Tuesday, 16 February 2016

ll దండోరా ll

విరించి ll దండోరా ll
--------------------------------
ఏ ఎక్స్ ప్రెషనూ పలుకలేని పార్కిన్సన్ ముఖంలో
ఒక ఎక్ప్రెషన్ కోసం తనుకులాడేవాడు
భావ పక్షపాతమొచ్చిన మెదడులోంచి
మడతబడిన నాలికలా నత్తి మాటలు పలికేవాడు
పిచ్చికుక్క కరిచి పుచ్చిపోయిన శరీరంలో
పురాతన చింతగింజ మోసుకుతిరిగేవాడు
లోపలి మనిషనేవాడు ఎపుడో చచ్చి
పైకి కులదయ్యమై తిరుగుతున్నవాడు

వాడు...ఈనాటి మనిషివాడు
కుల దైవాల్ని చంపి కులదయ్యమైనవాడు
చేతులు తెగ ఊపేస్తూ
కనుబొమ్మలెగిరేస్తూ
ఒక నోటితో, వేల నాలికలతో
అడుగుతున్నాడు చూడు
దళితుడిగా పుట్టడం ఎవరికిష్టం వుంటుందని?

ఓ పిచ్చి దయ్యమా..!
దళితుడిగా పుట్టడమంటే దరిద్రుడిగా పుట్టడం కాదు
నినదించే దండోరాలా పుట్టడం
దళితుడిగా బతకడమంటే దరిద్రుడిగా బతకటం కాదు
సమాజపు నిప్పుకి దండోరాను వేడి పెట్టుకోవడం.
దళితుడిగా చావడమంటే దరిద్రుడిగా చావటం కాదు
గూటానికి దండోరా తగిలించి నిద్దురోవటం

గాయాల్ని నిప్పులుగా పోగేసిన చేతుల్లో ఇపుడు
దండోరా పాడ బోతోంది.
ఛల్ దయ్యమా ఛల్..
ఆ నిప్పుల మీదే నీ దయ్యపు శవం ఇపుడు కాలబోతుంది.

16/ 2/ 16

No comments:

Post a Comment