Tuesday, 5 April 2016

విరించి ll మూడు ముక్కల మాట ll


విరించి ll మూడు ముక్కల మాట ll
........................................
ప్రపంచం మొత్తానికిగాను
అక్కడొక్కచోటే గుంతపడినట్లు
జీవితకాలపు ఊపిరులన్నీ
అక్కడొక్కచోటే పోగుబడినట్లు ఉంది నాకు

ఆమె రెండు పెదవుల పుష్పానికి
నా రెండాకుల కళ్ళు వేలాడుతున్న సమయంలో
నిలకడలేనట్టు పరిగెత్తే కాలం
మొనదేలిన ముల్లులా గుచ్చుకుంటోంది

ఆమె పెదవుల మీద మెరిసిన సాయంత్రపు నీరెండ
మధువును గ్రోలేందుకు వాలిన తేనెటీగ రెక్కలా కనిపించింది
కడుపంతా మకరందాన్ని నింపుకుని
ఎర్రెర్రగా గూటికి ఎగురుతున్నాడు సూర్యుడు

ప్రపంచాన్ని తానే తిప్పుతున్నట్లు తిరిగే
రిస్ట్ వాచీ ముళ్ళ వైపు
అసహనంగా చూస్తోందామె "ఇంకెంత సేపన్నట్లు"

ఆ మూడు ముక్కల మాట
నా పెదవుల కారాగారంలోంచి చీల్చుకు రాలేక
న్యాయం కోసం గుండె కోర్టులో
గొంతు చించుక వాదిస్తోంది

తనను తాను శిల్పంగా చెక్కుకునే శిలలా
నా మాటలుంటాయేమో..
పెచ్చులుగా ఊడిపడే అనవసర మాటల్ని విని
నాకెందుకు చెబుతున్నావివన్నీ అని అరిచిందామె
కింది పెదవిని వింటినారిని చేస్తూ
పై పెదవి మీదుగా ఆగ్నేయాస్త్రాల్ని సంధించి వెళ్లి పోయింది

మా ఇద్దరినీ చూస్తుంటే
ఈ నడిరోడ్డు మీది బస్ స్టాండు కూడా బృందావనంలా
కనిపించిందన్నాడు నా కమ్యూనిస్టు మిత్రుడు
దూరంగా నక్కి చూసేవాడి హ్రస్వ దృష్టి కాబోలనుకున్నా

"విసుగుదలలో ఇంత అందముంటుందా" అనడిగాను నేను అమాయకంగా

నా కళ్ళ ను తేరిపారా చూస్తూ అనునయంగా వాడన్నాడు
"మెదడునీ హృదయాన్నీ కలిపే ఆమె మెడనరాల్లో
ప్రవహించే వేడి రక్తం ఒక్కసారైనా ఆలోచించి ఉంటుంది
ఒక మెట్టు ఎక్కడమా
ఒక మెట్టు దిగడమా" అని

పురాతన కాలపు ఆనకట్టలా
తెగడానికి సిద్ధంగా వుంది ఆకాశం అపుడు.

4/4/16

No comments:

Post a Comment