Wednesday, 30 December 2015

కవిత్వ సందర్భం- 6

ఏదీ...! ఎక్కడుంది ఆ ఇంధనం?.
...........................................
సునామీ అంటే అందరికీ తెలుస్తుంది. మెటియో సునామీ అంటే ఎవరికీ తెలియదు. కాదు, తెలియనీయలేదు. చేతకాని కొయ్యగుర్రం లాంటి ప్రభుత్వాలు, వ్యవస్థలు మనకు ఎన్నో విషయాల్ని తెలియనీయవు. దాచిపెడతాయి. సముద్రంలో భూకంపం వస్తే, సునామీ వస్తుందని మనకందరకూ తెలుసు. కానీ ఈ మధ్య వచ్చిన కమల్ హాసన్ 'దశావతారం' సినిమా, ప్రకృతికి మూర్తిమత్వాన్ని కలిగించి, బయో టెర్రరిజం నుంచి తనను తాను కాపాడుకోవటానికి ప్రకృతి ఉపయోగించిన అస్త్రమే సునామీ అనే ఊహతో ఒక సందేశాన్ని ఇచ్చింది. అందులో నిజం లేక పోవచ్చు. కానీ సునామీ లాంటి ఒక విపత్తు ఎన్నో ఆలోచనలను కూడా మోసుకొస్తుంది అనటానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. సాధారణంగా ఒక విపత్తు పుట్టుకొచ్చిన తర్వాత భాష, మాటలు అన్నీ నిశ్శబ్దాన్ని పులుముకుంటాయి. వాతావరణం మౌనంగా ఉండిపోతుంది.  కానీ కవి హృదయం, అక్కడి నుండి ఆ నిశబ్దం నుండి ముందుకు సాగుతుంది. అందుకే Maurice Blanchot అంటాడు, It is not you who will speak: let the disaster speak in you.  అని.

అలా ఒక విపత్తు వచ్చిన తరువాత, పోయెట్రీ ఆఫ్ డిసాస్టర్, పుట్టుకొస్తుంది. అలా వచ్చిందే నగ్నముని రాసిన కొయ్యగుర్రం. ఈ పన్నెండు కవితల చిన్న పుస్తకం మహాకావ్యమా కాదా అనే వివాదాన్ని కూడా సృష్టించింది. ఆ వివాదాలతో ఈ కవితలో చర్చించిన విపత్తుకి ఎలాంటి సంబంధం లేదు. ఈ అనవసర వివాదాల వల్ల కవి హృదయం అర్థం చేసుకునే వ్యవస్థ మరలా దారితప్పింది. అయినా కానీ విపత్తు సృష్టించిన నష్టానికి పోటీగా వివాదాలు ఉంటుంటాయి. సృష్టించబడతాయి. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్టు, ఏ విషయాన్నయినా తప్పుదారి పట్చించటం ప్రభుత్వాలకి వెన్నతో పెట్టిన విద్య.  వాటిని చర్చించటం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. నగ్నముని ఈ విపత్తుని చూసి రాసుకున్న కవితలు స్వానుభవాన్నీ, రాజకీయ వాతావరణాన్నే కాకుండా...సామాజిక కోణాన్ని కూడా ఎత్తి చూపుతాయి. ఒక ఖచ్చితమైన ప్రయోజనాన్ని ఆశించి, నగ్నముని కవిత్వం చేశాడు.

ఈ వ్యవస్థ లో
పుట్టడం మోసపోవడానికే
పెరగటం మోసపోవడానికే
ప్రేమించటం మోసపోవడానికే
నమ్మడం మోసపోవడానికే

జీవితం చివర్న పొంచున్నది మాత్రమే
మృత్యువు కాదు
అజ్ఞానంలోనూ మూర్ఖత్వంలోనూ
బతుకు భయంలోనూ ద్వంద్వ జీవితంలోనూ
నయవంచనలోనూ ప్రతీక్షణం వెంటాడేది
మృత్యువే.

ఈ వాక్యాలన్నీ అకస్మాత్తుగా మృత్యువు కౌగిలిలోకి జారిపోయిన అభాగ్యులను చూసిన తరువాత వచ్చినవే. ప్రకృతే మోసం చేయలేదు, సముద్రమే మోసం చేయలేదు. వ్యవస్థ మొత్తంగా మోసం చేసింది. 1977 లో దివిసీమ లో తుఫాను చెలరేగింది. మన ట్రోపికల్ ప్రదేశాల్లో వచ్చే తుఫానులకూ, టెంపరేట్ దేశాల్లో వచ్చే తుఫానులకూ తేడా వుంటుంది. నీరు వేడెక్కి ఆవిరవటం మూలాన ఏర్పడే అల్పపీడనం తన చుట్టూ వుండే అధిక పీడన గాలుల్ని ఆకర్షిస్తుంది. ఈ అల్ప పీడన ద్రోణి ఎపుడయితే తీరం దాటుతుందో, దానితో పాటుగా సముద్రం కూడా పొంగి జనావాసాలను ముంచెత్తుతుంది. దీన్నే 'మెటియో సునామీ' అంటారు. వాతావరణ విశేషాలను తెలిపే శాస్త్రాన్ని 'మెటియొరాలజీ' అంటారు కాబట్టి, మెటియో సునామీ అనే పదం అలా వచ్చింటుంది. అలాంటిదే దివి సీమను 1977 novamber 19 న తాకింది. రాత్రికి రాత్రే గ్రామాలు ఈ  meteo tsunami లేదా storm surge బారిన పడి మునిగి పోయాయి. ఎప్పటిలాగే అనధికారిక మరణాల సంఖ్య విపరీతంగా పెరిగి పోయింది. అనధికార మరణాలు 50000 ఐతే, అధికారికంగా ప్రకటితమైన మరణాలు 10000 నాలుగు లక్షల పశుపక్షాదులు చనిపోయాయి. లక్షల ఎకరాల పంట నష్టం వాటిల్లింది. ఈ హృదయ విదారకర విషయాన్ని ఒక చోట ఇలా చెబుతాడు.

వృక్షాలపై పక్షులపై సమస్త జంతుజాలం పై
చీకటి ముసుగు హఠాత్తుగా కప్పి
నీటితో పేనిన తాల్లతో గొంతులు బిగించి
కెరటాల్తో,కాటేసి వికటాట్టహాసంతో
బుసలు కొడుతూ  పరవళ్ళు తొక్కింది
మనిషి బతికుండగా దాహం తీర్చలేని
ఉప్పునీటి సముద్రం
మిగిలింది కెరటాలు కాదు
శవాల గుట్టలు

శవాల గుట్టల్ని తీసేయటానికి కాకులూ గద్దలూ రాబందులూ లేకపోయినా ఫరవాలేదు, ప్రజాసేవ చేయటానికి పోటీలు పడే నాయకులున్నారనీ, కాంట్రాక్టర్లున్నారనీ అంటాడు.
ఈ కావ్యంలో కవి బాధంతా కనిపిస్తుంది. ఈ విపత్తులో చనిపోయిన వారందరూ పేదవారే. కవి కోపమంతా ప్రభుత్వం మీద, మతాలమీద, వ్యవస్థ మీద. అప్పటి ప్రభుత్వాలు తమ చేతకాని తనాన్ని వెనుకేసుకొచ్చాయేమో...ఈ పాపాన్ని ప్రకృతిమీదకి నెట్టివేసి చేతులు దులుపుకోజూసాయేమో, కొయ్యగుర్రంలా హృదయం లేని స్తబ్ద ప్రభుత్వాలమీద వ్యంగ్య విమర్శనాస్త్రాలను ఎక్కుపెడతాడు కవి.

ఒక విపత్తు జరిగాక, మేలుకునే ప్రభుత్వాలు నిజంగా మేలుకుంటాయా అంటే - లేదనే చెప్పాలి. కంటి తుడుపు చర్యగా ఎక్స్గ్రేషియాలు ప్రకటించేసి కొంత హడావుడి ప్రకటనలు చేసి నిమ్మకుండిపోతాయి. ఎందుకంటే పోయిన ఆ ప్రాణాలన్నీ నిర్భాగ్యులవే. ఎందుకంటే అనాథ శవాలు, కంకాళా లూ ఎలాంటి సంజాయిషీ కోరవు. అదే, పదవిని ఒంటినిండా బట్టగా చుట్టుకున్న నాయకుడు చనిపోతే, దేశ జండా విషాదంగా తలదించుకుంటుంది. ఈ పరిస్థితి ఇప్పటికీ మారలేదు. తీర ప్రాంతాల్ని ముంచెత్తే తుఫానులనుండి పూర్తి రక్షణ కలిగించటానికి ఇప్పటిదాకా ఎలాంటి సమర్థమైన చర్యలు చేపట్టనేలేదు. మద అడవుల ని పెంచాల్సిన ప్రభుత్వాలు అడవుల నరికివేతను విచ్చలవిడిగా కొనసాగిస్తున్నాయి.  ఔట్ వార్డ్ సూయిజ్ లు కూడా ఇప్పటికీ అదే శిథిలావస్థలో ఉన్నాయట. ఇకపై ఎపుడు ఉప్పెన వచ్చినా మరలా ఇలాంటి విపత్తే సంభవించబోతోందని అందరికీ తెలుసు. కానీ ఏమీ చేయలేని కొయ్యగుర్రం వ్యవస్థ మనది. ఇంకో విషాదమేమంటే ఈ విపత్తుకి గుర్తుగా కట్టిన స్థూపం కూడా కబ్జా పాలయిందట. ఇలాంటి కొయ్యగుర్రం వ్యవస్థని తగలబెట్టగల ఇంధనం కనిపెడతానన్నాడు నగ్నముని. ఏదీ..ఎక్కడుంది ఆ ఇంధనం. ఆ ఇంధన అవసరం అప్పటికన్న ఇప్పుడే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. చివరి విందు లో తనను ఎవరు మోసం చేస్తారో జీసస్ కి తెలుసు, హన్తకులెవరో మనకు తెలుసు- నెపం కాసేపు ప్రకృతిమీదకు ఎవరు తోసేస్తారో కూడా మనకి తెలుసు. అందుకే విపత్తు వ్యవస్థలోనే ఉంది. ఏదీ! ఎక్కడుంది ఆ ఇంధనం?.

30/12/15

No comments:

Post a Comment