Thursday, 28 April 2016

(కవిత్వ సందర్భం 16)hrk

వంతెనకు మరమ్మతులు ఐనట్టేనా?
--------------------------------------------

ప్రతీ దానికో ఎక్పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ దాటాక దాని విలువ దాదాపు సున్నా. కానీ మనుషులు సాధారణంగా ఒక విషయానికి ఎక్పైరీ డేట్ ఉంటుందని నమ్మరు. శాశ్వతత్వాన్ని ప్రతీ దానికీ ఆపాదించుకుని సంతోష పడుతుంటారు. కానీ ఏదో ఒక రోజు ఎక్పైరీ డేట్ వచ్చేసిందని తెలుసుకున్నపుడు భయంకరమైన స్తబ్దతకు గురౌతారు. లో బోల్షివిక్ విప్లవంతో ప్రపంచ వ్యాప్తంగా మొదలైన కమ్యూనిష్టు ఉద్యమం 1980 వ దశకం వచ్చేసరికి పతనావస్థకి చేరుకుంది. ఈ ఉద్యమం మీద ఆశలు పెట్టుకున్న వారందరూ ఒక్కసారిగా హతాశులయ్యారు. రియాక్టివ్ థింకింగ్ నుండి ప్రోయాక్టివ్ థింకింగ్ వైపు తననూ, తన పార్టీ శ్రేణులనూ మరలించటానికని కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని భవిష్యత్తుకో భరోసాను కల్పించే ప్రయత్నం చేస్తారు కవి హెచ్చార్కే.

ఇపుడున్న అసంబద్ధత కన్నా తక్కువ అసంబద్ధత కలిగిన సమాజాన్ని నిర్మించగలమా అనే ప్రశ్న మానవుడి ఆలోచనలో నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. గత చరిత్ర నుండి ప్రస్తుతాన్ని వేరుపరిచి చూసుకున్నంత మాత్రాననే మానవుడు అభివృద్ధి చెందలేదు. గతాన్నంతా కాదని ప్రస్తుతాన్ని నిర్మించే వ్యవస్థల్ని కనుగొని భవిష్యత్తును ఊహించి అందుకు తగిన విధంగా నేటిని మలచుకోవటం అనేది మానవాభివృద్ధిలో ప్రధాన అంశం. ఎప్పటికప్పుడు మనిషి తప్పొప్పులను బేరీజు చేసుకోక పోతే ఒక చోట మాత్రమే ఆగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. నిన్నటి చరిత్ర నేటిని, నేటి చరిత్ర రేపటినీ ప్రభావితం చేస్తుంటుంది కాబట్టి, గడిచిపోయిన నిన్నని మార్చనేలేము కాబట్టి, నేటి చరిత్రలోని లోపాల్ని గుర్తించి, బాగుచేసుకొనకపోతే రేపనే భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది. నేటి చరిత్ర ఒక మనిషిది కాదు, ఒక సమాజానిదీ కాదు. యావత్ ప్రపంచానిది. వర్తమాన పరిస్థితులు కొన్ని రకాల భావాల్ని సిద్ధాంతాల్ని సృష్టింకుకుంటాయి. చరిత్రకు అవే ఆధారం. ఆ సిద్ధాంతాలెప్పటికీ ఒకదానికొకటి విబేధించుకుంటూ చరిత్రను నడిపిస్తాయి. పారిశ్రామిక విప్లవం తరువాత ప్రపంచం ముందుకు ప్రధానంగా రెండు సిద్ధాంతాలు బాహా బాహీగా తలపడ్డాయి . ఒకటి పెట్టుబడీదారి సిద్ధాంతం అయితే రెండోది కమ్యూనిజం. ఇరవైయవ శతాబ్దపు చరిత్రంతా ఈ రెండు సిద్ధాంతాల మధ్య పోరాట చరిత్రే. ఐతే ఒక సమాజానికి ఏ సిద్ధాంతం సరిగ్గా సరిపోతుంది అని అడిగితే చెప్పటం కష్టం. సిద్ధాంత కర్తలు వారి అనుచర గణం తమ సిద్ధాంతమే గొప్పదని నమ్మకం కలిగివుండటంలో ఆశ్చర్యం ఏమీ ఉండథుగానీ, ఆ నమ్మకం ఇతరుల మీద బలవంతంగా రుద్ది రారాజులం కావాలనుకోవటం అందుకు ఎంతటి ఊచకోతకయినా తెగించటం ఆశ్చర్యమే కాక మానవ ప్రవృత్తి మీద అపనమ్మకాని కలుగజేస్తుంది. 'మానవత్వం' అనే భావన కేవలం ఒక భావననే అనిపించేలా ఉంటుంది. వాస్తవానికి అతీతంగా సిద్ధాంత చట్రం జీవితపు ప్రతి అంశం మీద పోత పోయాలని చూస్తుంది. అయితే ఏదైనా ఒక సిద్ధాంతం యొక్క ఏలుబడి ప్రాయాక్టీవ్ థింకర్స్ చేతిలో కాక అతివాద ఛాందసవాద శక్తుల చేతుల్లో ఉండటం ప్రతీ గొప్ప సిద్ధాంతం విషయంలో మనకు చరిత్రలో కనిపిస్తుంది. అందువల్ల ఒక సిద్ధాంతం పతనానికి దాని ప్రత్యర్థి సిద్ధాంతపు గొప్పతనమే కారణం అనుకోవటానికి లేదు. ఈ సిద్ధాంతపు ఆలోచనల్లోనో, ఆచరణల్లోనో అంతర్లీనంగా వ్యాపించిన ఛాందసత్వం తద్వారా కనిపించకుండా దాగుండి పోయే లోపాలు కూడా కారణం అయ్యుండొచ్చు . అలా తను నమ్మిన సిద్ధాంతపు పతనాన్ని చూసి ఒక ప్రాయాక్టీవ్ థింకర్ లా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఇంకా మునుముందుకు పోయే ప్రయత్నం చేస్తాడు కవి హెచ్చార్కే.

కమ్యూనిజం సోషలిజం ఈ రెండు పదాలూ ఒకదినికి మరొకటి ఉపయోగించబడుతుంటాయి. సోషలిష్టు సమాజం సాధించాకే కమ్యూనిష్టు సమాజమన్నది సాధించబడుతుందని నిఖార్సయిన కమ్యూనిష్టులు చెబుతుంటారు. సోషలిస్టు సమాజంలో ప్రభుత్వం ఉంటుంది. దాని జోక్యంతోటే సమాజంలో అంతరాలు తొలగించబడతాయి. ఒకసారి ఇది సాధించిన తరువాత ప్రభుత్వం అవసరం లేని స్వయంచాలిత సమాజం ఏర్పడటమే కమ్యూనిజం. అయితే ఈ భావనను కొనసాగించటానికి ఒక రాజకీయ శక్తిగా ఏర్పడినదే కమ్యూనిష్టు పార్టీ. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇంపీరియల్ రష్యాలో జరిగిన బోల్షివిక్ విష్లవంతో మొదలైన కమ్యూనిష్టు పార్టీ సమాజానికి ఒక కొత్త సిద్ధాంతాన్ని అందించింది. రష్యన్ సమాజంలో అప్పటిదాకా శ్రామికులయిన వారు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఎప్పటికీ జరగదేమో అనుకున్న ఒక అద్భుతమే జరిగిందక్కడ. ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ విప్లవం ఇచ్చిన స్పూర్తి  ఒక దేశానికో ప్రాంతానికో పరిమితం కాకుండా ఒక అంతర్జాతీయ ఉద్యమంలా పరిణమించింది. ప్రపంచ వ్యాప్త మేధావులను ఆకర్షించింది. సొంత దేశాల్లో చిన్న పార్టీగా ఉన్నప్పటికీ తాము ఒక అంతర్జాతీయ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నామనే తృప్తి, కొత్త సమాజాన్ని చూడబోతున్నామనే ఆకాంక్ష ఎందరినో ఈ ఉద్యమం వైపు ఆకర్షితులను చేసింది. ఎన్నో దేశాలల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడ్డాయి. ఇలా గత శతాబ్దపు రెండవ దశకంలో మొదలై, మధ్య దశకాలకు చేరేసరికి కమ్యూనిజం రష్యా కేంద్రంగా తూ ర్పు యూరోప్ దేశాల్లోనే కాక లాటిన్ అమెరికా ఆసియా దేశాల్లోకి కూడా విస్తరించి౦ది. ఈ దేశాలను అన్నింటినీ రెండో ప్రపంచం గా గుర్తించారు.  అమెరికా కేంద్రంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కొనసాగే యురోపియన్ దేశాలు మొదటి ప్రపంచ దేశాలుగా వెలిశాయి. ఒక దశలో, మొదటి ప్రపంచ దేశాల పనంతా అభివృద్ధి చెందుతున్న మూడవ ప్రపంచ దేశాలను , రెండవ ప్రపంచం బారిన పడకుండా చూసుకోవటమే. అంటే రష్యా ఆధిపత్యం ఈ దేశాల మీద పడకుండా అమెరికా జాగ్రత్త పడుతూ  వచ్చింది. యూరోపు తూ ర్పు పడమర అని రెండుగా చీలిపోయింది. తూ ర్పు యూరోపు లో రష్యా ఆధిపత్య౦, పశ్చిమ యూరోపులో అమెరికా ఆధిపత్యం. ఈ రెండు సైద్ధాంతిక విరుద్ధ దేశాల నడుమ కోల్డ్ వార్ నడిచింది. ఆ సమయంలోనే ఫ్రాన్సు ఇటలీ ఇండియా వంటి దేశాల్లోకూడా కమ్యూనిష్టు పార్టీ బలాన్ని పుంజుకుంది. ప్రతీ చోటా సమ సమాజ స్థాపన మీద ఒక నమ్మకాన్ని కలిగించింది. 1970 సంవత్సరం చివరికల్లా 16 దేశాల్లో కమ్యూనిష్టు ప్రభుత్వాలు ఏర్పడగా, దాదాపు 36 దేశాలు కనీసం ఒక్కసారయినా కమ్యూనిష్టు ప్రభుత్వ పాలనను చవిచూశాయి. ఇలా డెబ్భై సంవత్సరాల వైభవ చరిత్ర ఒక్కసారిగా 80వ దశకంలో కూలటం మొదలయ్యింది. ఆ సందర్భంలో సమ సమాజ స్థాపన జరుగుతుందని ఆశ పడే కవిగా హెచ్చార్కే ఒక్కసారిగా ఉలిక్కిపడి గాభరాపడిపోయి, తిరిగి ధైర్యం తెచ్చుకుని, సమ సమాజ స్థాపన వైపు పయనం కొనసాగిద్దామని పిలుపునిచ్చే కవితనే ఇది.

హ౦తకులెవరో తెలుసుకదా
శవ పరీక్షలెందుకు
అనుకున్న తీరం అందకపోయినా
కొత్త దుఃఖన్నాయితే కనుక్కున్నాం కదా
ఇంకా ఇక్కడేందుకు, పదండి

ఈ వ్యవస్థలు కుప్పకూలిపోవటానికి కారణాలు ఏవయినా, కమ్యూనిష్టు ఎకానమీ మార్కెట్ ఎకానమీలతో పోటీపడలేక చతికిలపడటమూ, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేని సమాజాల్ని ప్రజలు ఈసడించుకోవటమూ, రాజకీయాల్లో ప్రజాస్వామిక జవాబుదారీతనం లేకపోవటమూ వంటి ప్రధాన కారణాలు అప్పటి రష్యా అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ ను గ్లాస్నోస్త్, పెరస్త్రోయికా వంటి పాలసీ సంస్కరణలను పురిగొల్పేలా చేసింది. ఇవి ప్రధానంగా ఆర్ధిక సరళీకరణలు. కానీ వీటిలో పొలిటికల్ ఫ్రీడ౦ కూడా అంతర్భాగమే. వీటిని గోర్బచెవ్ సోషలిస్ట్ సమాజాన్ని అంతం చేయటానికి కాకుండా వాటి ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉండాలనే ఉద్దేశం తో చేసాడు అంటారు. కానీ ఈ విషయాన్ని కవి ఒప్పుకోడు. గోర్బచెవ్ వాటికన్ సిటీకి వెళ్లి క్రైస్తవ మతాన్ని కౌగిలించుకోవటాన్ని సున్నితంగా సూచించటం ద్వారా సిద్ధాంతాన్ని భ్రస్టు పట్టించేవాడు లోపలే ఉన్నాడనే విషయాన్ని చెబుతాడు. చైనా మీద సడలిన నమ్మకాన్ని కూడా వ్యక్త పరుస్తాడు.  చైనా కూడా ఇదే దశకంలో ఆర్ధిక సంస్కరణలను తెచ్చినా, రష్యాలాగా పొలిటికల్ ఫ్రీడంను అది కల్పించలేదు. రాజకీయ అసంతృప్త వాదులను నిర్ధాక్షిణ్యంగా అణచివేసింది. జూన్ 1989 లో తీనెన్మెన్ స్క్వేర్ దగ్గర శాంతి యుత ప్రజాస్వామిక ప్రదర్శనను జరుపుతున్న స్టూడెంట్స్ మీదకి సైన్యాన్ని, యుద్ధ ట్యాంకర్లతో సహా ఉసి గొలిపింది డెంగ్ జియాపింగ్ ప్రభుత్వం. ఫలితంగా వేల మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన జరగటానికి గోర్బచేవ్ గ్లాస్నోస్త్ కి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, ఇది ప్రజాస్వామ్యం వైపు ప్రజలు మొగ్గు చూపే స్థితి అనుకోవచ్చు. అయినా చైనా ప్రభుత్వం సైనిక బలంతో ఉద్యమాన్ని అణచి వేసింది. కమ్యూనిష్టు చైనా ప్రభుత్వం ఈ విషయంలో ఆధిపత్యాన్ని సాధించినా నైతికంగా పతనమైందన్న విషయాన్ని కవి తెలియజేస్తాడు. ఫెంగ్ లీ జీ అనే ఆస్ట్రో ఫిజిసిస్ట్ ఈ ప్రజాస్వామిక ఉద్యమంలో ప్రధాన భూమిక నిర్వహించాడు. అదే సమయంలో గోర్బచేవ్, రష్యా ఆధీనంలోని తూ ర్పు ఐరోపా దేశాల సరిహద్దు భద్రతా దళాల్ని విరమింపజేశాడు. హంగరీ (బుడాపెస్ట్),  బెర్లిన్ లలో కమ్యూనిష్టు ప్రభుత్వాలు కూలడంతో కమ్యూనిష్టు, కాపిటలిష్ట్ దేశాల మధ్యగల  ఐరన్ కర్టెన్ కూలినట్టయింది. వెస్ట్ బెర్లిన్ కీ ఈస్ట్ జర్మనీకి మధ్యగల ఐరన్ కర్టెన్, బెర్లిన్ వాల్ (Berlin Wall) కూడా కూలింది. రొమేనియాలో సీసెస్కూ పాలన అంతం అవటంతో, కమ్యూనిష్టు పాలనకూడా అంతమయింది. ఆ తరువాత సీసెస్కూ దంపతులకు మరణ శిక్ష అమలు జరగటం కూడా జరిగిపోయింది. ఇలా ఆ దశకంలో ఒకదాని తరువాత మరొకటిగా కమ్యూనిష్టు ప్రభుత్వాలు కూలటం, ఆ సిద్ధాంతం మీద నమ్మకం ఉన్న కవికి కాస్త ఇబ్బంది కలిగించే అంశమే.

తీనెన్మన్ స్క్వేర్ లో
యవ్వనం గ్లాస్నోస్తయిపోయింది
మాసియాంగు దేశంలోనూ
సొంత చెట్టు ఫాంగ్ లిజీ నే పూచింది
క్రెమ్లిన్ గంట వాటికన్ లో మోగింది
బెర్లిన్ లో కూలిపోవలసిందే కూలిపోయింది
మిగిలిపోయిన చెకుముకి రాళ్ళు మూట కట్టండి
మనమెందుకిక్కడ, పదండి

బుడాపెస్టులో జెండాలు చింపి
ఎవడో మనల్ని వెక్కిరించాడని
శ్రీమతి సీసేస్కూ చెప్పులు
ఎవడో మనపై విసిరేశాడని
ఎందుకలా దిగులు పడటం
వాడి పండక్కి మౌన ప్రేక్షకులమై
ఎందుకిలా ను౦చోవటం, పదండి

అందుకే కవిత రెండో భాగంలో కమ్యూనిష్టు ఉద్యమం సాధించిన ఘనతల్ని ఏకరువు పెట్టి తనకూ తన తోటి కమ్యూనిష్టులకూ కాస్త ధైర్య వచనాలు చెప్పే భారాన్ని నెత్తిన వేసుకుంటాడు కవి. మనం గెలిచేదాకా ఆగడానికి వీల్లేని పోరాటాలం, పదండి అని పిలుపునిస్తాడు.  కవిత చివరిలో జరిపే ఆత్మావలోకనం ఈ కవితకు కవి లోతైన దూరాలోచనకు అద్దం పడుతుంది. "వేసుకున్న చిక్కుముడులు ఇప్పుడే విడవు" అనటం ద్వారా ప్రత్యర్థి భావజాలం మీద కోపం కన్నా సొంత సిద్ధాంతం లో దాని ఆచరణలో జరిగిన లోపాల్ని సరి చూసుకునే ప్రయత్నం కవి చేస్తాడు . కొత్త ఆలోచనలు కొత్త పద్దతులు కొత్త గొంతుకలు వొచ్చి చేరవలసిన అంశాన్ని ఎక్సపైరీ డేట్ ముగిసిన వంతెనగా వర్ణించటం లో కవి ప్రాయాక్టీవ్ థింకింగ్ బయట పడుతుంది. జరిగిన నష్టాన్ని ఒక వంతెనగా చూడటం అంటేనే..ఇంకా అక్కడినుండి ముందుకు కదల౦డని చెప్పటమే కదా. అందునా పాత కాలపు ఎక్సపీరీ డేట్ ముగిసిన వంతెన. ఇక ఎవ్వరికైనా ఎం పని? ముందుకు సాగటమే మిగిలింది.

 సెకండ్ ఫ్రంట్
..................
చీకటి ముట్టడిస్తోంది
కంపాస్ పగిలిపోయింది
గడుసు దయ్యాల దిగంబరనృత్యానికి
మరోసారి అసురసంధ్య సిద్ధమవుతోంది
పిల్లాపాపా ఉన్నవాళ్ళం
బేఫికరుగా విశ్రమించలేం, పదండి

ఇది నిప్పులు నిర్మించే చోటు కాదు
ఇక్కడ అగ్గిపెట్టెలు మంచుగడ్డలౌతాయి
ఇది జీవితం చిగురించే తోట కాదు
పావురాళ్ళకు విషం కోరలు మొలుస్తుంటాయి

హంతకులెవరో తెలుసు కదా
శవ పరీక్షలెందుకు
అనుకున్న తీరం అందకపోయినా
కొత్త దుఃఖాన్నయితే కనుక్కున్నాం కదా
ఇంకా ఇక్కడెందుకు, పదండి

తీనెన్మన్ స్క్వేర్ లో
యవ్వనం గ్లాస్నోస్తయిపోయింది
మాసియాంగు దేశంలోనూ
సొంత చెట్టు ఫాంగ్ లిజీ నే పూచింది
క్రెమ్లిన్ గంట వాటికన్ లో మోగింది
బెర్లిన్ లో కూలిపోవలసిందే కూలిపోయింది
మిగిలిపోయిన చెకుముకి రాళ్ళు మూట కట్టండి
మనమెందుకిక్కడ, పదండి

బుడాపెస్టులో జెండాలు చింపి
ఎవడో మనల్ని వెక్కిరించాడని
శ్రీమతి సీసేస్కూ చెప్పులు
ఎవడో మనపై విసిరేశాడని
ఎందుకలా దిగులు పడటం
వాడి పండక్కి మౌన ప్రేక్షకులమై
ఎందుకిలా ను౦చోవటం, పదండి

మనం గోడలు పడగొట్టేవాళ్ళమే గానీ
జనాన్ని విడగొట్టే వాళ్ళ౦ కాదు
మనం చెప్పులు కుట్టే వాళ్ళ౦ కావచ్చు
జనం నెత్తిన మొట్టే వాళ్ళ౦ కాదు
బెల్ విలీ కొండల్లో ప్రాణాలొడ్డిన వాళ్ళం
పోటిమ్కిన్ నావను నడిపించిన వాళ్ళం
ప్రపంచాన్ని ఊపేసిన పదిరోజులం
వరదలెత్తిన టాటూ నదికి
వంతెనగా మారిన వాళ్ళం
మనం.......గెలిచేదాక
ఆగడానికి వీల్లేని పోరాటాలం, పదండి

వేసుకున్న చిక్కుముడులు
ఇప్పుడిప్పుడే విడవు
దారాలు తెంపి పోగులు పెట్టకండి
నడవడం ఎలాగో నడుస్తూనే నేర్చుకుందాం
మంచి మజిలీ చేరాకే అలసట తీర్చుకుందాం
మనసు చెదరనివ్వకండి
చెమట ఆరనివ్వకండి, పదండి

ఎవరికీ అర్థంకాని ఎవరూ ఆక్షేపించని
సంకేతాల ఇనుపకమ్మలు లెక్కబెడుతూ కూర్చోకండి
ఆ మలుపు తిరిగాక సంగతేమిటని
వాదిస్తూ నిలవకండి, అసలిక్కడ ఆగకండి

ఇది వంతెన
ఎక్స్పైరీ డేట్ ముగిసిన వంతెన
వంతెన మీద సైనికులెవరూ
కుడి ఎడమల కవాతులు తొక్కరు
పడుతూ లేస్తూనే పదండి ముందుకు

కమ్యూనిష్టు సిద్ధాంతమూ, కమ్యూనిష్టు పార్టీ ఒకటేనా కాదా అనే మీమాంస కమ్యూనిష్టు పార్టీ మెంబరులలో ఉంటుందో ఉండదోగానీ, కారల్ మార్క్స్ ని చదివిన వారికీ, ఇరవైయవ శతాబ్దపు కమ్యూనిష్టు పార్టీ చరిత్ర చూసినవారికీ ఈ అనుమానం ఎప్పటికీ ఉండిపోతుంది అనుకుంటాను. కాలం చెల్లిన ఎక్పైరీ డేట్ ముగిసిన వంతెన మీదనే కవాతులు వినిపిస్తున్నా..సుత్తీ కొడవలీ తీసుకుని వంతెనకు మరమ్మత్తులు చేసేవారు వస్తారనే నమ్మకం హెచ్చార్కే గారికి ఉంటుందనే అనుకుంటాను. ప్రొయాక్టివ్ థింకర్ కనుక కొత్త వంతెన నిర్మిద్దాం రండో రండని గొంతు సవరించుకుంటారని ఆశిస్తాను, సగటు కారల్ మార్క్స్ అభిమానిగా..

27/4/16
(కవిత్వ సందర్భం 16)
ఈ కవిత ఆత్మీయ మిత్రులు రాజేంద్రప్రసాద్ Rajendra Prasad Yalavarthyగారికి అంకితం

విరించి ll నాన్న ఫోట్వ ll
................................
శరీరాన్ని పొలంలో పాది
ఆత్మని విత్తన౦ లోపల దాచి
నిరాకారిలా ముడుచుకుని పంటుండె నాన్న

అమ్మ కట్టిన సద్ది కలల్ని
మూటయిప్పి ముద్దలు ముద్దలుగా తిన్న౦క
పొట్టమీద చేయితిప్పుతూ
'ఓవ్' అని నాన్న త్రేన్చినప్పుడల్లా
గొడ్డుకారం కలిపిన కలలు కరిగి
మొగులు మీంచి ఉరిమినట్టుంటు౦డె

సూర్యుని వేడి నాన్న వీపుని తాకుతున్నపుడు
బతుకు మీద కాలం రప్ప రప్ప అంటుకున్నట్టుండె
కానీ మబ్బులు తేలి, వంగిన నీడ పలుచగైనపుడు
ఆకాశం నుండి ఆనంద భాష్పాలు రాలుతుండె

కాలువల్లో నీళ్ళ కోసం నాన్న
నాళాల్లో రక్తానికి పాదులు తీస్తుండె
నాగళ్ళకి నమ్మకాల్ని బిగ గట్టి
హయ్ హయ్ అని దేశాన్ని అదిలిస్తుండె

పొలం పచ్చని చీర కట్టుకుని
చెరువు కొంగును నడుముకు చుట్టుకుని
పైరుగాలిలో వయ్యారంగా పంటకోస్తుంటే...
నా సామిరంగ..!
ఆకాశం అద్దంలో క్రాపు సరి చేసుకుంటుండె
పాల పిట్టలు విజిలేసి కన్నుగొడుతుండె

కానీ ఆ రోజులన్నీ ఎటుపాయె?
ముత్తాత జీవితం
తాత రక్తం
నాన్న స్వేదం
అంతా నా స్వార్థంల పైసలైపాయె
దున్నంగ దున్నంగ తరాల్ని సాదిన తల్లి
అన్యాయంగా నా చేతుల్ల ఆగమయిపాయే

ఎక్కడెక్కడో ఎగిరొచ్చే విమానాలు
నాన్న పెయ్యి మీద పాకుతున్నపుడు
'ఈయనే మా నాన్న' అని ఎవల్లకన్నా చెప్పుకోనీకె
గోడ మీద వేలాడే నాన్న ఫోట్వ ఒప్పుకోకుంటుండె
నాయిన మొదటిసారి చచ్చిపోయినట్టు కొడుతుండె.

17/4/16
బ్రాహ్మణ వాదం అంటే...? అనే చర్చలో "చరచ్చ"  చేయకుండా పాలుపంచుకున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.
ముఖ్యంగా రాజు గారికి, వంశీ కలుగోట్లకీ. ఈ పేద్ద కామెంటు అదే చర్చ కింద పోస్ట్ చేస్తే, పోస్ట్ కావటం లేదు. అందుకే ఈ సెపరేటు పోస్ట్. ఇది నిన్నటి చర్చకు కొనసాగింపుగా గుర్తించగలరు.

బ్రాహ్మణ వాదం అనేది కుల వివక్షకీ, అంటరానితనానికీ కారణం అయితే, ఆ వివక్షలూ, అంటరానితనాలూ ప్రస్థుత సమాజంలో బై అండ్ లార్జ్ తగ్గుముఖం పట్టినాయి  అనేది వాస్తవం. దానికి స్వాతంత్ర్యానంతరం రాసుకున్న రాజ్యాంగం, అది అమలు జరిగిన తీరు కారణం. ఈ క్రెడిట్ రాజ్యాంగానిదే. అలా అని వాటి ఆనవాలు పూర్తిగా నశించిపోయాయి అని చెప్పటానికి లేదు. ఏదో ఓ రూపంలో అవి మన కంటి ముందు కనిపిస్తూనే ఉన్నాయి. తగ్గు ముఖం పట్టాయి కనుక సమీప భవిష్యత్తులో పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పవచ్చు, కృష్ణ పక్షంలో అమావాస్యను ప్రెడిక్ట్ చేసినట్టు. రాజ్యాంగం రాసుకోక ముందు ఈ వివక్షకు బ్రాహ్మణులే కారణం అని చాలా మటుకు ఒప్పుకోక తప్పదు. అందుకు కారణం అది మతంతో ముడిపడివున్న సమాజం కావటం. ఇది చాలా వేగ్ స్టేట్మెంట్ అనిపించినా కాస్తో కూస్తో నిజముందనుకుంటాను, సెక్యులర్ అనే భావన అప్పటికి లేదు కాబట్టి. కానీ సెక్యులర్ రాజ్యంగా మనం మారాక బ్రాహ్మణుల ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. ఇపుడు రాజ్య నిర్ణయాల్లో అధికారమూ డబ్బూ ప్రాబల్యం చూపుతున్నాయి తప్ప బ్రాహ్మణత్వం కాదు. ఇలాంటి సందర్భం, బ్రాహ్మణ ప్రాబల్యం తగ్గిన సందర్భంలో అధికారమే పరమ పదం గా భాసిస్తున్న రాజకీయ తరుణంలో...ఎవరైనా ఎక్కడైనా కుల వివక్షకు గురి అయితే దానిని బ్రాహ్మణ వాదం అనటం, బ్రాహ్మణులైన వారికి ఒకింత మింగుడుపడని విషయం. దానికింకో పేరు తగిలించుకోవచ్చుకదా, బ్రాహ్మణులేం చేశారట మధ్యలో...బ్రాహ్మణ వాదం ఏంటీ?.. అనేది వారి కంప్లైంట్.

అలా అని, బ్రాహ్మణులలో కుల వివక్ష పూర్తిగా లేకుండా పోయిందా అంటే, లేదనే చెప్పాలి. ఎంతో పుణ్యం చేసుకుంటేగానీ, బ్రాహ్మణ పుట్టుక కలుగదు అనే భావన వారిలో ఉంది. తామొక్కరిమే తెలివయిన వారిమి, మిగతా వారంతా పరమ మూర్ఖులు అనే ధోరణి కూడా వారిలో అంతో ఇంతో ఇప్పటికీ ఉంది. దాగి ఉంది. అది ఎప్పుడో ఎక్కడో బయట పడుతూనే ఉంది. ఇక రెండు ముక్కలు సంస్కృతం నేర్చుకున్నాడా..ఆ బ్రాహ్మణుడు ఎవరికీ ఆనడు.   మాటలు గాలిలోనే తేలియాడుతూ ఉంటయి. దానికి తోడు హిందూ మతానికి ఏ మాత్రం సంబంధం లేని ధర్మ శాస్త్రాల్ని చూపించి, శాస్త్రాలు ఘోషిస్తున్నాయని గగ్గోలు. ధర్మ శాస్త్రాలు కాలానుగుణంగా మారగలిగినవి అయ్యుండాలిగానీ, యూనివర్సల్ సత్యాలన్నట్టు మాట్లాడితే చాగంటి గారి డ్రాయర్ పురాణంలా ఉంటుంది. రాజ్యాంగానికి సవరణలు ఉన్నట్టు ప్రతీ ధర్మానికీ సవరణ ఉంటుందట. శాస్త్రం మనుష్యుల కోసం గానీ, శాస్త్రం కోసం మనుష్యులు ఉండరాదన్నది ధర్మ శాస్త్రాలు చదివినవారే చెబుతూ ఉంటారు. కానీ అదేమీ పట్టనట్టు పంతం పట్టి కూర్చునే బ్రాహ్మణులు నేటికీ ఉన్నారు. ఎంతమంది ఉన్నారిట్లా అని అడిగితే, టీవీల నిండా వాల్లే కనిపిస్తున్నారు మరి. అయితే కాస్తో కూస్తో ధర్మ శాస్త్రాల వాసన ఏదో రూపంలో ఉంది కాబట్టి, ఇలా టీవీల్లో మాట్లాడే బ్రాహ్మణులను చూసి నవ్వుకునే వారిలో మిగతా వారికంటే బ్రాహ్మణులే ఎక్కువ.

ఉత్పత్తికి దూరంగా ఉంటూ వచ్చారు బ్రాహ్మణులు అని ఇంకో వాదన. కమ్యూనిస్ట్ వాదన. ఉత్పత్తి మార్కెట్టు వంటి పదాలు ఒకదానితో ఒకటి ముడి పడి వుంటాయి. ఉత్పత్తిని దోచుకునే వాడు బ్రాహ్మణుడయి వుంటాడా? భూస్వామి అయి వుంటాడా అనేది అర్థం చేసుకోవలసిన విషయం. బ్రాహ్మణుడు దోచుకుని మార్కెట్టు చేసుకుని డబ్బు సంపాదించింది లేదు. భూస్వాముల్లో బ్రాహ్మణులెంతమంది ఉండిన్నారో మరి తెలియదు. ఒకప్పటి బ్రాహ్మణ విధులల్లో వేద వేదాంగాలని కంఠతా నేర్చుకోవటం ప్రధాన విషయం. దానికి పన్నెండేల్లకు పైనే పడుతుంది. కఠోర శ్రమ తప్పదు దానికి. వేద వేదాంగాలను కంఠతా నేర్చినందుకు బ్రాహ్మణులపైన ఒకింత గౌరవం సమాజంలో ఉండేది. కష్టతరమైన పనిని దీక్షగా ఏండ్ల తరబడి, తరాల తరబడి ఎవరు చేసిన ఆ మాత్రం గుర్తింపుని సమాజం ఇస్తుంది. ఉత్పత్తికి దూరంగా ఉన్నది ఇటువంటి కార్యాలు చేయటానికే...అంతేకానీ సోమరిగా తిని బలిసిన వ్యవహారం కాదు. తిండి విషయంలో వేదాధ్యయన విద్యార్థికి ఎనలేని ఆంక్షలు. విద్యాతురాణాం న సుఖం న నిద్ర అన్నది ఈ విషయాన్నే తెలుపుతుంది. ఇంతా చేసి, వేదం నేర్చుకుని ఇక ఏమి చేయాలి. భుక్తికి ఏదో ఒకటి చేయాలి కదా..? సమాజంలో చదువుకున్న వాడు కదా అని ఎవడయినా కరుణించి అన్నం పెట్టినా ఎప్పటికీ పెట్టలేడు కదా?. ఒకరిద్దరికి పెట్టగలిగినా బ్రాహ్మణులందరికీ పెట్టలేడు కదా? అందుకే తాను చదువుకున్న విద్యకు సమాజ శ్రేయస్సును జోడించాడు బ్రాహ్మణుడు. విద్య నేర్పించటం, వైద్యం చేయటం, కళలను ఆశ్రయించటం, తగువులను తీర్చటం మున్నగునవి. వీటివల్ల లాభం పొందిన వారు అంతో ఇంతో ఇస్తే పుచ్చుకోవటమే తప్ప ఇప్పటిలాగా ఒకటో తరగతికి ఇంత, పదో తరగతికి ఇంత, ఫలానా పనికి ఇంత అని లెక్కలేసి డబ్బులు గుంజినది లేదు. హిందూ మతమూ, భక్తి భావమూ బ్రాహ్మణులకు ఒక ఊతం ఇచ్చింది.

అందువల్ల హిందూ మతంలో మతాలు కూడా పుట్టుకొచ్చినయ్. శైవులు, వైష్ణవులు, శాక్తేయులు ఇంకా పలు పలు రకాలు. ఇటువంటి మతాలకన్నిటికీ వేదమో ఉపనిషత్తో ఆధారం కాదు. తరువాత వచ్చిన పురాణ ఇతిహాసాలే. పురాణాలు వేదాల్ని పునర్ప్రతిపాదిస్తాయి అని చెప్పుకోటానికే తప్ప, వాటి ధోరణి వాటిదే. అన్నీ కథలే. ఒక పురాణంలో ఒక దైవం గొప్పగా పొగడబడితే, అదే దైవం వేరే పురాణంలో తూలనాడబడుతుంది. అసలు ఈ పురాణాల్లో కనిపించే దైవాలు కూడా వేదంలోని వారు కాదు. ఋగ్వేదం లో దేవాధిదేవునిగా కీర్తించబడిన ఇంద్రుడు పురాణాల్లో కేవలం స్వర్గాధిపతి. స్త్రీ లోలుడు. చంచలుడు. అస్థిరుడు. ఋగ్వేదమంతా ఇంద్రుని సర్వజ్ఞతను ప్రతిపాదిస్తుంది. రామాయణం కూడా రాముడిని ఇంద్రునితో పోలుస్తుంది తప్ప, విష్ణువు అవతారంగా కీర్తించదు. అసలు విష్ణువు అనే పదమే రామాయణంలో లేదు.  మొత్తానికి పురాణాలు ఎవరు ఎందుకు రాసినా, ఆయా ఇష్ట దైవాలపై భక్తి కుదురుకోవాలనే విధంగా ఒక్కో పురాణం ఒక్కో దైవాన్ని అందలం ఎక్కించినా.., తరువాతి కాలంలో ఈ వ్యత్యాసమే హిందూ మతంలోని శైవ వైష్ణవ సాంప్రదాయాలుగా అవతారం ఎత్తాయి. ఇక బ్రాహ్మణులకు చెప్పలేనంత పని. ఆయా దైవాల్ని, మతాల్ని, సాంప్రదాయాల్ని తీర్చిదిద్దటానికి బుర్రలో ఇంచు జాగా కూడా వదలకుండా వాడేశారు. ఫలితం శైవ వైష్ణవ యుద్ధాలు. ఆలయాలు. ఆ తరువాతి కాలంలో స్థిరీకరించబడిన సాంప్రదాయాల గుడ్డి నమూనాలతో బ్రాహ్మణులలో పెరిగిపోయిన ఛాందసత్వం. ఇప్పటికీ శ్రీ వైష్ణవులు తామే అసలైన బ్రాహ్మణులం అని అనుకుంటారు. పొరపాటున వారి ఇండ్లలో ఎవరైనా శివలింగం పెట్టుకుంటే, వారినిక వెలేస్తారు.

మొత్తానికి చెప్పొచ్చేదేమంటే, ప్రస్థుత కుల వివక్షకి, అనగా రాజ్యాంగానంతర కుల వివక్ష కీ, ప్రస్థుతం ఉన్న బ్రాహ్మణులకీ సంబంధం లేనపుడు, దీనికి బ్రాహ్మణ వాదం అని పేరెందుకు అని. ఇలా అంటే ఆయన బాపనాయన కాబట్టి ఆ కులాన్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం ఇదని మీరు అనవచ్చుగాక. కానీ బ్రాహ్మణుడు అంటే ఆ పదం వెనుక ఉండే భావం మీద నాకు గౌరవం ఉంది తప్ప బ్రాహ్మణుల మీద కాదు.  ఒకప్పుడు బ్రాహ్మణుల వలన అంటరానివారిగానో, తక్కువ కులం వారిగానో అవమానింపబడ్డ వారంతా తస్సాదీయ...దొరికార్రా ... తనివితీరా తిట్టేయాలి అనే ఆనందంలో కొట్టుమిట్టాడటం కనిపిస్తుంటుంది. కానీ బ్రాహ్మణత్వం ఒక కులంగా ఇంకా మనం చూడటం ఎప్పటికీ మానలేమేమో. సమ్యక్ దృష్టి, సమ్యక్ వాక్కు, సమ్యక్ భావన కలిగి సమాజ హితైషులు అందరూ బ్రాహ్మణులుగా గుర్తించబడాలి. అటువంటి మార్గదర్శకులనే బ్రాహ్మణులు అనాలి, వారికే ఆ గౌరవం ఇవ్వాలి. వారికి ఆ దృష్టి వేదం ఇచ్చిందా, ఆధునిక విజ్ఞాన శాస్త్రాలిచ్చినాయా అనే మీమాంస కాకుండా బ్రాహ్మణ భావనను అందుకున్న ప్రజలు సమాజంలో అవతరించాలి. సమాజం ఇక్కడినుంచి ముందుకు కదలాలి.

(కవిత్వ సందర్భం 14)

గణతంత్ర దినోత్సవ ప్రత్యక్ష ప్రసారాలు
...............................................
స్వాతంత్ర్యానంతర భారత దేశ ఆర్థిక చరిత్రను రెండుగా విభజించుకోవచ్చు. 1991 కి ముందూ, ఆ తరువాతా అని. 1991 కి ముందు ఆర్థిక వ్యవహారాలన్నీ గవర్నమెంటు చేతిలో ఉండేవి. ఎవరైనా ఒక ప్రైవేటుకంపనీ మొదలు పెట్టాలంటే దాదాపు ఎనభై రకాల గవర్నమెంటు లైసెన్సులు పొందవలసి ఉండేది. అంతేకాక ఆ ప్రైవేటు కంపనీ ఎంత ఉత్పత్తి చేయాలో కూడా ప్రభుత్వమే నిర్ణయించేది. ఈ విధానాన్ని "లైసెన్స్ రాజ్" అనేవారు. ఇది పండిత జవహర్ లాల్ నెహ్రూ మానస పుత్రిక. సోషలిస్ట్ భావజాలానికి ప్రభావితుడు కావటం వల్లనో, వందల యేండ్ల బ్రిటీష్ వలస పాలన అనుభవం వల్లనో ఇతర దేశాల కంపనీలను మన దేశంలోకి రానివ్వకుండా కట్టడి చేసే ఇటువంటి విధానాన్ని నెహ్రూ రూపకల్పన చేశాడు. దీని ప్రధాన ఉద్దేశం ప్లానింగ్ కమీషన్ కి అనుగుణంగా దేశ అభివృద్ధి జరగటం. కానీ 1985-1990 లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుండి తప్పుకోవటానికి భారత దేశం, దేశంలో ఉండే బంగారు నిల్వలను అదనపు హామీ గా చూపి ఐ. ఎమ్. ఎఫ్ (I M F) నుండి పెద్దమొత్తంలో అప్పు తీసుకోవలసి వచ్చింది. అదే సమయంలో చంద్రశేఖర్ ప్రభుత్వం కూలిపోగానే ప్రధాని అయిన పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు చేపట్టడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఇండియన్ మార్కెట్ ని 'ఓపెన్ టు ఆల్' అని అందరికీ తలుపులు బార్లా తెరవటం. లైసెన్సింగు విధానం పలుచన చేయటం జరిగింది.  ఈ సరళీకరణను లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ (LPG) అనీ పిలుస్తున్నాం. 1991 లో వచ్చిన ఈ సరళీకరణ భారత సమాజాన్ని విపరీతమైన మార్పుకి గురిచేసింది. అప్పటి ఆ మార్పు ఎంతో మందిలో భయాందోలనలను కలుగజేసింది. ఒకేసారి కుప్పలు తెప్పలుగా విదేశీ కంపనీలు భారత దేశానికి వచ్చి పడ్డాయి. వ్యాపారం చేసేవాడు వస్తువును అమ్ముకోవాలంటే ముందు అది అమ్ముకోవటానికి తగిన మార్కెట్ ని సృష్టించుకోవాలి. తమ వస్తువు మనిషికి అవసరం లేకున్నా అవసరం ఉందని మనిషిని నమ్మించాలి. ప్రసార సాధనాలు ప్రచార సాధనాలుగా చేసుకోవాలి. అటువంటి తరుణంలో కవి తన జీవన సరళిలో ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులను గమనించుకుని, ఉలిక్కిపడి, వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రపంచీకరణ మేలే చేస్తున్నపుడు కవి దానిని ఎందుకు తిప్పి కొట్టాలి అనే సందేహం కలుగుతుంది. అవును. ఇలా తిప్పికొట్టడం కూడా సహేతుకమే. ఎందుకంటే ప్రపంచీకరణ విధానాలు పేదరికాన్ని రూపుమాపకపోగా, పేదరికాన్ని ఈసడించుకునే ఒక సైద్ధాంతిక తాత్వికతను ఎస్టాబ్లిష్ చేస్తాయి. దానికి తగ్గ భూమికను తన నిత్య జీవితంలో చూసే సంఘటనలను తనదైన రీతిలో వ్యక్త పరుస్తాడు కవి జూకంటి జగన్నాథం.

కంటికి కనిపించని ఎన్నో అవ్యక్త శక్తులు మనిషి జీవితాల్ని శాసించటం మొదలైంది ప్రపంచీకరణ వల్లనే. తన జీవితం తన చేతుల్లో లేక పరాయాకరణ చెందినట్టు మనిషి గుర్తించగలడో లేదో కానీ కవి దానిని స్పష్టంగా చూడగలుగుతాడు. ఉదయాన్నే లేస్తే రైతులో ఉండే అయోమయమైనా, అరుగు మీద పిల్లలకి అన్నం పెడుతూ  అమ్మ మాట్లాడే భాషలోని పదాలలోనైనా ఎక్కడా తన సొంతం కాని జీవితం, మరెవరి జీవితమో తాను జీవిస్తున్నట్టు. వస్తు వినిమయ సంస్కృతే ప్రతీ చోట ప్రతిఫలిస్తుంది. అమ్ముకోగలిగితే ఏదైనా అమ్ముకోవచ్చు. అప్పటి దాకా వ్యవసాయాధారిత జీవితం ఇక ఏ మాత్రం లాభదాయకం కాదు అని, లాభం లేని, లాభం రాని జీవితం నిష్ఫలం అనీ  భావజాలం వ్యాపిస్తుంది. పెట్టుబడీదారుడు ఫ్యాక్టరీ పెడతాడు. దానికి కార్మికుడు కావాలి. రైతు కూలీ ఇపుడు కార్మికుడి అవతారం ఎత్తాలి. ఊ..ఇంకేం. మీ నాగళ్ళను కట్టెలుగా నరికి పొయ్యిలో వేయండి. మీ వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దులనూ, ఎద్దులను కనే ఆవులనూ ఊరికే ఉంచటం దేనికీ?. వధశాలలకమ్మండి. విదేశాల్లో మాంచి గిరాకీ  పలుకుతుంది. డబ్బు విలాసం అందుకోవాలంటే ఇలాగే చెయ్యాలి. బీదవాడిగా పుట్టడం తప్పుకాదు, బీదవాడిగా చనిపోవటం మహా ఘోరమైన పాపం అంటుంది. ఇది ప్రత్యక్ష మార్పయితే పరోక్షంగా అనేక సామాజిక పర్యవసానాలు నెలకొంటాయి. వస్తు వినిమయ సంస్కృతికి దూరంగా జరిగే ప్రయత్నం కూడా మనిషి చేస్తాడు. దానికి మత విశ్వాసాలకి దగ్గరగా జరుగుతాడు. కానీ వస్తు వినిమయ సంస్కృతి మతాన్ని కూడా వ్యాపారంగా మలచుకుంటుంది. ప్రాంతీయత స్థానికత అంశాలు వెల్లువలా ముందుకు వస్తాయి. సంస్కృతీ కళా రూపాలు కూడా మార్పుకీ ఒత్తిడికీ లోనవుతాయి.

ప్రపంచీకరణ జరగటానికి ప్రధాన మాధ్యమం ప్రసార సాధనాలు. అవే వారి ప్రచార సాధనాలు. టీవీ, ఇంటర్నెట్ ఎక్కడ చూసినా అడ్వర్టయిజ్మెంట్స్ రూపంలో సాంస్కృతిక దాడి చెయ్యాల్సిందే. ఒకే కంపనీ ఎన్నో ప్రోడక్ట్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్క హిందూస్థాన్ లీవర్ అనే ఆంగ్లో డచ్ కంపనీ తయారు చేసే వివిధ రకాల ప్రోడక్ట్స్ ని డెబ్భై కోట్ల మంది భారతీయులు వాడుతున్నారంటే అది కాళ్ళు చాపిన మార్కెట్ విస్తీర్ణాన్ని అంచనా వేయవచ్చు. ఉదయాన వాడే పేస్టు బ్రష్ నుండి రాత్రి పడుకున్నపుడు దోమలు రాకుండా వాడే మస్కిటో రిపెల్లెంట్స్ వరకూ అన్నీ హిందూస్థాన్ లీవర్ ప్రోడక్ట్ లే. భారతీయ గ్లోబల్ నారీ రూపాన్ని తీర్చి దిద్దటంలో ప్రపంచీకరణ హస్తం పెద్దదే. మహిళలలో పెరిగిన చదువు, ఉపాధి అవకాశాలూ వారిని అసలైన వినియోగదారీ లక్ష్యాలుగా చేశాయి. చదువుకుని చక్కని బట్టలతో అందంగా ఆకర్షణీయంగా ఉండే మహిళలు, ఇంట్లో ఒకరితో ఒకరు పోటీలు పడి బట్టలు ఉతుకుతున్నట్టు ఉంటుంది ఒక యాడ్. దానిలో హిందూస్థాన్ లీవర్ సర్ఫ్ వాడిన మహిళ గెలుస్తుంది. పది మందిలో తల ఎత్తుకు నడుస్తుంది. ఆఫీసు నుండి ఇంటికి వచ్చి, వంట చేయబోయి నడుము నొప్పితో పడిపోయిన మహిళకు, ఈ కంపనీ వారు తయారు చేసే పెయిన్ కిల్లర్ బామ్ రాసుకోగానే నొప్పి తగ్గుతుంది. లేచి వంట చక చకా చేసేస్తుంది. భర్త మెప్పుని పొందుతుంది. ఫ్యూడల్ పతివ్రతల స్థానం నుంచి  ప్రపంచీకరణ విద్యావంతురాలిగా ఎదిగినా చివరికి అదే వంట గదిలోనో ఇంటిల్లిపాది పనులు చేస్తూనో ప్రత్యక్షం అవుతుంది. ఈ గొప్ప తనానికి కారణం ఈ కంపనీ ప్రోడక్ట్స్ వాడటమే. కణ్వముని ఆశ్రమంలో పండితులను వాక్పటిమతో ఓడించిన శకుంతల భర్త మతిమరుపుతో ఆడ జన్మే వృధా అనుకునేట్టు  ఈ కాలంలో 'నేటి మహిళ' కూడా దాదాపు అదే స్థానంలోనే ఈ యాడ్స్ లో కనిపిస్తుంది. పోర్షియా అందాన్నీ తెలివి తేటలనూ కాదని, బన్సానియో ఆమె డబ్బునీ బంగారాన్నీ చూసి పెళ్లి చేసుకున్నట్టు, ఒక టూత్ పేస్టు వాడటం వల్ల ఒక అమ్మాయికి పెళ్లి కావటం, ఒక డిటర్జంటు వాడటం వల్ల ఉద్యోగం రావటం చూస్తుంటాం.

ఈ కవిత రాసినది 1994 లో. ఇప్పుడు మనకైతే అలవాటై పోయింది కానీ అప్పటివారు ఈ ప్రపంచీకరణ భూతాన్ని చూసి ఎంతగా కంగారు పడ్డారో ఈ కవిత చక్కగా వివరిస్తుంది. ప్రపంచీకరణ మంచిదా చెడ్డదా అనే ప్రశ్నకి సమాధానం చెప్పటం అంత తేలికైన విషయం కాదు. అంతర్జాతీయ విపణిలో దేశ వృద్ధి రేట్లతో సామాన్య మానవుడికి నిజంగా పనైతే లేదు. కానీ వాడి భాషనూ సంస్కృతినీ జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందనే విషయం అధ్యయనం చేయటానికి ఈ కవిత వెలువడిన సమయం కంటే ఇప్పుడు సరయిన సమయం అనుకుంటాను. ఎందుకంటే ఇండియాను ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనటం అప్పటికంటే ఇపుడే సరైనది. కానీ జూకంటి జగన్నాథం గారు ఈ పరిస్థితిని అపుడే ఊహించి రాసేశారు. గణతంత్ర దినోత్సవ ప్రత్యక్ష ప్రసారాలని విదేశీ కంపెనీలు స్పాన్సర్ చేస్తాయని చెప్పటం వస్తు వినిమయ తత్వానికి పరాకాష్ట కాక  మరేమిటి?.

ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
.....................................
పిల్లల ప్రపంచం విస్తరిస్తోంది
మనలోకం తలకిందులవుతోంది
మన బ్రతుకు మెల్ల మెల్లగా
పరాధీనమై కుంచించుకు పోతోంది

తెల్లారి లేస్తే
ఎద్దులను ముందేసుకుని
భుజాన నాగలి మోస్తూ పొలం వెళ్ళే
రైతుకు అంతా వడ్లు పెరుగు కలిసినట్లు అయోమయం

వీధి అరుగులమీద
పిల్లలకు అన్నాలు తినిపిస్తూ పక్కవాళ్ళతో
మా అమ్మ చెప్పే ముచ్చట్లలో
ఒక కొత్త డిక్షన్ దొర్లుతుంది
ఒక సరికొత్త దురాక్రమణ కొనసాగుతుంది

ఇంటి జారాడు నీళ్ళతో
నవ నవ పెరిగిన తోటకూరను
లండన్లోనో వాషింగ్టన్లోనో
అమ్ముకుని లాభ పడొచ్చని
'గాట్' ఒప్పందం పై వెన్నముక సాక్షిగా
ప్రభుత్వం చిలుకపలుకుల సంతకం

రూపాయికి పూర్తి మారకం
బ్యాంకు వడ్డీ తగ్గింపు
పశువులను వధ శాలలకమ్మండి
తోళ్ళకు మంచి గిరాకీ ఉంది
మాంసానికి మామంచి ధర పలుకుతుంది
నాగళ్ళ ను ఎక్కడికక్కడికి నరికి పోయిలోపెట్టి
ఏదో పరిశ్రమ స్థాపించుకోండి
ఇంట్లో కడుపులో గుద్ది
బజార్లో వీపు మీద చెయ్యేసి శభాష్ అంటుంది రాజ్యం

హిందుస్థాన్ లీవర్ లిమిటెడోడు
స్త్రీలకు బట్టలుతికే పోటీ నిర్వహిస్తాడు
మనం చొంగ కారుస్తూ గుడ్లప్పగించి చూస్తాం

మా చిన్నమ్మాయికి తెల్లారితే
అన్నీ అనుమానాలే అన్నీ ప్రశ్నలే
మా పెద్దమ్మాయికి అడుగు తీసి అడుగు వేస్తే
అన్నీ సందేహాలే అన్నీ సందిగ్ధాలే
డంకెల్? ఐ ఎమ్ ఎఫ్?? అగ్ర రాజ్యాలు???
'నీకంట్లో నేను వేలు పెడుతా
నీవు నానోట్లో చెయ్యి పెట్టు' బాపతిగాల్ల

ఇంతెందుకు ఒక్కమాట
తలొంచుకు మన పొలం గెట్టు మీదో మన యింటి ముందో
చల్లగా నిలిచిన వేపచెట్టు చూస్తుండగానే
వాని హక్కు భుక్తం అయిపోతుంది
మన అంగట్లో సరుకుల వ్యాపారం చేయరాని
మనం ప్రపంచ మార్కెట్లో పోటీ పడి
అవయవాలను అమ్ముకోవాలి

టెలివిజన్లో
సర్వ సత్తాక స్వతంత్ర సామ్యవాద లౌకిక గణతంత్ర దినోత్సవం
త్రివిధ దళాల వందన స్వీకారం
రాష్ట్రపతి భూతద్ద ప్రసంగం
అనంతరం ఒక ప్రకటన
ఇంతవరకూ మీరు చూసిన కార్యక్రమాన్ని
స్పాన్సర్ చేసినవారు
పోక్టర్ అండ్ గ్యాంబుల్, గ్లాక్సో, నెస్లే.

6/4/16
(కవిత్వ సందర్భం 14)

(కవిత్వ సందర్భం 15)

రైతులు కాదు-  వీళ్ళంతా పండని విత్తులు
..................................................
మనిషి ఎంతగా ఆలోచిస్తే, అంత మనిషిగా మారుతాడు. కవిత్వం మనిషిని ఆలోచించే మనిషిగా మార్చగలదు, అటు రాసిన కవినయినా, ఇటు చదివిన పాఠకుడినైనా. కవి రాసిన కవిత్వం, పాఠకుడికి, రాసినదాని కన్నా ఎక్కువనే నేర్పిస్తుంది. పాఠకుడికి తెలియని లోకాల్ని మాత్రమే పరిచయం చేయడు కవి, అంతకు మించి తాను తెలిపే లోకాల్ని పాఠకుడికి తెలిసిన లోకాలతో కలిపి కుట్టి చూపిస్తాడు. ఒక కవిత చదివినపుడు కవితలో కవి ఏమి ఆలోచనలని చెప్పాడు అనే దానికన్నా, ఆ కవిత మనలో ఎలాంటి ఆలోచనలను రేకెత్తించిందనేది ముఖ్యమవుతుంది. కవి అయినా తన ఆలోచనల్ని రాజకీయనాయకుడిలాగా సమాజం మీద రుద్దాలి అనుకోడు. సమాజపు ఆలోచనల్ని, ప్రజల జీవితాల్ని తన రచనలు ఎలా ప్రతిబింబింప చేస్తున్నాయి అనేది ఆలోచిస్తాడు. ఒకప్పటి భావ కవిత్వపు నీడ రాజకీయానికీ కవిత్వానికీ అగాధాన్ని సృష్టించింది. కానీ అభ్యుదయ పతాక రాజకీయాల పొట్టల్లోంచి పొడుచుకుని వచ్చి ప్రజల మధ్యన విస్పష్టంగా రెపరెపలాడుతోంది. అలాంటి కవిత్వాన్ని జండాలా పట్టుకుని దారి చూపే కవి అన్నవరం దేవేందర్.

వ్యాపారం చేసేవాడెపుడూ నిజాలు చెప్పడు. అబద్ధం వాడి జీవిత విధానం. 'మార్కెట్ ఎకానమీ' కిందకి ఒక సమాజం మారిపోయినపుడు జీవితం కూడా అబద్ధంగా మారిపోతుంటుంది. వస్తువు వస్తువులా చూడబడదు. సరుకులా చూడబడుతుంది. మనిషి కూడా మనిషిలా చూడబడడు. సరుకులా చూడబడుతాడు. మార్కెట్ ఎకానమీ అనేది  మనిషిలో కలిగించే మొట్టమొదటి మార్పు..'ఆశ'. ఆశ ఉండకూడదని కాదు. ఆశ యొక్క విస్తీర్ణం పెరగటం వేరు, ఆశ కలిగి ఉండటం వేరు. నేను పండించిన పంట నా ఊరికి, నాకు సరిపోతుంది అనుకోవటంలో తృప్తి ఉంది. ఇందులో ఆశ కూడా ఉంది. కానీ ఇక్కడ ఆశ తన ఊరి వరకు మాత్రమే పరిమితం అయింది. కానీ ఇపుడు నేను పండించిన పంట విదేశాలకు ఎగుమతి కావాలి అనుకోవడం కూడా ఆశే. కానీ దాని పరిధి పెద్దది. ఈ పరిధిని పనికట్టుకుని పెంచి పోషించే మంత్రంలాంటి పదం ఒకటుంటుంది. దాన్ని "అభివృద్ధి" అంటాం. ఈ అభివృద్ధి అనే పదాన్ని మార్కెట్ సృష్టిస్తుంది. మన ఇంట్లో ఒకరికొకరం మాట్లాడుకోవటం కంటే పక్కింటి వాడితో ఫోన్లో మాట్లాడటం అభివృద్ధి. అంతకు మించి విదేశాల్లో ఉండే కొడుకుతో స్కైప్ లో మాట్లాడటం మరింత అభివృద్ధి. అభివృద్ధి అనే పదం తెలియనపుడు తరాలకు తరాలు కుల వృత్తులతో నిశ్చింతగానే బతికి ఉండింటారు. ఒక తరానికీ రెండవ తరానికీ కూడా ఆలోచనలోగానీ ఆచరణలోగానీ పెద్దగా మార్పు వచ్చి ఉండిండదు. కానీ గ్లోబల్ విలేజ్ గా మారిపోతున్న ప్రపంచంలో మనం రోజులో అతి ఎక్కువ సార్లు వినే అధికారిక పదం 'అభివృద్ధి' కాబట్టి, అది తనతో పాటు ఎన్నో అనుకూల విపరీత మార్పులను తీసుకుని వచ్చింది. 'అభివృద్ధి' పదం అబద్ధాలనూ తీసుకుని వచ్చింది. జీవితాన్ని నడిపే వ్యవసాయ రంగం కూడా అబద్ధాల పాలయిన సందర్భాన్ని ఈ కవితలో కవి మనకు చూపిస్తాడు.

1991 లో ఆర్థిక సరళీకరణలు భారత దేశానికి వచ్చిన తరువాత విదేశీ సంస్థలు కూడా విత్తన కంపనీలతో ఊడిపడ్డాయి. దేశం ఒక అభివృద్ధి నమూనాను కల్పించుకుంది. దానిలో 'వ్యవసాయరంగం వృద్ధి రేటు' అనేది ప్రధాన అంశం. దీనిలో భాగంగానే అభివృద్ధి అంశపు పరిధి కూడా పెరిగింది. జొన్నలు తిని జొన్నలు ఏరిగి బతికే మనుషులు సాంప్రదాయక పంటల స్థానంలో సంపాదనను అందించే పత్తి పంటను గురించి ఆలోచించారు. ఎండిన నేలలలో పండే పత్తి, డెక్కను పీఠభూమిని సరైన నేలగా ఎంచుకుంది. జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాలు వచ్చాయి. వాటిని మార్కెట్ చేయటానికి, రైతులు అభివృద్ధి చెందాలనే స్లోగన్ పుట్టుకొచ్చింది. అందులో భాగంగానే బీటీ పత్తి విత్తనాలు వాటి కంపెనీలు. తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పాదనని కలిగిస్తాయనీ, పురుగుమందు వాడకం తగ్గుతుందనీ, లేబర్ పెద్దగా అవసరం ఉండదనీ,  పత్తిని ఎగుమతులు చేసుకుని మంచి లాభాలు గడించవచ్చనీ నమ్మబలికాయి. ఈ పంటలకి ఏకంగా "క్యాష్ క్రోప్స్' ( cash crops) అని పేరొచ్చింది. ఈ అభివృద్ధి మంత్రానికి తోడుగా మన ప్రభుత్వాల అవలక్షణాలన్నీ సామాన్య చిన్నకారు రైతులని క్యాష్ క్రాపుల వేపు మనసు మల్లించాయి. స్థిరమైన సాగునీటి వనరులు లేకపోవటం, ప్రాజెక్టులు అంతరాష్ట్ర వివాదాల్లో చిక్కుకు పోవటం, చెరువులు ఎండిపోవటం, వర్షాలు పడకపోవటం, భూగర్భ జలాలు ఇంకి పోవటం, ఎరువు మందుల ధరలు విపరీతంగా పెరిగిపోవటం, ప్రభుత్వ అదుపులోనుండి మధ్య దళారుల చేతిల్లోకి పోవటం, నాణ్యత లోపించడం, బ్యాంకు అప్పు తీసుకోవాలంటే పెద్ద కులపు వాడు కాకపోవటం, అర్థరాత్రి తరువాతే బోరుబావులకు కరెంటు అందటం, గ్రామీణ బ్యాంకు వ్యవస్థ పనికి రాకుండా పోవటం, పంటకు కాకుండా పంటమీద తీసుకున్న లోన్ కి ఇన్స్యూరెన్సు పుట్టడం, ప్రభుత్వ మార్కెటింగ్ వ్యవస్థ రైతుకు గిట్టుబాటుధరని కల్పించలేకపోవటం ఒకటేమిటి రైతుకు ప్రతీదీ సమస్యే. అన్ని సమస్యలకూ ఒకే మందు, ఈ నూతన వ్యవసాయ పద్దతి.. Cash crops..!

రైతులు పూర్తిగా మోస పోయారు అన్ని విధాలుగా. కొత్త వ్యవసాయ పద్దతులు కూడా ఏ సహకారం అందించలేదు. అభివృద్ధి అనే ఆశ అత్యాశగా అనిపించి నిరాశకే లోనయ్యాడు రైతు. ప్రభుత్వాలు తమ తప్పిదాల్నన్నింటిని కప్పి పుచ్చి బీటీ పత్తి విత్తనాలదే తప్పన్నాయి. లేకపోతే వరుణుడిదే తప్పనీ, మేఘుడిదే తప్పనీ తప్పించుకున్నాయి. అసలు రైతులదే తప్పు, వ్యవసాయం లాభసాటి విధానమే కాదు అని కూడా విజనరీ ప్రభుత్వాలన్నాయి. తాము చేసిన అప్పులకూ, తమకొచ్చే పంట దిగుబడికీ ఏ మాత్రం పొంతన లేని వారు పురుగుమందుల్ని ఆశ్రయించారు. చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియాలు ఘనంగా ఇస్తున్నాంగా, మిగిలిన వారంతా బాగానే ఉన్నారుగా, చని పోయిన యువ రైతులంతా ప్రేమ విఫలమయ్యి చనిపోయారుగా అని కాకి లెక్కలు చెబుతూ  కాకుల్లా అరిచే ఏలికలకు ఈ కవిత ఒక కనువిప్పు. బతికి ఉన్న రైతాంగం నిజానికి రైతులుగా లేరు. వారంతా దినసరి కూలీలుగా మారారు. ప్రతీ ఊరిలో ఒక అడ్డా ఏర్పరచుకుని తమను తాము అమ్ముకున్నారు. అలాంటి ఒకానొక అడ్డా ఈ మంకమ్మతోట లేబర్ అడ్డా. ఈ లేబర్ అంతా ఎక్కడినుంచో పుట్టుకురాలేదు. ధాన్యం పండే పొలాల్లోంచి పుట్టుకొచ్చిన నవ సమాజపు పండని విత్తులు ఈ రైతులు. వీరు పంటలు పండించటం లేదిపుడు, లేబర్ పండిస్తారు. పంటల గిట్టుబాటు కోసం ఎదురు చూడటం లేదిపుడు, తమ శరీరం గిట్టుబాటు కోసం 'కూలీ తక్కువిచ్చినా వస్తం' అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అవును అదే ఆశ. అభివృద్ధి అనే ఆశ.

మంకమ్మ తోట లేబర్ అడ్డా
-----------------------------------
పల్లె పొలిమేరలు దాటి
అడ్డా మీద సరుకుగా మారిన సందర్భం
అంగడిలో గొడ్డూ గోదా అమ్ముడుపోయినట్లు
తనకుతానే అమ్ముకుంటున్న దృశ్యం

మంకమ్మతోట లేబర్ అడ్డా మీద
బక్కచిక్కిన దేహాలన్నీ
లొట్టపోయిన కండ్లతో చూస్తున్నాయి

పనికి తీసుకోండ్రి సారూ..
కూలీ తక్కువిచ్చినా వస్తం
ఏదన్నా పని...కావాలె...అయ్యా పని..

గోస గోస మాటలు
గోవుల్లాంటి చూపులు

సున్నం వేసే కుంచెలు
తట్టా పార గడ్డపారలతో
పల్లె తరుముతే
పక్షులన్నీ అడ్డామీద వాల్తాయ్

చేయి సంచిల సద్ది గిన్నె
జబ్బ మీద తువ్వాల
ఇంకో చేతిల అతారెలు

ఎవలు పిలుస్తరా అని ఎదురుచూపులు
కంకర కొడతరు కందకాలు తీస్తరు
భవంతులు కడతరు బండలేస్తరు
గోడలు కడుతరు రాళ్ళు మోస్తరు
అరొక్క పనులన్నీ అవలీలగ చేస్తరు

నున్నగ తారురోడ్డు పరిచి
కలల కూడా డ్రైవింగ్ చేయని వాళ్ళు
ఫోన్ లైన్ల కోసం కందకాలు తవ్వీ తవ్వీ
హలో అని పలకని వాళ్ళు
పాలరాల తో భవనాలు కట్టి
పూరి గుడిసెల్లోనే జీవించే వాళ్ళు
ఉస్నాద ఎములాడ సిర్సిల్ల...
చినుకులు కురవని పల్లెలు ఎల్లగొడితే
అడ్డమీద కూలీలైరి

13/4/16

(కవిత్వ సందర్భం 15)

Tuesday, 5 April 2016

విరించి ll మూడు ముక్కల మాట ll


విరించి ll మూడు ముక్కల మాట ll
........................................
ప్రపంచం మొత్తానికిగాను
అక్కడొక్కచోటే గుంతపడినట్లు
జీవితకాలపు ఊపిరులన్నీ
అక్కడొక్కచోటే పోగుబడినట్లు ఉంది నాకు

ఆమె రెండు పెదవుల పుష్పానికి
నా రెండాకుల కళ్ళు వేలాడుతున్న సమయంలో
నిలకడలేనట్టు పరిగెత్తే కాలం
మొనదేలిన ముల్లులా గుచ్చుకుంటోంది

ఆమె పెదవుల మీద మెరిసిన సాయంత్రపు నీరెండ
మధువును గ్రోలేందుకు వాలిన తేనెటీగ రెక్కలా కనిపించింది
కడుపంతా మకరందాన్ని నింపుకుని
ఎర్రెర్రగా గూటికి ఎగురుతున్నాడు సూర్యుడు

ప్రపంచాన్ని తానే తిప్పుతున్నట్లు తిరిగే
రిస్ట్ వాచీ ముళ్ళ వైపు
అసహనంగా చూస్తోందామె "ఇంకెంత సేపన్నట్లు"

ఆ మూడు ముక్కల మాట
నా పెదవుల కారాగారంలోంచి చీల్చుకు రాలేక
న్యాయం కోసం గుండె కోర్టులో
గొంతు చించుక వాదిస్తోంది

తనను తాను శిల్పంగా చెక్కుకునే శిలలా
నా మాటలుంటాయేమో..
పెచ్చులుగా ఊడిపడే అనవసర మాటల్ని విని
నాకెందుకు చెబుతున్నావివన్నీ అని అరిచిందామె
కింది పెదవిని వింటినారిని చేస్తూ
పై పెదవి మీదుగా ఆగ్నేయాస్త్రాల్ని సంధించి వెళ్లి పోయింది

మా ఇద్దరినీ చూస్తుంటే
ఈ నడిరోడ్డు మీది బస్ స్టాండు కూడా బృందావనంలా
కనిపించిందన్నాడు నా కమ్యూనిస్టు మిత్రుడు
దూరంగా నక్కి చూసేవాడి హ్రస్వ దృష్టి కాబోలనుకున్నా

"విసుగుదలలో ఇంత అందముంటుందా" అనడిగాను నేను అమాయకంగా

నా కళ్ళ ను తేరిపారా చూస్తూ అనునయంగా వాడన్నాడు
"మెదడునీ హృదయాన్నీ కలిపే ఆమె మెడనరాల్లో
ప్రవహించే వేడి రక్తం ఒక్కసారైనా ఆలోచించి ఉంటుంది
ఒక మెట్టు ఎక్కడమా
ఒక మెట్టు దిగడమా" అని

పురాతన కాలపు ఆనకట్టలా
తెగడానికి సిద్ధంగా వుంది ఆకాశం అపుడు.

4/4/16