Monday, 22 February 2016

ll Death of The Author ll

విరించి ll Death of The Author ll
-----------------------------------------------------
"A text unity lies not in its origin but in its destination"
                                                                -Roland Barthes

ఎందుకనో
భలే తొందర పడిపోయావు!

పండు వెన్నెల కాగితం మీదికి విసురుగా
సిరా చుక్కల్ని విసిరేస్తావు చూడు
ఏం సరిపోలేదా..
నక్షత్ర మెరుపుల కోసమా
అఘమేఘాల మీద ఈ పయనం?

నీ మనసంతా నిండిన పాటను ఒడుపుగా
ఓ పిట్టలా ఎగరేస్తావు చూడు
ఏం సరిపోలేదా..
పంచ ప్రాణాలు పోద్దామనా
అకస్మాత్తుగా ఈ వాయు సంలీనం ?

మరణానంతర జీవితాన్ని
ఏం ఎందుకని నమ్మవునీవు..?
అభూత కల్పనలని కొట్టివేశావే..
మా గుండెల్లోకి వచ్చి చూసే
'దమ్ము' నీకెక్కడుంది?.

నీ ఆర్కెస్ట్రా ఆపేశావు సరే..
'మ్యూజిక్ డైస్' అనుకున్నావు సరే..
ఏ బాత్ రూం సింగర్ని నీవాపగలవు?
చెవుల పక్క నీ మ్యూజిక్ మోతని
నోటితో హమ్మింగ్ చేస్తే నీవేం చేయగలవు?

నీ మలి సంధ్య నీడ తూ ర్పుకు సాగీ సాగీ
ముని మాపు చీకట్లను తాకి తెల్లారి పోనీగాక
ఈ సాగర సంగమం మాత్రం
మా మనసుల్లోనే జరగాలి.
నీ కవిత్వపు కాపీ రైటు హక్కుల్ని
మా మనసుల్లోనే పూడ్చి పెట్టాలి
పదాల్లోకి ఒలికి౦చిన నీ సంగీతం
జనపదం గజ్జలై మ్రోగాలి

21/2/16
అరుణ్ సాగర్ గారి మీద ఒకింత కాదు
చాలానే ఒచ్చింది కోపం.

Tuesday, 16 February 2016

పిపిపి...పిచ్చి నా........
..----------------------
#ఒక్క సీటు ఒకే ఒక్క సీటు...నేనేంటో నిరూపించుకున్నా..

#ఒక్క ఎక్కం ఒక్కటి.

#నారా కు ఒకటి నారాయణకి ఒకటే.. కాకపోతే చెవి

#చెవి కోసుకోనవసరం లేదు. అన్నీ కోసి పడేశారు

#హైదరాబాదులో తంతే గుంటూరులో రీసౌండ్ రావాల

#నేను ఏదోలాగా గెలుద్దామనే హైదరాబాద్ వచ్చినా, లేకిన్ హైదరాబాద్ షహర్ నే పిశాప్ కరవాయా

#ప్రపంచ పటం నుంచి నన్ను తొలగించింది హైదరాబాద్ నగరమే.

#హైదరాబాద్ ని నేనే కట్టాను. అందుకే నంబర్ వన్ ని చేశారు.

#హైదరాబాద్ రావాలంటే వీసా ఉండనక్కర లేదు. సిగ్గూ శరం మానం మర్యాద ఉంటే చాలు.

#సైకిల్ కి గాలి కొట్టడమంటే గాలి కబుర్లు చెప్పడం కాదు.
Alcohol consumption- ఒక అవగాహన
--------------------------------------------------------------
మోడరేట్ ఆల్కాహాల్ కంన్సంప్షన్ ఆరోగ్యానికి మంచిదని మనకు తెలుసు. కానీ తాగే ప్రతీ ఒక్కరూ తాము తాగేదే మోడరేట్ క్వాంటిటీ అని అనుకుంటుంటారు. ఏది మోడరేషన్ అంటే ఎవరికీ తెలియదు. జాయింట్ నేషనల్ కమిటీ7, guidelines for life style modifications  ప్రకారం ఒక నార్మల్ వెయిట్ అడల్ట్ మేల్ (Normal weight adult male) కు, 24 ఔన్సుల బీర్,  10 ఔన్సుల వైన్, 3 ఔన్సుల విస్కీ ని మోడరేట్ క్వాంటిటీ అని నిర్ధారించింది. ఒక ఔన్సుకు 28.41 మిల్లీ లీటర్లు. ఈ లెక్కన సగటు మనిషి 680 మిల్లీ లీటర్ల బీర్ ని, లేదా 280 మిల్లీ లీటర్ల వైన్ నూ, లేదా 85 మిల్లీ లీటర్ల విస్కీ ని ఒక రోజుకు తీసుకోవచ్చు.

అయితే బక్కగా ఉన్నవారికీ, ఆడవారికీ ఈ లెక్క సరిపోదు. వారికి సరిగ్గా పైలెక్కకి సగం క్వాంటిటీనే మోడరేషన్ కిందకు వస్తుంది.

అయితే మోడరేట్ ఆల్కాహాల్ కంన్సంప్షన్ వలన ఆరోగ్యం బాగవటం మాట అటుంచితే, ఆల్కాహాల్ తో పాటు తీసుకునే స్టఫ్ తోటే అసలు చిక్కంతా. స్టఫ్ కోసమని అధిక ఉప్పు, కొవ్వు ఉండే పదార్థాలు తీసుకోవటం జరుగుతుంది కాబట్టి ఇవే ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. కాబట్టి నిజంగా ఆరోగ్యాన్ని కాపాడు కోవాలి అనుకునే వారు ఆలోచించుకోవాలి. వీలైనంత వరకూ ఆల్కాహాల్ ని తీసుకోకపోవటమే మంచిది. అసలు ఇండియన్స్ ఎందుకు ఆల్కాహాలును తీసుకోకూడదో తరువాత పోస్ట్ లో చర్చిద్దాం.

ll దండోరా ll

విరించి ll దండోరా ll
--------------------------------
ఏ ఎక్స్ ప్రెషనూ పలుకలేని పార్కిన్సన్ ముఖంలో
ఒక ఎక్ప్రెషన్ కోసం తనుకులాడేవాడు
భావ పక్షపాతమొచ్చిన మెదడులోంచి
మడతబడిన నాలికలా నత్తి మాటలు పలికేవాడు
పిచ్చికుక్క కరిచి పుచ్చిపోయిన శరీరంలో
పురాతన చింతగింజ మోసుకుతిరిగేవాడు
లోపలి మనిషనేవాడు ఎపుడో చచ్చి
పైకి కులదయ్యమై తిరుగుతున్నవాడు

వాడు...ఈనాటి మనిషివాడు
కుల దైవాల్ని చంపి కులదయ్యమైనవాడు
చేతులు తెగ ఊపేస్తూ
కనుబొమ్మలెగిరేస్తూ
ఒక నోటితో, వేల నాలికలతో
అడుగుతున్నాడు చూడు
దళితుడిగా పుట్టడం ఎవరికిష్టం వుంటుందని?

ఓ పిచ్చి దయ్యమా..!
దళితుడిగా పుట్టడమంటే దరిద్రుడిగా పుట్టడం కాదు
నినదించే దండోరాలా పుట్టడం
దళితుడిగా బతకడమంటే దరిద్రుడిగా బతకటం కాదు
సమాజపు నిప్పుకి దండోరాను వేడి పెట్టుకోవడం.
దళితుడిగా చావడమంటే దరిద్రుడిగా చావటం కాదు
గూటానికి దండోరా తగిలించి నిద్దురోవటం

గాయాల్ని నిప్పులుగా పోగేసిన చేతుల్లో ఇపుడు
దండోరా పాడ బోతోంది.
ఛల్ దయ్యమా ఛల్..
ఆ నిప్పుల మీదే నీ దయ్యపు శవం ఇపుడు కాలబోతుంది.

16/ 2/ 16

కవిత్వ సందర్భం 11

ముగియని సూర్య గ్రహణం లో మనం
--------------------------------------------------
"నైనం ఛిందంతి శస్త్రాణి..." సూక్ష్మ జగత్తులో అత్యంత సూక్ష్మమైనది, అవిభాజ్యమైనది ఆత్మ. అట్టి ఆత్మ విస్ఫోటనం చెందటం అంటే ఏమిటి? "ఆత్మ వుంది" అని అంటేనే, తాను వేరు ఈ చరాచర జగత్తు వేరు అనే స్పృహ కలుగుతున్నట్టు. తనను తాను ఈ జగత్తునుండి వేరు చేసుకుని చూసే ఒక స్థితి. పంచ భూతాత్మకమైన స్థూల జగత్తు, మనస్సు, బుద్ధి అహంకారమూ వంటి సూక్ష్మ జగత్తూ  అంతా కూడా విచ్ఛిత్తి చెందగలిగే గుణాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ ఆవల అతి సూక్ష్మమైన ఆత్మచైతన్యం అవిచ్ఛిన్నమైన స్థితిలో ఉన్నట్టు. కానీ ఒక కవి ఇందుకు విరుద్ధంగా ఆత్మని విస్ఫోటనం గావిస్తాను అంటే, ఏమవుతుంది?. తన ఆత్మ విస్ఫోటనమై ప్రతీ చరాచర వస్తువునందు ప్రతిఫలిస్తే...ఒక వాల్మీకీ నుంచి 'మానిషాద శ్లోకం' ఉద్భవిస్తుంది. ఒక కారల్ మార్క్స్ నుంచి 'దాస్ కాపిటల్' పుట్టుకొస్తుంది. తాను వేరు, ఈ జగత్తు వేరు అనే స్పృహయే ఆవరణం. ఆ ఆవరణాన్ని భగ్నం చేసి 'భగ్నావరణ చిద్విశిష్ట స్థితి' ని కవి పొందినపుడు, లోకపు శోకాన్ని తనదిగా కవి గుర్తిస్తాడు. తనను తాను విస్ఫోటనం చెందుతున్నట్టుగా భావిస్తాడు. అందుకే శేశేంద్ర అంటాడు "ఈ పవిత్ర ఆత్మ విస్ఫోటనాన్ని ఆపకండి" అని. ఉన్న స్థితినంతటినీ విస్ఫోటనం చేయించే ఒక ధైర్యమైన వాక్యం ఇది. ఆయనకు ఆ ధైర్యాన్నిచ్చింది ఋషి వాల్మీకీ , ఋషి కారల్ మార్క్స్. ఇది సమాజంలో ఒకరికోసమో ఇంకొకరికోసమో ప్రదర్శితమయ్యే ధైర్యం కాదు. సత్యం ముందర సత్యంగా నిలబడగలిగిన కవి ధైర్యం.

"నాదేశం నా ప్రజలు" కావ్యం అలా ఆత్మ విస్ఫోటనం చెందిన కవిలోంచి వచ్చిన కవిత్వం. ఎత్తుగడలూ, నిర్మాణ సౌష్ఠవాలూ, అలంకారాలూ ఒకింత పక్కనపెడితే, శ్రామికుడితో, పీడితునితో కవి తాదాత్మ్యం చెందే దశ ఈ కవిత్వంలో కనిపిస్తుంది. తరువాతి కాలంలో దీని ప్రభావం, అప్పటి సమకాలీన తెలుగు కావ్యాలతో పోలికలు, నాలికలూ కూడా పక్కకు పెడితే, ప్రతీ మానవునిలో జరగవలసిన ఆత్మ విస్ఫోటనాన్నీ, తద్వారా సామాజికాత్మ విస్ఫోటనాన్నీ, సామాజిక మార్పునూ కోరుకునే బలమైన కవిత్వం గోచరమౌతుంది. కవియే అసలు సిసలు విప్లవకారుడు. అతడు మొదట ఆత్మలో విప్లవాన్ని సాధిస్తాడు. అదే అతడి ఆత్మ విద్య. తానున్న సమాజాన్ని వర్గ సమాజంగా, తను నిలబడి ఉన్న చరిత్రను సమాజ వర్గ పోరాట సంఘర్షణగా మార్క్సు మహాశయుడు దర్శించాడు. తన దర్శనాన్ని నిరూపించాడు. అంతటి ఒక విప్లవాత్మక 'కాపిటల్ గీతం' ఆత్మ విద్యా సాధకుడైన కవిని తప్పక స్పృశిస్తుంది.

" ఓ గీతికా విను-
ఏ పుణ్యం చేసుకున్నానో ఉల్కలా వచ్చిన
ఒక్క క్షణం కాంతిలో
జీవన కఠోర సత్య దర్శనం చేసుకుంటున్నాను"

అంతటి గీతం ఒకటి తన చెవిన పడితే తన మనసు లోపలున్న పక్షులనూ పూవులనూ ప్రేమనూ కవి ఏం చేసుకుంటాడు?. భావ కవిత్వపు ప్రేమ మత్తులనీ, ఉన్మత్తులనీ ఒక వైపు, అస్పృశ్యులనీ పీడితులని బాధితులనీ మరో వైపూ చూసి ఏమని పాడతాడు?.

"హేయ్! పూవులూ పక్షులూ మీ గొంతులు కట్టి పెట్టండి
నా తుపాకీ నన్ను తీసుకోనీయండి
అసహ్యతను సహిస్తూ నిద్రిస్తున్న మనసుల్ని మేల్కొల్పనీండి
వాటిని భయంకర ఝంఝామారుతాలుగా మార్చనీండి
ద్వేషించే విద్య నేర్పనీండి
ద్వేషమెంత పవిత్ర వస్తువో బోధించనీండి
ద్వేషించటానికి కావలసిన స్పృహని నా రక్తంతో
దానం చేయనీయండి
గాలిలో ఉన్నా కాగితాలెక్కినా ఈ మాటలు వారిలో
అగ్ని పర్వతాలు నాటనీండి
నా అగ్ని పర్వతాలు పగలనీండి
ఈ పవిత్ర ఆత్మ విస్ఫోటని ఆపకండి"

కావ్యం మొదలు కావటమే శ్రమశక్తిని గుర్తించటంతో మొదలవుతుంది. కాలమే ఆ నిరంతర శ్రామికుడు. సూర్యుడే అతడి చేతులు. మానవ నాగరికతకు 'శ్రమ- చేతులూ' ఇవే మూల కారణం.  అక్కడే కవి తాను ఎవరో చెబుతాడు. రైతులో, శ్రామికుడిలో, కవిలో, రోడ్లు వేసే వాడిలో, నావల్ని నిర్మించేవాడిలో, భవనాలు కట్టే వాడిలో, సరిహద్దు సైనికుడిలో, శిల్పిలో ప్రతీ ఒక్కరిలోని శ్రమ శక్తియే తానుగా తాదాత్మ్యం చెందుతాడు కవి. కానీ మోసం చేసే చరిత్ర రిక్త హస్తాల్నే మిగిల్చింది. అందుకే తననూ గుర్తించాలనే కోరికే తన ఎర్ర జండాలా ఎగిరిందని మార్క్సిజాన్ని కవిత్వీకరిస్తాడు. కావ్యం మొత్తం ఎనిమిది సర్గలుగా సాగుతుంది. ప్రతీ వాక్యంలోనూ నిగూఢార్థం దాగి వుంటుంది. ఇది వేదంలో కనిపిస్తుందంటారు శ్రీ అరవిందులు. ఇతర పురాతన నాగరికతల సాహిత్యంలోనూ అద్భుతమైన మిస్టిసిజం కనిపిస్తుంది.

"నా నడకలు అడవుల్లో నిర్భయంగా తిరిగే సింహాలు
నేను పూలతో పోట్లాడతాను
పూల తోటలతో పోట్లాడతాను
మేఘాల సేనలతో పోట్లాడతాను
తుఫానులతో పోట్లాడతాను
పోట్లాట నేను బతకడానికి పీల్చే ఊపిరి"

ఇక్కడ నేను అని కవి అంటున్నదంతా శ్రమ శక్తికి ప్రతీకనే. కావ్యంలో కవి ఎపుడూ ఒకేలా ధ్వనించడు. ప్రతీకలో నిర్దిష్టార్థం లక్ష్యం కాదు కాబట్టి, ఎమర్సన్ అన్నట్టు 'For all symbols are fluxional' కాబట్టి ప్రతీకార్థం కాలాన్ని బట్టి మార్పుకి లోనవుతుంటుంది. అందుకే ఈ కావ్యంలో Symphony of various voices ఉంటుంది. సృష్టికర్త ప్రతీ ఒక్కరిలో ఒకడై, ఒక్కొక్కరూ వేరై పలుకుతున్నట్టు కవి వాక్కు ఉంటుంది. ఒక్కొక్కరూ వేరు వేరుగా ఉండటం తమ వాక్కును వినిపించటందుకు మాత్రమే. అయితే కావ్యంలో ఒక అర్థం కాని ప్రతీక ఉంటుంది. 'ఎర్రనక్క' అని. సాధారణంగా నక్క మోసానికి అత్యాశకీ ప్రతీక. కానీ ఈ ప్రతీక దగ్గర కవి ఆంతర్యం బోధ పడదు. కానీ కవిని బాగా డిస్టర్బ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. శేశేంద్రనే ఒక సారి ఒకాయన ఇలా అడిగాడు.

ప్ర. మీ కవిత్వంలో కనిపించే ఎర్ర నక్క ఎవరు?. నేను అది ఏ లెనిన్ కో లేక ఇంకో కమ్యూనిస్టుకో ప్రతీక అనుకున్నాను
జ. (మందస్మితంతో) అది ఊటీలో మా వాళ్ళ అతిథి గృహంలోని ఓ నక్క బొమ్మ.

కవిని ప్రశ్నించినా ఎలాంటి క్లూ ఇవ్వలేదు. కానీ కవితలో ఒక క్లూ వుంటుంది. మనమే ఆలోచించుకోవాలి.

"ఎవరు సృష్టించారు ఈ ఎర్ర నక్కని?
జుట్టూ జుల్ఫాలూ గడ్డమూ మీసాలూ
దట్టంగా ఆవరించిన పొదలాంటి ఒక మొహం లోంచి
మెరిసే రెండు నిప్పుకణికలా?"

కావ్యం మొత్తానికీ ఆరవ సర్గ ప్రాణం. ఈ ఒక్క సర్గ ఇలియట్ 'వేస్ట్ ల్యాండ్' తో పోల్చదగ్గది అంటారు. ఇక్కడే కవి ప్రవచనం కనిపిస్తుంది. మార్గనిర్దేశం చేసే ద్రష్టగా కవి కనిపిస్తాడు.

"నీకు తెలుసా ఆకలి వుందని, నీకు తెలుసా దప్పిక ఉందని
అవి రెండూ నీ విలువైన స్వేచ్ఛా మాంసం తిని
బ్రతికే క్రూర మృగాలని?
నీవు కాలేజీకి పోతుంటే బాబూ
నిన్ను పొలాలు బిక్క ముఖంతో చూస్తున్నాయి
ప్రతీరోజూ ఈ పుస్తకాల ఊరేగింపు ఎందుకు ఈ దేశపు వీధుల్లో
దేశం మొహం చూస్తే అవి చేసే ఉపకారం అవగాహన కాలేదా?
నీవు కాలేజీ గోడల్లోకి పోతావు
అక్కడ్నించి గవర్నమెంటు గోడల్లోకి పోతావు
అక్కడ్నించి ఎవ్వరూ ఎప్పుడూ తిరిగిరాని గోడల్లోకి పోతావు

లే బాబూ లే...నీ బాల్యం లోనించిలే
పుస్తకాలు అవతల పారేయ్, నాగలి భుజానికేసుకో
ఈ కులాలు విడిచి పెట్టు
ఆ పొలాల్లో కలువ్
గత కాలపు దారులకు కఠినంగా వీడ్కోలు చెప్పు"

గతానికి వీడ్కోలే కాకుండా, నా మెదడులో భావాల అరణ్యాలకు నిప్పంటుకుందంటూ వర్తమాన వ్యవస్థకు కూడా నిప్పంటించే సాహసం చేస్తాడు కవి.
గత మూడు నాలుగు శతాబ్దాలూ మానవుడిని, మానవుని చుట్టూ ఉండే ప్రకృతినీ వేరు వేరుగా చూసే ఒకానొక స్థితికి చేరుకున్నాయి. మతాలు సైతం భగవంతుడినుండి మానవున్ని ప్రత్యాఖ్యానించాయి. పురాతన వేదా౦త దృష్టిలో ఈ ప్రత్యాఖ్యానం ఒక అభాసగా గోచరిస్తుంది. వీటన్నింటినీ కాదంటూ శ్రమ- నాగరికత సంబంధాన్ని, నాగరికతా పరిణామాన్ని దర్శించిన మార్క్సుని ఆతడి దర్శనాన్ని ఆలంబన చేసుకుని ఒక కావ్యంగా నూతన మానవేతిహాసంగా శేశేంద్ర ఈ కావ్యాన్ని మలిచాడు.

"గుడిసెలూ భవనాలు మేలవించిన
మీ కలగూర గంప నాగరికతలో
మీరు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు
ఆత్మ దర్శనం అంటున్నారు
మీ ఉపన్యాసాలు మీరు చేస్తున్న బలాత్కార వ్యభిచారాలు".
ఈ వాక్యాలు వర్గ సంఘర్షణ ఉన్న ఎత్తుపల్లాల సమాజంలో మతాధికారులు చేసే అసత్య ప్రవచనాల్ని తూర్పారపట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

"ఉషస్సు వచ్చిందని కేక వేస్తే ఊరిలో
అందరూ బయటకి వచ్చారు
పిల్లలందరూ వీథుల్లోకి పరుగులెత్తారు
ఇండ్ల తలుపులూ కిటికీల తలుపులూ మేడల తలుపులూ మిద్దెల
తలుపులూ ఊరి తలుపులన్నీ తెరుచుకున్నాయ్ ఉత్కంఠతో
కానీ చూచింది సూర్యుడికి బదులు సూర్య గ్రహణం
మనుషుల్నే కాదు, దేశపు పొలాల్నీ అడవుల్నీ నదుల్నీ
మోసం చేశారు".
ఈ ప్రతీకలో అర్థం అసీమితం. స్వాతంత్ర్య ఫలానికో, మార్క్సిజం కో సూర్యుడు ప్రతీక అనుకుంటే మనం సూర్య గ్రహణాన్నే ఇపుడు చూస్తున్నాం. అమావాస్యలోనే, రాహు కేతువుల నీడల్లోనే ఉ౦టూన్నాం. మన సూర్యుడిని మనం తిరిగి తెచ్చుకోవాలి.

Monday, 8 February 2016

ll శిల్పం ll

విరించి  ll శిల్పం ll
.............................
చేతులూ కాళ్లూ విరిచేసి
అందమైన ముఖాన్ని
నిర్దాక్షిణ్యంగా కూల్చేశాక
ఇది ఒట్టి శిల అంటావేం..?
కాదు కాదు ఇది శిల కాదు
ఒకప్పటి సుందర శిల్పం

తన బరువు గుండెనెపుడూ
మోసుకోలేని ఓ బలహీన శిల్పం
చూసే కళ్ళ లోనే తన గుండెని వినిపిస్తుంది
మెదడు మూలుగలో
ఒక మూలకి ఒదిగిన జ్ఞాపకంలా
కొంత రక్తాన్ని శ్వాసిస్తుంది.

పోయం ని చీల్చి చెండాడాలనుకునే
కుటిల విమర్శకుడయినా
ఒకటికి పది సార్లు పోయం చదువుకుంటాడు
కవితా శిల్పం రాళ్ళల్లో పుట్టుకొచ్చేటపుడు
బట్టలు కట్టలేదని అమాంతంగా కూల్చేస్తావా?

నా తలలోంచి ఒక చెట్టు మొలవొచ్చిపుడు
నీ కళ్ల లోగిలి లో దాని విత్తును చూస్తున్నానిపుడు

శిలలోంచి శిల్పం వొలిచేశాక
కాగితాలెక్కితే  సరిపోదిపుడు
నాలికలెక్కాలింక నేనిపుడు

8/2/16

ll నిర్హేతుకం ll

హేతు దూరాలంటూ దూరమయిపోతున్న మానవ సంబంధాల కోసం ఈ కవిత

విరించి ll  నిర్హేతుకం  ll
.................................
అంతటి పొడి పొడి మాటల్ని
ఎలా అనగలిగావోనని
ఎపుడూ ఆశ్చర్య పోతుంటాను !

అసీమిత గగనాల నిశ్శబ్దాల్నీ
అగణిత లోకాల అస్థిత్వాల్నీ
ఒంపుకునే నాలోని అమాయక పూవులమీదికి
నీలోని తుపాకుల్ని ఎక్కు పెడతావు చూడు..
అపుడు లోలోతుల శూన్యం నుంచి
నులి పెట్టిన గొంతుక ఒకటి
గుండెకు గజ్జ కట్టుకుంటుంది
కణతల మధ్య పొంగిన నరం ఒకటి
నాలికను డప్పు చేసుకుంటుంది

ఇదిగో! ఈ పదాల దరువు విను
పేపరు మీద నీ చెవిని ఆనించి విను!
ఇక్కడెక్కడో సముద్రాలు అమాంతంగా
మునిగి పోయినట్టుంది కదూ..
ఇక్కడెక్కడో మిగిలిన బూడిదలోంచి
సగం కాలిన హృదయపు వాసన కదూ..

తుపాకీతో గురి పెట్టేవాడెవడయినా
ఒక కన్ను మూసే ఉంచుతాడు

కొలబద్దలతో కొలిచే వాడెవడయినా
హెచ్చు తగ్గుల్నే గుర్తిస్తాడు.

నీ తుపాకులూ, నీ కొలబద్దలూ
నీ నోటి దుర్వాసనలా
యుద్ధం చేసేటపుడు
రెండు పొడి పొడి మాటలు
తూ టాల్లాగే పొడుచుకొస్తుంటాయి

మనుషులంటే పేపరు మీద రాయబడిన
దీర్ఘ వాక్యాలే కాదు నేస్తం..
ఊచల వెనుక దాక్కున్న సత్యాల్లాగా
రాసి కొట్టేసిన చిన్న పదాలు కూడా

3/2/16