Friday, 25 December 2015

కవిత్వ సందర్భం- 5

పట్టాభి రాముడిలో లేని కొంటెదనం పఠాభి రాముడిలో ఉండొచ్చు. అది ఆయుధం కూడా కావొచ్చు.
..............................................................................................................................
పల్లెటూరి గోధూళి వేళలూ, పిచ్చుక శబ్దాలు, పచ్చిక బయళ్ళ స్థానంలో...నగరం లోని బిజీ లైఫులూ, రణగొణ ధ్వనులూ, ఇరుకు సందులూ వచ్చి చేరితే..
ఆకాశం లోని జాబిల్లి నక్షత్రాలు, నగరం లోని మిణుకు మిణుకుమనే ఎలక్ట్రిక్ బల్లుల ముందు పేలవంగా, దరిద్రంగా, అనవసరంగా కనిపిస్తే..
ప్రేయసి కనులను, కనుబొమ్మలనూ, హృదయాన్ని, కరుణను వర్ణించే చోట ప్రియురాలి అధరాలు, వక్షోజాలూ, నడుము వంపులూ, చుంబనాలూ, కౌగిలింతలూ వెచ్చగా అనిపిస్తే...
ఒకప్పటి ప్లెటోనిక్ లవ్ స్థానంలో ఇప్పటి వన్ నైట్ స్టాండ్ సంబంధాలు స్త్రీ పురుషుల మధ్యన కనిపిస్తే....
ప్రస్తుత గ్లోబల్ ప్రపంచంలో ఉన్న మనకు ఏమనిపిస్తుంది?.

ఆ! దీనిలో కొత్తేముంది. రోజూ వింటున్నదే కదా..!  అనిపించటంలో మనకు వింత ఏమీ ఉండదు కానీ, 1930 వ దశకం లో, భావ కవిత్వపు నశాలో తేలియాడే సమయంలో, అకస్మాత్తుగా కవితల్లోకి ఇలాంటి నగర జీవితమూ, కామమూ వంటి వస్తువులతో ఒక ఫుస్తకం  'ఫిడేలు రగాల డజను'లా వస్తే ఏమౌతుంది?. రాగాల డజను కాదిది, రోగాల డజను అని అనాల్సి వస్తుంది. వలపు పస్తులతో నవసి మతి చెడిన యువకుని ఉన్మత్త ప్రేలాపన( mad ravings) గా స్పురిస్తుంది. ఇలా అంటారని ముందే తెలుసేమో పఠాభికి, అందుకే పద్యాల నడ్డి విరగ్గొట్టడానికి వచ్చేస్తున్నానంటూ, అహంభావ కవినంటూ ముందే ప్రకటించేసుకున్నాడు.
1939 లో ముద్రితమైన ఈ పుస్తకం తెలుగులో మొదటగా ప్రచురితమైన వచన కవిత్వపు పుస్తకం అనే విషయం చాలా మందికి తెలియక పోవటం ఎందుకంటే, చాలామందికి ఇది రాగాల డజనుగా కన్నా రోగాల డజను లాగా కనిపించటం. శ్రీశ్రీ రాసిన అభ్యుదయ కవితలు అప్పటికే పత్రికల్లో ప్రచురితమైనా అది పుస్తకం రూపంలో వచ్చింది మాత్రం 1950 లోనే. అభ్యుదయ కవిత్వానికి పఠాభి వలన ప్రత్యక్ష ప్రయోజనం ఏమీ లేకపోయినా పరోక్ష ప్రయోజనం విస్మరించదగినది కాదని వేల్చేరు నారాయణ రావు గారెందుకన్నారో తెలియనిదయినా, నగర జీవితాన్ని తెలుగు సాహిత్యంలోకి ప్రవేశ పెట్టిన వాడిగా పఠాభి మనకు వేస్ట్ ల్యాండు ఇలియట్ ని గుర్తుకు తెస్తాడు.

ఇదే ఫిడేలు రాగాల డజనులో మనకొక సీత కనిపిస్తుంది. అయితే ఈమె రామాయణంలోని సీత కాదు. రామాయణం సీతను గురించి తలుచుకునే 'ఆధునిక సీత'. ఈ సీత, కవితలో 'పఠాభి' అనే వ్యకికి స్నేహితురాలు. అయితే కవితలోని ,ఈ పఠాభి, కవి పఠాభి కాదు. ఆ విషయాన్ని పుస్తకం ముందే రాసుకున్నాడు పఠాభి. అలాగే కవితలోని పఠాభి, రామాయణంలోని పట్టాభి రాముడూ కాడు. కవితలోని విషయమేమంటే, ఈ ఆధునిక సీత, కవి పఠాభితో కాక కవితలోని పఠాభితో, రామాయణంలోని సీతా రాముల గురించి చర్చించుకోవటం. కవితకు రామాయణం, అందునా విశ్వనాథ వారి రామాయణం వస్తువయినా, కవిత నడవటానికి బలమైన ప్రోద్బలం కలిగించినది మాత్రం ముద్దుకృష్ణ రాసిన 'అశోకం' నాటకం. పఠాభి, ఉపజ్ఞ ఉన్న కవిగా పేరుతెచ్చుకున్నా..ఆ ఉపజ్ఞ చమత్కార రచనకే పరిమితమైందని అప్రతిష్ఠ ఉన్నా..గెస్టాల్ట్ థియరీ ప్రకారం, నేర్చుకోవటమన్నది అంతకుముందున్న జ్ఞాన సంపద మీద ఆధారపడుతుందని, మనకు ఈ కవిత చదివినపుడు, దీనికి 1934 లో వచ్చిన 'అశోకం' నాటకం ప్రోద్బలమని తెలుసుకున్నపుడు  అర్థం అవుతుంది. పఠాభి కవితలోని సీత, రాముడి సతిగా ఉండటం కన్నా రావణుని ప్రియురాలిగా ఉండి, "హృదయం ఉన్న రావణున్ని తన ప్రేమతో అమరుణ్ణిగా చేయగలనని"  అమాయకంగా నమ్మే ఆధునిక మహిళ. ఈ పిచ్చి నమ్మకానికి ప్రభావం ముద్దుకృష్ణ నాటకం అశోకం మాత్రమే. కాబట్టి వాల్మీకీ లాగా ఉపజ్ఞ వలన పఠాభికి దానంతట అదే వచ్చేసిన ఆలోచన కాదు. పఠాభి సీత "మాం హి ధర్మాత్మనః పత్నీం శచీమివ శచీ పతే" (నేను ధర్మాత్ముడైన రాముని భార్యను ఎట్లనగా శచి ఇంద్రుని భార్య అయినట్లు) అని ధైర్యంగా పలకగలిగిన వాల్మీకీ రామాయణంలోని సీతైతే కాదు.

అయితే కవితలో తనకు తాను రాముడిగా కన్నా రావణుడిగా ఉండటం వల్ల ఏమి లాభమో కవి చెప్పటం మనల్ని అబ్బుర పరుస్తుంది. ఎందుకంటే సీత అనే తన ప్రియురాలిని, ఆమె పెదవులను పది మూతులతో, ఆమె వదనమును ఇరవై కనులతో గ్రోలాలని ఉబలాటపడే ఫక్తు కొంటె కుర్రాడు పఠాభి.  అక్కడి సీత రావణుడు వేసిన ఎరలో చిక్కుకోలేదు గానీ, ఇక్కడి ఈ ఆధునిక సీత ఈ ప్రతిపాదనకి ఈజీగా పడిపోయిందట. అందుకే తన ధర్మ సహచారిణి అయిందంటాడు!. ధర్మ సహచారిణి అయింది అనటం, ఈ సీత ఆ సీతమ్మని పతివ్రతా శిరోమణి అనీ, భారతీయ స్త్రీ మూర్తీ అని అనటం, అలా సీతమ్మ లా ఉండగలగటం ఒక అపూర్వ భాగ్యమనటం పఠాభికి రామాయణం మీద గౌరవాన్నే సూచిస్తున్నాయి. ముద్ధు కృష్ణ లాగా రామాయణాన్ని వికృతం చేసే పని పెట్టుకోలేదు. చలం లాగా పురాణాల పట్ల గౌరవభావాన్నే చూపించాడు. అంతే కాకుండా రామాయణ కథని కాస్త కొంటెగా కవితలోని పఠాభి పాత్ర వినియోగించుకుని, ఈ ఆధునిక సీతను సొంతం చేసుకోవటానికి ఉపయోగించుకున్నట్టు అనిపిస్తుంది. ఇది టోటల్ గా సరదాగా రాసిన కవితగానే నాకు అర్థం అయింది. కృష్ణ శాస్త్రి అమూర్త ప్రేయసికి, విరుద్ధంగా పఠాభి మూర్త కామాక్షిని, లీలనూ ప్రవేశపెట్టాడేమో కానీ, సీత ని మాత్రం కాదని నాకనిపించింది. ఈ కవితలో సీతని సొంతం చేసుకోడానికి ఆధునిక పఠాభి తన కొంటెదనాన్నే చూపించాడనుకుంటాను. 1972 లో తన ఫీడేలు రాగాలు కు ఇంగ్లీషు రాసిన పీఠిక లో ఇలా అంటాడు "Baffoonery, egoism, and sex were all part of my arsenal". ఈ కవితలోని కొంటేతనమనే ఆయుధం చాందసులకు ఎంత షాక్ ఇచ్చిందో తెలియదు కాని...కవితలోని ఆధునిక సీతకు మాత్రం గిలిగింతలు పెట్టించి ఉంటుందని చెప్పక తప్పదు. కొంటె పఠాభి కదా మరి!!.

సీత
.....
సీత నా సహాధ్యాయిని, సీతా నేను గలసి
నవీనమగు విశ్వనాథ సత్యనారాయణ కృతి
రామాయణ మహా కావ్యమును
పఠించినాము

పఠన ముగిసిన తర్వాత
సీతవంక జూచి, సీత ఆలోచనలోచనాల
వంకజూచి, ప్రశ్నించా ఈలాగ!

"రామాయణాన్నంతా విన్నావు గదా,
ఆదర్శ  పురుషుండనబడు పురాణయుగం
నాటి రామయ్యతో
కవన జవ గమనుల మయి
భూతకాల కాలాడవిలోకి జొచ్చుకొని పోయి
కలిశాము గదా, అతన్ని
అనుసరించి అడవికి పొయాము
మరుగున నుండి వాలిని పరిమార్చుట జూచినాము

ఇదంతా చూచాక,
సీతా నువు పురాణ యుగం నాటి
రామయ్య సతి సీతలాగా
వుండాలని వాంఛిస్తావా? చెప్మా"

ఇటులనేను వచించటము విని
అనింది!
"పఠాభీ ! పతివ్రతా శిరోమణి సీత
భారతీయ స్త్రీమూర్తి సీత
అట్టి సీతగావుండే భాగ్యం
అది అందరాని అపూర్వ మహాభాగ్యం కదా!

కానీ సీతగా వుంటానికి నేను
కోరినా, రామయ్య సతిగా వుంటానికి మాత్రం
ఒప్పుకోను ఏమాత్రం నేను"

"బలే మాట అన్నావు సీతా, బలే"

"రామయ్య సతిగా నుంటకన్నా
రావణుని ప్రియురాలిగా వుండి
హృదయంగల అసురుణ్ణి అమరుణ్ణిగా
చేసివుండేదానిని నా ప్రేమ బలంతో

అది సరే పఠాభీ! నీకేమన్నా
రామయ్యగా వుండాలని కోరికవుందా?"

"ఆ ! ఏమ్మాటన్నావు, సీతా !
నీకు రామయ్య సతిగా వుంట ఇచ్ఛ లేకున్న
నాకు మటుకు
రామయ్యగా వుంటమ్ ఎలా యిష్టం ఉంటుంది?
రామయ్యగా వుండేదాని కంటే
రావణుని గావాలని నా వాంఛ
పది మూతులతోనూ, నీ పెదవులను
మృదు శరీరమును, వదనమును అదుముతాను
ఇరవయి కళ్ళ సంకెళ్ళ తో నిన్ను
నిరతము బందీ చేస్తాను

నా వక్షానికి లాగుకొని
చిక్కని కవుగిలింతలో
అయిక్యం చేసుకొంటాను నిను నాలో సీతా!! ".

సీత నా సహ ధర్మచారిణి
ఇపుడు.

No comments:

Post a Comment