Sunday, 6 December 2015

ll అమ్మతనం ll poem

విరించి  ll  అమ్మతనం  ll
...............................................
మనం పులులుగా, సింహాలుగా
నక్కలుగా తోడేళ్ళుగా పుట్టలేదుర బిడ్డా..
అందుకే మనల్ని చంపేస్తారు.

మనకు కోరలు లేవు
వాడిగా గోళ్ళూ లేవు
మనసులో ఎవరి మీదా కోపాలు లేవు
అందుకే మనల్ని చంపేస్తారు

మనకు ఏ శక్తులూ లేవు
ఏ విద్యలూ రావు. ఏ పవిత్రతా మనలో లేదు.
ఏ కిరీటాలూ, గుడులూ లేవు
కానీ మనుషులు మనకు దైవత్వం అంటగడతారు

మనం దేవతలమూ కాము
దయ్యాలమీ కాము
మనుషులం అంతకన్నా కాము
అయినా ఈ మనుషులెందుకో
మనకు పూజలు చేస్తున్నారు
అయినా ఈ మనుషులెందుకో
కసిగా మన పీకల్ని కోస్తున్నారు.

వాళ్ళంతా చిన్న పిల్లలుగా అంబాడినపుడు
ప్రేమ తో పలుచని పాలిచ్చినదాన్ని
నా కంటి ముందు పెరిగి పెద్దయిన ఈ పిల్లలకు
ఈ బలిసిన నా కండను ధారబోయలేనా?.
అమ్మను కదరా బిడ్డా...!
వారి ఆనందానికి అడ్డు తెలపగలనా?
అమ్మ మనసు కదరా బిడ్డా...!

ఎక్కడెక్కడో గడ్డి మేసి
సాయం నీరెండల్లో నీ కోసం పరిగెత్తుకొచ్చినపుడు
నా పొదుగు మీద నీ చిన్న నోరు ఉంచి పొడుస్తావు చూడు
అపుడు కాళ్ళను పాతేసినట్టు నిలబడి పోతాను చూడు
అది నొప్పి కాదురా బిడ్డా...అమ్మతనం రా!
నీ కోసం దాచిన పాలను, ఇంకొకడొచ్చి పిండుతున్నపుడు
నిశ్చలంగా నిలబడి పోతాను చూడు
అది చేతగాని తనం కాదురా బిడ్డా...అమ్మతనమేరా!

పాల కోసం నోరు తెరిచి ఏ పసి బిడ్డలోనైనా
నిన్నే చూసుకుంటాను చూడు
అది పిచ్చితనం కాదురా బిడ్డా...అమ్మతనమేరా!

పాలంతా గటగటా తాగేసి
చెంగు చెంగు న నీవు ఎగురుతుంటావు చూడు
తన బిడ్డకి నేను పాలిచ్చినందుకు ఇంకెక్కడో తల్లి
చేతులెత్తి మొక్కుతుంటుంది చూడు
అపుడు మౌనంగా కారే కన్నీరు ఏడుపసలే కాదురా బిడ్డా..
గర్వంతో నిలబడిన అమ్మతనమేరా!

కానీ బిడ్డా..
నీవు చెప్పగలిగితే నా మాటగా వాళ్ళకు చెప్పు.
నాకుగాదులూ లేవు ఉషస్సులూ లేవు
నాదైన జీవితం లేదు, నాదైన గొంతుక లేదు
నాకో పేరూ లేదు, మతమూ లేదు
ఒక్క అమ్మతనం తప్ప.
పొదుగులో ఒట్టిపోయిన పాలు తప్ప.

నీవు చెప్పగలిగితే నా మాటగా వాళ్ళకు చెప్పు
ఈ పండగ రోజు నన్ను ఆకలితో కోసుకు తినమను
కోసి కారం పెట్టడం ఒక ఆనందకర విషయమే అయినా
ఆ ఆనందాన్ని నాకు తెలవనీయకమను
ఇంతకాలం ప్రేమను నటించినట్లే
ఆ చివరి క్షణం నా ముందు ఆకలిని నటించమను

ఈ పిచ్చి చివరి కోరిక కూడా పిచ్చితనం కాదురా బిడ్డా..
అమ్మతనమేరా బిడ్డా..!

ఈ గోడు నీకయినా అర్థమయిందారా తండ్రీ..
మన 'అంబా' అనే అమ్మ భాష మనుషులకు అర్థం కాదు కదరా తండ్రీ..
అంబా...అంబా...అంబా...

6/12/15

No comments:

Post a Comment