది. నిజానికి దేశమనే 'భావం' మిథ్య. కానీ 'దేశం' సత్యం. దీని వలన దేశ భక్తి రెండు రకాలుగా కనిపిస్తుంటుంది. దేశమనే పవిత్ర భావనలాంటి ద్వారా వచ్చిన భక్తి. ఇది ప్రేయసి లేదా దేవుడు స్థానంలో దేశాన్ని ఉంచటం వల్ల కలిగిన అవస్థ. అలాకాక దేశమనేది జవజీవాలు కలిగిన సత్యం లాగా తెలుసుకొని దానిలోని జీవులూ, వారి జీవితమూ, వేదనలూ, ఆకలిలోంచి వచ్చిన మానవతతో కూడిన దేశ భక్తి. దేశాన్ని ముందుకి నడిపించటం ఈ రెండవ రకం వారికి కేవలం ఒక భావన కాదు. యదార్థ సత్యం. వారికది ఒక పరిణామ విషయం. ఈ కవితలో ఇటువంటి భక్తి కనిపిస్తుంది. భారత దేశాన్ని తిట్టడం కాకుండా ఆమెని తమ స్వార్థానికి వాడుకుంటున్న శక్తుల మీద సటైర్ కన్పిస్తుంది. దీన్ని సరిగా అర్థం చేసుకోక పోతే, ఈ కవిత దేశ ద్రోహన్ని రెచ్చగొట్టేదానిలా కనిపిస్తుంది. అందుకనేమో కవితలో భారత దేశాన్ని కులటగా చిత్రించినట్టు గా అపార్థం చేసుకుని, చెరబండ రాజు మీద దాడి కూడా జరిగిందప్పట్లో. నిజానికి, ఇలా దిగజారిపోతున్న భారత దేశం మీద ప్రేమ దయ జాలి వంటివే కనిపిస్తాయి ఈ కవితలో. కవితలో నిరాశ కానీ, అసహ్యం కానీ కనిపించదు. కానీ ఒక ఆవేదన కనిపిస్తుంది. 'అమ్మా భారతీ, నీ గమ్యం ఏమిటి తల్లీ..!' అని అడగటంలో వ్వవస్థ మీద అసహ్యం ఎక్కడ కనిపించింది?.  సొల్యూషన్ కోసం అన్వేషణ కన్పిస్తుంది.

"దుండగులతో పక్క మీద కులుకుతున్న శీలం నీది".
ఈ దుండగులెవరు అంటే చెప్పటం కష్టం. దుండగులను ప్రోత్సహిస్తుందనే స్పృహ ఈ వాక్యంలో ఉంది. ఒక దేశం ఎందుకు దుండగులను ప్రోత్సహించాలి? ఎందుకు భరించాలి? అని మనం ప్రశ్నించుకుంటే విషయం చాలా పెద్దదవుతుంది. ఇక్కడ దేశం అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వమనుకోవాలి. రాజకీయ కారణాలే దుర్మార్గాల్ని ప్రోత్సహిస్తాయనేది అందరికి తెలిసిన విషయమే.

"అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది".
ఇంటర్నేషనల్ మార్కెట్ ఇపుడింకా ఎక్కువ అయింది. కానీ ఏకొద్దిగనో ఉండిన ఆ కాలంలోనే కవి గుర్తించి గర్హిస్తున్నాడు. తన అందాన్నే తాకట్టు పెట్టిందట. భారత దేశపు అందం ఏమిటి?. దాన్ని అంతర్జాతీయ విపణిలో తాకట్టు పెట్టి మనమేమి బదులుగా తెచ్చుకున్నాం అనేది మనం ఆలోచించాలి.

"సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది".
సంపన్నుల చేతుల్లోనే రాజకీయాలు, ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇది కవి యొక్క సునిశిత పరిశీలనకి తార్కాణమైన వాక్యం. ఇది ఇప్పటికీ మారలేదు. మారుతుందన్న నమ్మకం కూడా లేదు. ఈ విషయంలో నిత్య యవ్వనమే.

"ఊసినా దుమ్మెత్తి పోసినా చలనం లేని మైకం నీది".
దీనికి విరుద్థంగా ఇపుడు అతి చలనం కనిపిస్తుంది. దుమ్మెత్తి పోసే వారిలోనూ అతి, అలాగే స్పందించే వారిలోనూ అతి. చెరబండ రాజు సమయంలో లేని మీడియా అతి, మనకిపుడుంది. సమాచార విప్లవం సమాచారం కంటే అతినే అతిగా తీసుకుని వచ్చిందని టీవీ ముందు అయిదు నిముషాలు కూచుంటే చాలు. అర్థం అయిపోతుంది.

తరువాతి కవితంతా "రోటీ కప్డా అవుర్ మకాన్" లను అందించలేని దానిలా దేశాన్ని వర్ణిస్తాడు కవి . ఈ కవికి ఎంతటి లోతైన ముందు చూపుందో అనిపిస్తుంది. ఈ కవిత చూసే  తరువాత వచ్చిన ప్రభుత్వాలు రోటీ కపడా మకాన్ స్లోగన్ ఇచ్చాయేమో అనిపించినా, 1964 లో ఆకలి యువతరం(hungry youth) ప్రతినిధి గా కవి ఎంతగా నలిగి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.ఈ స్లోగన్ ఆనాటి అందరి అవసరం అనిపిస్తుంది.

"కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న ఎలుకల్నీ పంది కొక్కుల్నీ భరిస్తూ నిల్చున్న భారతివమ్మా!..నోటికందని సస్య శ్యామల సీమవమ్మా!."
దేశంలో అభివృద్ధి జరుగుతున్నదనే కవి రాశాడు. దేశం సస్య శ్యామలంగా ఉందనే రాశాడు.  కానీ ఆ ఫలాల్ని తినే ఎలుకలూ పందికొక్కులు వాటిని అందరికీ అందనివ్వటం లేదు. ఎంత నిష్కర్షగా కవి చెప్పాడు. ఒక సంస్థ  వారికి ఈ కవితలో దేశ దూషణ ఎక్కడ కనిపించింది?. ఎందుకు కనిపించింది?. ఎందుకు కవి మీద దాడి చేశారు?. మనం ఇంతకుముందు అనుకున్నట్టు 'కన్ఫర్మేషన్ బయాస్' అయివుండవచ్చు.

దేశ పరిస్థితులను ఎలాంటి బయాస్ కీ గురికాకుండా చూడగలిగే చూపు, నిజాయితీ కలిగిన చూపు  దిగంబర కవుల్లో కనిపిస్తుంది. దాన్ని ఈ తరం కవులం అందిపుచ్చుకోవాలి. దానికి సరి అయిన తరుణం ఇదే.  సమాచార విప్లవం పేరుతో మన ఆలోచనల్ని పూర్తిగా కొల్లగొట్టి, తన ఆలోచనలని మాత్రమే మనలో చొప్పించే మీడియా, మనల్ని మనకు కాకుండా చేస్తున్న మీడియా, విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా విజృభిస్తున్న ఈ తరుణం లోనే చెరా ఈ కవితలో చూపిన స్పిరిట్ ని అందిపుచ్చుకోవాలి. ముందు కవి తనకుతాను స్వచ్ఛందంగా మేల్కొని, తరువాత సమాజాన్ని మేల్కొలిపే యజ్ఞంలో తలమునకలవాలి.

ఓ నా ప్రియమైన మాతృదేశమా
తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా
దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది
అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది
సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది
ఊసినా దుమ్మెత్తి పోసినా చలనం లేని మైకం నీది
కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న
ఎలుకలూ పందికొక్కుల్నీ భరిస్తూ నుంచున్న భారతివమ్మా
నోటికందని సస్యశ్యామల సీమవమ్మా
వందేమాతరం వందేమాతరం
ఒంటిమీది గుడ్డలతో జండాలు కుట్టించి
వివస్త్రవై ఊరేగుతున్న ధైర్యం నీది
అప్పుతెచ్చి లేపిన మిద్దెల్లో, కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది
ఎండిన స్తనాల మీదికి ఎగబడ్డ బిడ్డల్ని, ఓదార్చలేని లోకం నీది
ఆకలికి ఎండి మాడి ఎరువు సొమ్ములతో వీధిన పడ్డ సింగారం నీది
అమ్మా, భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ
వందేమాతరం వందేమాతరం

2/12/15