Wednesday, 2 December 2015

Kavitwa sandarbham3 - చెరా రాసిన "వందేమాతరం" కవితలో దేశ ద్రోహమెక్కడుంది?.

చెరా రాసిన "వందేమాతరం" కవితలో దేశ ద్రోహమెక్కడుంది?.
...............................................................................

గ్లాసులో సగం దాకా నీరుందనేవాడు అధికార పక్షంవాడయితే, లేదోయ్ సరిగ్గా చూడు, సగం గ్లాసు ఇంకా ఖాలీగానే ఉంది అనేవాడు ప్రతిపక్షం వాడు. ఇద్దరూ ఒక సత్యాన్నే చెబుతున్నారు. కానీ ప్రాథమ్యాలు, స్వలాభాలు మారి, చెప్పే పద్ధతిలో మార్పులు చేసి, రెండు వేరు వేరు సత్యాల్లాగా భ్రమింపజేస్తున్నారు.

దేశం వెలిగిపోతోందని అధికార పక్షం వాడంటే, లేదోయ్ సరిగ్గా చూడు, అసహనం పెరిగిపోతోందని ప్రతిపక్షం వాడంటాడు. ఇద్దరూ రెండు వేరు వేరు సత్యాల్నే చెబుతున్నారు. కానీ, తాము చెప్పిన సత్యమే సత్యమని భ్రమింపజేస్తున్నారు.

గ్లాసులో నీరు ఒక ఆబ్జెక్టివ్ విషయం.కంటి ముందు కనిపించే దృగ్విషయం.
కానీ, ఇంత పెద్ద భారత దేశం గురించి, అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక మెతుకు పట్టుకుని చెప్పినట్టు, ఒకటి రెండు సంఘటనలాధారంగా నిర్ణయించి చెప్పటం సాధ్యమా?. అది అసలైన సత్యాన్నే చెబుతున్నట్టా?. "ఇదే సత్యం" అని మనతో నమ్మకంగా పలుకుతున్న ఇరు వర్గాల వారూ, వారి వారి రాజకీయ స్వలాభం కోసం నిర్మించుకున్న సత్యాలు, నిర్మిత సత్యాలు, కవిని ప్రభావితం చేస్తాయా?. కవి ఈ నిర్మిత సత్యాల ముసుగులోంచి, ముసురులోంచి బయటపడి అసలైన సత్యాన్ని దర్శించగలుగుతాడా?.  సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగే శక్తి, నిజాయితీ, నిబద్ధత కలిగిన కవి కన్ఫర్మేషన్ బయాస్ కి లోను కాకుండా పని చేయగలడా?.

కన్ఫర్మేషన్ బయాస్ అంటే ఏమిటి?. అంటే ఒక విషయం పై ముందే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని ఉండటమే కాక, ఆ తరువాత ఆ విషయానికి సంబంధించిన ఏ సమాచారాన్నైనా, మొదట ఏర్పరుచుకున్న అభిప్రాయ దృక్కోణం లోంచే చూడటం. 'నిక్కములే తోచుచుండు' కూడా కన్ఫర్మేషన్ బయాస్ వలననే. స్నేహం చెడిపోయాక ఏర్పడిన వ్యక్తిగత విద్వేషం. మనిషికుండే ఈ బేసిక్ నేచర్ ని ఉపయోగించుకుని, పాలక ప్రతి పక్షాలు తమ తమ క్యాంపైన్ ని మొదలుపెడతాయి. చివరికి వ్యాపార సంస్థలు కూడా మనం కొనుక్కునే ప్రతీ వస్తువునూ అడ్వర్టయిజ్మెంట్ల ద్వారా మనలో ఒక కన్ఫర్మేషన్ బయాస్ ని ఏర్పరచి మనల్ని తమకు అనుగుణంగా మలచుకుంటాయి. మన 'ఏషియన్ ఫుడ్స్' వండటానికి పల్లీ నూనె స్రేష్టమైనదైనా, పెద్ద పెద్ద పూరీల నడుమ చిన్న పిల్లగాడు ఉరుకుతూ  మనలోకి సన్ఫ్లవర్ నూనె నే మంచిదనే ఒక అభిప్రాయాన్ని ముద్ర వేశాడు. మనం కన్వీనియంట్ గా నమ్మేస్తాం. నూనెలో సహజంగా వచ్చే నురగ కనపడటకపోయేసరికి స్వచ్ఛంగా మనకోసం ప్యూరిఫై చేశారనుకుంటాం. కానీ కంపెనీ వాడి ప్యాకేజీలకు అనుగుణంగా నురగను తీసేసే హైలీ ఎసిడిక్ ఆడిటివ్స్ ని వాడతారని కన్వీనియంట్ గా మరచిపోతాం. అసలు తెలిసి ఉంటేనేకదా. కంపనీ వాడు తెలియనీయడు. చాలా గొప్పదనే నమ్మకాన్ని మన మనసులోకి చొప్పించేశాడు. ఈ విధంగా సంస్థలూ, వ్యవస్థలూ సత్యాలను నిర్మిస్తాయి. ఈ నిర్మిత సత్యాలు, ఒక రకమైన కన్ఫర్మేషన్ బయాస్ ఉన్న వారికందరికి అబ్సొల్యూట్ సత్యాల్లాగానే కన్పిస్తాయి. దాన్ని దాటి కొత్తగా ఆలోచించటమన్నది అసలుకే సాధ్యపడని విషయం అయిపోతుంది. కవి కూడా ఈ నిర్మిత సత్యాల్ని కాలరాయలేని పరిస్థితిలోకి పోవటం, పాలక పక్షమో ప్రతి పక్షమో ఇంకో కొత్త పక్షమో చేరిపోవటం సాహిత్య పరంగా దారుణమైన విషయమే అవుతుంది.

కానీ మనకు ఇలాంటి బయాస్ కి అతీతంగా కొంతమంది కవులు కన్పిస్తారు. ముఖ్యంగా దిగంబర కవులు. అయితే దిగంబర కవిత్వపు లక్షణాల్నీ లక్ష్యాలనీ చర్చించటం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. ( ఆ పనిని మునుముందు రాబోయే వ్యాసాల్లో చేయాలి అనుకుంటున్నాను). కానీ ఇక్కడ తమ స్వంత ఆలోచనా శక్తితో, ఎలాంటి ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ల ప్రభావానికీ లోను కాకుండా ఈ దిగంబర కవులు ఎలా సమాజాన్ని నగ్నంగా ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగారన్నది చాలా ముఖ్యవిషయం.  వారి నిబద్ధత, సత్య సంధత ఇపుడు మనకు ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది.  ఎందుకంటే ఇపుడు మనకు దొరికే ఇన్ఫర్మేషన్ అంతా కేవలం మీడియా ద్వారా లభించేదే. నిజానికి అది మనకు శుద్ధంగా చేరుతుందనే నమ్మకం లేదు. థియరీ ఆఫ్ సిమ్యులేషన్ అని ఉంది. బాద్రిల్లర్ ప్రతిపాదించినది.  'అసలు గల్ఫ్ యుద్ధం జరిగిందా?!' అని అడుగుతాడాయన. ఏమో ఎవరికి తెలుసు?. మనకు తెలిసిందంతా అమెరికన్  మీడియా చూపించినదే. అవి నిర్మిత సత్యాలయిండవచ్చు కదా!. వార్తలని కూడా స్టైలైజ్డ్ వర్షన్ లాగా ఫిక్షన్ లాగా చూపెట్టడం ప్రస్థుతం జరుగుతోంది. కొన్ని వార్తా ఛానల్స్ ఇంకాస్త అరాచకంగా 'పొలిటికల్ గాసిప్స్' ని ప్రసారం చేస్తున్నాయి. గాసిప్స్ అంటే పుకార్లు. పుకార్లు వార్తలెలా అవుతాయి?. పుకార్లని కనుక్కని, వీలైతే తయారు చేసుకుని ప్రజలకు చూపించటం జర్నలిజం అవుతుందా?. ఇలా వాస్తవమూ, ఫిక్షన్ కలిసిపోయిన ఈనాటి సమాజంలో, సత్య సంధుడైన కవి జాగరూకతతో ఉండక తప్పదు.

కవికి కార్య రంగం సమాజమే, కార్య ప్రేరణ సమాజమే, కవితా వస్తువూ సమాజమే అయినపుడు, సునిశిత దృష్టి కూడా అవసరమే. అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో కూర్చుని ఇండియా గురించి రాసే  వారికీ, అడుగు బయట పెట్టకుండా ఇంట్లో కూర్చుని రాసే వారికీ ఈ ప్రస్తుత సమాజానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి వస్తుంది?. అంతా మీడియా మీదనే కదా ఆధార పడేది. ఆ కవిత నిజమైన కవిత అవుతుందా. లేక ఒక వర్గం ని ఎలివేట్ చేసే అడ్వర్టయిజ్మెంటవుతుందా? ఇదేమీ ఎమోషన్ రి కలెక్టెడ్ ఎట్ ట్రాంక్విలిటి కాదుగా, భావ కవిత్వం రాసుకోవటానికి. సమాజాన్ని నగ్నంగా వర్తమానంలో ఉన్నది ఉన్నట్టు గా రాయాలి. అదిగో అలా రాసి ఒక దిశా నిర్దేశం చేసిన వారే దిగంబర కవులు. వీరి సామాజిక దృక్కోణం అస్తిత్వ వాదుల 'డిస్పెయిర్'( despair) కాదు. డిస్పెయిర్ మాత్రమే అయితే కవిత్వం రాయటమెందుకు, సార్త్రే 'నాసియా' చదివి సూయిసైడ్ చేసుకోవచ్చు. లేదా అల్బర్ట్ కామూ సృష్టించిన మెర్ సాల్ట్ లాగా మరణాన్ని చూసి దుఃఖ పడకుండా స్తబ్దుగా ఉండిపోయుండొచ్చు. మెర్ సాల్ట్ ని, రేయ్మండ్ బండ బూతుల లెటరు రాసియ్యమని అడిగినపుడు రాయనని అనటానికి కారణాలు కనిపించని స్థితిలో వీరేమీ లేరు. లేదా మెర్ సాల్ట్ లాగా 'దుఃఖాన్ని చూసి ప్రపంచం నిర్లిప్తంగా ఉండిపోతుందని తెలుసుకోగలగటమే ఎన్లైటన్మెంటు'  అనుకుని, ఒక భావాతీత ప్రశాంత స్థితిలోకి వీరు జారిపోనూలేదు.  అందుకు విరుద్ధంగా ధ్వంస రచన కు పూనుకున్నారు.

దిగంబర కవుల్లో ఒకరైన చెరబండ రాజు రాసిన "వందేమాతరం" కవిత, ఒక సత్యాన్ని ఎలాంటి ప్రలోభాలకీ లోనవకుండా దేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనముందు ఉంచుతుంది . ఈ కవితలో ఇంకో ప్రత్యేకత ఏమంటే 1965 లో చెరబండ రాజు చూసిన దేశ పరిస్థితికీ ఇప్పటికీ ఏ మాత్రం తేడా లేకపోవటం. అప్పటి పరిస్థితులకన్నా, ఇప్పటి పరిస్థితులకే ఈ కవిత ఇంకా చక్కగా అమరినట్టు కనిపించటం. తేడా ఉన్నదల్లా, ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్లని సమర్థవంతంగా మోస్తున్న మీడియా, అది ప్రజల్ని వర్గాలుగా చీల్చి ఒక్కొక్క వర్గాన్నీ ఒక నిర్మిత సత్యాన్ని నమ్మించగలిగి, అదే నిజమనుకొనే భ్రమలోనే ప్రజల్ని ఉంచగలగటం. చెరబండ రాజు కవితలో అరాచకం కనిపించదు. నిబద్ధతతో కూడిన దేశభక్తి కనిపిస్తుంది. అయితే దేశభక్తి అనే దాన్ని ఒక 'ఎమోషనల్ భావన'గా మార్చి వేసినపుడు ఈ పదమే హాస్యాస్పదం అవుతుంది. నిజానికి దేశమనే 'భావం' మిథ్య. కానీ 'దేశం' సత్యం. దీని వలన దేశ భక్తి రెండు రకాలుగా కనిపిస్తుంటుంది. దేశమనే పవిత్ర భావనలాంటి ద్వారా వచ్చిన భక్తి. ఇది ప్రేయసి లేదా దేవుడు స్థానంలో దేశాన్ని ఉంచటం వల్ల కలిగిన అవస్థ. అలాకాక దేశమనేది జవజీవాలు కలిగిన సత్యం లాగా తెలుసుకొని దానిలోని జీవులూ, వారి జీవితమూ, వేదనలూ, ఆకలిలోంచి వచ్చిన మానవతతో కూడిన దేశ భక్తి. దేశాన్ని ముందుకి నడిపించటం ఈ రెండవ రకం వారికి కేవలం ఒక భావన కాదు. యదార్థ సత్యం. వారికది ఒక పరిణామ విషయం. ఈ కవితలో ఇటువంటి భక్తి కనిపిస్తుంది. భారత దేశాన్ని తిట్టడం కాకుండా ఆమెని తమ స్వార్థానికి వాడుకుంటున్న శక్తుల మీద సటైర్ కన్పిస్తుంది. దీన్ని సరిగా అర్థం చేసుకోక పోతే, ఈ కవిత దేశ ద్రోహన్ని రెచ్చగొట్టేదానిలా కనిపిస్తుంది. అందుకనేమో కవితలో భారత దేశాన్ని కులటగా చిత్రించినట్టు గా అపార్థం చేసుకుని, చెరబండ రాజు మీద దాడి కూడా జరిగిందప్పట్లో. నిజానికి, ఇలా దిగజారిపోతున్న భారత దేశం మీద ప్రేమ దయ జాలి వంటివే కనిపిస్తాయి ఈ కవితలో. కవితలో నిరాశ కానీ, అసహ్యం కానీ కనిపించదు. కానీ ఒక ఆవేదన కనిపిస్తుంది. 'అమ్మా భారతీ, నీ గమ్యం ఏమిటి తల్లీ..!' అని అడగటంలో వ్వవస్థ మీద అసహ్యం ఎక్కడ కనిపించింది?.  సొల్యూషన్ కోసం అన్వేషణ కన్పిస్తుంది.

"దుండగులతో పక్క మీద కులుకుతున్న శీలం నీది".
ఈ దుండగులెవరు అంటే చెప్పటం కష్టం. దుండగులను ప్రోత్సహిస్తుందనే స్పృహ ఈ వాక్యంలో ఉంది. ఒక దేశం ఎందుకు దుండగులను ప్రోత్సహించాలి? ఎందుకు భరించాలి? అని మనం ప్రశ్నించుకుంటే విషయం చాలా పెద్దదవుతుంది. ఇక్కడ దేశం అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వమనుకోవాలి. రాజకీయ కారణాలే దుర్మార్గాల్ని ప్రోత్సహిస్తాయనేది అందరికి తెలిసిన విషయమే.

"అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది".
ఇంటర్నేషనల్ మార్కెట్ ఇపుడింకా ఎక్కువ అయింది. కానీ ఏకొద్దిగనో ఉండిన ఆ కాలంలోనే కవి గుర్తించి గర్హిస్తున్నాడు. తన అందాన్నే తాకట్టు పెట్టిందట. భారత దేశపు అందం ఏమిటి?. దాన్ని అంతర్జాతీయ విపణిలో తాకట్టు పెట్టి మనమేమి బదులుగా తెచ్చుకున్నాం అనేది మనం ఆలోచించాలి.

"సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది".
సంపన్నుల చేతుల్లోనే రాజకీయాలు, ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇది కవి యొక్క సునిశిత పరిశీలనకి తార్కాణమైన వాక్యం. ఇది ఇప్పటికీ మారలేదు. మారుతుందన్న నమ్మకం కూడా లేదు. ఈ విషయంలో నిత్య యవ్వనమే.

"ఊసినా దుమ్మెత్తి పోసినా చలనం లేని మైకం నీది".
దీనికి విరుద్థంగా ఇపుడు అతి చలనం కనిపిస్తుంది. దుమ్మెత్తి పోసే వారిలోనూ అతి, అలాగే స్పందించే వారిలోనూ అతి. చెరబండ రాజు సమయంలో లేని మీడియా అతి, మనకిపుడుంది. సమాచార విప్లవం సమాచారం కంటే అతినే అతిగా తీసుకుని వచ్చిందని టీవీ ముందు అయిదు నిముషాలు కూచుంటే చాలు. అర్థం అయిపోతుంది.

తరువాతి కవితంతా "రోటీ కప్డా అవుర్ మకాన్" లను అందించలేని దానిలా దేశాన్ని వర్ణిస్తాడు కవి . ఈ కవికి ఎంతటి లోతైన ముందు చూపుందో అనిపిస్తుంది. ఈ కవిత చూసే  తరువాత వచ్చిన ప్రభుత్వాలు రోటీ కపడా మకాన్ స్లోగన్ ఇచ్చాయేమో అనిపించినా, 1964 లో ఆకలి యువతరం(hungry youth) ప్రతినిధి గా కవి ఎంతగా నలిగి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.ఈ స్లోగన్ ఆనాటి అందరి అవసరం అనిపిస్తుంది.

"కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న ఎలుకల్నీ పంది కొక్కుల్నీ భరిస్తూ నిల్చున్న భారతివమ్మా!..నోటికందని సస్య శ్యామల సీమవమ్మా!."
దేశంలో అభివృద్ధి జరుగుతున్నదనే కవి రాశాడు. దేశం సస్య శ్యామలంగా ఉందనే రాశాడు.  కానీ ఆ ఫలాల్ని తినే ఎలుకలూ పందికొక్కులు వాటిని అందరికీ అందనివ్వటం లేదు. ఎంత నిష్కర్షగా కవి చెప్పాడు. ఒక సంస్థ  వారికి ఈ కవితలో దేశ దూషణ ఎక్కడ కనిపించింది?. ఎందుకు కనిపించింది?. ఎందుకు కవి మీద దాడి చేశారు?. మనం ఇంతకుముందు అనుకున్నట్టు 'కన్ఫర్మేషన్ బయాస్' అయివుండవచ్చు.

దేశ పరిస్థితులను ఎలాంటి బయాస్ కీ గురికాకుండా చూడగలిగే చూపు, నిజాయితీ కలిగిన చూపు  దిగంబర కవుల్లో కనిపిస్తుంది. దాన్ని ఈ తరం కవులం అందిపుచ్చుకోవాలి. దానికి సరి అయిన తరుణం ఇదే.  సమాచార విప్లవం పేరుతో మన ఆలోచనల్ని పూర్తిగా కొల్లగొట్టి, తన ఆలోచనలని మాత్రమే మనలో చొప్పించే మీడియా, మనల్ని మనకు కాకుండా చేస్తున్న మీడియా, విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా విజృభిస్తున్న ఈ తరుణం లోనే చెరా ఈ కవితలో చూపిన స్పిరిట్ ని అందిపుచ్చుకోవాలి. ముందు కవి తనకుతాను స్వచ్ఛందంగా మేల్కొని, తరువాత సమాజాన్ని మేల్కొలిపే యజ్ఞంలో తలమునకలవాలి.

ఓ నా ప్రియమైన మాతృదేశమా
తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా
దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది
అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది
సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది
ఊసినా దుమ్మెత్తి పోసినా చలనం లేని మైకం నీది
కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న
ఎలుకలూ పందికొక్కుల్నీ భరిస్తూ నుంచున్న భారతివమ్మా
నోటికందని సస్యశ్యామల సీమవమ్మా
వందేమాతరం వందేమాతరం
ఒంటిమీది గుడ్డలతో జండాలు కుట్టించి
వివస్త్రవై ఊరేగుతున్న ధైర్యం నీది
అప్పుతెచ్చి లేపిన మిద్దెల్లో, కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది
ఎండిన స్తనాల మీదికి ఎగబడ్డ బిడ్డల్ని, ఓదార్చలేని లోకం నీది
ఆకలికి ఎండి మాడి ఎరువు సొమ్ములతో వీధిన పడ్డ సింగారం నీది
అమ్మా, భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ
వందేమాతరం వందేమాతరం

2/12/15

No comments:

Post a Comment